ఛత్రీ వెర్సస్ ఖత్రీ

షేక్స్పియరు నాటకాల్ని హిందీలోకి అనువదిస్తూ యువ దర్శకుడు విశాల్ భరద్వాజ్ హిందీ చలనచిత్రరంగం మీదికి ఒక సుడిగాలిలా, ఒక "ఆంధీ"లా దూసుకొచ్చాడు. మెక్బెత్, ఒథెల్లో వంటి సుప్రసిద్ధ ట్రాజెడీలను మక్బూల్, ఓంకారలుగా మలిచాడు. వొళ్ళు గగుర్పొడిచే సంభాషణ రచనా చాతుర్యంతో, ఒక్కొక్క దృశ్యాన్ని ఒక యుద్ధవ్యూహంలా రచించే శైలితో హిందీలో నిశాచిత్రాలకి (film noir) ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడనటం అతిశయోక్తి కాదేమో.

ఇప్పటి వరకూ మనిషిలోని నీడల ప్రపంచం మీదే దృష్టి కేంద్రీకరించిన ఈ యువ దర్శకుడు ఒక్కసారి పూర్తి పల్లిటీ కొట్టి స్వఛ్ఛమైన నవ్వుల్నీ, పసుప్పచ్చని పువ్వుల్నీ, పసి తనపు నైర్మల్యాన్నీ తెరకెక్కిస్తానంటే .. మీరు సందేహంతో తల అడ్డంగా ఊపితే మిమ్మల్ని తప్పు పట్టను. కానీ "నీలిరంగు గొడుగు" (Blue Umbrella)తో ఈ చిచ్చరపిడుగు సరిగ్గా అదే సాధించాడు, ఢంకా బజాయించి మరీ.

ప్రసిద్ధ ఇండో ఆంగ్లికన్ కథా రచయిత రస్కిన్ బాండ్ రాసిన నవలికకి చిత్ర రూపమిది. హిమాచల్ ప్రదేశ్‌లో కొండల్లోని ఒక పల్లెలో బినియా అని పదేళ్ళ పాప ఉంటుంది. వాళ్ళన్నయ్య ఆ ఇలాకా మొత్తానికీ పహిల్వాన్. అందుకని ఈ పిల్ల మంచి ధైర్యంగా ఎవర్నీ లెక్క చెయ్యకుండా ధీమాగా తిరుగుతూ ఉంటుంది. ఆ వయసు పిల్లకాయలందరికీ ఆమే లీడరు. బస్టాపుకి దగ్గర్లో టీ కొట్టు నడుపుతూ నంద కిషోర్ ఖత్రీ అని ఒక పిసినారి ముసలాడూ కూడా ఉంటాడు. వీడు వచ్చేపోయే యాత్రికులకి టీ అమ్మడంతో పాటు పిల్లకాయలకి అరువు మీద పిప్పరమింటు బిళ్ళలూ, బిస్కట్లూ అమ్ముతూ ఉంటాడు. వాళ్ళు ఇంట్లో అమ్మకి తెలీకుండా దొంగతనంగా తెచ్చే ఊరగాయతో ఆ అప్పు మాఫీ చేస్తుంటాడు. హిమాలయాల మొదలులో ఉండే ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది. చాలా మంది విదేశీ యాత్రికులు వస్తూ ఉంటారు.

ఒకసారి ఒక జపనీయ బృందం బినియాకి తారసపడుతుంది. బినియా మెళ్ళో ఉన్న ఎలుగ్గొడు గోరు తాయెత్తు జపాను అమ్మాయిని ఆకర్షిస్తుంది. ఆ పిల్ల చేతిలో ఉన్న నీలిరంగు గొడుగు బినియాని ఆకర్షిస్తుంది. ఏమీ భాష రాకుండానే వస్తు మార్పిడి జరిగిపోతుంది. ఇక ఆ నీలి గొడుగుతో బినియా ఒక చిన్న రాణీలాగా తిరుగుతూ ఉంటుంది ఊళ్ళో. అందరికీ ఆ గొడుగు మీదే కన్నుంటుంది. ముసలి నందూకైతే అదొక అబ్సెషనై కూర్చుంటుంది. పక్కన బస్తీలో విచారిస్తాడు. ఆ ప్రాంతాల్లో దొరకదని తెలుస్తుంది. బినియాకి ఎన్నో ఆశలు పెడతాడు, కానీ తను దేనికీ చలించదు. ఇంతలో ఒక రోజు ఉన్నట్టుండి బినియా నీలి గొడుగు కాస్తా పోతుంది .. ఎమైందా గొడుగు? ఎవరు దొంగిలించారు? దొంగిలించిన వాళ్ళ పనేమైంది? బినియా ఆ గొడుగు వియోగాన్ని ఎలా భరించింది - ఈ ప్రశ్నలకి సమాధానం వెండి తెరపై - ఐమీన్ బుల్లి తెరపై చూసుకోవాల్సిందే.

బినియాగా చిన్నారి శ్రేయా శర్మా ఎంతో సహజంగా నటించింది, మామూలుగా మన సినిమాల్లో వయసుకి మించి ఓవరాక్షన్ చేస్తూండే ఆరిందాల్లా కాకుండా. ఆ ఠీవి, గొడుగేసుకుని రాణీగారి లాగా లెవెలు కొట్టటం - ముచ్చటేసేసింది. వెటరన్నటుడు పంకజ్ కపూర్ విభిన్నమైన పాత్రల్లో తన ప్రతిభని చాటుకుంటున్నాడు. ఆ ప్రాంతీయ యాసతో, మధ్యలో రెండు ముక్కలు ఇంగ్లీషు కలగలిపి అతను మాట్లాడే తీరు గొప్ప మజాగా ఉంది. ముఖ కవళికల్లో, శరీర భంగిమలో అతను పాత్ర మనస్తత్వం ఆవిష్కరించే తీరు కూడ గొప్పగా ఉంటుంది. అదంతా సరే గానీ ఈ సినిమా మొత్తం దర్శకుడి ప్రతిభకి ఒక చక్కటి ఉదాహరణ - వేరే మాట లేదు. నాకైతే, సినిమా మొదట్లో పిల్లకాయలంతా ఒక దిష్టిబొమ్మని పట్టుకుని ఊళ్ళో తిరుగుతూ చందాలు వసూలు చేస్తూ పాడే పాట విపరీతంగా నచ్చేసింది. ఎవరన్నా పుణ్యాత్ములు ఈ సినిమాని చక్కగా తెలుగులోకి అనువదిస్తే బాగుణ్ణు. అన్నట్టు ఈ డిస్కులో - ఇదివరకెప్పుడూ చూడనిది మొదటిసారి చూశాను - తెలుగు సబ్-టైటిల్సు! నిజం, ఒట్టు.

Comments

yourslovingly said…
ఇంతకు ముందు రిలీజ్ అయిన ధూమ, ఫిర్ హెరా ఫెరి కూడా తెలుగు సబ్ టైటిల్స్ ఉన్నాయి
cbrao said…
సమీక్ష ఆసక్తికరంగా, సినిమా చూడాలనిపించేలా ఉంది.
యువర్స్ లవింగ్లీ గారు - నిజమా? నేను హిందీ సినిమాలు చాలా అరుదుగా చూస్తాను. అంచేత తెలియలేదు.

రావుగారు, కచ్చితంగా చూడదగ్గది సినిమా. విశాల్ ఇదివరకటి సినిమాల్లో సంభాషణలు ఒక మూల బలంగా ఉండేవి. అట్లాంటిది ఈ సినిమాలో సంభాషణల్ని అతితక్కువ ఉపయోగించాడు - అంతా దృశ్యం ద్వారానే కథ నడుస్తుంది.
చేతన said…
avunu, re-mastered, re-released "mughal-e-azam" (2-3 yrs ago?) DVD lo kuda unnay telugu subtitles. aa cinema ki naku definite ga telugu subtitles avasaram anipinchayi.
రవి వైజాసత్య said…
సినిమాలు తెలుగు సబ్‌టైటిల్సుతో రావటం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది. సాధారణంగా ఈ తెలుగుళ్ళోకి ఎలాగూ ఇంగ్లీషు వచ్చి తగలడుతుందిలే అని మన మార్కెట్లోకి ఆంగ్ల టైటిల్సు ఉన్న వీడీయోలు వదులుతారని ఉహిస్తాము కానీ..ఇది కొద్దిగా షాకే..

రావుగారన్నట్టు మీ సమీక్ష సాధారణంగా హిందీ సినిమాలంటే భయపడే నాచేకూడా ఈ సినిమా చూపించేలా ఉంది. సినిమా చూసి చెప్తా..
pi said…
I want to watch that film. I have seen omkara & I loved it. I need to check out my local video store. BTW Vanaja is releasing in Bay Area on 5th. I already made plans to watch it on 5th. :).
nuvvusetty brothers said…
మీ సమీక్ష,సినిమా చూడాలని పించేలా ఉంది.
Indian Minerva said…
ఈ DVD నేను కొన్నాను కానీ నా కంప్యూటర్లో ప్లే అవ్వటంలేదు. ఇక ఈ రోజు టొరెంటు ద్వారా download చెయ్యాలి.