తంబూర చేకొని ..

తోడి రాగలక్షణాలు చెబుతూ మహామహోపాధ్యాయ నూకల చిన్నసత్యనారాయణ గారు Ragas of Indian Music పుస్తకంలో ఇది శాంత, కరుణ భక్తి రసములకు ప్రధానమని చెప్పారు. త్యాగరాజుకి పూర్వీకుడైన వెంకటసుబ్బయ్యర్ బాలకృష్ణుని గురించి యశోదతో గోపెమ్మలు ఫిర్యాదు చేస్తున్న గొంతుతో "తాయే యశోద, ఉందన్ ఆయర్ కులతుదిత్త" అని ఒక పక్క బాలకృష్ణుని కొంటెతనాన్ని, మరొక పక్క గోపెమ్మల కోపాన్ని, ఇంకో పక్క వాళ్ళ మురిపాన్నీ రంగరించి వయ్యారాలతో, విరుపులతో, బహు సొగసైన పాట తమిళంలో ఈ రాగంలో రచించారు. దీన్నే ఈ మధ్య కొత్తగా ఫ్యూషన్ రంగులద్ది Morning Raga సినిమాలో చూపించారు. ఎప్పుడో యాభయ్యేళ్ళకి పూర్వం మాటల మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు "జోడు గూడీ తోడి రాగం పాడుకుంటూ" అని పాడించాడు రేలంగితో .. ప్రియురాలితో సయ్యాటలాడేందుకు తోడి రాగమే సరైన నేపథ్య సంగీతం అన్నట్టు.

అసలు అంత దాకా ఎందుకు .. త్యాగరాజస్వామే తోడిలో కనీసం ఒక ఇరవై కృతులదాకా రచించారు. వాటిల్లో ఒక దానిలో ఉన్న భావం మరొక దానిలో ఉండదు. కానీ ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క రాగం వాడడం త్యాగరాజస్వామికి ఇష్టమేమో అనిపిస్తుంది. రాముని అందాన్ని పొగడ్డానికి మోహన రాగం, రాముని గొప్పతనాన్ని పొగడ్డానికి ఖరహరప్రియ, బరువైన ఆధ్యాత్మిక వైరాగ్య భావాలని బోధించడానికి శంకరాభరణం - ఇలాగ. సంగీతంలో తనకున్న లోతైన అవగాహన వలన ఆయన తన వాడుకతో ఆయా రాగాలకి ఒక నిర్దిష్టమైన రూపమిచ్చి తనదైన ముద్ర వేశారేమో అని కూడా అనిపిస్తుంది.

అలా ఆయన దృష్టిలో తంబూరా నాదానికి తోడి రాగానికి ఏదో అవినాభావ సంబంధం స్థిరపడి ఉంటుంది. నాకు తెలిసి కనీసం రెండు కృతులలో తంబూరా నాదం తోడిరాగంలో ప్రతిధ్వనిస్తుంది.

కొలువమరెగదా కోదండపాణీ
వేకువ జామున వెలయుచు తంబూర
చేకొని గుణముల చెలువొంద పాడుచు
శ్రీకరునికి ఆశ్రిత చింతామణునికి
ఆకలి దీర బాలారగింప జేయు .. కొలువమరె గదా ..

కద్దను వారికి కద్దు కద్దని మొరల నిడు
పెద్దల మాటలు నేడబద్ధమౌనో
నిద్దుర నిరాకరించి ముద్దుగ తంబూరా బట్టి
శుద్ధమైన మనసుచే సుస్వరముతో
పద్దు తప్పక భజియించే భక్త పాలనము సేయు
తద్దయశాలివి నీవు త్యాగరాజ సన్నుత

తంబూరా ప్రస్తావన మినహాయిస్తే, ఈ రెండు కృతులలోనూ వ్యాపించి ఉన్న స్థాయీభావం వేరు. ప్రధాన రసం భక్తే అయినా గొంతులో తేడా ఉంది - "మోహము నీపై మొలచి యున్నాదిరా" అనడానికీ, "వగ జూపకు తాళను నన్నేలుకోరా" అనడానికీ చాలా తేడా ఉన్నది. రెండూ భక్తిపూరితములే కానీ ఆ తేడా గొంతులో ఉంది. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి చెప్పే ఆర్ద్రత ఇదే. మొదటి కృతిలో కనిపించిన శ్రీరామునికి పాలారగింప చేసే ఘట్టం ఇంకో తోడిరాగ కృతిలో ప్రత్యక్ష మవుతుంది "ఆరగింపవే, పాలారగింపవే" అంటూ.

చార్‌సుర్ వాళ్ళు గత తరం విద్వాంసుల పూర్తినిడివి కచ్చేరీలని "పద్ధతి" అనే పరంపరలో విడుదల చేస్తున్నారు కొంత కాలంగా. కీ.శే. ఓలేటి వెంకటేశ్వర్లుగారి గాత్ర కచేరీలో "కొలువమరెగదా" ముఖ్యాంశంగా విపులంగా పాడారు. వేకువ జామున అన్న చరణపు వరుస మీద నెరవులు వేసి పాడుతుంటే త్యాగరాజు మదిలో జనించిన ఆ దివ్య తంబూర నాదం ఆయన గొంతులో ప్రతిధ్వనించింది.

Comments

Sriram said…
మంచి కీర్తనలు గుర్తుచేసారు. రాముని తర్వాత త్యాగరాజస్వామికి తంబూరాయే అత్యంత ప్రీతిపాత్రం అనిపిస్తుంది.

మొన్ననే మా ఊళ్ళో సంజయ్ సుబ్రమణ్యన్ ఈ కొలువమరెగదా అద్భుతంగా ఆలాపించాడు. తంబూర చేకొని దగ్గరే నెరవు వేసి పాడాడు.

ఇక్కడ వినండి:
http://www.sangeethapriya.org/~hariharan/sanjay/93-Sanjay-GayanaSamaja-Aug2007/
Anonymous said…
eemaaTa krotta saMchikalO 'sAyamu sEyarA' katha meedEnA?
శ్రీరామా, అది నిజం. అప్పుడప్పుడూ సంజయ్ స్టైలు కొద్దిగా ఓలేటిని గుర్తు చేస్తుంటుంది నాకు. ఈ టపా శుక్రవారమే రాశాను. వారాంతంలో యాదృఛ్ఛికంగా మరి కొన్నిసార్లు తోడిరాగం ఎదురైంది. ఇంకో టపాలో ..

యెనానిమస్సునికి - అవును.
సంగీత పరిగ్నానం యిసుమంతయు లేక్కున్నా,విని ఆనందించ గలను.అందుచేత యేమీ అభిప్రాయాలు యివ్వలేను. సప్తగిరి చానల్లో బుడతల గాన సామర్ధ్యాన్ని వింటూ వుంటాను....నూతక్కి
ఓలేటి లంకె పనిచెయ్యడం లేదు గురూజీ.