వీరు వృత్తిరీత్యా స్థానిక ఓక్లాండ్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రంలో ఆచార్యులు. కంటి రుగ్మతలకి సంబంధించిన విషయాలపై పరిశోధన చేస్తుంటారు. ప్రవృత్తి రీత్యా తెలుగు భాషాభిమాని, సాహిత్యాభిమాని, ప్రజాస్వామ్య వాది, మానవతావాది. మా తెలుగు సాహితీ సమితికి మూలస్తంభాల్లో ఒకరు. తోటి కథారచయిత, చిరకాల మిత్రులు. సీతారామయ్యగారికి చలం అంటే చాలా అభిమానం. వారింట్లో అందరూ కూర్చునే చోట ఎదురుగుండా చలం ఫొటో ఫ్రేముకట్టి అలమారులో ఉంటుంది. అప్పుడప్పుడూ ఎవరో ఒకరు, మన తెలుగు వారు కూడా, ఆ ఫొటో చూపించి, "ఎవరండీ, మీ నాన్నగారా? " అనడగడం జరుగుతూ ఉంటుంది. (రామాయణంలో పిడకల వేట - ఇది చదివే వాళ్ళలో ఎంతమంది చలం ఫొటోని గుర్తుపట్టగలరు? గురజాడని? విశ్వనాథని?)
ఈ సంపుటంలో పధ్నాలుగు కథలున్నయ్యి. ఈ కథలన్నీ 1998 - 2005 మధ్య రాసినవి. మూడు కథలు తప్పించి అన్నీ ఐదారు పేజీలు మించకుండనే, ఆ మూడైనా పది పేజీలలోపే. ఒక్కో కథా, అలవోకగా, సాయంత్రం పూట కప్పు టీ తాగే టైములో చదివెయ్యొచ్చు. ఎటొచ్చీ, చదివిన తరవాత ఆ కథనీ కథలో పాత్రల్నీ ఒక పట్టాన మర్చిపోలేం. మామూలుగా అమెరికా రచయితలు రాసిన కథల్లో (ఇది దారుణమైన స్టీరియోటైపింగ్ అనుకోండి) కనబడే మాతృదేశం విడిచి వచ్చిన బాధ, ఇక్కడి పరిస్థితులు వింతగా కొత్తగా అనిపించడం లాంటి సాధారణ దినుసులు వీటిల్లో ఉండవు. కొత్త సమాజం నించి నేర్చుకోవడం, దాంతో రాజీ పడడానికి ప్రయత్నించడం, రాజీ కుదరని చోట యుద్ధం చెయ్యడం కనిపిస్తాయి. వెరసి ఇప్పుడే కొత్త వాతావరణంలో తన అస్తిత్వాన్ని గుర్తించుకుంటున్న ఒక వలస జాతి గొంతు విప్పడం వినిపిస్తుంది.
కథనంలో సీతారామయ్య గారిది కుటుంబరావు బడేమో అనిపిస్తుంది నాకు. అనవసరమైన వర్ణనలూ అవీ ఉండవు. టూకీగా కథ నేపథ్యాన్ని పరిచయం చేసి పాత్రల్ని ప్రవేశ పెడతారు. కొన్ని కథల్లో పాత్ర ప్రవేశించడంలోనే కథా నేపథ్యం సమర్ధవంతంగా ఆవిష్కృతమౌతుంది. పాత్రలు కూడా, హెవీ మేకప్పు లేకుండా, కథకి తగినట్టు ఉంటాయి. ప్రతి పాత్రా తన స్థాయికి తగిన సంస్కారంతో ప్రవర్తిస్తుంది, సంస్కారానికి తగిన గొంతుతో మాట్లాడుతుంది, ఎవరో మనకి తెలిసిన మనిషిలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కథలన్నీ నిజజీవితం నించి వచ్చినవే.
రెండు వారాల సెలవు, గట్టు తెగిన చెరువు, సావాసం సహవాసం కథలు వృత్తి వలస నేపథ్యంలో హడావుడి పెళ్ళిళ్ళ వల్ల భారతదేశం నించి అమెరికా వచ్చిన స్త్రీల జీవితాల్లోకి కిటికీలు తెరుస్తాయి. మళ్ళా నాలుగేళ్ళకి, ముసుగులోంచి, జీతగాళ్ళు కథలు సమకాలీన జాతీయ అంతర్జాతీయ సంఘటనల నేపథ్యంలో వ్యక్తిత్వానికి ఏం విలువ ఉంది, వ్యక్తిగతంగానూ సమిష్ఠిగానూ మనం ఏం చెయ్యగలమనే ప్రశ్నల్ని పరిశీలనకి తీసుకొస్తాయి. దూరపు కొండలు కథ కుల మత జాతి వివక్షతలు ఎలా మన నరనరాల్లో జీర్ణించుకు పోయాయో, ఖండాంతర వాసంలోకూడా అవి మన జీవితాల్ని ఎలా శాసిస్తున్నాయో ఎత్తి చూపుతుంది. అవచారం, వెలుతురు, కొత్త ఊపిరి కథలు దేశం వదిలి వచ్చినా మనల్ని వదలని (మనం వదిలించుకోని) "ఇంటి" అలవాట్లకి, ఇంకా పూర్తిగా వంటబట్టని "ఇక్కడి" అలవాట్లకి మధ్య నలిగే జీవితాలకి అద్దం పడతాయి.
ప్రగతి ప్రభ, మీకు మీరే - ఈ రెండే అమెరికా ప్రసక్తి లేకుండా భారతదేశంలో జరిగే కథలు. ప్రగతి ప్రభ, కథలో అంతర్లీనంగా ఉన్న రాజకీయ నేపధ్యంతోనూ, పంచతంత్రం లాంటి జానపద కథనంతోనూ, ఇతర కథల్లో లేని వ్యంగ్య వైభవంతోనూ ఈ సంపుటంలోని కథలలో విలక్షణంగా నిలుస్తుంది. కొద్దిగా కొకు రాసిన దిబ్బరాజ్యం కథల్ని తలపించినా, కొకు స్పృశించని లోతుల్లోకి వెళ్ళి అనేక ఆర్ధిక రాజకీయ సామాజికాంశాల్లో కార్య కారణ సంబంధాలపై గురి పెట్టిందీ కథ. ఈ కథా రచనా కాలాన్ని బట్టి బహుశా కథలో రూపించినది వాజపేయి బీజేపీ భారతదేశాన్నీ, చంద్రబాబు టీడీపీ ఆంధ్రరాష్ట్రాన్నీ ఏలుతున్న టైము - అదెంత స్వర్ణయుగమో కథ చదివి చూడాల్సిందే!
వలస జీవితాల్లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు చాలానే మనకి సీతారామయ్య గారి కథల్లో పరిచయమౌతాయి. మామూలుగా సభ్య సమాజంలో జనం బయటకి మాట్లాడుకోడానికి బిడియపడే సున్నితమైన సమస్యలు కూడా. కానీ ఎక్కడా "ఈ సమస్యని ఇలా పరిష్కరించుకోండి" అని రచయిత మనకి నొక్కి చెప్పరు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ ఎవరికి వారు, వారి సంస్కారానికీ, వారి సహన శక్తికీ తగినట్టు పరిష్కరించుకో వలసిందే. పరిష్కరించుకోవడానికి మనకి అందుబాటులో ఉన్న పనిముట్లేవిటో చెప్పి, చక్కని పరిష్కారం దొరకాలంటే మనం ఎలా ఆలోచించాలో మాత్రం సూచిస్తారు. అందుకే ఈ కథలు మనల్ని ఆలోచింప చేస్తాయి. నేనుండే నుయ్యే నా ప్రపంచం అనుకునే కూపస్థ మండూకాల సంగతేమో గానీ, మన చుట్టూ ఒక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంతో నా జీవితం వీడలేని విధంగా ముడిపడి ఉంది అని భావించే అమెరికా భారతీయులు తప్పక చదవాల్సిన కథలివి. వోల్గా కథల్ని సమర్ధవంతంగా ఆంగ్లంలోకి అనువదించిన సీతారామయ్యగారు తన కథల్ని కూడా ఇతర ప్రవాస భారతీయులకి అందుబాటులో ఉండేట్లు అనువదించడం గురించి ఆలోచించాలి.
Comments
ఒకప్పుడంటే ఉద్యోగావకాశాలనుకోవచ్చు, మరిప్పుడే భారతం లో తక్కువా ?
ఎంత తీరిగ్గా కూర్చుని లాజికల్ గా ఆలోచిద్దామన్నా ఈ విషయం మాత్రం నా మదిని తొలుస్తూనే ఉంటుంది. పరాయి దేశంలో ఉన్న ఏ వ్యక్తి ని కదిపినా చిన్ననాటి సంగతులు, అమ్మా నాన్నా తో గడిపిన మధుర క్షణాలు చెబుతూనే ఉంటారు, ఏదో ఒక నిర్లిప్తత కనిపిస్తూనే ఉంటుంది. అయినా సరే వీలున్నా సరే వెనక్కి మాత్రం రారు. వీళ్ళు హిపోక్రట్స్ అనిపిస్తుంది నాకయితే.
సారీ చాలా ఎక్కువగా రాశాను. క్షమించండి. ఇంక ఉంటాను. ఈ కథలతో నేనెలాగూ రిలేట్ చేసుకోలేను లేండి.
@యనానిమస్సు - నవోదయ ఈమెయిలు ఇది vjw_booklink [at] yahoo [dot] co [dot] in
మిగతావారికి ధన్యవాదాలు.