ఈ ప్రభుత్వం మనదేనా?

సెప్టెంబరు 11 ఘోరం జరిగిపోయాక అప్పుడు మేల్కొన్న అమెరికా ప్రభుత్వ యంత్రాంగం నానా హడావుడీ చేసింది. విమానాశ్రయాలన్నిటిలో విపరీతమైన నిఘా పెంచింది. అలాగే ఇప్పుడు హైదరాబాదు పేలుళ్ళతో మేల్కొన్న మన కేంద్ర రాష్ట్ర యంత్రాంగాలూ హడావుడి చేస్తున్నై - తిరుమలలో రెడ్ ఎలర్టు-ట. ఇంకెక్కడో రెడ్ ఎలర్టు. అసలు రాష్ట్రమంతా రెడ్ ఎలర్టే. ఒక ఘోరం జరిగాక అయినా ఇతర జన సమ్మర్ద ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోక పోతే అది అవివేకమవుతుంది కానీ జాగ్రత్తలు తీసుకోవడం గొప్ప వివేకానికి సూచన కాదు.

పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకోనియ్యకుండా దుర్ఘటన జరిగిన స్థలాల్లో పని లేని రాజకీయుల పర్యటనలు. ఇంకొక పనిలేని రాజకీయుడు అసలేం పట్టనట్టు హాయిగా కొడుకు పెళ్ళి చేయిస్తూ - ఐతే అతివృష్టీ లేకపోతే అనావృష్టీ అన్నట్టుగా ఉంది ఈ రాజకీయుల వ్యవహారం.

అసలు అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు ఎవరు బాధ్యులు? దేశంలో జరుగుతున్న అరాచక విధ్వంస చర్యల వెనుక దారులు కొన్ని హైదరాబాదులో అప్పుడెప్పుడోనే తేలినై. మసీదు పేలుళ్ళ వెనుక బాగోతం ఇంతవరకూ బయట పళ్ళేదు. ఆ పరిశోధన ఏమైంది - మీడియాతో పాటు అధికారులు కూడా ఆ విషయం అప్పుడే మరిచిపోయారా? ఇప్పుడు మాత్రం ఏమౌతుంది - రాజకీయులు నిప్పులు చెరుగుతారు, అటూ ఇటూ వేళ్ళు చూపిస్తారు. అధికారులు తగుమాత్రంగా మొహాలు వేళ్ళాడేసుకుని మేం చెయ్యగలిగిందంతా చేస్తున్నాం అంటారు. ఒక వారం తిరిగేప్పటికి మీడీయా ఈ విషయం మరిచిపోతుంది. దాంతో మనమూ మరిచిపోతాం.

అప్పుడే బలిపశువుల్ని సిద్ధం చేసే యజ్ఞం మొదలైనట్టుంది. ఆంధ్రజ్యోతిలో చదివిన వార్త: రాజకీయుల వత్తిడి వల్ల గోకుల్ చాట్‌కి చట్టవిరుద్ధంగా లైసెన్సిలిచ్చిన బల్దియా అధికారులదే తప్పుట. ఎట్లా ఉందంటే ఇంటో దొంగలు పడ్డారు మహాప్రభో అని మొరపెట్టుకుంటే - నీ ఇంటి ప్లాను ఎప్రూవైందా, అసలు ఇల్లెందుకు కట్టావు అని నిలదీసినట్టు.

ఈ పేలుళ్ళ గురించి అత్యంత భీతి గొలిపే విషయం ఏవిటంటే ఆ చోటులో నేనైనా మీరైనా ఉండి ఉండవచ్చు. ఇదివరలో, దాడులు చేసింది ఎవరైనా, దాడికి గురయ్యేది ఏ ప్రముఖ వ్యక్తులో, ఏ రాజకీయ నాయకులో అయి ఉండేవారు. మనది ప్రజా ప్రభుత్వమే అయినా ప్రజలూ ప్రభుత్వమూ ఒకటేనని ఇటు ప్రజలూ అనుకోలేదు, అటు ప్రభుత్వమూ ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ నాడు ఆ హద్దులు చెరిగి పోయాయి. ఎవడికో ఎవరిమీదో ఎక్కడో కాలితే - ఎటూ సంబంధంలేని 42 మంది జీవితాలు దగ్ధమవటం. మనల్ని కాదులే అనుకుని చూపు తిప్పేసుకోలేం. మన గొడవ కాదులే అని మనమింక విడిగా ఉండలేం. ప్రజల గుండె చప్పుడుతో కలిసి వినబడాలి ప్రభుత్వ స్పందన. ప్రజల గొంతుతో మాట్లాడాలి ప్రభుత్వం నోరు. మనవి కాని గొంతుల్ని అరువు తెచ్చుకోనియ్యకండి. ఈ దేశం మనది, ఈ ప్రజలు మనవాళ్ళు, ఈ ప్రభుత్వం మనది - సాధికారతని సార్వభౌమత్వాన్ని స్వాధీనం చేసుకుందాం.

Comments

మీ టపాలో వావ్ అని అనిపించిన విషయం
"ఇదివరలో, దాడులు చేసింది ఎవరైనా, దాడికి గురయ్యేది ఏ ప్రముఖ వ్యక్తులో, ఏ రాజకీయ నాయకులో అయి ఉండేవారు."
కానీ కాస్త ఆలోచిస్తే టెర్రరిజం అంటే ఇదే కదా అనిపించింది. టెర్రరిజానికి ఎవరిని చంపుతున్నాం ఎందుకుచంపుతున్నామన్నది ముఖ్యం కాదు భయోత్పాతమే వాళ్ళ సాధనం.

తెలుగులో టెర్రరిస్టులను తీవ్రవాదులు అని అనటం కామేడ్లను కించపరచటమే అని నా అభిప్రాయం. టెర్రరిస్టులకు భయోత్పాతకులని కొత్తపేరు పెట్టాలేమో?

భయోత్పాతముతోన సమకూరు పనులన్ని ధరలోన (అమ్మ ముద్ద తినిపించటానికి బూచీ అన్నట్టు)
Anonymous said…
"ఇప్పుడు మాత్రం ఏమౌతుంది - రాజకీయులు నిప్పులు చెరుగుతారు, అటూ ఇటూ వేళ్ళు చూపిస్తారు. అధికారులు తగుమాత్రంగా మొహాలు వేళ్ళాడేసుకుని మేం చెయ్యగలిగిందంతా చేస్తున్నాం అంటారు. ఒక వారం తిరిగేప్పటికి మీడీయా ఈ విషయం మరిచిపోతుంది. దాంతో మనమూ మరిచిపోతాం."

అక్షరాలా మీరు పైన చెప్పింది నిజమండీ .మీ వేదనతో ఏకీభవిస్తూ....
Naga said…
ఎక్కువ మంది అమాయకులను ముట్టుబెట్టాలి అనే ఈ దుశ్చర్య ఏ మాత్రం క్షమార్హం కాదు. ఈ భయోత్‌పాతకులను ఏరివేయడానికి ఎంతకు తెగించినా తప్పు లేదు.
pi said…
Ekkadayina politicians dont give a crap about people. Nenu Musarambagh lo chaduvukunnanu. Akkada bomb diffuse chesaaru anagaane, ado la anipinchindi.
Terrorism is a very very serious issue. I hope our govt takes some steps about this.
Naga Pochiraju said…
అసలు ఈ ముఖ్యమంత్రికి కొంచమైనా బాధ్యత ఉందా?
డిల్లీ లో జరిగింది,వారణసి లో జరిగింది,ఇక్కడా జరిగింది అని చాలా సాధారణ విషయం గా తీసేశాడు...('డూ ప్రయోగించింది.....ఆయన పదవిమీద,ఆయనమీద నాకు గౌరవం పోయింది)
ఆ క్షణం లో మనసారా.....ఆ బాంబు ఎదో ఇలా అంటున్న వాడి పక్కన పెడితే బాగుండు అనుకున్నా....
ఈ హడవుడి అంతా రెండు రోజులే.....మళ్ళీ మామూలే...ఇంకో బాంబు పేలినప్పుడు ఎదో చేసేస్తాం అని గట్టిగా అరుస్తారు....షరా మామూలే...
60 ఏళ్ళ స్వాతంత్రయం అని గొప్పగా చేసుకుంటాం.కనీసం స్వేచగా బ్రతికే హక్కు లేదు ఈ స్వాతంత్రాయినికి.....

ఈ పేలుళ్ళ వల్ల అందరికీ "ఈ జీవితం బుద్బుద ప్రాయం అయ్యింది,మరుక్షణం చనిపోవచ్చు,కాబట్టి ఈ క్షణాన్ని మనస్పూర్తిగా జీవించు" అన్న నీతి నేర్పుతుంది
Naga Pochiraju said…
ఇంకా నీచం ఏంటి అంటే....కొన్ని ప్రసార మాధ్యమాలు ఎవరో కొడుకు పెళ్ళి ని ఇంత ఘోరం లో కూడా ప్రసారం చెయ్యడం.....
ఆ పెళ్ళికి ఎవరెవరు వచ్చారు,ఎవరైనా దాన్సు చేసారా,ఎలా ,ఏ పాటకి చేసారు,అక్కడ పెళ్ళి వంటలు ఏంటి....ఇవ్వన్ని అవసరమా.........అదీ ఒక పక్క ఇంత దారుణం జరిగాక

ఈ పేలుడు సంఘటన జరిగి ఉండక పోతే,మన ప్రసార మాధ్యమాలు ఈ "ఊళ్ళో పెళ్ళికి" తమదైన హడవుడి చేసేవారు...

అసలే తమ వాళ్ళు పోయి బాధ పడుతుంటే,వాళ్ళ నోటి దగ్గర మైకు పెట్టి గుచి గుచి ప్రశ్నలు వెయ్యడం.....ఇది పాత్రికేయమా,రాక్షసమా......
Anil Atluri said…
This comment has been removed by the author.
Anil Atluri said…
@లలితా స్రవంతి said...
రెండూ కాదు!
రాక్షస కేళి అది!
నేను హైదరాబాదులో పుట్టి పెరిగాను. సందు సందు నాకు కొట్టిన పిండి. గోకుల్ లో కొన్ని వేల సార్లు చాట్ తినాను. కనుక ఇంకా personal గా visualize చేయగలుగుతున్నాను.జరిగినది మామూలు ఘోరం కాదు. మీరు, నేను ఎవరైన ఉండవచ్చు. మనకే ఏదైనా అయ్యి ఉండవచ్చు. అంతకన్నా బాధాకరమైనది, మనకు ఎంతో ఆప్తులైన వాళ్ళను కోల్పోయి ఉండవచ్చు.

రాజకీయ రాబందుల చే ప్రేరేరింప బడిన మత కలహాలకు
అంతమే లేదా? కలియుగానికి నాలుగు కాళ్ళు కుంటి అంటే ఎమో అనుకున్నాను. నిజమే సుమా!
Unknown said…
నెల రోజుల్లో నేను ఇండియా వెళ్తున్నాను. అమెరికాలోనూ సెక్యురిటీ లేదు ఇండియాలోనూ లేదు అనిపిస్తోంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు. నాకెప్పుడూ అనిపిస్తుంది అప్పట్లో గాంధీ గారు అందరినీ చైతన్యపరచి తెల్లవాళ్ళని తరిమి కొట్టినట్లు ఇప్పుడు కూడా ఎవరైనా మహానుభావుడు పుట్టి ప్రజల్ని ఉత్తేజపరచి ఈ కుళ్ళు రాజకీయనాయకులని, రాజకీయాలని తరిమి కొట్టే రోజొస్తుందా అని. అయినా అప్పుడు ప్రజలలో అన్యాయాన్ని ఎదుర్కోవాలనే తపన ఉండేదనుకుంట. ఇప్పుడు మన తిండి, మన బతుకు బావుంటే చాల్లే పక్కవాడు పోతే ఏంటనే తత్వం వచ్చేసింది అందరిలోనూ.