అపురూపమైన నాట్య ప్రదర్శన

గత వారాంతంలో మా ఊళ్ళో అద్భుతమూ అపూర్వమూ ఐన ఒక నాట్య ప్రదర్శన తిలకించే భాగ్యం కలిగింది. బెంగుళూరుకి చెందిన Articulate అనే సంస్థ వారు పదమూడు మంది కళాకారులతో పంచవక్త్రం అనే నృత్యనాటిక, మరికొన్ని భరత నాట్యాంశాలు ప్రదర్శించారు.

ఈ ప్రదర్శన మీ ఊరి దగ్గర్లో జరుగుతుంటే తప్పక చూడండి. మీకు భారతీయ సాంప్రదాయ సంగీతం, నాట్యాల మీద ఏ మాత్రం ఆసక్తి లేకపోయినా సరే, వెళ్ళి చూడండి. మీరు ముగ్ధులౌతారని నా హామీ. వారి అమెరికా పర్యటన వివరాలు పైన ఇచ్చిన లంకెలో ఉన్నాయి.

ఈ ప్రదర్శన ఎన్నో విధాలుగా విలక్షణమైనది.

ఈ బృందంలో ఐదుగురు సభ్యులు అంధులు. అన్ని ఇంద్రియాలు, అవయవాలు సవ్యంగా పనిచేస్తుండగానే భరతనాట్యం వంటి సాంప్రదాయ కళలు నేర్వడం చాలా కష్టం. నిష్ణాతులవడం ఇంకా కష్టం. కర్ణాటకలో, సాంప్రదాయ విద్యలకి ఏ మాత్రం సంబంధం లేని నిరుపేద కుటుంబాలలో పుట్టి, చిన్న వయసులోనే వివిధ జాడ్యాల వలన, తగిన వైద్య సదుపాయం లేక చూపు కోల్పోయిన ఈ ఐదుగురు యువకులు నేడు భరతనాట్యంలో కాకలు తీరి దేశ విదేశాల ప్రేక్షకులతో సెబాసనిపించు కుంటున్నారు. వేరెవరో జబ్బపట్టుకుని వేదిక మీదికి తీసుకొచ్చి నిలబడితే, నాలుగు అడవులు వేసి ఏదో చేశామనిపించటం కాదు. ఈ యువక బృందం ప్రదర్శించినది అగ్రశ్రేణి నృత్యం. ప్రతి అంశానికి, ఒకరి వెనుక ఒకరో, లేక బృందం గానో సంగీతానికి తగిన అడుగులు వేస్తూ ప్రవేశించడం, ప్రదర్శన జరిగినంత సేపూ వేదిక మీద వేర్వేరు అమరికలలో నిరంతరం మారుతున్న వ్యూహాలలో చలిస్తూ, వేసే ప్రతి అడుగులో, పట్టే ప్రతి ముద్రలో, అభినయించే ప్రతి భంగిమలో అనంతమైన ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతుండగా నర్తించారు వారు. భూసె గౌడ, రాముడు, శివస్వామి, గురుప్రసాద్, సతీష్ - చిక్కని చక్కని నాట్యాన్ని ప్రదర్శించి అడుగడుగునా ప్రేక్షకుల మన్ననలకు పాత్రులైనారు.

విఘ్నేశ్వరునికీ భూదేవికీ నమస్కృతులిడి సాంప్రదాయకమైన తోడాయమంగళంతో ప్రదర్శన ప్రారంభించారు. నారాయణ తే నమో నమో, శరణు శరణు సురేంద్ర సన్నుత - ఇత్యాది అన్నమయ్య భక్తి పద మాలికలతో విష్ణుదేవుని వివిధ రూపాలలో స్తుతించి మంగళాచరణం చేస్తుంది ఈ అంశం. ఐదుగురు అంధ కళాకారులతో సరికొత్తవిధంగా నాట్యరచన (కొరియాగ్రఫీ) చేశారు ఈ అంశానికి. కాళీయ మర్దన కృష్ణుడు, లక్ష్మణ సహిత రాముడు, శేషశాయి, వేంకటేశ్వరుడు మొదలైన విష్ణు రూపాలను సందర్భోచితంగా ప్రత్యక్షం చేశారు ఈ ఐదుగురు అంధ కళాకారులు (ఐ.అం.క.).

అటుపైన తిల్లానా ప్రదర్శించారు. వివిధ లయ గతులతో క్లిష్టమైన జతులతో నృత్తానికి పెద్దపీట వేసి కళాకారుని సౌష్ఠవానికి, ఓర్పుకి పరీక్షపెట్టే అంశం తిల్లానా నృత్యం. మన ఐ.అం.క. దీన్ని కూడా ఎంతో ప్రతిభతో నిర్వహించారు.

పంచవక్త్రం - సుమారు యాభై నిమిషాల నృత్య రూపకం. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచ ముఖములుగల పరమశివ తత్త్వాన్ని ఆవిష్కరించినది. సృష్ట్యాది లో శూన్యము నుండి శివలింగము ఆవిర్భవించినది - ఇది ఓంకార రూపం. దీని నుండి శివపంచాక్షరీ మంత్రము జనించినది. మంత్రములోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శివుని సృష్టించినది. ఒక్కొక్క శివుడు ఒక్కొక్క శక్తితో కలసి పంచభూతములలోని ఒక్కొక్క భూతము (element) ను సృష్టించినాడు. ఇవన్నీ ఏకమై అర్ధనారీశ్వర రూపముగా అవతరించి యావద్ సృష్టికీ రూప కల్పన చెయ్యడం - సూక్ష్మంగా ఇదీ కథ.

అష్టదిక్కులను దిక్పాలకులను ప్రార్థించే నాందితో రూపకం మొదలైంది. చేతుల్లో ధ్వజము, పూర్ణకుంభము, పువ్వుల పళ్ళెం మొదలైన ఆహ్వాన సూచికలను ధరించి ఐ.అం.క. ఒక బాణం రూపంలో నిలుచుండి ఒకటొకటిగా ఎనిమిది దిక్కులకూ తిరిగి ఆవాహన చేశారు. వేద మంత్రోఛ్ఛారణ నేపథ్యంలో శూన్యంనుండి పంచ ముఖమైన శివలింగం అవతరించడం అద్భుతంగా రూపించారు. ఈ దృశ్యం కరిగిపోగానే రంగానికి వెనుకగా ఉన్న ఒక మెట్టు మీద సద్యోజాత శివుడు ప్రత్యక్షమైనాడు. "సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమో నమః" అనే వేదమంత్రం ఆయన్ను ఆవాహన చేసింది. కర్ణాటక పద్ధతిలో వాద్య సంగీతం మొదలైంది. వయ్యారంగా వచ్చి పరాశక్తి అతనితో చేరగా ఇద్దరూ భరతనాట్య రీతుల్లో నాట్యము సాగించారు. వారి సృజనతో పృథ్వీ భూతం ఉత్పన్నమైంది. శక్తీ శివులు రంగం వెనుకభాగంలో కొలువు తీరగా ఐ.అం.క. ముందుభాగంలో ప్రవేశించి పృథ్వి యొక్క అనేక లక్షణాలను ప్రత్యక్షము చేస్తూ వాద్యసంగీతానికి అనుగుణంగా నర్తించారు.

ఇదే పద్ధతిలో మిగిలిన నాలుగు భూతాల సృష్టి క్రమాన్ని ప్రదర్శించారు..
వామదేవ .. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః .. ఆది శక్తి .. జల భూతం .. కూచిపూడి సాంప్రదాయం
అఘోర .. అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోర తరేభ్యః .. ఇఛ్ఛా శక్తి .. అగ్ని భూతం .. యక్షగాన సాంప్రదాయం
తత్పురుష .. తత్పురుషాయ విద్మహే మహా దేవాయ ధీమహి .. క్రియా శక్తి .. వాయు భూతం .. కథక్ పద్ధతి
ఈశాన .. ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం .. జ్ఞాన శక్తి .. ఆకాశ భూతం .. పేరిణి తాండవ సాంప్రదాయం

ప్రకృతి పురుష సంయుక్త రూపముగా అర్ధనారీశ్వరుడు అవతరించి తాండవ నృత్యము సల్పి తన డమరు ధ్వని లోనుండి "అ ఇ ఉ ణృలుక్" శబ్దమాలికగా మాహేశ్వరాణి సూత్రాణి జాలువారగా సృష్టి కార్యక్రమం మొదలైంది.

ఆది దేవుడైన పరమశివునికి సృష్టి అంతా ప్రణమిల్లడంతో రూపకం ముగిసింది.

భరత శాస్త్రంలో నటరాజైన శివుణ్ణి "ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాఞ్మయం ఆహార్యం చంద్ర తారాదితం నమః సాత్వికం శివం" అని అభినయములోని నాలుగు ముఖ్యాంశాలైన ఆంగిక (రంగస్థలం), వాచిక (మాట, పాట, సంగీతం), ఆహార్య (వేషధారణ, అలంకారము), సాత్విక (నటుని హావ భావములు) మూర్తిగా స్తుతిస్తారు. పరమశివుని సర్వ సృష్టికారకునిగా ప్రత్యక్షము చేసిన ఈ రూపకము ఈ నాలుగు అంశాలలోనూ పరిపూర్ణత సాధించడం ఎంతో సమంజసంగా ఉంది. ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ తీసుకుని పనిచేశారనిపిస్తుంది. రంగాలంకరణ, లైటింగ్ డిజైనుని కథలోని సన్నివేశాన్ని ఇనుమడింప చేసే విధంగా ఉపయోగించుకున్నారు. ఉపయోగించిన వేద మంత్రాలు, ఆయా నృత్య రీతులకి సంబంధించిన వాద్య సంగీతములు, గాత్ర సంగీతములు శ్రావ్యంగా ఉన్నాయి, ఎక్కడా ఉచ్ఛారణ దోషాలు లేకుండా. శివ, శక్తి, అర్ధనారీశ్వరుల వేషధారణల అందం చెప్పనలవి గాదు - చూడ వలసిందే. ఒక్కొక్క భూత లక్షణాన్ని నటించడానికి ఐ.అం.క. ప్రతి దృశ్యానికి దుస్తులు మార్చుకుని రావడం ప్రేక్షకులని విస్మయ పరిచింది. సరే ఇక నాట్యకారుల నాట్యకళా కౌశలం గురించి చెప్పేదేముంది.

ఇదంతా ఒక ఎత్తు, అర్ధనారీశ్వరుడిగా ఈ సంస్థ సంచాలకులు శ్రీ మైసూరు నాగరాజు గారి నటన ఒక ఎత్తు. దీనికి నాత్య రచన, నేపథ్య సంగీతము ఉత్తరప్రదేశులో చెలామణి అయ్యే "బహురూపియా" (అంటే బహువేష ధారులు) జానపద కళా పద్ధతిలో ఉంది. నడక అడుగులో, చేతి విదిలింపులో, కనుబొమల కదిలింపులో నవరసాలొలికించ గల ప్రజ్ఞ నాగరాజు గారిది. కుడివైపు పౌరుష భరితమైన తాండవ రాజసం, ఎడమ వైపు మృదు పద లాస్య లాలిత్యం సమపాళ్ళలో ఆవిష్కరించారు. సృష్టి తాండవానికి నేపథ్యంగా మాహేశ్వరాణి సూత్రాణి పఠించడం సృజనాత్మకతకి పరాకాష్ఠ.

కొన్ని బొమ్మలు విడియో ముక్కలు వారి గూటిలో చూడవచ్చు.
ఈ ప్రదర్శన మీ వూరి దగ్గర్లో జరుగుతుంటే తప్పక చూడండి. వారి ప్రదర్శనల వివరాలు కూడా వారి గూటిలోనే ఉన్నాయి.

Comments

Sriram said…
ఆహా!కళ్ళకు కట్టేసారు...చెమర్చేసాయి చదువుతుంటే. బహూత్ బహూత్ ధన్యవాద్!
కొత్తపాళీ గారు,

అద్భుతం,అమోఘం.వారి ప్రదర్సన ను కళ్ళకు కట్టారు.ఆ అద్బుత కళాకారులకు, మాకు పరిచయం చేసిన మీకు నా నమస్సుమాంజలి.
-నేనుసైతం
మీ ఫొన్‌కాల్ తీసుకోలేకపోయినందుకు, ఇంత చక్కటి ప్రదర్శనను చూసే అవకాశం పోగొట్టుకున్నాను, ఈ టపా ఒక ఓదార్పు. చూసినా నేను మీ అంత లోతుగా అర్ధం చేసుకోలేనేమో అనిపిస్తుంది!! థాంక్స్.
కిరణ్ said…
మీ రెండు కళ్ళారా చూసి మూడోకన్ను లాంటి మీ సమీక్షతో మాకు కళ్ళకు కట్టించారు. మీ సమీక్షను దగ్గరుంచుకుని ప్రదర్శన చూడాలనిపిస్తోంది.
pi said…
Nenu veellani Detroit lo choosaanu. Nenu Bay Area lo Sankara Eye Foundation ki volunteer chestaanu. I pushed them to organize this program.

It is September 15th. I hope more people get to watch this.