ముగ్గురు వక్తలు - 1

పోయిన ఆదివారం మా డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితికి ముగ్గురు విశిష్ఠ అతిథులు విచ్చేసి ప్రసంగించారు. చక్కని వేసవి రోజు, వాతావరణం మరి వేడిగా కాకుండా అప్పుడప్పుడూ చల్లటి పిల్లగాలులు వీస్తూ ఎంతో ఆహ్లాద కరంగా ఉంది. గాల్ఫు ఆడుకుంటూనో, పిక్నిక్కులు చేసుకుంటూనో హాయిగా గడిపెయ్యడానికి అనువైనది. ఐనా ముప్ఫై మందికంటే ఎక్కువ తెలుగు సాహిత్యాభిమానులు దాదాపు నాలుగ్గంటలసేపు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

శ్రీ అట్లూరి రామమోహన రావుగారు నవోదయ పబ్లిషర్స్ అధినేత. నవోదయ వారి జీవితంతో ఎంత ముడిపడి ఉన్నదంటే చాలామంది తెలుగు సాహిత్యాభిమానులకి ఆయన "నవోదయ" రామమోహన రావుగానే తెలుసు. తెలుగు పుస్తక పాఠకులకి బాపు-రమణల్ని, నండూరి రామమోహనరావుని, సత్యం శంకరమంచిని, శ్రీరమణని అందించిన ఘనత నవోదయ వారిది. రామమోహన రావుగారు రాష్ట్ర ప్రచురణ కర్తల పుస్తక విక్రేతల సంఘంలో వివిధ పదవుల్లో క్రియా శీలక పాత్ర పోషించారు. విజయవాడ పుస్తకాల పండుగ (Book Festival) ఏటేటా జరిగేందుకు పునాది వేసి దాని అభివృద్ధికి కృషి చేశారు. ఫలితంగా నేడు విజయవాడ పుస్తకాల పండగా దక్షిణ భారతదేశంలో మేటి పుస్తక ప్రదర్శనగా ఎదిగింది. గత జనవరిలో జరిగిన 18వ పండుగని గురించి ఇక్కడ చదవచ్చు.

"నేను మాటల వాణ్ణి కాదు, చేతల వాణ్ణి" అని స్వపరిచయం చేసుకున్న రామమోహన రావు గారు తెలుగు పుస్తక ప్రచురణ చరిత్రని సింహావలోకనం చేసి, ప్రచురణ వ్యాపారంలో తన అనుభవాలను కొన్నిటిని పంచుకుని, ప్రచురణ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్ని టూకీగా ప్రస్తావించారు. ప్రచురణ చరిత్రలో వావిళ్ళ వారు, కాశీనాథుని వారి వంటి విద్వాంసులు తప్ప ప్రచురణ కర్తలు తొంభై శాతం మంది పెద్దగా చదువుకోలేదని, అంచేత చాలా కాలం తెలుగు పుస్తకాలు భయంకరమైన అచ్చుతప్పులతో, నిర్లక్ష్యంగా చేసిన ముద్రణతో వెలువడుతుండేవి. తెలుగులో పుస్తక ప్రచురణ ఒక వ్యాపారంగా ఏదో ఒక కుటుంబం బతికే ఉపాధి చూపించిందిగాని వ్యాపించే వ్యాపారంగా, ఒక పరిశ్రమగా ఏనాడూ ఎదగ లేదు. ఇప్పటికీ పుస్తక ప్రచురణకి ఒక పరిశ్రమగా గుర్తింపు లేకపోవడం ఆందోళన పడవలసిన విషయం. వ్యాపారం వృద్ధి చెందటం దృష్ట్యా బెంగాలీ అనువాద నవలలు, డిటెక్టివ్ నవలలు, 60లలో యద్దనపూడి మొ. రచయిత్రుల నవలలకి పెరిగిన ఆదరణ, ఆ తరవాత 80లలో యండమూరి మార్కు సంచలనాత్మక నవలలు కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. 90లలో టీవీ వ్యాప్తి పుస్తక పఠనాన్ని విపరీతంగా దెబ్బతీసింది. దీనికి తోడు పెరుగుతున్న ఉద్యోగాల చదువుల వత్తిడులు ఎప్పటికప్పుడు విరామసమయాన్ని ఇంకా కుదించేశాయి. మళ్ళీ కొత్త సహస్రాబ్దిలో - టీవీ అప్పటికే మొహం మొత్తి - పుస్తకాల మీద ఆసక్తి మళ్ళీ పెరుగుత్న్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి పాఠకులు, కల్పనా సాహిత్యానికంటే వ్యక్తిత్వ వికాసం, జీవితంలో విజయం సాధించడం వంటి ఉద్బోధనా సాహిత్యం ఎక్కువగా చదువుతున్నారు.

పుస్తక ప్రచురణకి పరిశ్రమగా గుర్తింపు (Industry Status) లేకపోవడం ఒక పెద్ద ఆటంకం. ఇతర వ్యాపారాలకు ప్రభుత్వం అందించే సదుపాయాలు, సబ్సిడీలు పబ్లిషర్లకి అందుబాటులో లేవు. పాఠ్య పుస్తకాల పంపిణీని పుస్తక విక్రేతల నుంచి లాగివేసుకుని ప్రభుత్వమే పంపిణీ చెయ్యడంతో కొత్త సహాయమేమీ లేకపోగా ఉన్నది కూడా ఊడింది. పురాతనమైన పుస్తక పంపిణీ వ్యవస్థ కూడా ఎదుగుదలకి ఆటంకంగా ఉన్నది.

ఇంత ముసురులోనూ కొన్ని ఆశా కిరణాలు మెరవక పోలేదు. ఎన్నారై సాహిత్యాభిమాని ఒకావిడ క్రమం తప్పకుండా నవోదయ నించి తనకిష్టమైన పుస్తకాలు తెప్పించుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆమె కీ.శే. మహీధర రామమోహన రావు గారి కొల్లాయిగట్టితే నేమి నవల కావాలని అడిగితే చాలా కాలంగా ప్రింటులో లేదని తెలిసింది. ఆ పుస్తకం తిరిగి ప్రచురించడానికి అవసరమైన పెట్టుబడి నిచ్చి ఆమె నవోదయ ద్వారా ప్రచురింప చేశారు. తన వాటా తిరిగి తీసుకోకుండా దాన్ని ఇతర పుస్తకాల ప్రచురణకి వినియోగించమని చెప్పారు. శ్రీరమణ మిథునం కథల సంపుటి వెలువడిన కొన్నాళ్ళకి హైదరాబాదు పారిశ్రామిక వేత్త ఒకాయన వంద కాపీలు ఆర్డరిచ్చారు. నెల రోజుల్లో ఇంకో వంద కాపీలకి .. మళ్ళి నేల ఇంకో వంద .. తన వ్యాపార జీవితంలో ఎదురయ్యే మిత్రులకీ, అధికారులకీ ఆయన ఈ పుస్తకం బహుమతిగా ఇస్తూ వచ్చారు - అలా మొత్తానికి ఆయన ఎనిమిది వందల కాపీలు కొన్నారని చెప్పారు రామమోహన రావు గారు. వారి నవోదయ కలకాలం వర్ధిల్లుతూ ఈ కొత్తయుగంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం.

రెండవ భాగం త్వరలోనే ..

Comments

"నేను మాటలవాణ్ణికాను. చేతలవాణ్ణి" అని చెప్పుకోవాలంటే ఎంత ఆత్మవిశ్వాసం కావాలి! మిథునం పుస్తకం యాదృచ్ఛికంగా నా కంటబడింది. ఒక ఆదివారం నేనూ నా మిత్రుడూ మాకు చాలా దూరంలో ఉన్న దేవళానికి వెళ్లాళనుకున్నాం. నేను ఆ పుస్తకం చదవడం చివరకు వస్తుండటంతో ఆపబుద్ధికాక, మిత్రునికి ఆ కథ నేపథ్యాన్ని చెప్పి, కార్లోనే చదివి వినిపిస్తున్నాను. చివర్లో మనసును అదుపుజేసుకునే ప్రయత్నంలో మాటపెగలకపోవడం, గొంతుగద్గదమవడం, కళ్లమ్మట నీళ్లురావడం, ముక్కుకారడం వంటివన్నీ జరిగినై. శ్రీరమణగారివి చాలా ప్రాక్టికల్ రచనలు. అందులో మంచి హాస్యం తప్పకుండా ఆద్యంతం నడుస్తూ ఉంటుంది. ఆ పుస్తకానికి సంబంధించి రామ్మోహనరావుగారూ మీరూ చెప్పిన సంఘటనల్లాంటివి ఇంకా ఎన్నెన్ని జరిగి ఉంటాయో! కొల్లాయిగట్టితేనేమి అనే నవలను రేడియోలో ధారావాహికంగా చదివేవారు , 10-15సం.ల క్రితం. మా ఇంట్లో చాలా ఆసక్తిగా వినేవాళ్లు. ఆ నవల ప్రచురించడానికి డబ్బులిచ్చి మరీ చదువుకోవడం మాత్రం మామూలుసంగతి కాదు. గొప్పగా చెప్పుకోదగిన అభిరుచి. మరి రెండో వక్త ఎవ్వరో?
Naga said…
This comment has been removed by the author.
leo said…
వారి www.telupu.com పుణ్యమా అని కొన్ని మంచి పుస్తకాలు తెప్పించుకునే అద్రుష్టం కలిగింది.
Anonymous said…
The great man took the trouble of securing second hand copies of few books required by me which are out of print. For that I am ever indebted to him. Thanks for introducing him to us via your blog.
Anonymous said…
మాస్టారు - మిగిలిన భాగాలు ఎప్పుడెప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నా. కాస్త తొందరగా రాయరూ.
తరువాయి భాగాలు రాయడం ఆలస్యమైంది. వక్తలు చెప్పిన విషయాల్ని వక్రీకరించకుండా చెప్పాలని, ఒక్కొక్కటి గంటకి పైగా సాగిన ఉపన్యాసాలని క్లుప్తంగా చెప్పాలని ప్రయత్నీంచేప్పటికి సమయం తీసుకుంటోంది. ఇంకొక్క వారంలో వేస్తాను.
Purnima said…
మంచి పుస్తకాలనే కాక, వాటి వెనుకనుండే విశిష్ట వ్యక్తుల పరిచయాలు ఇంస్పైరింగా ఉన్నాయి.

మీ బ్లాగు ద్వార ఇలానే మరిందరు పరిచయమవ్వాలని కోరుకుంటూ..

పూర్ణిమ
Anonymous said…
"మిధునం"కధల పుస్తకం కొనక ముందు నాన్నగారు పత్రికలో బాపుగారి దస్తూరీతో ప్రచురించిన "బంగారు మురుగు","మిధునం" కధలను జాగ్రత్తగా జిరాక్సు తీయించి ప్లాస్టిక్ కవరులో భద్రపరిచారు.తరువాత పుస్తక ప్రచురణ జరిగాకా మేమంతా తలో కాపీ కొనుక్కున్నాం.శ్రీ రమణగారు రచించిన పుస్తకాలన్నీ నాన్న బీరువాలో భద్రంగా ఉంటాయి...బెజవాడ వాస్తవ్యులం కావటం వల్ల 3,4సార్లు రామ్మోహనరావుగారు నాన్నగారితో పని మీద మా ఇంటికి విచ్చేసినపుడు ఆయనను కలిసే అవకాశం లభించింది.మళ్ళీ ఆ జ్ఞాపకాలని గుర్తుచేసారు.కృతజ్ఞతలు.
రామ్మోహన్ రావుగారి కాంటాక్ట్ వివరాలు యిచ్చినందుకు కృతజ్ఞతలు. ఆయన్ని రారా అనువాద సమస్యలు అడిగితే మార్కెట్లో అవి ఎక్కడా లేవు, కానీ, కావలంటే పాత పుస్తకాల వ్యాపారుల దగ్గర ప్రయత్నిస్తానని, మొత్తానికి ఒక కాపీ సంపాదించి పోస్టు చేశారు. He is very resourceful and willing to help. Thanks