నిన్న రాత్రి మా ఊళ్ళో "నేంసేక్" సినిమా ప్రీవ్యూ ప్రదర్శించారు.
తన కథల పుస్తకానికి పులిట్జర్ బహుమతి గెలుచుకున్న రచయిత్రి జుంపా లహిరి రాసిన మొదటి నవలకి మీరానాయర్ కల్పించిన వెండితెర రూపం. ముఖ్య దంపతులుగా తాబూ, ఇర్ఫాన్ ఖాన్, వారి కొడుకుగా కాల్ పెన్ నటించారు.
అసలు లహిరి రచనలు సినిమాలకి ఒదగవని నాకో నమ్మకం. వాటిల్లో ప్రేక్షకుల ఉత్సుకతని రేకెత్తించే హడావుడి ఏముండదు. మామూలు మనుషుల జీవితాల శకలాలు అవి. ఐతే ఆవిడ తన పాత్రలని ఎంతో శ్రద్ధతో ఆర్ద్రతతో తీర్చి దిద్దుతుంది. ఆ పాత్రలు మనకెంతో తెలిసిన వాళ్ళలాగా ఆత్మీయుల్లాగా అనిపిస్తారు. వెండితెరకి అనువదించటంలో పాత్రలకి రూపమిచ్చేది రచయిత్రి కలం కాక దర్శకురాలి కెమెరా కావటంతో - ఆ పాత్రలతో ఏర్పడాల్సిన అనుబంధం ఏర్పడదు. వాళ్ళు మనకేమీ కారు. ఎవరి జీవితాల్లోకో మనం (దొంగతనంగా) తొంగిచూస్తున్న అనుభూతి మిగుల్తుంది. హాస్యం కూడా మనం ఆ పాత్రలతో కలిసి హాయిగా నవ్వుకున్నట్టుకాక వాళ్ళని చూశి నవ్వుతున్నట్టు ఉంది.
ముఖ్య నటీనటులు తమతమ పరిధిలో బానే నటించారు. థియేటర్లో అందరూ (ముఖ్యంగా అమెరికన్ స్త్రీలు) తాబూని చూసి ఆహ్ ఊహ్ (పొగడ్తగా) అనుకున్నారుగాని, నాకైతే ఇర్ఫాన్ ఖాన్ నటన చాలా నచ్చింది. ఓవరాక్షన్ కి ఆలవాలమైన భారతీయ సినిమా నించి వచ్చి పటిష్ఠమైన కంట్రోలుతో అశోక్ పాత్రని పండించాడీయన. మక్బూల్ సినిమా చూశారా ఎవరైనా?
కాల్ పెన్ పరవాలేదు కానీ కొన్ని చోట్ల మరీ వెర్రివెంగళాయిలాగా అనిపించాడు. నవీన్ ఆండ్రూస్ ఐతే బాగుండేదేమో, కానీ అతను మరీ పెద్దవాడిలా కనిపించొచ్చు ఈ పాత్రకి. హౌరా బ్రిడ్జి, విక్టోరియా మెమోరియల్, తాజ్ మహల్ లాంటి భారతీయ దృశ్యాలు చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. వాటి వెంటనే మీరానాయర్ ట్రేడ్ మార్కు భారతీయ నగర దృశ్యాలు కళ్ళు బైర్లు కమ్మే గందరగోళంతో ప్రత్యక్షమౌతాయి - సలాం బాంబేలో ముంబాయి, మాన్సూన్ వెడింగ్ లో ఢిల్లీ, ఇప్పుడు కొలకత్తా.
నేపథ్య సంగీతం బాగుంది. యమన్, దేష్, శ్యాం కళ్యాణ్, బెంగాలీ జానపద సంగీతం బాగా ఉపయోగించారు. గంగూలీ కుటుంబం తాజ్ మహల్ని దర్శిస్తున్న ఘట్టంలో తమాషాగా హంసధ్వని వినిపిస్తుంది.
Comments
నిజమేనండీ - మీరానాయర్ సినిమాలు చూసినప్పుడల్లా నాకూ అదే అనుభూతి కలుగుతుంది. ఆవిడ ఉద్దేశ్యం బహుఃసా అదేనేమో. ఆరకంగా చూడడం వల్ల - కథని సాక్షీభూతంగా ఆకళించుకోడానికి వీలవుతుందేమో..
ఎవంటారు? :)
1. ఆవిడ మొట్టమొదట డాక్యుమెంటరీలు తీసేది. అదే స్టైలు ఆవిడ తీసే కథాచిత్రాల్లో కూడా బలంగా కనిపిస్తుంది.
2. పిల్లికీ బిచ్చానికీ ఒకటే మంత్రమని .. సలాం బాంబే కి నప్పిన సినీకరణ నేంసేక్ కి నప్పలేదు, నప్పదు కూడా.
నా స్నేహితుడొకడున్నాడు తెలుగులో మంచి కథలు రాస్తాడు (మీ బెంగుళూరులోనే ఉంటాడు). అతనిదీ ఇదే వాదం - రచయిత చెయ్యి అస్సలు కనబడకూడదు అని. పాత్రల ముందు ఒక కేమెరా పెట్టేసి న్యూస్ రిపొర్ట్ లాగా రికార్డ్ చేస్తానంటాడు. ఈ పద్ధతిలో రెండు మంచి కథలు రాశాడు కూడా (ఈమాటలో 2001 లో అనుకుంటా టైటానిక్ అని ఒక కథుంటుంది).
నేననేది - అన్ని కథలకీ ఇది నప్పదు అని.
You're welcome.
నేంసేక్ - రివ్యూ ఇచ్చినందుకు థాంక్స్
నేను సినిమా తీస్తున్నారుగా అని పుస్తకం కొని చదివాను ఓ ఏడు క్రితం.
పుస్తకం డిప్రెసింగా అనిపిచ్చి సినిమా చూడ సాహసం చేయలేదు. కాని ఎలా ఉండి ఉంటదా అని కుతూహలం ఉండిపోయింది. నాకెందుకో ABCD జీవితాలు కొద్దిగా sad గా అనిపిస్తూంటాయి ...