అమెరికా తెలుగు వారికి అక్షరాల విందు

చేతన గారి బొమ్మల బ్లాగు "నా కేమెరా" చూసిన వాళ్ళందరికీ అమెరికాలో వెలువడే తెలుగు మాస పత్రిక "తెలుగు నాడి" గురించి తెలిసే వుంటుంది.

ఈ పత్రికలో మిగతా శీర్షికల సంగతెలా వున్నా ఇంచుమించు ప్రతీ సంచికలోనూ ముచ్చటగా మూడు కథల్ని ప్రచురిస్తుంటారు.

ఒకటి అమెరికా తెలుగు కథ - అంటే అమెరికాలో నివసించే తెలుగు రచయిత రాసిన అమెరికా జీవితానికి సంబంధించిన కథ
రెండోది ఒక వర్తమాన తెలుగు కథ - అంటే దేశవాళీ పత్రికల్లో ఈ మధ్య కాలంలో ప్రచురితమైనది
మూడోది అలనాటి తెలుగు కథ - సంపాదకుల దృష్టిలో దీని నిర్వచనమేవిటో సరిగ్గా తెలీదు కానీ ఇప్పటిదాకా ఈ శీర్షికన కనిపించిన కథల్ని చూస్తే ఇరవై ముప్ఫై ఏళ్ళకి ముందు ప్రచురితమైన ప్రముఖ రచయిత కథగా దీన్ని చెప్పుకోవచ్చు.

కథా సంకలనాలు తెలుగులో చాలానే ఉన్నాయి, పాత తరపు కథల్ని కొంచెం శాంపిల్ చూడాలంటే. కానీ తెలుగు నాడి ప్రచురించే అలనాటి కథలు చాలా మట్టుకు సంకలనాల్లో దొరకవు. కనీసం అందుకోసమైనా ఈ పత్రిక చాలా విలువైనది. అఫ్ కోర్సు, మనం కట్టే చందాకి గిట్టుబాటునిచ్చే విషయాలు ఈ పత్రికలో ఇంకా చాలా ఉన్నై.

మార్చి నెల సంచిక పోయిన వారమే చేతికందినా మొన్ననే చదివాను.
నాకు గొప్ప సంతోషం కలిగించిన విషయం - నా అభిమాన కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి "వడ్ల గింజలు" నవలికని ఈ సంచిక నించీ ధారావాహికంగా ప్రచురిస్తున్నారు. ఒక గర్భ దరిద్రుడు (తంగిరాల శంకరప్ప) రాచరికం చుట్టూ ఘనీభవించిన ప్రాకారాల్ని ఛేదించుకుని పెద్దాపురం మహారాజు (మహారాజ నెలవోలు గండాంక పేషణి హనుమంత శ్రీవత్సవాయి తిమ్మగజపతి మహారాజులుంగారు) తో చదరంగం ఆడి గెలవటం ఇతివృత్తం.
ఆ భాష, ఆ సంభాషణా చాతుర్యం, ఆ పాత్రల మనస్తత్వాలు, హావభావాలు, ఆ కథ నడిపే నేర్పు, ఇక కథ చివర కొస మెరుపు - ఓహ్, ఒకటేమిటి .. మీరు చదివి అనుభవించాల్సిందే. తెలుగు భాష, తెలుగు కథ అంటే అభిమానమున్న ప్రతి ఒక్కరూ ఈ కథ చదివి తీర వలసిందని నా ఖచ్చితమైన అభిప్రాయం.
ఈ సంచికలో అలనాటి కథగా పురాణం సుబ్రహ్మణ్య శర్మ (చాలాకాలం ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకునిగా ప్రసిద్ధుడు, ఎందరో తెలుగు కథా రచయితల్ని పరిచయం చేసి పుణ్యం కట్టుకున్నవాడు) రచన "సీత జడ" ప్రచురించారు. పాత్ర చిత్రణలో, కథనంలో విచిత్రమైనది ఈ కథ.

ఈ పత్రిక మీకు ఏ షాపులోనూ దొరకదు.
పాత సంచికలు మిస్సయ్యామే అని దిగులు పడక్కర్లేదు - మీకు కావలసిన పాతసంచికల్ని కూడా డైరెక్టుగా ప్రచురణకర్తల దగ్గర్నించే కొనుక్కోవచ్చు.

మనలో మాట - సంపాదకులు నా స్నేహితులే గానీ పాపం ఆయనేం నన్నడగలేదు ఇలా టముకు వెయ్యమని. నేనే ఏదో ఇలా బహుజన హితాయ అన్నట్టు .. బ్లాగ్మిత్రులకి సేవగా ..
ఇంకెందుకు ఆలస్యం? వెంటనే చందాదారులు కండి.

Comments

spandana said…
కొత్తపాళీ గారూ,
నేను ఈ పత్రిక చందాదారునే అండి. మీరు చెప్పిన ఈ మూడు కథలూ తప్ప మిగిలిందంటా copy & paste వుంటోంది. ప్రతిదీ "జ్యోతి సౌజన్యం"తోనో, "ఇండియా టుడే" సౌజన్యంతోనో, "ఈనాడు", "వార్త" సౌజన్యాలతోనో అయివుంటున్నాయి. ఈ ఇంటర్నెట్ పుణ్యమా అని చాలా వాటిని ముందే చదివేస్తున్నాను. కొత్తగా చదవాల్సింది చాలా తక్కువ వుంటోంది. అయినా చందా పాతిక డాలర్లే కదా అని కొనసాగిస్తున్నాను.

--ప్రసాద్
http://blog.charasala.com
నా "ప్రకటన" ఇంకా చందాదారులు కాని వాళ్ళకోసమండీ ప్రసాదు గారు! :-)
మీరు చెప్పింది నిజమే - అందులో ఇంటర్నెట్ లో పత్రికల్ని తరచుగా చూస్తుండేవాళ్ళకి.
పత్రిక నమూనావే Readers' Digest నమూనా కదా ..
నా మట్టుకి నాకు కథలు, చివరి రెండు మూడు పేజీల్లో సినిమా వార్తలు గొప్ప సరదాగా ఉంటాయి. ప్రతీ సంచికలోనూ రావట్లేదేమో కానీ ఒక్కోసారి ఆచార్య వెల్చేరు నారాయణరావు గారు ఒక్కొక్క పాతపద్యాన్ని చక్కటి వ్యాఖ్యతో వివరించే శీర్షిక కూడా బాగా ఆస్వాదించాను.
Anonymous said…
Thanks. I signed up.