కుంతీసుత మధ్యముండు

ఇందాక తెలుగుబ్లాగుల గుంపులో తొంగిచూస్తే ఈ సంభాషణ కంట బడింది.
అందులో రానారె ఏదో సిద్ధాంతం చెప్పి చరసాలవారిని "ఔనంటారా" అని దబాయిస్తే ఆయన ముసిముసినవ్వు దాచుకుంటూ ఇచ్చిన గడుసు సమాధానం చూసి నవ్వొచ్చింది.
నిన్నరాత్రే పడుకునేముందు తోచక కాసేపు నర్తనశాల సినిమా చూశాను. నేను మళ్ళీ మళ్ళీ చూసే సినిమాల్లో ఇదొకటి. నా వుద్దేశంలో తెలుగు పౌరాణిక చిత్రాల్లో మాయాబజారు తరవాత బెస్టు సినిమా. రానారె-ప్రసాదు సంవాదం చదివితే అందులో ఒక డవిలాగు గుర్తొచ్చింది.

ఉత్తరకుమారుడు తన చెల్లెలు ఉత్తరకు అభిమన్యుడే తగిన వరుడని సిద్ధాంతీకరించి పక్కనే ఉన్న బృహన్నలతో "ఔనంటారా బృహన్నల గారూ?" అంటాడు. దానికి బృహన్నల గడుసు సమాధానం "మీరౌనన్నది నేను కాదంటానా? నేను కాదంటే మీరూరుకుంటారా? అందుకని ఔనే అంటాను!"

ఈ సినిమాలో మిగిలిన అంశాలన్నీ ఒక ఎత్తూ, పద్యాలు మాత్రం ఒక ఎత్తు. సందర్భోచితంగా పాత్రోచితంగా ఎక్కువ రాగాలు పెట్టి చావగొట్టకుండా క్లుప్తంగా భావపూరితంగా వాడారు పద్యాల్ని. అంతే కాదు, ఆయా సన్నివేశాల్ని చాలా చక్కగా పండించారు పద్యాల వాడుకతో. ఆ పద్యం అక్కడ లేని ఆ సన్నివేశాన్ని ఊహించలేం.
పద్యాలు ఇంత ప్రాముఖ్యత సంతరించుకోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి నాకు. ఒకటి, ఈ సినిమాలో వాడిన పద్యాలు ఇంచుమించు అన్నీ తిక్కనగారి మహాభారతం లోనివి. రెండు, ఆ పద్యాలన్నీ భారతకథలో ఆయా సన్నివేశాల్లో ఆయా పాత్రలు పలికిన సంభాషణలు. తన మారు వేషం తీసేసి, గాండీవం ధరించి దేవదత్తాన్ని పూరిస్తూ అర్జునుడు యుద్ధభూమిని సమీపిస్తుంటే ఇంకా మనిషి ఆనవాలు తెలియటంలేదు, శంఖారావం వినిపిస్తోంది, రథం లేపుతున్న దుమ్ము కనిపిస్తోంది.ఈ సందర్భంలో ద్రోణుడు అంటాడు.

సింగంబాకటితో గుహాంతరమున్ జేడ్పాటుమై నుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్
ఆకలి గొన్న సింహం గుహలోపల పొంచివుండి లేళ్ళ గుంపు కనపడగానే వాటి పై విరిచుకుపడ్డట్టు వనవాసంలో చిక్కిన అర్జునుడు యుద్ధాన్ని అభిలషిస్తూ నా సేనమీద దండెత్తి వస్తున్నాడహో! అని అర్థం.

మ స జ స త త గ అనే గణాలతో ఏర్పడ్డ ఈ ఛందస్సుని శార్దూలం అంటారు. అంటే పులి. అర్జునుడి సమరోత్సాహానికి సింహపు ఉద్రేకంతో ఉపమానాన్ని "పులి" ఛందస్సులో చెప్పటం అదొక చమత్కారం. అదలా ఉండగా లేళ్ళ గుంపుని చూసి ఉరికే సింహపు శౌర్యాన్ని (రెండో పాదం అంతా) "స్ఫూ, ధ, ఉద్యత్ క్రోధ" లాంటి కొరడా ఝళిపింపు చప్పుళ్ళతో ఒకే సంస్కృత సమాసంలో గుక్క తిప్పుకోకుండా చెప్పడం ఇంకో చమత్కారం.

చాన్నాళ్ళ కిందట ఫిలడెల్ఫియా నగరశివార్లలో ఒక సాయంత్రం కొందరు తెలుగుమిత్రులతో ముచ్చటిస్తూ నేను ఈ పద్యం చెప్పి, "పాపం తిక్కన గారు ఇక్కడ పప్పులో కాలేశారు. అర్జునుడు పాండవ మధ్యముడే కానీ కుంతీ సుతుల్లో చివరి వాడు." అని వ్యాఖ్యానించాను.

వెంటనే అక్కడున్న ఒక పెద్దాయన ఇలా అన్నారు. "పప్పులో కాలేసింది తిక్కనగారు కాదు, ద్రోణుడు. తిక్కనగారు ఆ పద్యాన్ని చాలా సందర్భోచితంగా, పాత్రోచితంగా రాశారు. ఆ పద్యంలో గొంతు వినండి, అందులో ఆనందం వినండి. అసలు బతికున్నాడో లేడో తెలియని ప్రియశిష్యుడు ఇలా హఠాత్తుగా కళ్ళముందు ప్రత్యక్షమయ్యేప్పటికి ఆ పరవశంలో ద్రోణుడు లెక్క తప్పినట్టు చూపించారు తిక్కన గారు. ఎంత సందర్భోచితమే చూడండి."
ఇదంతా చెప్పి ఒక క్షణం ఆగి "ఔనంటారా?" అనడిగారాయన.

ఔననక చస్తానా!

Comments

swathi said…
నిజమే కదా!!కానీ కుంతీ దేవి అందరిని సమాన పుత్ర ప్రేమ తో చూసినట్టు మనకనిపిస్తుంది భారతం లో యే ఘట్టమ చూసినా. ఆ రకంగానూ ఇది నిజమే.
spandana said…
కొత్తపాళీ గారూ,
అయితే మా సంవాదం మీకు ఇన్ని సంవాదాల్ని గుర్తుకు తెచ్చాయన్నమాట! పంచుకున్నందుకు ధన్యవాదములు.

--ప్రసాద్
http://blog.charasala.com
Sriram said…
మంచి పద్యం గురించి తెలియచేసారు. ధన్యవాదాలు. ఈ పద్యానికి ప్రతిపదార్ధం కావాలండీ...మాతంగం అంటే ఏనుగు అని స్ఫూర్జితము అంటే ఘీంకారమని గుర్తు. లేళ్ళు అనే అర్ధంలో ఏ పదం వాడబడింది?
అన్నట్టు కౌంతేయుడు అన్నపదం కూడా అర్జునుడికే ఎక్కువగా స్థిరపడిపోయింది.
కర్టిసీ: శ్రీకృష్ణ భగవానుడు :)
@ స్వాతిగారు - అవును. అలాగే పార్థుడు అనే పేరు కూడా అర్జునునికే పరిమితమైంది.
@ ప్రసాద్ - "ఔనంటారా?" "ఏమంటారు?" అన్న ప్రశ్నలు చూసినప్పుడల్లా నాకీ నర్తనశాల డవిలాగు చచ్చినట్టు గుర్తొస్తుంది :-)
@ శ్రీరాం - రాస్తున్నది మనకి పూర్తిగా తెలుసో లేదో చూసుకోకుండా రాస్తే ఇలాంటి చిక్కులే వస్తాయి :-) నువ్వు చెప్పిందే కరక్టు. మాతంగమంటే ఏనుగు, స్ఫూర్జితమంటే ఉరుము (ఘీంకారం). సింహం చూసింది లేళ్ళ గుంపు కాదు, ఏనుగుల గుంపునే. ప్రతిపదార్థం కావాలంటే తితిదే వారు ప్రచురిస్తున్న సంపుటాలు వచ్చేదాకా ఆగాల్సిందే.
పరమానందం. ఈ టపా రాసిన కొత్తపాళీ గారికి ధన్యవాదాలు. నాకీ సినిమాలో "ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రాగ పురవీధుల ... జ్యాతమిచ్చట నాడంగ రాదు సుమ్ము" అని ఎద్దేవాచేసే పద్యం, ఘంటసాలగారి కంఠం "అతిమనోహరలైన చతురాంగనలగూడి ..." అన్నప్పుడు మనోహరంగానూ, "... వేడ్కలు సలుపగలరే" అన్నప్పుడు అందులోని వెటకారపు స్వరమూనూ, ఇంకా నాలాంటి పామరుని మంత్రించి పడేసే ఎన్నెన్నో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ సినిమా చాలాకాలంపాటు ఆఫర్లులేని ఉద్దండుడైన సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి గారికి ఒక తీయని పునరాగమన విజయం కూడానని ఒక సారి రేడియోలో విన్నాను.
కొత్తపాళీ గారు...నాకిష్టమైన సినిమాను గుర్తు చేశారు. ముఖ్యంగా అర్జునుడు గాండీవం ఒక చేతబట్టి, మరొక చేత్తో మహాసముద్రంలా ఉన్న లక్షల కౌరవ సైన్యం గుండెలదిరేలా దేవదత్తము పూరిస్తూ ఐదు అశ్వములు గల రథములో వస్తూంటే.....చూడటానికి అద్భుతంగా ఉంటుంది సన్నివేశం. అది చూడాల్సిందే కానీ మాటలో వర్ణించడానికి కుదరదు.

ఇక్కడ నర్తనశాల తెవికీ లింకు ఇస్తున్నాను...కొత్తపాళీ గారు/రానారె మీకు తెలిసిన విషయాలన్నీ ఇందులో పొందుపరచాల్సిందిగా కోరుతున్నాను
http://te.wikipedia.org/wiki/నర్తనశాల
Giri said…
నాకు కూడా "ఏనుంగు నెక్కి.." పద్యం మహబాగా నచ్చుతుంది, అసలు చివరి ఘట్టంలో ఉన్న పద్యాలన్నీ గెప్పవే..ఉదా. "ప్రేలితి వెన్నొమార్లు కురువృధ్ధుల ముందర.." ఆహా!
Anonymous said…
telugu vikeepedia variki namassulu .Narthanasala vanti mahonnathamina cinima gurunchi sodarulu sodarimanula samvadam bagundi. Andulone Rama rao garu Savitri garu Sobhanbabu gurinchi sodhistu " Andam ammade kani budhulu tmarive " annapudu ramarao gari natana chudavalacinade. Satyam polurisatyam@yahoo.com vinukonda