నందకాంశ సంభూతుడు, పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు అవతారం చాలించి తన ఇష్టదైవంలో లీనమైన పుణ్య దినం.
తన పదాలతో షోడశకళానిధికి షోడశోపచారములూ జరిపించి, ఆ వైభవమూర్తిని వేనోళ్ళ కొనియాడి, అంగజ జనకుని దివ్య శృంగార తారకల్ని వెలయించి, సంసారజలధిలో పడి దిక్కుతోచక కొట్టుకుంటున్న జీవాళికి మోక్షమార్గము చూపిన మహనీయుడు చిరస్మరణీయుడు.
సుమారు ముప్ఫై రెండు వేల సంకీర్తనలు (ఆయన 90 ఏళ్ళు బతికాడనుకుంటే, బతికున్న ప్రతిరోజూ ఒక కొత్త పాట రాసినట్టు!) మనకిచ్చి
చివరికి -
వేనామాల వెన్నుడా, నిన్ను వినుతించ నెంత వాడ?
కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివీవే, అయ్యా!
అని ఆ పుణ్యం కాస్తా స్వామికే ఇచ్చేశాడు.
అవును నిజమే, ఆ స్వామే తనవాడైనప్పుడు ఇంక ఈ పుణ్యమెందుకు, భుజాల మీద బరువుగాక!
సుపుత్రుడు పెదతిరుమలాచార్యుడు తండ్రి తిథినాడు ఆ మహాత్ముని ఆహ్వానిస్తున్నాడు విందారగించమని.
రాళ్ళని కరగించే శ్రీరాగంలో స్వరపరిచిన ఈ కీర్తననీ, ఈ పుణ్యతిథినీ గుర్తు చేసినందుకు శ్రీ డివిఎన్ శ్రావణ కుమార్ గారికి శతకోటి వందనాలు.
Comments
మీరు మాకు సీనియర్ (ఆర్.ఈ.సీ లో) అని హర్ష ద్వారా తెలిసింది. మీ "విన్నవికన్నవి" బ్లాగు చదివి చాలా ఆనందించాను. మీలాంటి గొప్పవాళ్ళ స్ఫూర్తి తో ఇంకా ఎక్కువ అన్నమయ్య కీర్తనలు బ్లాగ్ చేయగలనని ఆశిస్తున్నాను.
-శ్రవణ్
మీ టపాలకి వ్యాఖ్యలు రాయక పోయినా తప్పక చూస్తుంటాను.