ఆరాధ్య దేవతకి అక్షర నీరాజనం

ఈ సినీతారల అభిమానులుంటారే - ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క నిర్మాణాత్మకమైన పని చేసినట్టు కనపడిందా మీకు?
ఆయనేం ధనవంతుడు కాదు, ఆయన వెనక పెద్ద బలగమూ లేదు. కానీ ఒక మంచి పని తలపెడితే వనరులు అవే కూడుకున్నై. ఒక వీరాభిమాని తన ఆరాధ్య సినీదేవతకి చివరిసారి అక్షర నీరాజనం పట్టాడు. తద్వారా తెలుగు సినిమాభిమానులందరికీ ఒక మధుర జ్ఞాపికని అందించాడు. 2005 డిశంబరులో తనువు చాలించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డా. పాలువాయి భానుమతికి అభిమాని భమిడిపాటి రామగోపాలం (భరాగో) పట్టిన ముత్యాల హారతి ఈ స్మృతి సంచిక - మహామహిళ.

వారపత్రికల సైజులో 195 పుటలతో బాపూ గీసిన వర్ణముఖచిత్రం (భానుమతిని సంగీత సాహిత్య సరస్వతిగా రూపిస్తూ) ముఖచిత్రంగా. లోపల కొందరు ప్రముఖులు (శివాజీ గణేశన్, తనికెళ్ళ భరణి, డి.వి. నరసరాజు), ఎందరో అప్రముఖులు, కొందరు భానుమతి కుటుంబాన్ని సన్నిహితంగా ఎరిగిన వారు, మరి కొందరు వృత్తిరీత్యా మాత్రమే ఎరిగిన వారు పంచుకున్న జ్ఞాపకాలు, అనుభవాలు. ఆవిడకున్న అఖండమైన ఆత్మవిశ్వాసం, ఈ వ్యాసాలు రాసిన వ్యక్తుల్ని ఏదో ఒక సందర్భంలో ఆదరించిన ఆవిడ ఔదార్యం, ఆవిడ గొప్ప గాత్రం - ఇంతకంటే ఈ వ్యాసాల్లో భానుమతిని గురించి వ్యక్తిపరంగా గానీ వృత్తిపరంగా గానీ మనకి కొత్తగా తెలిసేదేం లేదు.

ఈ పుస్తకాని కంతకీ హైలైటు ఫొటోలు. ఎక్కెడెక్కడి ఫొటోలూ - భానుమతి మొట్టమొదటి సినిమాల నుంచీ 90లలో చేసిన సినిమాల వరకూ సినిమాల స్టిల్స్, పాత సినిమాల పోస్టర్లు, భానుమతీరామకృష్ణల కుటుంబ చిత్రాలు, ఎవార్డులూ బిరుదులూ అందుకుంటూ, ప్రముఖులతో ఫొటోలు - ఈ ఫొటోలే తెలుగు సినిమాభిమానులకి ఈ పుస్తకాన్ని చాలా విలువైనదిగా చేస్తున్నాయి.
ఫోటోలన్నీ వేటికవే గొప్పగా ఉన్నై.
అందులోనూ నామట్టుకి నాకు స్పెషల్ గా అనిపించినవి -
రాజ్ కపూర్ చెన్నై వచ్చిన సందర్భంలో దిగిన గ్రూప్ ఫొటో (ఎన్టీ ఆర్, ఏఎన్నార్, అంజలి, జి. వరలక్ష్మి కూడా ఉన్నారు)
1947 ఆగస్టు 15 న ఆలిండీయా రేడియో కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖుల గ్రూప్ ఫొటో (అప్పటి మహామహులు చాలా మంది ఉన్నారిందులో)
వ్యాసాల్లో - భానుమతికి సంగీత గురువైన దొడ్డవరం చంద్రశేఖరం గారి గురించి ఒంగోలు వాస్తవ్యులు శింగంశెట్టి శివరామకృష్ణ గారు రాసిన "నేపథ్యం"
భరణీ పిక్చర్స్ వారి ఆస్థాన రచయిత రావూరి సత్యనారాయణరావు గారి కుమార్తె టి. జ్ఞానప్రసూన గుర్తు చేసుకున్న వ్యక్తిగత మధురానుభవాలు
భానుమతి పాటల్లో కర్ణాటక సంగీత విశేషాలను గురించి విదుషీమణి వింజమూరి లక్ష్మి గారి జ్ఞాపకాలుఈ మూడూ చెప్పుకో దగ్గవి అనిపించాయి.
అన్నట్టు తెలుగులో ఆవిడ పాడిన పాటలన్నిటి సాహిత్యమూ, అన్ని భాషల్లో ఆవిడ నటించిన సినిమాల లిస్టూ కూడా ఉన్నాయి ఈ పుస్తకంలో.
దీన్ని స్మృతి సంచిక అన్నారు. ఈ పుస్తకమొచ్చి భానుమతి స్మృతిని కొత్తగా నిలబెట్టేదేం లేదు - ఆ పని ఆవిడకున్న అసాధారణ ప్రతిభ, వ్యక్తిత్వమే చేస్తాయి ఎలాగూ. ఎటొచ్చీ భరాగో తన భక్తికి ఒక నిర్దిష్ట రూపమిచ్చుకున్నాడు ఈ పుస్తకంతో. పనిలో పనిగా మనలాంటి వాళ్ళకి ఈ మహామహిళతో ఒక మంచి ఫొటో ఆల్బం ఇచ్చాడు మళ్ళీ మళ్ళీ చూసుకుని ఆనందించేందుకు.

ప్రచురణ కర్తలు: జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు, విశాఖ (891-2535550)
వెల: రూ 160
దొరకు చోట్లు: నవోదయ బుక్ హౌస్, కాచిగూడ (40-24652387)
నవోదయ పబ్లిషర్స్, విజయవాడ (866-2573500)
అజొవిభొకం ఫౌండేషన్ ఇంటర్నెట్ బుక్ షాపు

Comments

రాధిక said…
నాకు చిన్నప్పుడు భానుమతి గారంటే పెద్ద ఇష్టం వుండేది కాదు.కానీ తరువాత ఒకసారి ఎవరో చెప్పారు ఆమె దర్సకురాలు,నిర్మాత,నటి,గాయని,రచయిత....ఇలా నిజ జీవితం లో ఎన్నో పాత్రలు పోషించేవారని.అప్పుడే నేను భానుమతి గారి అత్తగారి కధలు చదవడం జరిగింది.అందులోని గిలిగింతలు పెట్టే హాస్యం చూసి ఆశ్చర్యపోయాను భానుమతిగారేనా ఇంత సరదాగా రాసింది అని.అలా మొదట నేను భానుమతిగారనే రచయితకి అభిమానిని.తరువాత గాయనికి,నటికి,దర్సకురాలికి అభిమానిని.ముఖ్యం గా ఆవిడ రాజసం,ఆత్మవిశ్వాసం నిండిన మాటలు భలె నచ్చుతాయి.
ఈ సినీతారల అభిమానులుంటారే - ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క నిర్మాణాత్మకమైన పని చేసినట్టు కనపడిందా మీకు?
చిరంజీవి గారి అభిమానులు ఇందులో నాకెంతగానో నచ్చుతారు. నేను చిరంజీవి ఫాన్ ని అని కాదు కానీ, వారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. రక్త దానం, నేత్ర దానం మొదలయినవి. ఇప్పుడు ఎయిడ్స్ మీద పోరాటం కూడా.

ఇక పోతే భానుమతి గారు నాకు ఒక అహంకారి గా, పొగరు గల వారిగా అనిపించేవారు. అది సరి కూడా అయి ఉండవచ్చు. కానీ ఆవిడ కున్న multi talented personality అది మరుగున పడేలా చేసాయి తరవాత.
spandana said…
భానుమతి గారు నాకు ఒక అహంకారి గా, పొగరు గల వారిగా అనిపిస్తారు. ఆమె చూపించే దర్జా, దొరసాని తనం అంటే నాకెక్కడలేని చిరాకు. ఓసారి ఆమెకేదో అవార్డు ఇవ్వబోతే నా అంతటిదానికిదా అవార్డు అన్నట్లు గుర్తు. అప్పటినుంచీ ఆమెంటే నాకు మరింత విముఖత.
--ప్రసాద్
http://blog.charasala.com
భానుమతి గారు నాకు ఒక అహంకారి గా, పొగరు గల వారిగా ...
భానుమతి గర్వాన్ని గురించి ఇద్దరు వ్యాఖ్యాతలు సరిగ్గా ఒకే పదజాలం ఉపయోగించడం తమాషాగా ఉంది. మీ ఇద్దరికీ ఒక ప్రశ్న. ఎన్టీఆర్ మాట తీరు మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన అహంభావి అంటారా? నటన, సినీ నిర్మాణం, దర్శకత్వం సమాన అర్హతలు కాగా, కథా రచన, సంగీత దర్శకత్వం, గాత్రం - ఈ మూడూ ఎన్టీఆర్ కి లేని భానుమతికి ఉన్న ప్రత్యేకార్హతలు. ఆ అర్హతలు కూడా ఊరికే ఏదో చేసింది అన్నట్టుగా కాదు, ఆయా రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు మంచి అభిరుచి ఉన్న పెద్దవాళ్ళే 'ఓహో' అనేట్టుగా నిర్వహించింది.
ఇవన్నీ తీసి పక్కన పెట్టండి.
సినీరంగంలో ఏదో ఒక పనిలో అన్నివిధాలా successful అయిన స్త్రీని ఒక్కరిని చూపెట్టండి. గాయనీ మణుల్లో పి.సుశీల, ఎస్.జానకి కొంతవరకూ ఈ స్థితిని సాధించారు. కానీ ఘంటసాలనీ సాలూరినీ గుర్తు చేసుకున్నట్టు ఎవరన్నా వీళ్ళని గుర్తు చేసుకుంటారా?
నటనలో విజయాలు సాధించిన వారందరూ తమ వ్యక్తిగత జీవితాల్లో ఘోరాపజయాలు పొందారు.
మొత్తమ్మీద తెలుగు సినీరంగం స్త్రీలని చెరుగ్గడల్లా నవిలేసి పిప్పి బయటకి ఊసింది.
వినయం మంచిదే. ఆత్మవిశ్వాసం అంతకంటే గొప్పది.
Sriram said…
తెలుగు సినిమా పరిశ్రమలో కధానాయకులకి అతిగా ప్రాధాన్యతనిచ్చి వారిని వారు "మేము" అని సంబోధించుకున్నా నెత్తిమీద పెట్టుకున్న ప్రజలకి భానుమతి గారి "పొగరు" నచ్చకపోవడం విచిత్రమే. అన్నట్టు, నేను మాట్లాడేది ఇక్కడ వ్యాఖ్యలు రాసిన మిత్రులగురించి కాదు. వారు కధానాయకులని సమర్ధించ లేదు కదా. నాకు తెలిసిన ప్రజాభిప్రాయం గురించి మాత్రమే నేను చెప్పేది.

కొత్తపాళీ వారూ...నేను ఈమధ్యనే మల్లీస్వరి సినిమాలో ఉన్న ఎందుకే నీకింత తొదర అన్న పాట విన్నాను. ఆహా! ఖమాసు రాగంలో ఇంత అందంగా పాడిన సినిమా పాట మరొకటి నేను వినలేదు (బ్రోచేవారెవరురా సినిమా పాట కాదుకదా). అద్భుతం. ఇన్నాళ్ళూ ఎలా మిస్ అయ్యానా అనుకున్నాను.

enjoy :)

http://www.musicindiaonline.com/p/x/DU2_i3vPSd.As1NMvHdW/
ముళ్లపూడి వెంకటరమణ సాహితీసర్వస్వం అనే పుస్తక సంచయంలోని "సినీరమణీయం"లో చిన్నప్పటినుండే భానుమతిగారికి గల బలమైన వ్యక్తిత్వం, స్వంత ఆలోచనలు చదివి చాలా ఆశ్చర్యపోయాను. ఆ కాలానికి ఆమె ఒక కొరకరానికొయ్య. అహంభావి అని ముద్రపడటం అతిసహజమే.
నేనేదో MCP ని కాదండీ... నాకు మాత్రం ఒక మనిషిలో నచ్చేది humbleness. ఆత్మవిశ్వాసం మంచిదే కానీ అది హద్దు దాటితే అది వేరే వారికి ఇబ్బంది కలిగించేలా ఉంటుంది. భానుమతి గారి గురించి ఎన్నో కథలు విన్నాను. అవి మీకు ఆత్మవిశ్వాసం గాను, నాకు పొగరు గానూ అనిపించచ్చు. ఆవిడ multi talented personality అంటే నాకెంతో గౌరవం. అలాగని మనిషిగా కూడా ఆమెని అలాగే చూడాలని లేదుగా ?
ఇక్కడ ఆడా, మగా అన్న తేడా నాకు లేదండీ. ఇలా మగవాడున్నా నా భావాలు అలాగే ఉంటాయి.