1998 లోనో 99లోనో - సరిగ్గా గుర్తులేదు - ఒక స్నేహితురాలి ప్రోద్బలంతో ఒక గురువారం సాయంత్రం ఏన్ ఆర్బర్ లో ఒక యోగా తరగతికి వెళ్ళాను. ఆ తరగతిని నడుపుతున్నది ఒక తెల్లావిడ. బార్బరా లిండర్మన్. మొదటగా చూడగానే గౌరవభావం కలిగించే రూపం. తెలుపూ నలుపూ సమపాళ్ళలో కలగలిసి రింగులు తిరిగి పొట్టిగా కత్తిరించుకున్న జుట్టు. పెద్ద ఫ్రేమున్న కళ్ళద్దాలు. ఎంతో దయతో స్నేహపూర్వకంగా చూసే కళ్ళు. చక్కని చిరునవ్వు. మృదువైన గొంతు. పొడుగ్గా సన్నగా రివటలాంటి శరీరం. మొదటిసారి వస్తున్నారా, మీరు ఇండియా నించి అల్లే వుందే, చాలా సంతోషం. మీరిది ఆనందిస్తారని ఆశిస్తాను అంటూ ఆహ్వానించారు. మాకు చోటు చూపించారు. చూస్తుండగానే ఆ హాలు కొంచెం చోటు కూడా మిగలకుండా నిండిపోయింది. నాకు తరవాత తెలిసింది, ఆ గురువారపు తరగతి ఆ ఊరి మొత్తానికీ చాలా పాప్యులర్ అని. ఆ మొదటి తరగతి అనుభవం ఎలా జరిగిందో నాకిప్పుడు గుర్తు లేదు. కానీ ప్రతి గురువారం నేనా తరగతికి హాజరవటం మొదలు పెట్టాను. నెమ్మది మీద ఆమె నడిపే బుధ శుక్ర వారాల ఉదయపు తరగతులకి కూడా వెళ్ళటం సాగించాను. ఇది నేను 2002 లో ఆ నగరం వదిలిపెట్టే వరకూ సాగింది.
బార్బ్ గురువారపు తరగతి చాలా చిత్రమైనది. దాని పేరు Poses to Sacred Music. సుమారు గంటన్నర క్లాసు ఐదారు విభాగాలుగా సాగేది. ప్రతి విభాగానికీ ఒక పాటో, కొన్ని పాటల వరుసో నేపధ్య సంగీతం. అన్నిటికంటే తమాషా ఏవిటంటే మూణ్ణెల్లకోసారి ఈ sacred music మారిపోయేది. ఒక మూణ్ణెల్లు హిందూ భజనలు. ఒక మూణ్ణెల్లు కిరస్తానీ భజనలు. మూడో క్వార్టరులో ముస్లిము భజనలు (ఔను ఉన్నాయి, వింటానికి చాలా బావుంటాయి కూడా). చివరు మూణ్ణెల్లూ, వివిధ మతాల భజనలు (టిబెటను బౌద్ధము, నేటివ్ అమెరికనుల ప్రార్థనలు, ఆఫ్రికను ప్రార్థనలు, ఇలా). మారిన సంగీతానికి తగ్గట్టు విన్యాసంలో కొద్దిగా మార్పులు చేసేవారుగాని, మొత్తమ్మీద ప్రోగ్రాము ఒకలాగానే ఉండేది సంవత్సరం పొడుగునా. చివరి ఐదు నిమిషాలు శవాసనం. మా శరీరాల్ని మనసుల్ని విశ్రమింప చెయ్యటానికి తన మెత్తటి గొంతుతో సూచనలు చెపుతూ మమ్మల్ని ఆ అంతర్లోకంలోకి చేరవేసేవారామె. మళ్ళీ అంతే మృదువుగా మాట్లాడుతూ ఆ యోగనిద్రలోంచి మేలుకొలిపి ఆ వారంలో తనకి తోచిన ఒక మంచి ఆలోచనో, లేక ఎక్కడన్నా చదివిన/విన్న కొటేషనో, మనసుకి ఉత్తేజం కలిగించే మాటలు చెప్పేవారు.
ఆమె ఏ ఒక్క మతాన్ని గుడ్డిగా నమ్మి అనుసరించినట్టు కనపడదు. ఆమెని బౌద్ధ గురువుల ఉపన్యాసాలు, ధ్యాన కేంద్రాల్లో చూశాను, హిందూ కీర్తన సభల్లో చూశాను, క్రిస్మసు టైములో యూనిటేరియన్ యూనివర్సలిస్టు చర్చి కార్యక్రమాల్లో చూశాను. యోగము, దయ, మానవత్వమూ ఆమె నమ్మి ఆచరించిన ముఖ్యసూత్రాలు.
బార్బ్ తరగతిలో యోగవిన్యాసాలు ఒక అనుభవమైతే, ఆమెతో పరిచయం, సాహచర్యం, ఆమె దయని ప్రత్యక్షంగా చూస్తూ దాని ఫలితాలు అనుభవిస్తూ ఉండడం, ఆమె ద్వారా పరిచయమైన ఇతర అద్భుతమైన వ్యక్తులు, ఆమె ప్రోద్బలంతో మేము హాజరై ఎంతో ఆనందించిన అనేక కార్యక్రమాలు .. అవ్యాజంగా ఆమెకి మా మీద కలిగిన వాత్సల్యం - మాటల్లో వర్ణించలేను.
బార్బరా లిండర్మన్ ఫిబ్రవరి 24న స్వర్గస్తులైనారని ఇవ్వాళ్ళే తెలిసింది. 72 ఏళ్ళు. అమెరికాలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్న స్త్రీ పోవలసిన వయసు కాదు. ఒకటనిపిస్తుంది - అల్లకల్లోలమవుతున్న ఈ ప్రపంచానికి ఒక దిక్కూ తెన్నూ చూపించడానికి ఆ పైవాడికి ఇలాంటి సమర్ధులైన స్త్రీల అవసరం అర్జంటు అనిపించి పిలిపించుకున్నాడేమో నని.
Comments
కొత్తపాళి గారు: మీ గురుభక్తి కి జోహారు.
మత మౌడ్యాన్ని యోగా ఎలా పెంచుతుందో కాస్తా వివరించండి సార్!
--ప్రసాద్
http://blog.charasala.com
I request the visitors to refrain from irrelevant diatribes, at least on this particular post.
Thank you.