రమ్యమైన విరామం

మొన్న చదువరి గారి తప్పటడుగులు టపా చదివి పగలబడి నవ్వుకున్నాక, వారు ఉదహరించిన "సడిసేయకో గాలి" పాట గురించి ఆలోచిస్తుండగా రేగిన ఆలోచనలివి. అంతకు ముందొక సారి ఆయన ఆ పాట ఆడియో వేశారు తన టపాలో, సాహిత్యాన్ని జతపరిచి. వారు ప్రచురించిన సాహిత్యంలో దొర్లిన ఒక చిన్న తప్పు సవరించాను ఆ పూట.
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
ఆయనెందుకో అది "పీడ మబ్బుల" అనుకున్నారు. పీడ అనే మాటకున్న పీడార్థాన్ని కాసేపు పక్కన పెట్టండి. అసలు మాటల అర్థంతో పని లేకుండానే ఆ వరుసలో మొదటి మాట పీడ కాదని చెప్పొచ్చు - ఎలా?
ఆ చరణం మొత్తం ఒకసారి పరికిద్దాం -
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
-- మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన పూని విసిరి పోరాదే సడిసేయకే

బుర్రపండులో చిరువిత్తనంలాంటి యుక్తేవన్నా తట్టిందా?ఊహూ??
సరే.
వరుస మొదణ్ణించీ ప్రతి అడుగూ (వీటిల్నే మాత్రలంటారు) లెక్కపెట్టి వేసుకోండి.
పం (2) + డు (1) = 3 మాత్రలు
వెన్ (2) +నె (1) + ల (1) = 4 మాత్రలు
న (1) +డి (1) + గి (1) = 3 మాత్రలు
అంటే 3+4+3 మొత్తం పది మాత్రలు. తరవాత వచ్చే పదకొండో మాత్ర "పా", అవునా?
అలాగే మూడో వరుస చూడండి
విరుల = 3
వీవెన = 4
పూని = 3
మళ్ళీ 3+4+3 మొత్తం పది మాత్రలు. తరవాత వచ్చే మాత్ర "వి".
ఇప్పుడు ఈ అక్షరాల్ని "బోల్డు" చేసి చూపెడతాను.
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
-- మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన పూని విసిరి పోరాదే సడిసేయకే
ఇప్పుడు కనిపిస్తోందా ఒక క్రమం?
పది మాత్రల తరవాత పదకొండో స్థానంలో మళ్ళీ మొదటి అక్షరమే వొస్తోందన్న మాట.
ఇక రెండో వరసలో చదువరి గారు అనుకున్నట్టు
"పీడ మబ్బుల దాగు నిదుర తేరాదే" - అనుకుంటే
పీడ = 3
మబ్బుల = 4
దాగు = 3
మళ్ళీ 3+4+3! పదకొండో స్థానంలో "పీ" రావాలి!!
అంటే ఇక్కడ మొదటి అక్షరమన్నా తప్పు కావాలి, పదకొండోదన్నా తప్పు కావాలి.
మాట వరసకి పదకొండోదే తప్పనుకుందాం.
నిదుర లో "ని" ని పీకేసి, "పి" ని స్థాపిద్దాం.
"పీడ మబ్బుల దాగు పిదుర తేరాదే" - ఇప్పుడసలు ఉన్నది కూడా చెడింది.
దేవులపల్లి వారు ఎంత మనకి అర్థం కాకుండా రాసినా, మరీ ఇలా అర్థమే లేకుండా రాయరు గదా?
అందుకని అక్కడ "నిదుర" సరైన మాటేనన్న మాట. మొదటి మాటనే "ని"తో మొదలయ్యేట్టు వెతుక్కోవాలి మనం.
అంటే --> నీడ! voila!!
దీన్నే ఛందస్సులో యతి అంటారు. అంటే సంస్కృతంలో చిన్న విరామ స్థానం అట. దీని విశ్వరూపాన్ని గురించి మరో టపాలో మాట్లాడుకుందాం.
ఈ పాటలో ఈ రమ్యమైన విరామంతో ఎంత అందమొచ్చిందో గమనించండి!
మీ కోసం పూర్తి పాట ఇదుగో.
డి సేయకో గాలి.. డి సేయబోకే
డలి, ఒడిలో రాజు వ్వళించేనే! సడిసేయకే..
త్నపీఠికలేని రారాజు నా స్వామి
ణి కిరీటము లేని హరాజు గాకేమి
చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే.. సడిసేయకే!
టి గలగలలకే గసి లేచేనే
కు కదలికలకే దరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే.. సడిసేయకే
పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే
నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన పూని విసిరి పోరాదే .. సడిసేయకో గాలి

Comments

Naga said…
ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం విని వుంటాను. అప్పుడప్పుడు పాడుకుంటూ ఉంటాను. పాటను ఇచ్చి నాకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు.
Sriram said…
sinimaa paaTallO kUDaa yatulu praasalu paaTiMcEvaaru aarOjullO...
eerOjullO koMtamamdi raasEvaallaki avi EmTO, vaaTi valla vaccE aMdamEmiTo kUDaa teleedu.

cakkagaa ceppaaru chamdassu guriMci...
రాధిక said…
naaku kuuDaa ardamayyealaa vivarimcaaru.
పాటలో ఛందస్సును చక్కగా వివరించారు. వినడం వరకైతే ఇది నాకు బాగా నచ్చిన (most favourite) పాట.
భలే బాగా వివరించారు, ఛందస్సును.
చేసిన తప్పేంటో తెలిసిన తరువాత, సిగ్గేస్తుంది.., నేనింత తప్పు చేసానా అని. అయితే ఒకటి.. మీ ఈ జాబుకు మూలం ఆ తప్పే కాబట్టి నా తప్పుకు కాస్త గౌరవం కలిగింది. :-)
చదువరిగారి టపా, మీ సవరింపు తర్వాత ఆ పాటని చాలా సార్లు విన్నాను. లీల గారి ఉచ్చారణ పీడ కి దగ్గరగా ఉన్నట్లనిపీంచింది. మంచి పాటని వివరణాత్మకంగా అందించారు- కృతజ్ఞ్నతలు.
మంజుల said…
నిజమే సుమండీ.
యతివల్లే కాబోలు ఆ పాట కి అంత లాలిత్యం.
ఇలా మాకు చెప్తూ ఉండండి.
వ్యాఖ్యాతలందరికీ ధన్యవాదాలు.
చదువరి గారూ, నా భావం సరిగ్గా అర్థం చేసుకున్నారు.
స్వాతి గారూ, మీ కామెంటుని కొంచెం సవరిస్తాను. రాసింది గొప్ప భావుకత, గొప్ప సామర్ధ్యం ఉన్న కవి కాబట్టి, యతిని సందర్భోచితంగా సరసంగా వాడారు - అంచేత ఇక్కడ యతి శోభించింది.
ఇలాంటి యతులు మనకి సామెతల్లో కనిపిస్తాయి
నవు గాని చోట ధికుల మనరాదు
త్త సొమ్ము ల్లుడు దానం
కందకు లేని దురద త్తిపీట కెందుకు? - ఇలా.
వేమన పద్యాల్లోనూ, కొన్ని అన్నమయ్య కీర్తనల్లో కూడా ఈ యతి బహు సరసంగా ఉంటుంది.
మాత్రలు మధురంగా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. కొత్తసంగతి, చాలా ఆసక్తికరమైన సంగతి. తెలియజేసినందుకు కృతజ్ఞతలు. ఈ టపా నానుండి ఇన్నాళ్లూ ఎలా దాక్కుందో! లీలగారి గాత్రమాధుర్యానికి గాలి ఆమెచెప్పినట్టు ఆడాల్సిందే.