అశాశ్వత క్షణాలు

కొన్ని కొన్ని అనుభవాల ప్రత్యేకత వాటి తాత్కాలికత లోనే ఉంటుందేమో ననిపిస్తుంది.
తరగటం పెరగటం లేకుండా ప్రతి రాత్రీ పున్నమి వెన్నెల కాస్తే దానికేమీ ప్రత్యేకత ఉండదు.
ఒక్క వేసవి లోనే కాక ఏడాది పొడుగునా మల్లెపూలూ, మావిడిపళ్ళూ దొరికేట్లయితే వాటికీ ఏమీ ప్రత్యేకత ఉండదు.

మనిషి తత్వం ఎలా ఉంటుంది అంటే .. అయ్యో నెలలో మిగతా 29 రోజులూ ఇలాంటీ వెన్నెల ఉండదు కదా; ఈ మావిడి పళ్ళూ మల్లెపూలూ ఈ రెణ్ణెల్లేగా దొరికేది, మిగతా పది నెలలూ దొరకవు గదా .. అని విచార పడుతూ ఉంటుంది.

ఏదన్నా అనుభవాన్ని తరువాతి కాలంలో గుర్తు చేసుకోవడం కోసం రికార్డు చేసుకోవడంలో తప్పేం లేదు గాని, ఆ రికార్డు చేసుకునే హడావుడిలో పడి ఇప్పుడు ప్రత్యక్షంలో ఉన్న అనుభవాన్ని ఆస్వాదించ లేక పోతే .. హబ్బ, ఎంత వృధా?

ఒకసారెప్పుడో న్యూమెక్సికో రాష్ట్ర రాజధాని ఆల్బుకర్కీ నగరానికి వెళ్ళాను. ఎప్పుడూ అమెరికా ఈశాన్య రాష్ట్రాల్ని వదిలి వెళ్ళని నాకు అదొక విలక్షణమైన ప్రపంచం. అదొక వింత లోకం. (న్యూమెక్సికో రాష్ట్రం అమెరికా దక్షిణపు భాగంలో టెక్సస్ రాష్ట్రానికి వాయవ్య దిశగా ఉంటుంది.) ఆల్బుకర్కీ నగరానికి తూర్పు దిక్కున శాండియా పర్వత శ్రేణులు ఉత్తర దక్షిన దిశగా పరుచుకుని ఉన్నాయి. అక్కడ ఒక చోట పర్వతాగ్ర భాగం చేరేందుకు కిందనించి రోప్ వే కట్టారు. పైన ఒక చిన్న పార్కు, రెస్టారంట్ ఉన్నాయి. ఉత్సాహవంతులైన వారు అక్కడి నించి కాలినడకన వనవిహారం కూడా చెయ్యొచ్చు. ఐనా అది కాదు ఇప్పుడు విషయం.

ఈ రోప్ వే మీద ప్రయాణించే కారు నాలుగు వైపులా అద్దాలతో ఒక మినీ బస్సంత ఉంటుంది. పాతిక ముప్ప్ఫై మంది పడతారు. సుమారు పదిహేను నిమిషాల ప్రయాణం. పైకెక్కే కొద్దీ కళ్ళబడుతున్న శాండియా పర్వత సానువులూ లోయలే కాక, విశాలంగా పురివిప్పుతున్న ఆల్బుకర్కీ నగర విస్తీర్ణం. సూర్యాస్తమయ సమయం. పడమటి దిక్కున సూర్యభగవానుడు సంధ్యాకాంతని రాగరంజితం చేస్తున్నాడు. ఎన్నెన్ని రంగులు ఆకాశం నిండా. ఎటు చూసినా కళ్ళు పట్టనంత సౌందర్యం. నా చుట్టూతా జనాలు, పదిహేన్నిమిషాల మహాద్భుతాన్ని ఒక జీవితకాలం పొందు పరుచుకోవాలని ఆశతో, కేంకార్డర్లలోనూ కేమెరాల్లోనూ ఆ సౌందర్యాన్ని బంధించేందుకు విఫల ప్రయత్నం చేస్తూ. నా చేతుల్లోనూ ఒక అధునాతనమైన కేమెరా ఉంది. ఎక్కడో మెదడు సందేశాలు పంపుతోంది, ఫొటోలు తియ్యమని. దాని గోడు పట్టించుకునే నాథుడు లేడు.

ఇప్పుడు మీకు చూపిద్దామంటే ఫొటోలూ లేవు, ఈ నా మాటలు తప్ప.
కానీ నా మనసులో ఆ అనుభవం మాత్రం పదిలం.

తా.క. ఇవ్వాళ్ళ మూడెనిమిదుల తేదీ :)

Comments

Srividya said…
కొన్ని కొన్ని అనుభవాల ప్రత్యేకత వాటి తాత్కాలికత లోనే ఉంటుందేమో ననిపిస్తుంది.
తరగటం పెరగటం లేకుండా ప్రతి రాత్రీ పున్నమి వెన్నెల కాస్తే దానికేమీ ప్రత్యేకత ఉండదు.

ఎంత బాగా రాసారండి.. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేలా వున్నాయి.
అచ్చంగా మీరు చెప్పినదాని లాంటిదే, ఆల్బుకర్కీ నుండి సుమారు ఐదు గంటలు దక్షిణంలో ఉన్న కార్ల్స్ బాద్ గుహల దగ్గర నాకు జరిగింది..ఒకటే వ్యత్యాసం ఏమిటి అంటే, నేను ఫోటోలు తీసుకున్నాను, కానీ అన్నీ పోగొట్టుకున్నాను..కానీ పరమ అద్భుతమయిన గుహలు, వాతావరణం, సాయంత్రానికల్లా ఆహారం వేటలో అక్కడికి దగ్గరలోనే ఉన్న గుహల నుండి బయటకు వచ్చే లక్షల కొద్దీ మెక్సికన్ టెయిల్డ్ బాట్స్, చూడాల్సిందే తప్ప వర్ణించ తరం కాదు...
బాగా చెప్పారు.. నేను మొదటిసారి నయాగరా వెళ్ళినప్పుడు క్లిక్ ల మీద క్లిక్ లతో అసలు ఆస్వాదించడమనే విషయాన్ని మర్చిపోయాను.. కానీ రెండోసారి కెమెరా నీడ కూడా నా మీద పడనివ్వలేదు.. ఆ జలపాతం హోరు, నీటి తుంపర తల్చుకుంటే ఇప్పటికీ మనసు ఝల్లంటుంది! :-)
మనం నిజంగా జీవించేది అలాంటి క్షణాల్లోనే! వీటినే జపనీయులు హైకూ క్షణాలు అని కూడా అంటారు. చాలా బాగా రాసారు. తప్పక రాస్తూ ఉండండి.
Purnima said…
హిహి... ఒక్కోసారి మెదడుని పట్టించుకోకూడంతే!! అప్పుడే మనసు మనస్పూర్తిగా మనసైన దాంట్లో పడి మునకలేస్తుంది. ఎంత అధునాతనమైన కెమరా అయినా మన మనసు కన్నా బాగా చూడగలదా ఏంటి?
ఇది చాలా అన్యాయం కొత్తపాళీగారు,
అంత మంచి దృశ్యాన్ని మీరొక్కరే చూసి మమ్మల్నిఇలా ఊరిస్తారా? చేతిలో కెమెరా ఉండి కూడా ఆ అందమైన దృశ్యాలను బంధించాలనిపించలేదా?? టూ బ్యాడ్..
మళ్ళీ అలాంటి అవకాశం వచ్చినప్పుడు మర్చిపోకండి.కనీసం మీ మొబైల్‍తో అన్నా బంధించి మాకు చూపించండీ..
మాలతి said…
ప్రతి రాత్రీ పున్నమి వెన్నెల కాస్తే దానికేమీ ప్రత్యేకత ఉండదు.
- అన్నమాట నాకు చాలా నచ్చింది. ప్రయాణాలయినా మరోటయినా దాచుకునే తీరులోనే వుంది అనుభవించే అందం. ఫొటోల్లేకపోయినా, ఆర్ లేనందునే మీ పదాల్లో సౌందర్యం ఎక్కువ తెలిసింది నాకు.
Anonymous said…
ఆ అద్భుత క్షణాలను మాకూ కాస్త చూపించి భాగ్యం కట్టుకోండి ఎప్పుడైనా. ఫోటోలు తీస్తూ సమయం వృధా చేయక హాయిగా ఆస్వాదించారన్నమాట:)
cbrao said…
లేనిది కావాలని మనసు చాస్తుంది అర్రులు
మోజు తగ్గుతుంది, కోరుకున్నది అందుబాటులోకొస్తే
అదంతే మరి, చపల చిత్త మనసు
చాలా కాలం క్రితం ఈ కింది వాక్యాలు చదివాను ఎక్కడో!
As a matter of fact, man is a fool
He wants it hot, when it is cold
He wants it cold, when it is hot
Kranthi M said…
ప్రతి రాత్రీ పున్నమి వెన్నెల కాస్తే దానికేమీ ప్రత్యేకత ఉండదు.
ఈ మాట చాలా బాగు౦ది.నేను మొన్న రాసిన కవితలో ఎ౦దుకు లేదా అనిపి౦చి౦ది.నా బావానికి చాలా దగ్గరగా ఉ౦ది.

http://srushti-myownworld.blogspot.com/2008/08/blog-post.html
మోహన said…
చల బాగుందండీ. చదువుతూ నాదైన శైలిలొ ఒక trip వేసేశాను. :)
ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం నేను ఎప్పుడూ చూడనంత పెద్ద ఇంద్ర ధనుస్సును చూసాను. ఎంత అందంగా ఉందో చెప్పలేను. వర్ణించేందుకు ఇంకా మాటల కోసం వేచి చూస్తున్నాను.

కెమేరా ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఆ లెన్స్ లోంచి చూస్తూ గడిపి ఉంటే స్వచ్ఛమయిన ఆ కొద్ది అశాశ్వత క్షణలను శశ్వతంగా నా మనసులో పొందు పరచుకోలేకపోయేదాన్నేమో..

ఆ అనుభూతిని పక్క వారికి పంచాలనే ఆశే కదా ఈ కెమేరా ఆలోచనంతా..!
Anonymous said…
డీ.సీ దగ్గర్లో షానన్దోవ్ వ్యాలీలో "లూరే కావర్న్స్" చూసినప్పుడు ఇలాంటి అనుభవమే. ఆ గుహల్లో నుంచి బయటికి వచ్చిన తరువాత చెరిగిపోకుండా ఆ జ్ణాపకాలు అలా నిలిచిపోయాయి.
ఏదో పని చేస్తూనో,పనిపాటా లేక సూర్యుడికి వీపు చూపుతూనే నిలబడి ఉంటాం.నడినెత్తిన ఎప్పుడు పుట్టిందో తెలియదు ఒక ధార,ఊరుతున్న ఒక నీటి ఊట,మెల్లగామౌనంగా మెడమీదకు జారి,ఏదో పనిఉన్నట్లు మధ్యలో ఆగి అటూ ఇటూ చూస్తుంటుంది.మనకా ఈ చెమటచుక్క చల్లగా కాస్త సమ్మగా ఉన్నట్లనిపించినా,అదే సమయములో ఎవరన్నా కాస్త ఓపికచేసుకునిమెడతుడిస్తే బాగుండు అదే చేత్తో కాసిన్ని మంచినీళ్ళు,ఆమూల ఉన్న మంచినీళ్ళనల్లకుండలోనుంచి ఒక్కగ్లాసు ఒకేఒక గ్లాసు ఇస్తే ఎంతబాగుండూ అనుకుంటూనే ఉంటాం,కానీ కదలం.

అప్పుడొస్తుందండి,ఎక్కడినుంచో తెలియదు,ఎందుకొచ్చిందో తెలీదు,ఒక చిన్న గాలి అల,చాలా చిన్నది,పిల్లతెమ్మెరంత కూడాఉండదు,పిల్లగాలీ కాదు,చిటికెనవేలు గోరు చివరతో చెవి కిందచక్కిలిగింతలు పెట్టినట్లు వచ్చి ఆ చెమటగాడిని ఒక్కదులుపు దులిపి, కేవలం ఆ కాస్త చెమ్మ మాత్రం అలా ఉంచి ఏమబ్బుదుబ్బుల్లోకి దూరిందో తెలియకుండా మాయమవుతుందే ఆ గాలినిలిచింది ఎన్నిక్షణాలు?అవి శాశ్వతాలా?కాదా??కొన్నిటిని Space &Time కొలతలతో లెక్కపెట్టలేము
హమ్మయ్య! ఇన్నాళ్లకు నాకు తోడుగా ఇలాంటి 'వింత' ఆలోచనలు/లక్షణాలు ఉన్నవాళ్లు ఒకరు దొరకటం కొంచెం ఆనందంగా ఉంది. అసలు ఫొటోలు తీయకపోతే మనల్ని ఒక 'వెధవల్లాగా', మన జీవితం వృధా అన్నట్టుగా ... అన్నింటికన్నా ఇంకొక కామన్ స్టేట్మెంట్ ఏమిటి అంటే, "అయ్యో ఫొటోలు తీయలేదా, ఈ నాలుగేనా తీసింది, ముందు వెళ్లగానే నాలుగు అయిదు ఫొటోలు తీసుకోవలసింది కదా ... ఈ మాత్రం దానికి అంత డబ్బులు పెట్టుకొని వెళ్లటం దండగ కదా' ..... కనీసం కొన్ని సార్లు అయినా 'మనల్ని' మరిచిపోయేలా చేసే క్షణం అనిపించినపుడు 'ఇలాంటివన్నింటినీ' పక్కన పెట్టి మదిపొరలలో శాశ్వతత్వాన్ని ఆపాదించగలిగి, ఓ మధురజ్ఞాపకంగా భద్రపరచగలిగితే, ఫొటోల రూపంలో దాచిన వాటిని ఎన్ని వందల గూగుల్ ఇంజన్లతో వెదికినా విజయమెప్పుడూ జ్ఞాపకాలదే అనిపిస్తుంది, even though a picture is worth thousand words.

Especially these days with the availability of all these sophisticated/advanced photo editing tools like PhotoShop etc, I never understood the significance of photos rather than living/enjoying the moment, when we can create/make photos us being on any part of the world :-) ...

అందుకే నాకు ఎప్పుడూ ఒక వింత ఆలోచన/కోరిక ఉండేది (ఇప్పటికీ ఉంది లేండి) ... We should be able to record everything in a digital format as/how we see it (ie an exact replica of how we viewed it rather than color/light balance with camera/camcorder)with an on/off mechanism in/with eyes so that we can enjoy/live in the moment and later we can download and do whatever we want.
ఈ టపా రాస్తుండగా ఇంచుమించు కవిత్వం రాస్తున్నానేమో ననే ఊహ కూడా రాలేదు. కానీ ఇప్పుడు మీ అందరి వ్యాఖ్యలూ చదివాక, నే రాసిన టపానే మీ కళ్ళతో చూస్తూ ఉంటే .. కవిత్వమేమో అని కొద్దిగా అనుమానం కలుగుతోంది. :) అందరికీ అనేక ధన్యవాదాలు.

@మూలా - హైకూ గురించి మీరు చెప్పింది అక్షర సత్యం.

@ telugu'vadini' - you're talking about Holodeck on StarTrek Enterprise, my friend :)
Sankar said…
మొదటి పేరా చదవగానే అర్ధం అయ్యింది ఆ అనుభవం మీకు ఎంత ఆహ్లాదాన్ని కలిగించిందో.. ఫోటోలు ఎక్కాన్నా దొరుకుతాయి, కానీ ఇలాంటి వర్ణనలు మాత్రం బహు కద్దు...
అనుభవాలకి అక్షరరూపం ఇస్తే, భాష తన అవధులుదాటి భావాల్ని అందిస్తుందంటారు...బహుశా ఇదేనేమో!
మంచి దృశ్యాలను ఎంత మనస్సులో బలంగా ముద్రించుకున్నా అప్పుడప్పుడు చూసుకొనేటందుకు ఫోటోలు కూడా అవసరమే కదా!
Anonymous said…
కొన్ని అనుభూతులు, అనుభవాలు మాటలకు, వర్ణనలకు ఒహ పట్టాన అందవూ, లొంగవు.
నిశిధి నిశబ్దాన్ని అస్వాదించడం లాగ!

తా:క: ఔను, మాస్టారు, దీని మీదే బ్లాగితే...(నిశిధి నిశబ్దాన్ని అస్వాదించడం)
ramya said…
సరిగ్గా ఇలా ఫీలయ్యే ఎన్నో బంగారు క్షణాలను బంధించకుండా వదిలేసాను...ప్చ్!
Anonymous said…
ఔను. అనుభూతికి సాటిలేదు. ఫోటోలు ఎవరు తీసినా చూడొచ్చు.., ప్రత్యక్షానుభూతి మాత్రం అనుభవైకవేద్యం కదా!
Unknown said…
నాకు మాత్రం కెమేరా కన్నుతో చూడడం కూడా ఇష్టం.

ఆ జ్ఞాపకాలు నాకు కలకాలం గుర్తుంటాయి. ఫోటోలు తీయడం అనే ప్రక్రియలో లీనమయి ఉంటాను కాబట్టి పరిసరాలను ఇంకొంత ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ, తరువాత కూడా గుర్తుంచుకోగలుగుతాను.
రాధిక said…
ఎ0తబాగా చెప్పార0డి.నేను మొదట ప్రకృతిని స0పూర్ణ0గా అనుభవి0చేసి ఆ తరువాత నాకు తెలిసినవాల్లతో డిస్కస్ చేసేసి కెమేరా మీద పడతాను.మొన్న మాకు ఒకేసారి రె0డు వానవిల్లులు వచ్చాయి.ఎ0త బాగు0దో.మా ఊరిలో అ0దరికీ ఫోనులు చేసి చెప్పేసి కెమేరా చేత పత్తుకునేప్పటికి మేఘాలు వచ్చేసాయి.
కొన్ని కొన్ని మనక0టితోకన్నా కెమేరా క0టితో చాలా బాగు0టాయి.
రాజే0ద్రగారూ చాలా బాగా చెప్పారు.
Ramani Rao said…
ఈ టపా ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యాను అని ఆలోచించాను. నా బ్లాగు లిస్ట్ లో మీ బ్లాగ్ ని కలుపుకొన్నతరువాత రాసిన పోస్టే అయినా.. మరి నా దృష్టి లోపమో ఎమో!

లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు, ఒక పొరపాటుకు యుగములు వగిచేవు అని, అనుకొనేకన్నా, జ్ఞాపకాల పొరల్లో మైమరుపులా ఎప్పుడూ భద్రంగా ఉండే ఈ అనుభూతి ముందు, ఎంత ఖరీదైన కెమెరా చేతిలో ఉన్నా ప్రయోజనం లేదు. చక్కటి అనుభూతి. నిజమే! మనల్ని మనము మైమరిచేలా చేసే ప్రకృతి సౌందర్యం కొన్నిసార్లు మనల్ని చేష్టలుడిగేలా చేస్తుంది. జ్ఞాపకాల పొరల్లో ఆ మధురమైన అనుభూతిని దాచుకొనేందుకు వీలుగా.
Bolloju Baba said…
ఏ అనుభవమైనా దాన్ని అనుభవించేటప్పుడు కాక నెమరు వేసుకొన్నప్పుడు ఎక్కువ మజా ఇస్తుందని నా అభిప్రాయం.

ఫొటోలు, ఇలా నెమరువేసుకొనే ప్రక్రియను మానసికం నుంచి భౌతికం చేయటం లో దోహద పడతాయి.
అది ఆ అనుభవాన్ని మరింత ప్రజ్వలింపచేస్తుంది. ఇది వాంచనీయమే కదా.

నా ఫొటోల ఆల్బం కు పేరు "జ్ఞాపకాల పూలవాన"
బొల్లోజు బాబా