Saturday, February 28, 2015

రెక్కలు విప్పిన ఆశ

<<ఏదో పత్రికలో యథాలాపంగా చదవగా ఆకట్టుకున్న ఓ పక్షి ప్రేమికురాలి ప్రేమ కథ >>

మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు న్యూయార్కు సిటీకి కొంత దూరంలో గ్రామీణ వాతావరణంతో ఉండే పట్నం కౌంటీలో ఉన్నాం కొన్నాళ్ళు. వసంతం రాగానే రకరకాల పక్షులు మా ఇంటి ముందు పచ్చికబయలంతా పరుచుకునేవి. వాటి కువకువలు పకపకలతో నానా సందడీ చేసేవి. మొదట్లో చిరాకు వేసేది, కానీ మెల్లగా నా తలలో వాటి సందేశం ఇంకడం మొదలైంది - ఈ చోటు నా ఇల్లే కాదు, వాటి నివాసం కూడా. అలా పక్షులతో ప్రేమలో పడ్డాను .. చాలా బలంగా.

ఇహ అప్పణ్ణించీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పక్షులకోసం చూస్తుంటాను. అసలిప్పుడు చూడకుండా ఉండలేను కూడా. ఆ రోజుల్లో ఐతే నా బైనాక్యులర్లు, నా పీటర్సన్ గైడు ఎప్పుడూ చేతికి అందుబాటులో ఉండేవి - ఇంటి చుట్టు పక్కల అయినా, దూర ప్రయాణాల్లో అయినా. ఇప్పుడేమో నా ఫోనుమీదా ఐపాడ్ మీదా రకరకాల అప్లికేషన్లు.

ఇప్పుడు కెనడాలో నోవా స్కోషియాలో ఉంటున్నాను. ఇక్కడే మొదటి సారి ఆర్కిటిక్ టెర్న్ (Arctic tern) పిట్టని చూశాను. ఇవి ఎంత అద్భుతమైన పక్షులో. ప్రతీ ఏడూ దాదాపు నలభై వేల మైళ్ళు ప్రయాణం చేస్తాయివి. అట్లాంటిక్ మహా సముద్రాన్ని దాటేస్తాయి! ఇలా చలిదేశంలో నివాసం ఉండేటప్పటికి, మాకిక్కడ చలికాలం నడుస్తున్నప్పుడు ఇక్కడి పక్షులు ఎక్కడికి వలస వెళ్తాయో అనే కుతూహలంతో మధ్య అమెరికా, దక్షిణమెరికా దేశాలు అనేకం పర్యటించాను. ఆ సుదూర ప్రాంతాల్లో కెనడా పక్షుల్ని చూసినప్పుడల్లా, ప్రవాసం వచ్చి స్వదేశస్తుల్ని కలుసుకున్నంత ఆనందం!

ఒకసారి భూటాన్ వెళ్ళాను. అక్కడ నా మార్గదర్శికి నా కోరిక చెప్పాను, బయటికి బయల్దేరే ముందు ఒక రోజున .. హిమాలయన్ మోనల్ (Himalayan monal) అనే పిట్టను చూడాలి. ఈ పక్షి పదిహేను వేల అడుగులు మించిన పర్వతసానువుల్లో మాత్రమే ఉంటుంది. సూర్యోదయానికి బాగా ముందే బయల్దేరాం మేము. కొండ దేవత అనుగ్రహిస్తే నీకు కనిపించొచ్చు అన్నాడు మా గైడ్. సుమారొక గంట నడిచాక ఒక బౌద్ధ ఆలయాన్ని చేరుకున్నాం. అప్పుడే ఆ పర్వతాల్లో సూర్యోదయం అవుతున్నది. ఇంతలో ఒక వృద్ధ భిక్షువు బయటికి వచ్చి, రెండు గుప్పిళ్ళతో ఏవో విత్తనాలు విరజిమ్మాడు. సూర్యుడి బంగారు తొలికిరణాలు పరుచుకుంటూ ఉండగా, పొదల్లోంచి మైదానంలోకి వయ్యారంగా వచ్చిందొక ఒంటరి మోనల్. నా కళ్ళ వెంట ఎడతెగని ధార .. కృతజ్ఞతతో.

వాటి అందమూ, ఇతరత్రా వాటి అద్భుత కృత్యాలూ పక్కన బెడితే, పర్యావరణ పతాకలుగా కనిపిస్తాయి పక్షులు నాకు. భూమి అనబడే ఈ మన ఉమ్మడి ఇంటిని, ఆస్తిని మానవులం ఎలా ఎంత త్వరగా నాశనం చేసేసుకుంటున్నామో పక్షులు మనకి పదేపదే చెబుతుంటాయి. 2080 సంవత్సరం (ఇంకో అరవై అయిదేళ్ళలో) ఉత్తరమెరికాకి చెందిన డజన్లకొద్దీ పక్షి జాతులు మాయమై పోతాయని ఇటీవలి పరిశోధన పత్రం ఒకటి జోస్యం చెబుతున్నది. ఎప్పుడూ కనబడే వార్బ్లర్ జాతి పక్షులు అంతకంతకీ తక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే.

కానీ అంతా బాధాకరమే కాదు. ఇంచుమించు అంతరించి పోయిన బాల్డ్ ఈగిల్ని (bald eagle) మళ్ళీ పునరుద్ధరించుకో గలిగాము. పతనమై పోయిందనుకున్న వోపింగ్ క్రేన్ (whooping crane) ఇంకా బాగానే ఎగురుతోంది. ఈ ముఖ్యమైన విషయంలో తమాషా ఏవిటంటే దీనికి సంబంధించిన ములికమైన పనులన్నీ నాలాంటి సాధారణ వ్యక్తుల వల్లనే జరిగింది - కేవలమూ పర్యావరణ శాస్త్రవేత్తల వల్లనో, ఇంకేదో పైస్థాయి ఉద్యోగుల వల్లనో కాదు. పక్షులను గురించి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఎనభై శాతం సమాచారాన్ని పోగు చేసేది ఔత్సాహికులైన నావంటి వాళ్ళే. దీనికేం పెద్దగా శాస్త్రాలు తెలియనక్కర్లేదు.

నా మనవడి నోటివెంట పలికిన మొదటి మాట డబ్ .. అని - ఒక తెల్ల పావురాయిని చూసి. వాడికి నాలుగేళ్ళప్పుడు క్రిస్మసు సమయ గణనకి తీసుకెళ్ళాను. నా పక్షుల ప్రేమ వాడికీ అంటింది. నాకు తారస పడిన వారందరికీ ఈ ప్రేమని అంటించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.
 
మరి మీరూ వస్తారు కదూ!