Thursday, March 27, 2014

కబుర్లు - మార్చి 27

ఈ వారం పని వత్తిడి బాగా ఎక్కువగా ఉండడంతో ఫేస్బుక్కులాంటి జాలవిహరణలు బాగా తగ్గాయి. కొంతమట్టుకి ప్రాణానికి ఇది హాయిగా కూడ ఉంది. ఇదేదో రెగ్యులరైజ్ చేసే మార్గం చూడాలి.

నా ఆరోగ్యం కోసమనీ (బీపీ రైజవకుండా ఉండాలనీ) మనశ్శాంతి కోసమనీ ఎప్పుడో టీవీ చూడ్డమూ, పత్రికల్లో వార్తలు చదవడమూ మానేసినా, ఇదివరకు బ్లాగుల ద్వారానూ, ఇప్పుడూ ఫేస్బుక్కు ద్వారానూ ఆ క్షణానికి జ్వలిస్తున్న వార్తా కణిక ఏదో కంట్లో మండకా మానదూ, సలపకా మానదు. ఆ మధ్యన సచిన్ భారత రత్నతో ఒక ఊదర. మొన్న ప.క. రాజకీయ తెరంగేట్రంతో ఊదర. ఇలా ఏదో ఒక ఊదర. ఏదో కాస్త జనజీవన స్రవంతికి దగ్గరలో ఉందాము గదా అని ఈ చోట్లకి కాలక్షేపానికి వస్తే, అసలు వార్తలు చదివినదానికన్నా బీపీ రైజయ్యి ఫ్యూజులెగిరిపోయే ప్రమాద సూచికలు కనిపిస్తున్నాయి.

అందుకని, ఫేస్బుక్కులోకి తొంగి చూసి ఆప్త మిత్రులని పలకరించడానికి తప్ప ఇంక హుషారు షికార్లు అదుపు చేస్తాను.

గత రెండు మూడు రోజులుగానూ కార్లో రేడియో పెట్టినప్పుడల్లా ఎవరో ఒక రచయిత పరిచయం సాక్షాత్కారమవుతూ వస్తున్నది. ఎందుకో స్పష్టంగా చెప్పలేను గానీ రచయితలతో సంభాషణ విన్నప్పుడల్లా నాకు ఏదో తెలియని ఉత్తేజం, ఒక పరవశం కలుగుతుంది. మొదటి రోజున Teju Cole అనే నైజీరియన్ అమెరికన్ ఆంగ్ల నవలా రచయిత చెప్పిన కబుర్లలోనించి ఒక రచయిత తన రచనలో భాషలోని అందాన్ని, సంగీతాన్ని పట్టుకోవడం అనే మాట నన్ను బాగా ఆకర్షించింది. సమకాలీన తెలుగు రచయితలకి అన్వయిస్తూ ఫేస్బుక్కు కథ గుంపులో ఇదే ప్రశ్న అడిగాను. రకరకాల ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి. నిన్న నాకు చాలా ఇష్టమైన డయాన్ రేహ్మ్ షోలో అద్భుతమైన చర్చ పెట్టారు - ఫిక్షను చదవడం ఎందుకు? అని. ఈ ప్రశ్న నాకు నేను ఎన్ని సార్లు వేసుకున్నానో నా జీవితంలో. ఎప్పటికప్పుడూ నా సమాధానం మారుతూ వస్తున్నది. మొత్తానికి ఇదీ ప్రయోజనం అని గుర్తించదగిన దానికంటే మించిన ఒక ఆత్మానుభవం ఏదో నాకు కలుగుతూ ఉన్నది మంచి ఫిక్షను చదివినప్పుడల్లా. మీకు గనక ఒక గంట సమయం అందుబాటులో ఉంటే తప్పకుండా ఈ చర్చని వినండి. Diane Rehm Show

మొన్న మంగళారం నాడు, నా ఆంగ్లరచనా మార్గదర్శిని డయానా ప్లోపా నిర్వహించిన ఒక రచనా పద్ధతి వర్కుషాపులో పాల్గొన్నాను. Mythic Journey అని ముఖ్యాంశం. ఏ కథనమైనా ఈ మార్గంలో సాగుతుందని Joseph Campbell అనే మహానుభావుడు ప్రవచించడమే గాక, ఆ పద్ధతిని సవివరంగా విశదీకరించాడు. తన ఉపన్యాసంలో డయానా ఆ మార్గంలోని వివిధ మజిలీలను వివరించగా, వర్కుషాపు ముగిసేలోగా పాల్గొన్న సభ్యులందరమూ ఆ పద్ధతిని అనుసరిస్తూ ఒక్కొక్క కథనానికి రూపకల్పన చేశాము. మంచి అనుభవం. దీనికి తోడుగానే అసంపూర్తిగా ఉన్న ఒక తెలుగు కథా, ఇంకో ఇంగ్లీషు కథా మా సంగతేమిటని నిలదీశాయి. ఈ వారంతం మీ పని పడతానని హెచ్చరించి ప్రస్తుతానికి బయట పడ్డాను.

రెండు రోజుల కిందట Chang-Rae_Lee రాసిన Aloft అనే నవల చదవడం మొదలు పెట్టాను. వాక్యాలు కోంచెం సంక్లిష్టంగా ఉండడంతో చదువు కొంచెం నింపాదిగా సాగుతున్నది. కానీ ఈ నవల నాకు నచ్చేటట్టే ఉన్నది. చూద్దాం.

మళ్ళీ గురువారం కలుద్దాం .. ఈ లోపల ఇంకేదన్నా పోస్టు రాయకుంటే ..

Sunday, March 23, 2014

ఎవరో చెప్పిన కథలు - జ్ఞాపకార్ధం

జ్ఞాపకార్ధం
సూ జువాంగ్ చెప్పిన కథ

మొన్నామధ్యన నా కూతురు వాళ్ళ గళ్ స్కౌట్ బృందంతో కేంపుకి వెళ్ళొచ్చింది. కేంప్ బాగా జరిపినందుకు కృతజ్ఞతా సూచకంగా బృంద సభ్యులందరూ కలిసి, వాళ్ళ నాయకురాలికి ఒక చిన్న బహుమతి ఇచ్చారు. లెదర్మేన్ అనే కంపెనీ చేసినది, అనేక స్టెయిన్లెస్ స్టీల్ పనిముట్లు ఒకే పిడికి బిగించి ఉన్న పరికరం అది. అందులోనే రెండు రకాల స్క్రూ డ్రైవర్లు, ఒక కత్తి, ఒక కత్తెర, ఇలాంటివున్నాయి. అందులో ఆ బుల్లి కత్తెరని చూడగానే నా చిన్నప్పుడు నాదగ్గరుండిన ఒక మెరిసే బుల్లి కత్తెర గుర్తొచ్చింది.

మా అమ్మానాన్నలకి నేనొక్కత్తినే బిడ్డని. మేం చైనాలో ఉక్కు కర్మాగారాల నిలయమైన ఒక ఉత్తరప్రాంతపు పారిశ్రామిక నగరంలో ఉండేవాళ్ళం. మా నాన్న మాత్రం ఎక్కడో కొన్ని వందల మైళ్ళ దూరంలో ఏదో ఊళ్ళో పని చేసేవాడు. తనకి కావలసిన ఉద్యోగం ఎంచుకునే స్వేఛ్ఛ ఆయనకి లేదు. ఎప్పుడో సంవత్సరానికో సారి ఆయన మా ఊరొచ్చి, ఓ పదిరోజులు మాతో గడిపి వెళ్తూ ఉండేవాడు.

ఒకసారి ఆయన వస్తున్నాడని మా అమ్మా నేనూ రైలు స్టేషనుకి వెళ్ళాం. ఆయన రైలు పెట్టెలోంచి దిగాడు. బట్టలు నలిగిపోయీ, మొహం వడలిపోయీ, కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి, నలభై గంటల పైబడిన రైలు ప్రయాణం వల్ల. ఐనా, మమ్మల్ని చూడంగానే చిన్నగా నవ్వి, నన్ను దగ్గరికి రమ్మన్నట్టు చేతులు చాచాడు. నేను ఎవరో కొత్తవాళ్ళని చూసినట్టు భయపడిపోయి మా అమ్మని కరుచుకుపోయాను. ఆయన చిన్నగా నిట్టూర్చి తన జేబులోనించి మెరిసే ఒక చిన్న వస్తువుని బయటికి తీసి నా వేఫు చాచాడు. జంకుతూనే వెళ్ళి తీసుకున్నాను. హేండిల్ మడత పెట్టబడే బుల్లి కత్తెర. వెండితో చేసినట్టు మెరిసిపోతోంది. దాన్ని అందుకుని నేనెంత మురిసిపోయానో. మేలు రకం వస్తువులు నాకు అందుబాటులోకి రావడం అదే మొదలు. బీజింగ్‌లో రైలు మారడంకోసం వేచి ఉన్న సమయంలో అక్కడ నాకోసం కొన్నానని నాన్న తరవాత చెప్పాడు.

అప్పటిదాకా నాకంటూ ఉన్న ఆట వస్తువులు చెయ్యి విరిగిపోయిన ప్లాస్టిక్ పాప బొమ్మఒకటి, సొట్టలు పడిన ఒక రేకు లారీ, ఓ రెండు గోళీలు - ఇవే. మా యింటో అసలు కత్తెర లేదు. ఎప్పుడన్నా మా యింటి పైన ఉండే వాళ్ళ దగ్గర్నించి మా అమ్మ అరువు తెస్తుండేది. అది నల్లటి లోహంతో చేసిన పేద్ద కత్తెర. దాంతోనే ఆయన చేపల తలకాయలు కత్తిరించేవాడు. దాంతోనే మా అమ్మ తన పాత చొక్కాని కత్తిరించి నాకు గౌనులు కుట్టేది. ఇట్లాంటి బుజ్జి ముచ్చటైన కత్తెర నేనెప్పుడూ చూళ్ళేదు.

నేనే కాదు, నా తోటి మిత్రులు కూడా ఎవరూ చూళ్ళేదు. ఆ కత్తెర ఎప్పుడూ నాతోనే ఉండేది. అందరూ దాన్ని ముట్టుకోడానికి, పట్టుకోడానికి, కాగితమో దారమో కత్తిరించుకోడానికి అడిగి తీసుకోవాలనీ నాతో స్నేహం చేశారు. ఎప్పుడైనా నా స్నేహితురాలింటికి వెళ్తే, అక్కడ వాళ్ళ నాన్న ఆ అమ్మాయితో ఆడుతుంటే, నేను నిశ్శబ్దంగా నా లాగూ జేబులో నా కత్తెరని నిమిరేదాన్ని - వెంటనే మా నాన్న నా పక్కనే ఉండి నా భుజమ్మీద చెయ్యేసినట్టుగా ఉండేది. ఎప్పుడూ జేబులో వేసుకుని తిరుగుతూ ఉండటం వల్ల ఒక్కోసారి జేబులోనే మడతపెట్టిన కత్తెర తెరుచుకుని, నా జేబుకి చిరుగు పడ్డం, నా తొడ గీరుకోవడం కూడ జరిగింది, కానీ దాన్ని నేను వదిలి పెట్టలేదు.

ఇంత ప్రాణంగా చూసుకుంటూ ఉన్నా, కొన్నేళ్ళ తరవాత నేను ఏ ఎనిమిదో తరగతి చదువుతూ ఉండగానో, ఆ కత్తెర కాస్తా పోనే పోయింది. గళ్ స్కౌట్ కార్యక్రమం ఐపోయాక, నేనిలా ఈ జ్ఞాపకాల వెల్లువలో కొట్టుకుపోయి, నాకు మా నాన్న ఇచ్చిన కత్తెర గుర్తుగా అలాంటిదే ఒకటి కొని నా కూతురికి ఇచ్చాను. నానించి ఇంకో కానుక అనుకోకుండా వచ్చినందుకు అది సంతోషించినట్టే కనబడింది కానీ ఆ కత్తెరని కూడా తనదగ్గర ఇప్పటికే కుప్పలకొద్దీ పేరుకుని ఉన్నఆటవస్తువుల్లో పడేసింది.

మా నాన్నకిప్పుడు తొంభయ్యేళ్ళు. ఆ రోజున అకస్మాత్తుగా నాకోసం ఆ కత్తెర కొనాలని ఆయనకి ఎందుకు అనిపించిందో, అసలది నాకోసం కొన్నాడో, ఇంకెందుకన్నా కొన్నాడో - ఆ కత్తెర వెనక ఏమన్నా కథ ఉన్నదో - మా నాన్ననెప్పుడూ అడగలేదు. బహుశా ఎప్పుడైనా అడుగుతానని ఆయన ఎదురు చూస్తున్నాడేమో?

Thursday, March 20, 2014

కబుర్లు - మార్చి 20

ఇవ్వాళ్ళ పొద్దున కంప్యూటర్ తెరవంగానే గూగుల్ వాడు ఓ బుడబుక్కలాడి లాంటి బొమ్మొకటి పెట్టాడు. ఏంటబ్బా అని విచారిస్తే .. ఇవ్వాళ్ళ వెర్నల్ ఈక్వినాక్సుట .. అంతే కాక, అమెరికాలో సాధికారికంగా వసంతకాలపు ప్రారంభం. నేను పదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలో చదువుకున్నా. భూగోళ శాస్త్రంలో ఇవన్నీ చదువుకున్నట్టే గుర్తు గానీ ఈక్వినాక్సునీ, సాల్‌స్టిసునీ తెలుగులో ఏవంటారో గుర్తు రావట్లేదు. సరే పోనీండి. మనం సోషలు అంత శ్రద్ధగా చదువుకున్నామన్నమాట!

సరే వసంతకాల ఆరంభం అన్నారు గదాని సుమారు ఏడింటికి మా జోర్డను గాణ్ణి (కుక్క పిల్లని) తీసుకుని వాక్ కి బయల్దేరా. ఇల్లు దాటి నాలుగడుగులు నడిచేటప్పటికి పైనించి సన్నటి మంచు తుపరలూ, ఈ సైడునించి ఆ సైడుకి పీక కోసినంత పదునుగా రివ్వున చల్లగాలీ. జోర్డనుగాడీక్కూడా చలి తగిల్నట్టుంది, ఒక్క నిమిషంలో పని పూర్తిచేసి ఇంటి తలుపుకేసి పరిగెత్తాడు. సరే, ఏప్రిల్ దాటే దాకా ఇది మా ఊళ్ళో మామూలే. పెద్దగా ఆశ్చర్య పడలేదు.

ఏ న్యూసు ఛానల్ చూసినా ఏమున్నది గర్వకారణం అని న్యూసు చూడ్డమే మానుకున్నాను, కానీ ఈ మలేషియన్ విమానం మాయమవడం నిజంగా గుండెల్ని పిండేస్తున్నది. బ్రిటన్ మీద పేలిన పేన్ ఏం, అమెరికాలో 911 దుర్ఘటన, బ్రెజిల్ నించి బయల్దేరి సముద్రంలో కూలిన ఐర్ ఫ్రాన్స్ దుర్ఘటన .. ఆ తరవాత ప్రపంచవ్యాప్తంగా నిర్ఘాంత పరిచిన దుర్ఘటన ఇది. ఆ ప్రయాణికులేమయ్యారో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబ సభ్యుల బాధ తల్చుకుంటే కడుపు తరుక్కుపోతోంది.

ఒక వేపు ఉద్యోగపు వత్తిళ్ళు, ఇంకో వేపు ఇంటి బాధ్యతలు - ఏవేవో పనులు, పనుల ఆలోచనలు వేగిర పెడుతుంటే కూర్చుని రాసుకునే తీరికా, నిలకడా ఎక్కణ్ణించొస్తుందీ?  అందుకే మా వుల్ఫ్ పేక్ అంటే నాకిష్టం. వారానికో రోజు - బుధవారం సాయంత్రం రెండు గంటలు అందరం కలుసుకుని, ఒక చోట కూర్చుని రాతకే అంకితం. నిన్నటి సమావేశంలో ఆ మధ్య మొదలు పెట్టిన ఇంగ్లీషు కథని ఇంకో రెండు పేజీలు ముందుకు తీసుకెళ్లగలిగాను. తెలుగులో రాయాల్సినవి పేరుకు పోతున్నాయి. రాద్దామని కూర్చుంటే, ఒక్కొక్క వాక్యం ఆర్ద్రంగా, అర్ధవంతంగా రాయాలంటే .. ఎంత కష్టం? అదే రసాత్మకంగా రాయాలంటే .. చచ్చి ఇంకో జన్మ యెత్తినట్టే. అందుకే నన్ను అడిగిన వారికీ అడగని వారికీ కూడా చెబుతూ ఉంటా. పద్యాలు రాయడం సంగతి దేవుడెరుగు, చక్కగా కంటికీ, చెవికీ ఇంపుగా ఒక్క వాక్యం వచనం రాయడం ఎంత కష్టమో. ఆ మాత్రం భాష మీద పట్టు చాలా అరుదుగా ఉంటూ ఉంటుంది. మహామహా రచయితలమని విర్రవీగే వారి రచనల్లో కూడా వాక్యం బహు నీరసంగా పటుత్వం లేకుండ ఉండడం సవాలక్షమాట్లు చూశాను. "కవిత్వమని బుకాయించకు, వచనమై పుడతావ్" అని త్రిపురనేని శ్రీనివాస్ శపిస్తే శపించాడు గానీ, ఆ మాత్రం వచనం నాకు తగిల్తే నా పాలిటి వరమనే అనుకుంటాన్నేను.

కర్నాటక సంగీతం వినే అలవాటున్న వారిలో మోహన రాగం పెద్దగా నచ్చదు అన్న వాళ్ళెవరూ నాకింతవరకూ తారసపళ్ళేదు. పేరు ఎవరు పెట్టారోగానీ, ఆ రాగం మాత్రం సార్ధక నామధేయం. అందులోనూ ఆ పేరుకి ప్రాణం పోసేటటువంటి కృతి త్యాగరాజస్వామి వారి మోహన రామా అనే కృతి. దీన్నే పోయినవారం కబుర్లలో కూడా ప్రస్తావించాను. మొన్ననొక ఫేస్బుక్ మిత్రుల పుణ్యమా అని యూట్యూబు లింకు ఒకటి దొరికింది. ఇది ఒక LP రికార్డు, ఆ తరవాత కేసెట్టుగా ఉండేది. వయొలిన్ మీద లాల్గూడి జయరామన్, వేణువు మీద ఎన్. రమణి, వీణ మీద వెంకట్రామన్, రెండు మృదంగాల మీద ఉమయాల్పురం శివరామన్, టి. కె. మూర్తి గారలు కలిసి వాయించిన వాద్య బృందం. ఇంత మధురమైన మోహన రాగం, అందులో ఈ కృతి నేను ఇంకెక్కడా వినలేదు.
మీరూ విని ఆనందిస్తారని ..

Monday, March 17, 2014

ఆ మత్తులోన బడితే .. ఒక ఎనస్థీషియాలజిస్ట్ జ్ఞాపకాలు


ఒక సంభాషణ
 (వారి కోరికపై పేరు ప్రచురించడం లేదు)

నాకు ఐదేళ్ళప్పుడు టాన్సిల్స్ ఆపరేషన్ జరిగింది. రోజుల్లో పిల్లలెవరికైనా చీటికి మాటికి జలుబు, రొంప, పడిసం లాంటి ఇంఫెక్షన్లు  పడుతూ ఉంటే, అంటే 1950లలో, టాన్సిల్స్ తీసెయ్యడం సర్వధారణంగా జరుగుతుండేది. ఇప్పుడంటే టాన్సిల్స్ వల్ల శరీరానికి కొంత రోగనిరోధక శక్తి ఏర్పడుతుందని పరిశోధన ఫలితాల వల్ల డాక్టర్లు నమ్ముతున్నారు గానీ, రోజుల్లో పరిస్థితి వేరు, అప్పటి పద్ధతులు వేరు.

నన్ను ఆపరేషన్కి సిద్ధం చేసేందుకు మావాళ్ళు నాకో బొమ్మల పుస్తకం తెచ్చారు. Peter Ponsil Lost His Tonsil అని దాని పేరు. అందులో టాన్సిల్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అని రంగురంగుల బొమ్మలున్నాయి. నా అంతవయసే ఉన్న పీటర్ అనే పిల్లాడు, హాస్పటల్లో పీటర్ చుట్టూతా దేవదూతల్లాంటి నర్సులూ, దేవతల్లాంటి డాక్టర్లూ ఉన్నారు. అందరూ చిర్నవ్వులు చిందిస్తున్నారు. ఆపరేషన్ అయిపోయాక పీటర్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయి, వాళ్ళ అమ్మా నాన్నా లాలిస్తూంటే హాయిగా అయిస్ క్రీం తింటూ, వచ్చిన బహుమతుల్తో ఆడుకుంటూ చాలా ఆనందంగా ఉన్నట్టు తరవాత బొమ్మల్లో చూపించారు. ఎటొచ్చీ అసలు ఆపరేషను వ్యవహారం గురించి మట్టుకు ఏం చెప్పలేదు అందులో.

ఆపరేషన్కి ముందు రోజు సాయంత్రం మా వాళ్ళు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ కొంతసేపుండి, నన్నొక నర్సుకి అప్పగించి వాళ్ళు ఇంటికెళ్ళిపోయారు. ఇలా జరుగుతుందని పీటర్ పుస్తకంలో ఉంది కాబట్టి నేను కొంత సమాధానపడ్డాను. కానీ ఐదేళ్ల వయసులో మా వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం వాళ్ళని నన్ను కూడా కొంతైనా ఆందోళనకి గురిచేసే ఉంటుంది. రాత్రి ఒక పెద్ద హాల్లో టాన్సిల్ ఆపరేషన్ కోసమే హాస్పటల్కి వచ్చిన మరికొంత మంది పిల్లల్తో గడిపాను.

మర్నాడు ఉదయం నర్సులు ఒక్కొక్క పిల్లాణ్ణి హాల్లోంచి చక్రాలమంచం మీద తీసుకెళ్ళడం. కొంత సేపయ్యాక నిద్రపోతున్న పిల్లాడితో సహా మంచాన్ని దొర్లించుకుంటూ వెనక్కి తీసుకురావడం. తతంగమంతా గమనిస్తూ మిగతా పిల్లలమందరం మేకపోతు గాంభీర్యంతో మా వంతుకోసం చూస్తున్నాం. నా వంతు రానే వచ్చింది. ఆపరేషన్ చేసే గదిలోకి తీసుకెళ్ళారు. ఎవరో ఒక పెద్ద కప్పులాంటి దాన్ని నా మొహం మీద బోర్లించారు. ఒక ఘాటైన తియ్యటి వాసనతో నా ముక్కులు దిమ్మెక్కుతున్నాయి. ఇలా జరుగుతుందని నాకెవరూ చెప్పలేదు. పీటర్ పుస్తకంలో దీన్ని గురించి లేదు.

"ఏవండీ, ప్లీజ్ కప్పు నా మొహమ్మీంచి తీసెయ్యండి," అనడిగా చాలా మర్యాదగా. ఎవ్వరూ ఏం మాట్లాడలేదు. కప్పుని తీసెయ్యలేదు. నేనే తీసేద్దామని చెయ్యి కదిపాను. అంతే. కొన్ని బలమైన చేతులు నా చేతుల్నీ కాళ్ళనీ తలనీ మంచానిఖేసి అదిమిపట్టాయి. నేను గట్టిగా కేకలు పెడుతూ విదిలించుకోడానికి ప్రయత్నించాను. కానీ ఏమీ లాభం లేదు. తియ్యటి వాసన నా మొహమంతా నిండి ఊపిరి తిత్తుల్లోకి వెళ్ళిపోయింది. నాకు స్పృహ తప్పింది.

ఆపరేషన్ వల్ల మిగిలిన గొంతు నొప్పికానీ, తరవాత మావాళ్ళు చూపించిన లాలన కానీ, ఇచ్చిన బహుమతులుకానీ ఇన్నేళ్ళ తరవాత నాకిప్పుడు గుర్తు లేవు. కానీ, బలమైన చేతులు నన్ను కదలకుండా నొక్కి పట్టి ఉంచడం  - అప్పటి నా నిస్సహాయత - అక్కడ ఎవరూ నన్ను ఊరడించేందుకు ఒక్క మాటైనా అనక పోవడం - నాకు ఇప్పటికీ గుర్తుంది.

రోజుల్లో పేషెంటుకి మట్టుమందు ఎక్కించేందుకు ఇది సాధారణంగా ఉపయోగిస్తుండిన పద్ధతి. సన్నటి వైరు బుట్టమీద సర్జికల్ గాజు పరిచిందే నా మొహం మీద కప్పిన కప్పు. అలా మొహమ్మీద బోర్లించి గాజు గుడ్డమీద చుక్క చుక్కగా ఈథర్ ద్రవాన్ని వదులుతారు. ఈథర్ సులభంగా ఆవిరవుతుంది గనక పేషెంటు పీల్చుకునే గాలితో కలిసి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మత్తు కలిగిస్తుంది. ఆపరేషన్లకి మత్తు పదార్ధంగా ఈథర్ వందేళ్ళకి పైగా వాడుకలో ఉంది. కానీ ఇది అతి సులభంగా నిప్పంటుకుంటుంది - ఇదో పెద్ద సమస్య దీనితో. 1950లలోనే ఒక బ్రిటీషు శాస్త్రవేత్త ఈథర్ అణువులకి క్లోరిన్, బ్రోమిన్ వంటి హేలొజెన్ పరమాణువుల్ని సంధించి హేలోథేన్ అనే ద్రవాన్ని తయారు చేశాడు. ఇది అచ్చు ఈథర్లాగానే మత్తు కలిగించేది కానీ నిప్పంటుకునేది కాదు. కొద్ది సంవత్సరాల్లోనే చాలా ఆసుపత్రుల్లో దీన్ని వాడ్డం మొదలు పెట్టారు మత్తుమందుగా. ఐతే అప్పుడొక కొత్త సమస్య. హేలోథేన్ తీసుకున్న పేషెంట్సులో కొద్దిమందికి (30,000 మందిలో ఒకరు) తీవ్రమైన హెపటైటిస్ (ఒక మాదిరి కామెర్లు, కాలేయపు జబ్బు) జబ్బు చేసి చనిపోతుండేవారు. గణాంకాలు చూస్తే హేలోథేన్ వల్ల హెపటైటిస్ వచ్చి చనిపోయినవారికంటే ఈథర్ విస్ఫోటనల్లో చంపోయినవారు చాలా తక్కువ. మరి విద్య శాఖ, వైద్యాధికారి కొత్తమందుని ఆమోదించారయ్యా అంటే? ఎవ్వరూ కాదు! ఆసుపత్రుల్ని బీమా చేసే ఇన్సూరెన్సు కంపెనీలు - మీరీఉ గనక ఈథర్ వాడినట్లైతే అగ్నిప్రమాదాలకి మేము బీమా చెయ్యము - అని భీష్మించుకు  కూర్చుంటే ఆసుపత్రులు చచ్చినట్టు హేలోథేన్కి మారక తప్పంది కాదు. ఇదంతా 1950 లనించీ 1970లవరకూ జరిగిన కథ. అటుపైన ఇంకా కొత్త మత్తుమందులు కనిపెడుతూనే ఉన్నారు. అవి పని చేస్తూనే ఉన్నాయి. వాటి వల్లకూడా ఏవో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఏవీ పెర్ఫెక్ట్ కాదు. అద్వితీయమైన మత్తుమందు కోసం అన్వేషణ ఇంకా జరుగుతూనే ఉంది.

సరే, మళ్ళీ నా కథకొద్దాం. నేను హైస్కూల్లో ఉండంగా సముద్రం మీద బోటు షికారు వెళ్ళాను ఒకసారి నా తోటివారితో. కొంతమంది నీళ్ళ లోతుల్లోకి డైవింగ్ చేస్తున్నారు. తలనంతా కప్పి ఉంచే హెల్మెట్ పెట్టుకుని నీళ్ళలోకి వెళ్ళడం. పైన బోటు మీదనించి ట్యూబుద్వారా హెల్మెట్లోకి గాలిని సరఫరా చేస్తుంటారు. అలా డైవుచేసిన మనిషి చాలా సేపు నిళ్ళలోతుల్లో ఉండి, అక్కడి జీవరాశుల్నీ, వింతలు విశేషాల్నీ చూడచ్చు. నా మిత్రుల ప్రోద్బలంతో నేనూ సిద్ధమయ్యాను. హెల్మెట్ని నా తలపైన పెడుతూండగానే నాకు లోలోపల్నించి విపరీతమైఅన్ భయం తన్నుకొచ్చింది. హెల్మెట్ని తీసెయ్యడానికి ప్రయత్నించాను. కానీ అది కదల్లేదు. ఒక వందటన్నుల బరువున్నట్టుగా అనిపించింది. తీసెయ్యండి, నాకొద్దు అని గట్టిగా కేకలు పెట్టాను. నాకు సాయం చేస్తున్న పెద్దాయన హెల్మెట్ని తీసేశాడు. అంతే, అక్కడే కూలబడిపోయి, ఏదో ప్రాణాంతకమైన అనుభవం జరిగినట్టు రొప్పుతూ వొణికిపోతూ ఉండిపోయాను.

చాలా ఏళ్ళ తరవాత నాకు అర్ధమయింది - నా తలని కప్పే అనుభవాన్నీ నేను తట్టుకోలేననీ, భయానికి మూలకారణం నా చిన్నప్పుడు జరిగిన టాన్సిల్ ఆపరేషన్లో నా మొహమ్మీద బలవంతంగా బోర్లించిన ఈథర్ కప్పు అనీ తెలుసుకున్నాను.

అనుభవాలూ, అవగాహనా నన్నొక గొప్ప ఎనస్థీషియాలజిస్టుని చేశాయి, నేను నా ప్రాక్టీసులో నా పేషెంట్లతో ఇంకా సెన్సిటివ్గా ఉంటాను, నా చిన్నప్పుడు నాకు మత్తెక్కిచ్చిన డాక్టరుకంటే - అని నాకు నేను భావించుకుంటూ ఉంటాను.

కాని అది పుర్తిగా నిజం కాదు.

కాదని నా పేషెంట్ గెయిల్ అనే అమ్మాయి నిరూపించింది. నా చిన్నప్పటి అనుభవం వల్ల నేను నా పేషెంట్స్ని ముందే కలిసి వాళ్ళ పాత హిస్టరీ, ఇంతకు ముందేమైనా సర్జరీలు అయినాయా, ఎలాంటి మత్తుమందు వాడారు, ఇలాంటివన్నీ కనుక్కుంటాను. వాళ్ళకేవన్నా ప్రశ్నలుంటే జవాబులు చెప్పి వాళ్ళని ఊరడించే ప్రయత్నం చేస్తుంటాను. అలాగే ఆపరేషనుకి ముందు గెయిల్ని కలిసి మాట్లాడాను. ఆమెని ఆమె భర్త విపరీతంగా కొట్టేవాడు. అతని హింసలు భరించలేక ఆమె పారిపోయి ఒక రక్షణగృహంలో తలదాచుకుంది. అతను ఎట్లాగో ఇంటి ఎడ్రసు సంపాదించి ఆమెని వెతుక్కుంటూ వచ్చాడు. తనతో పాటు ఇంటికొచ్చెయ్యమని బతిమాలాడు. ఆమె ఒప్పుకోకపోయేటప్పటికి రివాల్వర్ తీసి కాల్చాడు. గుండు ఆమె జబ్బలోంచి దూసుకు పోయి ఎముక ముక్కలు ముక్కలుగా చిన్నాభిన్నమయింది. నేను గెయిల్ని చూసేటప్పటికి అతన్ని అరెస్టుచేసి విచారించి జెయిల్లో పెట్టారు.

గెయిల్ అప్పటికే ఒక ప్రాణభీతికరమైన అనుభవాన్ని చవిచూసింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి అనుభవం (సుదీర్ఘమైన ఆపరేషన్) ని ఎదుర్కుంటున్నది. నేను ఆమెతో చాలా మార్దవంగా మాట్లాడుతూ, ధైర్యం చెబుతూ ఆమె ఆరోగ్యపరిస్థితినంతా తెలుసుకుంటూ అతని శిక్ష ఎన్నాళ్ళు అని అడిగానామెని. రెండేళ్ళు అని చెప్పింది. లోపుగా ఒక పిస్టల్ కొనుక్కుని దాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి నువ్వు అన్నాను ఆమెతో. నాలో నాకు తెలియకుండానే ఆమె మాజీ భర్త పట్ల కోపం పెల్లుబికి పోతూ ఉన్నది. అంతే. అప్పుడప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్న మనిషి కాస్తా ముడుచుకుపోయింది. అటుపైన గెయిల్ నాతో - అని తప్ప మాట్లాడలేదు. ఆపరేషన్ జరిగేప్పుడు నేను నీ పక్కనే ఉంటాను, అన్నీ జాగ్రత్తగా చూస్కుంటాను, అంతా సవ్యంగా జరుగుతుంది, నీకేం భయంలేదు - ఇలా చాలా ధైర్య వచనాలు చెప్పాను. పూటా, ఇక ఆపరేషను బల్లమీద స్పృహతప్పే దాకా ఆమెని హింసపెట్టే భయభూతాలేవో వాటిని గెయిల్ ఒక్కతే ఎదుర్కుంది. నాగొంతు ఆమెకి ఎప్పుడోనే వినపడ్డం మానేసింది.

ఎంతో జాగ్రత్తగా పేర్చుకుంటూ వచ్చిన పేకమేడలాంటిది పేషెంట్ విశ్వాసం. అజాగ్రత్తగా అన్న ఒక్క మాటతో ఉఫ్ అని ఊదినట్టు కూలిపోగలదు.

తరవాత మనుషుల్ని గురించి, వాళ్ళ భయాల్ని గురించీ ఇంకొంచెం నేర్చుకున్నాను. మామూలుగా తిరిగే మనిషికైనా తన శరీరాన్ని పూర్తిగా ఇంకొకరికి (డాక్టరుకైనా) స్వాధీనం చేసెయ్యడం ఇష్టం ఉండదు. స్వాధీనం తప్పడం, అశక్తత కొందరికి విపరీతమైన భీతి కలిగిస్తుంది. కొందరికి మెల్లగా స్పృహ తప్పటం ఇష్టముండదు. కొందరికి అకస్మాత్తుగా స్వాధీనం తప్పితే భయపడతారు. కొందరికి సూది అంటే భయం. నాలాగా కొందరికి మొహం మీద ఏదన్నా పరిస్తే భయం. అలా నేర్చుకున్న విషయాల్ని నా ప్రాక్టీసులో వాడుతున్నాను.

రెండేళ్ళ రాక్సానా. ఎంతో ముద్దుగా ఉన్న పాప. పెద్ద పెద్ద ఆకుపచ్చరంగు కళ్ళు, పట్టులాంటి బ్లాండు జుట్టు. నా చిన్నప్పటిలాగానే పాపం ఏదో చెవికి సంబంధించిన ఇంఫెక్షనుతో చిన్న సర్జికల్ ప్రొసీజరు కోసం ఆసుపత్రికి తెచ్చారు. నా జేబులోంచి ఒక బుల్లి టెడీ బేర్ని తీసి, చూడు రాక్సానా! ఈయన మిస్టర్ బేర్. పాపం ఈయనకి కూడా నీకు లాగానే చెవి నొప్పంట. ఈయనక్కూడా రేపు ఆపరేషన్ చేస్తారు. ఈయనకి భయంగా ఉందంట. నువ్వు కొంచెం బుజ్జగిస్తావా? అనడిగా. రాక్సానా చెయ్యిచాపి బొమ్మని తీసుకుని దాని వేపు జాలిగా చూసి, ముద్దు పెట్టుకుని చంకనేసుకుంది

రాక్సానాని నా డెస్కు దగ్గరికి తీసుకెళ్ళా. బేర్ గారికి ఆపరేషన్ చేసేముందు మత్తెక్కించాలి. ఏం చేస్తే బాగుంటుంది అంటావ్? ఇంజెక్షను ఇద్దామా? ముక్కు మీద మాస్క్ పెడదాంఆ? అనడిగా. రాక్సానా వయసు పిల్లలకి సాధారణంగా ఇంజెక్షను సూది అంటే ఎక్కువ భయం ఉంతుంది. నేను అనుకున్నట్టే రాక్సానా మాస్క్ని ఎంచుకుంది.

ఆపరేషను గదిలో రాక్సానా పొట్ట మీద, ఆమెకి కనబడేట్టు బేర్ బొమ్మని ఉంచాను. బొమ్మకి కూడా ఒక చిన్న మాస్క్ తగిలించాను. నూరు శాతం ప్యూర్ ఆక్సిజెన్ ప్రవహిస్తుండగా సర్జికల్ మాస్క్ని రాక్సానా మొహమ్మీద మెల్లగా ఉంచాను. ఆమె భయపళ్ళేదు కానీ, మొహమ్మీద మాస్క్ ఉండడం ఆమెకి నచ్చలేదు. నీకు నచ్చలేదా, ఐతే తీసేస్తానులే అని మాస్క్ని కొంచెం పక్కకి జరిపి పూర్తిగా మత్తుమందు (నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గేస్) ప్రవహింప చేశాను. నేను మాస్క్ తీసేస్తున్నాననే రాక్సానా అనుకుంది. ఇంతలోనే ఆమె కళ్ళు మూతలు పడినాయి. ఆమె మెల్లగా స్పృహ కోల్పోతున్నది. సరైన వాయువుల మిశ్రమాన్ని సెట్ చేసి మాస్క్ని మళ్ళీ రాక్సానా మొహమ్మీద అమర్చాను. ఆపరేషన్ సులభంగా జరిగిపోయింది.

అన్నేళ్ళ క్రిందట, నాకు ఆపరేషన్ జరిగినప్పుడు నాకు మత్తు ఇచ్చిన ఎనస్థీషియాలజిస్ట్ మాత్రం తన పేషెంట్ భయాన్ని అర్ధం చేసుకుని ఉంటే ..  .. అప్పుడప్పుడూ ఆలోచనలో పడిపోతుంటాను.

పాలపిట్ట 2011 లో ప్రచురితం