Tuesday, December 17, 2013

పౌర్ణమి నించీ అమావాస్య దాకా - 5

గౌతమీ ఎక్స్‌ప్రెస్ ఆదివారం ఉదయం అనుకున్న సమయానికే రాజమహేంద్రి స్టేషను చేరింది. సామాన్లు దింపుకుని ప్లాట్ఫాం మీద నిలబడి ఉండగా అదే రైల్లోంచి దిగిన బంధువులు చివుకుల వెంకట్‌నీ, వారి అమ్మగారినీ పలకరించాను. ఇంతలోనే, ఎక్కడో పది పెట్టెల అవతలినించీ అమరేంద్రగారు వచ్చి ఆత్మీయంగా వీడ్కోలు చెప్పి, బండి కదులుతుండడంతో వెళ్ళిపోయారు. అక్క ఫోన్ చేసింది, కారులో స్టేషన్ బయటనే ఉన్నదని, వెంకటేష్ లోపలికి వచ్చాడనీను. ఇంతలో వెంకటేష్ రానే వచ్చాడు. ఎలాగూ చక్రాల సామానులే గనక, వాటిని దొర్లించుకుంటూ, ప్లాట్ఫాం పొడుగంతా నడిచి, లెవెల్ క్రాసింగ్ దగ్గర బయటపడ్డాం. ఓ పది నిమిషాల్లో ఇల్లు చేరుకున్నాం.

మా అక్క, శంకగిరి సరస్వతి, ONGCలో ఛీఫ్ ఇంజనీరు. బావగారు, JSR మూర్తిగారు కూడా ONGCలో ఛీఫ్ ఇంజనీరుగా పని చేసి రిటైరయ్యారు. బావగారి పెదనాన్నగారు, బ్రహ్మశ్రీ జోస్యుల సూర్యనారాయణగారు, తొంభై అయిదేండ్ల నవయువకులు. కొంతసేపు వారితో పిచ్చా పాటీ, సంగీత సంభాషణ. ఆయన కొన్ని దశాబ్దాల పాటు శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి పేరిట రాజమహేంద్రిలో సంగీత సేవ చేశారు. మా అక్క, బావగార్లు కూడా రాజమహేంద్రిలో సంగీత సభల నిర్వహణలో ముఖ్య భూమిక పోషిస్తూ వచ్చారు. సంగీత సభలు ఎలాగూ పెడుతున్నాము గదా, కథా రచయిత అయిన తమ్ముడొస్తున్నాడు, అందుకని ఒక సాహిత్య సభ పెట్టుకుంటే బాగుంటుందని అక్క సంకల్పించింది.

ONGC విశ్రాంత జెనరల్ మేనేజరు, సాహిత్యాభిమాని, విజయకుమార్ గారి ప్రోద్బలంతో, వారి సంస్థ సాహిత్య గౌతమి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం రివర్ బే హోటలు సమావేశ మందిరంలో సభ జరిగింది. ప్రముఖ కవి, తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు కేంపస్ డీన్, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు సభా సంచాలకులుగా, రాజమహేంద్రిలో తెలుగు సాహిత్యానికి పేరెన్నిక గన్న దిగ్గజాలవంటి పండితులు వేదికనలంకరించారు. స్వాగత వచనాలు, ప్రార్ధనాగీతం ముగిసినాక సభ మొదలైంది. ప్రముఖ కథా రచయిత, పర్యావరణ రక్షణ కార్యకర్త, డా. తల్లావఝల పతంజలి శాస్త్రి గారు సాహిత్యంలో స్థానీయకత గురించి మాట్లాడారు. సాహిత్యమంటే లిఖితమే కాదనీ, చెంచులు, సవరలు వంటి ఆటవిక సమాజాల మౌఖిక సాహిత్యంలో వారి పరిసరాలు, పర్యావరణం, వాటికి అనుగుణమైన జీవన పద్ధతులను గురించి ఎన్నో వివరాలు పొందుపరచబడి ఉన్నాయని, ప్రపంచ వ్యాప్తంగా ఉదాహరణలతో చెప్పారు. తరువాత సంస్కృతాంధ్ర పండితులు చింతలపాటి శర్మగారు మన ప్రాచీన సాహిత్యంలో సంస్కారాన్ని తెలియజేసే అంశాలను గురించి ప్రసంగించారు. తైత్తిరీయ ఉపనిషత్తుతో మొదలు పెట్టి వాల్మీకి రామాయణం, మహాభారతం మీదుగా కాళిదాసు శాకుంతలంతో సోదాహరణంగా, రసవత్తరంగా ప్రసంగించారు.

మహీధర రామశాస్త్రిగారు (మరా శాస్త్రి) రూర్కేలాలో ఉద్యోగరీత్యా ముప్ఫయ్యేళ్ళ పైగా నివాసం ఉన్న సందర్భంలో ఒరియా భాష క్షుణ్ణంగా నేర్చుకుని, తెలుగు నుండి ఒరియాకూ, ఒరియానుండి తెలుగుకీ కథలనూ కవితలనూ అసంఖ్యాకంగా అనువదించారు. ముఖ్యంగా కవితాత్మ చెడకుండా, మూలంలోని క్లుప్తతను, భావసాంద్రతను అనువాదంలో సాధించడం గురించి తన అనుభవాలను సోదాహరణంగా వివరించారు. కాదర్ ఖాన్ గారు వృత్తి రీత్యా పన్నుల అధికారి అయినా ప్రవృత్తిరీత్యా సాహిత్య ప్రియులు, అంతకన్న ఎక్కువగా హాస్య ప్రియులు, సాంఘిక సమస్యలకి హాస్య పరిష్కారం అనే అంశం మీద ప్రసంగించారు. మొదట్లోనే ఆయన చెప్పిన ఒక మాట నాకు చాలా నచ్చింది. సమస్యకి హాస్యం పరిష్కారం కాదు. కాకపోగా, అసందర్భంగా హాస్యాన్ని వాడితే, అది వికటించే అవకాశం కూడా ఉన్నది. ఐతే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో సమయోచితంగా హాస్యాన్ని వాడి వేడెక్కిన మనసుల్ని కొంచెం చల్లబరచ వచ్చనీ, చల్లటి మనసుతో ఆలోచించినప్పుడే సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయని చెప్పారు. చరిత్ర నించీ, తన జీవితంనించీ హాస్యాన్ని సందర్భోచితంగా వాడగలగటాన్ని ఉదహరించారు.

పుట్ల హేమలత గారు, తన పి హెచ్ డి పరిశోధన అంశమైన అంతర్జాలంలో తెలుగు సాహిత్యం అనే అంశం మీద మాట్లాడారు. తెలుగు బ్లాగుల చరిత్రని క్లుప్తంగా సమీక్షించి, అటుపై వ్విధ జాల పత్రికలు, ఇంకా ఇతరత్రా జరుగుతున్న సాహిత్య సృష్టి, అందులోనే ఎదురౌతున్న కొన్ని పెడధోరణులను ప్రస్తావించారు. యెర్రాప్రగడ రామకృష్ణగారు కవి, నటుడు, వ్యాఖ్యాత, పత్రికా రచయిత. గోదావరీ తీరంతో తెలుగు సాహిత్యానికున్న అనుబంధం అనే అంశం గురించి, పెద్దగా మాట్లాడకుండా నన్నయ్యగారి శ్రీవాణీ .. పద్యంతో మొదలు పెట్టి, ఎందరో మహామహుల పద్యాలను రచనలను తన మధురమైన గళంలో ఆలపించి, ఆహా, గోదావరీ తీరమంతా తెలుగు సాహిత్యమే కదా అనే సత్యాన్ని స్ఫురణకు తెచ్చారు.

చివరిగా నేను అమెరికా తెలుగువారు చేస్తున్న భాషా సేవ గురించి రెండు ముక్కలు చెప్పాను. తానా వంటి సాంస్కృతిక సంస్థలు, సిలికానాంధ్రా వంటి సాంస్కృతిక విద్యా సంస్థలు, వంగూరి ఫౌండేషన్ వంటి సాహిత్య సంస్థలు, అజొవిభొ ఫౌండేషన్ వంటి కళా సంస్థలు చేసిన, చేస్తున్న వివిధ కార్యక్రమాలను టూకీగా ప్రస్తావించాను. అమెరికను విశ్వవిద్యాలయాలలో తెలుగు బోధన ఆవశ్యకతని పరిచయం చేసి, ఆ దిశలో గత పదేళ్ళలో జరుగుతున్న ప్రయత్నాలను గురించి చెప్పాను. సంస్థలుగా వ్యక్తులుగా చాలా రకాల పనులు చేసినా, ప్రభుత్వం మాత్రమే చెయ్యగలిగిన పనులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి బడిస్థాయిలో తెలుగు బోధన. ఒక ఎనిమిదవ తరగతి తెలుగు వాచకం తెరిచి చదివితే, అందులో పిల్లలకు ఆసక్తి కలిగించే పాఠ్యాంశాలు ఏమున్నాయి? అవి ఎలా బోధించబడుతున్నాయి. ఇటువంటి కీలకమైన విషయాలను భాషా ప్రేమికులు పట్టించుకోవాలి అని చెప్పి ముగించాను.

ఆచార్య సుధాకర్ గారు, సభ ఆద్యంతం, తన సమయోచిత సరస సంభాషణతో, ఉల్లాసంగా సభను నడిపించారు. విజయ కుమార్ గారు, మా అక్కా, బావా వక్తలందరినీ శాలువాలతో సత్కరించారు. అటుపైన ఆ సభామందిరంలోనే ఏర్పాటైన విందు భోజనం. కానీ అప్పటికే బాగా ఆలస్యమవడంతో కొందరు అతిథులు వెళ్ళిపోయారు. ఆ కొద్ది సమయంలోనే ఇతర వక్తలతో కొద్దిగా సంభాషించ గలిగాను.

మరుసటి రెండు రోజులు బంధు మిత్రులతో కాలక్షేపం. విశాఖ నించి మా చెల్లెలు కూడా వచ్చింది మమ్మల్ని చూడ్డానికి. యెర్రాప్రగడ రామకృష్ణగారిని కొద్ది సేపు కలిశాను. అంతర్యామి అనే పేరిట పత్రికల్లో రాసిన ఆధ్యాత్మిక వ్యాసాల సంకలనం బహుకరించారు. తల్లావఝల వారు కూడా ఇటీవల ప్రచురించిన కొత్త పుస్తకాలు పంపించారు.

ఒక రోజు మా ఆవిడ కజిన్ సుధాకర్, తనూజ దంపతులతో గడిపాము. తనూజ ఆధ్వర్యంలో మంగళ వారం సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకుని బాలత్రిపుర సుందరీ సహిత విశ్వేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాము. సుధాకర్ గారి హోటల్ "షెల్టన్ - రాజమహేంద్రి" చూశాము. అన్ని హంగులతో చాలా బాగున్నది హోటల్. ఆ రోజే వారి మిత్రులు ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజనాలలో మేము కూడా అతిథులుగా వెళ్ళొచ్చాము.

ఇక ఆ సాయంత్రం టేక్సీలో విజయవాడ ప్రయాణమయ్యాం. మంచి బండి అని చెప్పి ఇచ్చాడు. అదేదో పాతకాలపు బండి. విజయవాడ చేరేటప్పటికి మా నడుములు విరిగినాయి. దానికి తోడు రింగు రోడ్డు ట్రాఫిక్‌లోఇరుక్కుని, అటు తిరిగి, ఇటు తిరిగి, చివరికి  రామవరప్పాడు రింగురోడ్డు దగ్గర, "కే" హోటల్లో బతుకుజీవుడాని రాత్రి తొమ్మిదిన్నరకి చేరుకున్నాం. వాళ్ళ పుణ్యమాని బఫే డిన్నరు పెట్టారు.

Tuesday, December 10, 2013

పౌర్ణమి నించీ అమావాస్య దాకా - 4

నవం. 23 శనివారం. తెల్లారెప్పుడో వాన మొదలైంది. ఏడున్నరకి వెంకట్ పాపం వానలో తడుస్తూనే పోయి నాకోసం ఆటో తీసుకొచ్చారు. ఎనిమిదింటికల్లా నా మిత్రుడు చక్రి వాళ్ళింటికి చేరుకున్నా. హైదరాబాదులో ఇక అది చివరి రోజు. రాత్రి తొమ్మిదింపావుకి గౌతమీ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. ఆ మూడు రోజులూ ఆత్మీయమైన ఆతిధ్యం ఇచ్చిన చక్రి, విజయ, వారి సుపుత్రుడు అరవింద్ లతో ఒక గంట సేపు హాయిగా గడిపాను ఆ ఉదయం. ఎందుకంటే, ఒకసారి ఇల్లు కదిలి బయటికొచ్చానంటే ఏదీ నా కంట్రోల్లో ఉండదని బాగా తెలిసొచ్చింది గనక. విజయ స్థానిక Waldorf బడిలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆయా తరగతులకి అవసరమైన బోధనాసామగ్రిని తామే తయాఉ చేసుకుంటూ, మధ్యమధ్యలో చిన్న చిన్న సంగీత నృత్య రూపకాలు రాసి పిల్లలతో ప్రదర్శింప చేస్తూ రకరకాల ఆసక్తికరమైన పనులు చేస్తున్నారు. తెలుగులో పిల్లలకి అవసరమైన సాహిత్యం ఎక్కువగా లేకపోవడాన్ని గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇదొకటి తెలుగు సాహిత్యకారులందరూ కొంత అర్జంటుగా పట్టిచుకో వలసిన విషయం.

ఏ పదిన్నరకో భట్టిప్రోలు అక్కిరాజు, స్వర్ణల ఇంట్లో నన్ను దింపేసి, చక్రి తన ఆఫీసు పని చూసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడే టైటానిక్ (కోనేరు) సురేషు, పద్మ దంపతులు, దాసరి అమరేంద్ర గారు కూడా వచ్చారు. యంగ్ టైగర్ అద్దంకి అనంతరామయ్య కొద్ది నిమిషాల తరవాత వచ్చి కలిశాడు. అమరేంద్రగారి మధ్యవర్తిత్వంలో ఐదారు పాయింట్ల మీద మంచి చర్చ జరిగింది. ఆయన ఫేస్బుక్ పేజిలో ఇది కొద్దిగా కేప్చర్ చేశారు. ముఖ్యంగా అక్కిరాజూ సురేషూ ఏమీ రాయకుండా ఉండడం చాలా దారుణమని తీర్మానించాం. సురేషుని తొయ్యవలసిందిగా పద్మని కోరాము. అక్కిరాజు రాయకపోతే, కొద్ది రోజుల్లో వాళ్ళమ్మాయి భావన రచయితగా ఆయన్ని అధిగమించేస్తుందని బెదిరించాం. చర్చల్లో - పిల్లల సాహిత్యం అంటే ఏంటి, పిల్లల సినిమా అంటే ఏంటి అని జరిగిన చర్చ బాగుంది. ఈ విషయమ్మీద చి. భావన అభిప్రాయాలు మనం గమనించాలి. నాకు గుర్తున్నవి -
  • పిల్లల సాహిత్యమంటే అందులో దుఃఖం లేకుండా అంతా సుఖమయం అంటూ ఉండదు. అమెరికను ఇంగ్లీషు పిల్లల సాహిత్యంలో బాగా పేరుపొందిన అనేక కథలు పుస్తకాలు, మృత్యువునీ, దుఃఖాన్నీ రియలిస్టిక్ గా చూపించాయి.
  • పిల్లల ఊహాశాక్తికి దోహదం చేసేట్టుగా ఉండాలి సాహిత్యం కానీ, సినిమా కానీ. అందుకే పిల్లలు ఇప్పటికీ మాయాబజార్ సినిమాని ఇష్టపడతారు.
  • పిల్లలకి హాస్యం అంటే చాలా ఇష్టం. ఆటలన్నా చాలా ఇష్టం. 
  • ఈ కాలపు పిల్లలు కథలోని పాత్రలతో రిలేట్ చేసుకో గలిగేట్లుగా ఉండాలి, కథలోని కాలం ఎప్పటిదయినా.
మన సాహిత్యంలో పిల్లల మానసిక వేదనని నిజాయితీగా చిత్రించిన సందర్భాలు బాగా తక్కువ అని సభ్యులు అభిప్రాయ పడ్డారు. ఈ నేపథ్యంలో తలిదండ్రులు విడిపోవడం (పరస్పర అంగీకారంతో విడాకులు, వదిలెయ్యడం, లేచిపోవడం, ఇత్యాది) లేదా ఒక పేరెంట్ చనిపోవడం - ఈ రెండు సంఘటనలలోనూ ఆ కుటుంబంలోని పిల్లల మీద వచ్చే వత్తిడిలో తేడా ఉంటుందా అని చర్చ. రెండవ సంఘటనలో సంఘంలో కొంత జాలి కలిగితే కలగవచ్చు. మొదటి దానిలో సంఘం ఈసడించుకోవచ్చు. ఏదేమైనా, విఛ్ఛిన్నమైన కుటుంబంలో పిల్లల మనసులపై వత్తిడి చాలా తీవ్రంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చాము. ఇదే నేపథ్యంలో పి. సత్యవతి గారి దమయంతి కూతురు, వోల్గా గారి మృణ్మయనాదం కథల గురించి మంచి లైవ్లీ చర్చ జరిగింది. ఈ టాపిక్కులన్నీ చూసి అక్కడి సంభాషణ అంతా యమా సీరియస్సుగానూ, హృదయవిదారకంగానూ ఉన్నదనుకుంటే మీరు తప్పులో కాలేశారన్నమాటే. మధ్యమధ్యలో ఎన్నో చమక్కులు, చతురోక్తులు, ఎకసెక్కాలు, చిన్ని చిన్ని సరదాలు. రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియలేదంటే అతిశయోక్తి కాదు. విడవలేక విడవలేక (ఇంటి మెయిన్ గేటుదాకా వచ్చాక మళ్ళీ బై బై చెప్పుకోడానికి ఇంకో పావుగంట పట్టింది) విడిచి బయల్దేరాం.కాలేజి మిత్రుడు కొండల్రావింట్లో భోజనం .. అతి ఇష్టమైన వంకాయ కూర, ఆవడలతో. సౌ. శాంతి అన్నపూర్ణే. అక్కణ్ణించీ మళ్ళీ హడావిడిగా బంజారాహిల్సులోని తరంగా మీడియా కర్యాలయినికి పరుగు. ఈ రోజంతా మా చక్రి నన్నంటిపెట్టుకునే ఉన్నాడు, పాపం. వాన బాగా కురుతోందీపాటికి. మొదట అనుకున్న సమయంకంటే సరిగ్గా గంట ఆలస్యమయింది. రచయిత కస్తూరి మురళీకృష్ణగారు ఈ మధ్య అసలే సస్పెన్సు హారర్ కథలూ గట్రా రాస్తూ ఉన్నారేమో, డైరెక్షన్సు కూడా అలాగే ఇచ్చారు. ఫలాని సందులోకి తిరగమన్నారు. ఆ సందులోకి తిరిగి కారాపి ఆయనకి కాల్ చేస్తే, అక్కడ పెద్ద చెట్టుంది చూడండి? గేటు ముందు నల్ల కారు కూడా ఉంది. అదే బిల్డింగ్ అన్నారు. ఫోను పెట్టేసి, ఆ వానలోనే సందుని పరికించి చూస్తే ఓ ఇరవైమూడు పెద్ద చెట్లూ, ఓ అరడజను నల్ల కార్లూ ఉన్నై. చివరికి ఆయనే స్వయంగా బిల్డింగులోనించి వానలో బయటికొచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళారు. తుర్లపాటి నాగభూషణం గారిని కూడ కలిశాను. సుమారొక గంట సేపు తరంగ ఆన్లైన్ రేడియో కోసం సంభాషణ రికార్డింగ్. మురళీకృష్ణగారు అమ్మో మహా చమత్కారి, ఆ సంభాషణలో ఏం మాట్లాడానో నాకిప్పుడు గుర్తు లేదుగానీ ఏవిటో చాలానే మాట్లాడాను. బయటికొచ్చాక మా చక్రి బాగా మాట్లాడావురా అన్నాడు. మా చక్రి ఆ మాత్రం మెచ్చుకున్నాడంటే పర్లేదన్నమాట అనుకున్నా. ఇంతలో అరిపిరాల సత్యప్రసాద్ మరో వారంలో విడుదల కాబోతున్న తన ఊహాచిత్రం కథల పుస్తకం తీసుకొచ్చారు. ఆయన ప్రోగ్రాము తరంగలో మొన్ననే బ్రాడ్కాస్ట్ అయింది. మిత్రులందరితో కూర్చుని ఓ కప్పు టీ తాగి తరవాతి అపాయింట్‌మెంటుకి బయల్దేరాం నేనూ చక్రీ.

MPC శర్మగారు, శ్రీలక్ష్మిగారు సుమారు నలభయ్యేళ్ళుగా మా కుటుంబ మిత్రులు. వాళ్లందర్నీ చాలా ఏళ్ల తరవాత కలవడం. సుమారు ఏడాది కిందట వారమ్మాయి పద్మప్రియ ఫేస్బుక్కులో పరిచయమైతే, అలా ఈ స్నేహం మళ్ళీ పునరుద్ధరించబడింది. ఫేస్బుక్కు ద్వారానే పైచయమైన మరొక మిత్రులు మణి భూషణ్ గారు (మీడియా హబ్ సంచాలకులు, జీవన సురభి పత్రిక సంపాదకులు) కూడా అక్కడికే వచ్చి కలిశారు. ఆయనతో పుస్తకాల అమ్మకం గురించి మంచి వాడి వేడి చర్చ జరిగింది. ఇక బయల్దేరకపోతే రైలందుకోలేము అని చక్రి హెచ్చరించడంతో ఇక వీడ్కోలు తీసుకోక తప్పలేదు.

బయట వానతో రోడ్లు మహా బీభత్సంగా ఉన్నాయి. మొదటి ప్రశ్న హైటెక్ సిటీనించి సికిందరాబాదు స్టేషనుకి ఎలా వెళ్ళాలి. ఎమెంటీయెస్ లో వెళ్ళాలి అంటే, ఆ రైలుని అందుకోగలనా అనేది రెండో ప్రశ్న. నిజానికి అక్కడ ఛాయిస్ లేదు - ఆ ఎమెంటీయెస్ని అందుకుని తీరాలి. ఇంటికి చేరంగానే యుద్ధ ప్రాతిపదిక మీద పేకింగ్ పూర్తి చేసి పది నిమిషాల్లో మళ్ళీ కార్లో ఉన్నా. లక్కీగా స్టేషను వీళ్ళింటికి బాగా దగ్గర. సూట్కేసుల్ని బ్రూట్ ఫోర్సుతో ప్లాట్ఫాం మీదికి ఈడ్చిపడేసి టిక్కెట్టు కొనుక్కొచ్చా చక్రి కారుని పార్క్ చేసొచ్చేంతలో. మేము చూసిన రైలు టైము దాటి రెండు నిమిషాలైంది అప్పటికి. రైలెళ్ళిపోయిందా?? గుండెలో గుబులు. చక్రిది ఎంతైనా గొప్ప లాజికల్ బుర్ర. రైలింకా రాలేదని తీర్మానించాడు. ఎలాగంటే, వచ్చేసుంటే మేము స్టేషనుకి చేరుకునే లోపల పట్టాల మీద కనబడి ఉండేది. అదీ కాక, ప్లాట్ఫాం నిండా ప్రయాణికులు చాలా మందున్నారు. హమ్మయ్య, నేను పట్టుకోవలసిన రైలు వెళ్ళిపోలేదు అనే నిర్ధారణకి వచ్చాము. అప్పుడింక మరో టెన్షను పట్టుకుంది. ఒకేళ ఈ రైలు మరీ లేటయితే .. కానీ దాని పుణ్యమాని మరో ఐదు నిమిషాల్లో అది రానే వచ్చింది, ఒక అరగంటలో సికిందరాబాదుకి చేరనే చేర్చింది. చక్రికి హైటెక్ సిటీ స్టేషనులోనే వీడ్కోలిచ్చాను.

సికిందరాబాదు స్టేషనులో నా తోటి ప్రయాణికుడొకతను సూట్కేసులు దింపడానికి సాయం పట్టాడు. ఇంతలోకి నా యువమిత్రులు, అమిత్, అజిత్ సోదరులు వచ్చి చేరారు. వారి సాయంతో బ్రిడ్జీ ఎక్కి, రెండు ప్లాట్ఫాములు దాటి, కిలోమీటరు పొడుగున్న ప్లాట్ఫామంతా నడిచి ఎట్టకేలకు నా కంపార్టుమెంటులో ఎక్కాను. రెణ్ణిమిషాల్లో రైలు కదిలింది! నిజంగా జస్ట్ ఇన్ టైమన్నమాట. శర్మగారింటినించి బయల్దేరనప్పటినించీ, ఈ క్షణందాకా జరిగిన సంఘటనలలో ఏ ఒక్క లింకు తెగినా నేను రైలందుకోలేక పోయేవాణ్ణి.

ఇంతలో దాసరి అమరేంద్రగారి నుండి ఫోను. ఆయనా, శ్రీపతి గారూ, మరి కొందరూ అదే రైల్లో కాకినాడ వస్తున్నారని. సామాను సర్దేసి, వాళ్ళని కలుద్దామని బయల్దేరాను. నాలుగు కంపార్టుమెంట్లు దాటేప్పటికి నా తాతలు దిగొచ్చారు. బహుశా దగ్గరి స్టేషన్లలో దిగిపోవడానికో ఏమో, రిజర్వేషను స్లీపరు కోచిల్లోకూడా చాలా మంది ప్రయాణికులు నిలబడి ఉన్నారు. ఆ జనసముద్రాన్ని ఈదలేక, అమరేంద్రగారికి కాల్ చేసి సారీ చెప్పాను.

అలా గౌతమీ ఎక్స్ప్రెస్లో మరుసటి మజిలీ దిక్కుగా ..
(ఇంక ఒకట్రెండు ఎపిసోడ్లతో ఐపోతుందిలేండి!)

Sunday, December 8, 2013

పౌర్ణమి నించీ అమావాస్య దాకా - 3

మర్నాడు (నవం. 22) కి ఎపాయింట్‌మెంట్లు ముందురోజునే ఫిక్సయిపోయినాయి. హైటెక్ సిటీ ఎం ఎం టియెస్ స్టేషన్లో రైలెక్కి, ఐదురూపాయల టిక్కెట్టుతో అరగంటలో సీతాఫల్ మండీ స్టేషన్లో దిగాను. వాటేనైడియా సర్ జీ! అని మనసులోనే సెల్యూట్ చేసుకున్నా. 2003-2004 ప్రాంతాల్లో ఈ ఎం ఎం టియెస్ నిర్మాణానికి పూర్వం జరిగిన తర్జన భర్జనలు, గోల, లీలగా గుర్తొచ్చాయి. ఇప్పుడు మెట్రో అని మరో నగర వ్యాప్త రైలు మార్గం రూపుదిద్దుకుంటున్నదిట. మావూళ్ళో నాకు ఆప్తమిత్రులైన పద్మ వాళ్ళ అమ్మగారింటికి చేరుకున్నా. డా. కుప్పా శ్రీనివాస శాస్త్రిగారు, డా. ఉషా శ్రీనివాస్ గారు ఇద్దరూ వారి వారి రంగాల్లో అసాధారణ ప్రతిభావంతులు. అంతేకాక తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఇద్దరికీనూ. యుగాది అనే పేరిట పుస్తక ప్రచురణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆసక్తికరమైన పుస్తకాలను ప్రచురించారు. వారమ్మాయికీ అల్లుడికీ స్నేహితుడిగానే కాక, నా పట్ల వారికి వాత్సల్యం కూడాను. ఉభయ కుశలోపరి పలకరింపులైపోయాక సుమారొక గంటన్నరసేపు వివిధ సాహిత్య విషయాలను గురించి మాట్లాడుకున్నాం. నాకు కొత్తగా పరిచయమవుతున్న యువ రచయితలని వారికీ పరిచయం చేస్తానని మాటిచ్చాను. తెలుగు సాహిత్యాన్ని ఉద్యమ ప్రాతిపదికమీద ఆంగ్లంలోకి తర్జుమా చెయ్యవలసిన అవసరాన్ని గురించీ, ఈ మధ్య వెలువడిన అనువాదాల్లో లోపించిన నాణ్యతని గురించీ ముచ్చటించుకున్నాం. అసలు ఏ అనువాదమూ లేకపోవడం కంటే చెత్తదైనా ఏదో ఒక అనువాదం ఉండడమే మేలని తీర్మానించాం.

వారి మనవరాలు శ్రీకరి. నా మిత్రులు పద్మ సుధాకర్ల కూతురు. అమెరికాలో పుట్టి పెరిగి, 12 వ తరగతి విజయవంతంగా ముగించుకుని, కాలేజికి వెళ్ళేముందు ఒక సంవత్సరం భారత్ లో, హైదరాబాదులో, అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉండి కొన్ని స్వఛ్ఛంద సేవా కార్యక్రమాలలో పనిచేస్తూ ఉన్నది కొన్ని నెలలుగా. పనిలో పనిగా తన నృత్యకౌశలానికి మెరుగులు దిద్దుకుంటూ ఉన్నది. ఆమె బాగులో ఆమె ఆలోచనలు, కొన్ని ఇండియా అనుభవాలు చదవచ్చు. ఆ రోజు కార్యక్రమం శ్రీకరిని నాకు మిత్రులైన ఒక స్వఛ్ఛంద సంస్థకి పరిచయం చెయ్యడం. వారి ఆఫీసు బర్కత్పురాలో ఉన్నది. ఆటోలో ప్రయాణం చెయ్యగలవా అనడిగితే శ్రీకరి నాకేసి వింతగా చూసి, నేను సిటీబస్సుల్లో కూడా తిరుగుతున్నా! అన్నది. నా ఎన్నారై మనస్తత్వాన్ని నేనే సైలెంటుగా మందలించుకుని ఆటో పిలిచాను. బర్కత్పురాలో నాకు చిరపరిచితమైన యుగాంతర్ ఆఫీసుని బయటి నుండి గుర్తు పట్టడం కొంచెం కష్టమయింది గానీ, ఆ వీధి చాలా చిన్నది కావడంతో తొందరగానే పట్టుకున్నాను. ఇక్కడనే కాదు, హైదరాబాదులో చాలా చోట్ల నాకు బాగా పరిచితమైన స్థలాలనే గుర్తు పట్టలేకపోయాను ఆ చుట్టు పట్ల బిల్డింగుల రూపు రేఖలు అనూహ్యంగా మారిపోవడం వల్ల.

యుగాంతర్ ఆఫీసులో అప్పటి మా గురువుగారు డా. విఠల్ రాజన్ గారిని, యుగాంతర్ నేతలు డా. కె. లలిత (of Women Writing in India fame), ఎం. శశికుమార్ గారలను కలిశాను. శ్రీకరి అక్కడ పని చేస్తున్న యువతీయువకులతో చర్చల్లోకి వెళ్ళిపోయింది. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు యుగాంతర్ నడుపుతున్న ప్రాజెక్టులు (దేశ వ్యాప్తంగా రూరల్ డెవలప్మెంటుకి సంబంధించి ఒక కీలకమైన ప్రాజెక్టు), పాత స్నేహితులందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఇలా రకరకాల విషయాలు ముచ్చటించుకున్నాం. విఠల్ గారు ఇతర బాధ్యత లన్నింటినించీ విరమించి ఇప్పుడు తన ఇంగ్లీషు ఫిక్షన్ రచన మీదనే శ్రద్ధ పెడుతున్నానని చెప్పారు. శశి కుమార్ గారిని మళ్ళీ మంచి ఆరోగ్యంతో చూడ్డం బాగుంది. లలిత గారు ఎప్పటి వలెనే వైవిధ్య భరితమైన ప్రాజెక్టుల మీద పని చేస్తున్నారు. ఆ ఆఫీసు, అక్కడి ఉత్సాహకరమైన వైబ్స్, ఆ ముందటి చిన్న ఆవరణ, సరిగ్గా చూసుకుని నడవకపోతే నుదుటికి కొట్టుకునేట్టు గుమ్మం పక్కనే జామచెట్టు .. అమెరికా వదిలేసొచ్చి మళ్ళీ యుగాంతర్లో పని చేద్దాం అనిపించింది చాలా బలంగా .. ఒక్క క్షణం పాటు.

లంచికి నారాయణగూడ చౌరస్తాలోని తాజమహల్ హోటల్ని సూచించారు మిత్రులు. శ్రీకరీ నేనూ అక్కడికి వెళ్ళాం భోజనానికి. ఏసీ డైనింగ్ హాలు బానే ఉంది గానీ ఆ మెనూ మహా గందరగోళంగా ఉన్నది. వెతికి వెతికి ఏవో రెండు పంజాబీ కడాయి వంటకాలు ఆర్డరిచ్చాను రోటీతో. తినడానికి వచ్చే సరికి రోటీ అప్పడంలా ఉన్నది. కూరలకి ఒక రుచీ పచీ లేదు. ఈ సారి నాన్ ఆర్డరిస్తే అదీ అలాగే ఉన్నది. అసలు సాంప్రదాయకంగా ఇడ్లీ వడ దోస లాంటి టిఫిన్లూ, థాలీ భోజనాలూ వడ్డిస్తూ వచ్చిన హోటళ్ళకి ఈ కొత్త కాలంలో కొంత ఐడెంటిటీ క్రైసిస్ వచ్చిందనుకుంటా. వినియోగదారులు నిజంగానే మారేరో, లేక మారేరని వీళ్ళనుకున్నారో .. ప్రతి మెనూలోనూ పంజాబీ వంటకాల లిస్టు, చైనీసు వంటకాల లిస్టు .. ఇంకా సవాలక్ష వస్తువులు .. ఇంతకీ ఏదీ తినడానికి రుచిగా ఉండదు! మెస్సుల్లో తప్ప ఒక సింపుల్ థాలీ భోజనం ఈ హోటళ్ళలో కనుమరుగై పోయినట్లుంది. కాలే కడుపుకి మండే గంజి .. ఏదోలే .. అని సర్ది చెప్పుకుని (బిల్లు మాత్రం గంజి లాగా లేదు, బెంజి రేంజిలో ఉంది .. ఈ సంగతి ఇదివరకే రాశాను గదా!) బయటపడ్డాం. శ్రీకరిని తను వెళ్ళాల్సిన చోటికి దింపేసి నేను నా తరువాతి ఎపాయింట్‌మెంటుకి పరిగెత్తా. అప్పటికే ఆలస్యం అవనే అయింది.

నారాయణ గూడా నించి నాంపల్లి గాంధీ భవన్ మరీ దూరం కాదన్నట్టు నాకు గుర్తు, కానీ ఆ ఇరుకు రోడ్లలోనుండి వెళ్ళేప్పటికి అరగంట పైనే పట్టింది. గాంధీభవన్ గేటు బయట ఆటో దిగి హడావుడిగా ఆవరణలో ప్రవేశించి నాకు సూచించబడిన ఎర్రరంగు కారు ఎక్కడున్నదా అని పరికిస్తుండగా, ఒక పక్కనించి "కొత్తపాళీ గారూ!" అని పిలుపు వినబడింది. అటు తిరిగి చూడగా, ఒక ఎర్రకారులోంచి స్నేహపూర్వకమైన చిరునవ్వుతో చెయ్యి ఊపుతూ .. ఆయనే సుబ్బారావు గారయి ఉండాలి. ఇంతలో ఆయనే కారు దిగి పలకరించారు. నిలువెత్తున, విశ్రాంత ఉపాధ్యాయుడినే అని చెప్పకనే చెబుతున్న హుందా అయిన విగ్రహం. ఇంకా ఆలస్యం చెయ్యడం ఇష్టం లేక ఇద్దరం వెంటనే కారెక్కగా, డ్రైవరు మా గమ్యం వేపుకి దారి తీశాడు. ఏ మాత్రం జాప్యం లేకుండా భలే గుర్తు పట్టారే! అన్నా సుబ్బారావుగారితో. ఏముందీ? మీ రూపం చూస్తేనే, ఇక్కడి వారు కారనీ, విదేశాలనించి వచ్చారనీ తెలిసేట్టు ఉన్నది. అటుపైన ఆవరణలోకి రావడం కొంత హడావుడిగా, చూపులతో వెతుక్కుంటూ వచ్చారు. ఒకవేళ ఆ వ్యక్తి మీరు కాకపోయినా, పోయిందేముంది, నా పిలుపుని పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్తాడు, అంతే కదా! అని నవ్వారు. ఆయన చూపులోని తీక్ష్ణత నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఎంతైనా కవి గదా అనుకున్నాను.

సుబ్బారావుగారు గుంటూరు జిల్లా నగరం కాలేజినించి విశ్రాంత ఆంగ్లోపన్యాసకులు, స్వయంగా ఇంగ్లీషులో మంచి కవి, కవిత్వ విశ్లేషకులు. ముఖ్యంగా తిలక్ కవిత్వాన్ని ఎంతో ఆర్ద్రతతో ఆంగ్లంలోకి తర్జుమా చేశారు (ఈ సంపుటి త్వరలో విడుదల అవుతుంది). వీరి పెద్దమ్మాయి డా. వైదేహి శశిధర్, అమెరికాలో పేరున్న తెలుగు కవయిత్రి. వారు అమెరికా వచ్చినప్పుడల్లా అడపాదడపా ఫోనులో మాట్లాడుకుంటూ ఉన్నాము గానీ ఇదే ప్రత్యక్షంగా కలవడం. శ్రీపాదవారి వడ్లగింజలు కథలో రాజావారూ శంకరప్పా తొలిసారి ఎదురుపడినప్పటిలా ఉంది ఆ సన్నివేశం, కనీసం నా మనసులో. గాంధీభవన్ నించి బయల్దేరి త్వరలోనే విశ్వనాథ సాహితీ పీఠం కార్యాలయానికి చేరుకున్నాము. పాతకాలపు ఇల్లువంటి భవన సముదాయం, అయినా చాలా చక్కగా మెయింటేన్ చేస్తున్నారు. ముందు ఆవరణలో మూణ్ణాలుగు కార్లు పార్కు చేసుకునే స్థలమే కాక పూల మొక్కలతో, చిన్న చెట్లతో ఆహ్లాదకరమైన ప్రదేశం. కార్యాలయం ముఖ్య భాగం విశాలమైన హాలు. పదిమంది కూర్చోవడానికి అనువుగా సోఫాలు, కుర్చీలు. తెల్లని వొత్తైన జుట్టుతో అంతే తెల్లని బట్టలలో డా. వెల్చాల కొండల్రావుగారి దర్శనం. ఆయనకి ఎనభై దాటాయంటే నమ్మడం చాలా కష్టం. ప్రభుత్వ కళాశాలల్లోనూ, అటుపై ఉన్నత విద్యా శాఖలోనూ ఉన్నత పదవులు నిర్వహించి అటుపై తెలుగు ఎకాడామీ సారధిగా పలు సంవత్సరాలు భాషా సేవ చేసి, ఇప్పుడు కొన్నేళ్ళుగా ఈ విశ్వనాథ సాహితీ పీఠాన్ని నెలకొల్పి నడుపుతున్నారు. మహాకవి, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి రచనలను విస్తృతమైన ప్రచారంలోకి తీసుకురావాలనేది ఈ సంస్థ ముఖ్యోద్దేశం. విశ్వనాథవారి రచనల పునర్ముద్రణ నేరుగా వారి వంశజుల చేతుల్లో ఉండగా, ఆ పనిని మినహాయించి, ఇతరమైన అనేక వనరులను (ఉదాహరణకు అనేక విడియోలు, ఆడియోలు) సేకరించడం, అనువాదాలు, విశ్వనాథ సాహిత్యాన్ని గురించి విశ్లేషణలు - ఇత్యాది ప్రయత్నాలను బహుముఖంగా చురుకుగా చేస్తున్నారు. ఇప్పటికే ఆంగ్లంలో Viswanatha A Literary Legend అనే పెద్దపుస్తకం వేశారు. ఇదికాక జయంతి అనే పేర ఒక త్రైమాసిక సాహిత్య పత్రిక నడుపుతున్నారు.

వారు ఇటీవల పూనుకున్న ఒక బృహత్కార్యం వేయిపడగలు నవలను ఆంగ్లంలోకి అనువదింపజేసి ముద్రించడం.ఆ అనువాదకుల బృందంలో నేను కూడా ఒకణ్ణి కావడం కొంత నా పూర్వజన్మ సుకృతం, కొంత సుబ్బారావుగారికి నామీద ఏర్పడిన వాత్సల్యమూను. ఈ అనువాదక బృందంలో డా. వైదేహి శశిధర్ అమెరికాలో ఉండగా, హైదరాబాదు వాస్తవ్యులైన డా. అరుణ వ్యాస్, డా. రేవూరి అనంతపద్మనాభరావు, శ్రీ పి. ఆత్రేయ శర్మ, శ్రీ సి. సుబ్బారావు గారలతో ఇది తొలి సమావేశం. అరుణగారు అప్పటికే వచ్చి ఉన్నారు. పద్మనాభరావుగారు మాతోపాటే రంగప్రవేశం చేయగా ఆత్రేయశర్మగారు మరి కొంతసేపటికి వచ్చి చేరారు. ముందుగా పీఠం కార్యకలాపాలను గురించి కొండల్రావుగారు చెప్పారు. తాము సేకరించిన విశ్వనాథవారి శ్రవ్యకాలు, ముఖ్యంగా కిన్నెరసాని పాటలు పాడినవి వినిపించారు. అటుపైన అనువాద ప్రక్రియను గురించీ, వేయి పడగలు అనువాదంలో శ్రద్ధ వహించవలసిన అంశాలను గురించీ లోతైన చర్చ జరిగింది. త్వరలోనే ఈ ఆంగ్లానువాదం పుస్తకరూపంలో వెలువరించాలని కొండల్రావుగారు అన్నారు. అల్పాహార విందు తరవాత కొన్ని ఫొటోలు తీసుకుని శలవు పుచ్చుకున్నాం. సుబ్బారావుగారు నన్ను మళ్ళీ నారయణగూడా చౌరస్తాలో దింపి వెళ్ళిపోయారు.
ఎడమనించి: పద్మనాభరావు, ఆత్రేయశర్మ, నారాయణస్వామి, కొండల్రావు, సుబ్బారావు, అరుణ వ్యాస్

ఉదయం పూట యుగాంతర్ ఆఫీసులో కలవడం మిస్సయిన మిత్రులు మదన్మోహన్ రావుగారొచ్చి కలిశారు. మేం కలిసి పనిచేసినప్పటి పాత జ్ఞాపకాలతో పాటు ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ప్రాజెక్టులని గురించి కూడా ముచ్చటించుకున్నాము. ఇంతలో బ్లాగు మిత్రులు, విలక్షణమైన రచయిత, పాత్రికేయుడు, నరేష్ నున్న వచ్చి కలిశారు కానీ ఆయనతో ఎక్కువసేపు ముచ్చటించే అవకాశం లేకపోయింది.
ఎడమనించి: నారాయణస్వామి, నరేష్, మదన్

అప్పటికే జ్యోతిగారు రెండు సార్లు ఫోన్ చేశారు, ఏంటి, ఎక్కడున్నారు అని. మేం పరస్పరం వీడుకోళ్ళు పుచ్చుకుని బయల్దేరుతుంటే మదన్ ఆ పూటకి తన కారు వాడుకొమ్మన్నారు. సరేనని మేం బయటికి వచ్చి చూస్తే డ్రైవరూ కనబడ్డు, కారూలేదు. మొత్తానికి ఓ ఐదునిమిషాల వెతుకులాట తరవాత డ్రైవరు సెల్లులో దొరికాడు. ఎక్కడున్నావు నాయనా అంటే, హోటలు కింద సెల్లారు పార్కింగులోకి కారు పెట్టానని చెప్పాడు. సరే బయటికి రమ్మంటే, అంతకు ముందే అక్కడ జరుగుతున్న ఏదో బిల్డింగు పనిలోనించి పల్చగా సిమెంటు కలిసిన బోలెడు నీళ్ళు ఆ దారిలో వొంపారు పనివాళ్ళు. ఆ ఇరుకైన సెల్లారు స్లోపు మీద, ఆ జారుడులో ఆ కారుని పాపం నానా తంటాలూ పడి బయటికి తెచ్చాడు, ఉపద్రవమేమీ జరక్కుండానే. మదన్ కి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుని కారెక్కి బయల్దేరాను. జ్యోతిగారింటికి ఐదు నిమిషాల్లో చేరతానని అంచనా. అరగంట పట్టింది!

తనిష్క్ ఎదురుగా గల్లీ అని చెప్పారు. ముందసలు ఆ తనిష్క్ కనబళ్ళేదు. లిబర్టీ సర్కిల్ దాకా వెళ్ళి, మళ్ళి చాంద్రాయణం తిరిగొచ్చాం. ఈ సారి జాగ్రత్తగా చూస్తే, మిగతా షాపులన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతుండగా తనిష్కు వాళ్ళు అప్పటికే లైట్లార్పుకుని కొట్టు కట్టేసుకుని వెళ్ళిపోయారు. మొదటి సారి అలా మిస్సయ్యాం. సరే ఈ సారి గల్లీ దొరికిందని తిరగ్గానే, అందులో రెండు గల్లీలు తెరుచుకున్నాయి. ఇదేదో నిజంగా ఏలిస్ ఇంద వండర్లాండ్ లాగుందని .. మొత్తానికి వాళ్ళింటికి మూడు సార్లు ప్రదక్షిణం చేసి అప్పటికి ఇల్లు పట్టుకోగలిగాను. అలా అరగంట వేస్టయింది. దారి సరిగ్గా తెలియకపోతే, గమ్యం మన పక్కనే ఉన్నా ఎంత గుడ్డితనంలో ఉంటామో కదా! జీవితంలో అనుభవించే అయోమయ అవస్థకి ప్రతీకలా అనిపించింది ఈ అనుభవం. జ్యోతిగారి భర్త గోవర్ధన్ గారు సాదరంగా ఆహ్వానించారు. అప్పటికే ఆలస్యం అయిందని వెంటనేనే భోజనం వడ్డించారు. కొద్దిగా నా ప్రయాణ విశేషాలూ, ఇంకా రకరకాల విషయాలను గురించి కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేశాము. ఆ రోజు భోజనంలో హైలైట్ కుబానీ కా మీఠా. నేనిది ఇంతకు మునుపెన్నడూ తినలేదు. అద్భుతంగా ఉన్నది. మరి కాసేపు కబుర్లు చెప్పుకుని ఇంక ఆ దంపతులవద్ద శలవు తీసుకున్నాను.

అప్పటికి పది దాటింది. హమ్మయ్య, రోజు ముగిసిందనుకున్నారా? తప్పులో కాలేశారు. రోజులోకెల్లా అతి ముఖ్యమైన, సరదా అయిన మీటింగుకి దారి తీశాను ఇక్కణ్ణించి.

అప్పటికి ట్రాఫిక్కు కొంచెం సద్దు మణగడంతో పదిహేను నిమిషాల్లోనే బంజారా హిల్సులో గమ్యస్థానం చేరుకున్నా. నా హోస్టులు సస్పెన్సు సినిమాలు తీస్తూ అదే బాగా అలవాటయిందేమో, అక్కడికొచ్చి ఫోన్ చెయ్యండన్నారు. ఫోన్ చేస్తే, అరె, అప్పుడే వచ్చేశారా అని ముందు ఆశ్చర్యపడి, ఇదిగో వచ్చేస్తున్నాం అని భరోసా ఇచ్చారు. నా దశ బాగుండి ఆ భరోసా వెనకాలే వాళ్ళూ సాక్షాత్కరించారు .. నవతరంగం నిర్వాహకులు, వర్ధమాన సినిమా దర్శకులు: వెంకట్ సిద్ధారెడ్డి, మహేశ్ కత్తి, సత్యప్రసాద్ అరిపిరాల. మధ్యలో సింగిల్ మాల్ట్ స్కాచి సీసా, చుట్టూ నాలుగు దప్పిక గొన్న మెదళ్ళు. సీసా ఖాళీ అయిందికానీ కబుర్ల బావి ఎండలేదు. నవతరంగం గురించీ, ఫేస్బుక్ గురించీ, సినిమాల్లో వాళ్ళ అనుభవాల గురించీ, ఎడారి వర్షం గురించీ, మునెమ్మ గురించీ, డా. కేశవరెడ్డి గురించీ, సాహిత్యాన్ని సినిమా తియ్యడంలో లోతుపాతుల గురించీ, సంగీతం గురించీ .. ఆ కబుర్లకి అంతులేదు.  నా డ్రైవర్ని వెనక్కి పంపేశాను, ఆలస్యమవుతోందని. రెండింటికి మహేశ్ శలవు తీసుకున్నారు. ఏ మూడున్నరకో సత్యప్రసాదూ, వెంకట్, నేనూ అక్కడే నడుం వాల్చాం.

 ఎడమనించి: మహేశ్ కత్తి, అరిపిరాల సత్యప్రసాద్, నారాయణస్వామి, వెంకట్ సిద్ధారెడ్డి.

Friday, December 6, 2013

పౌర్ణమి నించీ అమావాస్య దాకా - 2

బొంబాయి ఆసుపత్రిలో కోలుకుంటున్న మా పెద్దమ్మగారి సేవలో గడిచింది మొదటి రోజంతా. కొలాబా ప్రాంతం ఎప్పుడూ నన్ను అబ్బురపరుస్తూనే ఉంటుంది. ఇక పెద్దమ్మ ఉన్న గది పన్నెండో అంతస్తులో ఉండడంతో ఏ గవాక్షాన్నించి బయటికి తొంగిచూసినా ఆ వ్యూ మా గొప్పగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది వారి వారి విధి నిర్వహణలో కనబరిచిన శ్రద్ధ చూసి ముచ్చటేసింది. పేషెంట్ల భోజనావసరాలు చూసే అతనయితే పాపం నాక్కూడా టీ యిచ్చాడు. సాయంత్రం ఏడింటికల్లా ఐఐటీ నించి అన్నయ్యా, అన్నయ్య కొడుకూ, ఇంటి నించి వదినా వచ్చేశారు. దూరంగా ఉంటున్న చెల్లెలూ కుటుంబంతో సహా వచ్చి చేరారు. పలకరింపుల కోలాహలంతో మా పెద్దమ్మని కూడా అందరూ ఓ గంటసేపు ఆహ్లాదపరిచి, ఆసుపత్రివాళ్ళు విజిటింగ్ సమయం ముగిసిందని అదిలించగా బయటపడ్డాము. అక్కడికి దగ్గర్లోనే బలవాస్ అనే పూటకూళ్ళింటో భోజనం చేశాం. ఒక్కో వంటకమూ రూ. 250 రేంజిలో ఉన్నాయి. ఈ రేట్లు దేశమంతటా సర్వసాధారణమని తరవాత మెల్లగా తెలిసి వచ్చింది. ఆ సాయంత్రమంతా మా చెల్లి కొడుకులిద్దరితోనూ, మా అన్నయ్య కొడుకుతోనూ ముచ్చట్లాడుతూ హాయిగా గడిచింది.

మర్నాడు మా పెద్దమ్మని మరొకసారి పలకరించి, ఇంటికొచ్చి మళ్ళీ విమానాశ్రయం దారి పట్టాను. మధ్యాన్నప్పూట కావడంతో ఈ సారి ప్రయాణం గంటమ్ముప్పావు పట్టింది. ఇండిగో విమానంలో హైదరాబాదు చేరాలి. నేనేమో విదేశీ ట్రంకు పెట్టెల్తో దిగాను కదా. అక్కడికీ వాళ్ళు కొంచెం బరువు కన్సెషను ఇచ్చారు కానీ మిగతా బరువుకి అదనపు ఛార్జీ అన్నారు. ఆ చెల్లింపు చెయ్యడానికి వెళితే, వాళ్ళు ఎంతకీ తెమలరే! ఒక్కొక్క చెల్లింపు తీసుకోడానికీ వాళ్ళకి సరిగ్గా పది నిమిషాలు పట్టింది. చాలా ఇనెఫిషియెంట్ సిస్టం. అలా బొంబాయి ఏర్పోర్టులో వాళ్ళు ఎలా నెగ్గుకొస్తున్నారో మరి! తొందరగా చెకిన్ చేసి లౌంజులో హాయిగా కూర్చుని ఒక కాఫీ తాగుదామనుకున్న నాకు అడియాసే మిగిలింది. విమానమూ, ప్రయాణమూ బానే ఉంది.

హైదరాబాదులో యువమిత్రుడు అమిత్ వచ్చి రిసీవ్ చేసుకుని హైటెక్ సిటీ దగ్గర నా కాలేజి మిత్రుడు చక్రి వాళ్ళింటో దిగబెట్టి, నా వాడుకకోసం ఒక సెల్ఫోనిచ్చి వెళ్ళాడు. ఇక ఆ పూట వేరే పనులేమీ పెట్టుకోలేదు. చక్రి కుటుంబంతో ముచ్చట్లాడుతూ ఉండిపోయాను.

ఇక మర్నాడు మొదలైంది హడావుడి. కొన్ని తర్జన భర్జనల తరవాత దగ్గర్లోనే ఉన్న స్వాతి (బ్లాగరి, కవయిత్రి, కథకురాలు స్వాతి బండ్లమూడి) గారింటికి చేరుకున్నా సుమారు పదింటికల్లా. కొంతసేపటికి చావా కిరణ్ పుత్రికారత్నంతో సహా దర్శనమిచ్చారు. మరి కొంతసేపటికి బ్లాగాడిస్తా రవి రాకతో సందడి పెరిగింది. కాసేపు పాతకాలపు బ్లాగు జ్ఞాపకాలు నెమరేసుకున్నాం. పెళ్ళి చేసుకుని ఎవరు రాయడం మానేశారు, పిల్లలు పుట్టి ఎవరు రాయడం మానేశారు, ఇప్పుడు ఎవరెవరు ఏమేం రాస్తున్నారు - ఇలాంటివన్నీ ఓ సారి తిరగేశాం. ఇస్మాయిల్ స్మారక పురస్కారం పొందినందుకు నేను ఆమెని అభినందించలేదని స్వాతి కొంచెం సేపు నామీద అలిగారు. అలక తీరినాక తాజా జామకాయ ముక్కలు పెట్టారు అందరికీ. రవితో కాసేపు ఆయనకిష్టం లేని విశ్వనాథ రచనలని గురించీ, కాసేపు ఆయనకిష్టమైన సంస్కృత రస గుళికల గురించీ మాట్లాడుకున్నాం - అంటే, ఆయన చెబుతుండగా మేం విన్నాం చాలా మట్టుకి. అక్కడే భోజనం చేసి బయల్దేరుతుంటే స్వాతిగారు డ్రైవర్నిచ్చి కారులో పంపారు. రవిని వాళ్ళ ఆఫీసు దగ్గర దింపేసి నేను మెహిదీపట్నం దగ్గర మా బాబాయిగారింటికి వెళ్ళాను.

బాబాయి వాళ్ళతో ఓ రెండు గంటలు కబుర్లాడుకున్నాక అక్కణ్ణించి ఆటోలో బంజారా హిల్సులోని సాక్షి కార్యాలయానికి వెళ్ళాను. ఆటో వందరూపాయలు అడిగాడు. ఎక్కువేననిపించింది గానీ బేరమాడే ఓపిక లేక, సరైన రిఫరెన్సు పాయింటూ లేక సరేనని వెళ్ళాను. ముస్లిం అబ్బాయి. ఆటో సంపాదన పరవాలేదు, అవసరాలు బాగానే గడుస్తున్నాయి. కానీ పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఇద్దరు పిల్లల్లో అమ్మాయి పెద్దది, పదో తరగతి చదువుతోందిట ప్రభుత్వ పాఠశాలలో. బాగా చదువుతుంది, పైకి చదివించు అని టీచర్లు, పక్కవాళ్ళు సలహా ఇస్తున్నారుట. కాలేజి ఖర్చులు తట్టుకోగలనా అని ఇతను జంకుతున్నాడు పాపం. దిగేటప్పుడు ఒప్పుకున్న వందకి ఇంకో ఇరవయ్యిచ్చి, పిల్లలకిమ్మని నాలుగు చాక్లెట్ల్ఇచ్చి సాక్షి ఆఫీసులోకి నడిచాను.
 
మూడేళ్ళ కిందట సాక్షి ఆఫీసు బయట ఉన్న సెక్యూరిటీ హడావుడి ఇప్పుడు లేదు. సునాయాసంగానే అన్వరు డెస్కు చేరుకున్నాను. ముందు కాసేపు పాత కబుర్లు నెమరేసుకున్నాము - బ్లాగుల్లో పరిచయం, అతను నా కథల పుస్తకానికి బొమ్మలు వెయ్యడం, ఇవన్నీ. ఇంతలోకే బయటినించి అరిపిరాల సత్యప్రసాద్, సాక్షి లోనించే పూడూరి రాజిరెడ్డి, వేంపల్లి షరీఫ్ వచ్చి కలిశారు. ఏంటేంటో చాలా మాట్లాడేసుకున్నాం. అటు తిరిగి, ఇటు తిరిగి చర్చ - ఎందుకు రాస్తున్నాం? ఎవరు చదువుతారు? దగ్గరికొచ్చి ఆగింది. కవిసంగమం ద్వారా కవిత్వంలో మంచి చైతన్యం వచ్చింది, యువకవులు బాగా రాస్తున్నారు, కథలకి కూడా ఒక సక్రమ ప్రాతిపదికన ఇలాంటిదేదైనా చెయ్యాలి అని ఒక ప్రతిపాదన వచ్చింది. అటుపైన నా ఫేవరెట్ ప్రశ్న - ఎందుకు తెలుగు సాహిత్య పుస్తకాల్ని హెచ్చు సంఖ్యలో అమ్మలేకపోతున్నాం? అనేది వాళ్ళ ముందు పెట్టాను. ఈ ప్రయాణంలో నాకు దొరికిన ప్రతీ వేదిక మీదా ఈ ప్రశ్నని లేవనెత్తుతూనే వచ్చాను. అక్కడక్కడ చర్చల్లో రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి, కానీ ఏదైనా చివరికి కార్యాచరణగా పరిణమించాలి గదా! అన్వరు ఇప్పించిన టీ తాగి అందరం క్యూబికిల్ బయటికి వచ్చేప్పటికి అదే ఫ్లోరులో ఖదీర్ బాబు కూడా ఉన్నారని తెలిసింది. ఆయన క్యూబికిల్ కి వెళ్తే అక్కడ జి.ఆర్. మహర్షిగారు కూడా ఉన్నారు. ఇదేదో చారిత్రాత్మక సందర్భంలా ఉన్నదని చెప్పి, ఆ అవకాశం మిస్సవకుండా ఒక మంచి గ్రూప్ ఫొటో తీసుకున్నాం.
ఇందులో ఎడమనించి: అన్వర్, సత్యప్రసాద్, ఖదీర్ బాబు, నారాయణస్వామి, జి. ఆర్. మహర్షి, రాజిరెడ్డి, షరీఫ్
ఇంకా చెప్పుకోవాల్సిన కబుర్లు చాలానే ఉండిపోయినా (ఇలాంటి బృందాలతో కలిసినప్పుడు ఆ కబుర్లకి అసలు అంతు అంటూ ఉంటుందా?) ఎవరికీ వెళ్ళిపోవాలని లేకున్నా - వాళ్ళకేమో పని సమయం కావడం వల్లనూ, నేనేమో నా తరువాయి ఎపాయింటుమెంటుకి అప్పటికే ఆలస్యమయి ఉండడంతోనూ, ఇంక తప్పనిసరై శలవు పుచ్చుకున్నాం.

అక్కణ్ణించి మళ్ళీ ఆటోలో పాత ఎమ్మెల్యే క్వార్టర్సు దగ్గర అక్షరసీత గారి ఆఫీసుకి చేరుకున్నా. అక్కడ తానాపత్రిక నిర్వహణలో నా తోటి శ్రామికులు సీత, వాసిరెడ్డి నవీన్ కలిశారు. కొంతసేపు తానాపత్రిక నిర్వహణ వ్యవహారాలు మాట్లాడుకున్నాక, కొత్త పుస్తకాలు ఏం వస్తున్నాయి, కథల్లో ఏం ట్రెండ్స్ నడుస్తున్నాయి, పత్రికల స్టాండర్డ్ ఎలా ఉంది అని కాసేపు ముచ్చటించుకున్నాం. నా అదృష్టం బాగుండి నవీన్ తాను కూడా జుబిలీహిల్స్ వేపుకే వెళ్ళాలని బయల్దేరారు. సీతాగారిని ఇంట్లో దింపేశాక దాదాపు ముప్పావు గంత ప్రయాణంలో హైదరాబాదులో మాకిద్దరికీ కామన్ సాహిత్య మిత్రులందరినీ ఒకసారి తలపోసుకున్నాం.

జుబిలీహిల్స్ సెలబ్రేషన్స్ అనే పూటకూళ్ళింట్లో మా ఆర్యీసీ క్లాస్మేట్లు ఇరవైమంది సన్నిహిత మిత్రులతో విందు ఈ రోజు ఆనందానుభవానికి పరాకాష్ఠ. కవిమిత్రుడు విన్నకోట రవిశంకర్ కూడా ఆ సమయానికి హైదరాబాదులో ఉండి ఈ విందులో కలవడం చాలా ఆనందమైంది. సిబీఇ జేడీ లక్ష్మీనారాయణ, నెల్లూరు వాణిజ్య పన్నుల అధికారి మొహమ్మద్ ఇంతియాజ్, ఇటీవలే ఉద్యోగరీత్యా హైదరాబాదుకి బదిలీ అయి వచ్చిన మిత్రుడు కొండల్రావు - వీళ్ళంతా కలవడం అదనపు ఆనందం. మధ్య మధ్యలో భాస్కర్ సరికొత్తగా తీస్తున్న సినిమా విశేషాలు. ఆర్యీసీ వాళ్ళు నలుగురొక్క చోట చేరారంటేనే ఆ సందడి చెప్పనలవి గాదు. ఇక ఇరవైమందంటే మాటలా. సెలబ్రేషన్స్ లో భోజనం చాలా బావుంది. బహుశా ఈ ప్రయాణంలో ఇళ్ళల్లో తిన్నవి కాక నేను ఆస్వాదించిన మేలైన భోజనం ఇదే.

Thursday, December 5, 2013

పౌర్ణమి నించీ అమావాస్య దాకా - 1

అమెరికాలో బయల్దేరడం కార్తీకపౌర్ణమినాడే బయల్దేరినా, భారతదేశపు గడ్డపై అడుగు పెట్టేటప్పటికి కృష్ణ విదియ వచ్చేసింది. ఒక చేతిలో కేశవరెడ్డి మునెమ్మ, మరో చేతిలో అమిష్ ఓతాఫ్ది వాయుపుత్రాస్ పట్టుకుని విమానమెక్కాను గానీ ఏదీ చదవబుద్ధి కాలేదు. అలాగని నిద్రా పట్టలేదు. ఫ్రంక్ ఫర్టులో దిగేసరికి ఎక్కడి నిస్త్రాణాను. జెడ్ టెర్మినల్లో కాస్త ప్రశాంతంగా ఉన్న ఓ మూల చూసుకుని, నాలుగు సీట్ల మీద కాళ్ళు చాపుకుని హాయిగా ఓ రెండు గంటలు నిద్రపోయాను, సీట్ల మధ్యన కరావలంబనములు పెట్టని ఆ దిజైనరుని మనసులోనే అభినందిస్తూ.

లేచాక అవసరమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఓ నాలుగు మైళ్ళు నడిచి బొంబాయి ఫ్లైటు ద్వారాన్ని చేరుకున్నాను. ఆ విమానాశ్రయం వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి అంత దూరం నడిపించారు గానీ, నేను చేరుకున్న చోటు బయల్దేరిన చోటుకి కూతవేటు దూరంలోనే ఉన్నదని నా అనుమానం. ఎనీవే, కాస్త సేదతీరి ఉండడంతో ఈ సారి ఫ్లైట్లో మూడ్ బానే ఉండి, మునెమ్మ మొత్తమూ, వాయుపుత్రాస్ ఓ వంద పేజీలూ చదివేసి, Planes సినిమా చూశాను. కాస్త కునుకు పట్టిందో లేదు, విమానపు కుదుపుతో బొంబాయిలో దిగామని అర్ధమయింది.

బయటికొచ్చి ఇక సామాన్లకోసం వెయిటింగు. చాలా ఇరుకైన స్థలం, విపరీతమైన రద్దీ. ఈ విషయంలో మాత్రం మనవాళ్ళని బాగు చెయ్యలేం. అదేమి ఆత్రమో అర్ధం కాదు. ఎనీవే. ఆ సామాన్లు అంత తొందరగా ఊడి పడవని అర్ధమయింది. కనీసం అక్కడ ఒక కాఫీ/టీ అమ్మే స్టాలు కూడ లేదు. వాడి పుణ్యమాని కనీసం టయిలెట్ల వసతినిచ్చారు. ఒక మూలగా చతికిల పడి చోద్యం చూస్తున్నా. నా పక్కన ఇంచుమించుగా నా వయసే ఉన్న ఇంకొకాయన చతికిల పడ్డారు. ఇద్దరం పిచ్చాపాటీ కొనసాగించాము. ఆయన ఉద్యోగం నేవీలో. ఐతే, ప్రవృత్తి బాడీ బిల్డింగ్ లో జాతీయ స్థాయి కోచ్. బుడపెస్టులో జరిగిన ఒక అంతర్జాతీయ పోటీకి భారతీయ యువకుల దళాన్ని తీసుకెళ్ళి తిరిగి వస్తున్నారట. అప్పుడు గమనించాను, అతనికి కనుసన్నల్లో మసలుతున్న ఐదారుగురు యువకుల్ని, మంచి అవయస్వ స్ఫుటత్వంతో మెరుస్తున్నారు. మొత్తం ఎనిమిది మెడళ్ళు సాధించారుట. భారత్ లో క్రికెట్ తప్ప ఇంకే క్రీడా రాణించక పోవడమూ, అప్పటికింకా చల్లారని సచిన్ మేనియా, అయినా వివిధ క్రీడల్లో మంచి ప్రతిభని చూపుతున్న నేటి తరపు యువకుల ఆత్మ విశ్వాసమూ - ఇలాంటి విషయాలు ముచ్చటించుకున్నాం కాసేపు.

విమానం దిగి మేం బయటికి వచ్చాక అక్షరాలా రెండు గంటల తరవాత నా సామాన్లు ఊడి పడ్డాయి. ఇంకా ఓ వంద మందిదాకా ప్రయాణికులు వారివారి సామాన్ల కోసం చూస్తున్నారు అప్పటికి. బతుకు జీవుడా అని బయటికి నడిచాను. కస్టంసువారేమీ కష్టపెట్టలేదు. సాధారణ ప్రీపెయిడు టేక్సీ దగ్గర పొడుగాటి క్యూ ఉంది. ఇటుపక్క ప్రైవేటు కంపెనీల కిటికీల దగ్గర క్యూలేదు. మేరులో బుకింగ్ చేశాను. అంతా ఎఫిషియెంట్ గా జరిగింది. డ్రైవరు కుర్రవాడే. యూపీ అబ్బాయి. ఐదేళ్ళుగా బొంబాయిలో టేక్సీ నడుపుతున్నాడట. మాహిం సీ లింక్ అబ్బుర పరిచింది అంత చీకట్లోనూ. నేవీనగర్లో ఒకసారి దారి తప్పాము గానీ, నేవీ గార్డుల పుణ్యమాని త్వరగానే గమ్యస్థానం చేరుకున్నాను. సుమారు 28 కిలో మీటర్ల ప్రయాణానికి సరిగ్గా గంట సమయమూ, వెయ్యి రూపాయల ఖర్చూ అయింది. తెల్లారి అయిదింటికి TIFRలో మా అన్నా వదినల ఫ్లేటుకి చేరుకున్నా. కిటికీలో, అప్పుడప్పుడే తెల్లబడుతున్న ఆకాశంలో అస్తమిస్తున్న కృష్ణవిదియ చంద్రుడు!

మా అన్నయ్య ఓ గిద్దెడు మంచి కాఫీ ఇచ్చాడు. అది చప్పరిస్తూ ఆయనతో ఓ రెండు గంటలు కబుర్లాడి, ఆయన్ని ఐఐటీకి సాగనంపి పడి నాలుగ్గంటలు నిద్రపోయాను.