Wednesday, July 17, 2013

చిన్నప్పటి చెరువులో ఓ మునక

బాల్యమంతా మధురం అనే ఆలోచన నేనెప్పుడూ ఒప్పుకోను గానీ, ఓ తీరిక వేసవి మధ్యాన్నం మనసు అలా బాల్యవీధిలోకి షికారెళ్ళొస్తే, అక్కడ చిన్నప్పటి చెరువు గాలి హాయిగా సోకుతుందన్న మాట మాత్రం నిజం. నాకివ్వాళ్ళ కొంచెం సోకింది.

ఆఫీసుకి కావల్సిన వస్తువులేవో కొనడానికి స్టేపుల్స్ కొట్టుకి వెళ్ళాను. వాళ్ళు అప్పుడే Back To School సంరంభం మొదలెట్టేశారు. రకరకాల నోటు బుక్కులు - రంగుల్లో, పరిమాణంలో, అట్టల్లో ఎంత వైవిధ్యం! రూళ్ళున్నవి, లేనివి, సన్నపాటి రూళ్ళవి. ఇంకా రకరకాల పెన్నులు, రంగు రంగుల పెన్నులు, రకరకాల పెనిసిళ్ళు, ఇరేజర్లు, ఇవన్నీ పెట్టుకోడానికి రకరకాల డబ్బాలు. ఒక్కసారిగా వెనక్కెళ్ళి ఐదో తరగతిలో చేరిపోవాలనిపించింది నాకు.

బడి తెరిచే ముందు కొత్త పుస్తకాలు తెచ్చుకుని, వాటికి బ్రౌను పేపరు అట్టలు వేసుకుని, లేబుల్స్ అంటించి, నీటుగా పేరు రాసుకుని .. అదంతా పెద్ద పరిశ్రమ. వుట్టినే లేబులు మీద మాత్రమే రాసి ఉంటే, ఎవరైనా ఆ లేబులు చించేసి మన పుస్తకం కొట్టేస్తే? అందుకని ఎక్కడో పుస్తకం మధ్యలో ఇంకో పేజీలో రహస్యంగా పేరు రాసుకోవడం!

ఐదో తరగతి దాకా పెనిసిలుతోనే రాసుకోవడం. నటరాజ్ కానీ, అప్సర కానీ. నేను ఎప్పుడూ పెనిసిళ్ళు పారేసుకునే వాణ్ణి, లేకపోతే క్లాసులో ఎవరికో దానధర్మం చేసే వాణ్ణని మా అమ్మ నాకెప్పుడూ పూర్తి సైజు కొత్త పెనిసిలు ఇచ్చేది కాదు. ఒక పెనిసిల్ని సగానికి విరిచి, సగం ముక్కే ఇచ్చేది. నేను చదివిన బళ్ళో ఎవడి దగ్గరా పెనిసిలు చెక్కుకునేందుకు షార్పెనర్ ఉండేది కాదు. ఒకేళ ఎవడి దగ్గరన్నా ఉంటే వాడు పోజు గాడి కింద లెక్క. ఇంచు మించు అందరి దగ్గరా నాన్నలు గెడ్డాలు గీసుకుని పారేసిన, సగం విరగ్గొట్టిన రేజరు బ్లేడు ముక్కలే ఉండేవి. ఈ బ్లేడు ముక్కతో పెనిసిలు చక్కగా చెక్కడం ఒక గొప్ప కళ. ప్రతీ క్లాసులోనూ ఇద్దరో ముగ్గురో ఉండేవాళ్ళు ఈ కౌశలం కలిగిన వాళ్ళు. వాడికి ఓ జాంకాయో, ఒక ఐసుఫ్రూటో లంచం పెట్టి నున్నగా, సూది మొనగా పెనిసిలు చెక్కించుకోడం ఓ గొప్ప. ఇరేజర్లు కూడా కొంచెం అరుదుగానే ఉంటుండేవి. మేం చాలా కాలం వాటిని అచ్చ తెలుగులో లబ్బరి అనేవాళ్ళం. కొంచెం తెనుగుమీరాక రబ్బరు అనడం నేర్చాం. ఐదు పైసలకీ పది పైసలకీ దొరికే రబ్బర్లు చాలా మోటుగా ఉండేవి. వాటితో తుడిపితే పేజీ చిరిగిపోయేది. కాకపోతే వీటితో చాల అదనపు ప్రయోజనాలు ఉండేవి. నెత్తికి రాసిన కొబ్బరి నూనె (క్లాసులో కనీసం పది మందైనా మెడమీదికి కారే లెవెల్లో నూనె రాసుకొచ్చేవాళ్ళు) ఈ రబ్బరుకి పట్టించి, దాన్ని అచ్చు పుస్తకం పేజీల మధ్యలో నొక్కి పడితే, ఆ అచ్చు ఈ రబ్బరుకి అంటుకునేది. అదో గొప్ప వినోదంగా ఉండేది మాకు. కానీ అచ్చు పుస్తకాల్ని ఖరాబు చేస్తున్నాం అని అటు టీచర్లు, ఇటు ఇంట్లోవాళ్ళు ఇద్దరూ వాయగొట్టేవాళ్ళు. ఆ తరవాత యెప్పుడో ఇంచుమించుగా పెనిసిళ్ళ అవసరం తీరిపోయాక నాజూకు ఇరేజర్లు, సెంటు వాసన వచ్చే, ఆకర్షణీయమైన రంగుల ఇరేజర్లు వచ్చాయి.

 ఆరో తరగతిలో కలాలు మొదలు. మేప్ పాయింటింగ్ కోసమూ, సైన్సు బొమ్మల కోసమూ కలర్ పెనిసిళ్ళ వాడకం మొదలైంది కూడా ఆరులోనే. అప్పటిదాకా జీవితం బ్లాకండ్వైటే :) ఎలాగూ రంగు పెనిసిళ్ళు వాడనిస్తున్నారు కదాని నోటు బుక్కుల్లో హెడింగులకీ సబ్ హెడింగులకీ కింద ఏదో ఒక రంగు (సాధారణంగా ఎరుపు రంగు) పెనిసిలుతో అండర్లైన్ గీతలతో అలంకారాలు అద్దటం ఒకటి. ఆరులోనే చేతికందిన మరో మంత్రదండం జామెంట్రీ (అప్పుడు అలాగే అనేవాళ్ళం) బాక్సు. వృత్తలేఖిని, కోణమానిని - ఈ రెండిటితో ఏం చేస్తామో చెప్పుకోండి చూద్దాం!

కలం అంటే ఫౌంటెన్ పెన్నే. బాల్ పెన్నులు ఎక్కువగా ఉండేవి కావు. పైగా టీచర్లు కూడా ఒప్పుకునే వారు కాదు. బాల్ పెన్ తో రాస్తే చేతివ్రాత చక్కగా ఉండదని వాళ్ళకి గాఢనమ్మకం. అదీ కాక అప్పట్లో వచ్చే రీఫిళ్ళు ఊరికే ఇంకు కారేవి. ఆ ఇంకు చొక్కాకి అంతుకున్నదంటే జన్మలో వదలదు. జీవితంలో పెన్నులు ప్రవేశించంగానే ఇంకే మారక ద్రవ్యంగా ఇంకు మీద ఆధారపడిన ఒక వాణిజ్య ఆర్ధిక వ్యవస్థ కూడా మా జీవితాల్లో ప్రవేశించింది. మా యింట్లో బ్రిల్ రాయల్ బ్లూ వాడేవాళ్ళము. కానీ చాలా మందికి ఇళ్ళల్లో ఇంకు బుడ్డి ఉండేది కాదు. అందుకని బడికి వస్తూ వస్తూ వీధి దుకాణంలో ఐదు పైసలకి ఇంకు పోయించుకునే వాళ్ళు. సాధారణంగా ఆ ఇంకు నీళ్ళగానూ, కొంచెం హీనపక్షంగానూ ఉండేది. ఒకసారి ఫైనలు పరీక్షలు జరుగుతుండగా ఒక పిల్ల రాయడం మానేసి దిక్కులు చూస్తోంది. టీచరుగారు ప్రశ్నించిన మీదట ఇంకు ఐపోయింది అని చెప్పింది. టీచరుగారు అదేమిటే, పరిక్షకి వస్తూ ఇంకు నింపుకోవాలని తెలీదా అంటే .. నిన్నటి రోజున ఒక మిత్రురాలికి అరపెన్నుడు ఇంకు అప్పిచ్చిందిట. ఇవ్వాళ్ల ఆ స్నేహితురాలు అప్పు తీరుస్తానందిట. అందుకని అమ్మడు పాపం ఇంకు నింపుకోకుండా వచ్చింది. మొత్తానికెలాగో ఆ స్నేహితురాలు పరిక్షకి ముందు అప్పు తీర్చలేదు. టీచరుగారు ఋణదాతనీ, గ్రహీతనీ ఇద్దర్నీ నాలుగు పీకారు పాపం. ఏప్రిలు ఫస్టుకి మాత్రం ఈ ఇంకు పెన్నులు మరొకందుకు బ్హలే పనికొచ్చేవి

ఈ తీపిచింతపండు బ్లాగులో..అప్పటి ఉపకరణాలు చాలా వాటిని తల్చుకున్నారు

హైస్కూలు కొచ్చేప్పటికి పొడుగు నోటు పుస్తకాలు, బాల్ పెన్నులు అలవడినాయి. పిల్ల వేషాలు చాలా మట్టుకి తగ్గి పోయాయి. అచ్చు పుస్తకాలు కూడా పొడుగు వెడల్పు బాగా పెరిగాయి. ఆ సమయంలోనే డిటెక్టివు పుస్తకాలు అద్దెకి తెచ్చుకోవడం కూడ పరిచయమయింది. కుర్చీలో కదలకుండా కూర్చుని పాఠం చెప్పే మాస్టార్ల క్లాసులో, అచ్చుపుస్తకంలోనో, నోటు పుస్తకంలోనో దాచి పెట్టి డెటెక్టివులు చదవడం ఒక గొప్ప ఎడ్వెంచర్. ఇవ్వాళ్ళ స్టెపుల్స్ కొట్లో చూసిన ఒక అద్భుతమైన వస్తువు ఇది.


పుస్తకానికి తొడిగేందుకు గుడ్డతో కుట్టిన చొక్కా (కవర్) ఇది. 
వార్నీ, ఇట్లాంటిది మా హైస్కూలు రోజుల్లో ఉండి ఉంటే .. !

Wednesday, July 10, 2013

వివిధ సైట్లలో ఇటీవల ప్రచురించిన కథలు, వ్యాసాలు - ఒకచోట