Sunday, February 10, 2013

రామజోగి మందు భవరోగాలకి సరైన చికిత్సరామభక్తి సామ్రాజ్యవాసి రామదాసు

కంచెర్ల గోపన్న ఉద్యోగానికి తహసీల్దారు అయుండవచ్చునుగానీ ఆయన మనసూ జీవితమూ మాత్రము శ్రీరామునికే అంకితమైనవి.
రామదాసు కీర్తనలను తొలిసారిగా విన్నప్పుడు వరదగోదావరిలాగా పొంగిపొరలే రామభక్తి మనలను ముంచివేస్తుంది. సాహిత్యంలోని సరళత, పాడుకోవడంలో సౌలభ్యమూ మనలను ముగ్ధుల్ని చేస్తాయి. పారవశ్యంలో చిందు వేస్తున్న భక్తుని తూగువంటి లయ మనలను ఊపేస్తుంది, లేచి చిందెయ్యమటుంది. ఒక మూల ఏకాంతంలో కూర్చుని తాటాకులమీద గంటంతో రాసినవి కావు కీర్తనలు. తోటి భక్తులతో చేరి రాముని సన్నిధిలో మైమరచి ఉండగా, తన మానస పర్వతాలలో రామభక్తి ఊటలూరి, పాయలు గట్టి ప్రవహించిన సాహిత్య స్రవంతులివి, సంగీత ఝరులివి.

రాముడుంటే చాలు, రామభక్తి ఉంటే చాలు, ఆహా రామనామం ఎంత మధురం, భవరోగములన్నిటికీ విరుగుడైన మందు కదా రామనామం - ఇటువంటి భక్తిభావన చిప్పిల్లే కీర్తనలు అనేకం. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకూ, తారకమంత్రము కోరిన దొరికెను, పాహి రామప్రభో, రామజోగి మందు గొనరే - ఇటువంటి కీర్తనలలో లక్షణాలు ప్రస్ఫుటంగా ప్రకటించబడినాయి. ఇది భక్తి సాహిత్యానికి మొదటి లక్షణం. ఇదిలా ఉండగా, నా మొరాలకించవయ్యా నన్ను రక్షించవయ్యా, అని మొరబెట్టుకుంటూ నా మాట వినవా, నన్ను పట్టించుకోవా అని నిష్ఠూరమాడే కీర్తనలు - ఏతీరుగ నను దయజూచెదవో, ఎటు పోతివో రామ, పలుకే బంగారమాయెనా - ఇటువంటి పాటలలో తన ప్రభువు పట్ల భక్తితో పాటు స్వామికి అతి చేరువ అయిన ఒక చెలికాని చనువు మనకి వినిపిస్తున్నది. నేనెంత మొరబెట్టుకున్నా స్వామి వినడంలేదు అని చెప్పి, అయ్యవారిని కాదని అమ్మవారిని ఆశ్రయించాడు - రామచంద్రులు నాపై చలము జేసినారు, సీతమ్మా, చెప్పవమ్మా; ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ - అంటూ.

లోకప్రసిద్ధమైన రామదాసు చరిత్రములో ఆయన లౌకికంగా చాలా కష్టాలు అనుభవించాడనీ, గోల్కొండనవాబు తానీషావల్ల ఖైదు చెయ్యబడినాడనీ తెలుస్తున్నది. సరే, భక్తునికి కష్టాలు వచ్చినప్పుడు మరి తన స్వామితోకాక ఎవరితో చెప్పుకుంటాడు అని మనం సరిపెట్టుకోవచ్చు. అమ్మవారి సిఫారసు కోరడం కూడా అంగీకరించవచ్చు. ఐతే రామదాసు నిష్టూరాన్ని దాటి ఎకసెక్కానికి పూనుకున్నాడు. పాహిమాం శ్రీరామా అంటే పలుకవైతివి అనే కీర్తనలో వినబడే వెక్కిరింపు, మనం సాధారణంగా సంభాషణలలో వాడే - అబ్బబ్బో, అయ్యయ్యో, ఆహాహా - వంటి ఆశ్చర్యార్ధకాలతో మనకి కూడా ఆశ్చర్యం కలిగించడమేగాక, చక్కని అనుప్రాసలతో సాగే ఎకసెక్కెం గిలిగింతలు పెట్టేట్టుగా ఉన్నది.
ఉదాహరణకి ఒక చరణం -
ఇబ్బందినుండీ కరి బొబ్బ పెట్టినంతలోనే
గొబ్బున కాచితివట జబ్బుసేయక
నిబ్బరముగా నెంతో కబ్బమిచ్చి వేడుకున్న
తబ్బిబ్బు చేసెదవు రామ, అబ్బబ్బబ్బా
బహుశా రాజభటులు పెట్టిన చిత్రహింసలు భరించలేక కావచ్చును - ఇక్ష్వాకు కులతిలక అనే కీర్తనలో భద్రాచల రామునికీ ఆయన పరివారానికీ తాను తయారుచేయించి అర్పించిన విలువైన ఆభరణాలన్నిటినీ ఏకరువు పెట్టి, నీ తండ్రి దశరధ మహారాజు పెట్టేనా, లేక నీ మామ జనకమహారాజు పంపేనా - ఇవన్నీ అని రాముణ్ణే నిలదీశాడు. కలికి తురాయి నీకు మెలుపుగ జేయిస్తి, నీవు కులుకుచు తిరిగెదవు ఎవడబ్బ సొమ్మని అని కోపం చేశాడు. మళ్ళీ వెంటనే తను చేస్తున్న అపచారం జ్ఞప్తికి వచ్చింది కాబోలు, తిట్టితినని ఆయసపడవద్దయ్యా, దెబ్బలకోర్వక తిట్టితినయ్యా అని మళ్ళీ తానే రాముణ్ణి అనునయించాడు. విధంగా రాముని పట్ల ఒక భక్తునిగానే కాక, నిష్టూరమాడే చనువున్న ఒక చెలికానిగా, అమ్మవారి దగ్గర మారాము చేసే పసిపిల్లవానిగా, కోపం చేసుకోగలిగే ఒక పెద్దన్నగా గోపన్న మనకి ఆయన కీర్తనలలో దర్శనమిస్తున్నాడు.

తెలుగులో పదకవితకి ఆద్యుడు, భక్తి కవిత్వానికీ, అనన్యసామాన్యమైన కల్పనాశక్తికీ చిరునామా అయినటువంటి తాళ్ళపాక అన్నమాచార్యుడు రామదాసుకి సుమారు రెండువందల సంవత్సరాల ముందటివాడు. రామదాసుకి అన్నమాచార్యుల గురించి తెలుసునా, అన్నమయ్య పదరచన ప్రభావం రామదాసు కీర్తనలమీద ఉన్నదా అని ఇదమిత్థంగా చెప్పలేము. కానీ అందుబాటులో ఉన్న రామదాసు కీర్తనలను పరిశీలించగా ఇటువంటి ప్రభావం లేదనే అనిపిస్తున్నది. రామదాసు కీర్తనలలో వినబడే గొంతు భక్తితో నిండి ఉన్నప్పటికీ అమాయకంగానూ, ఒకింత వేడికోలుగానూ ఉంటుంది తప్ప అన్నమయ్యలోని శృంగార శిఖరాలుగానీ వేదాంతపు లోతులుగానీ కనబడవు. భాగవతాన్ని తెనిగించిన పోతన మహాశయుని ప్రభావం ఏమన్నా ఉంటే ఉండవచ్చుగజేంద్రమోక్షము, ప్రహ్లాదచరిత్ర వంటి భాగవతంలో ప్రసిద్ధ ఘట్టాల ప్రస్తావన రామదాసు కీర్తనలలో తరచు కనిపిస్తుంది. రాముణ్ణి కేవలం రామావతారంగా కాక, పరబ్రహ్మ స్వరూపమైన శ్రీమన్నారాయణునిగా భావించి పూజించడం కనిపిస్తుంది. ఒక పక్కన ఏమిరా రామా అని చనువుగా సంబోధిస్తూనే, మరొకపక్క రామచంద్రులు నాపై చలము చేసినారు - అని మర్యాదావాచకమైన బహువచనం వాడుతూ, ఒక ప్రభువుపట్ల సేవకుడు కనబరిచే కైంకర్య స్వభావమూ కనబడుతుంది. కైంకర్య స్వభావం వైష్ణవ మత లక్షణం. కానీ గోపన్న అన్నమయ్యలాగా స్మార్తాన్ని వదిలి వైష్ణవం స్వీకరించలేదు. పోతన వలెనే తన రామభక్తియే తనకు చాలు ననుకున్నాడు కాబోలు.
తెలుగు సంస్కృతిమీద, సాహిత్యం మీద, సంగీతం మీద రామదాసు కీర్తనలు వేసిన ముద్ర చెరిపివేయలేనిది. పామరులైనా అతి సులభంగా పాడుకునేందుకు అనువైన సరళమైన భాష, సంకీర్తన పద్ధతిలో, భజనపద్ధతిలో సాగే సంగీతమూ కలిసి ఉండడం వలన అటు వీధిలో సంకీర్తన చేసుకుంటూ తిరిగే హరిదాసులకీ, ఇటు ఇంటిలో పనీ పాటా చేసుకుంటూ కూని రాగాలు తీసుకునే ఆడవారికి కూడా నిత్యం నోటిలో నానుతూ వచ్చాయి కీర్తనలు. అంతే కాక, రామ భజన, చెక్కభజన, కోలాటం వంటి జానపద కళారూపాలకు వెన్నుదన్నుగా వెలసినాయి. అలా పాటలు తెలుగుప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయినాయి. అంతేకాక సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీత్యాగరాజస్వామిని బలంగా ప్రభావితం చేసినాయి. రామదాసుకి నూటయాభయ్యేండ్ల తరువాతివాడైన త్యాగయ్య, ఎక్కడో తంజావూరు దగ్గరనున్న తిరువయ్యారులో నివాసముండినవారు, రామదాసుని తన ఆధ్యాత్మిక గురువుగా భావించి అనేక కృతులలో ప్రహ్లాద నారదాది పరమభాగవతోత్తములతో సమానునిగా రామదాసుని భావించడమే కాక, రామదాసు సంకీర్తనల పద్ధతిని అనుసరిస్తూ దివ్యనామ సంకీర్తనములనీ ఉత్సవసాంప్రదాయ కీర్తనలనీ రచించారు.

తెలుగువారే కాదు, సకలభారతీయులు గర్వపడవలసిన మహాగాయకుడు, వాగ్గేయకారుడు, శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు తాను విజయవాడ ఆకాశవాణిలో సంగీత ప్రయోక్తగా ఉండగా ఎన్నో రామదాసు కీర్తనలని లక్షణశుద్ధంగా స్వరపరిచి, వీనులవిందైన వాద్యసహకారం మేళవించి ప్రముఖ గాయనీ గాయకులతో పాడించారు. కీర్తనలు భక్తిరంజని కార్యక్రమంలో ప్రసారమవుతూ ఉండేవి. అంతేకాక, సుమారు 1970 ప్రాంతంలో మొదలు పెట్టి తానే స్వయంగా గానం చేసిన రామదాసు కీర్తనలను మూడు విడతలుగా, కేసెట్లు, సీడీల రూపంలో విడుదల చేశారు. దేశ విదేశాలలో ఉన్న తెలుగువారు మళ్ళి మళ్ళీ రామదాసుని స్మరించుకుని ఆయన రామభక్తిని కొంతైనా అనుభవించడానికి రికార్డులు ఉపయోగపడతాయి.

రామజోగి మందు గొనరే!
http://mio.to/VFkr