Sunday, October 28, 2012

కర్నాటక సంగీతాన్నిఆస్వాదించడం ఎలా - 3

క్షమించాలి - ఈ టపాలు వారానికి కనీసం ఒకటైనా ప్రచురించాలని సంకల్పించానుగానీ ఉద్యోగపు వత్తిళ్ళు మరీ తీవ్రం అవడంతో ఈ టపా వెనకబడింది. 

గత ఎసైన్మెంటులో వేణువు వాయించినది VK Raman గారు. ఈయన అమెరికాలో మేరిలేండ్ రాష్ట్రంలో నివాసమున్నారు. అమెరికాలో అనేక నగరాల్లో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. మా ఊరిలో చాలాసార్లు ప్రత్యక్షంగా వీరి వేణుగానం విన్నాను. యువకుడే గాని మంచి పరిణతి కనబరుస్తున్న విద్వాంసుడు.

నేను ఇచ్చిన శ్రవ్యకం ఒక ప్రత్యక్ష కచేరీ నించి తీసుకోబడినది. వాయించిన పాట ప్రసిద్ధమైన "వాతాపి గణపతింభజే" అని గుర్తించే ఉంటారు. ఆ తునకని వినడంలో పాఠకశ్రోతలు గమనించాలని నేను అనుకున్న విషయాలు ఇవి.
అ) వినిపించిన వాయిద్యాలు: వేణువు, వయొలిన్, వీణ, మృదంగం, ఘటం, కంజిర.
ఆ) వేణువు నాయకస్థానంలో ఉన్నది. మిగిలినవి సపోర్టుగా ఉన్నాయి.
ఇ) మొదటినించి సుమారు 7 నిమిషాల వరకూ వేణువు, వయొలిన్ మాత్రమే వినిపించాయి. తాళ వాయిద్యాలైన మృదంగం తదితరులు వినిపించలేదు. తాళం లేని ఈ భాగాన్ని ఆలాపన అంటారు. దీని సంగతి ఈ టపాలోనే తరవాత పరిచయం చేస్తాను.
ఈ) సుమారు 7 నించీ 14 నిమిషాల దాకా పాట నడిచింది. 14 నిమిషాల దగ్గర ఆడియో ఒక బ్రేకు పడింది (బహుశా రికార్డింగులో ఏదో లోపం). ఆ బ్రేకు తరవాత వేణువు, వయొలిన్, వీణ మార్చి మార్చి స్వరాలు పలికిస్తుంటే, ఒక్కొక్కరికీ ఒక్కొక్క తాళవాయిద్యం సహకరించింది.
ఉ) చివరిలో మళ్ళీ అన్ని వాయిద్యాలు కలిసి పాట పల్లవిని వినిపించి ముగించారు.

ఈ ఎసైన్మెంట్ల ముఖ్యోద్దేశం మీకు వినడంలో ఆసక్తి పెంచాలనీ, వినికిడి శక్తిని పదును పెట్టలనీ. మొదట్లోనే చెప్పాను. కర్నాటక సంగీతమంటే వేరే పని చేసుకుంటూ నేపథ్యంలో మంద్రంగా వినేది కాదు - శ్రద్ధ పెట్టి విన్నప్పుడే దానిలోని అందచందాలు మనకి బాగా తెలుస్తాయి. అంతే తప్ప, ఈ ఎసైన్మెంటుకిచ్చే సమాధానాల్లో గొప్ప సంగీత శాస్త్ర రహస్యాలు చర్చించాలని కాదు. నిజానికి సంగీత శాస్త్రంతో మనకి పనేలేదు. అంచేత, దయచేసి ఇచ్చిన ఎసైన్మెంట్లని శ్రద్ధగా వినండి. విని మీ అభిప్రాయాలని ఇక్కడ రాయండి. అలా రాస్తుంటే తప్ప మనం సరైన దారిలో వెళ్తున్నామో లేదో నాకు తెలియదు మరి.

గత టపాలో సంగీతం లభించే కొన్ని వనరుల్ని ఇచ్చాను.
ఎలా వినాలి అంటే
 Listen widely. Listen deeply. Listen frequently.  
అని చెప్పుకున్నాం.
Widely: మొదటి టపాలో చెప్పాను, కర్నాటక సంగీతంలో చాలా వైవిధ్యం ఉన్నదని. రకరకాల బాణీలు, పద్దతులు, గొంతులు, వాయిద్యాలు, శైలులు. అన్నీ అందరికీ నచ్చాలని లేదు. వినడం ప్రారంభించిన దశలో అన్నిరకాలనీ రుచి చూస్తేనేగాని మనకి ఒక అభిరుచి అంటూ ఏర్పడదు. అందుకని ఇప్పుడే ఒక గాయకుణ్ణీ, ఒక వాద్యాన్ని అనుసరించడం మంచిది కాదు, వినడానికి కూర్చున్నప్పుడల్లా ఒక కొత్త గొంతు, కొత్త వాయిద్యం వినడానికి ప్రయత్నం చెయ్యండి.

Deeply: వినేటప్పుడు వేరే డిస్ట్రాక్షన్లు లేకుండా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చెయ్యండి. కారులో డ్రైవు చేసుకుని వెళ్ళేవారికి, లేక బస్సు, రైలులో కమ్యూట్ చేసేవారికి ఆ ప్రయాణ సమయం మంచి వేళ సంగీతం వినడానికి. అలా కుదరకపోతే మీకు వీలైన సమయం ఒక అరగంట సేపు సంగీతం వినడానికి కేటాయించి వినండి. వినేటప్పుడు వేరే పుస్తకం చదవడం, కంప్యూటరు తెరవడం, కంప్యూటరు మీద వినేటప్పుడైతే ఫేస్బుక్కులో చాట్ చెయ్యడం, ఇలాంటి పనులేమీ చెయ్యొద్దు. వినడం మాత్రమే. అదేదో సినిమాలో బాలయ్య డయలాగులో చెప్పినట్టూ - చెవులు మాత్రమే పని చెయ్యాలి. విన్నాక అది మీకు నచ్చిందా లేదా, నచ్చితే ఏమి నచ్చింది, నచ్చక పోతే ఏమి నచ్చలేదు అని ఆలోచించి చూడండి. వీలుంటే ఆ ఆలోచనని మాటల్లో పెట్టండి. ఇక్కడ వ్యాఖ్యగా రాయండి. ఇక్కడ ఎసైన్మెంట్ విషయాలే కాదు, మీరు విన్న కర్నాటక సంగీతం దేని గురించైనా రాయవచ్చు.

Frequently: సాధకావస్తలో ఉన్నప్పుడు తరచూ క్రమం తప్పకుండా సాధన చెయ్యడం చాలా ముఖ్యం. వినడంలోనైనా అంతే. అందరమూ బిజీబిజీయే, కాదనను. కానీ ఒక్క పది పదిహేను నిమిషాలు దొరక్కపోతుందా, వేరే  వేరే డిస్ట్రాక్షన్లు లేకుండా శ్రద్ధగా వినడానికి? రోజూ పొద్దున టీ తాగేటప్పుడో, లేక సాయంత్రం భోజనం కాగానే ఒక పది నిమిషాలు విశ్రాంతిగా కూర్చున్నప్పుడో - ఏదో ఒక సమయాన్ని కచ్చితంగా సంగీతం వినడానికి కేటాయించండి. కమ్యూట్ చేసే సమయం దీనికి బాగా ఉపకరిస్తుంది.

అందుకే ప్రత్యక్ష కచేరీకి వెళ్ళడం వల్ల చాలా ప్రయోజనం ఉంది. కచేరీకి, సంగీతం వినడానికి వెళ్తున్నాం అనే ఆలోచనతో ముందు మానసికంగా సిద్ధమై ఉంటాము ఆ రసానుభూతిని పొందడానికి. ఇక కచేరీలో కూచున్నప్పుడు, ఎదురుగా విద్వాంసులు పాడుతున్నారు కాబట్టీ, మన చుట్టూతా రసికులు కూర్చుని ఆస్వాదిస్తున్నారు కాబట్టీ మనకి వేరే డిస్ట్రాక్షన్లు ఉండవు. మన ప్రమేయం లేకుండానే మన దృష్టి శ్రద్ధ సంగీతం మీద లగ్నమవుతాయి. ఐతే వినడం మొదలెట్టిన తొలిదశలో మూడేసి గంటలపాటు అలా కూర్చుని ఇంకా పూర్తిగా పరిచయం కాని సంగీతం వినాలంటే కష్టం అనిపిస్తుంది. నిజమే. కానీ, మీరున్న ప్రదేశంలోగనక ప్రత్యక్ష కచేరీలు జరుగుతూ ఉంటే, కొంతసేపయినా వెళ్ళి వినమని కోరుతున్నాను.

కచేరీలో పాట పద్ధతి, స్వరూపం
మన శాస్త్రీయ సంగీతం అతి పురాతనమైనది అయినా గతించిన కాలం అంతటా సంగీతం ఒకలాగానే లేదు. ఎలాగైతే జనులు మాట్లాడే భాష స్వరూపం మారుతూ వస్తున్నదో, సంగీతం స్వరూపం కూడా మారుతూ వస్తున్నది, ఇప్పటికీ మారుతున్నది కూడా.

సంగీత త్రిమూర్తులు (త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రులు, ముత్తుస్వామి దీక్షితులు) కాలంలో, వారి సృజన ప్రభావం వల్ల సంగీతం స్వరూపంలోనూ, పాడే పద్ధతిలోనూ, కచేరీ స్వరూపంలోనూ చాలా మార్పులు వచ్చాయని పరిశోధకులు భావిస్తున్నారు. మళ్ళీ పంతొమ్మిదవ శతాబ్ది చివరలో, ఇరవయ్యవశతాబ్ది ప్రారంభంలో చెన్నై నగరం దక్షిణభారతానికి రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక కేంద్రంగా స్థిరపడింది. అప్పటివరకూ రాజాస్థాన ఆశ్రితులుగా ఉన్న కళాకారుల సాంప్రదాయ కళలకి వేదిక సంగీత సభలలోకి మారింది. మెడ్రాసు మ్యూజిక్ ఎకాడమీ వంటి సంస్థలు ఏర్పడ్డాయి. సంపన్నులు, ఉద్యోగస్తులు ఒక సాయంత్రం పూట ఆహ్లాదంగా గడపడానికి కచేరీకి వెళ్ళడం అనే పద్ధతి మొదలైంది. ఈ మార్పులన్నిటి వలనా కచేరీ స్వరూపం మరోసారి బాగా మారింది. శ్రీ అరియక్కూడి రామానుజ అయ్యంగారు ఈ కచేరీ స్వరూపాన్ని తీర్చి దిద్దినారని విజ్ఞులు చెబుతూ ఉంటారు. అప్పటినించీ ఇప్పటికీ కొన్ని చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి గానీ స్థూలంగా అదే స్వరూపం నిలిచి ఉన్నది.

ప్రత్యక్ష కచేరీ సుమారు మూడు గంటలపాటు జరుగుతుంది. గాత్ర కచేరీ అయితే సాధారణంగా వయొలిన్, మృదంగం పక్క వాద్యాలుగా ఉంటాయి. ఘటం, కంజీర, మోర్సింగ్ వంటి అదనపు తాళవాయిద్యాలు కూడ ఉండవచ్చు. వాద్య కచేరి అయితే, గాత్రం ఉండే స్థానాన్ని ముఖ్య వాయిద్యం ఆక్రమిస్తుంది. పక్కన వయొలిన్, మృదంగం ఇత్యాది. వీణ విషయంలో మట్టుకు, పక్కన వయొలిన్ ఉండదు - ఉంటే మరొక వీణ ఉంటుంది.

కచేరీ ప్రారంభంలో వర్ణం (ఇది పాటల్లో ఒక రకం, విద్యార్ధి స్థాయిలో నేర్పిస్తారు) తో మొదలు పెట్టడం ఒక సాంప్రదాయం. ఇది 3-5 నిమిషాల నిడివితో, ఒక warm up exercise లాగా ఉంటుంది. అటుపైన కచేరీ నిర్విఘ్నంగా జరిగించమని గణపతి ప్రార్ధన కృతి పాడుతుంటారు. మహాగణపతిం మనసాస్మరామి, వాతాపి గణపతిం భజే, శ్రీమహా గణపతిరవతు మాం అనే దీక్షితుల కృతులు, శ్రీగణపతిని సేవింపరారే అనే త్యాగరాజ కృతి, బాగా ప్రఖ్యాతి చెందినాయి. ఇంకా చాలా కృతులున్నాయి గణపతిమీద, కానీ సాధారణంగా ఇవి ఎక్కువ వినిపిస్తుంటాయి.

మూడో పాటగా కొంచెం బరువైన పాటని ఎంచుకుంటారు. పాటకి ముందు ఆలాపన చేస్తారు (అంటే పాట సాహిత్యం ఉండదు - అకారంతోనూ, లేక తదరిననా అనే ధ్వనుల ఆసరాగా, రాగ స్వరూపాన్ని చిత్రిస్తారు. చిన్నపాటి ఆలాపన తరవాత అసలు కృతి. ఈ కృతి ని పాడ్డంలో మళ్ళీ రకరకాలు. పాటలోని ఒక వాక్యాన్ని, ఒక సాహిత్య వరుసని తీసుకుని దాన్నే రకరకాలుగా మార్చి మార్చి పాడతారు - ఈ పద్ధతిని నెరవులు (neraval) అంటారు. నెరవులు పాడ్డంలోనించి స్వరప్రస్తారం (అంటే సరిగమప అని స్వరాల ధ్వనులని ఉచ్చరిస్తూ రాగ స్వరూపాన్ని చిత్రించడం) లోకి వెళ్తారు. ఇదంతా కలిపి సుమారు 15-20 నిమిషాలు పడుతుంది. ఇలా మొదటి గంటలోనూ సుమారు నాలుగైదు పాటలు పాడతారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒకదాని తరవాత ఒకటి వచ్చే పాటల్లో గతి భేదాలు, ఒకటి వేగంగా ఉంటే మరుసటిది నింపాదిగా ఉండడం, ఇటువంటి చమత్కారాలు గమనించవచ్చు.

రెండోగంట మొదలయ్యేప్పటికి ఆ కచేరీకి ముఖ్యాంశాన్ని ఎత్తుకుంటారు. ఈ ముఖ్యాంశం దాదాపు గంటసేపు జరుగుతుంది. ముందు బాగా పది పదిహేను నిమిషాలపాటు విపులమైన ఆలాపన చేస్తారు. ఈ ఆలాపన జరిగేటప్పుడు గాత్రము (లేక ముఖ్య వాయిద్యము), పక్కన సహకారంగా ఉన్న వయొలిన్ పోటీ పడుతున్నట్టుగా ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే గాత్రం ఎప్పుడూ లీడర్. వయొలిన్ అనుసరిస్తూ ఉంటుంది. గాత్రాన్ని వయొలిన్ ఎలా అనుసరిస్తున్నది, ఎంతబాగా అనుసరిస్తున్నది అని గమనిస్తుంటే ఆలాపన మంచి సరదాగా ఉంటుంది. సరే ఆలాపన అయ్యాక, నేరుగా కృతిలోకి వెళ్తారు. విపులంగా నెరవులు పాడతారు. మరో పది నిమిషాల పాటు స్వరప్రస్తారం చేస్తారు. స్వరప్రస్తారం ముగిశాక మృదంగ విద్వాంసుడికి "సోలో" (దీన్నె తమిళంలో తని ఆవర్తనం అంటారు - తెలుగులో సమానార్ధకం నేనెక్కడా వినలేదు మరి) ఇస్తారు. ఒక్క మృదంగమే కాక ఘటం, కంజిరా, మోర్సింగ్ (ఒక్కోసారి తబలా) వంటి అదనపు తాళ వాయిద్యాలు ఉంటే వారి మధ్య పోటాపోటీగా జరిగే తాళ సమ్మేళనం బహు రంజుగా ఉంటుంది. కున్నక్కుడి వైద్యనాథన్ (http://en.wikipedia.org/wiki/Kunnakudi_Vaidyanathan) అనే వయొలిన్ మాంత్రికుడు నాలుగైదు తాళవాద్యాలతో కలిసి కచ్చేరీ చేసేవారు. ఆయన ప్రత్యక్ష కచేరీలలో ఈ తాళవాద్య సమ్మేళనం గొప్ప ఆకర్షణగా ఉండేది. ఇలా ముఖ్యాంశానికి కనీసం గంటసేపు పడుతుంది.

ఇది ముగిశాక నేరుగా గానీ, లేక ఒక చిన్న పాట తరవాత గానీ, రాగం-తానం-పల్లవి పాడుతున్నారు. ఇది ఒక అరగంట సేపన్నా జరుగుతుంది. చివరి అరగంటలో కొంచెం లలితంగా ఉండే రాగాలు (semi classical), భజనలు, పదాలు, జావళీ, తిల్లానాల వంటి పాటలు పాడుతారు. చివరాఖరుకి మంగళాశాసనం (త్యాగరాజస్వామి వారి పవమాన సుతుడుబట్టు అనే కృతి)తో కచేరీ ముగుస్తుంది.

పైన చెప్పిన పద్ధతి అంతా ఒక సాంప్రదాయం మాత్రమే. ఇది ఇల్లాగే ఉండాలి, ఈ సమయానికి ఇటువంటి పాట పాడి తీరాలి అని రూలేమీ లేదు. ఈ మధ్యన చాలా మంది వర్ణం, గణపతి ప్రార్ధన ఏమీ లేకుండానే నేరుగా కృతి పాడ్డంలోకీ, ఒక్కోసారి బాగా విపులమైన ఆలాపనలోకీ కూడా వెళ్ళిపోతున్నారు. అందులో తప్పు పట్టాల్సిందీ ఏమీ లేదు.

ఇక్కడ ప్రస్తావించిన అంశాలన్నిటినీ ఒక్కొక్కదాన్నీ విపులంగా చర్చిద్దాము వచ్చే టపాలలో.

Assignment
http://mio.to/#/
Search for "nannu palimpa"
Listen to
Vocal rendition of Maharajapuram Santanam (item #1 on list - about 10 minutes)
Violin of Kunnakkudi Vaidyanathan (item #2 on list - about 6 minutes)
Vocal of Balamurali (item #9 on list - about 15 minutes - Album title is Alapana - Raga Mohanam)
Saxophone of Kadiri Gopalnath (item #13 on list - about 30 minutes)

What are the similarities? Differences? Tell me one unique thing you heard in each rendition.

Thursday, October 18, 2012

కర్నాటక సంగీతాన్నిఆస్వాదించడం ఎలా - 2

మొదటి టపా ఇక్కడ.

గతవారపు ఎసైన్మెనంటుకి సమాధానాలు బాగానే వచ్చాయి. కొందరు పక్కదారి పట్టారు గానీ చాలామంది సరిగ్గానే పోల్చారు. ఒకరిద్దరు రాగం పేరు కూడా చెప్పారు. మంచిదే. సంగీతం గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాక రాగాల ప్రస్తావన లేకుండా పని జరగదు. కానీ అది ఇప్పుడే కాదు. మరి కొన్ని టపాలు అయ్యాక రాగాలు, వాటి విశేషాల్లోకి వెళ్దాము.

ఇక్కడే మరొక్క గమనిక కూడా. కొంతమంది సినిమా పాటల ఉదాహరణలు చెప్పమని అడిగారు. ఈ వరుసటపాల ఉద్దేశం కర్నాటక సంగీతాన్ని పరిచయం చెయ్యడం. దాని పట్ల ఆసక్తి పెంపొందించడం. విని ఆనందించడంలోని మెలకువలు చెప్పడం. అసలు మౌలికంగా సినిమా సంగీతం వేరు, కర్నాటక సంగీతం వేరు. సందర్భం వచ్చిన చోట్ల అలాగే చెప్పుకుందాం సినిమా పాటల ఉదాహరణలు. కానీ ముందే చెబుతున్నాను, సినిమా పాటల ప్రస్తావన చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. వ్యాఖ్యల్లో పాఠకులెవరైనా వాటిని ఉదహరిస్తే నాకేం అభ్యంతరం లేదు. Carnatic Fusion సంగీతం గురించి కూడా ఇదే సూచన.

సంగీతం ఆస్వాదించాలంటే ఏం చెయ్యాలి?
నేను నా ఫేస్బుక్కు పేజీలో ఈ టపాల గురించి చెప్పగానే మా పెద్దక్క ఒక మంచి వ్యాఖ్య రాసింది - సంగీతాన్ని ఆస్వాదించడమంటే ఏవుందీ, కర్ణపుటాలు తెరిచి విని ఆనందించడమే - అని. తను సరదాకి రాసిందేమో గాని, సంగీతం వినడం మొదలు పెట్టేవారికి ఈ సలహా మట్టుకు అక్షరసత్యం మాత్రమే కాదు మూలమంత్రం కూడా.
సంగీతం ఆస్వాదించడానికి మొదట కావలసింది వినడం.
ఏం వినాలి? ఎలా వినాలి? ఎక్కువ పరిచయం లేకుండా ఇప్పుడు వినాలి అనుకునేవారికి ఎదురయ్యే ప్రశ్నలివి.

ఏం వినాలి - వనరులు
1) నేను వినడం మొదలు పెట్టినప్పటికంటే ఈ రోజున బోలెడు వనరులు శ్రోతలకి సులభంగా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా జాలంలో. ఇదొక మంచి పరిణామం.
నాకు తెలిసిన కొన్ని వనరుల్ని కింద ఇస్తున్నాను. మీకు తెలిసినవి ఇంకా ఉంటే చెప్పండి.

Music India Online    http://mio.to/#/
Raaga                       http://www.raaga.com
Youtube                   http://youtube.com

ఈ మూడు సైట్లనీ పరిశోధించండి. Search చెయ్యడం, ప్లేయర్ని ఉపయోగించడం ఇటువంటివి కొంచెం ముందే సాధన చేసి అలవాటు చేసుకుంటే తరవాత అవసరమైనప్పుడు వెతుకులాటలో సమయం వృధా చేసుకోనక్కర్లేదు. ఈ సైట్లలో సభ్యత్వం తీసుకోవడం వల్ల ఏమైనా అదనపు ప్రయోజనం ఉన్నదేమో మరి నాకు తెలియదు. వీటిని తరచూ ఉపయోగించేవారు ఎవరైనా చెబితే బాగుంటుంది.

2) మీ బంధుమిత్రులలో సంగీతాభిమానులు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి. ఉంటే గనక వారి వద్ద నించి డిజిటల్ రూపంలోగాని, లేక డిస్కు/కేసెట్ రూపంలో గానీ అరువు తీసుకోవచ్చు. ఇదొక పద్ధతి. దీనివల్ల ఇంకో ప్రయోజనం ఉన్నది - ఆయా బంధుమిత్రులతో వారికీ మీకూ వీలు కుదిరితే ఒక చోట కూర్చుని కలిసి వినవచ్చు, కొంత సంగీత చర్చ చేసే అవకాశం ఏర్పడుతుంది. తద్వారా మీ సంగీత పరిధి విస్తరించే అవకాశం ఉంది.

ఇప్పుడే తొందరపడి డబ్బు పెట్టి సీడీలు గట్రా కొనెయ్యొద్దు. సంగీతం వినడంలో మీకంటూ ఒక అభిరుచి ఏర్పడనివ్వండి, దాన్ని బట్టి మెల్లగా కొనుక్కోవచ్చు.

3) మీరు నివాసం ఉండే చోట సంగీత కచేరిలు నిర్వహించే సభలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోండి. సంగీతం వినడంలో ఉత్కృష్టమైన అనుభవం ప్రత్యక్ష కచేరీ వినడంలోనే లభిస్తుంది. ప్రత్యక్ష కచేరీలతో కొన్ని ఇబ్బందులు లేకపోలేదు గానీ దాని వల్ల వచ్చే ఆనందం దృష్ట్యా ఇబ్బందుల్ని భరించొచ్చు. సాధ్యమైనంత వరకూ కచేరీలకి వెళ్ళండి. చెన్నైలో త్వరలోనే మ్యూజిక్ సీజను మొదలవబోతున్నది. బహుశా బెంగుళూరులోనూ హైదరాబాదులోనూ కూడా కచేరీలు బాగానే జరుగుతుంటాయి. అమెరికాలో పెద్దనగరాలన్నిటిలోనూ కచేరీలు నిర్వహించే సభలు ఉన్నాయి.

4) టీవీ, రేడియో. నా చిన్నప్పుడు సంగీతాభిరుచికి ప్రాణం పోసింది రేడియో. నేను ఇంజనీరింగ్ చదువుకి ఆర్యీసీకి వెళ్ళిపోయిన కొత్తల్లో రేడియో సంగీత కచేరీలని విపరీతంగా మిస్సయ్యాను. ఆ వియోగం భరించలేక, మా కుటుంబ సన్నిహితులు ఒక ప్రొఫెసరుగారుండేవారు, ఒక ఆదివారం నాడు పొద్దున ఎనిమిదింటికి వాళ్ళింటికి వెళ్ళి, రేడియో పెట్టండి, కచేరీ వినాలి అని అడిగి, గంటసేపు వినిమరీ వచ్చాను. ఆ పిచ్చి అలాంటిది. ఆలిండియా రేడియో శనివారం రాత్రుళ్ళు సుమారు 9.30 నించీ గంటన్నరసేపు శాస్త్రీయ సంగీత కార్యక్రమం నడిపేది. దేశం మొత్తం అదే బ్రాడ్‌కాస్ట్. అందులో మూడు వారాలు హిందుస్తానీ, ఒక వారం కర్నాటక సంగీతం వచ్చేది. ఇది కాక, సంవత్సరానికి ఒక నెల రేడీయో సంగీత సమ్మేళనం అనే పేరిట, దేశంలో వివిధ నగరాల్లో కచేరీలు జరిపి, తరవాతి నెలలో ఆ కచేరీల రికార్డింగుని బ్రాడ్‌కాస్ట్ చేసేవారు. ఆ పైన చెన్నై కేంద్రం డిసెంబరు జనవరి నెలల్లో జరిగే చెన్నై సంగీతోత్సవాల కచ్చేరీలు కొన్నిటిని ప్రసారం చేసేవారు. మరిప్పుడంతా ఎఫ్ఫెం రాజ్యమేలుతున్నది. పరిస్థితి ఏంటో నాకు తెలియదు. అలాగే టీవీ సంగతి కూడా నాకు తెలియదు. కానీ యూట్యూబులో దొరుకుతున్న విడియోలని చూస్తే దూరదర్శన్‌లోనూ వివిధ ఛానెళ్ళలోనూ కర్నాటక సంగీతం బాగానే వినిపిస్తున్నదని తెలుస్తున్నది. అంచేత మీకు అందుబాటులో ఉన్న టీవీ, రేడియోలలో కర్నాటక సంగీత కార్యక్రమాలు ఏమి వస్తున్నాయి, ఏయే వేళల్లో వస్తున్నాయి గమనించి వినే ప్రయత్నం చెయ్యండి.

ఏం వినాలి - రూపాలు
ఇది నిజానికి చాలా జటిలమైన సమస్య. అలవాటు లేని వాళ్ళకి సంగీతం అంతా ఒకలాగే వినిపించవచ్చు, కానీ దానిలోకి దిగి లోతులు తడమడం మొదలైతే అర్ధమవుతుంది, అంతా ఒకలా ఉండదని. సినిమా సంగీతంలో ఎంత వైవిధ్యం ఉన్నదో కర్నాటక సంగీతంలోనూ అంత వైవిధ్యం ఉన్నది. గాత్రం ఉంది, వాయిద్యాలు ఉన్నై. బాణీలు ఉన్నై, కొన్ని కొన్ని పారంపర్య గతమైన కుటుంబాల పద్ధతులున్నై. అటుపైన వ్యక్తిగతమైన శైలులు ఉన్నాయి. హాయిగా ఉయ్యాల ఊపుతున్నట్టు పాడేవారొకరు, జడివాన పడుతున్నట్టు పాడేవారొకరు. మెరుపులు మెరిపించేవారొకరు, పిడుగులు కురిపించేవారొకరు. చమక్కులు చేసేవారొకరు, వయ్యారాలు పోయేవారొకరు. అలాగే పాటల్లోనూ ఎంతో వైవిధ్యం. వీటన్నిటినీ వీలైనంత విస్తృతంగా రుచి చూసి, మీ అభిరుచిని పెంపొందించుకుని, మీకు ఏది నచ్చుతోంది అని గుర్తించుకోవాలని నా కోరిక. నా ఉద్దేశంలో ప్రారంభ దశలో గాత్రం వినడం వల్ల ఎక్కువ లాభాలున్నాయి. అందులోనూ మనకి పరిచయమైన గొంతులు వినడంతో ప్రారంభిస్తే దారి మరి కాస్త సులభం అవుతుంది. ఇక్కడ ప్రస్తావించే సంగీతజ్ఞులందరూ నాకు దైవసమానులే, అందుకని ప్రత్యేకంగా గౌరవ వాచకాలు వాడడం లేదు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, యేసుదాసు, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాదు (అన్నమాచార్య ప్రాజెక్టు ఆస్థాన విద్వాంసులు), సుధా రఘునాథన్, ఉన్నిక్రిష్ణన్ - ఈ గాయకుల గాత్రం మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు. ప్రస్తుతానికి పైన ఇచ్చిన వనరులలో వీరి పాటలను వెతికి పట్టుకుని వినడం మొదలు పెట్టండి. ఇంకా ఏమేం వినాలో వచ్చే టపాల్లో చాలా వివరాలు వస్తాయి.

ఎలా వినాలి?
ఇప్పటికే ఈ టపా చాలా పొడుగైంది. ఈ విషయాన్ని తరువాయి టపాలో ఇంకా వివరంగా చర్చిద్దాముకాని, ఇప్పటికి ఒక క్లుప్తమైన సలహా చెబుతాను.
Listen widely. Listen deeply. Listen frequently.

గతవారపు ఎసైన్మెంటు
గాత్రం ఎమ్మెస్ సుబ్బలక్ష్మి. నేనిచ్చిన రికార్డింగు ఏ సినిమాలోదీ కాదు, ఒక ప్రత్యక్ష కచేరీలో రికార్డింగు. ఈ పాట హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతుల సృష్టి. ఖమాస్ అనే రాగంలో ఉన్నది. శంకరాభరణం సినిమాలో ఉపయోగించిన బ్రోచేవారెవరురా అన్న మైసూరు వాసుదేవాచార్యుల కృతి కూడా ఇదే రాగంలో ఉండడమే కాక, వింటున్నప్పుడు ఈ పాటకి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇప్పటికి విని ఉండకపోతే, రెండు పాటలనూ మరోసారి విని పోల్చి చూడండి. ఇది ఎటువంటి పాట, ఈ రాగం ఏవిటి, రెండు పాటలు ఒకే రాగంలో ఉన్నంత మాత్రాన ఒకేలా వినిపిస్తాయా? ఈ విశేషాలన్నీ నెమ్మదిమీద చర్చిద్దాం, సోదాహరణంగా.

ఈ వారం ఎసైన్మెంటు
ఇది సుమారు 20 నిమిషాల నిడివిగల పాట. అమెరికాలో జరిగిన ఒక ప్రత్యక్ష కచేరీలో రికార్డు చేసినది. ఈ పాట మొత్తం, మొదటినించీ చివరిదాకా శ్రద్ధగా వినండి. ఇది మీకు తెలిసిన పాటే. కాకపోతే ఇక్కడ సంపూర్ణమైన కర్నాటక స్వరూపంలో, వాద్య సంగీతంలో వినిపిస్తున్నది. ఈ పాటలో ఏమేమి వాయిద్యాలు వినిపించాయి? వినడంలో మీరు ఇంకా ఏమేమి విశేషాలు గమనించారు? మూడు నాలుగు వాక్యాలు రాయండి. ఉదాహరణకి రికార్డింగులో సుమారు ఏడు నిమిషాలు గడిచాక (ఇక్కడ చప్పట్లు మోగినై) గానీ అసలు పాట మొదలు కాలేదు. అప్పటిదాకా ఏమి జరిగింది? ఎసైన్మెంటులో రెండో భాగం - పైన చెప్పిన జాల వనరులు ఒకదానిలో ఇదే పాటని ఎవరైనా గాయకులు పాడిన గాత్ర రూపంలో వినండి. ఏ సైటులో ఏ గాయకులు పాడినది విన్నారో ఇక్కడ చెప్పాలి. నేనిక్కడ ఇచ్చిన వాద్య రూపానికీ, మీరు విన్న గాత్రరూపానికీ ఏమి తేడాలు గమనించారు? పోలికలు గమనించారు? దీన్ని గురించి ఒకట్రెండు వాక్యాలు చెప్పండి. రెండు రూపాల్లో మీకు ఏది నచ్చింది?

Tuesday, October 16, 2012

కర్నాటక సంగీతాన్నిఆస్వాదించడం ఎలా - 1

ఉపోద్ఘాతం
తెలుగువారమై పుట్టినందుకు మనకి మన పెద్దలు ఇచ్చిపోయినవి రెండు గొప్ప ఆస్తులున్నై. ఒకటి పద్య కావ్య సాహిత్యం. రెండోది కర్నాటక సంగీతం. సంగీతానికి భాషల హద్దులేవిటని కొందరు మొహం చిట్లించవచ్చు. ఈ సంగీతానికి ప్రాచుర్యంలో ఉన్న పేరిట కర్నాటక అని విశేషణం ఉన్నా, ఈ సంగీతం బాగా వృద్ధిపొందింది తమిళనాట అయినా, ఇది తెలుగువారి సొత్తు. ఎందరో గొప్ప తెలుగు వాగ్గేయకారులు ఈ సంగీతాన్ని సుసంపన్నం చేశారు. ఇందులో పాడబడే సాహిత్యంలో తొంభైశాతం తెలుగులో ఉంది. అంతే కాక ఎందరో గొప్పతెలుగు గాయకులు, వాద్యకారులు దీని పరిధిని అనేక విధాల విస్తరింపచేసి శోభిల్ల చేశారు. ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా కర్నాటకసంగీతం తెలుగువారి ఆస్తి.

అంతేకాక, ఈ మానవ జీవితంలో మనిషి దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా, దైవత్వ అనుభూతిని అతి సులభంగా కలగ్జేసే దివ్యమైన వరం సంగీతం. నా మిత్రులు పరమనాస్తికులైన వారు కూడా కర్నాటక సంగీతం వింటూ అలౌకికానందం అనుభవించడం నాకెరుకే.

ఈ రెండు కారణాలూ ఇలా ఉండగా, తెలుగు మిత్రులతో సంగీత ప్రస్తావన చేసినప్పుడల్లా చాలా మందికి ఇది బొత్తిగా పరిచయం లేని విషయం అని తెలిసి నాకు బాధ కలుగుతూ వచ్చింది. ఆలోచింపచేసింది. సంగీతం అంటే అస్సలు ఇష్టం లేని వారెవరూ ఉండరు. కానీ శాస్త్రీయ సంగీతం, కర్నాటక సంగీతం అనేటప్పటికి మాత్రం ఏదో జంకు, భయం. ఎందుకు? ఇదేదో పండితులకి సంబంధించినది, మనకోసం కాదు, ఇదేదో పాతకాలపు వ్యవహారం, ఆధునికం కాదు, అబ్బ చాలా స్లో, ఫాస్ట్ బీట్ ఏదీ .. ఎన్నో అపోహలు, మరిన్ని సంకోచాలు.

అమెరికాలో విశ్వవిద్యాలయాల్లోనూ, ఇతరత్రా కూడా వారి పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించడం పైన కోర్సులు నడుపుతూ ఉన్నారు. అలాగే మన కర్నాటక సంగీతాన్ని ఆస్వాదించడం నేర్పలేమా అనిపించింది. ఒకటి మాత్రం నిజం. ఇంట్లో మొదణ్ణించీ సంగీతం ఏదో ఒక రూపంలో ఉంటూ ఉండడం వల్ల సంగీతం అలవాటైన వారిని మినహాయిస్తే నాకు పరిచయమున్న సంగీత రసజ్ఞులందరూ కాస్తో కూస్తో కృషి చేసినమీదటే సంగీత రసాస్వాదనని అలవాటు చేసుకున్నారు. దీనిని నేర్చుకోవచ్చు. దీనికి ముందస్తు క్వాలిఫికేషన్లేవీ అక్కర్లేదు. బాలమురళీకృష్ణ మీకు బాల్యమిత్రుడవ్వక్కర్లేదు. కావలసిందల్లా కొంచెం శ్రద్ధ, మరికాస్త పట్టుదల. ఈ మాత్రం చిన్న పెట్టుబడి పెడితే అనంతమైన కర్నాటక సంగీత రత్నాకరం మీదవుతుంది. జీవితాంతం అలౌకికమైన ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది.

నేర్పడానికి నేనెవర్ని?
మంచి ప్రశ్నే. నేను సంగీత విద్వాంసుణ్ణి కాదు. కనీసపు స్థాయి గాయకుణ్ణి కూడా కాదు. నేనొక శ్రోతని. సుమారు పన్నెండేళ్ళ వయసులో మొదలెట్టి, మా అమ్మ నా తోటి శ్రోతగా పని గట్టుకుని సంగీతం వినడం నేర్చుకున్నాను. ఇదొక్కటే నాకున్న క్వాలిఫికేషను. నేను పడుతూ లేస్తూ నేర్చుకున్న విషయాల్ని ఇక్కడ కొంత ప్రణాళిక ప్రకారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను.

షరా:
ఈ వరుసటపాలు సంగీత విద్వాంసులకోసమూ, ఇప్పటికే సంగీతం బాగా వినే అలవాటున్న వారికోసమూ కాదు.
కొత్తగా వినేవారి కోసం. వినాలని కుతూహల పడే వారికోసం.
ఇక్కడ పెద్దగా శాస్త్ర చర్చ జరగదు. నేను సంగీత శాస్త్ర పాఠాలు చెప్పను. విని ఆనందించడానికి అవసరమైన విషయాలు, అనుసరించాల్సిన పద్ధతులూ చెబుతాను. మధ్యమధ్యలో సందర్భోచితంగా చిట్టికతలూ, పిట్టకతలూ, కూసింత చరిత్రా, మరికాసింత గాసిప్పూ కూడా చెబితే చెప్పొచ్చు.
ప్రతి టపాలోనూ ఒకటో పదో ప్రశ్నలుంటాయి. ప్రశ్నలకి సమాధానాలు రాసే వ్యాఖ్యలని వెంటనే ప్రచురించను, మిగతా పాఠకులకి కూడా సమాధానమిచ్చే ఛాన్స్ ఉండాలి కదా.
సందేహాలుంటే అడగవచ్చు. నాకు చేతనైన సమాధానమిస్తాను.

Even though this is a learning experience, the main point is to have fun. I hope you do.

ఈ వారం అసైన్మెంటు


ఈ గాయని ఎవరు?
ఇదే పాటని మార్నింగ్ రాగా అనే తెంగ్లీష్ సినిమాలో యథాతథంగా ఉపయోగించారు.
ఈ పాట లాగా అనిపించే పాట ఇంకోటేదైనా మీరు విన్నారా? వినే ఉంటారు. కర్నాటకసంగీతం ప్రధాన పాత్ర పోషించిన ఒక ప్రఖ్యాత తెలుగు సినిమాలో ఒక పాట ఉన్నది. చెప్పండి చూద్దాం.