Sunday, March 11, 2012

నలుపూ తెలుపూ సినీమా .. ఆ .. ఆ!

ఇప్పుడే ది ఆర్టిస్ట్ (The Artist) చూసి వస్తున్నా.

నా చిన్నప్పుడు విజయవాడలో అడపాదడపా పాత నలుపు తెలుపు సినిమాలు వేస్తుండేవాళ్ళు. తరవాత్తరవాత కూడా .. బహుశా కొత్త రిలీజులు రాకపోవటం వల్లనో ఏమో .. పాత సినిమాలు థియెటర్లలో ఆడుతూనే ఉండేవి. ఇలాగే మల్లీశ్వరి, దేవదాసు లాంటి, నేను పుట్టక ముందు తీసిన క్లాసిక్సు థియెటర్లో చూసే భాగ్యం దక్కింది.

అమెరికా వచ్చాక నాకిదొక పెద్ద ఫిర్యాదు సినిమాల విషయంలో - కొత్త సినిమాలు తప్ప పాత సినిమాలు కనబడేవి కావు, టీవీలో తప్పించి. నా అదృష్టం కొద్దీ ఫిలడెల్ఫియా నగరంలో ఆ సమయంలోనే రిట్జ్ అనే థియెటర్లు తెరిచారు. వీళ్ళు మామూలు రోజుల్లో అనేక ఆర్ట్, ఇండిపెండెంట్, విదేశీ కొత్త సినిమాలున్నూ, వేసవి నెలల్లో ఒక్క రెండు వారాల పాటు పాత క్లాసిక్సునీ వేసే వారు. అలా కొన్ని హాలీవుడ్ అద్భుత దృశ్యకావ్యాల్ని వెండి తెరమీద చూసే అదృష్టం దక్కింది.

ఇప్పుడీ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, మొన్న ఆస్కార్ బహుమతి ప్రదానోత్సవం టీవీలో చూస్తూ కించిత్ విచారంతో కూడిన నిట్టూర్పు విడిచాను .. హా, ఈ సినిమాలేవీ నేను చూడలేక పోతినే .. ఇక డిస్కులే శరణ్యమా .. అని. ఇవ్వాళ్ళ యధాలాపంగా వూళ్ళో ఏం సినిమాలాడుతున్నాయో అని చూస్తే, దగ్గర్లోనే ఆర్ట్ సినిమాలు ఆడే మేపుల్ థియెటర్లో ఆస్కార్ పంట పండించుకున్న అనేక సినిమాలు ఆడుతున్నట్టు తెలిసింది. ఆహా ఏమి నా భాగ్యమని, బెస్టు ఫిలిము, బెస్టు ఏక్టరు బహుమతులు కొట్టేసింది గదాని ది ఆర్టిస్టుకి హాజరయ్యాను, మిత్రుడు క్లూనీని కాస్త వెనక్కి తగ్గమని హెచ్చరించి.

ఆసక్తికరమైన కాన్సెప్టు. దుజార్డిన్ చాలా అందంగా ఉన్నాడు (ఈ విషయం ఆస్కార్ షో చూస్తూ ఫేస్బుక్కులో ఒకటికి రెండు సార్లు వక్కాణించాను - Don't worry. I am secure in my masculinity to admire another man's good looks). కథ .. ఈ కథ ఇప్పటికి కొన్ని వందల సినిమాల్లో .. హాలీవుడ్లోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ, తెరకెక్కి ఉంటుంది. ఒక విధంగా ఇది మూగ చిత్రాల తారలైన రుడాల్ఫ్ వేలెంటినో, ఛాప్లిన్ వంటి మహామహుల జీవితాల్లో వారెదుర్కున్న ఆటుపోట్లని తరచి చూసుకోవడం అనుకోవచ్చు. అఫ్కోర్సు, ఛాప్లిన్ జీవితాన్నే దర్శకులు రిచర్డ్ ఎటెన్‌బరో సినిమాగా మలచారు అనుకోండి. ఐతే, పై పై పొరలను వలిచేస్తే .. సినిమా 1920-30లలో హాలివుడ్ ని గురించి కాదు అనుకుంటే - ప్రగతిని నిర్లక్ష్యం చేసేవాడి గతి అథోగతే .. అని సూచించే కథ అని నేననుకుంటున్నా. నిజానికి ఈ కథ, కథానాయకుడు జార్జి వేలెంటిన్ పాత్ర వేపు నించి చూస్తే విషాదాంతం అయుండాలి. ఎందుకంటే, అతను ది ఆర్టిస్ట్ అయితే కావచ్చును గానీ, సినిమా మొత్తంలోనూ అతని గర్వము, ఆత్మాభిమానము, .. ఒక్క మాటలో చెప్పాలంటే దుర్యోధనుడికి ఉన్నలాంటి ఆభిజాత్యం .. hubris .. అతన్ని ఎప్పుడూ మనిషిని కానివ్వదు. పెప్పీ యొక్క ప్రేమ ఆ మార్పుని తీసుకొచ్చిందా అంటే .. నమ్మడం కష్టమే.

పెప్పీగా వేసిన అమ్మాయి, Berinice Bejo బాగా చేసింది. స్టూడియో బాసుగా జాన్ గుడ్‌మెన్ కి ఒక్క అవార్డు నామినేషన్ కూడా రాకపోవడం అమానుషం. తన యజమాని ఎంత దిగజారినా, ఒక ఏడాదిపాటు జీతమియ్యకపోయినా అతన్ని వదిలి పెట్టకుండా కని పెట్టి ఉన్న విశ్వాసపాత్రుడైన షాఫరుగా జేం్‌స్ క్రామ్వెల్ కూడా చాలా బాగా చేశారు. పెప్పీ మొట్తమొదటి సారి స్టూడియోలో అడుగు పెట్టి ఎక్‌స్ట్రాల లైనులో కూర్చుని ఉండగా ఆమె పక్కన (బహుశా తాను కూడా ఎక్‌స్ట్రా పాత్ర కోసం వేచిఉన్నట్టు) వెటరన్ మహానటుడు మాల్కం మాక్డొవెల్ (కలిగులా, ఎ క్లాక్వర్క్ ఆరెంజ్) కనబడ్డం గిలిగింతలు పెట్టింది. సాంకేతికంగా సినిమా బాగున్నట్టే. ముఖ్యంగా ఆ సమయపు హాలీవుడ్ కథని అదే పద్ధతిలో (మూగ పద్ధతిలో) చెప్పాలని డిసైడవటమే దర్శకుడికి ముఖ్యమైన నిర్ణయం అయుంటుంది. అది డిసైడవంగానే మిగతావన్నీ అలా అలా చట్రంలో ఇమిడిపోయాయి. నేపథ్య సంగీతానికి చాలా అవార్డులు వచ్చాయి, నాకైతే చాలా విపరీతమనిపించింది. సైలెంట్ ఫిల్ము తియ్య బూనిన దర్శకునికి నిశ్శబ్దపు విలువ తెలియకపోవడం బాధగా అనిపించింది.

ఆస్కారు బహుమతి గొప్ప సినిమాకి తార్కాణం కాదు అనే భావన మనసులో స్థిరపడిపోయినా (బహుశా English Patient గెలిచినప్పట్నించీ అనుకుంటా) ఈ సినిమాకి బెస్టు పిక్చరు, బెస్టు డైరెక్టరు అవార్డులు ఎందుకొచ్చాయబ్బా అని కించిత్ మీమాంస తప్పనిసరిగా జరిగింది థియెటర్లోనించి బయటపడి కారు దగ్గరికి నడుస్తుండగా. నాకేమనిపించిందంటే .. నాస్టాల్జియా కళాయి పూత పూసిన మధురానుభూతులనే మాయా దర్పణంలో హాలీవుడ్ తనని తాను చూసుకుంది ఈ సినిమాలో. మనమైనా అంతేగా - ఆ మాయలో పడితే బయటపళ్ళేము. హాలీవుడ్డూ అతీతం కాదు, తాను సృష్టించుకున్న మాయలో తానే కూరుకు పోవడానికి (Much Like Velentin's character sinking into the quick sand in "Tears of Love"!)


చివరిమాటకి ముందుమాట .. నా దృష్టిలో ఈ సినిమాకి తార అగ్గీ (జార్జి వేలెంటిన్ పెంపుడు కుక్క, మరియు అతని సినిమాల్లో సహతార).

చివరిమాట .. ఈ సినిమా చూసినంత సేపూ నాకెందుకో అన్నగారు నందమూరి తారకరామారావుగారు మదిలో మెదులుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ ఫీలింగ్ తోసివేయలేకున్నాను.

Monday, March 5, 2012

తెలుగు కథల్లో క్లిషేలు - 3 (ఆఖరు)

1990లలోనూ తరవాత కొంతకాలమూ తెలుగు కథల్లో రాజ్యమేలిన మరో టాపిక్ సీమ ఫేక్షనిజం.

నేను చదివిన చాలా కథలు ఫేక్షనిస్టు దగ్గర పని చేసే ఒక ఛోటా అసిస్టెంటు దృష్టి కోణం నించో, లేక పల్లెలో ఉంటున్న చిరుద్యోగి ఎవరో ఒకరు, ఫేక్షనిజంతో నేరుగా సంబంధం లేనివారు (బడి పంతులు, పోస్టు మాస్టరు, ఇత్యాది) అయిన పాత్ర దృష్టి నించో చెప్పినట్టుగా ఉన్నాయి. ఈ కథ చెప్పే పాత్రకి ఫేక్షనిస్టు ఎందుకు ఆ పని చేస్తున్నాడో నిజంగా తెలియదు, బహుళజాతి వాణిజ్య సంస్థలు చేసే రాజకీయ కుట్రలు సాధారణ సొడాబండి మనిషికి అర్ధం కానట్టే. కానీ అర్ధం కాని వాడు కానట్టు ఉండడు కదా. అతని సిద్ధాంతాలేవో అతనికి ఉంటాయి. ఆ సిద్ధాంతాల్లో ఫేక్షనిస్టుకి ఒక నిర్దిష్ట స్వరూపం ఉంటుంది. వర్మ సినిమాల్లో కనిపించే మాఫియా బాస్కీ ఈ ఫేక్షనిస్టు స్వరూపానికీ ఆట్టే తేడా కనబడదు. అట్లా మూసపోసినట్టుగా ఉంటాయి ఈ పాత్రలు. ఇక మిగతా కథ అంతా చచ్చిపోతున్న, చంపబడుతున్న అమాయకులైన ఫేక్షను సైనికుల గురించి ఆరాటమే, నాశనమైపోతున్న పల్లె శాంతి గురించే.

అసలు నిజం ఏవిటంటే సీమలో ఫేక్షను యుద్ధాలు యుగాలనుంచీ ఉన్నాయి. గడియారం రామకృష్ణశర్మగారి ఆత్మకథలో తెలుస్తుంది. పరమశ్రోత్రియమైన వారి పండిత కుటుంబము కూడా 20వ శతాబ్ది తొలిరోజుల్లో ఈ ఎడతగని యుద్ధాల్లో ఒక పాత్రగా ఉండి ఆ నిమిత్తమై ప్రత్యేకంగా సైనికుల్ని పోషిస్తూ ఉండేవారని. అంటే ఇది కొత్తగా చొచ్చుకు వచ్చిన ఘటన కాదు, గ్లోబలైజేషన్ లాగా. ఐతే కొత్తగా జరుగుతున్నదేమిటంటే, ఒక మోస్తరుగా ఇవి ప్రస్తుత సమకాలీన రాజకీయాలకి ఒక అంతర్భాగంగా తయారయినాయి. ఐతే కథ రాసేవారికి ఆయా పార్టీల చారిత్రక నేపథ్యం గానీ, వారివారి స్వంత వ్యక్తిత్వ బలాలు (వాళ్ళూ మనుషులే కదా) - బలహీనతలుగాని తెలియవు. నేరుగా దాన్ని సమకాలీన రాజకీయ నేపథ్యంలో నిలిపి బేరీజు వేసి ప్రశ్నించే ఆలోచనకానీ ధైర్యం కానీ ఉన్నట్టు కనబడదు. అంచేత ఆ కథలూ ఆ పాత్రలూ ఒక నేపథ్యంలేని వేక్యూములో ఆధారం లేని కీలుబొమ్మల్లా వేళ్ళాడుతుంటాయి.

చివరిగా సాఫ్టువేరు జీవితాలు.
ఒక పక్క సరళ ఆర్ధిక విధానాలు, మరొక పక్క మన (అప్ప్పటి) హైటెక్కు ముఖ్యమంత్రి, ఇంకోపక్క పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన బీపీవో కంపెనీలు, వాటి నీడనే మొలిచిన వందలకొద్దీ ఇంజనీరింగ్ కాలేజీలు. ఇవన్నీ కలిసి మన సమాజంలో ఒక కొత్త వర్గాన్ని సృష్టించాయి. అదే సాఫ్టువేరు వర్గం. మన మధ్యతరగతికి అప్పటి వరకూ ఆర్ధిక లక్ష్యం - కుదిరితే ఒక గవర్నమెంటుద్యోగం, అది కుదరకపోతే కనీసం ఒక బేంకుద్యోగం - ఈ రెంటిలో ఏదో ఒకటి వస్తే జీవితం సెటిలయినట్టే. ఇంజనీరింగు, మెడిసిన్ వంటి వృత్తి విద్యలమీద మనవారి దృష్టి ఎక్కువగా ఉండేది కాదు. ఎంత పెద్దదైనా ప్రవేటు కంపెనీలో ఉద్యోగం అంటే అది అస్థిరత్వానికి చిహ్నంగా ఉండేది.

90లలో ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పెద్ద ఆఫీసరుకి నెలజీతం పదిహేను - ఇరవైవేలు ఉండగా, సాఫ్టువేరు, బీపీవో కంపెనీల్లో మొదలు జీతమే ముప్ఫై వేలు, అనుభవజ్ఞులకి లక్ష దాకా నెలజీతం. ఈ పరిణామం అనేక విధాలుగా మన సామాజిక సౌధాన్ని కుదిపేసింది. ఎట్లాగైనా సరే ఆ సాఫ్టువేరు పల్లకీ ఎక్కెయ్యాలనే యువత ఆశయం ఒక పక్కన. నా కొడుకు/కూతురు/అల్లుడు/కోడలు ఈ రంగంలో స్థిరపడితే ఈ జన్మకి ఒక లాటరీ తగిలినట్టే అని భావించే మధ్యతరగతి తల్లిదండ్రుల ఆశా ఇంకో పక్కన. ఈ వ్యాపార వొరవడిని పూర్తిగా వొంట పట్టించుకోకుండానే మరో బిల్ గేట్స్ అయిపోదామని ఉరకలెత్తే నయా పెట్టుబడిదారుల దురాశ ఒక పక్కన. వెల్లివిరుస్తున్న ఈ వ్యక్తి ఆదాయగంగాప్రవాహాన్ని ఎట్లాగైనా సరే తమ గల్లాపెట్టేల్లోకి మళ్ళించాలని వ్యాపార భగీరథుల కన్సూమరిస్టిక్ జింగోయిజం మరొక పక్కన. ఇన్ని మాటలెందుకు, ఒక్క దెబ్బతో మధ్యతరగతి స్వరూపమే మారిపోయింది - పనిమనిషికిచ్చే జీతం దగ్గిర్నించి, పిల్లలు చదివే స్కూలునించి, నడిపే కారు, ఏడాదేడాది తీసుకునే వెకేషన్ స్పాటు వరకూ.

సాఫ్టువేరు జీవితం అంటే మితిమీరిన డబ్బు. డబ్బెక్కువ అయ్యేప్పటికి కోరికలెక్కువ కావడం. ఓ ఆస్తులు పోగు చెయ్యడం. తల్లిదండ్రుల్ని పట్టించుకోక పోవడం. భార్యాభర్తల మధ్యలో పొరపొచ్చాలు, కుటుంబ వ్యవస్థ ఛిద్రం కావడం. యువత పట్టపగ్గాలు లేకుండా పబ్బుల్లో పడి తాగి తందనాలాడ్డం - మొత్తానికి సాఫ్టువేరు జీవితాల చిత్రణ ఎలా ఉంటుందంటే, ఎడ్గర్ ఏలెన్ పో కథ ఒకటుందిలే. అందులో హీరో విలాసవంతమైన జీవితం కోసం తన ఆత్మని సైతానుకి తాకట్టు పెడతాడు. అలాగే, ఈ సాఫ్టువేరు పాత్రలు పైకి ఎన్ని భోగాలు అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నా లోలోపల తమ ఆత్మల్ని సాఫ్టువేరనే సైతానుకి అమ్ముకున్న వాళ్ళే - వీళ్ళు శాశ్వతంగా సుఖంగా వుండలేరు - అనేలాంటి శాపంతో కూడిన తీర్మానం ఒకటి కనిపిస్తూంటుంది. అంతే తప్ప మంచేవిటి, చెడేవిటి, ఈ రెండిట్లో ఏది జరిగినా దానికి వెనక ఉన్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ మూలాలేవిటి - ఏది వ్యక్తిగతం, ఏది సంస్థాగతం - ఇటువంటి వివేచన కానీ విశ్లేషణకానీ కనబడదు. ఒక విధంగా అభ్యుదయవాదం, అభ్యుదయభావం అంటే డబ్బుండడాన్ని వ్యతిరేకించడం లాగా కనబడుతోంది. చేతులో కొంచెం డబ్బు ఆడుతోంది, కాస్త భోగాన్ని అనుభవిస్తున్నారు ఎవరైనా అంటే, వాళ్ళు కచ్చితంగా ఏదో ఒక నైతిక పతనానికి దారితీసే వాళ్ళో, లేక ఏదో తెలీని దుఖంతో లోలోపల కుమిలిపోయేవాళ్ళు అయుండాల్సిందే. ఈ నేపథ్యంలోనే పనిలో పనిగా తరాల అంతరాల్ని చిత్రించడం కూడా బాగా కనిపిస్తోంది. కథలో ఒక రిటైరైన వర్గం (తాత), నడివయసు వర్గం (తండ్రి), యువవర్గం (కొడుకు). కథ రాసే రచయిత నడివయసు వర్గానికి చెంది ఉంటాడు. దాంతో ఎప్పుడూ యువవర్గానికి న్యాయం జరిగినట్టు నాకైతే అనిపించలేదు, పాత్ర చిత్రణలో, నిజాయితీలో. ఎప్పుడూ ఈ వర్గం స్వార్ధ పూరితమైనదిగానూ, పెద్దవారి పట్ల వినయమూ ప్రేమా లేనిదిగానూ, చిత్రించబడుతూ వస్తున్నది.

నేను ఈ మూడు వ్యాసాలూ ఎందుకు రాశాను అని కొందరు మిత్రులు (ఆప్యాయంగానే) ప్రశ్నించారు. ఈ వ్యాసాలు చదివి కథలు రాస్తున్నవారు తమ పద్ధతుల్ని మార్చేసుకుంటారని నాకేమీ భ్రమలేదు. కానీ బ్లాగరులలో సాహిత్యం పట్ల కొత్త ఇష్టాన్ని అభివృద్ధి చేసుకుంటున్న రచయితలూ పాఠకులూ చాలా మంది కనిపిస్తున్నారు. ముఖ్యంగా యువతీయువకులు - తమ కథల్ని తామే రాసుకుంటున్నారు. కొత్తపుంతలు తొక్కుతున్నారు. వారికోసమే నేనీ వ్యాసాలు రాశాను. మూడు నాలుగు కొత్త మోడలు సెల్ ఫోనులు మార్కెట్లోకి వచ్చినాయంటే, మన స్నేహితులు పదిమందీ ఒకానొక మోడలుని సిఫారసు చేస్తే మన మనసు కూడా దానివేపే మొగ్గుతుంది. అలాగే సాహిత్యరంగంలో కూడా, ఇవ్వాళ్టి ట్రెండు ఇదే, ఇవే అభ్యుదయ రచనలు అని శాసించే శక్తులు కొన్ని ఉన్నాయి. (ఎప్పుడూ ఉంటాయి కూడా. అవి ఉండడం సమస్య కాదు.) కానీ ఆ ట్రెండ్సుని గుడ్డిగా నమ్మేయడం కాకుండా, మనం చదివేది ఎలా చదువుతున్నాం, రాసేది ఎందుకు రాస్తున్నాం అని జనాలు ఆలోచిస్తారనే ఆశతో, ఆ ఆలోచన రగల్చడానికి చిన్న వత్తిలాగా ఈ వ్యాసాలు ఉపయోగపడతాయనే ఆశతో ఇవి రాశాను.
***

నేను ఉదహరించిన క్లిషేలని ధిక్కరిస్తూ వచ్చిన కొన్ని మంచి కథలు గుర్తొచ్చాయి ఈ వ్యాసం రాస్తుండగానే. వాటి జాబితా ఇదిగో:

ప్రయోగం - వోల్గా
వివాహాన్ని గురించి, స్త్రీ పురుష సంబంధాల్ని గురించి స్పష్టమైన అభిప్రాయాలున్న యువతి కథ. దీన్నించి పురుషులు, స్త్రీలు కూడా నేర్చుకోవలసింది చాలా ఉంది.

జ్ఞాతం - వివినమూర్తి
తరాల అంతరాలు, సాఫ్టువేరు జీవితాలు, అభ్యుదయం-స్వార్ధం ఘర్షణ - వీటన్నిటి మధ్య నలుగుతున్న నాలుగు జీవితాలు .. సంక్లిష్టమైన సమీకరణాల్ని ఆర్ద్రతతో చర్చించిన మంచి కథ

వీరనారి - సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి
ఫేక్షనిజం నేపథ్యంలో అమరవీరుని భార్య వీరపత్ని, మళ్ళీ తన కొడుకుని వీరుణ్ణి చేసి అదే (తనదికాని) యుద్ధానికి బలి చేసి వీరమాతగా ఎదగాలనే వత్తిడిని ధిక్కరించిన వీరనారి కథ.

టైటానిక్ - సురేష్ బాబు
సరళ ఆర్ధిక విధానాలు ఎలా క్రమబద్ధంగా లీగల్‌గా ఒక పెద్ద ప్రభుత్వ కంపెనీని ముంచేశాయి అని మంచి శిల్పంతో చిత్రించిన కథ.

గేటెడ్ కమ్యూనిటీ - అక్కిరాజు భట్టిప్రోలు
ఇరవయ్యేళ్ల తరవాత కలుసుకున్న బాల్య మిత్రుల మధ్య తెరుచుకోని గేటు- వారి ఆర్ధిక స్థితిలోని తేడా.