Friday, April 22, 2011

నాస్టాల్జియా - తొలి తెలుగు బ్లాగుపుస్తకం

మధ్యాహ్న భోజనం పూర్తయ్యి ఒకింత భుక్తాయాసంతో కన్నులరమూత పడుతున్న సమయంలో వేకువకీ సుషుప్తికీ మధ్య తెలివి ఊగిసలాడుతున్న స్థితిలో వీచికలుగా ఏవేవో పాత ముచ్చట్లు తోచాయి.

అలా గుర్తొచ్చాడు ప్రవీణ్.

గబుక్కున మెలకువొచ్చింది. వెదికితే దొరికింది అతని బ్లాగు. ఎక్కడికీ పోలేదు అక్కడే భద్రంగా ఉంది. పెళ్ళి చేసుకుని బ్లాగురాయడం మానేసినవారిలో ప్రవీణు కూడ ఒకరు. ఆ రోజుల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ కి సంబంధించిన సాంకేతిక విషయాలమీద సరళమైన తెలుగులో మంచి టపాలు రాస్తుండేవాడు.

ఇంచుమించుగా వొంటిచేత్తో ప్రవీణ్ సాధించిన ఘనకార్యం మరోటి ఉంది.
అదే తొలి తెలుగు బ్లాగు పుస్తకం.

ప్రవీణ్ మళ్ళీ తెలుగులో రాస్తుంటే బాగుణ్ణు.

Wednesday, April 20, 2011

I have no more fingers left ...

.. to count the anniversaries of man-made disasters and atrocities!

That's okay.

However, I dread the day when I shall have no more feelings left.

One more first anniversary today.

Sunday, April 17, 2011

కబుర్లు - ఏప్రిల్ 18

వసంతాగమనంతో ప్రకృతిలో జరిగే మార్పులు అలా ఉండగా, అమెరికను సాంఘిక జీవనంలో ఈ సమయానికి ప్రతి యేడూ కొన్ని కొన్ని విశేషాలు జరుగుతూ ఉంటాయ్. బడులకి స్ప్రింగ్ బ్రేక్ శలవలు (దాంతోబాటే ఉద్యోగస్తులైన తలిదండ్రులు వారంరోజులు శలవతీసుకోవడమూ), ఈస్టరు పండగా, తత్సంబంధమైన గుడ్ల వేట, ఈస్టరు కుందేళ్ళ దర్శనాలు, బహుమతులు, ప్రార్ధనలు, గట్రా. ఇలాగే ప్రతియేడూ క్రమం తప్పకుండా ఈ సమయంలో వారం రోజుల పాటు జరిగే తమాషా నేషనల్ పబ్లిక్ రేడియో వారి భిక్షాటన సప్తాహం.

అమెరికావాసులు కానివారికి ఈ టూకీ పరిచయం. ఇక్కడ టివీ ఛానెళ్ళూ, రేడియో స్టేషనులూ అన్నీ ప్రైవేటు సంస్థలవే. అవి ప్రకటనల అమ్మకంద్వారా డబ్బు సంపాదిస్తాయి. వీటికి భిన్నంగా, వ్యాపార ప్రకటనలు లేకుండా రేడియోలో నేషనల్ పబ్లిక్ రేడియో (NPR) అనీ, టీవీలో పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ (PBS)అనీ సంస్థలు ఉన్నాయి. ఈ రెండూ లాభాపేక్ష లేని (non-profit) సంస్థలు. ఇలాంటివే మరికొన్ని ఉన్నాయి, PRI, APM, ఇలాగ, కానీ ఈ రెండూ పెద్దవీ, ముఖ్యమైనవీనూ. వీటిని నడిపేందుకు అవసరమైన ఆర్ధిక మదుపు ఎక్కువభాగం ప్రజల చందాల ద్వారా సమకూరుతుంది. వాణిజ్య సంస్థలుకూడా చందాలు ఇస్తుంటాయి, తమ ఎండోమెంట్ ఫౌండేషన్ల ద్వారా. కార్పొరేషన్ ఫర్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ అనే సంస్థ ద్వారా అమెరికను ప్రభుత్వం కొంత డబ్బు వీటికి ఇస్తుంది. వీళ్ళకి వచ్చే ఆదాయంలో సింహభాగం సాధారణ ప్రజలు కట్టే చందాల వల్ల కాబట్టి ఆయా పబ్లిక్ రేడియో స్టేషన్ల వాళ్ళు మార్చి-ఏప్రిల్ నెలల్లో ఒక వారం రోజులపాటు రేడియోమీద అతి దర్జాగా భిక్షాటనం చేస్తారు.

ఇప్పుడు మళ్ళీ అసలు కథకొద్దాం.

కొన్ని నెలలకిందట యువాన్ విలియంస్ అనే సీనియర్ విశ్లేషకుడి కాంట్రాక్టుని అథాట్టుగా రద్దుచేసి NPR తానే వార్త అయి కూర్చున్నది. ఆ సందర్భంలో విలియంస్ గారి ప్రవర్తన వివేచనారహితంగా ఉన్నదా అన్న ప్రశ్న పక్కన పెడితే, విలియంస్‌ని వదిలించుకున్న పద్ధతిలో NPR తప్పులో కాలువేసిందనే పబ్లిగ్గా అనుకున్నారు. అదలా ఉండగా, మొన్నటి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికను పార్టీ ఢంకా బజాయించి కాంగ్రెసు పగ్గాల్ని చేబట్టిందిగదా. అసలుకి NPR ఎప్పుడూ లిబరల్ ఎజెండాని సమర్ధిస్తూ ఉంటుంది, తమ కన్సర్వేటివ్ ఎజెండాని చిన్న చూపు చూస్తుంది అని రిపబ్లికన్ల గునుపు. దాంతో ఈ సంవత్సరపు కాంగ్రెసు సెషన్లలో దీన్ని ఒక పట్టుపట్టక తప్పదని వాళ్ళు తర్జనభర్జన పడుతున్న సమయంలోనే మూలిగే నక్కమీద తాటికాయ పడినట్టు NPR మీద జేమ్స్ ఓకీఫ్ పడ్డాడు. ఈ దెబ్బతో NPR సీయీవో రాజీనామా చేశారు. జేమ్స్ ఓకీఫ్ బయలుపరచిన విడియోతో నసాళం అంటిన కాంగ్రెస్ రిపబ్లికన్లు అమెరికను ప్రభుత్వాన్నించి NPRకి అందే నిధుల్ని పూర్తిగా అరికట్టాలను బిల్లు ఆమోదించారు. రిపబ్లికన్ల కసరత్తు సాగుతుండగానే, వసంతకాలపు భిక్షాటన సప్తాహం మొదలైంది. ఈ సంచలన సంఘటనల నేపథ్యంలో సాధారణ ప్రజలు ఇచ్చే చందా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతే కాదు, NPRవార్తా ప్రసారాల్లో తరచూ వినిపించే కొందరు ప్రముఖ విలేఖరులు, విశ్లేషకులు - ఎందుకు అమెరికను రాజకీయ సాంఘిక చైతన్యంలో NPR ముఖ్యమైనదో - తమమాటల్లో చెబుతూ వస్తున్నారు. అంటే, మీరెన్నుకున్న ప్రభుత్వం మా ఫండింగ్‌ని కత్తిరించింది, మేం చేస్తున్న పని మీ తరపునే కాబట్టి మీరే ఇంకాస్త ఆర్ధిక సహాయం చెయ్యాలని చెప్పకనే చెప్పినట్టయింది.

మామూలుగా నాకు ఈ భిక్షాటన వారంరోజులూ NPRవినడం ఇష్టం ఉండదు, వాళ్ళ దీనాలాపాలు వినలేక. కానీ ఈ సారి మాత్రం - ఘటోత్కచుడు అన్నట్టు - ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి. ప్రతిరోజూ, వీలు దొరికినప్పుడల్లా రేడియో పెట్టుకుని మరీ వింటున్నా!

Thursday, April 14, 2011

అసంపూర్ణ పద్యం

రహస్యంగా నన్ను పిలిచి
మన్నించిన పద్యం
గుహతలుపు
ఇప్పుడు మూసుకుపోయింది.
తలుపు తెరిచే మంత్రం
మరిచిపోయాను.

పనిముగించుకుని వస్తానని
పరకాయంలో దూరాక
నిజశరీరంలా పద్యం
నిస్తేజంగా పడివుంది.
తిరిగి ప్రవేశించేసూత్రం
మరిచిపోయాను.

కళ్ళు నిలిపినంత సేపు
కన్నియలా నర్తించిన పద్యం
కాలు తగిలి రాయిలా మారిపోయింది
ఈ శిలకిప్పుడు ప్రాణం పోయలేను.

మనోకాసారంలో పద్యం కదిలినప్పుడు
ప్రతిరూపమూ అలలు అలలుగా చెదిరిపోతుంది.
అలజడి ఉన్నప్పుడే పద్యం పూర్తి కావాలి
ప్రతిరూపం తిరిగి ఏర్పడిందంటే
ఇక, పద్యం పూర్తి కాదన్నట్టే.

రాసింది విన్నకోట రవిశంకర్.
ఈ పద్యమూ, ఇంకా ఇట్లాంటివీ ఇంతకన్నా అందమైనవీ సుమారు నలభై పద్యాలు రెండోపాత్రలో.

Saturday, April 9, 2011

అవినీతి వ్యతిరేక పోరాటాన్నించి మనం ఏం ఆశిస్తున్నాం

ఎనాలిసిస్ బ్లాగులో భలే చెప్పారు అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటాన్నించి పుట్టుకొచ్చిన రాజకీయుల సర్కస్ తమాషాని.

అన్నలారా అక్కలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా .. గమనించండి. గుర్తు పెట్టుకోండి. మనం పూర్తిగా కళ్ళు తెరవకపోతే, విషయాల్ని ఉన్నవి ఉన్నట్టుగా అర్ధం చేసుకుని వ్యవహరించకపోతే - ఇప్పుడైనా ఎప్పుడైనా మనకి మిగిలేది రాజకీయ సర్కస్ తమాషాయే!

మీకు గుర్తుందా? 2004లో బాబు ఎనిమిదేళ్ళ పాలనమీద ఎంత వ్యతిరేకత? అలనాటి బీజేపీ "భారత్ వెలిగిపోతోంది" అన్న ఏడ్ కేంపేన్ ఏమయింది - మంటగాలి పోయి ఇంత గుప్పెడు బూడిద మిగిలింది. ఎంత ఆశతో, ఎన్ని గొప్ప ఆశయాలతో కాంగ్రెస్‌ని ఎన్నుకున్నారు ప్రజలు, రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ?

ఏమయిందా తరవాత? 2004 లో ప్రభుత్వాలు మారినప్పుడు నేనక్కడే ఉన్నా. మళ్ళీ 2009లో ఒకసారి భారత్ కి వచ్చా. ఎందరో వివిధ వృత్తుల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడా. అందరూ చెప్పింది ఒక్కటే .. ఆ పెద్దగా ఏం తేడాలేదు .. కత్తి పోయి సుత్తి వచ్చే ఢాం ఢాం ఢాం.

ఇప్పుడు ప్రశ్న అవినీతిలో వారెక్కువా వీరెక్కువా అని కాదు. నాకు వ్యక్తిగతంగా ఇరుపక్షాలమీద మోజూ లేదు, అలాగని ద్వేషమూ లేదు. మార్క్ ఏంటొనీ లాగా నేనిక్కడ సీజర్‌ని సమాధి చెయ్యడానికి వచ్చాను - బ్రూటస్‌ని తెగిడేందుకు కాదు.

అయ్యా - ఏదో ఒక గొప్ప దశగ్రహ కూటామి సంభవించి భారత్‌లో కనీవినీ ఎరుగని విధంగా ప్రజా చైతన్యం నిప్పు రాజుకుంది - అన్నా హజారే అనే డెబ్భైరెండేళ్ళ కొవ్వొత్తి వల్ల ఐతే అవుగాక. ఈ నిప్పు రాజుకున్నది. ఐతే దీని పర్యవసానం ఏమిటి? ఇది దావానలంలాగా చేతికందినంత మేరా కబళించడమా? లేక నూట ఇరవైకోట్ల భారతీయుల కరదీపికలుగా ప్రజ్వరిల్లి ఉజ్జ్వల భవిష్యత్తుకు దారి చూపటమా? అది మన చేతుల్లోనే ఉంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట పడాలని సామెత. లోకపాల్ బిల్లు వచ్చినంత మాత్రాన అవినీతి ఆగుతుందా?

మన పంచాయితీ లేక మ్యునిసిపల్ వార్డు దగ్గర్నించీ, స్థానికి ప్రభుత్వ కార్యాలయాల మీదుగా ప్రధాని కార్యాలయం వరకూ ఇదొక అవినీతి రాచబాట. ఇందులో - ప్రభుత్వాధికారుల దొకదారి. రాజకీయులది ఇంకోదారి. మొదటిది గుళ్ళో లింగాన్ని మింగే రకమయితే, రెండోది గుడినే మింగేది. దేన్ని ఎట్ల నియంత్రిస్తాం? నిలువరిస్తాం?

We need Objective Verifiable Indicators!!

Thursday, April 7, 2011

ప్రపంచం భారతాన్ని ఎలాచూస్తోంది

ది ఎకానమిస్ట్ (The Economist) పత్రికలో భారత్‌లో అవినీతి గురించి ఒక చిన్న నివేదిక చదివాను. మన పత్రికల్లో ఇతర మీడియాలో గత కొన్ని నెలలుగా పెచ్చుమీరుతున్న అవినీతిని గురించి రేగుతున్న హోరుకి ఆల్రెడీ చెవులు దిబ్బెళ్ళు పడిపోయినా, విదేశీయులు దీన్ని ఎలా చూస్తున్నారా అని ఆసక్తిగా చదివాను. పోయినేడు కామన్వెల్త్ గేమ్స్ అప్పటినించీ ఇది రేగుతున్నదే, 2జి విషయంలో పతాకస్థాయికి చేరుకుంది. అయినా మన మీడియాకి ఆత్రమెక్కువలే, గోరంతని కొండంతలు చేస్తారు, దాన్ని పట్టుకుని ప్రతిపక్ష పార్టీలు తందనానా ఆహి అని వంతపాడి మరికాస్త రక్తి కట్టిస్తారు, ఆ మాటకొస్తే ఆ మాత్రం అవినీతి లేణిదెక్కడ అనుకున్నా.

ఈ నివేదిక కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. అసలు ఆ రిపోర్టింగ్ దృష్టే వేరుగా ఉంది. అవినీతి, అమ్మ బాబోయ్ అవినీతి, హమ్మయ్యో హింత అవినీతే అని బుగ్గలు నొక్కుకోవటమూ, గుండెలుబాదుకోవటమూ చెయ్యకుండా వ్యాపారమ్మీద, ముఖ్యంగా అంతర్జాతీయ వ్యాపారసంబంధాల మీద ఈ అవినీతి ముద్ర ఎలా పడుతున్నది? 16 ఆసియా దేశాల వాణిజ్య వాతావరణాన్ని బేరీజువెయ్యగా, భారత్ అందులో కిందనించి నాలుగోస్థానంలో ఉందిట. చైనా వియత్నాములకంటే ధ్వాన్నంగా ఉండటమే అవమానకరం అనుకుంటే అష్టదరిద్రాలకి ఆలవాలమైన కాంబోడియాతో సమానంగా ఉన్నాముట మనం. భారత్ అంటే ఎవరో కాదు, మనమే. ఎట్లాగూ గణాంకాలు మొదలెట్టాం కాబట్టి ఇంకో రెండు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కంపెనీల అధిష్ఠానాల సర్వేలో గత అయిదేళ్ళల్లో భారత్ పరువు ప్రతిష్ఠలు సగానికి సగం పడిపోయాయిట. 2008తో పోలిస్తే 2009లో విదేశీ మదుపు (FDI) 33 శాతం తగ్గింది. మనవంతు మదుపు చైనాలో జరిగిన మదుపులో నాలుగోవంతు కూడ లేదు.

ఇదంతా అవినీతి మూలంగానేనా? మనదేశంలో మీడియాకి స్వేఛ్ఛ ఉంది, వేరే పనేమీ లేదు కాబట్టి ఇట్లాంటి కుళ్ళుతున్న శవాల్ని తవ్వి తియ్యడమే మన మీడియాకి పని కాబట్టి, భారత్‌లో ఇలాంటి విషయాల గురించి పెద్ద యెత్తున రభస జరుగుతుంది. అదే చైనాలో ప్రభుత్వం కనుసన్న చేస్తే తప్ప, మీడియా కాదు, వాడీ బాబు కాదు, ఎవ్వడూ నోరు మెదపడానికి లేదు. అక్కడ అవినీతి లేదంటే నమ్మేసేందుకు ఎవడూ చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకు కూర్చోలేదు.

ఐతే చిన్నపిల్లల ఆటల్లో అవతలవాడూ తొండి చేసినా ఏమీ అనని రిఫరీ మనం తొండి చేసినప్పుడు మాత్రం పెనాల్టీ వేస్తే గోల చేసినట్టుగా ఉంటుంది. ఏది ఏమైనా ఈ అవినీతి మూలంగా విదేశీ వ్యాపారాలు వెనుకంజ వేస్తున్నాయనేది విస్మరించలేని నిజం. గత ఇరవయ్యేళ్ళలో మారి పోయిన ప్రపంచంలో, మారుతున్న భారతీయ ఆర్ధిక వ్యవస్థలో ఇప్పుడు నన్ను ముట్టుకోకు నామాలకాకి అని ముక్కు మూసుకుని కూర్చోవడం కూడా సాధ్యపడే పని కాదు. మన కంపెనీలు విదేశాల్లో వ్యాపారాలు చెయ్యాలి, విదేశి కంపెనీలు మన దేశంలోనూ చెయ్యాలి. అంచేత ఈ అవినీతి భూతాన్ని ఏ సీసాలోనో పట్టి బంధించగల రాజకీయ మంత్రగాడు కావాలి.

పైగా పలువురు విదేశీ సీయీవోల నోట పొక్కుతున్న మాట - ఎక్కడన్నా లంచమిస్తే మన పని తొరగా జరుగుతుంది. కానీ భారత్‌లో లంచానికి లంచం ఇచ్చాక కూడా మన పని జరుగుతుందని నమ్మకం లేదు. అంటే .. మదుపుకి రక్షణ లేదు!

అయ్యా, అదీ సంగతి.

తాజా కలం: ఈ టపా అంతా రాసేశాక ఇవ్వాళ్ళ పలు బ్లాగుల్లో చూశాను, వృద్ధ కృద్ధ యోధుడు అన్నా హజారే అవినీతి పై సమరశంఖం పూరిస్తున్నారని. బ్లాగరులందరం కలిసి ఆయన ప్రయత్నానికి మద్దతుగా ఏమన్నా చెయ్యలేమా?

Tuesday, April 5, 2011

తెలుగు పాఠం - ఏప్రిల్ 5 - క్రావడి చిందులు

గతంలో తెలుగు పాఠాలు వెలువరించి అప్పుడే చూస్తూ చూస్తూ ఏడాది కావస్తున్నది.
మరీ ప్రతీవారమూ క్రమంతప్పకుండా చెయ్యలేకపోయినా అప్పుడప్పుడూ, ఏదైనా చెప్పాలని బుద్ధికి తోచినప్పుడు మంగళవారం పూట ఈ శీర్షికన మళ్ళీ వెలువరిస్తుంటాను.

భవదీయుడు బ్లాగరి, యువమిత్రుడు కమల్ చక్రవర్తికి "వ్రాయటం" అంటే ప్రాణం. చాలామంది బ్లాగర్లు వ్రాయకుండా రాసేస్తున్నారని ఆయన తన ఆవేదన చాలాచోట్ల వ్యక్తం చేశారు.

తెలుగులో కొన్ని పదాలకి మొదటి అక్షరానికి ఇలా క్రావడి (ర వొత్తు) ఉన్నది. అది ఆ పదం లక్షణం .. అంతే. కానీ మాట్లాడేటప్పుడు ఆ క్రావడిని ఉచ్చరించక పోవడం కూడా అనాదిగానే వస్తున్నది. ఉదా. క్రింద .. కింద; బ్రతుకు .. బతుకు. క్రావడి వాడినంత మాత్రాన అది గ్రాంధిక భాష అని చాలామందికి ఒక భ్రమ ఉన్నది. క్రావడి లేకపోతే అది వ్యావహారికభాష అనే అపోహకూడా ఉన్నది. ఇది గ్రాంధిక వెర్సస్ వ్యావహారిక పోటీ కానే కాదు. అసలు 1900 సంవత్సరం ప్రాంతాల్లో గ్రాంధికభాషకి ప్రత్యామ్నాయంగా సూచించబడిన భాషకి శిష్టవ్యావహారికమని పేరు. అంటే పెద్దలైనవారు, బాగా చదువుకున్నవారు, సాంప్రదాయం బాగా తెలిసినవారు సామాన్యంగా తమ వ్యవహారాల్లో వాడుతుండే భాషని ప్రామాణికం చెయ్యాలి, ముఖ్యంగా విద్యాబోధనలో అనేది అక్కడి చర్చనీయాంశం. అలా శిష్టవ్యావహారికం మన విద్యా వ్యవహారాల్లో ప్రమాణం అయింది. నేను పదోతరగతి దాకా తెలుగుమీడియంలోనే చదివాను. అప్పట్లోకూడా సైన్సు సోషలు పరీక్షల్లో వాక్యాలు పద్ధతిగా రాయవలసి వచ్చేది. వృక్షములకు కొమ్మలు ఉండును, ఇట్లు ప్రయోగము చేసితిని, అక్బరు జనరంజకముగా పరిపాలించెను - ఇలా రాసేవాళ్ళం. అక్బరు యుద్ధం చేశాడు, నేను ప్రయోగం చేశాను అని రాస్తే మార్కులు తగ్గించే వాళ్ళు. అది గ్రాంధికం కాదు, వ్యావహారికమే.

ఏదో ఒక సందర్భంలో, రాసిన తెలుగు మాట్లాడే తెలుగుని ప్రతిబింబించడం మొదలు పెట్టింది. ముఖ్యంగా సృజనాత్మక రచయితలు, కవులు ఇటువంటి వాడుకలు మొదలు పెట్టి ప్రచారం చేశారు. వివిధ విషయాలపై పత్రికలలో ప్రచురితమవుతున్న వ్యాసాల్లో కూడా ఈ ధోరణి ప్రబలింది. భాష విషయంలో బాగా పట్టుదల ఉన్న సంపాదకులు కొందరు, నార్ల, కొడవటిగంటి ప్రభృతులు కూడా ఈ పరిణామానికి దోహదం చేశారని నా నమ్మకం. దీన్ని వాడుక తెలుగు అనడం మొదలుపెట్టారు. కొంతమంది మనం మామూలుగా వాడే
స్పెల్లింగులని కూడా తమకి ఇష్టమైనట్టుగా మార్చుకుని వాడడం కొనసాగిస్తున్నారు. ఉదా: వూరు, యేరు. అటుపైన ఆయా వాడుకలు ఆయా రచయితల వ్యక్తిగత శైలిగా నిలిచిపోయాయి. సృజనాత్మక రచనలో అంటే సరే ఆ రచయిత ఇష్టం - మరి వ్యాసాల్లో, పత్రికల్లో, బ్లాగుల్లో - ఏ పబ్లిక్ డొమెయిన్‌లో అయినా వాడే భాషకి ఒక ప్రమాణం ఉండనక్కర్లేదా? ఎవరిష్టం వచ్చినట్టు వారు రాసుకుంటూ పోతే భాష ఏమైపోతుంది. ఇవ్వాళ్ళ రేపు, మన వెండితెర హీరోలని అనుసరిస్తూ యువత ఎవరూ ళ ఉచ్చరించడం లేదు - వాల్లు వచ్చారు, వెల్లరా వెల్లు, కల్లు తెరిచి చూడు - ఇలా మాట్లాడుతున్నారు. మాట్లాడినట్టే రాయాలి అంటే, రేపట్నించీ తెలుగులో ళ అనే అక్షరం అదృశ్య మైపోతుందేమో? ఇదొక ఆసక్తికరమైన చర్చ.

వ్రాయడం రాయడం గురించి ఇంకో తమాషా ఉంది. తెలుగులో రాయడం అంటే రుద్దడం అనే అర్ధం కూడా ఉంది. నూనె రాయడం, వొంటి మీద రాయడం .. ఇలా. దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ వ్రాయడం అనరు. ఐతే, క్రావడితో మొదలయ్యే అన్ని పదాలకీ ఇటువంటి సమస్య లేదు. క్రింద అన్నా, కింద అన్నా అర్ధంలో తేడా ఏంలేదు.

ఇంకో తమాషా కూడా ఉంది. నేను బడి విడిచిపెట్టినాక రాస్తున్న తెలుగులో ఎప్పుడూ రాస్తూనే వచ్చాను - వ్రాయలేదు. దీన్ని గురించి కొంత ఆలోచించిన తరవాత, వ్రాయడమే కరక్టు అని తెలిశాక కూడా చాలా కాలంగా అయిన అలవాటు ప్రభావమో ఏమో, రాయడం సాగినట్టుగా వ్రాయడానికి చేతులు రావు.

ముచ్చటగా మూడో తమాషా - ఈ క్రావడి చిందులు తెలుగు పదాలకి మాత్రమే. సంస్కృత తత్సమాల (అంటే సంస్కృతంలో పుట్టి తెలుగులో వాడుతున్న పదాలు)కి ఈ సందిగ్ధం లేదు, అక్కడ క్రావడి ఉంటే చచ్చినట్టు వాడాల్సిందే.

ఇప్పుడు పాఠకులకి హోంవర్కు: మీ దృష్టికి వచ్చిన మరికొన్ని తెలుగు క్రావడి పదాల్ని రాయండి. క్రావడి ఉండాలా, అక్కర్లేదా? ఉన్న క్రావడి తీసేస్తే ఆ పదానికి వేరే అర్ధం వస్తున్నదా? ఎలా రాసినా పరవాలేదా? మీ అభిప్రాయం కూడా చెప్పండి.

Sunday, April 3, 2011

కబుర్లు - ఖర ఉగాది

అందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు.

కొత్త సంవత్సరం పేరు ఖర అని తెలిసిన దగ్గర్నుండీ ఏవిట్రా ఈ పేరు కమామిషు అని బుర్ర గోక్కున్నా. కడివెడైననేమి ఖరము పాలు అని వేమన పద్యం తెలుసుగదా! అంటే గాడిద అన్న మాట. ఖరదూషణులని ఇద్దరు రాక్షసులున్నారు రామాయణంలో. శూర్పణఖ అన్నదమ్ములు. శ్రీరాముడు వారిని సంహరించాడు కాబట్టి ఖరహరుడు, ఖరాంతకుడు అని పేరు పొందాడు. ఆయనకి ఇష్టమైన రాగంగా ఖరహరప్రియరాగం ప్రసిద్ధికెక్కింది. ఖర అంటే పదునైన, వాడిగల అని కూడా అర్ధమున్నదిట. ఈ ఖరవత్సరం శ్రీకరమై అన్నిరకాల అవరోధాలను అశుభాలను వాడిగా ఛేదిస్తూ వడిగా వేడిగా మీమీ లక్ష్యాలదగ్గరకు మిమ్మల్ని చేర్చాలని నా శుభాకాంక్షలు.

మార్చి ఇరవై నించీ వసంతారంభం అని లెక్క. మరి తెలుగు ఉగాది కూడా వచ్చేసింది కాబట్టి మరి నిజ్జంగా వసంతం వచ్చెయ్యాలి గద! గత వారంలో పూర్తిగా మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రత యాభైలతో దోబూచులాడుతుంటే, అవునుగామోసు అని నమ్మెయ్యడానికి రెడీ అయిపోయాను. నా అమాయకత్వాన్ని పటాపంచలు చేసి వాస్తవాన్ని పరిచయం చేస్తూ ఇవ్వాళ్ళ ఓ బుట్టెడు మంచు కురిసింది.

లిబియాలో స్వాతంత్ర్య సమరజ్వాలలు రగులుతూనే ఉన్నాయి, నేటో విమానదాడులు ఆ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. గద్దాఫీ వారుణాస్త్రాలు పెద్దగా పని చేస్తున్నట్టు లేదు. టూనీసియాలోనూ, ఈజిప్టులోనూ డిక్టేటర్లకి ఉద్వాసన చెప్పే ప్రక్రియ (ఉద్యమం? విప్లవం?) కొంతలోకొంత శాంతియుతంగా జరిగింది కాని, బహ్రేన్ సౌదీలలో ఉద్యమాన్ని డబ్బుతో కొనేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎటొచ్చీ లిబియా, యెమెన్ మాత్రం రగులుతున్నాయి. కాష్టం నించి చుట్టముట్టించుకునే అవకాశవాదిలాగా లిబియా చమురు బయటికి ప్రవహించట్లేదని చమురు కంపెనీలన్నీ పెట్రోలు ధరని ఆకాశానికెత్తేసి లాభాలు దండుకుంటున్నాయి. వాలువీధి రేపనేది లేనట్టు నింగికి పాకుతోంది.

ఉగాది అనగానే తెలుగు నాట కవిసమ్మేళనాలు జరపడం సాంప్రదాయం. పొద్దు జాలపత్రిక వారి చొరవతో 2008లో సర్వధారి ఉగాదికి మొదటిసారి జాలకవిసమ్మేళనం జరిగింది. 2009లో విరోధి ఉగాదికి అది ఒక కొత్త వరవడిగా ఎదిగి, 2010 వికృతి ఉగాదితో సాంప్రదాయంగా పరిణమించింది. తెలుగు బ్లాగుల ఆవిర్భావంతో జరిగిన ఒక శుభపరిణామమిది. యువమిత్రుడు బ్లాగాడిస్తా రవి అధ్యక్షతన శ్రీఖర ఉగాదికి కూడా విద్వత్కవిసభ సలక్షణంగా అలంకారయుతంగా నవరసభరితంగా జరిగిన తార్కాణాలు కనిపిస్తున్నాయి. బహుశా ఇవ్వాళ్టితో మొదలెట్టి ఆ సభ విశేషాల్ని పొద్దులో ప్రచురిస్తారు. పద్యకవిత్వం మీద ఆసక్తి ఉన్నవారు తప్పక చదవండి.