Thursday, March 31, 2011

రచయిత రచన భాష

ప్రతి కళలోనూ కళాకారుడికి కొన్ని పనిముట్లు ఉంటాయి. చిత్రకారుడికి కుంచెలూ కేన్వాసు, శిల్పికి ఉలి సుత్తి. రచయితకి కూడా ఉన్నై పాత రోజుల్లో అయితే గంటాలు, భూర్జపత్రాలు, తరవాత ఇంకు పెన్నులు కాయితాలు, ఈ రోజుల్లో అయితే కంప్యూటర్లు.

అసలు సరుకంతా ముడిపదార్ధంలో ఉన్నది. శిల్పికి చెక్కనో శిలనో ఎలాగో రచయితకి భాష అలాగు.

ఐతే ఒక మౌలికమైన భేదం లేకపోలేదు. రచయితకి ముడి సరుకైన భాష, శిలలాగానో కేన్వాసులాగానో ప్రాణం లేనిది కాదు, అది సజీవమైనది. చరిత్రని పొట్టనిండా నింపుకుని సంస్కృతిని సాంప్రదాయాన్ని వేళ్ళకొసల్లో కనుకొలుకుల్లో తొణికిస్తూ ఉంటుంది. తన జాతి చైతన్యంతో అది నవనవలాడుతూ ఉంటుంది ఎప్పుడూ. భాషతో వ్యవహారం ఆషామాషీ కాదెప్పుడూ.

ఇలా సజీవమైన ముడిసరుకుతో కుస్తీ పట్టే రచయితని చూస్తే నాకు చెవులుకుట్టే వాళ్ళూ, పచ్చబొట్టు పొడిచేవాళ్ళూ గుర్తొస్తారు. పచ్చబొట్టు పొడిచేవాడు అసమర్ధుడైతే, వాడి ముడిసరుకునైన నేను వాడి చేతిలో నరకం చూస్తాను గద! ఆ బాధలో వాడీ గొంతునులిమి చంపెయ్యలేక పోవచ్చును గానీ కుయ్యో మొర్రో అని మొత్తుకుంటాను గద! అటూఇటూ మెలికలు తిరుగుతాను గద! ఇంతా చేసి చివరికి ఆ పచ్చబొట్టు నానాకంగాళీ అవకతవగ్గా తయారవుతుందని వేరే చెప్పాలా? ఆ మచ్చని - మనకి నచ్చనిదైనా - చెరిపేసుకోలేను గద!

అసమర్ధుడైన రచయితచేతిలో భాష కూడా ఇలాంటి పాట్లే పడుతుంది. విజ్ఞుడైన రచయిత భాష పట్ల గౌరవంగా ఉంటాడు. ప్రాణానికి జీవానికి మనమిచ్చే ఒక మౌలికమైన గౌరవమది. జ్ఞాన నిధులైన పండితులకిచ్చే గౌరవమది. అది తెలిసి మసలుకునే రచయితని భాష కరుణిస్తుంది, ప్రేమిస్తుంది. ఒకే క్షణంలో తల్లీ ప్రేయసీ కూడా అవుతుంది. ఆ కరుణలో ప్రేమలో తడిసి పునీతుడైన రచయిత ఆ భాషకి నగిషీలు చెక్కి అందాలు అద్దుతాడు.

Tuesday, March 29, 2011

విజయవాడలో కార్టూన్ల సభ


ఏప్రిల్ మూడున

Sunday, March 20, 2011

ఏనార్బర్‌లో ఇండోనీషియన్ నృత్య ప్రదర్శన

ఇండోనీషియా సాంప్రదాయక నృత్యరీతులను లోతుగా అధ్యయనం చేసిన నాట్యకారులు, నృత్యనాటక రూపకర్త, శ్రీ విదర్యాంతో గారి ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన నృత్య ప్రదర్శన జరగనున్నది ఏనార్బరు నగరంలో మిషిగన్ వివి ప్రాంగణంలో.

మన కూచిపూడీ, ఒడిస్సీలలాగానే ఇండోనీషియాలో వివిధభాగాలైన బాలి, జావా, సుమాత్రా ద్వీపాలలో సాంప్రదాయక నృత్యసంగీతాలు విలసిల్లుతూ వస్తున్నాయి. సాంప్రదాయకంగా రామాయణ భారతాలు ఈ కళారూపాలకి అవసరమైన ముడిసరుకుని అందిస్తూ వచ్చాయి. ఈ ప్రాంతాలకి ఇస్లాము రాకతో, పాలకులైన సుల్తానులు కూడా ఇస్లాం ను స్వీకరించడంతో సాంప్రదాయ కళల్లో కూడా ఇస్లాంకి సంబంధించిన కథల్ని ఉపయోగించడం మొదలైంది. తన రాజపోషకుడైన సుల్తాన్ శాసనంతో శ్రీ విదర్యాంతో ఇస్లాంకి సంబంధించిన అనేక కథలను సాంప్రదాయ నృత్య రీతుల్లో రూపొందించారు. తన పద్ధతుల్లో సాంప్రదాయక మూలాల్ని నిలుపుకుంటూనే ఒక కొత్త నాట్య పరిభాషని, దేశప్రజలకి దగ్గరచేసే రీతిలో రూపొందించే ప్రయత్నం చేస్తున్నానని శ్రీ విదర్యాంతో చెప్పారు.(బొమ్మ మీద నొక్కితే పూర్తి పరిమాణంలో చూడవచ్చు)

శ్రీ విదర్యాంతో రెండు సెమిస్టర్లు మిషిగన్ విశ్వవిద్యాలయంలో గౌరవ ఆచార్యులుగా వచ్చిఉన్నారు. ఈ వివిలో గత ముప్ఫై యేళ్ళుగా సంగీతాచార్యులు సూజన్ గారి పుణ్యమాని జావాద్వీపపు సంగీత సమ్మేళనం గామెలాన్ జరుగుతూ ఉన్నది. అనేక అమెరికన్ విద్యార్ధులు ఈ సంగీత పద్ధతిలో శిక్షణ పొందుతూ ఉన్నారు. ఈ సంవత్సరం శ్రీ విదర్యాంతో గారి వ్యక్తిగత పర్యవేక్షణలో సుమారు ఇరవై మంది విద్యార్హినీ విద్యార్హులకు నాట్య శిక్షణ లభించింది. ఈ వాద్య సంగీత నాట్య సమ్మేళనం ఒక అద్భుతమైన ప్రదర్శనగా రూపుదిద్దుకుంటున్నది.

తేదీ: మార్చి 27 ఆదివారం
సమయం: సాయంత్రం 4.00
చోటు: హిల్ ప్రదర్శన స్థలం, ఏనార్బర్
ప్రవేశం ఉచితం

తప్పక చూడండి.

Friday, March 4, 2011

తెలుగు పుస్తకానికి ఒక కొత్త పేజీ - కినిగె


సుమారు రెండు మూడు సంవత్సరాలుగా అమెరికాలో ఈ-పుస్తక దర్పణాల (e-book readers)గురించి బాగా చర్చ జరుగుతూ వస్తున్నది. మామూలుగానే పుస్తకాల అమ్మకాలు బాగా తగ్గిపోతున్నాయి. పబ్లిషరు కంపెనీలు ఏవీ లాభాల బాటలో నడవడం లేదు. ఒక పక్కన ముద్రణ ఖర్చులు పెరుగుతూండగా, పైపెచ్చు కాగితం కోసం చెట్లు ధ్వంసం చెయ్యడం పట్ల వ్యతిరేకత - వెరసి, పుస్తకాల ముద్రణా వ్యాపారాలు మునుపెన్నడూ లేనంత క్షోభకి గురవుతూ ఉన్న స్థితిలో, ఈ ఈ-పుస్తక దర్పణాలు పుస్తకాల వ్యాపార స్వరూపాన్నే మార్చివేస్తున్నాయి.

తెలుగునాట ముద్రణ సంస్థలు, పంపిణీ సంస్థలు అన్నీ కూడా ఉన్నంతలో ఒక కుటుంబం బతికేందుకు కావల్సిన ఆదాయాన్ని ఇవ్వగలిగినాయే తప్పించి ఒక ఇండస్ట్రీగా ఈ రంగం అభివృద్ధి చెందలేదని నవోదయ పబ్లిషర్సు అధినేత రామ్మోహనరావుగారు ఒక ముఖాముఖిలో చెప్పారు. పుస్తకాలు కొనడవా? బార్బేరియస్! అనే జాతి మనది. ఇదిలా ఉండగా, పుస్తక ప్రియులకైనా - కొన్న పుస్తకాలు చెదలు పట్టి పోతుండడమూ, మనపిల్లలకి సరిగ్గా తెలుగు చదవడమే రాదే, ఇంక ఈ పుస్తకాల్ని ఎవరు పట్టించుకుంటారు అనే ఆందోళన - అయినా మనసాగలేక ఏదో ఒక పుస్తకం కొంటూనే ఉంటాం.

ఇలాంటి ఆందోళనలన్నిటికీ ఒకే సమాధానంగా తెలుగు పుస్తక పంపిణీ స్వరూపాన్ని మార్చివేస్తూ పుస్తకప్రియులని అలరించేందుకు ముస్తాబై ఉన్నది కినిగె. ఈ పుస్తకాల గూడు కంటికింపైన పుటల అమరికతో, కంప్యూటారుకి కొత్త అయిన వారు కూడా సులభంగా వాడుకోగలిగేట్టు ఉన్నది. ధరలు కూడా చాలా సరసంగా ఉన్నాయి.

పాఠకులకి సదుపాయాలు:
ఈ-పుస్తకాన్ని కొనుక్కోవచ్చు, లేదా 30 రోజులకి అద్దెకి తీసుకోవచ్చు.
బేంక్ ఖాతా, ఆన్‌లైన్ ఖాతా (పేపాల్ వంటివి), లేదా క్రెడిట్ కార్డు ద్వారా మీ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
మీ కోసమే కాదు, కంప్యూటరు లేదా హస్తభూషణాలు (అదే, PDA) ఎక్కువగా వాడే మీ బంధుమిత్రులకి బహుమతిగా ఇవ్వచ్చు.
ఆర్డరు చేసి పుస్తకం పోస్టులో రావడం కోసం వేచి ఉండక్కర్లేదు. మరుక్షణమే పుస్తకం అందుబాటులో ఉంటుంది.
అప్పుడే నలభైకి పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

పుస్తకాలు కొనుక్కోవడమే కాక మీరింకా ఏం చెయ్యొచ్చు?
మీరే గనక రచయిత అయితే మీ పుస్తకాన్ని కినిగె. ద్వారా పంపిణీ చెయ్యొచ్చు.
మీ బంధుమిత్రుల్లో గనక రచయితలు ఉంటే వారికి ఈ కొత్త అవకాశాన్ని పరిచయం చెయ్యొచ్చు.
మీకు నచ్చిన పుస్తకాలని కినిగె. సిఫారసు చెయ్యొచ్చు.

Wednesday, March 2, 2011

శివానందరూప శివోహం

వేదమూర్తులు శ్రీ చల్లకీరె సోదరులు "పరాత్పరా పరమేశ్వరా" పేరిట పఠించిన నమకచమక పారాయణకు ముందుమాటగా బ్రహ్మశ్రీ కళింగకృష్ణగారు ప్రవచించిన ఆంగ్ల భాష్యానికి నా తెలుగు సేత.

శ్రీరుద్రభగవానునకు నమస్కారములు.

ఆ పరమశివుడు జగద్గురువు శంకరాచార్యులుగా అవతారమెత్తియున్నప్పుడు చేసిన బోధలలో మనలను వేదాధ్యయనము నిత్యకృత్యముగా సలుపమని చెప్పినాడు.
వేదో నిత్యమధీయతాం!

రుద్రాధ్యాయమనే ఈ నమకచమక ప్రశ్నములు వేదంలో కర్మకాండను బోధించే యజుర్వేద భాగాలు. ఈ రుద్రాధ్యాయము దైనందిన పారాయణకు ప్రత్యేకంగా నిర్దేశింపబడినది.

స్వశాఖోపనిషద్గీతా విష్ణోర్నామ సహస్రకం
రుద్రంచ పౌరుషం సూక్తం నిత్యమావర్తయేత్ బుధః

ఈ రుద్రాధ్యాయమును శతరుద్రీయము అని కూడా అంటారు. పరమాత్ముడు ఒక్కడే అయినా వందల వేల రూపాల్లో ప్రత్యక్షమవుతూ ఉంటాడు. జాబాలోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షిని ఆయన శిష్యులు అడిగారు - ఏ మంత్రాన్ని నిష్ఠతో, అర్ధము తెలిసి నిత్య పారాయణ చేస్తే మానవునికి ముక్తి దొరుకుతుందని ప్రశ్నించినప్పుడు ఆ మహర్షి "శతరుద్రీయేణ!" అని సమాధాన మిచ్చాడు.

ఈ రుద్రాధ్యాయము వేదంలోని కర్మకాండల విభాగానికి సంబంధించినది అయినా, అనేక కర్మవిధులను నిర్దేశించే కల్పము "శతరుద్రీయం జుహోతి!" అని సూచించినప్పటికీ, దీనిని (ఈ రుద్రాధ్యాయాన్ని) విజ్ఞులు ఉపనిషత్తుగా (వేదంలో ఆధ్యాత్మిక తత్త్వబోధ చేసే భాగం) మన్నిస్తున్నారు. వేదాలకి మహాభాష్యాలు రాసిన సాయణాచార్యుడు ఇలా చెబుతున్నాడు.
కర్మప్రకరణే పాశాత్ కర్మాంగత్వ మిహేష్యతే
జ్ఞాన హేతుత్వమప్యస్య సర్వోపనిషదీరితం
ఇలా శతరుద్రీయం ఉపనిషత్ అని నొక్కి చెప్పాడు.
ఎందుకంటే రుద్రాధ్యాయం ఆ పరమేశ్వరుని విశ్వరూపత్వాన్ని సర్వాంతర్యామిత్వాన్ని మరల మరల విశదపరచడమే కాక, "సర్వం ఖల్విదం బ్రహ్మ" (ఇదంతా కూడా బ్రహ్మమే!) అనే ఉపనిషద్వాక్యాన్ని అంతులేని స్వరూప ఉదాహరణలతో నిర్వచిస్తున్నది.

రుద్రాధ్యాయాన్ని అర్ధం తెలిసి నిష్ఠతో, శ్రద్ధతో పారాయణ చేసే వారు తమకు తాము ఆత్మశక్తిని వృద్ధి చేసుకోవడంతో పాటు తాము నివసిస్తున్న సమాజానికి కూడా ఎంతో ఉపయోగపడతారు.
రుద్రాధ్యాయీ వసేత్ యత్ర గ్రామేవా నగరేపివా
నతత్రత్ క్షుత్పిపాసా దుర్భిక్షా వ్యాధియోపచా - అని ఆర్యోక్తి

అంత మహిమాన్వితమైనది ఈ శతరుద్రీయం.
***
శ్రీకాళహస్తి మహత్యం పాత సినిమానుండి కొన్ని దృశ్యాలు

అర్జునుడి కథ
మహేశా పాపవినాశా
పార్వతీదేవి
దండకం
***
ఈ రోజు మహాశివరాత్రి మహా పర్వదినం. వీలుంటే శివాలయానికి వెళ్ళి, చేతనైతే సస్వరంగా నమకచమకాలు పారాయణచేసి పరమశివునికి అభిషేకం చేసుకోండి.
లేదంటే కనీసం ఓం నమశ్శివాయ అనుకోండి.
అందరికీ శివకటాక్షం సిద్ధించుగాక!
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.
తథాస్తు.