Friday, October 29, 2010

మాసు క్లాసు ఇదేమి తిరకాసు

రెంటాల జయదేవగారు జూ. ఎన్టీయార్ బృందావనం సినిమాని సమీక్షిస్తూ "మాస్ హీరోగా ముద్ర పడిన చిన్న ఎన్టీయార్ ను, మంచి లవర్ బాయ్ గా చూపి, క్లాస్ కు దగ్గర చేయాలనే ప్రయత్నంగా ‘బృందావనం’ చిత్రాన్ని చెప్పుకోవచ్చు." అని రాశారు.

ఈ సినిమాని గురించి బ్లాగుల్లో ఇతర సమీక్షలు చర్చల్లో కూడా ఇంచుమించు ఇదే భావం, ఇంచుమించు ఇదేమాటల్లో వ్యక్తమయింది. ఇది నాకు బాగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలీ క్లాసు - మాసు వర్గీకరణలు ఏంటి, వాటికేవన్నా అర్ధం ఉందా అన్నది నా మౌలికమైన ప్రశ్న. సినిమా పత్రికలూ, సినీ జర్నలిస్టులూ, సినిమాకి అంకితమైన సాలెగూళ్ళూ ఇలాంటి మాటల్ని అలవోకగా వాడేస్తూ ఉంటారు. అలాంటి వాడుకల వెనకాల ఒక నిర్దిష్టమైన ఆలోచన, ఒక స్పష్టమైన అవగాహన ఉన్నాయని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ మన భావాల్ని, అనుభూతుల్ని పంచుకోడానికి రాసుకునే బ్లాగులో కూడా ఇవే వాడుకలు ఎదురయ్యేటప్పటికి నాక్కొంచెం ఝలక్ తగిలిన మాట నిజం. అందుకే జయదేవగారి టపా దగ్గరా, ఇంకా ఒకట్రెండు సమీక్షల దగ్గరా దీన్ని గురించి నిరసనగా వ్యాఖ్యలు రాశాను.

జయదేవగారు సహృదయంతో స్పందించి, క్లాసు - మాసు వర్గీకరణ గురించి ఇంకో టపా వివరంగా రాశారు. ముందస్తుగా వారికి నా ధన్యవాదాలు. ఆ టపాలో మంచి పాయింట్లు చెప్పారు. ఇదేమి పెద్ద వివాదం కాదు గానీ, ఐనా నా సందేహాలు తీరలేదు. అందుకే నా రేండం ఆలోచనల్ని బయటపెట్టే ప్రయత్నం ఇది. నలుగురిముందూ పెడితే ఎవరన్నా నా సందేహాలు తీరుస్తారేమోననే చిన్న ఆశకూడ లేకపోలేదు.

నా ప్రతిపాదనలు ఇవి:
1. మంచి సినిమా, చెత్త సినిమా, పరవాలేదనిపించే సినిమా - ఇవే నాకు సంబంధించిన వర్గీకరణలు.
2. క్లాసు - మాసు అనే వర్గీకరణ ఇండస్ట్రీ వర్గాలకీ, ట్రేడ్ వర్గాలకీ ఉపయోగపడే కొలమానం అయితే కావచ్చు. ఒక ప్రేక్షకుడిగా ఈ లేబుల్ నాకేమీ ఉపయోగపడదు.
3. పరిశ్రమకి అనుబంధ వర్గాలు ఈ లేబుళ్ళని, వర్గీకరణల్ని వాడితే వాడారు గానీ, మన ఆనందం కోసం సినిమా చూసి, ఆ ఆనందాన్ని (కొండకచో బాధని) బ్లాగులో పంచుకునేందుకు రాసుకునే సమీక్షలో ఈ రొడ్డకొట్టుడు లేబుళ్ళని పట్టించుకోవలసిన పని లేదు. అంతే కాదు, మన సినిమాలు ఇంకొంచెం బాగుండాలి, ఇంకాసిని మంచి సినిమాలు రావాలని తాపత్రయపడే బ్లాగరులు ప్రయత్నపూర్వకంగా ఈ రొడ్డకొట్టుడు భావనల్ని దూరంగా ఉంచాలని కూడా నేననుకుంటాను.
4. ప్రస్తుతం తెలుగు తెరని ఏలుతున్న హీరోల్లో "క్లాసు" హీరోలు ఎవరన్నా ఉన్నారా?

గత ఐదారేళ్ళల్లో నేను చూసిన తెలుగు సినిమాల్ని నెమరు వేసుకున్నప్పుడు - జయదేవ గారు తన వివరణలో ఇచ్చిన నిర్వచనాలని బట్టి - కొన్ని మాసు సినిమాలు నాకు బాగా నచ్చాయి, కొన్ని క్లాసు సినిమాలు చాలా విసుగు పుట్టించాయి. ఫైట్లు రక్తపాతం ఇరగదీసే డాన్సులు రెండర్ధాల పాటలు (ఇంకా రెండర్ధాలు కూడా ఎక్కడున్నాయండీ బాబు, డైరెక్టుగా ఇంక అదే అర్ధం!) - ఇత్యాది సకల మసాలా దినుసులతో వండబడిన యమదొంగ, మగధీర బాగా నచ్చాయి. కొన్ని అస్సలు నచ్చలేదు (పేర్లు నాకిప్పుడు గుర్తు లేవు). పైన చెప్పిన మసాలా దినుసులు లేనివి, కుటుంబగాధలకి ప్రాముఖ్యతనిచ్చేవి క్లాసు చిత్రాలని నిర్వచించుకుంటే - అష్టాచెమ్మా, ఆకాశమంత బాగా నచ్చాయి. కొం యి కొం క, కొత్తబంగారులోకం పరవాలేదు అనిపించాయి. శశిరేఖాపరిణయం, ఆడవారి మాటలకి అర్ధాలు వేరులే, ప్రవరాఖ్యుడు లాంటి సినిమాలు చూసినప్పుడు కథ రాసినవాణ్ణీ, డైరక్టరునీ కలిపి తన్నాలన్నంత చిరాకు కలిగింది.

దీనికి ఇంకో కోణం ఉంది. సోకాల్డు మాసు హీరో సినిమాల్ని క్లాసు ఆడియెన్సులు బహిష్కరించడంగానీ చూడకుండా ఉండడం గానీ జరుగుతోందా? అన్ని రకాల ప్రేక్షకులూ విరగబడి చూస్తేనే గదా యమదొంగ, పోకిరీ, మగధీర అంత హిట్టయినాయి! పైగా భారత్‌లోనూ ఇక్కడ అమెరికాలోనూ నాకు పరిచ్యమున్న కుటుంబాల్లో - అబ్బే అది మాసు హీరో సినిమా కాబట్టి మేం చూడం - లాంటి సెంటిమెంటు నాకైతే ఎక్కడా వింబళ్ళేదు. గృహిణులు, పిల్లలతో సహా, తెలుగు సినిమా చూడ్డం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు అన్ని రకాల సినిమాలనీ (కొండకచో చూడకూడని వాటినికూడా, అంటే పిల్లలకి సముచితం కానివి) చూస్తూనే ఉన్నారు. మరి వీరుకాకుండా కుటుంబాలుగాని క్లాసు ప్రేక్షకులుగాని వేరే ఉన్నారేమో నాకు తెలియదు.

సినిమా హిట్టా ఫట్టా అన్న సంగతి కాసేపు పక్కన పెట్టి, సినిమాని సినిమాలాగానే చూస్తే .. అసలు ఒక సినిమానించి మనం ఏం ఆశిస్తాం? కొంచెం వినోదం. ఒక రెండున్నరగంటల సేపు మన బుర్రని డైరెక్టరు చేతుల్లో పెట్టినందుకు అతగాడు మనబుర్రని మరీ చెత్తకుండీలా చూడకూడదని ఆశించడం తప్పులేదు గద? సినిమా కథ అనుకున్నాక ఏదో ఒక పరిధిగీసుకుని, ఆ పరిధిలో కథ చెబుతాడు దర్శకుడు. మనం ఆ పరిధిని అంగీకరించాం అనుకుంటే, ఆ పరిధిలో కథ పకడ్బందీగా, లొసుగుల్లేకుండా ఉందా లేదా, ఆ కథని సినిమాగా మలచిన పద్ధతిలో ఏవన్నా వినోదం, చమత్కారం ఉన్నాయా లేదా? ఇవే మన ప్రమాణాలు. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం ఆసించట్లేదు.

ఉదాహరణకి మగధీర తీసుకుందాం. పునర్జన్మలుంటాయా లేదా అనే డౌటుతో సినిమా చూడ్డం మొదలు పెడితే ఇంక ఆ సినిమాలో వినోదించేందుకు ఏం లేదు. ప్రేక్షకులుగా మనం ఆ కథ పరిధిని - పునర్జన్మ ఉంది, పాత జ్ఞాపకం ఏదో ఒక విధంగా కొత్త జన్మలో తెలుసే అవకాశం ఉంది - అని మనం ఒప్పుకుంటే, మొత్తమ్మీద మిగతా కథ అంతా ఆ చట్రంలోకి చక్కగా ఇమిడింది. ఒక చక్కని వినోదభరితమైన (వినోదం అంటే ఇక్కడ నవ్వు అని కాదు) చిత్రం తయారైంది. మసాలా దినుసులుకూడా, చక్కటి భవనానికి బహుచక్కగా వేసిన రంగుల్లాగా, కథకి ఉపకరించే విధంగా అమరినాయి. దీనికి పోలికగా శశిరేఖాపరిణయంగానీ ఆడవారిమాటలకి అర్ధాలెవేరుళే గానీ తీసుకుని చూడండి. కథ పరిధిని మనం ఒప్పుకున్నా, ఆ పాత్రలుగాని, సన్నివేశాలుగాని, డయలాగులుగాని - ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా, అతుకులేసి కుట్టినా కూడ వొంటికి పట్టని చిరుగు చొక్కాలాగా ఉన్నాయి.

సో, లాష్టండ్ ఫైనలుగా నా విన్నపం ఏంటంటే .. క్లాసో మాసో మరో తిరకాసో .. మనకి అనవసరం. సినిమా బావుందా బాలేదా .. ఇదే మనక్కావల్సింది, కనీసం మనం బ్లాగుల్లో రాసుకునే వరకైనా.

మీరేమంటారు?

Wednesday, October 27, 2010

మాంఛి కథలండే!

మా వూళ్ళోనండే, మరే, డీటీయెల్సీ అని ఒక సబుండాదండే!
నెలకోసారి గావాల్న మనోళ్ళందరూ ఆడజేరి తెలుగు పుస్కాలు చదివొచ్చి ఆడ చర్చలు జేస్తారండే!
మరండే, పెతీ సంవొచ్చరమూ కత అన్జెప్పి ఓ కతల బుక్కొచ్చుద్ది గదాండే? అంటే ఆ సంవొచ్చరంలో వొచ్చిన మాంఛి కథలండే!
ఓ పాలేవైనాదంటే, మా డీటీయెల్సీలో ఈ కత బుక్కుని చర్చిస్తనావండే, ఒగాయనన్నాడూ, థూ ఏందీ ఏడుపు నాగొట్టు కతలు? ఛీ దీనెమ్మ (ఆయన ఆ మాటన్లేదండే, నే సెబతన్నా గదా, తవరిలాటి ఇసయాలు కొంచెం నిబాయించుకోవల్న!) జీవితంలో సంతోసమనేది లేదా? ఆనందమనేది లేదా? కత రాయల్నంటే ఏడుపేనా? థూ దీనెమ్మ అని చానా ఫీలైపోనాడండి. నాను గూడ చానా ఫీలైపోనానండి - ఆయన నానూ కల్సి మీటంగం మద్దిలో కిందకి బొయ్యి కాపీ తాగొచ్చేటోళ్ళమండి. మరి ఆ మాత్రం ఫీలింగుండదేటండి, మీరే జెప్పండి?

సరెగాని దీనెమ్మ తెలుక్కతలన్ని యిట్టనే యేడుపుగొట్టుగ జచ్చినయ్యనిజెప్పి, ఇయ్యాల ఇంటికొస్తానె, ఏంటో కుశాలగనిపించి, యేదన్న కుసాలగ చదువుదాము అనిపించి, నిగనిగలాడతన్న యింగ్లీషు నవలోటి పట్టుకోని పైకొచ్చినానండే. జానీ వాకరు బ్లాక్ లేబిలు (ఏటి మజాకనుకున్నారేటి? 12 సంవచ్చరాల స్కాచి విస్కీ!) సరికొత్త బాటిలు మూద్దెరిచి హా సువాసనని
హమ్మ్
ముక్కపుటాల్లోకి పీల్సుకోని హమ్మ సమ్మగా ఓ సుక్కేసుకోని పుస్కం దెరిసినానండే. ఏవి సుకంగుండాలి, మీరే జెప్పండే! ఇంగ్లీసు నేల - ఇంగ్లీసు విస్కీ- ఇంగ్లీసు పుస్కం! కానేంటండే?

?
?
?

ఏంటండే ఈ పుస్కం? యాబై పేజీల్చదివినానండీ యీ పాటికి. అంతా కడుపు కోత దుఃఖం!!!

దుక్కం - ఒహటేనండే - దానికి తెలుగూ యింగ్లీసూ తేడాల్దెలీవండే .. దుక్కం ఒహటేనండే!
మాంఛి కథలండే! మరి యెతలున్న సోటనె కతలు గూడున్నాయండే!!

Monday, October 25, 2010

కబుర్లు - అక్టోబరు 26

మొన్న అక్టోబరు 21 న ప్రఖ్యాత జాజ్ ట్రంపెట్ ప్లేయర్ డిజ్జీ గిలెస్పీ పుట్టినరోజు సందర్భంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించారు. చప్పట్లు.

నేనెంతో గౌరవంగా భావించే రేడియో విశ్లేషకులు, యువాన్ విలియమ్స్ ముస్లిముల గురించి చేసిన అనుచితమైన వ్యాఖ్యల వల్ల నేషనల్ పబ్లిక్ రేడియో ఆయన కాంట్రాక్టుని రద్దుచేసింది. సంక్లిష్టమైన ప్రపంచ పరిణామాల్ని, వార్తల్ని విశ్లేషించి విడమరిచి చెప్పే బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్న యువాన్ వంటి మేధావుల నించి ఇటువంటి హేయమైన వ్యాఖ్యలు వినాల్సి రావడం నాకు చాలా బాధ కలిగించింది. ఇటీవల అమెరికను సమాజంలో అతి సున్నితమైఅన్ సందర్భాల్లో జాతి పరంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిన సందర్భాల్లో వివేకానికి ప్రతిధ్వనిలా నింపాదిగా ఎంతో సంయమనంతో మాట్లాడిన యువాన్ .. ఏంటో?

ఆరోగ్యం

You are what you eat అని ఆంగ్లోక్తి. అందులో కొంచెం కూడా అతిశయోక్తి లేదు. ఇరవై ముప్ఫై యేళ్ళ కిందట కూడా దైనందిన జీవితంలో భాగంగానే మైళ్ళకి మైళ్ళు నడుస్తూ, మెట్లెక్కుతూ దిగుతూ, ఇంటిపనులు చేసుకుంటూ, శరీరానికి తగినంత శ్రమ, వ్యాయామం కలిగిస్తూ ఉన్నప్పటి పరిస్థితి ఏమోగాని, ఇప్పటి మధ్యతరగతి జీవనశైలి మాత్రం ఏమితిన్నా హరాయించుకునేట్టుగా లేదు. అందుకని భోజనాన్ని నియంత్రించాల్సిన అవసరం మరింత పెరిగింది ఈ రోజుల్లో. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకుంటున్నవారు తప్పక ఈ విషయం మీద శ్రద్ధ పెట్టాలి - ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం - ఈ రెండిటినీ పట్టించుకోవాలి. కొన్ని కొన్ని డయట్ ప్రోగ్రాములు స్వల్పవ్యవధిలో మంచి ఫలితాలని ఇవ్వవచ్చు కానీ ఆ ఫలితాలు జీవితాంతం ఉండకపోవచ్చు. అంచేత, మనం చేపట్టే మార్పులేవో జీవితమంతా మనతో ఉండే అలవాట్లుగా పెంపొందించుకోవాలి - అంచెలంచెలుగా చేసినా.

ఈ మార్పుల్లో మొట్టమొదట సాధించాల్సిన మెట్టు అన్నం మానెయ్యడం. అన్నం అంటే అన్నం ఒక్కటే కాదు, జీర్ణక్రియలో సులభంగా చక్కెరగా మార్పుచెందే పిండిపదార్ధాలు (కార్బోహైడ్రేట్లు) అన్నిటినీ మానెయ్యాలి. మనవాళ్ళు చాలామందికి భ్రాంతి - చపాతీలు పుల్కాలు అన్నం కంటే హెల్దీ అని. అస్సలు కాదు. ఈ కార్బోహైడ్రేట్ల కథా కమామిషూ వచ్చేవారం మరిన్ని వివరాలతో.

పర్యావరణం

ఇటీవల మెక్సికో గల్ఫ్‌లో జరిగిన చమురు పేలుడు వల్ల బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ పట్లనేగాక మొత్తం చమురు పరిశ్రమ పట్ల జనాలకి కోపం హెచ్చింది. ఆ కోపాన్ని కాస్తయినా చల్లార్చి, తాము నిజంగా ప్రజలవైపే నని చూపించుకోవడానికి షెవ్రాన్ కంపెనీ ఒక ప్రకటన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి జాలరూపాన్ని ఇక్కడ చూడచ్చు.

ఐతే, చమురు కంపెనీల దగాకోరుతనాన్ని బయటపెడుతూ అచ్చం ఈ ప్రకటనలాగానే కనబడే ఇంకో పేరడీ సాలెగూడు మొదలైంది. ఆ పేరడీ ఇక్కడ.

ఈ పేరడీని "యెస్ మెన్" అనే గుంపు రూపొందించింది. ఈ పేరడీకి తెరవెనుక కథని వాళ్ళ బ్లాగులో చదవండి. కొంతకాలం క్రితం భోపాల్ తీర్పు వెలువడిన నేపథ్యంలో ఇదే గుంపు ఆ సందర్భంగా చేసిన "ఉత్తుత్తి ఇంటర్వ్యూ" ఇదిగో!

Yes men - Dow and Bhopal
ఈ వారపు సిఫారసు

టీవీ రాకమునుపు రేడియో మన దైనిందిన కార్యక్రమాల్లో ఎంతో ముఖ్యపాత్ర వహిస్తూ ఉండేది. ఉదయం భక్తిరంజనితో మేలుకొలిపి, రాత్రిపూట ఏదో ఒక వినోద కార్యక్రమంతో నిద్రపుచ్చుతూ - తెలుగు గడ్డమీద హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప కేంద్రాలనించి ప్రసారం చేస్తూ - ఎన్నో వినోద విజ్ఞాన కార్యక్రమాలని అందిస్తూ ఉండేది. అందులో విజయవాడ కేంద్రం ముఖ్యంగా సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలకి అగ్రగామిగా ఉండేది. తొలినాళ్ళలో శ్రీమంగళంపల్లి బాలమురళీకృష్ణగారు, తదుపరి స్వర్గీయ శ్రీవోలేటి వేంకటేశ్వర్లుగారు - ఇద్దరూ గొప్ప సంగీత విద్వాంసులేగాక స్వతస్సిద్ధమైన సృజన శక్తి ఉన్నవారు - ఎన్నో అద్భుతమైన సంగీత కార్యక్రమాలని రూపొందించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది భక్తిరంజని కోసం తయారు చేసిన అనేక అంశాలు. నాకు బాగా గుర్తుండిపోయినదొకటి సూర్యదేవునికి పట్టిన గాత్ర నీరాజనం - శ్రీసూర్యనారాయణా మేలుకో అనే మేలుకొలుపు పాటతో మొదలై, తరవాత చక్కగా పాడిన భానుదండకం (మధ్య మధ్యలో విరామచిహ్నంగా వినిపించే బృందగానం), చివరగా రాగమాలికలో శ్రావ్యంగా గానం చేసిన ఆదిత్య హృదయం. దండకాన్నీ ఆదిత్యహృదయాన్నీ గానం చేసినది శ్రీనూకల చిన్నసత్యనారాయణగారు అనుకుంటున్నా. ఈ మూడు కలిపి ఇప్పుడు సీడీగా దొరుకుతున్నది - ఆకాశవాణి లేదా దూరదర్శన్ కేంద్రాల్లో మాత్రమే. తప్పక కొనుక్కోండి. చాలా బాగుంది.

ఈ వారపు బ్లాగు

శ్రీ పంతుల జోగారావుగారు సీనియర్ కథకులు. వివిధ పత్రికల్లో ఎన్నో ఏళ్ళుగా కొన్ని డజన్ల కథలు ప్రచురించారు. తన బ్లాగులో తన కథలతో పాటు సుభాషితాలు, చమత్కారమైన పద్యాల కథలు, తన చిన్నప్పటి విశేషాలు, తమ స్వస్థలం విజయనగరం కబుర్లు - ఇలా వైవిధ్యంగా ఎన్నో విషయాలమీద విపులంగా రాస్తున్నారు. క్రమం తప్పకుండా క్వాలిటీ తగ్గకుండా రాసే కొద్దిమంది బ్లాగర్లలో జోగారావుగారొకరు. చూడ్డం గనక మొదలెడితే మీరూ వదిలి పెట్టరు - ఏదీ, ఒక లుక్కెయ్యండి!

Wednesday, October 20, 2010

ఆచార్య అక్కిరాజు సుందరరామకృష్ణగారు

స్ఫురద్రూపం
శ్రావ్యమైన గళం
పద్యాన్ని అర్ధయుక్తంగా పాడే నైపుణ్యం
వెరసి ఆచార్య సుందర రామకృష్ణగారు

"శుంఠలకి చురకలు వేయడానికి సుందరరామకృష్ణ తోందరగా స్పందిస్తాడు. మాడు పగలగొట్టి మందు రాస్తాడు .." ఇవి ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుగారు శ్రీ రామకృష్ణగారి రచనని గురించి చేసిన వ్యాఖ్యలు.

వీరితో ఇంతకు మునుపు పరిచయం లేదు, ఇండియనాపొలిస్ సదస్సులోనే పరిచయం. పుట్టిపెరిగినది గుంటూరు జిల్లా నరసరావుపేట. హైదరాబాదులో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి ఇటీవలనే రిటైరయ్యారు. వ్యంగ్యం, హాస్యం, తెంపరితనం, సృజనాత్మకత - ఈ నాలుగూ వీరి కవితకి నాలుగు ముఖాలు. శ్రీరాజరాజేశ్వరీ అనే మకుటంతో వెయ్యిన్నెనిమిది పద్యాలు (దీన్ని సహస్రకం అనొచ్చా?) రాశారు. తిరుమలకి సంబంధించిన ఎవరో నిర్వాహకుల ఘనకార్యాలతో తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లగా ఆ ఏడుకొండలవానిపైననే కినిసి కోనేటి రాయుడికి తేనీటి విందు పేరిట అధిక్షేప త్రిశతి (ఎగతాళి చేస్తూ మూడొందల పద్యాలు) రాశారు. ఎంత కొమ్ములు తిరిగిన హేమాహేమీలైనా జడుసుకుని భయం చెప్పుకునే శనీశ్వరుణ్ణి చూసికూడా జంకని ధైర్యం రామకృష్ణగారిది - శ్రీశనీశ్వరా అనే మకుటంతో శతకం రచించారు. అనుకోకుండా ఇండియనాపొలిస్ సదస్సులో శ్రీ సుందరరామకృష్ణగారి పరిచయం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఇండియనాపొలిస్ సదస్సులో ధూర్జటిని గురించి చేసిన ప్రసంగాన్నించి కొన్ని తునకలు

Saturday, October 16, 2010

రంగులమారి చెట్టు

Thursday, October 14, 2010

ఇండియనాపొలిస్ సదస్సులో తెలుగు బ్లాగు సందేశంతెలుగు బ్లాగులు - సాహిత్యం అనే విషయం మీద ఏడవ అమెరికా తెలుగు సాహిత్య సదస్సు (ఇండియనాపొలిస్)లో నా ప్రసంగం.

ఓపిగ్గా విడియో తీసిన మిత్రుడు కాలాస్త్రి శ్రీకి ధన్యవాదాలు.
మరోసారి అంతర్జాతీయ తెలుగు సాహిత్య వేదికమీద బ్లాగుల ప్రస్తావనకి చోటిచ్చిన వంగూరి చిట్టెన్‌రాజుగారికి ధన్యవాదాలు.

Tuesday, October 12, 2010

కొంచెం నాట్యం కొంచెం సంగీతం

గడిచిన వారంలో గురువారంనాడు ఒక ఆధునిక నాట్యప్రదర్శన, శుక్రవారంనాడు కర్నాటక గాత్రప్రదర్శన చూసొచ్చాను.

నాట్యప్రదర్శన పాల్ టేలర్ డేన్స్ కంపెనీ వారిది ఏనార్బర్లో పవర్‌సెంటర్ అనే రంగస్థలమ్మీద జరిగింది. నేను చూసిన ప్రదర్శనలో రెండు అంశాలు చేశారు. మొదటిది Speaking in Tongues. సుమారు 45 నిమిషాల నిడివి ఉన్న ఈ అంశం చాలా విచిత్రంగా ఉన్నది. ఆధునిక నాట్య ప్రక్రియలని ఉపయోగిస్తూనే కథచెప్పడంలో ఒక వినూత్నమైన ప్రయోగం అనిపించింది నాకు. మన భారతీయనాట్యంలో లాగా చాలా అభినయం ఉంది ఇందులో - పాశ్చాత్య ఆధునిక నృత్యంలో అభినయం ఉండదు. కానీ కథ తిన్నగా సాగదు. పాత్రలేవీ గీతగీసినట్టు, నిర్వచించినట్టు నిలకడగా ఉండవు. కథ, కథనము, పాత్రలు - ఈ మూడూ నాట్యమనే ఒక ద్రావకంలో వేసి గిలక్కొడితే ఏర్పడిన రసాయన మిశ్రమంలా రంగులు మారిపోతూ నిత్యచలనంతో నిత్య చైతన్యంతో ఉన్నాయి. అంచేత ఆ చూసిన దృశ్యాల నించి ప్రేక్షకులు ఎవరికి వారు కథని తమతమ బుర్రల్లో అల్లుకోవలసిందే. మొత్తం తొమ్మిదైమందో పదిమందో ఉన్నారు నాట్యకారులు, ఆడామొగా కలిపి. వాళ్ళ మధ్యలో కదలికల సమన్వయం కానీ, ఆ కదలికల్లో ప్రస్ఫుటితమవుతున్న ఒక విసురైన శక్తికానీ కళ్ళని మిరుమిట్లు గొలిపాయి. ఏతన్మధ్య బుర్ర మాత్రం - ఇప్పుడు నేను చూసిందానికి అర్ధం ఏవిటీ అని బుర్ర గోకేసుకుంటూ ఉన్నది. ఈ అంశం తరవాత విరామ సమయంలో, నా వరసలో కొంచెం అవతలగా కూర్చున్న నలుగురు అమ్మాయిలు, వివి విద్యార్ధినులల్లే ఉన్నారు, నోటుబుక్కులు పెన్నులు పట్టుకుని బరబరా నోట్సులు రాసేస్తున్నారు - ఈ కార్యక్రమం చూడ్డం, దాన్ని గురించి రాయడం వాళ్ళకి క్లాసు ఎసైన్మెంటల్లే ఉంది. వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారు, ఈ ప్రదర్శనలో ఆయాభాగాలకి అర్ధమేమిటి, తమకి ఏం అర్ధమయింది అని. నాకు చాలా ముచ్చటగా అనిపించింది - ఏదో వచ్చాం, చూశాం, ఇంటికెళ్ళి తొంగున్నాం అన్నట్టు కాకుండా, వాళ్ళా ప్రదర్శనలో లీనమై లోతులు వెదకడాన్ని గమనిస్తే. ఈ అంశాన్ని 1988లో తొలిసారి ప్రదర్శించారట.

విరామం తరవాత రెండో అంశం - ఇదికూడా సుమారు 45 నిమిషాలు నడిచింది. యోహాన్ సెబాస్టియన్ బాఖ్ రచించిన రెండు వయొలిన్ కాంచెర్టోలకి ఇది నృత్యానువాదం. బాఖ్ సంగీతం సహజంగానే ఆహ్లాదంగా మృదువుగా ఉంటుంది. వయొలిన్ కాంచెర్టో అంటే ఆ మృదుత్వం ఇంక చెప్పక్కర్లేదు. అటుపైన దానికి నృత్య రచనచెయ్యడంలో శ్రీమాన్ టేలర్ గారు ఆ సంగీతంలోని ఆత్మని పట్టుకున్నట్టు చక్కగా కనులకింపైన కదలికలతో అమరికలతో ఈ అంశాన్ని రూపొందించారు. నటీనటులు ధరించిన ఆహార్యంకూడా కంటికింపయిన రంగుల్లో ఒక గులాబి పూలతోటని గుర్తుచేస్తూ ఉన్నది. నాట్యం అంతా నటీనటులు గుంపులు గుంపులుగా లయబద్ధంగా కదులుతూ ఆయా గుంపులు విడిపోయి కొత్త గుంపులు ఏర్పడుతూ ఉండడమే. బుర్రని హడావుడి పెట్టేసిన మొదటి అంశం తరవాత ఈ అంశం చెవులకీ కళ్ళకీ హాయినిచ్చి బుర్రని శాంతపరిచింది. దీనిలోకూడా నటీనటుల మధ్య ప్రకటితమైన సమన్వయం అద్భుతం. రెండు అంశాల్లోనూ లైటింగ్ డిజైన్ మరో అద్భుతం. లైటింగ్ అంటే ఊరికినే అవసరమున్నా లేకపోయినా రంగు రంగుల లైట్లు గుప్పించడం, స్ట్రోబు లైట్లలో కళ్ళు బైర్లు కమ్మించడం కాకుండా స్టేజిమీది వివిధ భాగాల్ని అవసరమైన పాళ్ళల్లో, అక్కడి అంశంలోని మూడ్‌కి తగినట్టు మార్చుకుంటూ, ప్రదర్శనలో విడదీయరాని భాగంగా లైటింగ్ భాసించింది. ప్రదర్శన ముగిసినాక నటీనటులు ప్రేక్షకుల అభినందనలు అందుకుంటుండగా ఎనభయ్యేళ్ళ పాల్ టేలర్ గారే స్వయంగా స్టేజిమీదికి విచ్చేశారు. అది ఇంకో అద్భుతం!

శుక్రవారంనాడు స్థానిక సంగీతసభవారు మల్లాది సోదరుల గాత్రకచేరి ఏర్పాటు చేశారు. ఒక మిడిల్ స్కూలు కేఫెటెరియాలో ఏర్పాటైంది సభ. ఇదేమిరానాయనా, సౌండు బాగుండదు అనుకుంటూ కూర్చున్నాను గానీ, ఆశ్చర్యంగా అకౌస్టిక్స్ బానే ఉంది. మల్లాది సోదరులతో పాటు బి.యు. గణేశప్రసాద్ గారు వయొలిన్, పత్రి సతీష్ కుమార్ గారు మృదంగం. శహన వర్ణంతో మొదలై అసావేరిలో త్యాగరాజస్వామివారి మాపాల వెలసి, తరవాత రామప్రియ రాగాన్ని విపులంగా ఆలపించి దీక్షితర్ కృతి మాతంగీ శ్రీ రాజరాజేశ్వరీ పాడారు. రామప్రియ ఆలాపన ఆసక్తి కరంగా ఉంది. ఇది 52వ మేళకర్త, దీక్షితార్ మద్ధతిలో దీన్ని రామమనోహరి అంటారు. స్వరాలు S, R1, G3, M2, P, D2, N2. R1 నించి G3 కి వేసే గంతు ఈ రాగానికి విలక్షణమైన నడకనిస్తుంది. ఐతే ఆలాపన వింటూ ఉంటే బాగా పరిచయమైన మలయమారుతం (రాగం పేరు) లాగా అనిపించింది. ఏవిటబ్బా అని ఇంటికొచ్చాక చూస్తే, అదే మరి - రామప్రియలోంచి ఆ ప్రతిమధ్యమాన్ని తొలగిస్తే అదే మలయమారుతమై కూర్చుంటుందాయెను. ఆహా నా చెవులు బాగానే పనిచేస్తున్నాయని నాకు నేనే అభినందించుకున్నాను.

శ్రీరంజనిలో పాపనాశం శివన్ గారి తమిళకృతి పాడాక త్యాగరాజస్వామివారి చిట్టిముత్యం ననుగన్న తల్లీ మంచి వేగంతో పాడారు. భైరవి రాగాలాపన ఎత్తుకున్నారు గానీ తొందరగా ముగిసినట్టు అనిపించింది. ఆ రాగానికి తగిన బరువుగానీ శ్రద్ధగానీ పెట్టలేదు. తానం మాత్రం చాలా చాలా బావుంది. సోదరులిద్దరూ వొంతులేసుకుని మంచి vigorతో పాడారు. దానికి తోడు వయొలిన్ మీద గణేష్, మృదంగం మీద సతీష్‌లు కూడా దీటైన సహకారం ఇచ్చారు. పల్లవి త్రిపురసుందరి అమ్మవారి మీద (నవరాత్రులు కదా!).. ఆది తాళం, అటుపైన వేసిన రాగమాలిక స్వరాలు - ఇవన్నీ కొంచెం చప్పగా ఉన్నాయి. మృదంగ తనిఆవర్తనం మంచి హుషారుగా ఉంది. ఈ అబ్బాయి రూప వేష విశేషాలు కొంచెం తమాషాగా, ఆకట్టుకునేట్టు ఉండి, ఎవరబ్బా అని కుతూహలంతో ఇంటికొచ్చాక జాలంలో వెదికాను. ఆ పొడుగాటి జుట్టూ అదీ కోంచెం తబలా ఉస్తాద్ జాకీర్ హుసేన్ స్టైల్లో పెట్టీంచాడు. వేషం ఒకటే సరిపోదు కదా, అతని వాయిద్యం కూడా మంచి పసతోనే ఉన్నది. ఇతనికి ఇంకా మంచి ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంటుందనడంలో సందేహమేం లేదు. చాన్నాళ్ళ తరవాత అంతర్జాతీయ రంగమ్మీద మరోమంచి తెలుగు సంగీతకారుడు కనబడినందుకు సంతోషమనిపించింది. నాకు కనబడిన యూట్యూబ్ విడియోల్లో, అరుణాసాయిరాం గారి పక్కన ఇతను మృదంగం వాయిస్తున్న దృశ్యం మీకోసం. ఈ దృశ్యకపు తునకలో ఇంకో విశేషం - ఈ కచేరిలో వయొలిన్ వాయించిన రాఘవేంద్రరావుగారు కూడా తెలుగువాడే.

Monday, October 11, 2010

వంగూరి వారికి ఇండియనాపొలిస్ గీతావారికి శెల్యూట్!

ఒక గంట క్రితమే ఇండియనాపొలిస్ నించి తిరిగివచ్చాను.
రెండు రోజులు తెలుగుసాహిత్య చర్చల్లో మునిగి తేలి, సాహితీబంధువుల సాంగత్యంలో గడిపివచ్చిన ఆ ఆనందపు సుగంధం ఇంకా నన్ను ఆవరిచే ఉన్నది.

బ్లాగ్మిత్రుడు అఫ్సర్‌ని ఇదే ముఖాముఖి కలుసుకోవడం. చిరకాలంగా జాలంలో పరిచయమున్న యువమిత్రుడు, ఔత్సాహిక కవి కిరణ్ (నచకి పేరిట ప్రసిద్ధుడు) ని కూడా ఇదే చూడ్డం. కలిసి చాలాకాలమైన మిత్రులు డా. ఇయ్యుణ్ణి ఉమగారిని, డా. శొంఠి శారదాపూర్ణగారిని మళ్ళీ కలుసుకోవడం బాగుంది. షికాగో నించి చాలామందే వచ్చారు. సరే ఈ ఉత్సవానికి నాంది పలికిందే వంగూరి ఫౌండేషన్ కాబట్టి వంగూరి చిట్టెన్‌రాజుగారిని ఎలాగూ కలిశాననుకోండి.

ఇండియానించి ఇక్కడ తమ పిల్లల్ని చూసుకోడానికి వచ్చిన పెద్దలు పనిలోపనిగా ఈ సభావేదికని అలంకరించారు - లొయొలాకాలేజిలో నాకు హిందీ పాఠం చెప్పిన గురువులు, మాజీ పార్లమెంటు సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ప్రముఖ సాహిత్య తత్త్వవేత్త బి. ఎస్. రాములుగారు, ప్రఖ్యాత రంగస్థలనటులు, పద్యకవి, ఆచార్య అక్కిరాజు సుందరరామకృష్ణగారు - ఇత్యాది ప్రముఖుల్ని కలుసుకోవడమేగాక రెందు రోజులపాటి వారి మాటలు వింటూ, వారితో కలిసి భోజనం చేస్తూ వారి సాంగత్యంలో గడిపే భాగ్యం చిక్కింది.

చివరిగా ప్రయాణంలో తోడొచ్చి, దారి ఖర్చులే కాదు, రోడ్డు కష్టాల్ని కూడా పంచుకున్న మిత్రుడు శ్రీ - శ్రమ తెలియకుండా ప్రయాణం జరిగింది. మరీ దూరం కాకపోయినా డిట్రాయిట్ నించి మేవిద్దరం తప్ప ఇంకెవరూ రాలేదెందుకో.

సదస్సు సమగ్ర నివేదిక శ్రీ రాస్తానన్నారు. బ్లాగుల గురించి నేను చెప్పిన మాటలు, ఇంకా సదస్సులో నా దృష్టిని ఆకర్షించిన అంశాలతో వేరే టపా వివరంగా రాస్తాను త్వరలోనే.

సదస్సు జరిగేందుకు విత్తనం వేసిన వంగూరివారికీ, నడుంబిగించి చక్కటి ఏర్పాట్లు చేసి సదస్సుని నిర్వహించిన ఇండియనాపొలిస్ గీతావారికి శెల్యూట్!

Sunday, October 3, 2010

కబుర్లే - ఎక్కువగా కళలగురించి

చాలా రోజుల (నెలల) తరవాత ఈ వారంతం చక్కటి కళాస్వాదనలో ఆహ్లాదంగా గడిచింది. మెట్టుమెట్టుగా కిందికి దిగిపోతున్న వాతావరణ ఉష్ణోగ్రతకానీ, రెండ్రోజులపాటు మావూరి ఆకాశాన్ని పట్టి విడవని ముసురుగానీ ఈ హాయిని ఇసుమంతయినా తగ్గించలేకపోయాయి.

శుక్రవారం సాయంత్రం పనులు తొందరగా చక్కబెట్టుకుని సాయంత్రం ఆరింటికల్లా బయల్దేరాను అరవై మైళ్ళదూరంలో ఉన్న ఏనార్బర్ నగరానికి. శుక్రవారపు సాయంత్రం రద్దీతో గంటంబావు పట్టింది గమ్యం చేరేప్పటికి. మిషిగన్ వివి వారి సంగీత కళాశాలలో మేకింటోష్ థియేటరులో ఏర్పాటయింది కచేరీ. నూటయిరవై మంది మాత్రం పట్టే చిన్న హాలు. విదుషి ఏ. కన్యాకుమారి, శ్రీ ఎంబార్ కణ్ణన్ గార్ల వయొలిన్ యుగళం. (ఒక కుంటి ప్రశ్న - ఇంగ్లీషులో అయితే సింపుల్‌గా డ్యూయెట్ అనేస్తాం. వాద్య ద్వయాన్ని యుగళం అనొచ్చా?) మృదంగం మీద శ్రీ శ్రీముష్ణం రాజారావుగారు, కంజిర మీద ఆయన శిష్యుడు, టొరాంటో నివాసి కార్తీక్ వెంకటరామన్ తాళవాద్య సహకారం. కన్యాకుమారి గారు చిన్నవయసునుండీ మహావిదుషీమణి ఎమ్మెల్ వసంతకుమారి ఆంతరంగిక వాయులీన సహాయకురాలిగా కచేరీలలో పాల్గొంటూ వసంతకుమారి (అది వారి గురువు జీ.ఎన్. బాలసుబ్రమణ్యంగారు ధారపోసిన) బాణీని పుణికి పుచ్చుకున్నారు. వసంతకుమారి కీర్తిశేషులైనప్పటినించీ ఎక్కువగా కదిరి గోపాలనాథ్ గారి శాక్సఫోన్ వాద్యానికి వయొలిన్ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఈవిడ స్వంతగా కచేరీలిచ్చినది చాలా తక్కువ. ఎక్కువగా సహకారవాద్యాన్నే అందిస్తూ వచ్చారు. ఈ రోజు కచేరీ ఒక శ్రోతగా నాకు కనువిప్పు - కన్యాకుమారి గారు తన విద్యలో మరో పార్శ్వాన్నే కాదు, ఏకంగా విశ్వరూపం ప్రదర్శించారు ఆ వేదిక మీద.

కచేరీ అద్యంతమూ పూర్తిగా సాంప్రదాయ పద్ధతిలో ఉన్నట్టుగా ఉంటూనే ఇదివరకు అనుభవానికి రాని కొత్తవింతల్ని ప్రదర్శించింది. చక్కగా వర్ణంతో మొదలు పెట్టారు నాటకురంజిలో. వెనువెంటనే గణపతి ప్రార్ధన మహాగణపతిం నాటరాగంలో. కృతి చివర సాధారణంగా వచ్చే చిట్టస్వరంతో బాటు అద్భుతమైన చమక్కులతో చమత్కృతులతో కల్పనాస్వరాలను గుప్పించి వదిలారు. నేరుగా క్షీరసాగరశయనా అంటూ కృతిలోకి వెళ్ళిపోయారు దేవగాంధారిలో. దీనికి కూడా కృతిముగిసిన తరవాత రసవత్తరమైన స్వరప్రస్థారం చేశారు. దేవగాంధారి కొంచెం plaintiveగా ఉంటుంది, ఈ కృతిలో మరీను. అట్లాంటిది కన్యాకుమారి చేసిన రూపకల్పనలో plaintive natureని అధిగమించి ఒక తారస్థాయిని చేరాలనే ఉప్పొంగిన ఉద్వేగం కనబడింది - సారీ, వినబడింది. కర్ణరంజని అనే అంతగా పరిచయంలేని రాగంలో ముత్తయ్యభాగవతారి బొత్తిగా పరిచయం లేని కృతి తరవాత, మళ్ళీ ఆలాపన ఏమీలేకుండా నేరుగా కృతి అందుకున్నారు. నా చెవుల్లోని ప్రతీ జీవకణమూ అది శంకరాభరణమనీ, స్వరరాగసుధ అనే త్యాగరాజ కృతియనీ ఘోషిస్తున్నాయి. కానీ నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను - ఏవిటి నిజంగానే? ఛ, కాదు. అసలు శంకరాభరణం ఆలాపన లేకుండ ఎట్లా వాయిస్తారు? పోనీ స్వరరాగసుధ కాదేమో. ఏదో ఇంచుమించు అలాగే ఉన్న ఇంకో రాగంలో ఇంకో పాట యేదన్నానేమో? ఉహు, కాదు. రెణ్ణిమిషాల్లో నిర్ధారణ అవనే అయింది. ఆ పల్లవిలో అలలపై అలలుగా పేరుకుంటున్న సంగతులు, ఆ పాట స్వరరాగసుధ అనే నిర్ధారించేశాయి. ఏవిటబ్బా ఈ వింత? ఆలాపన లేకుండా? అయినా మన పిచ్చిగానీ రజతగిరీశుడు నగజకి దెల్పిన స్వరార్ణవ మర్మములను దెలిసిన త్యాగరాజు వెదజల్లే సుస్వరమాయ పరుచుకోడానికి ముందు ఆలాపన అనే అవలంబన కావాలా?

ముఖ్యాంశంగా నటభైరవిలో శ్రీవల్లీ దేవసేనాపతే, బహు విపులంగా, తాళవాద్యాల తని ఆవర్తనం యథావిధే. ఆ పైన ఎన్నెన్నో చిన్నచిన్న కృతులు, కీర్తనలు .. ఆనంద అలలో కొట్టుకుపోతున్నాను. మళ్ళీ తట్టిలేపిన ఒక వినూత్న అంశం .. ఏడు రాగాల మాలికలో గోవింద నామాలు. హ హ హ .. భలే. బహ్లే కాన్సెప్టు! నీనామమే మాకు నిధియు నిధానము .. ఇంకొక సాహిత్యము కావలెనా? శ్రీవేంకటేశా గోవిందా వేంకటరమణా గోవిందా .. గోవిందా హరి గోవిందా గోవిందా భజ గోవిందా .. రేవతి, వలజి, మోహన, హిందోళ, నాగస్వరావళి (రెండు రాగాలు ఇప్పుడు గుర్తు రావట్లేదు) .. అన్నీ ఐదు స్వరాల ఔడవరాగాలే .. గోవిందా, నీనామ మెంత రుచికరమయ్యా .. అదీనూ సప్తస్వరాలకి ప్రతీకలుగా నిలిచిన ఏడురాగాల్లో కూర్చితే, ఇహ అడుగుతావూ .. మధురాధిపతే, అఖిలం మధురం - మరోమాట లేదు. అటుపైన మధ్యమావతిలో (ఇదీ ఔడవరాగమే) భాగ్యదలక్ష్మిని రావించి (అయ్యవారి వెంటనే అమ్మవారూ రావాలి గద!) గబగబా శివరంజనిలో తిల్లానా చూపించేసి పవమానసుతునితో మంగళం పాడించారు. తోడు వచ్చిన మిత్రులందర్నీ యథాస్థానాల్లో దింపి ఇల్లు చేరేప్పటికి పన్నెండున్నర!

ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినవాళ్ళు ఎవరో iCarnatic.org అనగానే కొంచెం ఆశ్చర్యమైంది. మధ్య ఇంటర్వల్లో వాళ్ళే చెప్పారు. కర్నాటకసంగీతంలో గొప్పగొప్ప కచేరీలన్నీ ఎందుకు చెన్నై వాసులకి మాత్రమే లభ్యం కావాలి, ప్రపంచంలో నలుమూలల్ల్లో ఉన్న కర్నాటక సంగీత అభిమానులకి కూడా ఎందుకు అందకూడదు అనే ఉద్దేశంతో మొదలు పెట్టారట ఈ iCarnatic.org. బానే ఉంది ఐడియా.

శనివారం ఉదయం కంప్యూటరు మీద ఏదో పనులు చేసుకుంటూ ఉంటే అకస్మాత్తుగా స్ఫురించింది, అరె దసరాల ప్రత్యక్ష కవిసమ్మేళనం ఇవ్వాళ్ళేగద! పొద్దువారు సాదరంగా పంపిన ఆహ్వానాన్నించి సభాస్థలిలో అడుగుపెట్టాను. అప్పటికే కవితాగానం జోరుగా సాగుతున్నది. అడుగు పెట్తినదే తడవుగా పుంభావసరస్వతుల సాక్షాత్కారం కలిగింది. ఆహా, భలే నిన్నమాపు సంగీత సరస్వతి నేడురేపు సాహిత్య పుంభావ సరస్వతి. భేష్. తెలుగుపద్యం కామేశ్వర్రావుగారి అధ్యక్షతన సభ కడురమ్యంగా నడుస్తున్నది. నేను కొద్ది సేపు మాత్రం ఉండి. కొన్ని రసవత్తరమైన పూరణలు విని, కవిసభ్యులతోపాటు సరససల్లాపంలో పాలుపంచుకుని నిష్క్రమించాను. కార్యక్రమం మొత్తం పొద్దులో విజయదశమి సందర్భంగా ప్రకటితమవుతుంది.

మా స్థానిక భారతీయదేవాలయంలో మరొక వయొలిన్ ద్వయం కచేరీ జరిగింది శనివారం సాయంత్రం. నాపనులు ముగించుకుని నేవెళ్ళేప్పటికి రసకందాయంలో పడుతున్నది. పూర్వికళ్యాణిలో త్యాగరాజస్వామివారి జ్ఞానమొసుగుచున్నారు. అటుపైన ముఖ్యాంశంగా భైరవి రాగంలో ముత్తుస్వామి దీక్షితుల బాలగోపాలుణ్ణి ప్రత్యక్షం చేశారు. భాగ్యశ్రీ (హిందుస్తానీ వారి బాగేశ్రీ)లో రాగం తానం పల్లవి .. రసికుల కనురాగమై, రసగంగలో తానమై, పల్లవించింది. మళ్ళీ ఎన్నెన్నో బుల్లి బుల్లి హొయలు సోయగాలు, భారతియార్ పాటలు, కావడి చిందులు. కచేరీ ముగిసినాక తారసపడిన తమిళమిత్రులతో విచారించాను, ఎవరీ యువకులు? రామలక్ష్మణుల్లా ఉన్నారే? అరుణ్ రామమూర్తి, శివ రామమూర్తి - లాసేంజిలస్ వాస్తవ్యులు, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు .. ఆహా ఏమి విద్య, ఎలా నేర్చారయ్యా? ఎంత చక్కటి సంగీత జ్ఞానం, ఏమా భక్తి? మాతృదేశాన్నించి పర్యటనలకి వచ్చే వర్ధమాన వాద్యకారుల కెవరికీ తీసిపోకుండా, చక్కటి సమన్వయంతో వాయించారే! జోహార్, జోహార్! ఈ సంగీత సరస్వతిని ఇలాగే ఆరాధిస్తూ ఇంకా గొప్ప ఆనంద శిఖరాలకు చేరెదరు గాక! శుభాశీస్సులు చిరంజీవులారా!!

రాబోవు వారాంతంలో (అక్టోబరు 9, 10) ఇండియానాపొలిస్‌లో తెలుగు సాహిత్యసదస్సు జరగబోతున్నది. నేను హాజరయి తెలుగుబ్లాగుల సాహిత్య సేవ అనే అంశం మీద ఉపన్యాసం దంచబోతున్నాను. సభ వివరాలు వారి బ్లాగులో.

పొద్దులో గిరిధర్ పద్య కావ్యం తప్పక చూడండి.