Saturday, September 25, 2010

తోచని శనివారపు మధ్యాన్నం కబుర్లు

అంతటా ఎన్నికల సంరంభం. డెమోక్రాట్లు బుజాలు తడుముకోవడం. రిపబ్లికన్లు లేని బింకాలు ప్రదర్శించడం. టీపార్టీవారు మీసాలు దువ్వి తొడలు చరచడం, అంతా మహా సందోహంగా ఉంది. కానీ ఎవరు గెలిచీ సాధించేది, ఎప్పుడు జరుగుత్న్నదానికంటే ఇంకా ఊడబొడిచేది ఏమీ కనబడ్డంలేదు. కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు మెజారిటీ సాధిస్తే మాత్రం ఒబామా ప్రతిపాదించే ప్రతీ శాసన ప్రతిపాదనకీ వాళ్ళు అడుగడుగునా అడ్డుతగుల్తారనేది కచ్చితమే. అదేవిటో విచిత్రం - బుష్షు అధ్యక్షుడిగా తన లెజిస్లేటివ్ ఎజెండాని వొద్దుమొర్రో అంటున్న డిమొక్రాటిక్ కాంగ్రెస్ గొంతులో బలవంతంగా కుక్కి మరీ సాధించుకున్నాడు. కానీ డిమొక్రాటిక్ అధ్యక్షులెవరూ రిపబ్లికన్ కాంగ్రెస్‌తో ఇట్లాంటి విజయం సాధించలేకపోయారు. చూడాలి ఏమవుతుందో. కానీ నాకు బొత్తిగా ఆసక్తి పోయింది.

మా ఊరి వాతావరణం పూరిత్గా ఫాల్లోకి పడిపోవాలో లేక ఇంకా కొంచెం సేపు వేసవి కొంగులు పట్టుకుని వేళ్ళాడాలో తేల్చుకోలేకుండా ఉంది. ఒక పూట ఇంచుమించు తొంభఈ డిగ్రీలు తాకుతూ చెమటల కక్కిస్తుంటే మరునాడే గరిష్ఠం అరవై దాటట్లేదు. సాధారణంగా ఫాల్ మొదట్లో ఇట్లాంటి సయ్యాట మామూలే, కాకపోతే అది అక్టోబర్లో జరిగేది, ఈ సారి లేబర్ డే నించే మొదలైపోయింది.

మొదటి చలి దెబ్బకి పెరటి తోటలో కొన్ని మొక్కలు వాడిపోతే ఇంక నా వ్యవసాయం పని సరి అనుకున్నాను. కానీ మళ్ళీ కొన్ని రోజులు వెచ్చగా ఉండడం వల్లనో ఏమో, మొక్కలు కోలుకున్నాయి. టొమేటో, గోంగూర, పచ్చిమిరప దిగుబడిని ఇస్తూనే ఉండగా, తొలిసారిగా దోస, కాకర పాదులు కాపుకాసి అనుగ్రహించాయి. ఊరిస్తున్నాను అనుకోకపోతే, కాకరకాయ వేపుడు మహా రుచిగా ఉన్నది. ఏదేమైనా, రాశిలో కాకున్నా వాసిలో ఈ సంవత్సరం వ్యవసాయం సక్సెస్ అనే అనుకుంటున్నా. వేసిన మొక్కలన్నీ బాగా ఎదగడమే కాక, ఒకటో అరో ఫలసాయాన్ని ఇచ్చాయి. వచ్చే యేటికి ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు ఉత్తేజం కలిగించాయి.

మిషిగన్‌లో గ్రాండ్ రేపిడ్స్ నగరంలో మళ్ళీ ఆర్ట్ ప్రైజ్ నడపబోతున్నారుట. పోయినేడు వెళ్ళనే లేదు. చూడాలి ఈ ఏడాదన్నా కుదురుతుందేమో.

సమాజంలోని ఏ ఒక్క పార్శ్వంలోనైనా మౌలికమైన మార్పు తేవాలంటే అవసరమైనది డబ్బా? లేక కొత్త ఆలోచనా? లేక మార్పు సాధించాలి అనే పట్టుదలా? ఉదాహరణకి ఏదైనా నగరంలో ఉండే పాఠశాల వ్యవస్థని తీసుకోండి. అమెరికాలో పబ్లిక్ పాఠశాల వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉంటూ వచ్చింది. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు కొన్ని కలిపి ఒక స్కూల్ బోర్డు అధీనంలో నడుస్తుంటాయి. ఉన్నతోద్యోగిగా సూపెరింటెండేంటు గారు దీని నిర్వహణ చూస్తుండగా, పౌరులచే ఎన్నుకోబడిన డైరెక్టర్లు ఈ స్కూల్బోర్డుని పర్యవేక్షిస్తూంటారు. ఆ స్కూల్ బోర్డు పరిధిలో నివసించే పిల్లలందరికీ ఆయా బడులలో ఉచిత విద్య. స్కూల్ బోర్డు బడ్జెట్ ఆ ప్రాంతపు ఇంటిపన్నుల, భూమి పన్నుల ద్వారా భర్తీ అవుతుంది. ఇదంతా బాగానే ఉన్నది గానీ, అనేక కారణాల వల్ల, దేశవ్యాప్తంగా అనేక నగరాల స్కూలు బోర్డులు లోతైన డెఫిసిట్ బడ్జెట్లతో నడుస్తున్నాయి. తద్వారా విద్యార్ధులకి సరైన సదుపాయాల నందించలేక, విద్యార్ధుల్ని కోల్పోతున్నాయి. విద్య నాణ్యత కూడ గణనీయంగా పడిపోతున్నది. ఇదంతా ఒక downward spiral. ఒకసారి ఈ బాటలో పడిందంటే, ఆ స్కూల్ బోర్డు అలా ఇంకా అథోగతికి జారిపోతూనే ఉంటుంది - బయటపడి, పైకి రావడం చాలా కష్టం.

ఈ ఇబ్బందులు ముఖ్యంగా పెద్దపెద్ద నగరాల పరిధిలో ఉన్న స్కూల్ బోర్డులని ఎక్కువగా వేధిస్తున్నాయి. దానికితోడు నగర మధ్యభాగాల్ని పీడిస్తున్న అధిక నిరుద్యోగం, వ్యాపించిన పేదరికం, పడిపోతున్న ఇంటి ఖరీదు - ఇవన్నీ కూడా ఈ అథోగతికి దోహదం చేస్తున్నై. ఐతే ఈ ట్రెండ్‌ని మార్చలేమా? విద్య నాణ్యత పెంచలేమా? చెయ్యొచ్చు. చేసి చూపించిన ఉదాహరణలు లేకపోలేదు. ఇట్లాంటి మార్పుని సాధించడంలో న్యూ ఆర్లీన్స్ స్కూల్ బోర్డు ఆకర్షణీయమైన ఉదాహరణగా నిలిచింది. ఐతే, దాని ప్రగతి శ్రద్ధగా గమనించిన కొందరు "వాళ్ళు ఛార్టర్ స్కూళ్ళని మరీ ఎక్కువగా ప్రోత్సహించారు" అని విమర్శిస్తున్నారు. ఛార్టర్ స్కూళ్ళ ప్రసక్తి తీసుకురాంగానే చర్చ కాస్తా పాలిటిక్సు బారిన పడిపోతుంది. అందుకని మనం దాని జోలికి పోవద్దు ఇప్పుడే. ఒక స్కూల్ బోర్డు పరిధిలో తగు మోతాదులో ఛార్టర్ స్కూళ్ళు ఉంటే మంచిదే, కానీ మొత్తం పబ్లిక్ స్కూళ్ళన్నిటినీ మూసెయ్యలేం కదా! ఉన్న పబ్లిక్ స్కూళ్ళని ఎలా మెరుగుపరచడం అన్నది అసలు ఛాలెంజ్.

నువార్క్ స్కూల్ బోర్డుకి వంద మిలియన్ల డాలర్లు, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇచ్చాడుట, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడూ, సీయీవో, ఇరవయ్యారేళ్ళ మార్క్ జుక్కర్‌బర్గ్. డబ్బు మేలైన విద్యని పుట్టిస్తుందా? చూద్దాం!

ఇతనెవరో, మోటర్‌సైకిళ్ళంటే బాగా మోజల్లే ఉంది. మీరూ ఓ లుక్కెయ్యండి.

Sunday, September 12, 2010

మాయింటి వినాయకుడు


ఈసారి గోధుమ పిండితో తయారు చేశాను.
అంతకు ముందటేడు బంకమన్నుతో

Monday, September 6, 2010

మిషిగన్‌లో సమ్మరైపోయింది, ప్చ్!

కనీసం దసరాల దాకానైనా నా సరదా తీరుస్తుందనుకున్నాను.
వినాయకచవితైనా రాకుండానే అమాయకంగా వీడ్కోలు తీసేస్కుంది మా మిషిగన్ వేసవి.
కానీ, నా సావి రంగా, అది రాజ్యమేలినన్నాళ్ళూ ఏంఇ వైభవం, ఎన్నెన్ని హొయలు!
ఇహ ప్రకృతంతా నాదే కదా అన్నట్టు ఏకఛ్ఛత్రాధిపత్యం చెలాయించిందిగా!!
అచ్చం చక్రవర్తిణిలాగానే, మరీ ఒకే రకం పూలు సీజనంతా ఉంటే బోరని చెప్పి, రెండేసి వారాలకి ఒక కొత్త గుబాళింపు, ఇంకో కొత్త వెరైటీ పూల సోయగం, మార్పు మార్పు మార్పు, ఎడతెగని మార్పు, నిరంతర మార్పు.
వాహ్ వాహ్ మిషిగన్ వేసవి!
నీ రాజసం ముందు, నీ సోయగం ముందు దాసోహమ్మని తలవంచుతున్నాను.
ఈ రంగులూ రూపాలూ సువాసనలూ నాకోసమే విరిసి విసిరి మురిశావని అనుకోడానికి నేనెంతవాణ్ణి?
ఐనా నా అజ్ఞానంలో అలాగే అనుకుంటాను. ఐనా ఎక్కడో, ఏమూలో నా మెదడుకి అందని ఒక సమూలాగ్రమైన అంతశ్చేతనకి తెలుసు.
నువ్వే సకల సృష్టిని శాసించే జగన్మోహినివి.
నేనల్లా నీ మాయలో పడి ఓలలాడుతున్న పిచ్చివాడిని.
వాహ్ వాహ్ మిషిగన్ వేసవి!
నీ రాజసం ముందు, నీ సోయగం ముందు దాసోహమ్మని తలవంచుతున్నాను.


తెలుగు బ్లాగువనంలో ఒక విచిత్రమైన పూల తీగె వెన్నెల పూలు పూస్తోంది చూడండి.

Thursday, September 2, 2010

అమెరికా అంటే నాకిష్టం - టోనీ బ్లెయిర్ మాటల్లో

"అమెరికా అంటే నాకిష్టం" అనే శీర్షికతో ఈ బ్లాగులో ఇదివరలో కొన్ని టపాలు రాశాను. సందర్భోచితంగా మరికొన్ని చోట్ల కూడా అమెరికా పట్ల నా అభిమానాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. కానీ ఎప్పుడూ ఏదో ఒక వెల్తి, నా మనసులో ఉన్నది సరిగ్గా చెప్పలేకపోతున్నాను అని. ఇందాక టైం వారపత్రిక సైట్లో టోనీ బ్లెయిర్ ఆత్మకథ పేజీనొకదాన్ని చదివినప్పుడు, హబ్బ, సరిగ్గా నా మనసులో మాట రాశాడీయన అనిపించింది. అది మీతో పంచుకోవాలని ..

తెలుగుసేత నాది. టపా కింద టైం పత్రికకి లంకె ఉంది. ఆంగ్లం కావాలంటే అక్కడ చదువుకోవచ్చు.

మిగతా ప్రపంచం అమెరికన్లని ఆడిపోసుకునే లక్షణాలు ఉన్నాయి అమెరికన్లలో - వాళ్ళు ఒకింత పొగరుగా, పెద్దనోరేసుకుని మాట్లాడుతూ, అంటీముట్టనట్టు ఉంటూ, తాము పట్టిందానికి మూడేకాళ్ళంటూ, ఒకింత పెత్తనం చెలాయిస్తూ ఉంటారు నిజమే. అయినా అమెరికా గొప్పతనానికి ఒక కారణముంది. ఎంత తిట్టుకున్నా మిగతా ప్రపంచం అమెరికాకేసి తలెత్తి చూస్తుండడానికి ఒక కారణం ఉంది. అమెరికను వ్యక్తిత్వంలో ఒక మొక్కవోనితనం- కొన్ని శతాబ్దాల చరిత్ర పేర్చిపెట్టినది, కొత్త ప్రపంచపు ఉత్సాహంతో వచ్చినది, రకరకాల కాందిశీకుల కలయికతో ఏర్పడినది, స్వాతంత్ర్య యుద్ధంతో సాధించుకున్నది, గొప్ప అంతర్యుద్ధం ద్వారా రాటుదేలినది, ఇంకా అనేక చారిత్రక సంఘటనల వల్ల రూపుదిద్దుకున్నది - అటువంటి రాజసం ఒకటున్నది.

ఐతే అది మంచితనానికి సంబంధించినది కాదు. మిగతా వాళ్ళకన్నా గొప్పగా ఉండడానికి సంబంధించినది కూడా కాదు. అది తమ దేశానికి సంబంధించిన ఒక భావన. జాతి మత వర్గ భేదాల్ని అధిగమించిన ఒకానొక అమెరికను ప్రతీక పట్ల ఆరాధన అది. విలువలకి సంబంధించిన ప్రతీక అది - స్వేఛ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పరిపాలన, స్వశక్తితో కష్టపడి వృద్ధిలోకి రావడం, ఇలాంటి విలువల్లో ఆ అమెరికన్ ప్రతీక ఉంది. ఈ ప్రతీకని సాధించడంలో, రక్షించుకోవడంలో వ్యక్తికన్నా దేశం ముఖ్యం అనే ఒక మజ్జాగతమైన సత్యం. నిజమే - ఈ ప్రతీక ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు, కానీ అమెరికనులు దాని కోసం ఎల్లప్పుడూ పాటుపడుతూనే ఉంటారు.

Read more: http://www.time.com/time/world/article/0,8599,2015409-3,00.html#ixzz0yOIrMUrK