Monday, August 2, 2010

మళ్ళీ మళ్ళీ చదవాలి ఈ బుక్కూ ..

ప్రసిద్ధమైన హాలీవుడు చిత్రం కేసబ్లాంకాలో ఇంకా ప్రసిద్ధి చెందిన డయలాగ్ - ప్లే ఇట్ ఎగేన్, శాం! అని. నాయికకీ నాయకునికీ గత జ్ఞాపకాల సేతువులాంటి పాటనొకదాన్ని మళ్ళీ వాయించమని శాం అనే పియానో వాద్యకారుణ్ణి కోరుతూ నాయిక ఇన్‌గ్రిడ్ బెర్గ్‌మేన్ చెప్పే డయలాగిది.

ఏదన్నా పుస్తకం తీసుకుందామని బుక్‌షెల్ఫు దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడూ, ఈ డయలాగుని కొద్దిగా మార్చి, రీడిట్ ఎగేన్, శాం! అని నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను.

పాత పుస్తకం. ఎంతో పరిచయమైన పుస్తకం. మొదటి అట్ట దగ్గర్నించీ చివరి అట్టదాకా, ఏయే పేజీల్లో ఏయే విషయాలున్నాయో ఇంచుమించు హృదయస్థంగా తెలిసిపోయిన పుస్తకం. ఏముంది ఇందులో మళ్ళీ కొత్తగా చదివేందుకు?

పాత పుస్తకం. ఎంతో పరిచయమైన పుస్తకం. ఒకటో క్లాసులో బళ్ళో మొదటి రోజున నా పెన్సిలి ములుకు విరిగిపోతే షార్పెనర్ లేక బిక్కమొగం వేస్తే చొరవగా తీసుకుని చెక్కిపెట్టి అప్పణ్ణించీ ఆప్తమిత్రుడైపోయిన బాబూజీ జ్ఞాపకం. నాలుగో క్లాసులో కుంటాట ఆడుతూ పడిపోయి మోకాలికి దెబ్బతగిల్తే తనకోసం కొనుక్కున్న జాంకాయని కాకెంగిలి చేసి కొరికి నాకో ముక్క పెట్టిన స్వరాజ్యం చూపించిన అభిమానం. హైస్కూల్లో అనర్గళ ప్రవాహంలాంటి హెడ్మాస్టారి ఆంగ్ల పాఠం - అప్పటిదాకా ఇంగ్లీషు పాఠమంటే పాఠంలోని ఇంగ్లీషు మాటలకి తెలుగులో అర్ధాలు చెప్పుకుని బట్టీ కొట్టడమే - ఇంగ్లీషు పద్యంలో ఇంత మాధుర్యం ఉందా అని తెలుసుకున్న తొలి అనుభవం అది. అటుపైన కాలేజి విద్యార్ధినై ఇల్లు విడిచి బయటి ప్రపంచంలో తప్పటడుగులు వేస్తూ, అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా మాత్రమే ఇంటికొచ్చే నన్ను, ఏవేళకి ఇల్లు చేరినా, అన్నం తిన్నావా నాన్నా అని పలకరించిన అమ్మ ఆప్యాయత - నేను కాలేజి విద్యార్ధినైనా, మాస్టర్నైనా ఆ ఆప్యాయత మారదు గదా.

పాత పుస్తకం. ఎంతో పరిచయమైన పుస్తకం. నా మెదడుకి తెలుసు. పోయిన్నెల్లో కొన్న ఆ ప్రపంచ ఆర్ధికస్థితి విశ్లేషణ పుస్తకం ఇంకా తెరవనేలేదు. మొన్నటి వారంలోనే తెప్పించిన లేటెస్టు బెస్ట్ సెల్లరు నవల ఇంకా పేకెట్టే విప్పలేదు. కొత్త పుస్తకాలు చాలా ఉన్నై చదవాల్సినవి. తెలుసుకోవలసిన విషయాలు బోలెడున్నై. కానీ, చిన్నతనంలో పిచ్చిని పోలి ఉండే ఏకాగ్రతతో చేసినపనినే విసుగులేకుండా మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండే ఆ పునరావృత్తిలోని హిప్నాటిక్ ఆకర్షణ. ఒక గిల్టీ ప్లెజర్ - స్ట్రిక్ట్ డయట్ పాటించవలసిన వాడు ఒకసారి, నాలుగు చెంచాలే అయినా, తనకిష్టమైన బటర్ పీకాన్ ఐస్క్రీము తినెయ్యడం. ఒక గిల్టీ ప్లెజర్ - ఇలా దొంగతనంగా రాబట్టుకున్నే చిన్ని సుఖం కలిగించే ఆనందం లెజిటిమేట్‌గా వచ్చే ఏ గొప్ప సుఖమూ ఇవ్వలేదుగదా!

అలాంటి గిల్టీ ప్లెజర్ .. నా పాతపుస్తం!!

పాత పుస్తకం. ఎంతో పరిచయమైన పుస్తకం. పాత జ్ఞాపకాలంత అపురూపం. కానీ అనుభవాలు జ్ఞాపకాలు మళ్ళీ అనుభవంలోకి రావు. మనసు వీధుల్లో పిల్ల తెమ్మెరల్లా పలకరించాల్సిందే. పాత పుస్తకం అలాక్కాదు. మన దగ్గరే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరిచి చదువుకోవచ్చు. ఆ మాయదుప్పటీ మన మీద కప్పేసుకుని నాలుగో క్లాసులోకో, హైస్కూలు వయసుకో వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కాస్సేపు.

నా దగ్గిర ఓ అరడజను ఉన్నాయ్ ఇలాంటి మాయదుప్పట్లు.
మరి మీ మాయ దుప్పటీ ఏంటి?