Friday, April 30, 2010

కబుర్లు - మే 3

మొన్న శనివారం మేడే. నే పుట్టి పెరిగిన విజయవాడలో అన్ని కూడళ్ళలో ఎర్రజెండాల సంరంభం జరుగుతుండేది. నేను కొంచెం పెద్దవాణ్ణయ్యాక, బయటిలోకం కాస్త కాస్త తెలిసొచ్చాక భారద్దేశంలో అతి పెద్ద, అన్నిటికంటే శక్తివంతమయిన కార్మికసంఘం కాంగ్రెస్ పార్టీదని తెలిసి విస్తుపోయాను. అదలా ఉండగా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కార్మికఉద్యమం అసలు ఏ స్థితిలో ఉంది? అనేక సామాజిక చిహ్నాల రూపురేఖలు మారిపోతున్నట్టే శ్రమ, ఉత్పత్తికి సంబంధించిన సూత్రాలుకూడ మారిపోతున్నాయి. అనతి వత్సరాల క్రితం వరకూ లేబరెవరు, మేనేజిమెంటెవరు స్పష్టంగా తెలిసి ఉండేది. మూణ్ణెల్ల ఆర్నెల్ల ఎసైన్మెంట్లకోశం ప్రపంచం నలుమూలలకీ పొట్టచేతబట్టుకుని వలసపోతున్న సాఫ్టువేరోళ్లు కార్మికులు కాదా? వాళ్ళకేం హక్కులున్నై? కానీ ఏసీ ఆఫీసుల్లో బట్ట మడతనలక్కుండా రోజుగడిపే వాళ్ళని కార్మికు లనుకోవాలంటే మనసుకి అదోలా ఉంది. ఒకపక్క ఇలా వర్గీకరణకి లొంగిరాని కొత్తకొత్త కార్మిక వర్గాలు తయారవుతుంటే, మరోపక్క సంఘటితమై ఉన్న కార్మికఉద్యమ సంక్షేమసంఘాలు అన్నిరంగాలలోనూ నిర్వీర్యమై ఊరుకుంటున్నాయి. అమెరికను కార్లకంపెనీలు కుప్పకూలబోతున్నాయి అని ప్రభుత్వం జోక్యం చేసుకోవడంలో సందట్లో సడేమియా అని ఆయా కంపెనీల యాజమాన్యం (యాజమాన్యం అంటే యెవరు? పరోక్షంగా ప్రభుత్వమే!!) లేబరుయూనియన్లని మరికాస్త పిండింది. ఇన్నేళ్ళుగా డెమోక్రాటిక్ పార్టీకి పెట్టనికోటగా నిలిచిఉన్న లేబర్ యూనియన్లు తాము ఏరికోరి ఎన్నుకున్న ప్రభుత్వమే ఇలా వెన్నుపోటు పొడిస్తే సహిస్తారా? ఏమో మరి వచ్చే నవంబర్లో తెలుస్తుంది.
మేడే సందర్భంగా ఈ ఆంగ్లబ్లాగు కూడా చూడండి (నా దృష్టికి తెచ్చిన గద్దెస్వరూప్ గారికి నెనర్లు.)

మే 1 న డిట్రాయిట్ తెలుగు సమితి వారి ఉగాది వేడుకలు చూసొచ్చాను కాసేపు. కార్యక్రమాలు జరుగుతున్న హాల్లోకంటే ఎక్కువసేపు బయట కారిడార్లోనే పరిచయస్తులు, స్నేహితులతో ముచ్చట్లాడుతూ గడిపాను. ప్రస్థానం సినిమా నిర్మాత (ఈయన పేరు రవి అనుకుంటా, సరిగ్గా గుర్తు లేదు) కనిపించారు. ఆయన బిజీగా ఉండడంతో హలో అనడం కంటే ఎక్కువ సంభాషణ జరగలేదు. మిత్రులు ప్రసాద్ సామంతపూడి, శ్రీనివాస్ కాళ్ళకూరి గార్లతో కాసేపు జరిపిన తెలుగు భాష, పరిస్థితి, సాహిత్యచర్చ చాలా హాయిగా అనిపించింది. తెలుగు టీవీలో ఉపయోగిస్తున్న భాష మరీ దరిద్రంగా ఉన్నదనీ, భాష కాస్త బాగుపడాలంటే ముందుగా టీవీలో ఉపయోగించే భాషని మెరుగు పరచాలనీ శ్రీనివాస్ గారు అభిప్రాయపడ్డారు. నేను గత టపాలో చర్చకి పెట్టిన మూడు ప్రభంజనాల్ని ప్రస్తావిస్తూ ప్రసాద్ గారు మన తెలుగు పాఠకులు గొప్ప సాహిత్యాన్ని పరిచయం చేసుకోవడం కోసం తెలుగు పరిధిని దాటి ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవించిన మహారచయితల రచనల్ని రుచిచూడాలని అభిప్రాయపడ్డారు. అన్నట్టు కార్యక్రమం చివర్లో మన కాలాస్త్రిగారి యువబృందం "హై ధరా బాదు" అనే చిన్న కామెడీ నాటిక ప్రదర్శించారు - ట. కానీ అప్పటికే చాలా జాప్యాలస్యం జరిగి నేను ఇంటిముఖం పట్టాను.

అమెరికను సెనేట్‌లో వాలువీధి చాకిరేవు - చిరిగి పీలికలవుతున్న సాక్సు! ఎలావుంది హెడ్‌లైను? :)
విపణివీధిలో వాళ్ళ స్టాకు మాత్రం ఆకాశాన్నంటుతోంది - ఇదేమి వైష్ణవమాయో!
గ్రీకుల పురానగాథల్లో హెర్క్యులిస్ అని మహాశక్తిమంతుడు ఉండేవాడు - మన భీముడి టైపు. ఆయనకి ఒకసారి ఎవరో రాజో దేవతో ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు మహాద్భుత కృత్యాలు చెయ్యాలతను - సామాన్య మానవమాత్రులకి అసాధ్యమైనవి. అందుకే ఇప్పటికీ మనిషి శక్తికి మించిన పని అని చెప్పడానికి "అదొక హెర్క్యూలియన్ టాస్క్" అని ఆంగ్ల నుడికారం. ఇంతకీ అతగాడు సాధించిన అద్భుతకృత్యాల్లో ఒకటి ఆగియస్ అనే మహారాజుగారి పశుశాలల్ని ఒక్కరాత్రిలో శుభ్రం చెయ్యడం. ఈ ఆగియస్ మహారాజు మన విరాటరాజులాగానే తన పశుసంపదకి పేర్గాంచినవాడు. మరి ఆయన పశుశాలల్ని ఒక్క రాత్రిలో శుభ్రం చెయ్యడమంటే మాటలుకాదు. ఈ పనికోసం హెర్క్యులిస్ ఏకంగా ఒక నదిని దారిమళ్ళించి పని కానిచ్చాడు, అదంతా ఓ కథ. ఇంతకీ చెప్పొచ్చిన కవిహృదయం ఏంటంటే మన సెనేటర్లు, వాలువీధి అనే ఆధునిక ఆగియన్ పశుశాలని శుభ్రం చెయ్యడానికి నడుములు బిగిస్తున్నారు. అది మాత్రం కచ్చితంగా హెర్క్యూలియన్ టాస్కే!

కస్తూరి మురళీకృష్ణ గారి అసిధార నవల పూర్తి చేశాను. త్వరలో సమగ్రమైన సమీక్ష ప్రచురిస్తాను. చాలా ఆసక్తికరమైన పుస్తకం - సంపాదించి చదవండి. అర్ధవంతమైన చర్చకి ఆస్కారం ఉంటుంది. పుస్తకం లభించే వివరాలు ఆయన బ్లాగులో ఉండొచ్చు.
ప్రస్తుతం పెరూదేశ స్పానిష్ భాషా రచయిత మారియో వర్గాస్ లోసా (Mario Vargas Llosa) రాసిన War of the End of the World నవల ఆంగ్లానువాదంలో చదువుతున్నా. అద్భుతంగా ఉంది.

రెడ్‌ఫర్డ్ (Robert Redford) తీసిన River runs through it సినిమా చూశాను.

గత వారపు జాలవిహరణలో తగిల ఆసక్తికరమైన తీగ - లంబాడీల వివాహ విధానాల గురించి.

బెంగుళూరి నించి కృష్ణగారు కొత్తగా బ్లాగ్గూడు తెరిచి చాలా చక్కగా రాస్తున్నారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

Thursday, April 29, 2010

మూడు ప్రభంజనాలు

ఆయన రచనలు చదివి నేను గొప్ప ఉత్తేజం పొందాను

ఆయన రాసిన పాటలు నా ఆలోచనల్ని మార్చడమే కాదు, నా జీవితాన్నే ప్రభావితం చేశాయి

ఆయన స్వరపరిచిన సంగీతం నన్నేదో లోకాలకి తీసుకుపోతుంది

పై మూడు వ్యక్తీకరణలూ నావి కావు, వివిధ సంభాషణల్లో వేర్వేరు మిత్రులు చెప్పినవి. ఆ మిత్రుల్లో ఆడా మగా ఉన్నారు, ఇరవై నించీ యాభై దాకా వయసుల వాళ్ళున్నారు, వేర్వేరు నేపథ్యాల వాళ్ళున్నారు.

ఆ ముగ్గురు వ్యక్తులూ
యండమూరి వీరేంద్రనాథ్
సిరివెన్నెల సీతారామశాస్త్రి
ఇళయరాజాఈ ముగ్గురూ తెలుగు నాట ఉదయిస్తున్న సమయంలోనే నేను తెలుగు నేలని విడిచి దూరంగా వెళ్ళటమూ, ఆటుపైన దేశాన్ని కూడా విడిచి సుదీర్ఘ ప్రవాసంలో ఉండడం వల్ల వీరి కళాభ్యుదయం నాకు అప్పట్లో పట్టలేదు. అలాగని బొత్తిగా పరిచయం లేకుండానూ లేదు.
యండమూరివి కొన్ని నవల్లు చదివాను, సిరివెన్నెలవీ, ఇళయరాజావీ కొన్ని పాటలు విన్నాను.

కానీ నాకివేవీ అంత గొప్పగానూ, జీవితాన్ని ప్రభావితం చేసేవిగానూ, వేరే లోకాలకి తీసుకుపోయేవిగానూ అనిపించలేదు.

ఎక్కడో ఏదో మిస్సయింది.

మీకు ఈ ముగ్గురిలో ఎవరిని గురించి అయినా నేను మొదట ఉటంకించిన లాంటి స్టేట్‌మెంట్లు చేసేంత అభిమానం ఉందా? ఐతే మీ అభిప్రాయం నాక్కావాలి.

ఏవిటి వీరిలో గొప్ప?
దయచేసి చెప్పండి.
నేను యెద్దేవాకీ వితండవాదానికీ అడగట్లేదు. నిజంగా తెలుసుకోవాలనే కుతూహలంతోనే అడుగుతున్నాను. నాక్కావాల్సింది సాహిత్య సంగీత తాత్త్విక విశ్లేషణ కాదు - చదివిన, విన్న, ఆస్వాదించిన ఒక మనిషిగా మిమ్మల్ని ఎలా కదిలించాయి వీరి కృతులు? అదీ నేను తెలుసుకోవాలంటున్నది.

ఇక్కడ వ్యాఖ్యగా చెప్పినా సరే, మీ సొంత బ్లాగులో టపా వేసినా సరే.

Wednesday, April 28, 2010

ఏమని ట్వీటెదనో ఈ వేళా ..

తెలుగుబ్లాగు మొదలెట్టిన కొత్తల్లో బ్లాగు పేరుతో ఒకట్రెండు పేరడీ కందాలు రాశాను.

ఇవ్వాళ్ళ డా.పెన్ బ్లాగులో తెలుగు తారలు ట్వీటుతున్నారని చదివాక ఈ ట్వీటు పేరడీలు వాటంతటవే పెల్లుబికినాయి. సరదాగా ..

ట్వీటమని నన్నడగ వలెనా నేనే పరవశించీ ట్వీటనా?

అంతగా నను ట్వీటకు ఉష్ .. మాటాడకు

ట్వీటంటే తెలుసా నీకూ? తెలియందే ట్వీటు చెయ్యకూ ..

ఓలమ్మీ ట్వీటు రేగిందా? వొళ్ళంతా మీట నొక్కిందా?

జగమే ట్వీటు బ్రతుకే ట్వీటు జాలమ్ములో ఇదే స్వీటు స్వీటు

నేను ట్వీటాను, లోకం మెచ్చిందీ ..

నిన్ను ట్వీటేటందుకె పుట్టానే గుమ్మ .. నువు ట్వీటకపోతే వృధా ఈ జన్మ

ట్వీటూ లేదూ స్వీటూ లేదూ ట్వీటేటందుకు ట్విట్టరు లేదూ ఏక్ నిరంజన్

నను పాలింపగ ట్వీటును పంపితివా .. గోపాలా ..

ట్విట్టరు ట్విట్టరు ట్విట్టరులో ఓహో జగమే ట్వీటెనుగా ట్వీటెనుగా మీటెనుగా

Monday, April 26, 2010

కబుర్లు - ఏప్రిల్ 26

గత నెల అంతా బీభత్సాలు, ప్రకృతి వైపరీత్యాలు, మనసుని కుదిపేసే భయానక దృశ్యాలు.
ప్రపంచవ్యాప్తంగా తరచుగా వస్తున్న భూకంపాలు - ఒక పక్కన తీవ్రమైన మానవ నష్టం, బతికున్నవారి కష్టం చూసిచూసి మనసు మొద్దుబారిపోయే పరిస్థితి కలిగిస్తుంటే, మరొక పక్కన ప్రకృతి వొళ్ళువిరుచుకుంటే దాని అనూహ్యమైన బలమ్ముందు మనిషి అస్తిత్వం ఎంత అల్పమో అన్న స్పృహ కలిగిస్తున్న దిగ్భ్రాంతి. అమెరికాలోనే, ఇంకా వసంతకాలం కూడా సరిగ్గా రాకుండా వరదల్లాంటి అనేక ఉపద్రవాలు. ఐస్‌లాండ్ అగ్నిపర్వతం అదో తమాషా - ఒక్క చిన్న అగ్నిపర్వతం అంత పెద్ద ఐరోపీయ మహాసామ్రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకుంది, ఎంత ఆశ్చర్యం? న్యూస్‌లో చెబుతున్నాడు దక్షిణాఫ్రికా నించి స్విట్జర్లాండుకెళ్ళాల్సిన చామంతిపూల కాడలు జోహనెస్‌బర్గు విమానాశ్రయం దగ్గర కోల్డుస్టోరేజిలో వడలిపోతున్నాయిట! ప్రపంచీకరణపు వింత సమీకరణం!!

వాలువీధిలో చాకిరేవు జరుగుతోంది .. ఉతుకో ఉతుకు!!! మకిలంతా బయటికి రానీ .. పోనీ పోనీ మురికంతా కడిగెయ్‌నీ!

హబుల్ టెలిస్కోపు ఇరవయ్యో పుట్టిన్రోజు జరుపుకుంటోంది. నా అభిమాన రేడియో కార్యక్రమం డయాన్ రేం షోలో హబుల్ ప్రాజెక్టుకి నేతగా పనిచేసిన ఎడ్వర్డ్ వైలర్ గారు నెమరువేసుకున్న అనుభవాలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. అందులో నన్ను మరీ ఆకట్టుకున్న అంశం ఈ హబుల్ టెలిస్కోపు ప్రాజెక్టుకి అమెరికను కాంగ్రెసు సంపాయించడానికి సుమారు 30 యేళ్ళు పట్టిందట. ఆ లెక్కన మన భారతీయ పార్లమెంటులో బిల్లులు చాలా తొందరగా జరుగుతున్నట్టే!

వారాంతంలో విలేజ్‌లో వినాయకుడు సినిమా చూశాను. టెన్షన్లూ ఉద్రేకాలూ లేకుండా నింపాదిగా హాయిగా బానే ఉంది. ఆ యింటి లొకేషన్ అద్భుతంగా ఉంది. ఎక్స్‌టీరియర్ ఏంగిల్స్‌లో ఆ అందాన్ని బాగా పట్టుకున్నాడు ఛాయాగ్రాహకుడు. యండమూరి నటన సరదాగా ఉంది. ఆయన ఇంతకు ముందు ఎక్కడన్నా సినిమాల్లో నటించారా? ఆయన మాట్లాడగా ఇంతకు మునుపు ఎప్పుడూ వినలేదు. అందుకని ఆయన గొంతు రూపానికి తగినట్టు లోతుగా గంభీరంగా ఉంటుందని ఊహించుకున్నానేమో - పీలగా హైపిచ్‌లో ఉండడంతో ఆయన డయలాగు చెప్పడానికి నోరు తెరిచినప్పుడల్లా ఉలిక్కిపడుతూ వచ్చాను! అన్నట్టు బ్లాగరి రవిగారు వైద్యుడిగా ఒక కేమియో పాత్ర సమర్ధవంతంగా పోషించారు. మాటిమాటికీ సాక్షిపేపరూ, రిలయన్సు ఫోను నెట్వర్కూ కనబడుతూ వినబడుతూ ఉండడం చిరాకెత్తించింది.

ప్రస్తుతం ఇంగ్లీషులో వైదేహి అనే కన్నడ రచయిత్రి రాసిన కథల ఆంగ్లానువాదం, (పుస్తకం పేరు గులాబీ టాకీస్, పెంగ్విన్ ఇండియా ప్రచురణ), తెలుగులో మన రాతలుకోతలు బ్లాగరి కస్తూరి మురళీకృష్ణగారు రాసిన అసిధార నవలిక చదువుతున్నా. రెండూ ఆసక్తికరంగానే ఉన్నయ్యి.

మాలిక అని సరికొత్త సంకలిని తెరంగేట్రం చేసింది. స్పీడు స్పీడు మా తీరే స్పీడు అని రూపకర్తలు చెబుతున్నారు. నిజమేననిపించింది. రూపనిర్మాణ, నిర్వహణ బృందానికి అభినందనలు. వివాదాలకి, నిషేధాలకి అతీతంగా నడిపిస్తామని కూడా ప్రకటిస్తున్నారు - జరుగుతుందని ఆశిద్దాం. శాస్త్రవిజ్ఞానం బ్లాగులో ఆర్థర్ సి. క్లార్క్ వైజ్ఞానికి నవలిక జూపిటర్ ఫైవుని తెలుగు చేస్తున్నారు, కడు సమర్ధవంతంగా, అనువాదం అని చెబితేకాని తెలియనట్టుగా. మొన్నోరోజున బ్లాగుల్లో కోతికొమ్మచ్చి ఆడుతుంటే ఈ చక్కటి దృశ్యమాలిక కంటబడింది - ఆ శిల్పాలెంత బాగున్నాయో. మీరూ ఓ లుక్కెయ్యండి.

Friday, April 23, 2010

నా కుఠోల బ్లాగు మేల్కుంది ఇరవై రెండోసారి

అప్పుడప్పుడూ ఓ లుక్కేస్తుండండి.

ఈ బ్లాగు కుడిపక్కనున్న పట్టిలోనించి కూడా దీన్ని చూడొచ్చు.

Thursday, April 22, 2010

పుడమి తల్లికి పూజచేద్దాం

ఇవాళ పొద్దున యాహూ తెరిస్తే జాలలోకమంతా ఏవిటో పచ్చపచ్చగా కనబడింది. ఇది పసుప్పచ్చ కాదు ఆకుపచ్చకాబట్టి నాకు కామెర్ల రోగమేదీ రాలేదని నిర్ధారణ చేసుకుని, కారణమేవిటా ఈ పచ్చదనానికని చూస్తే .. ఇవ్వాళ్ళ ఎర్త్ డే - ట!

పాశ్చాత్య పైత్యపు బుద్ధి కనిపెట్టిన సవాలక్ష దినాల్లాగే ఇది కూడా ఓ దినం.

ఐతే, ఎంతైనా భూమాత మనందరికీ తల్లి కాబట్టి, ఈ దినం తద్దినం కాకోడదని నా ఆకాంక్ష, ఆసయం ,కోరికానూ.

ఒకానొక్కాలంలో పర్యావరణం గురించి పట్టించుకోవడం, ఏదన్నా ప్రయత్నం చెయ్యడం, అందోళన చెయ్యడం వంటివి హిప్పీలవంటి వారు మాత్రమే చేసేవారు. తరవాత్తరవాత గ్రీన్‌పీస్, ఆడుబాన్ లాంటి ఉద్యమ సంస్థలు తయారయ్యాయి, కానీ సాధారణ సమాజం వీళ్ళందర్నీ చాలా అనుమానంతోనూ, కించిత్ చులకనగానూ చూస్తూ వచ్చింది. మరిప్పుడు పచ్చ పచ్చ మాటలు మాట్లాడే నల్లమనిషొకాయన ఏకంగా శ్వేతసౌధంలో తిష్ట వేసేప్పటికి .. ఎన్విరాంటలిజానికి యుక్తవయసొచ్చినట్లైంది.

రెండేళ్ళ క్రితం ప్రశాంతి గారి ప్రోద్బలంతో పర్యావరణ విశేషాల్ని చర్చించేందుకు ఒక బ్లాగు మొదలు పెట్టాం. అప్పటి ఉత్సాహంలో మన బ్లాగు మిత్రులు చాలా మంది ఒక చెయ్యేసి మంచి మంచి వ్యాసాలు రాశారు. సీరియస్‌గా, విశ్లేషణలతో, తమ ఆలోచనల్తో, ఒక్కోసారి సరదాగా, కించిత్ రొమాంటిగ్గా కూడా -- భలే భలే విషయాలు రాశారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

ఆ తరవాత కూడలి చర్చా వేదికలో ఒక రోజున పర్యావరణ రక్షణకై వ్యక్తిగత కార్యకలాపాల గురించి మంచి చర్చ జరిగింది. అనేక దేశాల్నించి చాలా మంది పాల్గొన్నారు. ఆ చర్చకి సంక్షిప్త నివేదికలు కింది లంకెల్లో చూడచ్చు.

నివేదిక మొదటి భాగం
రెండో భాగం
మూడో భాగం

జై పుడమి తల్లీ!
నాలుక్కాలాల పాటు పచ్చగా వర్ధిల్లు!!

గమనిక - గత టపాలో రామనాథుడి గూగులమ్మ పదాలకిచ్చిన లింకు తప్పయింది. ఇప్పుడు సవరించాను. ఇక్కణ్ణించి కూడ చూడచ్చు.