Monday, January 25, 2010

హబ్బ, ఎటు చూసినా కార్లే!

గత వారంలో ఉత్తర అమెరికా అంతర్జాతీయ కార్ల ప్రదర్శన జరిగింది డెట్రాయిట్లో. 2008లో ప్రపంచ ఆర్ధిక సంక్షోభం నేపథ్యంగా, పెద్ద కార్ల కంపెనీలన్నీ ఇబ్బందుల్లో కూరుకు పోయిన సందర్భంలో 2009 జనవరిలో జరిగిన ప్రదర్శన చాలా కృశించిపోయింది. నిస్సాన్ వంటి కంపెనీలు ప్రదర్శనలో పాల్గొనలేదు. సందర్శకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. మొత్తం ప్రదర్శన మీద ఒక నిరాశాపూరిత వాతావరణం నెలకొని ఉంది. 2009లో జెనెరల్ మోటర్స్, క్రైస్లరు కంపెనీలు దివాలా కోర్టులోంచి బయట పడ్డం, కేష్ ఫర్ క్లంకర్స్ ప్రోగ్రాము ఇచ్చిన ఊతం, అమెరికాలోనూ ఇతరత్రా ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతున్న సూచనలు - అన్నీ కలిసి ఈ సంవత్సరం డెట్రాయిట్ ప్రదర్శన కొత్త ఆశల్ని చిగురించిందనే చెప్పుకోవాలి.

ప్రదర్శనలో ప్రవేశించగానే ఎదురుగా కనులని ఆకట్టుకునేవి BMW, Audi, Mini Cooper వారి ప్రదర్శనలు. ఈ జెర్మను కంపెనీలు ఎప్పటికప్పుడు గొప్ప ఇంజనీరింగ్ పనితనం కలిగిన కొత్త కొత్త కార్లను మార్కెట్లో విడుదల చేస్తుంటాయి. సరికొత్త Audi స్పోర్ట్స్ కార్ చక్కటి డిజైనుతో పలువురు ప్రేక్షకుల చూపుల్ని ఆకట్టుకుంది. అలాగే Mini Cooper విడుదల చేసిన కన్వెర్టిబుల్ కూడా చాలా మంది అభిమానుల్ని మూటకట్టుకుంది. ముందుకి సాగితే Volvo వారి కార్నర్లో హైబ్రిడ్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్న సూచనలు కనబడ్డాయి. హైబ్రిడ్ టెక్నాలజీతో నడిచే కొత్తకార్లని ప్రదర్శించడమే కాకుండా ఆ టెక్నాలజీ లోని అంశాలని అందరికీ అర్ధమయ్యే రీతిలో వివరిస్తూ కొన్ని ఇంజను, గేర్‌బాక్సు మోడల్సుని కూడ ప్రదర్శించారు. ఇవే కాక యూరప్‌లో చాలా పాపులర్ అయిన క్లీన్ డీజిల్ టెక్నాలజీలని కూడా ప్రదర్శించారు.

ఇక్కణ్ణించి కుడి పక్కకి తిరిగితే, అక్కడ హాలు నడిమధ్యలో క్రైస్లరు వాళ్ళ ప్రదర్శన ఉంది. ఒకే ఒక్క కొత్త కాన్సెప్టు కారు ఆవిష్కరించారు. మిగతావన్నీ 2010, 2011 లలో విడుదల కానున్న పేసింజరు వేన్, సెడాన్ కార్లనే ఎక్కువగా ప్రదర్శించారు.

జెనెరల్ మోటర్స్ వారు అతి పెద్ద స్థలాన్ని ఆక్రమించి బ్రహ్మాండమైన ప్రదర్శన ఏర్పాతు చేశారు. రానున్న Buick, GMC, Chevrolet, Cadillac బ్రాండ్లలో అనేక వాహనాల్ని ప్రదర్శించారు. చూపులకి అన్నీ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటిల్లో పొందుపరిచిన టెక్నాలజీలు కూడా ప్రేక్షకుల్ని బాగానే అకర్షిస్తున్నాయి. ఇవి విడుదలైనాక ఎంతవరకూ మార్కెట్లో విజయం సాధిస్తాయో వేచి చూడవలసిందే. GM ప్రదర్శనలో ఏదైనా వాహనానికి మా చక్రాలు కనబడతాయేమోనని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూశాను. నా నమ్మకం వమ్ము కాలేదు. ఒక చక్కటి ఎర్రరంగు సిల్వరేడో ట్రక్కుమీద మా క్రోం చక్రాలు ధగధగా మెరుస్తున్నాయి.

మిగిలిన వాటిలో ఫోర్డు, టొయొటా కంపెనీల ప్రదర్శనలు అతి పెద్దగా ఉన్నాయి. ఫోర్డు వారు తమ స్థలంలో చాలా విషయాల్ని ప్రదర్శించ ప్రయత్నించడంతో అదంతా చాలా ఇరుగ్గా, వత్తిడిగా తయారయ్యి, మేము ఏదీ సరిగ్గా చూడలేకపోయాము. టొయొటా వాళ్ళ స్టాల్‌లో కొత్త టొయొటా, లెక్సస్ బ్రాండ్ వాహనాలు ప్రేక్షకుల్లో చాలా ఉత్సాహం కలిగించాయి. ముఖ్యంగా పూర్తిస్థాయిలో కరంటుతో నడిచే చిన్న కారు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది.

మనకు సాధారణంగా కనబడని వినబడని అతి ఖరీదైన కార్లు .. ఫెర్రారి, టెస్లా, మాసరాటి, లోటస్ ఇత్యాది కంపెనీలు వారు కూడా అక్కడక్కడా ఒక్కొక్క కారుని ప్రదర్శించారు. ఈ కార్లు ఒక్కొక్కటీ కొన్ని లక్షల డాలర్ల ఖరీదు చేస్తాయి.

మొత్తమ్మీద ఈ సంవత్సరపు కార్ల ప్రదర్శన డెట్రాయిట్‌లో ఒక కొత్త ఆశని చిగురింపచేసిందని చెప్పుకోవచ్చు.

Friday, January 22, 2010

ఏం జరుగుతోందీ దేశంలో??

నేషనల్లెవెలు పాలిటిక్సుని గురించి వో .. .. చించుకుంటే చిరిగేది మన ధ్వనితంత్రులే గానీ పెద్దగా వొరిగేదేంలేదని చిన్నతనంలోనే గ్రహించేశాను కాబట్టి, దేశాధ్యక్షులూ, సెనేటర్లూ, ప్రతినిధులూ చేసే వెధవ పన్లని చూసీ చూణ్ణట్టు పోతూ వుంటా. టీవీ చూడ్డం మానెయ్యడానిక్కూడా ఇదో కారణం.

కానీ ఈ మధ్యన అసలు ఒక్క రెణ్ణిమిషాలు ఏ రేడియో షో విన్నా, ఎక్కడన్నా జాలంలో ఓ రెండు న్యూసు ముక్కలు చదివినా కళ్ళ ముందు ఎర్రని తెరలు, చెవుల్లో హోరు, కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టు (హబ్బే రక్తపోటు కాదులేండి, మీ పుణ్యమాని బీపీ నార్మల్ గానే ఉంది, మొన్నే చెక్ చేయించుకున్నా) ..

జాతీయ రాజకీయ రంగమ్మీద డెమోక్రాట్ల నిర్వాకం చూస్తుంటే చిరాకు మారాకు వేసి తిక్క నసాళానికి అంటుతోంది. ఒక పక్కన పదిహేను మిలియన్ల మంది ఉద్యోగస్తులు జీవనభృతి కోల్పోయి అలోలక్ష్మణా అని ఏడుస్తుంటే, అబ్బే నా పేరు లక్ష్మణుడు కాదు అన్నట్టు .. అసలేం మాట్లాడుతున్నారో ఆలోచిస్తున్నారో కనీసపు ఇంగిత జ్ఞానం లేనట్టుగా కనిపిస్తోంది. 90లలో ఆంధ్ర దేశంలో ఒకపక్కన రైతులు ఎడాపెడా ఆత్మహత్యలు చేసుకుంటూంటే హైదరబాదు హైటెక్కు అందాల్ని విదేశీ వీఐపీలకి చూపిస్తూ మురుసుకున్న టీడీపీ ప్రభుత్వం గుర్తొస్తోంది నాకిప్పుడు ఈ జోకర్లని చూస్తూంటే.

ప్రభుత్వమే అసలు సమస్య అన్నాడు చచ్చి నరకానికి పోయిన రీగన్ మహాశాయుడు. నాలాంటి వెర్రి కుట్టెలం, ఎన్ని అనుభవాలు తగిల్నా, ఇంకా ప్రభుత్వం ఏదో తవ్వి తలకెత్తుతుందనే భ్రమలో పడి కొట్టుకుపోతూంటాం. నిజవే కదా, ఏ విషయంలో మాత్రం - ఈ విషయంలో ఇది చాలా సమర్ధవంతంగా పని చేస్తోంది - అన్నట్టు ఆశాజనకంగా ఉన్నదా ఏ ప్రభుత్వపు తీరైనా? ప్రభుత్వాఫీసంటేనే నిర్లక్ష్యానికీ, అశ్రద్ధకీ, జాప్యానికీ, నాంచివేతకీ నిర్వచనాలు కదా. అట్లాంటప్పుడు దేశ సమస్యలు, ప్రజల సమస్యలు ఇట్లాంటి ప్రభుత్వం చేతిలో పెట్టి నిశ్చింతగా కూచుందామనుకున్న మన దురాశ ఉందే .. టోకున మనల్నందర్నీ మెంటల్ అని సెర్టిఫై చేస్సి పిచ్చాసుపత్రులకి తోలెయ్యొచ్చు.

చూడండి, లేకపోతే తన బుర్ర తిన్నగా ఉన్న ఏ మనిషైనా ఇట్లాంటి పనులు చేస్తాడా?
1. ఇవ్వాళ్ళ కాకపోతే ఇంకొన్నాళ్లలో మునిగే కార్ల కంపెనీలని సొంత డబ్బు యాభై బిలియన్ల డాలర్లు పెట్టి కొనుక్కున్నాం .. ఖర్చు పెడుతున్నప్పుడే చెప్పారు మన ప్రతినిధులు .. ఈ డబ్బు తిరిగొస్తుందని ఆశ పెట్టుకోకండీ అని. ఆ మాత్రం నిజాయితీ మిగిలి చచ్చింది.
2. వాలు వీధి బేంకులు గుడ్లు తేలేస్తే ఏం పర్లేదు భాయీ మేమున్నాంగా అని మన ఖజానాలు తెరిచి వాళ్ళకి ఖాళీ చెక్కులిచ్చాం .. దానకర్ణుడి సవిత్తమ్ముళ్ళం కదా. అవును, ఇప్పుడా బేంకులు తమ ఆఫీసర్లకి మనడబ్బుల్ని బోనస్ గా ఇస్తూంటే ఎందుకూ ఏడవడం .. మనమిచ్చిన దానంతో వాడో కొత్త ఫెరారీ కొనుక్కుంటే అంతర్జాతీయ కార్ల వ్యవస్థని నిలబెట్టినట్టు కాదూ? వాడు బహమాస్ లో పదమూడో వెకేషన్ హోం కొనుక్కుంటే గ్లోబల్ రియలెస్టేట్ ని ఉద్ధరించినట్టు కాదూ? మనలాంటి సామాన్య పౌరులం మన సొంత డబ్బుతో ఇటువంటి ఘనకార్యాలు చెయ్యగలుగుతున్నందుకు గర్వించాలి గానీ ఏడుస్తారా ఎవరన్నా?
3. హెల్తు కేరు .. కేరు కేరు మని ఏడ్చి సెనేటు ఫ్లోరు మీద సొమ్మసిల్లి పడిపోయింది. డెమొక్రాట్లు తందనానా అని గంతులేసి మాసచుసెట్ సీటు పోగొట్టుకున్నారుగా? ఆ సొమ్మసిల్లిపోయిన హెల్తు బిల్లుకి సీపీఆర్ సంగతి దేవుడెరుగు, కనీసం పచ్చి మంచి నీళ్ళు పోసే నాథుడు కనబడ్డం లేదు.

చెప్పుకుంటూ పోతే ఇది చాంతాడంత లిస్టవుతుంది, మనమందరం మెంటల్ అని నిర్ధారించేందుకు. అర్రె, బ్రిలియంట్ బిజినెస్సయిడియా .. ఎర్రగడ్డ చుట్టు పట్ల ఓ నాలుగో ప్ఫదో పిచ్చాసుపత్రులు కట్టించేస్తే ఈ అమెరికా పిచ్చోళ్ళని ఔట్‌సోర్సింగులో అక్కడికి తీసుకెళ్ళి .. ఆలసించిన ఆశాభంగం, రండి బాబూ రండి .. భాగస్వాములు కండి ..

ఇప్పుడు మీరంటారు, నాకు తెల్సు .. అవున్సార్ .. ఈటనిట్ని గురించీ మనం చించుకుంటే చిరిగేది మన వోకల్ ఖార్డ్సే గానీ ..
అందుకే .. దానికి ప్రత్యామ్నాయం కూడ చెబుతున్నా. మీరు చెయ్యగలిగిన పనీ ఉంది.
మీరే చెయ్యగలిగిన పని యిది.
ముందస్తుగా మీ సెనేటర్లెవరో, మీ కాంగ్రెస్ ప్రతినిధి ఎవరో తెలుసుకోండి. అటుపైన ఉత్తరం ద్వారా, ఫోను ద్వారా, ఫేక్సు ద్వారా, ఈమెయిలు ద్వారా ఈ కింది అంశాల పైన వాళ్ళకి మీ అభిప్రాయం నొక్కి చెప్పండి.

అ. ఆరోగ్య బీమా వ్యవస్థ మార్పులు (Healthcare Reforms)
ఆ. ద్రవ్య వ్యవస్థ మార్పులు (Finance and monetary policy reforms)
ఇ. వలసవిధాన మార్పులు (Immigration reforms)
ఈ. పర్యావరణ విధాన మార్పులు (Environmental policy reforms)

ప్రతిరాష్ట్రానికీ ఇద్దరు సెనేటర్లుంటారు. మనం ఇద్దరికీ రాయొచ్చు. వీళ్ళల్లో ఎవరెవరైతే ఈ సంవత్సరం నవంబర్లో తిరిగి ఎన్నికలకి నిలబడుతున్నారో, వాళ్ళ విషయంలో ఇది మరీ ముఖ్యం. ఈ పని చెయ్యడానికి మీరు అమెరికా పౌరులు కానవసరం లేదు. ఆ ఎన్నికల జిల్లాలో నివాసముండి, పన్నులు కడుతుండి ఉంటే చాలు. నేనెందుకు చెయ్యాలి, ఏదో నాలుగు (లక్షలు? కోట్లు??) డాలర్లు చేసుకుని వెళ్ళిపోయే వాణ్ణి అనుకుంటారా? కనీసం రెండు కారణాలు.
1. మేమూ మీలాగే వెళ్ళిపోదామనుకునే వచ్చాము. వచ్చి ఇరవయ్యేళ్ళయింది. మీరు ఈ దేశం వదిలి వెళ్ళిపోతారని గేరంటీ ఏమీ లేదు.
2. ఒకేళ మీరెళ్ళిపోయినా, మీలో చాలామంది పిల్లలు ఈ దేశ పౌరులు. మనం రాజకీయంగా ఇప్పుడు చేసే పనులు రేపు వాళ్ళ భవిష్యత్తు మీద తీవ్రమైన ముద్ర వేస్తాయని గుర్తుంచుకోండి. మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకి చదువులు చెప్పించడం, బుద్ధులు చెప్పడం, ఆస్తులు సంపాయించి పెట్టడం .. ఇవన్నీ చెయ్యడంలేదా? ఇది దానికి ఇంకో ముందడుగు.

ఇవన్నీ కాద్సార్ .. లోకానికి ఒక మంచి పని చేస్తున్నాం అనే ఫీలింగ్ చాలదా? మీరు కోట్ల రూపాయలు దానమివ్వడం కంటే ఈ పని చెయ్యడం సులభమే కాదు, ఇంకా చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది కూడా.

అమెరికా రాజకీయ వేదిక మీద మీ గొంతు వినిపించండి!!!

Thursday, January 21, 2010

అమెరికాలో నివాసమున్న తెలుగు బ్లాగర్లందరికీ పిలుపు

మీ మీ కీబోర్డులకి దుమ్ము దులపండి.

అంతే కాదు, మీ చూపులకి పదును పెట్టండి.

ఈ మధ్యన విరివిగా రాస్తూన్న అబ్రకదబ్ర, ఉమాశంకర్, ఉష, భాస్కర్, భారారె, కిరణ్మయి, సునీత, శరత్, వాసు, రాధిక, రౌడీ, శ్రీ, కల్పన ... ఇంకా చాలామంది..

కొన్నాళ్ళొ చాన్నాళ్ళో రాసి ఈ మధ్య రాయడం ఆపేసిన రానారె, భవాని, చరసాల ప్రసాదు, డా. శ్రీకృష్ణదేవరాయలు .. ఇంకా చాలామంది ..

మీకందరికీ చక్కటి భాష వుంది. సహజమైన, వ్యక్తిగతమైన రచనా శైలి ఉంది. మీమీ రచనల్ని ఆసక్తిగా చదివే, కొత్త రచనలకోసం ఎదురు చూసే పాఠకులున్నారు.

అన్నిటికంటే, ఈ దేశంలో నివాసం ఉండడం వల్ల ఇక్కడి జీవితాన్ని, పరిస్థితుల్ని చదవగలిగే ఒక unique perspective ఉంది మీకు. పత్రికల్లో రాసే వ్యాసాల్లో లాగా మొహమాటాలకి పోవలసిన అవసరం లేదు. నిజాయితీతో నిర్మొహమాటంగా రాసుకోవచ్చు.

తెలుగు సినిమాలూ, ఆంగ్ల సినిమాలూ, చిన్నప్పటి జ్ఞాపకాలూ, తెలుగు రాజకీయాలూ - ఇవే కాదు మనకి విషయాలు. వీటిని రాయొద్దు అనడం లేదు, కానీ, నా వుద్దేశంలో మనం మాట్లాడుకోవలసిన విషయాలు, చెప్పుకోవలసిన కబుర్లు, చేసుకోవలసిన చర్చలు వేరే ఉన్నాయి.

మీ చేతిలో భాషుంది బ్లాగుంది చెప్పే సత్తా ఉంది చదివించే గుణముంది విశ్లేషీంచే బుర్రుంది చూసే చూపుంది - నాకు తెల్సు ఇవన్నీ ఉన్నాయని. ఇప్పటిదాకా మీమీబ్లాగులుల్లో మీమీ రచనలే ఋజువులు. కానీ ఇది సరిపోదు. సరిపోదంటే సరిపోదోచ్.

చూడండి, చూపుకి పదును పెట్టి లోతుగా చూడండి. ఎలా ఉన్నాయి మన జీవితాలు? చుట్టూతా ఉన్న సమాజం ఎలాగుంది? తెలుగు సమాజం ఎలాగుంది? భారతీయ సమాజం ఎలాగుంది? పరస్పర సంబంధా లెలాగున్నై? ఆశలూ, ఆశయాలూ, ప్రిజుడిస్లూ, ప్రైడ్‌లూ, డిజప్పాయింటుమెంట్లూ, వాటికి పూసుకున్న ఆయింటుమెంట్లూ ..

కథలో కవితలో వ్యాసాలో వ్యథలో విశ్లేషణలో డిసెక్షనులో ఏదో ఒక రూపంలో
హాస్యంగానో ఆర్ద్రంగానో సీరియస్‌గానో చర్చగానో ఏదో ఒక మూడ్‌లో

రాయండి రాయండి రాయండి
జీవితాన్ని విప్పి చెప్పే టపాలు రాయండి.

రాయండి, ప్లీజ్!!

Wednesday, January 20, 2010

మాటలు – ఒక ఏక్సిడెంట్ కథ

ఎప్పటిదో పాతది .. సుమారు పదేళ్ళ కిందటి కథ. ఆ రోజుల్లో తానా పత్రికలో ప్రచురితమైంది. అప్పణ్ణించి అలా దీర్ఘనిద్రలో ఉంది. మళ్ళి ఇప్పుడు ఇలా మీకోసం ..

ఆ ఒక్ఖ మాటా అనేశాడతను. అనేశాక వెనక్కి తీసుకోలేని మాట .. అర్జునుడి అస్త్రంలా గురితప్పని మాట .. ఆయువు పట్టులో తగిలి అగ్గి రగిలించే మాట .. అని తెలుసతనికి. అది వినగానే .. మనసుకి తగలగానే ఆ దెబ్బకి ఆమె విలవిల్లాడి పోతుందనీ తెలుసు.
అనొద్దనుకున్నాడు .. ఐనా అనేశాడు.
తెలుసుండే .. కావాలనే .. ఆమె అలా విలవిల్లాడి పోవాలనే.
అతి తేలిగ్గా అనేశాడు.

ఎప్పట్లాగే మొదలైంది సంభాషణ ఆ రోజు కూడా .. కబుర్లు చెప్పుకుంటున్నట్లుగా. ఎన్నిసార్లు ముచ్చట్లాడుకోలేదు అలా ? వందలు వేల సార్లు .. ప్రేమించుకునే రోజుల్లోనూ .. పెళ్ళాడిన కొత్తల్లోనూ .. కబుర్లేసుకుంటే ఇక వొళ్ళు తెలిసేది కాదు ఇద్దరికీ .. టైము లెక్కలోకి అసలే వచ్చేది కాదు. అలా చెప్పుకునే వాళ్ళు కబుర్లు. కానీ ఈ మధ్య ఏదో వెలితి .. ఏమీ లోతు లేకుండా .. పైపైన మాట్లాడు కుంటున్నట్టు. తెరిచి చూపించాల్సిన గుండెల తలుపులు మూసేసుకున్నట్టు .. తరచి చూడాల్సిన మనసుల మీద ఏవో పొరలు కప్పేసుకున్నట్టు. తొలకరిలో తడిసిన మాగాణి భూమిని లోతుగా తవ్వుకు పోయే నాగటి చాలు రాతి నేల తగిలి పట్టు దొరక్క జారి పోతున్నట్టు .. ఊరికే పైపైన మాటలు .. కబుర్లు .. ఇన్నాళ్ళుగా చెప్పేసుకున్న తరవాత ఇంకేం వుంటై కొత్తవి ? ఫ్రెష్ గా పిండి కలిపి దోరగా వేడిగా వేయించుకున్న మిరపకాయ బజ్జీలల్లే .. కావాలంటే ఎప్పటి కప్పుడు ఎక్కణ్ణించి పుట్టుకొస్తాయ్ ? రెండ్రోజుల క్రితం రెడీ మేడ్ పేకెట్ పిండితో వొండుకుని తినగా మిగిల్నవి రిఫ్రిజిరేటర్లో దాచుకుని ఈ పూట మైక్రోవేవ్లో రి-ఫ్రెష్ చేసుకున్న చద్ది ఇడ్లీలకు మల్లే .. ఈ మాటలు. నీరసంగా .. పేలవంగా .. ఈ కబుర్లు.

బేలెన్సు చాలా ఇంపార్టెంటు. జీవితం సాఫీగా సాగి పోవటానికి బేలెన్సు అతిముఖ్యం. ఎంతో జాగ్రత్తగా మైంటైన్ చెయ్యాలి ఈ బేలన్సు. అలా మైంటైన్ చేసుకొస్తున్నా డతను. ఒంటి త్రాటి మీద .. వేరే వూతం లేకుండా నడుస్తున్న గారడీ వాడి కౌశలంతో .. బేలెన్సు నిలుపుకుంటూ వస్తున్నా డతను. పొడి పొడి మాటలు వాడుకుంటూ .. పై పై కబుర్లు పేర్చుకుంటూ .. వాటి ఆసరాతో ఆ బేలెన్సు .. సంద్రంలో నావకి ఎన్ని ఒడిదుడుకులు .. ఎన్నెన్ని ఆటు పోట్లూ .. అవన్నీ తమకి తగలకుండా .. జెర్కులు లేకుండా .. కుదుపులు రాకుండా .. ఆమె ఆ రోజు తాడు తెగేట్టుగా ఒక్ఖ పాటున గుంజింది. నావ తల్లకిందులయ్యేట్టు ఒక్ఖ తోపు తోసింది. పైపై కబుర్ల పేక మేడల్ని .. అతనెంతో జాగ్రత్తగా పేర్చు కొచ్చిన వాటిని .. ఊఫ్ మని ఊదేసింది. పొడి పొడి మాటల మూటల్ని చించేసి .. వాటిల్లోకి కుక్కేసిన అసంతృప్తిని బయటికి లాగింది చిందర వందరగా. అది అప్పుడప్పుడే ముక్కిన వాసన కొడుతూ వుంది.

పోనీ ఆమె అంతటితో వూరుకుంటే పరిస్థితి ఇంత వరకూ రాకనే పోయేది. వూరుకునేట్టుందా? ఎప్పటెప్పటి విషయాల్నో తవ్వి తీసింది. ఎప్పుడో మరిచిపోయిన విశేషాల్ని గుర్తుకి తెచ్చుకుంది. ఒకప్పుడు .. సరదాగా, బాధగా, బరువుగా, ప్రేమగా, ఆశగా, ఆనందంగా, కోపంగా, చిలిపిగా .. ఎన్నెన్నో భావాల్ని పంచుకున్న కబుర్ల నీడల్ని అతని ముందు ఝళిపించింది. అతని మీదికి విసిరేసింది ఎన్నెన్నో ప్రశ్నల్ని .. ఆ భావాలన్నీ ఎక్కడ దాచావని .. ఆ మాటలన్నీ ఏ మూటల్లో కూరుకు పోయి ఎక్కడ అటకెక్కేశా యని .. ఆ ఆశలన్నీ ఎక్కడికి ఎగిరి పోయాయని .. ప్రశ్నలు. కబుర్లు తరిగి పోయి ప్రశ్నలే మిగిలి పోయాయా అనడిగింది. కబుర్లు తరిగి పోతే మరి ప్రశ్నలైనా అడక్కుండా ఈ వూకదంపుడు మాటలెందుకూ అనడిగేసింది చివరికి.

సరిగ్గా అప్పుడే అతనా మాట అనేశాడు. ఈ మాటలు మొదలై నప్పటినుంచీ అతనికి లోలోపల అనుమానంగానే ఉంది .. ఇది ఎటు దారి తీస్తోందో అతనికి తెలుస్తూనే ఉంది. దాన్నటు పోనివ్వకుండా మళ్ళించాలని .. అదలా పరిణమించకుండా విశ్వప్రయత్నమైనా చేసెయ్యాలని అనిపించింది .. కానీ ఏమీ చెయ్యలే దతను. చెయ్యలేడు .. చెయ్యటానికి చేతులు కట్టేసినట్టు .. పెదాలు కుట్టేసినట్టు .. నాలికని వెనక్కి మడిచి పై అంగటికి క్రేజీ గ్లూతో ఎవరో అంటించేసినట్టు .. అశక్తత.

మాయలా కప్పేసిన మంచు మీద ఓడిపోయిన బ్రేకులు, నిర్వీర్యమైపోయిన సుదర్శనంలా స్టీరింగ్ వ్హీల్ నీరసించిపోయిన చేతుల్లో .. ఇనెవిటబుల్ .. అని అర్థమైపోయి .. వేచి వేచి .. ఆ తాకిడికై చూసి చూసి .. ఎన్నో యుగాలు గడిచాక .. థడ్! సరిగ్గా అలాగే ఇప్పుడు కూడా .. స్పష్టంగా స్లో మోషన్ లో ..

ఇనెవిటబుల్ .. ఇప్పుడో ఇంకాస్సేపట్లోనో .. ఢీ కొట్టుకోవడం తధ్యం .. అతనికి తెలుస్తూనే వుంది .. కేమ్రీ టోటలై పోతే స్టేట్ ఫార్మ్ వాడు డబ్బిచ్చాడు కొత్త కారు కొనుక్కునేందుకు .. ఈ జరగ బోతున్న ఏక్సిడెంటుకి ఇన్సూరెన్స్ ఏదీ? ఈ క్రాష్ లో గుద్దుకుని విరిగి ముక్కలై పోయే మనసుల్ని రిపైర్ చేసే మెకానిక్ ఎవడూ? క్రాష్ జరక్కుండా ఆప లేడా తను? అది తన చేతుల్లో పని కాదా? నిజమా? నిఝంగా అది నిజమైతే ఎంత బావుణ్ణు! కానీ అది నిజం కాదు .. ఎప్పుడైతే జాగ్రత్తగా పేర్చుకున్న పైపై కబుర్ల పేక మేడలు కూలి పొయ్యాయో .. ఎప్పుడైతే ముక్కిన వాసన కొడుతూన్న పొడి పొడి మాటల మూటలు చిరిగి పోయాయో .. అప్పుడే అర్థమై పోయింది .. inevitable .. this crash .. with no survivors .. it’s just going to happen .. in front of his very eyes .. with both of them right in the middle of it.

ఇనెవిటబుల్ గా అతనా ఒక్ఖ మాటా అనేశాడు. అనొద్దనుకున్నాడు .. ఐనా అనేశాడు. శరాఘాతం .. లోతైన గాయం .. బాణం .. తగిలిన వాళ్ళకి .. వేసిన వాళ్ళక్కూడా .. గుండెలు ఛిద్రమై పోయి .. మనసులు భీభత్సమై పోయి .. అల్ల కల్లోలం .. బయట నిశ్శబ్దం .. ప్రశాంతం .. లోలోపల ప్రళయం .. అగ్ని గోళాలు ఢీకొని ఫెటీల్మని పేలి పోతున్నట్లు .. నరాలు చిట్లి పోతున్నట్లు .. మాట విని ఆమె ఎంత విలవిల్లాడి పోతోందో ఆ మాట అని అతనూ అంతగానూ .. మండి పోతూ .. రెండు మనసులూ రగిలి పోతూ .. ఇద్దరూ మాడి మసై పోతూ .. విధ్వంసం .. సర్వ నాశనం .. అయిపోయాక మిగిలింది ఇంత బూడిద. లోపల గాఢాంధకారం .. బయట నిశ్శబ్దం .. మధ్య ఎడారి.

రవంత చెమ్మ .. మంటల వేడికి ఇగిరి ఆవిరై పారిపోయిందనుకున్న చెమ్మ .. ఇంకా నేనున్నా నంటూ .. హఠాత్తుగా ద్రవీభవించి .. నాలుగు కళ్ళల్లోనూ నాలుగు చుక్కలుగా .. ఆ ఎడారిలో .. ప్రాణానికి జీవం పోసే చెమ్మ.

చాలా సన్నటి సవ్వడి .. చిన్న చప్పుడు .. రెండు చేతులు ఒకదాన్నొకటి వెతుక్కుని .. ముని వేళ్ళతో స్పృశించినప్పుడు .. ఒక అరచేతిలో ఇంకో అరచెయ్యి ఒరుసుకున్నప్పుడు .. ఆ చప్పుడు .. నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ .. ఒక మెత్తటి వెచ్చటి స్పర్శ చేసే సవ్వడి.

మబ్బులు వీడి పోయి .. మంచు పొరలు ఎగిరి పోయి .. మనసుల పరస్పర వీక్షణంలో .. గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ ఒక సన్నటి కాంతి కిరణం.

అప్పుడింక మాట లనవసరం.

Friday, January 15, 2010

జయహో నానో!

డిట్రాయిట్‌లో ఉత్తరమెరికా అంతర్జాతీయ కార్ల ప్రదర్శన జరుగుతోంది. నేనింకా వెళ్ళలేదు, వీలైతే వచ్చేవారం వెళ్ళి ఆ విశేషాలు కూడా రాస్తాను. కాకపోతే, ఈ సంరంభాన్ని పురస్కరించుకుని టాటా వారి అనుయాయి సంస్థ టాటా టెక్నాలజీస్ వారు నిన్న సాయంత్రం స్థానిక విజ్ఞాన కేంద్రం (Detroit Science Center) లో ఒక చిన్న ప్రదర్శన, విందు ఏర్పాటు చేశారు.

టాటా టెక్నాలజీస్ సంస్థ అనేక పెద్ద తయారు సంస్థలకి (manufacturing companies) ఇంజనీరింగ్ సేవలని అందిస్తుంది. వారి వినియోగదారులకి ఒక విందు చెయ్యడం ఈ సమావేశాపు ముఖ్యోద్దేశము అయినా, ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని తమ సహ సంస్థ అయిన టాటా మోటర్స్ వారి సరికొత్త కారు నానోని ఇక్కడి సమాజానికి పరిచయం చేశారు.

కారుని ఆవిష్కరించేముందు కంపెనీ అధ్యక్షుడు రతన్ టాటా గారు ఢిల్లీలో ఈ కారుని ఆవిష్కరిస్తూ చెప్పిన ప్రసంగం విడియో ఒకటి ప్రదర్శించారు. అటుపైన ఈ కారుని రూపొందించే బృందంలో పని చేసిన ఒక యువ ఇంజనీరింగ్ మేనేజరు, ఒక సీనియర్ మేనేజర్ మాట్లాడారు ఈ అనుభవాన్ని గురించి. కారుని రూపొందించడంలో ఏ విషయంలోనూ రాజీపడలేదనీ, మొదటినించి చివరి దాకా ప్రతీ భాగాన్నీ, ఇంతకు ముందు ఎలా చేశారు, వేరే కార్లలో ఎలా చేశారు అని కాకుండా, మన ఉద్దేశం ఏంటి, దాణికి తగినట్టు ఎలా చెయ్యాలి అని ఆలోచించామని, తత్ఫలితంగా, ఈ కారు అంతర్జాతీయ పనితనపు మరియు భద్రత ప్రమాణాలకి తూగ గలుగుతున్నదనీ చెప్పారు. యువ ఇంజనీరు మాట్లాడిన మాటలు నాకు చాలా నచ్చాయి. ముప్ఫయ్యేళ్ళయినా నిండని చిన్న వయసులో, వందేళ్ళుగా నెలకొని, పాతుకుని, వేళ్ళూనుకుని ఉన్న అంతర్జాతీయ కార్ల తయారీ అనే మహావృక్షం నీడలో, ఇప్పటివరకూ ఎవరూ ఊహించని (లక్షరూపాయల్లో కారు) లక్ష్యమ్మీద రాజీ లేకుండా పని చెయ్యడం .. తద్వారా కేవలం కారు రూపకల్పనలోనే కాక తదంతర్గత ప్రక్రియలన్నీ కొత్తతీరుగా ఆలోచించి పెంపొందింప చెయ్యడం నిజంగా ఒక ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయం. అంతిమంగా ఈ కారు విపణిలో విజయం సాధిస్తుందా అనే ప్రశ్న పలువురి మనసుల్లో మెదుల్తూనే ఉన్నా, అసలీ లక్ష్యాన్ని ఊహించి దీన్ని సాధించి తీరాలి అని నిర్దేశించిన అధ్యక్షుడు శ్రీ రతన్ టాటా, ఆయన విసిరిన సవాలుని అందుకుని ఐదేళ్ళు శ్రమించి సాధించిన టాటా బృందమూ అభినందనీయులు. చాణూర మల్లుడిలాంటి అంతర్జాతీయ కార్ల వ్యవస్థని సవాలు చేస్తున్న చిన్నికృష్ణుడీ నానో. జయహో నానో!

ఇక కారెలా ఉందా? మీరే చూడండి.


ఇవ్వాళ్ళ పొద్దున హిందూ పత్రికలో వార్త.

Monday, January 11, 2010

రచయితా కథకుడూ చర్చకి నా తరపు పొడిగింత - తుపాకీ కథ

మాలతి గారు రచయితా కథకుడూ అంటూ మంచి చర్చ లేవనెత్తారు. ఈ మొదటి చర్చ ఇక్కడ.

కథల కమామిషు చర్చించే క్రమంలో నాకథలు ఉపయోగపడతాయని అనిపిస్తే దయచేసి ఉపయోగించుకోండి అని నేను అన్నందుకు, నేను 1999లో రాసిన తుపాకి కథలో ఈ రచయితా కథకుడూ అనే అంశాన్ని చర్చించారు. ఈ రెండో చర్చ ఇక్కడ చదవొచ్చు.

ఈ చర్చలో కథకుడు అని మనం చెప్పుకుంటున్న మనిషిని ఆంగ్లంలో Narrator అంటారు. అంటే కథ చెప్పేందుకు రచయిత ఉపయోగిస్తున్న ఒక గొంతు. ఒక సర్వజ్ఞానియైన అశరీరవాణి చెప్పినట్టుగా ఉంటాయి చాలా మట్టుకు కథలూ నవల్లూ. దీన్ని Omniscient third person narrator అంటారు. తెలుగు సినిమా ఉదాహరణ కావాలంటే జల్సా సినిమాని మహేష్ బాబు గొంతు చెప్పినట్టు. అశరీరవాణి అని ఎందుకన్నానంటే కథలో ఈ కథకుడు అనే పాత్రగానీ మనిషిగానీ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ఈ సర్వజ్ఞాని కథకుడికి ఏ పాత్ర మనసులో ఏమున్నదో సంపూర్ణంగా తెలుసు. ఒక్కొక్క పాత్ర ఒక సన్నివేశంలో ఎటువంటి మనోభావాలకి లోనవుతోందో తెలుసు ఈ కథకుడికి. కానీ తెలిసిందంతా పూర్తిగా పాఠకుడికి చెప్పెయ్యడు. కథకి అవసరమైన మట్టుకే, కొద్ది కొద్దిగా చెబుతాడు.

ఇలాక్కాకుండా రచయిత కథ చెప్పేందుకు పనిగట్టుకుని ఒక కథకుడి పాత్రని కల్పిస్తాడు. సూతుడు శౌనకాది మునులకి రకరకాల పురాణాలు చెప్పడం, షహరజాద్ రాణి దున్యజాద్ అనే తన చెల్లెలి వంక పెట్టుకుని తన భర్తయైన షహర్యార్ రాజుకి వెయ్యిన్నొక్కరాత్రులు కథలు చెప్పడం, విష్ణుశర్మ అనే గురువుగారు మూఢులైన నలుగురు రాజపుత్రులకీ పంచతంత్రం చెప్పడంలో ఉన్న కథకులు ఇట్లాంటి కథకులు. ఈ కథకులు సర్వజ్ఞులు అవ్వొచ్చు, కాకపోవచ్చు. ఈ పద్ధతి ఆధునిక తెలుగు సాహిత్యంలో తక్కువే, కానీ చలం మొదలుకొని కొకు, తిలక్, రావిశాస్త్రి, ఇటీవల యండమూరి (డబ్బు టు ది పవరాఫ్ డబ్బు) ఈ టెక్నిక్ ని చక్కగా ఉపయోగించి కొన్ని మంచి కథలూ నవల్లూ రాశారు. తెలుగు సినిమా ఉదాహరణ ఏదీ నాకు గబుక్కుని గుర్తుకి రావడంలేదు. ఆంగ్లంలో అమెరికను రచయిత Henry James ఈ పద్ధతిని బహు సమర్ధవంతంగా ఉపయోగించడమే గాక దీనిలో ఎన్నో ప్రయోగాలు చేసి ఈ పద్ధతిని ఒక కళారూపంగా తీర్చి దిద్దాడని అంటారు.

ఈ రెండు పద్ధతులకీ పూర్తిగా భిన్నమైనది ఉత్తమ పురుష కథనం (First Person Narrator)- కథకుడు "నేను" అంటూ కథ చెప్పడం. అంటే కథకుడు కూడా కథలో ఒక పాత్ర అన్నమాట. ఇందులో మళ్ళీ రెండు రకాలు - ఈ నేను అనే కథకుడు ముఖ్య పాత్ర అయితే అదోరకం. ఇటీవలి తెలుగు సినిమాల్లో మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో ఈ టెక్నిక్ ఉపయోగించారు. యద్దనపూడి నవల్లు మీనా, ఈ దేశం మాకేమిచ్చింది రెండిట్లోనూ కథానాయికే కథ చెబుతుంది. Arthur Conan Doyle రాసిన Sherlock Holmes కథల్ని హోంస్ స్నేహితుడైన డా. వాట్సన్ (Dr. Watson) గొంతులో చెప్పిస్తాడు. వాట్సన్ కథానయకుడు కాకపోయినా, కథలో కీలకమైన పాత్ర పోషితాడు కాబట్టి ముఖ్యపాత్ర అనే చెప్పుకోవాలి. అదీ కాక అతనికి హోంస్ అంటే విపరీతమైన అభిమానమూ, గౌరవమూ.
రెండో రకంలో నేను అనే కథకుడు కథలో ఒక ప్రేక్షకుడిగా మాత్రం ఉంటాడు. మహా అయితే ఏదన్నా ఒక చిన్న పాత్ర పోషిస్తాడు. మధురాంతకం రాజారాంగారి అనేక కథలు ఈ పద్ధతిలో ఉంటాయి. సింహాద్రి సినిమాలో బ్రహ్మానందం పాత్ర (తలుపులు) కేరళలో జరిగిన కథని ఇలా చెప్పుకొస్తాడు.

ఈ ఉత్తమ పురుషకథనంలో తమాషా ఏంటంటే కథ చెప్పేది కథలోనే ఉన్న ఒక వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి తాను చూసేవీ వినేవీ తప్ప ఇతర పాత్రల మనోభావాలు తెలిసిపోయే అవకాశం లేదు. ఈ పద్ధతిని జాగ్రత్తగా ఉపయోగిస్తే, రచయిత "నేను" అనే కథకుడి పాత్ర మనోభావాల్ని జాగ్రత్తగా పాఠకుల మనసుల మీదికి ప్రొజెక్ట్ చెయ్యడం ద్వారా అద్భుతమైన సైకలాజికల్ ఎఫెక్ట్ సాధించొచ్చు. ఈ ఎఫెక్ట్ నే పైన మాలతి గారి బ్లాగులో జరిగిన చర్చలో కత్తి మహేష్ గారు "ఆ రచన పాఠకుడికి మరింత చేరువవుతుంది." అన్నారు. అఫ్కోర్సు, ఒక్కోసారు కొందరు చెయ్యితిరిగిన రచయితలు కూడా, ఉత్తమపురుషలో రాస్తున్న విషయం మరిచిపోయి అవతల పాత్రల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించడం, మనసులో గుబులు పుట్టించడం లాంటి పనులు చేస్తుంటారు. ఈ ఉత్తమ పురుష కథనం కొంతవరకూ రచయితకి సహాయమే చేస్తుంది. ఎందుకంటే, కథలో అన్ని పాత్రల మనోభావాలన్నిటిని గురించి రచయిత బాధ పడనక్కర్లేదు. ఈ నేను అనే ఒక్క మనిషి మనసులో ఏమి జరుగుతోందో పట్టించుకుంటే చాలు.

ఇప్పటిదాకా చెప్పింది ఉపోద్ఘాతం.

తుపాకి కథలో నేను ఉపయోగించినది సర్వజ్ఞాని అశరీరవాణి కథకుడు (స.అ.క).

కథలో ముఖ్య పాత్రలు రెండు - శంకర్, కిరణ్. తల్లి రాజ్యలక్ష్మి, మిత్రులు మేట్, బ్రయన్, జిమ్మీలు సహాయ పాత్రలు. కథ ఎక్కువగా కిరణ్ శంకర్ల చుట్టూ జరుగుతుంది. అంటే, వాళ్ళ మనసుల్లో ఏమి జరుగుతోందో అనే దాన్ని గురించి ఎక్కువగా పట్టించుకుంటాడు ఈ స.అ.క. అదే చెబుతుంటాడు పాఠకులకి. ఉదాహరణకి మొదటి దృశ్యంలో శంకర్, కిరణ్, రాజ్యలక్ష్మి ముగ్గురూ ఉన్నా, కథకుడి ప్రభావం వల్ల పాఠకుడి దృష్టి కిరణ్ శంకర్ల మీదనే ఎక్కువగా ఉంటుంది. రాజ్యలక్ష్మి మనసులో ఏముందో అనేది పెద్దగా గణనకి రాదు. ఆ తరవాత కొంతసేపు మాత్రం బాలుడైన కిరణ్ మనోభావాలు వాడి మాటల్లోనే స్వగతంలాగా, ఒక చైతన్య స్రవంతి ధారలో వెలువడుతాయి. ఆ భాగం కూడా కథ చెబుతున్న స.అ.క. పాఠకుల్ని కిరణ్ మనసులోకి ఓ రెణ్ణిమిషాలసేపు తొంగి చూడనిచ్చాడు అంతే. బస్సులో కిరణ్ మేట్‌ని మొదటి సారి కలిసినప్పుడు మేట్ మనసులో ఏముందో కథకుడు ఎక్కడా చెప్పడు. పాఠకుడి దృష్టి ఎంతసేపూ కిరణ్ మనసుమీదనే ఉంటుంది. అలాగే చివర్లో ఎమర్జెన్సీ రూంలో కథకుడు పూర్తిగా శంకర్ మనోభావాల మీద దృష్టి పెడతాడు.

స.అ.క. కి కథలో ఉన్న అన్ని పాత్రల మనోభావాలూ తెలిసినా కథకి అవసరమైన మేరకు, పాథకుల దృష్టిని ఇలా ఒకటి రెండు పాత్రల మీద మాత్రమే ఫోకస్ చెయ్యడం ద్వారా ముందుగా ఒక స్పష్టతనీ, ఒక కథా క్రమాన్నీ సాధిస్తాడు. కథకుడితో ఆ పని చేయించేది రచయిత. సినిమా పోలిక చెప్పుకోవాలంటే - రచయిత సినిమా దర్శకుడైతే, కథకుడు కేమెరా లెన్సు.

మాలతిగారి విశ్లేషణలో రచయితని స్వయంగా కథలోకి చొప్పించే ప్రయత్నం చేశారల్లే వుంది. నేను పురుషుణ్ణీ, ఒకస్థాయి వయసు వాణ్ణి కావడంతో నన్ను శంకర్ పాత్రలో ఊహించుకున్నట్టున్నారు. నేను అమెరికాలో చిన్నపిల్లవాడిగా పెరగలేదు కాబట్టి కిరణ్‌ని అయ్యే అవకాశం లేదు. స్త్రీని కాదు కాబట్టి రాజ్యలక్ష్మినయ్యే అవకాశం లేదు. మళ్ళీ మాలతిగారే చెప్పినట్టు నేను వృత్తి రీత్యా డాక్టర్నీ కాదు, నాకు పదేళ్ళ వయసున్న కొడుకూ లేడు. వాస్తవానికి ఈ కథలో రూపించిన సన్నివేశాలేవీ నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరిగిన అనుభవాలు కావు. కానీ ఈ కథలోని రెండు ముఖ్యపాత్రల్లోనూ నేనున్నాను. దీన్నే మాలతిగారు "రచయిత కథకుడిద్వారా తనని బాధిస్తున్న ప్రశ్నలు కూడా చెప్తున్నాడేమో" అన్న అబ్సర్వేషనుతో చక్కగా పట్టుకున్నారు.

అమెరికాలో భారతీయ కుటుంబాలు పిల్లల్ని పెంచడం అనే విషయం చాలా కాలంగా నా మనసులో సుళ్ళు తిరుగుతూనే ఉంది. ఆ అంతర్మథనానికి ఒక రూపం ఈ కథ. ఈ మథనం ఇంకా సాగుతూనే ఉంది. ఈ కథని నేను ఫిబ్రవరి మార్చి ప్రాంతాల్లో రాశాను 1999లో. రాసి, వంగూరి ఫౌండేషను వారి ఉగాది కథల పోటీకి పంపించాను. పంపిన కొద్ది రోజులకి కొలరాడో రాష్ట్రంలో కొలంబైన్ హైస్కూలు మారణహోమం జరిగి ఈ దేశం మొత్తాన్నీ అచేతనం చేసేసింది కొన్నాళ్ల పాటు. ఆ మారణహోమానికి కారణం నా కథలో చెప్పినలాంటి జాతి విద్వేషం కాదు. నా కథకి మొదటి బహుమతి వచ్చింది. కానీ ఈ కథని తలుచుకున్నప్పుడల్లా నాకు ఆ బహుమతి గుర్తు రాదు. కొలంబైనే గుర్తొస్తుంది. బాధే మిగుల్తుంది.

Thursday, January 7, 2010

హీబ్రూ నించి స్ఫూర్తి పొందుదాం

Let's take a listen.

మనమూ తెలుక్కి ఒక వీరతాళ్ళ సంఘం ఏర్పరిస్తే ఎలాగుంటుంది?

ఆచార్య వేమూరి గారి వీరతాళ్ళ కార్యక్రమం ఆగకుండా కొనసాగుతుంటే బాగుండేది. హీబ్రూ సంఘానికి రోజుకి ముప్ఫైకి పైన విచారణలొస్తాయిట, ఫలాని చోట ఏ మాట వాడాలి, ఈ పదానికి అర్ధమేవిటీ, ఇలాగని!

'nuff said.

Tuesday, January 5, 2010

For Michigan Residents - Free basic Healthcare at Bharatiya Temple, Troy

Basic Health Care SEVA Program

This program provides basic health care to unemployed and uninsured MI-Residents.

Brief Description of BASIC Health Care SEVA Program:
The current economic crisis has resulted in massive lay-offs in the region, and some of our community members are in distress, having lost their jobs and, consequently, health care coverage for their families. SEVA Committee of the Bharatiya Temple, Troy, with support of Michigan physicians and medical labs has worked out a health care program to provide short-term health care assistance for those families. This program waves the physician visit fee for eligible patients. Lab tests will be provided at cost basis.

A SEVA Project of The Bharatiya Temple, Troy, MI
Email: seva.hotline@gmail.com
www.bharatiya-temple.org

Contact SEVA Hotline:
248-341-3727

Sunday, January 3, 2010

కబుర్లు - జనవరి 4

సరిగ్గా క్రిస్మసు రోజున వాడెవడో నవరంధ్రాల్లోనూ ఏవేవో దోపుకుని మా డిట్రాయిటొచ్చే విమానం ఎక్కేశాట్త. మొత్తానికి పెద్ద ప్రమాదమైతే తప్పింది గానీ, ఇహ ఏంస్టెర్డాములోనూ యెమెన్‌లోనూ రాజుకుంటోంది రావణ కాష్టం. చల్లటి కాలం కదాని కాస్త మాతృదేశ సందర్శనానికి వెళ్ళొచ్చే అమెరికా ప్రవాసులందరికీ అక్కడ తెలంగాణా దిగ్బంధం, ఇలాగ దారిలో రక్షణ వలయ దుర్బంధం.

రెండు మంచి సాహిత్య చర్చలు ఊపందుకున్నాయి బ్లాగుల్లో ఈ మధ్య. మీరూ గొంతు కలపండి ఆసక్తి ఉంటే. కల్పన గారి బ్లాగులో స్వర్గీయ కవి అజంతా గురించి కవి విమర్శకుడు అఫ్సర్ గారి వ్యాసం మొదలుకొని కవిత్వం ఏవిటనే మూలాల్ని గురించి మంచి చర్చ జరుగుతోంది.

కథలకి సంబంధించిన కొన్ని మౌలిక విషయాల్ని చక్కగా అరటి పండు వలిచి పెట్టినట్టు విశదపరిచే బ్లాగు మాలతి గారి తెలుగు తూలికలో రచయితా - కథకుడూ .. ఒకరేనా, వేర్వేరా అని చర్చ జరుగుతోంది.

హైదరాబాదు పుస్తక ప్రదర్శన ముగిసిందో లేదో, విజయవాడ పుస్తకాల పండుగ మొదలైంది. జనవరి 1 నించీ 11 దాకా జరుగుతోంది. అనేక సాయంత్రాలు చక్కటి సాహిత్య సభలు జరుగుతున్నాయి. వివరాలిక్కడ. అప్పుడే పోయిన వారాంతం ఈ-తెలుగువారు సంరంభం జరిపించారు.

అన్నట్టు ఇప్పుడే యువమిత్రుడు వాసు చెప్పాడు, శ్రీపాద వారి కథలు కొత్త సంపుటాలుగా విశాలంధ్రలో దొరుకుతున్నాయిట. హైదరాబాదు ఎల్. బి. నగర్ కి చెందిన ప్రగతి పబ్లిషర్స్ వారు ప్రచురించారు. వీళ్ళు ఇదివరకే పుల్లంపేట జరీచీర అనే పెద్ద సంపుటి ఒకటీ, నిలువు చెంబు అనే చిన్న సంపుటి ఒకటీ ప్రచురించి ఉన్నారు. ఇప్పుడు వడ్లగింజలు, కలుపుమొక్కలు, మార్గదర్శి అనే పేర్లతో మూడు సంపుటాల్ని తీసుకొచ్చారు. విశాలాంధ్ర వారు ఇదివరలో ప్రచురించిన మూడు కథా సంపుటాలు కొన్నేళ్ళుగా అందుబాటులో లేని విషయం విదితమే. కథా సాహిత్యాన్ని ఇష్టపడే మిత్రులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తాను. తెలుగువారైన ప్రతివారు చదివి తీరవలసినవి శ్రీపాదవారి కథలు. మునుపు నేను ఆ మహానుభావుని ఒకానొక కథని తలుచుకున్న వైనం ఇక్కడ. మార్గదర్శి కథ శ్రవ్యకం నా గొంతులో ఇక్కడ వినొచ్చు.

ఇద్దరు సాహిత్య ప్రముఖులు బ్లాగులు ప్రారంభించారు ఇటీవల. ఆంధ్ర జ్యోతి ప్రధాన సంపాదకులు కె. శ్రీనివాస్ గారి బ్లాగుని ఇక్కడ చూడచ్చు.

మృదుభాషి, సున్నితంగా స్పందించే కవి వంశీకృష్ణ గారి విదేహ ఇక్కడ.

మీరూ ఓ లుక్కెయ్యండి.

Invi New Size