Wednesday, October 21, 2009

అమెరికా అంటే నాకిష్టం - స్వశక్తి

నేను చూసినంతలో, ఈ దేశంలో నా వృత్తి సంబంధమైన జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ నాకు పరిచయమైన అమెరికన్లందరూ బాగా కష్టపడి పనిచేసే స్వభావం కలిగినవారు, స్వశక్తి మీద ఆధారపడి పైకి రావాలనే తపన కలిగినవారు.

ఈ నిర్ధారణలో వేరే దాగిఉన్న ఉద్దేశ్యాలేమీ లేవు. అమెరికన్లు కానివారు కష్టపడి పనిచెయ్యరని కాదు. దేశప్రజలందరూ కష్టపడి పనిచేసేస్తారనీ కాదు. ఇలాంటి నిర్ధారణని సర్వత్రా అన్వయించడం సాధ్యమయ్యే పని కాదు. నిర్ధారణకి వ్యతిరేకమైన ఉదాహరణలు కోకొల్లలుగా ఉంటాయి, సందేహం లేదు. నా అనుభవం పరిధి చాలా చిన్నది అని ఒప్పుకుంటూనే నాకెదురైనవీ, పబ్లిగ్గా వార్తల్లో తెలియ వచ్చినవీ కొన్ని ఉదాహరణలిస్తాను.

ముందుగా పబ్లిక్ వార్తల నించి.
హాలీవుడ్ నటుడు నికొలాస్ కేజ్ (Nicholas Cage) 1996 లో లీవింగ్ లాస్ వేగస్ అనే సినిమాకి ఆస్కార్ గెల్చుకున్నాడు, తదుపరి అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తారగా ఎదిగాడని చాలామందికి తెలిసిన విషయం. గొప్పదర్శకునిగా పేరుపొందిన ఫ్రేన్సిస్ ఫోర్డ్ కోపొలా (Francis Ford Coppola) సోదరుని కొడుకు అనే సత్యం చాలామందికి తెలియదు. కోపొలా కుటుంబ సభ్యులు చాలామంది అప్పటికే సినీరంగంలో పేరుమోసినవారున్నారు. కుటుంబం పేరువల్లనో, లేక చుట్టాల ప్రాపకంవల్లనో కాక తన స్వశక్తితోనే పైకి రావాలని పద్ధెనిమిదేళ్ళ వయసులోనే తన ఇంటిపేరు మార్చుకుని సినీరంగంలో ప్రవేశించాడు. ఎన్నో లోబడ్జెట్ చిత్రాల్లో చిన్నా చితకా పాత్రలు వేశాడు. ఇతను పెద్దతార కాకమునుపు నటించిన చిత్రాల్లో Guarding Tess (1994), Amos & Andrew (1993) మెచ్చదగినవి. ఇటీవల ఒక్క సినిమాకి ఇరవై మిలియన్ డాలర్లు పారితోషికం అందుకున్న నికొలాస్ తనకి ఆస్కార్ తెచ్చిపెట్టిన Leaving Las Vegas కి తీసుకున్న పారితోషికం అందులో వందోవంతు కూడా ఉండదు.

అమెరికాలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన వారెన్ బఫెట్ (Warren Buffett) గారి కొడుకులు హోవర్డ్ మరియు పీటర్ బఫెట్. హోవర్డ్ తనంత తానుగా వాణిజ్య రంగంలో ఎదిగి, అనేక బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించి ప్రస్తుతం వారి సొంత పొలాన్ని నిర్వహిస్తున్నారు. రెండో కొడుకు పీటర్ మొదటినించీ తనకిష్టమైన వ్యాపకమైన సంగీతంలో కృషిచేసి అనేక విజయాలు సాధించారు. Dances with the wolves అనే చిత్రానికి నేపథ్యసంగీతం అందించి ఆస్కార్ గెల్చుకున్నారు.

గొప్ప రాజకీయ నాయకుల సంతతి కూడా చాలామంది తమతమ రంగాల్లో స్వశక్తితోనే విజయాలు సాధించిన దృష్టాంతాలు చాలా ఉన్నాయి.

నా వ్యక్తిగత పరిచయాల్లో ఇటీవల తారసపడిన ఒక యువకుడి కథనం నన్ను చాలా అబ్బురపరిచింది. ఈ మధ్య కొత్తకారు కొనాలని కారుడీలర్లచుట్టూ తిరుగుతున్నా. ఒక డీలరు దగ్గర జేసన్ అనే సేల్స్‌మేన్ ఆ రోజు నాకు కార్లు చూపిస్తున్నాడు. సుమారు ఇరవయ్యెనిమిదేళ్ళుంటాయి. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, నా వృత్తిరీత్యా కార్లకంపెనీలతో నాకున్న అనుబంధాన్ని గురించి చెబుతున్నా అతనితో. మా నాన్న కూడా జెనెరల్ మోటార్స్‌కి పని చేసేవారు - కొన్నేళ్ళ కిందట రిటైరయ్యారు అన్నాడు జేసన్. అలాగా, ఏ ప్లాంట్‌లో పనిచేసేవారు అన్నా. అబ్బే ప్లాంట్‌లో కాదు అన్నాడు. ఓహో, ఏదో ఇంజనీరో మేనేజరో అయుంటారు అని, ఏ డిపార్టుమెంట్లో అనడిగా. అతను చిన్నగా నవ్వి, ఏ డిపార్టుమెంటని చెప్పను? ఆయన కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్‌గా రిటైరయ్యారు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదే సన్నివేశాన్ని భారద్దేశంలో ప్రతిబింబిస్తే, ఒక టాటా కంపెనీకో, రిలయన్స్‌కో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసినాయన కొడుకుని ఒక కార్ డీలర్షిప్‌లో సేల్స్‌మేన్‌గా ఊహించగలమా?

ఈ విషయాలన్నీ నా అమెరికన్ సహోద్యోగితో చర్చిస్తుంటే అతనొక మాటన్నాడు. అమెరికాలో ఎస్టేట్ శిస్తులు (అంటే వంశపారంపర్యమైన ఆస్తి తరువాతి తరాలకి బదలీ అయేప్పుడు కట్టాల్సిన శిస్తు) చాలా ఎక్కువ వుంటాయి-ట. అందువల్ల, తండ్రి తాతలు ఎంతెంత ఆస్తులు సంపాయించినా, తరువాతి తరాల చేతులో మిగిలేది చాలా తక్కువే. అదీకాక, చాలా మంది గొప్ప ధనవంతులు తాము సంపాయించిన ఆస్తిలో సింహభాగాన్ని ఏదన్నా ఫౌండేషనుగానో ట్రస్టుగానో ఏర్పరిచి ప్రజోపయోగ కార్య్క్రమలకి ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. ఇవన్నీ కాక, అమెరికను మనస్తత్వంలో అల్లుకుపోయి ఉన్న స్వేఛ్ఛాప్రియత్వం కూడా ఒక కారణం కావచ్చు.

ఏదేమైనా, ఇలా స్వశక్తితో కష్టపడి పైకిరావడమనే ఆదర్శం వల్ల, అమెరికను సమాజంలో కొత్తతరాలు ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా, సృజనాత్మకంగా ముందడుగు వేస్తూ వస్తున్నాయని నాకనిపించింది.

Tuesday, October 20, 2009

Invitation to Carnatic Music concert in metro-Detroit

We invite you to enjoy an afternoon of Carnatic Instrumental Music.

We are very happy to present very talented local musicians in concert.

Veena solo by

Sri Sasidhar Lakshminarayana


Accompanied on mrudangam by

Sri JeyasinghamFollowed by

Violin duet by

Smt. Pavani and Sri Srikanth Mallajosyula


Accompanied on mrudangam by

Sri Rajasekhar AthmakuriVenue: Troy Community Center Room 304
3179 Livernois Rd
Troy, MI 48083-5029
(248) 524-3484

Date and Time: October 25, 2009 (Sunday); 3 - 6 PM

Monday, October 12, 2009

కబుర్లు - అక్టోబరు 12

డా. కె. బాలగోపాల్ గారి అకాల ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి కలిగించింది. వారితో నేరుగా పరిచయం లేకపోయినా, ఆయన సన్నిహితులు చాలా మందితో అనేక ప్రాజెక్టుల్లో పనిచెయ్యడం వల్ల ఆయన వ్యక్తిత్వం నాకు పరిచయమైనట్టే ఉంది. అదీ కాక, ఆయన రచనలు అనేక పత్రికల్లో చదువుతుండడం, ఒక విషయాన్ని నిశితంగా విశ్లేషీంచే ఆయన బుద్ధి పటిమ, తాను కనుగొన్న విషయాన్ని, ఎంత క్లిష్టమైనదైనా, విప్పి చెప్పగలిగే చక్కటి వాగ్ధార ఆయన రచనా లక్షణాలు. యాదృఛ్ఛికంగా మొన్న వయ్యెస్సార్ మృతి తరవాత, ఆయన చరిత్ర గురించి వెతుకుతుంటే, 2004 ఎన్నికల తరవాత వయ్యెస్సార్ రాజకీయ జీవితాన్నీ సీమ రాజకీయ నేపథ్యాన్నీ సమీక్షిస్తూ బాలగోపాల్ గారు రాసిన ఈ వ్యాసం నా కంట పడింది. బాలగోపాల్ వంటి వ్యక్తులు కనుమరుగైనప్పుడు, విధిని నిందించడం, కుటుంబానికి సానుభూతి తెలుపుకోడం, ఆత్మ శాంతికి ప్రార్ధించడం ఇవన్నీ అర్ధంలేని పన్లుగా కనిపిస్తాయి నాకు. మనం చెయ్యాల్సిందల్లా .. ఆ కనుమరుగైన మనిషి ఎటువంటి విలువల్ని నమ్మి ఆచరించారో ఆ విలువల్ని అప్పుడప్పుడూ అయినా గుర్తు చేసుకుంటూ, చాతనైతే మనం కూడా ఆ విలువల్ని మన జీవితాల్లో ఆచరిస్తూ ముందడుగు వెయ్యడమే.


కాబూల్లో భారతీయ దౌత్య కార్యాలయం వద్ద బాంబు పేలింది. ఇంకా తాజాగా రావల్పిండిలో ఏకంగా పాకిస్తాను సైన్య ముఖ్య కార్యాలయం మీదనే భీకరమైన దాడి చేశారు తాలిబాన్ దుండగులు. మన కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా నాకైతే ఎక్కడా కనబళ్ళేదు. పక్క వీధిలో ఇళ్ళు నిప్పంటుకున్నాయని తెలిసినప్పుడైనా మన చూరు మీదా నీళ్ళు చల్లుకోకుండా కూర్చుంటే ... ఇదిలా ఉండగా 40,000 సైన్యం అదనంగా కావాలని అడిగారుట ఆఫ్ఘనిస్తానులో నేటో సైన్యాధ్యక్షుడు. సాధారణ ప్రజలు ఎలా ఉంటున్నారో, ఏమి అల్లాడి పోతున్నారో .. ఇంతలో చలికాలం రానున్నది. ఎనిమిదేళ్ళయింది అమెరికా తొలి దాడులు జరిపి ..

తుంగభద్ర, కృష్ణ వరదల నేపథ్యంలో, జీమెయిలు చాట్లో ఎవరన్నా ఇండియా స్నేహితులు కనబడి చాట్లో చెబితే తెలిసిన వివరాలు తప్ప, ఆన్లైన్ పత్రికల్లో కానీ, పదే పదే ఎప్పటికప్పుడు యూట్యూబులో అప్లోడ్ అవుతూ ఉండిన టీవీ వార్తా ఛానెళ్ళ ప్రసారాలు కానీ ఒక్క పనికొచ్చే వార్త చెప్పలేదు. ఈ సందర్భంగా బ్లాగుల్లో టీవీ ఛానెళ్ళ తాండవాన్ని మన వాళ్ళు బాగానే విమర్శించారు. అదలా ఉండగా, వార్తా పత్రిక గానీ, వార్తా ఛానెల్ గానీ, ఒక పద్ధతి ప్రకారం కవరేజ్ ఇవ్వనక్కర్లేదా? ఉదాహరణకి, ఈనాడో, ఆంధ్ర జ్యోతో తెరిస్తే, కనీసం ఒక అరగంట వెతుక్కోవాలి, కృష్ణ వెంబడి పలాని వూర్లో పరిస్థితి ఎలాగుందో అని తెలుసుకోవడానికి. కృష్ణ ప్రవహించే మార్గం తెలిసినదే. దాన్ని ఒక మేప్ గా ఇచ్చి, దాన్నించి వివిధ ప్రాంతాల వివరాల్ని ఇవ్వచ్చు. ఇంకా చాలా రకాలుగా సమర్ధవంతంగా ఇవ్వచ్చు. ఈ సందర్భంగా వార్తా మాధ్యమాల పూర్తి ఫెయిలయ్యాయని భావిస్తున్నాన్నేను. సరే, వరద తగ్గు మొగం పట్టిందని చదివి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని పోనీ మన మేధావులేమని విశ్లేషిస్తున్నారో అని ఆంధ్రజ్యోతి సంపాదకీయం తీస్తే, ప్రధాన సంపాదకుడు కే. శ్రీనివాస్ గారు, ఏంటో తలా తోకా లేకుండా .. ఋగ్వేదం నించి కొటేషన్లు చెబుతూ .. ఆయన తెలివినంతా కుమ్మరించింది చదివేప్పటికి నాకు తిక్క నసాళం అంటుకుంది.

ఉట్టుడియంగా ఒబామాకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఈ నార్వీజియన్లకి చదవేస్తే ఉన్నమతి పోతున్నట్టుంది :) నేను ఒబామా అభిమానినే గానీ, ఇది మాత్రం టుమ్మచ్ అనిపించింది. ఆయన సున్నితంగా తిరస్కరించే బావుణ్ణని కూడా అనుకున్నాను. కానీ హబ్బే మారీ బాగుండదేమో అని సిగ్గు పడుతూనే స్వీకరించేశాడు. బుష్షుగారు మిగతాప్రపంచం మీదంతా కత్తులు దూస్తూ వీరతాండవం చెయ్యనారంభించిన రోజునుంచీ, ఈ నార్వీజియన్లకి ఎట్లాగైనా అమెరికన్ల దిమ్మతిరిగేలా ఒక్క చెంపపెట్టు పెట్టాలని వాళ్ళకి చేతులు తిమ్మిరి తిమ్మిర్గా ఉన్నాయనీ, ఒబామాకి శాంతి నోబెలు నిచ్చేసి ఆ తిమ్మిరి తీర్చేసుకున్నారనీ నాకో గాట్ఠి అనుమానం. అసలే మనిషి అందర్నీ కలుపుకు పోవాలీ, ఎక్కడా మాట తొణక్కూడదూ అన్నట్టు ఆచి తూచి అడుగేస్తుంటాడు .. ఇహ ఇంత గౌరవం చేసేశాక, ఇంక మరీ జాగ్రత్త పరుడైపోతాడేమో అని నా భయం. ఎందుకంటే, రాజకీయం, జాతీయంగానైనా, అంతర్జాతీయంగానైనా ఏదన్నా ముఖ్యమైన విజయం సాధించాలంటే కొంచెం తెగింపు ఉండాలి. ఇతగాడు సాధించాల్సిన ఘనకార్యాలెన్నో ఉన్నాయి. ఈ బహుమతి ఏదో ఆయనకి గర్వంతో కళ్ళు నెత్తిమీదికి తెస్తుందనే భయం లేదు కాని, ఈయన జాగ్రత్త విపరీతం ఐపోతుందని మాత్రం నాకు భయంగా ఉంది. టైం పత్రిక విలేకరి జో లైన్ తనబ్లాగులో నా భావాల్ని సరిగ్గా పట్టుకున్నాడు.

Monday, October 5, 2009

షికాగో శివార్లలో మహారుద్రం - మరువలేని అనుభవం

షికాగోనగర శివార్లలో విల్లోబ్రుక్ అనేచోట మహారుద్రాభిషేకం, హోమం నిర్వహించారు కంచి కామకోటి సేవా ఫౌండేషనువారు. స్థానిక చిన్మయామిషన్ వారి భవనంలో ఏర్పాటు చేశారు. మా వూర్నించి ఇంకో ఆరుగురితో కలిసి ఒక వేన్‌లో శుక్రవారం సాయంత్రం బయల్దేరి వెళ్ళాము. అంతకు ముందురోజునే అక్కడికి చేరుకున్న మరో ఆరుగురు మావూరివాళ్ళూ కలిశారు. చిన్మయామిషన్ కి దగ్గర్లోనే ఒకహోటల్లో బస.

శివరాత్రికీ, ఇంకా ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లోనూ ఏకాదశ రుద్రాభిషేకం చెయ్యడం ఆనవాయితీ. అంటే రుద్రాన్ని (దీన్నే రుద్రప్రశ్నం, శతరుద్రీయం, నమకం అని వ్యవహరిస్తారు) పదకొండుసార్లు పఠించడం. ఆ చదివేది ఒక్కరు కాక, నూట ఇరవయ్యొక్క మంది చదివితే, దాన్ని మహారుద్రం అంటారు. ఈ వారాంతంలో నేను పాల్గొన్న ఈ మహారుద్రంలో పదహారుమంది పురోహితులు కాక నాలాగా చదవడానికి మొత్తం నూటముప్ఫైనాలుగు మంది వచ్చారు దేశం నలుమూలల్నించీ. టొరాంటో నించికూడా కొందరు వచ్చారుట.

శనివారం పొద్దుట ఐదున్నరకల్లా పూజాస్థలానికి చేరుకున్నాం. ఆరింటికి, చెప్పినట్టుగా కార్యక్రమం మొదలీంది. అసలు కాండకి ముందు జరగాల్సిన తయారీ వ్యవహారమంతా జరిగేందుకు రెండుగంటలు పట్టింది. ఎనిమిదింటికి మహాన్యాసం మొదలైంది. అదంతా ఒకగంట. మహాన్యాసం జరుగుతుండగానే నాకు వొళ్ళు గగుర్పొడిచింది. నూటయాభై కంఠాలు ఒక్క స్వరంతో ఒక్క గొంతులో సస్వరవేదమంత్రోఛ్ఛారణ చెయ్యడం .. ఒక నయాగరా జలపాతపు హోరు .. అదొక మహాప్రభంజనం .. కానీ తుపానులో ఉండే కల్లోలం మాత్రం లేదు .. ఉచ్ఛస్వరంలో పైకి లేస్తూ, మంద్రంతో కిందికి దిగుతూ .. అదొక ఆనంద డోలిక. అక్కడ ఆ నూట యాభై గొంతుల్లోంచి ఒక్క స్వరూపంగా ప్రత్యక్షమై మమ్మల్నందర్నీ ఆవరించిన ఆ శబ్దబ్రహ్మాన్ని అంతకంటే వర్ణించలేను.

ఇక అక్కణ్ణించి పదకొండు ఆవృత్తాలు సస్వర నమక పారాయణం. ప్రతీ ఆవృత్తం తరవాతా చమకంనించి ఒక అనువాకం. మధ్యలో పురోహితుల్లో ఒకరు, న్యూజెర్సీ నించి వచ్చిన నటరాజశ్రౌతిగారు, సామవేదరుద్రాన్ని గానం చేశారు. ఆవృత్తాలు పదకొండూ ముగిసి, ఇతరసూక్తాల పారాయణ జరుగుతుండగా అలంకారం, పిమ్మట అర్చన. మహానైవేద్యం పెట్టి హారతిచ్చేప్పటికి మధ్యాన్నం మూడు కొట్టింది.

నాకు ఉదయం పదింటినించే నడుంనెప్పి మొదలైంది బాసింపట్టులో కూర్చోవడం అలవాటు లేక. అక్కడ చాలామంది నాలాగే నలభయ్యో పడిలో ఉన్నవాళ్ళే. కొందరు స్థిమితంగా కదలకుండా కూర్చోగలిగారు కానీ, చాలామంది నాలాగా ఇబ్బంది పడుతున్నవాళ్ళే. ఇంక మరీ భరించ శక్యం కానప్పుడు, లేచి, ఒక ఐదు నిమిషాలు పక్కకి వొచ్చి నించోవడం, మళ్ళీ యథాస్థానంలో కూర్చోవడం .. గొంతులు మాత్రం పారాయణ ఆపింది లేదు. ఒక్కరంటే ఒక్కరైనా ఆ సభాస్థలిని వదిలి కదిల్తే వొట్టు. అక్కడ జరుగుతున్నది ఏదో మన వొంటి నెప్పులకీ, మన దైనందిన వ్యవహారాలకీ, సమస్యలకీ అతీతమైనది, గొప్ప శక్తివంతమైన మహాద్భుతం ఏదో అక్కడ జరుగుతోందన్న స్పృహ ప్రతి ఒక్కరిలోనూ వెలుగుతూ ఉంది.

సాయంత్రం ఆరింటికి రుద్రక్రమార్చన. నాకు అన్ని వివరాలూ తెలియవు కానీ క్రమ, ఘన, జట .. అనేవి వేద పనస వల్లించడానికి రకరకాల పద్ధతులున్నాయి, ఒకదానికంటే క్లిష్టమైనది మరోటి. వేదపండితుల్ని ఘనాపాఠీ అనీ, జటాంతస్వాధ్యాయి అనీ వ్యవహరించడం వింటూ ఉంటాం. ఒక మోతాదువడితో నమక పారాయణ ఒక ఆవృత్తం చదవడానికి సుమారు ఇరవై నిమిషాలు పడుతుంది. అదే క్రమపద్ధతిలో పారాయణకి గంటంబావు పట్టింది. నాకు చేతకాలేదుగానీ, అనుభవం ఉన్నవాళ్ళు చాలామంది పురోహితులతో గొంతు కలిపారు ఈ పారాయణలో కూడాను. తదుపరి షోడశోపచార పూజ. నాలుగు వేదాలనించీ ఒక్కొక్క పనస పారాయణ చేశారు ఒక్కొక్క పురోహితులు. ఒకరు నమకంనించి ఒక మంత్రాన్నీ, మరొకరు చమకంనించి ఒక మంత్రాన్నీ ఘనం వల్లించారు. ఒకాయన ద్రావిడవేద గానం చేశారు శ్రావ్యంగా. శివుడు నాట్యవేదానికి ఆద్యుడూ, నటరాజూ కదా .. నాట్యం అవధారయ అంటూ ఒక పది పన్నెండేళ్ళ బాలిక శివస్తుతి కీర్తనకి చక్కటి భరతనాట్యం చేసింది.

ఆదివారంనాడు హోమం. ఇది భవనంలో చెయ్యడానికి వీలులేక బయట లాన్లో టెంట్లు వేసి అక్కడ నిర్వహించారు. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేశారు. నలుచతురస్రంగా పెద్ద హోమగుండం. దాని చుట్టూతా పదహారు మంది పురోహితులు. ఒక పక్కగా ఒక టెంటులో మేము నూటముప్ఫై నాలుగు మందిమీనీ. ఎక్కడ చలి తగులుతుందోనని టెంటుకి అటుచివరా ఇటుచివరా వేడి పంకాలు అమర్చారు. ఎందుకంటే, మేవంతా కట్టుకున్నది నూలు పంచెలు. పైన చొక్కా ఉండడానికి వీల్లేదు. మొదట వచ్చి కూర్చున్నప్పుడు, కింద ఎన్ని పట్టాలు పరిచినా, మంచుగడ్డ మీద కూర్చున్నట్టుంది. కానీ ఆ రుద్రం వేడికి వానమబ్బులు కూడా ఆవిరైపోయి ఎనిమిదింటికల్లా సూర్యుడొచ్చి వెచ్చ చేశాడు. మొదటి ఆవృత్తం మాత్రం మామూలు వడితో చదివాము, రెండు నించీ పది దాకా వాయువేగ మనోవేగాలతో సాగింది పారాయణం. నాలిక అంత వేగంగా కదలగలదని నేనెప్పుడూ ఊహించనైనా లేదు. అంతటి వడిలోనూ ఎక్కడా స్వరం తప్పలేదు. ఆఖరి ఆవృత్తాన్ని మళ్ళీ మామూలుగతిలో చదివాక, చమక పారాయణతో వసర్ధార హోమం చేసి పూర్ణాహుతి ఇచ్చారు.

మా పారాయణ నించి మీకోసం రెండు శబ్దపు తునకలు.
Get this widget
Track details
eSnips Social DNA


Get this widget
Track details
eSnips Social DNA


తరవాత ఆచార్యులందరికీ సన్మానాలు, నిర్వహణలో తోడ్పడిన స్వచ్ఛంద సేవకులనీ, విశిష్టసేవలందించిన ప్రముఖుల్నీ, ఆఖరికీ నాలాగా గొంతెత్తి పారాయణ చేసిన ఋత్విక్కులందర్నీ కూడా శాలువాలు కప్పి సత్కరించారు. షడ్రసోపేతమైన భోజనం పెట్టి వీడ్కోలు చెప్పారు.

ఈ యాత్రలో నిరంతర నమక చమక పారాయణ వల్ల కలిగిన ఆధ్యాత్మికానందం ఒకయెత్తయితే, కార్యక్రమ నిర్వహణలో అక్కడివారు చూపిన శ్రద్ధ, సామర్ధ్యం చూసి కలిగిన విస్మయం ఇంకో యెత్తు. ఏర్పాట్లన్నీ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే, ఎక్కడా వేలెత్తి చూపించడానికైనా ఒక్కతప్పు కనబడలేదు. నిర్వాహకులందరూ, ఎక్కడే ఆత్రుత గానీ చిరాకుగానీ లేకుండా, ఎవరి పని వారు చేసుకుంటూ, నావంటి పొరుగూరి అతిథులపట్ల ఎంతో ఆదరం కనబరిచారు. ఇక భోజనాల ఏర్పాట్లు చెప్పనే అక్కర్లేదు. వారింట పెళ్ళి భోజనం అన్నట్టు కొసరి కొసరి వడ్డించారు.

ఈ కార్యక్రమాన్ని గురించి మరికొంత సమాచారం.

బాసింపట్టు వేసుక్కూర్చోవడం అలవాటు లేక నడుం మహా నీలిగింది కానీ .. ఆ మాత్రం కష్టపడకుండా పరమాద్భుతమైన అనుభవాలు రమ్మంటే ఎలా వస్తాయి?

Sunday, October 4, 2009

పరమాద్భుతమైన ఒక వారాంతం

అసలు ఇట్లాంటి అనుభవం ఉంటుందా అని ఊహించని ఒక గొప్ప అనుభవాన్ని మూటగట్టుకుని ఇప్పుడే ఇల్లు చేరాను. అనుభవం మాగొప్పగానే ఉంది గానీ, బాసింపట్టుమీద కూచునీ కూచునీ నడుం నెప్పి. అదీ కాక పొద్దునెప్పుడో నాలుగింటికి లేచాను. ఇప్పుడు గంట పదకొండున్నరైంది.

అందుకని, వైవరాలు రేపు ...