Friday, July 31, 2009

నన్ను నమ్ము!

అశోకవనంలో దుఃఖంలో మునిగిపోయున్న సీతని గమనించాడు హనుమంతుడు.

రావణుడు ఆమె ముందుకి వచ్చి ఎడాపెడా పేలడాన్నీ చూశాడు చెట్టుమీద సూక్ష్మరూపంలో దాక్కుని. రాక్షస స్త్రీలు నయానా భయానా సీత మనసు మార్చ ప్రయత్నించడమూ గమనించాడు. రావణుడు నిష్క్రమించాక, రాక్షస స్త్రీలు నిద్రకి పడ్డాక .. ఆలోచించాడు. నేనిప్పుడు ఏ రూపంతో ఎదుటబడినా సీత నన్ను రామదూతగా నమ్మదు అని గ్రహించాడు. ఎలా ఆమెని నమ్మించడం. ఆమెకి అత్యంత ప్రీతి పాత్రమైన రామకథని గానం చెయ్యడం ఆరంభించాడు.

కథాగానం పూర్తయినాక ఆమె ముందు తన నిజ రూపంతోనే నిలబడ్డాడు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. తన రామభక్తిని చెప్పుకున్నాడు. ఇంత చెప్పినా అతను అనుమానించినట్టే సీత నమ్మలేదు. చివరికి తల్లీ నన్ను నమ్మవమ్మా అని ఆక్రోశించాడు. అప్పటికి గానీ అతనికి రామ ముద్రిక సంగతి గుర్తు రాలేదు.

సీత హనుమంతుని గుర్తించిన తరవాత .. అదింకో సంగతి.

రాముడు నీయందు ఎంతో ఆర్తితో ఉన్నాడన్నాడు. రాముడి వెనక అఖండమైన వానర సైన్యం ఉందన్నాడు. నేనీవార్త వెనక్కి తీసుకు వెళ్ళగానే రాముడు ఆ సైన్యంతో లంక మీద దండెత్తుతాడన్నాడు. రావణుణ్ణి వధించి తీరుతాడు, నిన్ను చెర విడిపిస్తాడన్నాడు.

సీత సహజంగానే ఈ మాటలూ నమ్మలేదు.
ఈ సారి ఆమెని నమ్మించేందుకు అతని దగ్గర ముద్రిక ఏదీ లేదు.

చేసి చూపించాడు. తన నమ్మకం నిలుపుకున్నాడు.

మాటలు చెప్పడం తేలికే. చేసి చూపించడం కష్టం. కానీ నమ్మకం నిలుపుకునేందుకు అంతకు మించిన మార్గం మరోటి లేదు.

Thursday, July 30, 2009

బంగారు లక్ష్మి లలిత లలితంగా ..


పల్లవి|| హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి, హీనమానవాశ్రయం త్యజామి
అనుపల్లవి|| చిరతర సంపత్ప్రదాం, క్షీరాంబుధి తనయాం
హరి వక్ష స్థలాలయాం, హరిణీం చరణ కిసలయాం
కరకమల ధృత కువలయాం, మరకత మణిమయ వలయాం

చరణం||శ్వేతద్వీప వాసినీం, శ్రీకమలాంబికాం పరాం
భూత భవ్య విలాసినీం భూసుర పూజితాం వరాం
మాతరం+అబ్జమాలినీం, మాణిక్యాభరణ ధరాం, సం -
గీత వాద్య వినోదినీం, గిరిజాం, తాం, ఇందిరాం

శీతకిరణ నిభవదనాం, శ్రిత చింతామణి సదనాం
పీత వసనాం, గురుగుహ మాతుల కాంతాం లలితాం ||హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి||

లలిత రాగం, రూపక తాళం

లలిత - స రి గమ ద ని స - స ని ద మ గ రి స
15 వ మేళకర్త మాయామాళవగౌళ జన్యం

సుధా రఘునాథన్ గారి గాత్రం కనబడింది గానీ ఇది నాకస్సలు నచ్చలేదు.

డీకే పట్టమ్మాళ్ గారి తమ్ముడు డీకే జయరామన్ గారి గాత్రం నాకు నచ్చినది.

ఆంగ్లంలో కృతి వివరణ
దారిద్ర్య మోచనం, నామస్తోత్ర మంబాపరం శతం
ఏనశ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః
పఠంస్తు చింతయే ద్దేవీం సర్వాభరణ భూషితాం!

అందరికీ వరలక్ష్మీవ్రత పుణ్యదిన శుభాకాంక్షలు.

Tuesday, July 28, 2009

నాలుక్కాలాల పాటు దాచుకోదగిన తానా సావనీరు

జూలై నెల మొదట్లో షికాగోలో జరిగిన 17 వ తానా సభల జ్ఞాపిక, తెలుగు పలుకు, ఇప్పుడే నా చేతికందింది.

ముఖచిత్రం అద్భుతంగా ఉంది.
వెనక అట్టమీద, సమకాలీన తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశకు లనదగిన శ్రీశ్రీ, నార్ల, కొకు, గోపీచందుల ముఖాల్ని అమెరికా మౌంట్ రష్మోరుకి మల్లే నీటివర్ణచిత్రంగా ఆవిష్కరించడం బ్రిలియంటైడియా. చిత్రకారుడు చంద్రకి అభినందనలు.

పధ్నాలగు సంవత్సరాల క్రితం షికాగో తానా సభల సావనీరుకి ఏమీ తగ్గకుండా తీసుకు వచ్చారు ఈ పుస్తకాన్ని. ఇంచుమించుగా అప్పటి బృందమే ఈ ఏడు శ్రమించినది కూడా. అనేక అంశాల్లో నాలుగు మెట్లు పైకే ఎక్కారని కూడా చెప్పొచ్చు. కమిటీ సభ్యులకీ, ఇతరత్రా శ్రమించిన వారందరికీ అభినందనలు.

పధ్నాలుగేళ్ళ క్రితం లాగానే, గొప్ప తెలుగు చిత్రకారులు వేసినవాటిల్ని, కళ్ళు మిరుమిట్లుగొలిపే వర్ణచిత్రాల్ని, ముద్రించడం ప్రత్యేక ఆకర్షణ ఈ సావనీర్లో కూడా. దీనికి ఒక కారణం ముఖ్య సంపాదకులు జంపాల గారి చిత్రకళాభిరుచి అయితే, ఆ కారణానికి దన్నుగా నిలిచి ప్రాణం పోసినది ఆచార్యులు, స్వయంగా చిత్రకారులు పద్మశ్రీ ఎస్వీ రామారావుగారి దీక్ష అని చెప్పుకోక తప్పదు. ఆయా చిత్రాల్ని ఒకే పరిమాణానికి తీసుకొచ్చి, రంగులు గల్లంతు కాకుండా, ఫ్రేము కట్టించుకోదగిన క్వాలిటీతో ముద్రించి ఇచ్చిన ముద్రాపకులు కూడా సామాన్యులు కాదు. ఏదేమైనా, వాళ్ళ శ్రమ, మనకి కనుల విందు. రచనల సంగతి ఇంకా తరచి చూళ్ళెదు గానీ, ఈ చిత్రాలు మాత్రం ఈ సావనీరుని అతివిలువైనదాన్ని చేశాయి.

సావనీరు ఆమూలాగ్ర సమీక్ష విన్నవీకన్నవీలో త్వరలోనే.

Monday, July 27, 2009

కబుర్లు జూలై 27

అధికారపు పగ్గాలు చేపట్టిన ఆర్నెల్లకి ఒబామా మొత్తానికి పప్పులో కాలేశాడు, అదీ జాతివివక్షత విషయంలో.

హార్వర్డు వివిలో ఆఫ్రికనమెరికను అధ్యయన విభాగంలో ఘనతవహించిన ఆచార్యుడు హెన్రీ గేట్స్ గారిని గురువారం రాత్రి ఒక తెల్ల పోలీసు అరెస్టు చేశాడు. ఆ అరెస్టు కూడా గేట్స్ గారి స్వగృహంలో జరగడం గమనించాల్సిన విషయం. ఇదంతా కేవలం తాత్కాలిక ఉద్రేకం వల్ల జరిగిందనీ, పరిస్థితుల ప్రభావంలో జరిగిన అపార్ధం తప్ప వేరు కాదని చెప్పి గేట్స్ గారిని మరునాడే విడుదల చేసేశారనుకోండి, కానీ ఇంతలోనే తగలాల్సిన దెబ్బ తగల్నే తగిలింది. గేట్స్ గారు సాక్షాత్తూ అధ్యక్షులు ఒబామాకి ఆప్త మిత్రుడు మరి.

అసలక్కడ ఏం జరిగింది, పక్కింటోళ్ళు పోలీసుల్ని పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఒబామా అసలేమన్నాడు, ఆ అన్న మాటలు నిజ్జంగా పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేలా ఉన్నయ్యా, ఆ అరెస్టు చేసిన తెల్ల పోలీసు ఎలాంటివాడు, అతని వ్యక్తిత్వం ఎలాంటిదీ .. ఇవన్నీ కూడా గమనించాల్సిన విషయాలే, చర్చించాల్సిన ప్రశ్నలే.

ఐతే ఒక్క విషయం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది .. ఒక దేశాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి కొంచెం కూడా మాట తూలేందుకు అవకాశం లేదు. ఏం మాట్లాడినా, ఆ మాటలు మనుషుల్నీ, పరిస్థితుల్నీ అధిగమించేసి, ఇంతింతై అన్నట్టు విశ్వరూపం ధరించి కూర్చుంటై. అసలు విషయాల్ని మరుగున పడేస్తై.

రెండో విషయం .. ఈ నాటి అమెరికాలో కూడా ఒక నల్ల జాతి మగవాడు, ఎంత చదువుకున్న వాడైనా, ఎంత డబ్బూ ఖ్యాతీ గడించిన వాడైనా, పోలీసు దృష్టిలో అతి సులభంగా దోషిగా గుర్తించబడతున్నాడు. ఒబామా ఇప్పుడెంత యెత్తుకి యెదిగినా, ఒకప్పుడు తనూ యువకుడే. ఇటువంటి వివక్షతకీ పోలీసు జులుంకీ ఆలవాలమైన షికాగో పేటల్లో తిరిగినవాడే. పని చేసినవాడే. ఈ సంఘటన అతని జ్ఞాపకాల్లో ఏ తెరల్ని కదిలించిందో. తన హార్వర్డు మిత్రుడి పక్షాన స్పందించినందుకు అమెరికా అధ్యక్షుణ్ణి తప్పు పట్టలేం, అందుకే.

ముచ్చటగా మూడో విషయం .. గేట్స్ గారి స్థానంలో ఒక తెల్లాయన గనక ఉండి ఉంటే (మిగతా అన్ని పరిస్థితులూ అలాగే ఉండగా), పోలీసు ఏ జాతివాడైనా, ఈ సంఘటన ఇలాగే జరిగి ఉండేదా? జరిగి ఉండేదని కచ్చితంగా చెప్పలేం. వివక్షత సజీవంగా ఉందని రూఢి చేసుకునేందుకు ఆ సమాధానం చాలు. జాతి విషయంలో అమెరికా ఇంకా చాలా ముందుకు వెళ్ళాల్సి ఉంది.

ఇంకా వేసవికాలమే, ఆకురాలం రాలేదింకా. కానీ పండుటాకులు తొందరి పడి ఒకటొకటే రాలిపోతున్నై .. మొన్న పట్టమ్మాళ్, నిన్న గంగూబాయ్ హంగల్, ఇవ్వాళ్ళ వాల్టర్ క్రాంకైట్. రెండు దశాబ్దాల పాటు .. క్రాంకైట్ ముఖతహ వినబడితే చాలు, అది నమ్మదగిన వార్తే .. అన్నంతగా అమెరికా ప్రజలు నమ్మిన వార్తాహరుడు. అంతటి నమ్మకాన్ని సాధించడం నిజంగా గొప్ప ప్రతిభే. ఇవ్వాళ్టి రోజుల్లో ఏ వార్తా మాధ్యమాన్ని అంతలా నమ్మగలుగుతున్నాం?

గతవారం ఉమామహేశ్వర్రావుగారి భాషణని గురించి నా పాఠకుల్ని ఊరించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రెండు చిరునైవేద్యాలు.


Sunday, July 26, 2009

నేను చాలా రిస్క్ తీసుకుంటాను

ఇటీవలనే కంట పడిందీ పద్యం.
అనేక కారణాల వల్ల ఇది నాకు చాలా నచ్చింది.
చదివి మీకేమనిపిస్తోందో చెప్పండి.
చాతనైతే ఎవరు రాసి ఉంటారో ఊహించొచ్చు.
****
రిస్క్ తీసుకుంటాను.

మొదటి పెగ్గు
మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను
సాయంత్రం రొట్టెలోకి తైలం లేక నేను రోడ్డెక్కిన సమయానికి తను నిండుసీసాతో ఇల్లు చేరుకుంటాడు
జరగబోయేదేవిటో నా జ్ఞానదంతం సలపరించి చెబుతుంది
సోడాకోసం లోపలికొచ్చి అనవసరంగా నవ్విపోతాడు
గోడ మీద తెగకావిలించుకుని దిగిన హనీమూన్ ఫోటో వింత చూస్తూ వుంటుంది
సత్యనారాయణవ్రతం మాదిరి సరంజామా సిద్ధం చేసుకుని ఎంతో తన్మయంతో సీసా మూత తిప్పుతాడు
బుసబుసబుసా మైకం గ్లాసులోకి దూకుతుంది
శూన్యంలోకి ఛీర్స్ కొట్టి ఒక గుక్క తాగుతాడు
అఫ్కోర్స్! ఎంత తొందరలో ఉన్నా గానీ ఛీర్స్ మర్చిపోడు
పిల్లల కళ్ళకి గంతలు కట్టడం ఎలాగా అని నేను దారులు వెదుకుతూ వుంటాను
ఈ చెవి మాట ఆ చెవికి వినబడదు
ఎందుకంటే రెంటికీ మధ్య జానీవాకర్ ఉంది
అన్నట్టు నీ కొత్త చెప్పులు ఇంకా కరుస్తున్నాయా? వాడి ప్రశ్న
కరిచినా తప్పదు కదా, వాటితోనే కాపురం చేస్తున్నా! నా జవాబు.

రెండో పెగ్గు
మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను
మూతి ముందుకు చాపి రెండో పెగ్గు అందుకుంటాడు
హోంవర్కు మానేసి స్కేళ్ళతో బాదుకుని ఏడుస్తున్న పిల్లల తిక్క కుదరడం కోసం టీవీలో హారర్ సినిమా పెడతాను
కళ్ళు తేలేసి ముగ్గురూ అక్కడే పడివుంటారు.
ఇంట్లో ఈ సంత నాకొద్దు - గరిట విసిరి కొడతాను
నీ యిల్లు కాదిది, నా యిల్లు - ధడాల్న తలుపు మూస్తాడు
నీ యమ్మ నీ యక్క నీ యబ్బ మృదు సంభాషణ జరుగుతుంది
ఈ బూతు మాట ఆ బూతు మాటకి ఆనదు
ఎందుకంటే ఇద్దరి నాల్కల మీదా ఒకే ఉప్పు తిన్న రోషం వుంది
ఏ తప్పూ లేకూండా మా ఇద్దరి అమ్మ అక్క అయ్యలు వాళ్ళ వూళ్ళల్లో శీలం పోగొట్టుకుని నిలబడతారు
తెగకావిలించుకుని దిగిన హనీమూన్ ఫోటో భయంతో గోడని కరుచుకుంటుంది

మూడో పెగ్గు
ఇల్లంతా నిద్రకు జోగుతూ వుంటుంది
వున్నాడో పోయాడో చూడ్డం కోసం లోపలికి వెడతాను
పొట్ట చీల్చిన మిర్చీ బజ్జీ మాదిరి ప్రాణనాథుడు పొర్లుతూ వుంటాడు
తిండికి రమ్మని భుజం తట్టి చెబుతాను
చెప్పుల్ని మొగుడితో పోలుస్తావా ఎంత పొగరు - అంటూ చెయ్యి విసురుతాడు
అదే చేతిని వెనక్కి విరిచి గోడకేసి కొడతాను
ఈ దెబ్బ మాట ఆ దెబ్బకి చాలదు
ఇద్దరి మీదా ఒకే బ్రాండు సిగరెట్టు పొగ గొడుగు పట్టి వుంటుంది

నాలుగో పెగ్గు
కళ్ళు నిద్రపోతున్నా నేను మెలకువగానే వుంటాను
చెప్పుల్ని మొగుడితో కరిపిస్తావా ఎంత పొగరు
సీసాభూతం మొరుగుతూ వుంటుంది
మొరిగి మొరిగి మూలాలు తెగి పడేట్టు వాంతి చేస్తాడు
తెమడ తెమడగా అతని వ్యక్తిత్వం ఉట్టిపడుతుంది
పైజమా తడిసి ప్రభుత్వం మడుగు కడుతుంది

మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను
సిద్ధంగా వున్న నీళ్ళ బక్కెట్టు నెత్తిన దిమ్మరించగానే ఇటు సర్కారూ అటు జానీవాకరూ ఒకర్నొకరు తోసుకుంటూ తూములోకి పరిగెడతాయి
ఈ తూములో మాట ఆ తూముకి వినిపించదు
రెండింటి మీదా ఒకే మంత్రి వాగ్దానం అట్టకట్టి వుంటుంది
తెగకావిలించుకుని దిగిన హనీమూన్ జంట తటాల్న విడిపోయి ఇంకెవరితోనో లేచిపోతారు

మొగుడు సీసాలో ఉన్నప్పుడు నేను చాలా రిస్క్ తీసుకుంటాను
***

Thursday, July 23, 2009

మీ సొంత కూడలి/జల్లెడ

తెలుగు బ్లాగులకి ఒక ఉమ్మడి వేదికనిచ్చి కూడలి, జల్లెడ ఏగ్రిగేటర్లు బ్లాగర్లకి గొప్ప మేలు చేశాయి, సందేహం లేదు. కొన్నాళ్ళు ఈ బ్లాగులోకంలో మసలిన తరవాత, ప్రతివారికీ త్వరలోనే తెలిసిపోతుంది, కూడలిలో కనబడిన ప్రతీ టపా మనం చదవం. కొన్ని కొన్ని బ్లాగులకోసం, వాటిల్లో కొత్త టపా ఏదైనా వచ్చిందేమోనని కళ్ళు గాలిస్తుంటాయి. అదీకాక, బ్లాగుల సంఖ్య పెరిగే కొద్దీ కొత్తగా విడుదలైన టపాలన్నీ చదవడం దాదాపు అసాధ్యమవుతుంది. ఎంపిక తప్పనిసరి.


జల్లెడలో ఇలా మనకిష్టమైన బ్లాగుల్ని ఎంచి అవి మాత్రమే చూపించుకునే సదుపాయం ఉన్నట్టుంది, నేనెప్పుడూ ఉపయోగించలేదు. గూగుల్ రీడర్ అని ఒక పరికరం ఈ మధ్యనే నా దృష్టికి వచ్చింది. ప్రవీణ్ బ్లాగుద్వారా దీన్ని గురించి తెలిసి చాలా రోజులే అయినా, కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం పట్ల ఉండే బద్ధకం వల్ల దాన్ని ఇంతవరకూ ఉపేక్షించాను. గత కొద్ది నెలలుగా కూడలిలో అయినా జల్లెడలో అయినా నేను సాధారణంగా చూసే బ్లాగుల టపాల్ని వెతుక్కోవడం కష్టమైపోతూ వచ్చింది. సుమారు నెల్రోజుల కిందట ఒక మిత్రుడు ఈ గూగుల్ రీడర్ పరికరాన్ని ఉపయోగిస్తుంటే చూశాను. అబ్బ, ప్రాణానికి హాయిగా ఉందిగా అనుకున్నా. వాడ్డం చాలా సులభమని ధైర్యం చెప్పాడు ఆ మిత్రుడు.

మీరూ వాడి చూడండి.

Tuesday, July 21, 2009

రెండు పుస్తకాలు


ఇది సమీక్ష కానీ విమర్శ కానీ కాదు, కేవలం పరిచయం మాత్రమే.

పురాణ ప్రలాపం .. వ్యంగ్యవినోద ప్రసంగం:
పుస్తకం వెనక అట్ట నించి .. ఆధునిక మైథిలీ సాహిత్యంలో హాస్యావతారంగా వ్యంగ్య సమ్రాట్ గా ప్రసిద్ధికెక్కిన హరిమోహన్ ఝా విలక్షణా రచన ఇది. ఇందులో ఆయన సృష్టించిన అపూర్వమైన పాత్ర వికటకవి చిన్నాన్న, కావ్యశాస్త్ర వినోదానికి అపూర్వభంగిమలు ప్రసాదిస్తాడు. అన్ని వేద శాస్త్రాలూ ఆయన జిహ్వాగ్రాన ఉంటాయి. ఆయన శాస్త్రాలను బంతుల్లా ఎగరేసి ఆడుకుంటాడు. విశుద్ధ వినోద భావంతో మనోవినోద ప్రసాదం పంచి పెడతాడు. అందువల్ల అందరికీ ప్రేమపాత్రుడు. అంతేకాక ఆయన మన గుప్తజ్ఞాన సంపదను సాక్షాత్కరింపచేసే కన్ను కూడా!

నామాట: ఝాగారు మైథిలీ భాషలో రాసిన పుస్తకాన్ని ఆచార్య జె. లక్ష్మిరెడ్డి గారు చక్కటి తెలుగులోకి సరసమైన అనువాదం చేశారు. భాష హాయిగా సాగుతుంది, ఎక్కడా నట్లు పోకుండా. మూలంలోని వ్యంగ్యాన్ని, విరుపుల్ని వొడుపుగా పట్టుకున్నారు లక్ష్మిరెడ్డిగారు. ఇందులో వికటకవి చిన్నాన్న నిజంగానే రామాయాణాది కావ్యాలనుండీ, అనేక పురాణాలనుండీ, కొన్ని చోట్ల సాక్షాత్తూ వేద సంహితల నుండీ ఉదాహరణలు ధారగా కురిపిస్తూ తనదైన శైలిలో విశ్లేషిస్తూ, ఆధునిక జీవితానికి అన్వయిస్తూ అనర్గళంగా మనోహరంగా ఉపన్యసిస్తుంటాడు. ఒక గుప్పెడు సెన్సాఫ్ హ్యూమరు కూడా ఉంటే మంచిది. మచ్చుకి ఒక చురక - వికటకవిచిన్నాన్న శ్రీరామచంద్రుణ్ణి ఎడాపెడా దులిపేసి వాయించేశాక, నోరెళ్ళబెట్టిన కుర్రాడు అడుగుతాడు, అదేంటి చిన్నాన్నా, రాముడంతటివాణ్ణి ఇలా దులిపేశావే అని. చిన్నాన్నా అంటాడు చిద్విలాసం చిందిస్తూ .. రాముడి అత్తవారింటి పండితుణ్ణి, అల్లుడుగార్ని ఆమాత్రం హాస్యం చేసే అధికారం నాకుంది!
అదీ చమత్కారమంటే.
భారతీయ సనాతన సాహిత్యాన్ని గురించి ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకం ఒక గొప్ప వరం. ఐతే, ఈ పుస్తకం చదివి జీర్ణించుకోవాలంటే గుండె ధైర్యం మెండుగా ఉండాలి. పిరికివారికీ ఉఫ్ఫంటే ఉలిక్కిపడేవారికీ కాదు ఈ పుస్తకం.

వివరాలు:
వేమన ఫౌండేషన్
హైదరబాదు - 040-2763 8527
260 పేజీలు, వంద రూపాయలు.


నవతరం తెలుగు కథ (1998 - 2008)
ఆధూనిక తెలుగు సాహిత్యానికి ఆటపట్టులైన కవిత, కథ, నవలలని పుస్తకాలుగా ప్రచురించడం అసాధ్యమై కూచున్న ప్రస్తుత వాతావరణంలో .. ఈ సమస్యని వొంటరిగా ఎదుర్కోనక్కర్లేదు, సమిష్టిగా సాధించుకుందాం అని కొందరు నవతరం కథా రచయితలు నడుంకట్టారు. వారధి సహకార రచయితల వేదికగా ఏర్పడ్డారు. వారి కృషికి తొలిఫలం, నవతరం తెలుగు కథ అనే సంకలనం, ఇటీవలనే వెలువడింది.

ఇరవై నాలుగు కథలున్నాయిందులో. గోపిని కరుణాకర్, స.వెం. రమేశ్ వంటి అనుభవజ్ఞుల రచనల సరసనే ఇప్పుడిప్పుడే తమ గొంతుల్ని వినిపిస్తున్న కె. ఎన్. మల్లీశ్వరి, కె. సుభాషిణి, ప్రశాంత్ వంటి వారి కథలూ ఉన్నాయి. ప్రతి కథ చివరా రచయిత ఫోన్నెంబరో, ఈమెయిలు ఎడ్రసో ఇచ్చారు .. ఇదొక అదనపు ఆకర్షణ. నవతరం రచయితలు పాఠకుల్ని వినడానికి సన్నద్ధులైనా రనుకోవచ్చు.

నామాట: నేనింకా పూర్తిగా చదవలేదు. అక్కడక్కడా రెండు మూడు కథలే చదివాను. బాగున్నై. పుస్తకం చక్కటి రూపంతో ముచ్చటైన అక్షరాలతో ముద్రితమైంది. కథల కోసమే ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చు. మన కొనుగోలుతో రచయితల సహకార వేదికని బలపరుస్తున్నామనే ఆనందం అదనపు తృప్తినివ్వాలి మరి!

287 పేజీలు, 60 రూపాయలు.
అన్ని ప్రముఖ సాహిత్య పుస్తకాల షాపుల్లోనూ దొరకవచ్చు.

Monday, July 20, 2009

కబుర్లు జూలై 20

మూడున్నర గంటల సేపు తెలుగు సాహిత్య ప్రవాహంలో ఓలలాడి, గుండె బరువెక్కేలా మునకలేసి, మళ్ళీ అంతలోనే తేలికపడే చతురోక్తుల హాస్యంతో పైకి తేలి, కథసాహితివారి కథ 2008 సంకలనాన్ని తరచి చూసి, బోలెడు మధురానుభూతులు మూటగట్టుకుని ఇప్పుడే ఇల్లు చేరుకున్నాను.

ఆరెం ఉమామహేశ్వర్రావు ముఖతః తన కథల నేపథ్యాన్ని వినే అదృష్టం ఇంతవరకూ ఎవరూ పొందలేదేమో. ఇప్పటిదాకా రాసినవి ఎనిమిది కథలే అయినా, అందులో వొంటేపమాను, నోరుగల్ల ఆడది లాంటి కథల్ని సులభంగా మరిచిపోలేం. నిజజీవితంలోంచి పుట్టిన కథ, సజీవమైన వ్యక్తుల్లోనుంచి మలచిన పాత్రలే కథకి ఇటువంటి మరిచిపోలేని గుణాన్ని కలిగిస్తాయని మరోసారి గ్రహింపుకొచ్చింది ఆరెం చెప్పిన తన కథల కబుర్లు వింటే.

కథాసాహితి సంపాదక ద్వయం పాపినేని శివశంకర్, వాసిరెడ్డి నవీన్ కథ 2008 గురించి మా సభ చదువరులు చేసిన విశ్లేషణని సహృదయంతో విన్నారు. తమ సమాధానంలో, కథల ఎంపికలో ఎప్పుడూ రాజీ పడలేదనీ, ఎన్నో వొత్తిళ్ళూ వ్యక్తి విమర్శలూ ఎదురైనా తాము పెట్టుకున్న లక్ష్యం స్పష్టంగానే ఉన్నదనీ చెప్పారు. ఎప్పటికప్పుడు ఈ వార్షిక సంకలనాన్ని ప్రామాణికంగా మలిచేందుకే తమ కృషి జరుగుతొందన్నారు.

గతవారంలో సుప్రసిద్ధ ఏనార్బరు కళాసంత (Art Fair) జరిగింది ఓ నాలుగు రోజుల పాటు. మొత్తానికి నిన్న చివర్రోజున వెళ్ళి చూడగలిగాం. రచయిత ఆరెం, మిత్రుడు శ్రీనివాస్ (తెలుగు సినిమా నిర్వాహకుడు)ల తోడు అదనపు ఆహ్లాదాన్ని కలిగించింది. అమెరికాలో ఒక నగర వీధుల్లో అంతటి జనసందోహాన్ని చూడ్డం నాకెప్పుడూ ఒక గొప్ప థ్రిల్లునిస్తుంటుంది. ఆర్ధికమాంద్యం ఉంటే ఉంది గానీ, ఇదివరకన్నా ఆర్భాటంగానే సంత జరిగింది. ఆహ్లాదం, ఉత్తేజం కలిగించే మంచి కళాఖండాల్ని చూశాం.
కందిపప్పు పట్టుచీర

రాముడు శబరి ఎంగిలి తిన్న దృశ్యాన్ని హృద్యమైన పద్యమాలలో చిత్రించారు కొత్తబ్లాగరి సనత్ శ్రీపతి. చాలా పెద్ద విరామం తరువాత గొప్ప కామెడీతో గుండె డొల్ల సెంటిమెంటు కథతో మన ముందుకొచ్చారు లలితగారు. మీరూ ఒక లుక్కెయ్యండి.

Thursday, July 16, 2009

పట్టమ్మాళ్ గారికి వీడుకోలు

సంగీత కళానిధి డి.కే. పట్టమ్మాళ్ తొంభై నిండిన పండు వయసులో ఈ అవతారం చాలించి సరస్వతీ సాన్నిధ్యానికి చేరుకున్నారు.

సాంప్రదాయకమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, బ్రాహ్మణ బాలికలు వేదికనెక్కి కచ్చేరీ చెయ్యడం అనాచారంగా భావించే కాలంలోనే అనేక సామాజిక కట్టుబాట్లని ఎదురుకుని, గొప్ప గాయనీమణిగా పేరు తెచ్చుకున్నారు. తన తరంవారే అయిన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, ఎమ్మెల్ వసంతకుమారిలతో కలిపి కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్నత్రయంగా ప్రసిద్ధి చెందారు. తరువాతి తరంలో స్త్రీలు వేదికనెక్కేందుకు మార్గదర్శకులయ్యారు.

తమిళంలో ఎన్నో మరపురాని కృతులు రచించిన మహా వాగ్గేయకారుడు పాపనాశం శివన్ గారి ప్రత్యక్ష శిష్యురాలీమె. అందువల్ల తమ గురువుగారి కృతులు పాడ్డంలో ఆ కృతుల భావం ఇంకా గొప్ప సొగసుతో ప్రభవిస్తుండేది. ఆవిడ గొంతు విలక్షణమైనది. ఎమ్మెస్ సుబ్బలక్ష్మికి లాగా కోకిల కంఠం కాదు, వసంత కుమారికి లాగా కంచుగంట కాదు. కొద్దిగా బొంగురుగా, ఒక మాదిరి జీర కలిసిన కొమ్ముబూర ధ్వనిలా ఉండేది. అటువంటి గొంతునే తన స్వంత ముద్రగా మలచుకుని, అంత ప్రసిద్ధుడైన గురువు నీడలో పెరిగినా సంగీత వేదిక మీద తనదైన స్థానం సంపాదించుకున్నారు. సంప్రదాయం, శ్రుతి శుద్ధం, లయ మీద పట్టు .. వెరసి పట్టమ్మాళ్ (ఇది చిన్న శ్లేష. తెలుగులో పిల్లల్ని చిన్ని, బంగారం అని పిల్చుకున్నట్టు, తమిళంలో చెల్లం, పట్టు (silk)అంటారు. ఒక్కోసారి అదే నిజం పేరుకూడా అవుతుంది. పట్టు + అమ్మాళ్ = పట్టమ్మాళ్ అన్నమాట).

తనకంటే బాగా చిన్నవాడైన సోదరుడు డి.కే. జయరామన్ కి తానే గురువై తనంత వాడిని చేశారు. ఈ నాడు పట్టమ్మాళ్ గారి మనుమరాలు శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ బామ్మగారి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కర్ణాటక రంగంలో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

ఆవిడ ఇంకా కొన్నేళ్ళు బతికి ఉండాలని కోరుకోవడం బహుశా అత్యాశే అవుతుంది. అయినా, అకస్మాత్తుగా ఇక లేరు అనుకుంటే, చెవుల్లోనూ, మనసులోనూ వెలితే మరి!

పట్టమ్మాళ్ వికీ పేజి
హిందూ పత్రికలో వార్త
మ్యూజిక్ ఇండియా ఆన్లైన్లో దీక్షితర్ కృతి రంగనాయకం

సర్వసమర్ధులం!

మనం చాలా సమర్ధులం.

అబ్బో, మనలో బోలెడు సామర్ధ్యం ఉంది.

ఎంత సామర్ధ్యం ఉన్నదంటే, ఎంత ఉన్నదో మనకే తెలీక, వ్యక్తిత్వ వికాస పుస్తస్కాల రచయితలూ, కోర్సుల నిర్వాహకులూ, ఆఖరికీ సినీ రచయితలు కూడా ఈ విషయాన్ని మనకి పదేపదే ఎప్పటికప్పుడు బోధిస్తుంటారు. మనలో ఎంత సామర్ధ్యం ఉన్నదో ఎప్పటికీ మనం మర్చి పోకుండా, ఏ క్షణమూ మనం సమర్ధులమనే విషయం మనకి మరపు రాకుండా.

మా అమ్మా నాన్నల తరం సంగతి, కనీసం ఈ విషయంలో, నాకు అంత బాగా తెలీదు కానీ, నా తరంలో .. మనసు పెడితే సాధించలేనిదేదీ లేదు, మనకి అసాధ్యం ఏదీ కాదు, మనం సకల సమర్ధులం అన్న ఆత్మ విశ్వాసంతోనే పెరిగాం మేమంతా. అలాగే సగం జీవితాన్ని గడిపేశాం కూడా. ఎప్పుడన్నా యాభైల్లో అరవైల్లో రాసిన కథలూ నవల్లూ చదువుతున్నప్పుడు, ఆ నిరుద్యోగ సమస్యలూ, ఆ దిగువ మధ్య తరగతి దిగుళ్ళూ, ఆ బేలబేల ప్రేలాపనలూ, ఆ దీనాలాపాలూ చదివి అప్పుడప్పుడూ వొళ్ళు మండేది కూడాను. ఆ ఆ బేల దీన ఏడుపుగొట్టు హీరో వెధవాయిని పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి ఒక నాలుగు పుంజీల వ్యక్తిత్వ వికాసం వాడి నోట్లో కుక్కి, ఒక నాలుగౌన్సుల ఆత్మవిశ్వాసపు హార్మోను ఇంజెక్షనిచ్చి, సిక్స్ ట్రాక్ స్టీరియోఫోనిక్ సిస్టంలో కుడిచెవిలో ఎప్పుడూ ఒప్పుకోవొద్దురా వోటమీ అంటూనూ, ఎడమ చెవిలో సాహసం శ్వాసగా సాగిపో సోదరా అంటూనూ మారు మోగించేసెయ్యాలనిపించేది.

మరింత సామర్ధ్యం ఉంది గదా మనలో! అదొక మధుమదోన్మత్త కాల్పనిక జాగ్రదావస్థ!!
ఉన్నట్టుండి మెలకువొస్తుంది.

అప్పటిదాకా తనువులు వేరైనా మనసులు ఒకటే అనుకున్న స్నేహితుడు ఉన్నట్టుండి బద్ధశత్రువైపోతేనో, అప్పటిదాకా మనకి కొండంత అండగా నిలిచిన అమ్మ అనారోగ్యం పాలయ్యి మన కళ్ళముందే జీవఛ్ఛవంలా ప్రాణమున్న అస్తిపంజరంలా తయారవుతుంటేనో, అప్పటిదాకా ప్రాణప్రదంగా ప్రేమించిన భర్తో భార్యో ఇక నీతో జీవితం చాలు అని దాంపత్యానికి చరమగీతం పాడుతుంటేనో, మన జీవన దీపం అని అప్పటిదాకా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మన బిడ్డ తెలిసితెలిసీ తప్పు దారి పట్టి మనకి దూరమై పోతుంటేనో ...

అప్పుడు అనిపిస్తుంది, బహుశా మనం అంత సమర్ధులం కాదేమోనని!

ఒక్క క్షణం పాటు.

ఒక ఆత్మవిశ్వాసపు ఇంజక్షను మనకి మనమే చేసుకుని సాగిపోతాం, సాహసం శ్వాసగా.
సర్వ సమర్ధులం కదా మరి!

Saturday, July 11, 2009

ఆంధ్రజ్యోతి ఆదివారం ముఖపత్ర వ్యాసం ఆస్ట్రేలియా తెలుగు బ్లాగర్ల నించి

ఆస్ట్రేలియాలో కొంతకాలంగా భారతీయ విద్యార్ధుల మీద జరుగుతున్న మూక దాడుల గురించి ఇద్దరు తెలుగు బ్లాగర్లు రాసిన వ్యాసాలు ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి ముఖపత్ర కథనంగా వెలువడినాయి.

అదలాగుండగా, ఇవ్వాళ్ళ (ఆదివారం) పొద్దున్న సుమారు తొందిన్నరకి యింటెనక పెరట్లోకి వెళ్తే పైన పశ్చిమాకాశంలో బహుళ పంచమి జ్యోత్స్న వెలతెలబోతూ కనబడింది. నేను భయపళ్ళేదనుకోండి. కానీ "ఆకాశపుటెడారిలో కాళ్ళుతెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి" .. ఇదిమాత్రం నిజం!
ఇదే జాబిల్లి నిండు పున్నమి నాడు వెండి పళ్ళెంలా మెరుస్తూ ప్రేమికులకి విరహాగ్నిని పెంపు చేస్తుంటాడంటే .. ఇవ్వాళ్ళ ఈ క్షణాన నమ్మడం కష్టమే! కాలమెంత చిత్రమైనది, ఎంత గొప్ప మార్పుని తెస్తుంది?

తెలుగెలా నిలుస్తుంది?

బ్లాగర్లు కొందరు తెలుగు భాష మనుగడ గురించి బాగా లోతుగా ఘాటుగా చర్చించారు ఇటీవల.
ఆ సందర్భంగా కొన్ని ఆలోచనలు. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది రాసే భాష గురించే, మాట్లాడే భాష గురించి కాదు.

ఆంగ్లం మూలంగానూ హిందీ మూలంగానూ తెలుగు మరుగున పడిపోతున్నది అనే ఆక్రోశం ఈనాటిది కాదు. 30లు 40లలో వచ్చిన అనేక కథల్లో వ్యాసాల్లో నవలల్లో కూడా ఈ ఆక్రోశం చూడచ్చు మనం. బాబోయ్, తొందరగా ఏమన్నా చెయ్యకపోతే మన కళ్ళముందే తెలుగు భాష కనుమరుగైపోతుందో అన్నంత ఆందోళన వ్యక్తపరిచారు ఆ తరం రచయితలు. మరి ఆ తరం దాటి డెబ్భయ్యేళ్ళ పాటు తెలుగు మనడమే కాక, ఈ గ్లోబలైజుడు కంప్యూటరైజుడు యుగంలో కూడా సజీవంగా మన నాలుకలమీద, మన కీబోర్డుల మీద, మన కంప్యూటరు తెరల మీద నాట్యమాడుతోంది గదా!

అలాగని ఆందోళన కలిగించే పరిస్థితులు లేవని నేననడం లేదు. ఏవిటా ఆందోళన కలిగించే పరిస్థితులు, వాటిని గురించి ఏమి చెయ్యాలి, ఎంత చెయ్యగలం .. ఇవన్నీ కొంచెం స్పష్టంగా ఆలోచించుకోవాలి, ఉద్యమాలకి ఉపక్రమించేముందు.

భాష సజీవం. జీవానికి గుర్తు మార్పు. అందుకని అది నిరంతరం మారుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఇదింక మారకూడదని శాసిస్తామో, ఇక ఆ భాషకి సమాధి కట్టినట్టే.

మన మనసుల్లో ఉన్న మాట చెప్పుకోడానికి, మన ఆలోచనలు పంచుకోడానికి, ప్రస్తుత పరిస్థితుల్ని చర్చించుకోడానికీ భాష ఉపయోగ పడాలి. ఈ ప్రయోజనం నెరవేర్చలేక పోయినప్పుడు భాష పాతబడిపోతుంది. ఇలా పాత బడినప్పుడు అది సమాధికి ఒక అడుగు దగ్గర వేసినట్టే. ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది రాసే భాష గురించే, మాట్లాడే భాష గురించి కాదు.

గతమంతటా భాష ఒకేరకంగా లేదు. పద్య సాహిత్యంలోనే, నన్నయ భాష వేరు, శ్రీనాథుడి భాష వేరు, పెద్దన భాష వేరు. ఆధునిక యుగం వచ్చాక కూడా గురజాడ దగ్గిర్నించీ ఇప్పటి వరకూ భాష మారుతూనే ఉంది, ఆయా కాల పరిస్థితులకి తగినట్టు.

శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసాలు చదువుతున్నానీమధ్య. అకస్మాత్తుగా ఒక విశేషం కనబడింది వారిద్దరి రచనల్లోనూ. ఆంగ్లాన్ని చాలా తక్కువ ఉపయోగించారు వారు. వారిద్దరి ఆంగ్ల భాషా పరిజ్ఞానం, సాహిత్య పరిజ్ఞానం ఏమీ తక్కువకాదు మళ్ళీనూ. సంక్లిష్టమైన అనేక సామాజిక సాహిత్య విషయాల్ని చక్కటి తెలుగులో రాశారు, ఆంగ్లమ్మీద ఆధారపడకుండానే. మనమేమో, ఏదో రోజువారీ సంభాషణ కాక కొద్దిగా జటిలమైన విషయం గురించి ఒక్క వాక్యం రాయాలన్నా, హమ్మో ఇంగ్లీషు వాడకుండా ఎలాగు? అనుకుంటూ అందోళనలో పడిపోతున్నాం.

తెలుగులో కంప్యూటరు, ఫైలు, ఇత్యాది పదాల్ని వాడాలా వొద్దా అని ఒక వివాదం. ఆ సామర్ధ్యం ఉన్నవారు ఇటువంటి అనేక పదాలకి తెలుగు సమానార్ధకాల్ని ప్రతిపాదించి వాడుతున్నారు. వాటిల్లో కొన్నిటికి కొంత జనాదరణ లభిస్తున్నది కూడా, కనీసం బ్లాగర్లలో. ఈ గోలంతా ఎందుకూ, ఆంగ్లపదాలనే ఉపయోగిస్తే పోలేదా అని కొందరి వాదన. వాదన, చర్చ మంచిదే కానీ అది అవహేళనకి దారి తీస్తే మొదటికే మోసం వస్తుంది. ఇలా ప్రతిపాదిస్తున్న పదాలేవీ మాంత్రికుడు హాంఫట్ అని మాయాదర్పణంలోంచి పుట్టించినవి కావు, ఎప్పటినించో ఉన్నవే. వాడుక లేక మరుగున పడిపోయాయి. ఉదాహరణకి ఫైలుకి కవిలె, దస్త్రం అనే పదాలు వాడుకలో ఉండేవి. ఇప్పుడు మళ్ళీ వాటికి బూజు దులిపి కంప్యూటరు ఫైలు అనే అర్ధంలో వాడితే, కొన్నాళ్ళు కొత్తగా ఉండొచ్చుగానీ అందులో ఎగతాళి చెయ్యాల్సినదేమీ లేదు.

ఈ విషయంలోనే రెండు ముచ్చట్లు చెప్పాలి. కథలకి కావలసిన భాష వేరు, కవిత్వానికి కావలసిన భాష వేరు, సాంకేతిక శాస్త్రీయ వ్యాసాలకీ చర్చలకీ కావలసిన భాష వేరు. శాస్త్ర చర్చల్లో భాష జనసామాన్యానికి అందుబాటులో ఉండే భాష కాదు. మనలో నాకు బాగా ఇంగ్లీషు వొచ్చు అనుకున్న వాళ్ళలోనే ఒక ఆంగ్ల సాహిత్య విమర్శని, ఒక సామాజిక శాస్త్ర చర్చని, ఒక ఆర్ధిక శాస్త్ర విశ్లేషణని ఎంతమందిమి క్షుణ్ణంగా అర్ధం చేసుకో గలం? అందుకని మనం చర్చిస్తున్నది సాంకేతిక పరిభాష గురించి కాదు. కాస్తో కూస్తో చదువుకున్న వారందరికీ నాలుగు విషయాలూ మాట్లాడుకునేందుకు అందుబాటులో ఉండే భాష గురించి. శాస్త్ర చర్చలకి కావలసిన పారిభాషిక పదాల్ని ఆయా వర్గాలు సృష్టించుకుంటాయి.

రెండో ముచ్చట, మనం గుర్తు పెట్టుకోవాల్సింది, మార్పు ఒక్కోసారి పని గట్టుకుని ప్రయత్న పూర్వకంగా తేవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వాడుక భాషలో రాసుకుంటున్నాం అంటే, దానికి సుమారొక వందేళ్ళ క్రితం ఒక కురుక్షేత్ర సంగ్రామమే జరిగింది. ఆ యుద్ధంతో పోలిస్తే, ఇప్పుడు భాషగురించి జరుగుతున్న చర్చలు, వాదోపవాదాలూ పిల్లలాటలాగా ఉంటాయి.

Thursday, July 9, 2009

సప్తర్షి మండలం - పెద్ద గరిటె

వేసవి రాత్రుల్లో ఆరుబయటనో డాబామీదనో పడుకుని బాల్యం గడిపిన వాళ్ళకి సప్తర్షి మండలం సుపరిచయమే. చక్కగా పేద్ద గాలిపటంలా ఉంటుంది, మూడు నక్షత్రాల తోకతో.

ఆంగ్లం నేర్చాక దీన్ని Big Dipper అంటారని నేర్చుకున్నా, కానీ ఎందుకా పేరొచ్చిందో ఎప్పుడూ అంతు బట్టలా.

ఇవ్వాళ్ళ సూర్యాస్తమయం తరవాత మా యింటి వెనక పచ్చిక బయల్లో పచార్లు చేస్తుంటే, ఇంకా చంద్రోదయం కాని మబ్బులు లేని ఆకాశంలో దర్శనమిచ్చింది .. ఒక్క పాటున బుర్రలో చిరుదీపం వెలిగింది, ఈ నక్షత్ర సముదాయానికి ఆంగ్లంలో ఆ పేరెందుకొచ్చిందో.

భారద్దేశపు అక్షాంశరేఖ నించి చూస్తే ధృవతార క్షితిజసమాంతర రేఖ (horizon) కి బాగా చేరువలో కనబడీ కనబడకుండా ఉంటుంది. సప్తర్షిమండలం దానికి దగ్గర్లోనే దాని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. వేసవి రాత్రుల్లో సప్తర్షిమండలం ఎప్పుడూ ఉదయిస్తూ కనిపిస్తుంది, అంచేత గాలిపటాన్ని చేసే నాలుగు నక్షత్రాలూ పైకి ఉన్నట్టూ, మిగతా మూడు నక్షత్రాలూ తోకలా ఉన్నట్టూ కనిపిస్తాయి.

మిషిగన్ అక్షాంశరేఖ నించి చూస్తే ధృవతార క్షిసరే కి సుమారు యాభై డిగ్రీల కోణంలో ఉంటుంది. వేసవి రాత్రుల్లో సూర్యాస్తమయమైన వేళలో సప్తర్షిమండలం భారద్దేశంలో కనిపించే దృశ్యానికి తల కిందులుగా కనిపిస్తుంది. అంటే తోకగా ఉండే మూడు నక్షత్రాలూ చక్కగా వొంపు తిరిగిన గరిటె కాడలాగానూ, గాలిపటంలా ఉండే నాలుగు నక్షత్రాలూ లోతైన గరిటె లాగానూ. అదీ బిగ్ డిప్పర్!

ఈ దృశ్యం దక్షిణభారద్దేశంలో ఎక్కడా కనబడదు. కాష్మీరు ప్రాంతాల ఏవన్నా కనిపిస్తుందేమో.

Tuesday, July 7, 2009

నేటి రైతులోని సజీవాత్మ

ఇట్లు ఒక రైతు పుస్తక రచయిత గొర్రెపాటి నరేంద్రనాథ్ మరణ వార్త కలవర పరిచింది.
నిన్ననే నవోదయ నించి మొదటి పుస్తకాల బంగీ అందింది. వచ్చిన పది పుస్తకాల్లోంచీ ఎందుకో ఈ పుస్తకమే నా దృష్టి నాకర్షించింది. ఒక్క బిగిని చదివేశాను. కథలంటే చెవికోసుకునే నేను, తెలుగులో గనీ ఇంగ్లీషులో గానీ ఒక నాన్-ఫిక్షను పుస్తకాన్ని ఇంత ఇదిగా చదవలేదు.

ఇవ్వాళ్ళ పొద్దున లేచి బ్లాగులు చూస్తుంటే ముందుగా కొణతం దిలీప్ బ్లాగులోనూ, అటుపై నారాయణీయంలోనూ ఈ నమ్మలేని వార్త.

ఆంధ్రజ్యోతిలో బాలగోపాల్ కదిలించే అక్షర నివాళి ఇచ్చారు.

నరేంద్రనాథ్ గారి జీవితం ఆదర్శప్రాయం అని చెప్పటం వైశాఖ సూర్యుణ్ణి చూపించి, దీపమమ్మా అని చెప్పటం లాగుంటుంది. పార్టీలకీ సిద్ధాంతాలకీ ఇజాలకీ అతీతంగా నేల మీద, మనుషుల మధ్య నిలబడి, కళ్ళెదురుగా అను నిత్యం తన తోటి వారిని పట్టి పీడిస్తున్న సమస్యలకి నిర్మాణాత్మకమైన పరిష్కారాలని వెదికేందుకు నడుంకట్టి అవిశ్రాంతంగా శ్రమించిన సాహసి ఆయన. దేశంలో ఏం జరుగుతోంది, మన పల్లెల్లో ఏం జరుగుతోంది అని మనసుకి పట్టించుకునే ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన పుస్తకమిది.

ఆయన చెయ్య బూనిన పని సామాన్యం కాదు, నాకు ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తెలుసు. ఆయన నడిచినంత తీవ్రంగానూ, పూర్తిగా ఆయన పద్ధతిలోనూ కాకపోయినా, నేనూ ఆ దారిలో నాలుగడుగులు వేసినవాణ్ణే!

నరేంద్రనాథ్ గారూ, మీ జ్ఞాపకం మా మనసుల్లో ఆరని జ్వాలగా రగులుతుండాలి!

అమెరికా అంటే నాకిష్టం - రేడియో

నా మెట్టినిల్లు అమెరికా మొన్నీ మధ్యనే పుట్టిన్రోజు జరుపుకుంది.
దాన్ని గురించి ఆలోచిస్తుంటే .. తీగ తగిల్తే డొంకంతా కదిల్నట్టు .. ఏవేవో ఆలోచనలు.
నేనీ దేశం రావడం యాదృఛ్ఛికంగా జరిగింది. నేనిక్కడికి రావాలని గొప్ప ఆరాటం లాంటిదేమీ పడలేదు. అమెరికా వెళ్ళలేక పోతే నా జన్మ వ్యర్ధంలాంటి ఆవేశాలేవీ పళ్ళేదు. నా జీవితంలో అప్పటిదాకా జరిగిన అనేక ముఖ్య పరిణామాలన్నీ నా ప్రమేయం పెద్దగా లేకుండానే జరిగిపోయినట్టే ఇది కూడా జరిగింది. అప్పట్లో నా ఉద్దేశమల్లా .. ఇదొక అవకాశం. ఉపయోగించుకుని చూద్దాం ఏమవుతుందో .. అని మాత్రమే.

మొన్నటి జూలై 4 సందర్భంగా రేగిన ఆలోచనల్తో, అమెరికాలో నాకిష్టమైన విషయాల గురించి ఇక్కడ పంచుకుందామని బుద్ధి పుట్టింది. ఆ వరుసలో ఇది మొదటి టపా. ఈ వరుసకి ఒక ప్రాధాన్యత ఏమీ లేదు. నాకు గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్టు రాస్తుంటాను.

నేషనల్ పబ్లిక్ రేడియో ప్రస్తావన నా టపాల్లో ఇంతకు ముందు చూసే ఉంటారు.
ఈ సంస్థ దేశరాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంది. తానే అనేక కార్యక్రమాల్ని, ముఖ్యంగా వార్తలకి సంబంధించిన వాటిని, ప్రొడ్యూస్ చేసి ప్రసారం చేస్తుంటుంది. అంతే కాక తమ నెట్వర్కులో సభ్యులైన కొన్ని స్టేషన్లు ప్రొడ్యూస్ చేసే కార్యక్రమాలని తమ సర్వీసు ద్వారా బట్వాడా చేస్తుంది.

అందులో, ఫిలడెల్ఫియా నగరంలోని WHYY స్టేషన్లో తయారయ్యే ఫ్రెష్ ఏర్ (Fresh Air) కార్యక్రమం నాకు చాలా ఇష్టం. నిర్వాహకురాలు టెరీ గ్రోస్ (Terry Gross) ఈ కార్యక్రమాన్ని ఒక ఇంటర్వ్యూ ఫార్మాట్ లో నడిపిస్తారు. అనేక సమకాలిక సమస్యల గురించి ఎవరో ఒక్క వ్యక్తితో టెరీ సంభాషిస్తారు. మనకి ప్ర్ధాన మీడియాలో ఎక్కువగా కనిపించని వినిపించని ఉద్యమకారులు, సైద్ధాంతికులు, ఈ కార్యక్రమంలో వినిపిస్తారు. నటులు, దర్శకులు, రచయితలు, సంగీతకారులు ఈ కార్యక్రమంలో మనకి వినిపిస్తారు. ఈ షో ఎప్పుడూ పనిరోజు మధ్యలో, ఏ మధ్యాన్నం పన్నెండింటికో వస్తుంది. విద్యార్ధి రోజుల్లో లాబ్ కి మనమే మహరాజులం కాబట్టి లాబ్ లో రేడియో పెట్టుకుని తప్పక వినేవాణ్ణి. ఇప్పుడు జాలం పుణ్యమాని ఇంటికొచ్చాక పాడ్కాస్టులు వింటున్నా. ఇంటర్వ్యూ చెయ్యాలి అంటే టెరీ చేసినట్టు చెయ్యాలని నాకు అదొక స్టాండర్డ్ గా ఏర్పడిపోయింది. తన అతిథులతో మాట్లాడేటప్పుడు ఆమె సమయోచితంగా వినబరిచే ఆత్మీయత, ఆర్ద్రత, కొంటెతనం, అంతలోనే వారి ఆలోచనల లోతుల్ని కొలిచే నిశిత దృష్టి .. అన్నీ నాకు చాలా ఇష్టం. వియత్నాం యుద్ధం సమయంలో అమెరికా రక్షణమంత్రిగా పనిచేసిన మెక్నమారా ఇవ్వాళ్ళ చనిపోయారుట. ఆయనతో టెరీ 1995లో జరిపిన ఇంటర్వ్యూ పునః ప్రసారం ఇవ్వాళ్టి విశేషం.

నాకు అమితంగా నచ్చే ఇంకో కార్యక్రమం డయాన్ రీం షో (Diane Rehm Show). దీన్ని వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ విశ్వవిద్యాలయపు రేడియో స్టేషన్ WAMU వారు నిర్మిస్తున్నారు. ఇది కూడా సంభాషణల ప్రోగ్రామే కానీ దీన్ని డయాన్ నడిపే విధానం ఫ్రెష్ ఏర్ కంటే భిన్నంగా ఉంటుంది. ఎక్కువగా ఈ కార్యక్ల్రమంలో సమకాలీన జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద ముగ్గురు నలుగురు మేధావుల్ని అతిథులుగా పిలుస్తారు. డయాన్ సంభాషణకి దిశ నిర్దేశించడం, ఎప్పుడు ఎవరు మాట్లాడాలని సూచిస్తుండడమే కాక, మధ్య మధ్యలో ఆయా అతిథులు వెలిబుచ్చే అభిప్రాయాలకి సానబెట్టేలాంటి ప్రశ్నలు కూడా వేస్తుంటారు. అంతే కాక, శ్రోతలు కూడా ఈ కార్యక్రమంలో, ఫోను ద్వారా కానీ, ఈమెయిలు ద్వారా కానీ పాల్గొనవచ్చు, అతిథుల్ని ప్రశ్న లడగొచ్చు, లేదా చర్చ గురించి మన అభిప్రాయం చెప్పొచ్చు. అప్పుడప్పుడూ డయాన్ కూడా కళాకారుల్నీ రచయితల్నీ అతిథులుగా ఆహ్వానిస్తుంటారు. ఇవ్వాళ్టి కార్యక్రమంలో ఆఫ్రికన్ నవలా రచయిత్రి చిమమందా అడీచీ వెలిబుచ్చిన అభిప్రాయాలు నాకు చాలా నచ్చాయి.

అమెరికాలో నేషనల్ పబ్లిక్ రేడియోలో ఈ రెండు కార్యక్రమాలూ అంటే నాకు చాలా ఇష్టం.

Thursday, July 2, 2009

కథాంశం

చాన్నాళ్ళ కిందటి ముచ్చట.
రెండు ఎసైన్మెంట్ల మధ్య కాలంలో నేను కోంచెం ఖాళీగా ఉంటే మిత్రులు, మిషిగన్ విశ్వవిద్యాలయంలో సాహిత్యాచార్యులూ డా. క్రిస్టీ మెర్రిల్, తను బోధిస్తున్న భారతీయ సాహిత్యపు తరగతికి ఆహ్వానించారు, నాకు సాహిత్యమంటే ఉన్న ఆసక్తి తెలిసి. క్లాసులో సుమారు ఇరవై మంది విద్యార్ధులున్నారు. అందులో కొందరు భారతీయ సంతతి వారు. Waiting for the Mahatma అని ఆర్కె నారాయణ్ రాసిన నవల చదువుతున్నారు. ప్రతి క్లాసుకి నవల్లో ఒక యాభై పేజీలు చదువుకుని రావాలి. ఆ యాభై పేజీల్లో కథలో పాత్రల్లో జరిగిన పరిణామాల్ని తరగతిలో చర్చించేవాళ్ళు. నేను క్లాసులో వెనకాల కూర్చుని ఆ చర్చలు వింటూ ఉండేవాణ్ణి. ఎప్పుడో 1945లో భారత స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంగా దక్షిణ భారతంలో ఒక చిన్న వూళ్ళో రూపొందిన ఈ కథని ఈ ఇరవయ్యొకటో శతాబ్దంలో అమెరికాలో యువతీ యువకులు (భారతీయ సంతతి వారైనా కాకపోయినా) ఎలా చూస్తున్నారనేది నాకు గొప్ప ఆసక్తిగా ఉండేది.

ఈ నవల్లో హీరో శ్రీరాం ఒకమ్మాయి మోజులో పడి తనకేమీ ఆసక్తి లేని క్విటిండియా ఉద్యమంలో పీకల్లోతుకి మునిగిపోతాడు తనకి తెలీకుండానే. ఒకానొక సందర్భంలో అతడు తన పరిస్థితిని సమీక్షించుకుంటూ ఎట్లా ఇంత చిక్కుల్లో ఇరుకున్నానురా భగవంతుడా అని నీరస పడి కూర్చుంటాడు. ఆ రోజు ఆ సన్నివేశం చర్చకి వచ్చింది. చాలా ఉత్తేజంగానూ జరిగింది వాదన. హీరోకి ఎదురైన అయోమయం సహజమే అన్నారు కొందరు. మరి కొందరు అది అప్పటి అల్లకల్లోల పరిస్థితుల ప్రభావం అని అభిప్రాయపడ్డారు. ఇంకొకరు అది గాంధీమహాత్ముడి ప్రభావం అన్నారు. ఇలా వాద ప్రతివాదాలు జరుగుతుండగా దీప్తి అనే అమ్మాయి (ఇంటి పేరుని బట్టి చూస్తే తెలుగువాళ్ళమ్మాయి అనిపించింది) మొదలు పెట్టింది. మాట్లాడ్డం మొదలెట్టిన కాసేపటికే ఆవేశంతో ఊగిపోతోంది. ఈ హీరో అంత చవట దద్దమ్మని ఎక్కడా చూళ్ళేదంది. మరీ అంత వెన్నెముక లేకుండా ఎలాగున్నాడంది. తన జీవితానికి ఒక సొంత లక్ష్యమూ గమ్యమూ లేకుండా ఏగాలి వీస్తే అటు ఊగుతూ ఉండడం ఏవిటంది. అతనికి ఆ ఉద్యమం గురించి ఏమీ అవగాహన లేకుండా కేవలం ఒకమ్మాయి మోజులో ఉద్యమంలో దిగడం ఏవిటి, తరవాత ఇలాగ తలపట్టుకు కూర్చోవడమేవిటి అని శ్రీరాం వ్యక్తిత్వ రాహిత్యమ్మీద నిప్పులు చెరిగింది. ఆ పిల్ల ఆవేశం చూస్తే, ఆ శ్రీరాం నవల్లో ఒక పాత్ర కాక, తన సొంత అన్నదమ్ముడో, కజినో అయినట్టూ, అతగాడి చేతగాని తనాన్ని సరిదిద్దడానికి ఈమెకి సరైన అవకాశం దొరక్క గొప్ప ఫ్రస్త్రేషన్‌కి గురైనట్టూ, ఆ శ్రీరామే గనక ఎదురుగా ఉంటే ఆ చెంపా ఈ చెంపా వాయించి వాడి బుర్రలోకి కూసింత సెన్సుని, మరికాస్త వ్యక్తిత్వాన్ని బలవంతంగానైనా ఇంజెక్టు చేసి పారేసేదానిలా కనిపించింది.

ఆ పిల్ల వాదన విన్నంత సేపూ, ఔరా, ఆ నారాయణ్ గారు ఈ నవల రాసినప్పుడు, ఇరవయ్యొకటో శతాబ్దంలో ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగిన ఒక భారతీయజాతి పిల్ల ఈ నవల చదువుతుందనీ, చదివినాక తన హీరోపైన ఇలా విరుచుకు పడుతుందనీ అస్సలు ఊహించైనా ఉండడేమో కదా అనిపించింది నాకు. ఆ తరగతి ముగిశాక డా. మెర్రిల్‌తో మాట్లాడుతూ, ఇందాక చర్చలో మీరెందుకు దీప్తి వాదనని సరి చెయ్యలేదు. శ్రీరాం పాత్రని సృష్టించడంలో నారాయణ్ గారి ఉద్దేశం అది కాదు గదా అన్నాను. ఆవిడ చిర్నవ్వుతో, నారాయణ్ గారి ఉద్దేశం పలానా అని మీకెలా తెలుసు అని ఎదురు ప్రశ్న వేశారు. నా దగ్గర బదుల్లేదు.

సాహిత్యం చదవడాన్ని గురించి ఒక ముఖ్య సూత్రాన్ని ప్రామాణికంగానూ, అనుభవ పూర్వకంగానూ నేర్పించింది ఈ సంఘటన నాకు. ఏ రచనకయినా పాఠకుడు దాన్నుంచి ఏం గ్రహించాడు అనేదే ఆ రచన పరమావధిని నిర్ణయిస్తున్నది. ఒకసారి రచన పుర్తి చేసి ప్రకటించాక రచయితకి దానిమీద హక్కులన్నీ పోయినట్టే. మొన్నటి దాకా అచ్చుమాధ్యమాలు రాజ్యమేలినప్పుడు, ఫలాని పాఠకుడు ఫలానా రచనని ఈ విధంగా అర్ధం చేసుకున్నాడు అని రచయితకి తెలిసే అవకాశాలు చాలా తక్కువ. ఏవో చిన్న చిన్న సాహిత్య బృందాల్లో మాత్రం అటువంటి స్పందనలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుండేది. రచయితలకీ పాఠకులకీ మధ్య సరిహద్దు చెరిగిపోతున్న ఈ జాల మాధ్యమంలో రచయితే పనిగట్టుకునొచ్చి నా రచన ఉద్దేశం ఇది అని చెప్పజూసినా, పాఠకులు పోపోవోయ్, నీ శాస్త్రాలు సొంత తెలివి లేనివాళ్ళకి, స్వయంగా ఆలోచించగలిగిన మాక్కాదు అనేస్తారు. ఈ కొత్త యుగంలో నిష్పాక్షికంగా శరపరంపరగా తమపై కురిసే పాఠకాభిప్రాయాల్ని తట్టుకోవడానికి రచయితలు కొత్త మార్గాలు వెతుక్కోవలసిందే, కొత్త సాధన చెయ్యాల్సిందే.

తెలుగు పత్రికల్లో కథ నవలల పోటీలు పెద్ద పెద్ద బహుమతులతో

స్వాతి సపరివార పత్రిక సి.పి.బ్రౌన్ ఎకాడెమీతో కలిసి నిర్వహిస్తున్నది, స్వాతి రజతోత్సవ సీరియల్ నవలల పోటీ.

సుమారు 25 వారాలకు సరిపోయేట్లుగా సీరియల్ నవల రాసి పంపండి. ప్రథమ బహుమతి అక్షరాలా లక్ష రూపాయలు.

చేరవలసిన ఆఖరు తేదీ ఆగస్టు 20

చిరునామా
స్వాతి రజతోత్సవ సీరియల్ నవలల పోటీ
స్వాతి సపరివార పత్రిక, అనిల్ బిల్డింగ్స్,
సూర్యారావు పేట, P. O Box 339
విజయవాడ - 520 002

మరికొన్ని వివరాలిక్కడ.
***

నవ్య వీక్లీ ప్రకటించిన కథల పోటీ
మొదటి బహుమతి రూ.10,000
రెండు రెండో బహుమతులు రూ. 5,000
నాలుగు మూడో బహుమతులు రూ. 2,500

గడువు: ఆగస్టు 15

చిరునామా:
నవ్య వీక్లీ, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్
ప్లాట్ నెం 76, రోడ్ నెం. 70
అశ్వనీ లే అవుట్, హుడా హైట్స్,
జుబిలీ హిల్స్, హైదరాబాద్ 500039
***
స్వాతి సపరివార పత్రిక సరసమైన కథలకి కూడ ఒక పోటీ ప్రకటించింది. ఆ వివరాలిక్కడ.
***
సృజనాత్మక రచన మీద ఆసక్తి ఉన్న మన బ్లాగర్లందరూ పాల్గొంటారని ఆశిస్తున్నా.