Thursday, April 23, 2009

ముద్దర్ల ముచ్చట్లు

బాపట్లలో ఒక్క ఏడూ పంతులు గిరీ చేసిన సమయంలో అయిన ఒకానొక గొప్ప వింత అనుభవం ఎన్నికల డ్యూటీ చెయ్యడం.

నాకప్పటికి 21 నిండుతూ ఉండగా, 22 ఇంకా రానా వొద్దా అంటూ ఉంది. కాయితమ్మీద వోటు హక్కు వచ్చినట్టే గానీ ఇంకా ఎక్కడా వినియోగించే అవకాశం రాలేదు. హస్తినాపురిలో రాజీవుడూ, భాగ్యనగరిలో తారకరాముడూ ప్రశాంతంగా రాజ్యమేలుతున్న కాలమది. ఎక్కడా మధ్యంతర ఎన్నికల వాసన కూడా లేదు.

ఇదిలా ఉండగా తారకరాముడు ఒకానొక సుముహూర్తాన స్థానిక పరిపాలనా వ్యవస్థనంతా ప్రక్షాళించేస్తున్నాం, పంచాయితీ రాజ్ వ్యవస్థకి పూర్తి శక్తి నాపాదిస్తున్నాం అని చెప్పి, జిల్లాపరిషత్తులకి ఎన్నికలు ప్రకటించాడు. ఇది జెనెరల్ ఎలక్షను కాకపోవడంతో మామూలుగా ఎన్నికలకి సహకరించే సిబ్బందిని వాడలేకపోయారు గామాలు, మొత్తానికి మాది ప్రైవేటు కాలేజీనే అయినా మా సిబ్బందికీ ఎన్నికల వేటు పడనే పడింది.

డ్యూటీ నోటీసులు చూసుకుని మా కుర్రకారంతా ఉత్సాహంగానే ఉంది. ఆహా, ఒక్క సారైనా వోటెయ్యక పోయినా ఎన్నికలు జరిపించే గురుతర బాధ్యత నెరవేర్చి ప్రజాస్వామ్యానికి నేను సైతం లెవెల్లో మేం ఫీలైపోతుంటే, సీనియర్ మేష్టార్లు గత ఎన్నికల చేదు అనుభవాల్ని తలుచుకుని, తగ్గండి తగ్గండి తమ్ముళ్ళారా అని హెచ్చరించ జూశారు. ఐనా మా యువబృందపు ఉత్సాహాన్ని వాళ్ళాట్టే తగ్గించ లేక పోయారు. మొత్తానికి ఒక పిక్నిక్కి బయల్దేరినట్టు బయల్దేరాం గుంటూరుకి, ఛార్జి తీసుకోడానికి.

జిల్లా ఎన్నికల ప్రధాన కార్యాలయానికి చేరుకున్నాం. విజయవాడలో కాళేశ్వర్రావు మార్కెట్లో ఉదయాన్నే కూరగాయల లారీలు వచ్చే టైములో అక్కడి సందోహాన్ని మీలో ఎవరన్నా ఎప్పుడన్నా చూశారా? ఈ కార్యాలయ ప్రాంగణంలో హడావుడి దానికి వంద రెట్ల ఎక్కువ గందరగోళంగా ఉంది. మా శక్తియుక్తులు, తెలివితేటలూ అన్నీ ఉపయోగించి మాకు ఛార్జి ఇచ్చే చోటు తెలుసుకుని అక్కడ హాజరయ్యాం. అసలే వరంగలార్యీసీ గ్రాడ్యువేట్లం, అటుపైన బాపట్లింజనీరింకాలేజీ అధ్యాపకులం అయ్యేప్పటికి తగు మాత్రం గీరగా ఉండేవాళ్ళం. అసలు మేమేంటి, మా లెవెలేంటి, మా ముందు ఈ తుఛ్ఛ ప్రభుత్వోద్యోగులందరూ అల్పజీవులూ, పిపీలికాలూ కదా అన్నట్టుండేది మా తీరు. మా లెవెలు చూసి అక్కడి క్లర్కులు హడలి పోయి, గబగబా మా పేపర్లు చూసి మా ఎసైన్మెంట్లు అందజేశారు. అందరమూ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లము. ఈ టైటిలేదో బాగానే ఉందే అని మురుసుకున్నాము. ఇహ అప్పుడు మొదలైంది .. అసలు పండుగ ..

మా నలుగురికీ ఒక వూరు కాదుగదా, పక్కపక్క వూర్లు కాదుగదా, ఒక రూట్లో ఉండే వూళ్ళు కూడా వెయ్యలేదు. అది మొదటి దెబ్బ. నేను నా మిత్రుల్ని విడిచి నా పై అధికారియైన ప్రిసైడింగాఫీసరు గారిని వెతుక్కుంటూ వెళ్ళాను. నా అదృష్టం కొద్దీ ఆయన అనుభవజ్ఞుడైన ఒక డిగ్రీకాలేజీ మేష్టారు, అనేక ఎలక్షన్ల క్షతగాత్రుడు .. అబ్బే, నిజంగా దెబ్బల్తిన్నాడని కాదు, క్ష అనుప్రాస బాగుందని వాడానంతే. మొత్తానికి ఆయన అనుభవజ్ఞుడు. నన్ను తేరిపార చూసి, ఏం భయం లేదు, నేను చూసుకుంటాను అంతా, నేను చెప్పే కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే చాలు అని అభయమిచ్చారాయన.

మారూట్లో ఉన్న వూళ్ళలో డ్యూటీ సిబ్బందినందర్నీ, సుమారొక నలభై మందిని అక్కడున్న ఒక డాడ్జిలారీ ఎక్కించారు. జీపు లేదు, బస్సు లేదు, వేను లేదు, ఒక లారీలో వెనకాల గొర్రెల మందని ఎక్కించినట్టు ఎక్కించారు. పాఠక మహాశాయులారా, సూపర్ డీలక్సు బస్సు తప్ప ఎక్కని ఈ శరీరం ఒక మట్టిలారీలో పైన టాపైనా లేకుండా గుంటూరునించీ, రేపల్లె దగ్గర ఒక చిన్న పల్లెటూరికి మిట్టమధ్యాన్నపు ఎండలో ప్రయాణం చేసింది! మీకెప్పుడైనా వోటెయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలక్షనాఫీసర్ల మీద కోపమొస్తే, ఈ దృశ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి.

మొత్తానికి వొళ్ళు పూర్తిగా బాబాయి హోటల్లో కొబ్బరి పచ్చడై పోకముందే మా కుగ్రామం చేరుకున్నాం. అప్పటికి సాయంత్రం అయిదవుతోంది. పోలింగ్ కేంద్రం ఊళ్ళో ఉన్న ఒకేఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో. దాని పుణ్యమా అని ఆస్కూలికి ఒక పక్కా భవనమూ, దానికి గొళ్ళెం పెట్టి తాళం వెయ్య దగిన తలుపూ ఉన్నాయి. ఫేను కానీ, లైటు కానీ లేవు. ఒకేళ ఉన్నా, కరంటు ఎలాగూ కట్టే. మేము దిగడం చూసిన అక్కడి పిల్లవాళ్ళు ఊళ్ళోని పెద్దమనుషుల్ని పిలుచుకు వచ్చారు.

నాకప్పటికి బొత్తిగా లోకజ్ఞానం లేకపోవడంతో అక్కడి స్థానిక పరిస్థితుల్ని గురిచి కూలంకషంగా తెలుసుకునే అవకాశం పూర్తిగా పాడుచేసుకున్నా. నాకిప్పుడు గుర్తున్నదల్లా .. ఊళ్ళో ఇద్దరు మోతుబరి రైతులు. ఒకాయన కాంగ్రెస్, ఇంకొకాయన తెలుగు దేశం. ఇద్దరికీ సుమారుగా సమాన బలగమే ఉంది. కానీ, ఊరిజనం కొట్లాటలకి దిగే రకం కాదు. ఎన్నికల కార్యక్రమం ప్రశాంతంగా జరిగిస్తామని ఇద్దరు మోతుబరులూ మా పెద్దాఫీసరుగారికి భరోసా ఇచ్చారు. మా ఇద్దరి భోజనాలు, పడక ప్రసక్తి వచ్చింది. మోతుబరులిద్దరూ గుసగుసలాడుకుని ఒక నిర్ణయానికొచ్చారు. వాళ్ళిద్దరికీ నమ్మకమయిన ఒక మధ్య మనిషి ఉన్నాడు. ఆయన ఇంటి ముందు గచ్చు చేసిన వరండాలో పడుకోవచ్చు. మర్నాడు ఎలక్షను రోజు మధ్యాన్న భోజనం కూడా ఆయన ఇంట్లోనే ఏర్పాటవుతుంది. కానీ ఇవ్వాళ్టి రాత్రికి మాత్రం మీ ఏర్పాటు మీరు చూసుకోవాల్సిదే నన్నారు. మా పెద్దాయన పోనీ ఇక్కడ ఊళ్ళోగానీ పక్క ఊళ్ళోగానీ పూటకూళ్ళ ఇళ్ళూన్నాయా అనడిగారు .. చెప్పాను కదా, అనుభవజ్ఞుడని? నేనింకా హాచ్చెర్యపడి చూస్తున్నా, వార్నీ ఇంకా ఈ రోజుల్లో కూడా పూటకూళ్ళ ఇళ్ళున్నాయా అని.

ఆ ఊళ్ళో లేదుగానీ పక్కూళ్ళో ఉంది. కానీ ముందు చెప్పుకునుంటే బెటరు. అని చెప్పి వాళ్ళు చక్కా పోయారు. ఆపక్క ఊరు సుమారు రెండు మైళ్ళు. వెళ్ళి, భోజనం చెప్పుకుని, తిరిగొచ్చి, మళ్ళీ వెళ్ళి .. ఇదంతా ఎందుకులే అని మేమిద్దరమూ డైరెక్టుగా వెళ్ళి భోంచేసి రావడానికి బయల్దేరాము. అప్పటికే ఆరు దాటి బాగానే చీకటి పడింది. అదేమీ రోడ్డు కాదు, డొంకదారి. చెప్పానుగా పెద్దాయన అనుభవజ్ఞుడని, చక్కగా నాలుగు బేట్రీల టార్చిలైటుతో సహా వచ్చారాయన. పక్కూరు చేరుకుని పూటకూళ్ళిల్లు కనుక్కోడం పెద్ద కష్టం కాలే.

దానికి పూటకూళ్ళిల్లు అనడం కూడా పెద్ద బిరుదిచ్చినట్టే. అది మామూలుగా బస్సులాగే చోట ప్రయాణీకులకి టీ, అరటిపళ్ళు అమ్మే చిన్న పాక. ఇలా ఎప్పుడన్నా మాలాంటి కాందిశీకులు ఆ ప్రాంతాలకొస్తే అదే టెంపొరరీగా పూటకూళ్ళింటి స్థాయికి ఎత్తబడుతుందన్న మాట. మేమక్కడికి చేరుకునేప్పటికి బయట సుమారొక అరడజను మంది పేంట్లూ షర్ట్లూ వెసుకున్న జనాలు .. చూడంగానే పట్నం సజ్జు అనిపించే బాపతు జనాలు .. సిగరెట్లు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. ఓహో, పరవాలేదు, ఇదీ ఒక మోస్తరు హోటలన్నమాట అనుకుని సమీపించాము మేము. తీరా అందులో కొన్ని పరిచయమైన మొహాలున్నాయి. ఈ జనాభా కూడా ఆయా చుట్టుపక్కల గ్రామాలకి మేమొచ్చిన పని మీద వొచ్చినవారే .. ఇందాక మా లారీలో వచ్చిన వారే. ఆ తట్టు ఐదారు గ్రామాలకి ఇదే పూటకూళ్ళిల్లు. ఒక్కసారిగా పదిమంది భోజనాలకి దిగేసర్కి ఆ పాకవాడికి కాళ్ళూ చేతులూ ఆడక, అవసరమైన సరుకులు కూడదీసుకుని, వొండి మాకు పెట్టేప్పటికి రాత్రి తొమ్మిదయింది. అప్పటికి నాకు శోషొచ్చి సగం నిద్రకి పడి ఉన్నాను. పొడిపొళ్ళాడుతున్న అన్నం, నాలిక చురుక్కుమనే పచ్చిమిరపకాయల కారంతో రోట్లో నూరిన దోసకాయ పచ్చడి, ఘుమఘుమలాడే గేదె నెయ్యి! ఒక పెద్ద పట్టు పట్టాను. నెక్స్ట్ .. అంతే ఇంకేమీ లేదు. మజ్జిగే. ఐతే, ఆ పచ్చడే మళ్ళి పట్రా .. నిజంగా చెబుతున్నానండీ, జీవితంలో అంత రుచికరమైన దోసకాయపచ్చడన్నం నేనెప్పుడూ తినలేదు. దాన్నే ఇదే పప్పూ, ఇదే కూరా, ఇదే సాంబారూ అనుకుని నాలుగు సార్లు కలుపుకు తిన్నా. పాడికి లోటు లేదల్లే ఉంది, ప్రతీసారీ నెయ్యి మాత్రం తప్పనిసరి. ఒక అరగ్లాసుడు మజ్జిగ తాగి (మందెక్కువయ్యాము గదా, అది పల్చగానే ఉంది) సుమారు పదిన్నరకి మా బళ్ళో వొచ్చి పడ్డాం. ఎలా నిద్ర పోయానో నాకిప్పుడు గుర్తు లేదు .. వొళ్ళు హూనమైంది కాబట్టి, ఫేను లేకపోయినా, ఉక్క పోసినా, దోమలు కుట్టినా నిద్రమాత్రం బాగానే పోయాననుకుంటా.

మర్నాడు ఎనిక్కల తతంగం తగుమాత్రం ఎఫిషియెంట్ గానూ, ప్రశాంతంగానూ జరిగింది. ఏవో చిన్న చిన్న కొట్లాటలు వచ్చాయిగానీ, మా పెద్దాయన ఆధ్వర్యంలో సద్దుబాటైపోయాయి. నాకు పని కూడా పెద్ద కష్టమనిపించలేదు. ఊరి పెద్దమనుషులు వాగ్దానం చేసినట్టు మధ్యానం భోజనం ఆ తటస్థుడైన పెద్దమనిషి ఇంట్లో షడ్రసోపేతం కాదుగానీ, మంచి భోజనమే పెట్టించారు. ఎన్నికలు కట్టేసినాక, చూడాల్సిన కూడికలూ తీసివేతలూ అన్నీ పెద్దాయనే చేసేసి, నాతో కూడా ఒక సంతకం పెట్టించేశారు. మూటా ముల్లే సద్దుకుని కూర్చున్నాం, మా పుష్పక విమానం కోసం. అది సుమారు ఎనిమిదింటికి వచ్చి మమ్మల్ని ఎక్కించుకుంటే, అర్ధరాత్రి ఏ వొంటిగంటకో గుంటూర్లో ఎన్నికలాఫీసుకి చేరుకున్నాం. ముందస్తుగా సీలేసిన వోట్లడబ్బా, నింపిన ఫారాలూ అన్నీ అధికారులకి అందజేసి, మా పెద్దాయన దగ్గర వీడుకోలు తీస్కుని నా మిత్రుల్ని వెదుకున్నాను. వాళ్ళూ ఇంచుమించుగా అదే సమయానికి చేరుకున్నారు. నలుగురమూ బేటా ఇచ్చే చోటికి వెళ్ళాము. మేము డ్యూటీకి రిపోర్టు చేసినప్పుడు ఉన్న క్లర్కులే ఇప్పుడు బేటాల పంపిణీ చూస్తున్నారు. మేం వెళ్ళగానే భయభక్తులతో మా పే స్లిప్పులందుకుని చూశారు. చూసి వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. మధ్యమధ్యలో ఒకరిద్దరు పెద్దగా, కొంచెం ఎకసక్కెంగా నవ్వారు. మావాడికి కొంచెం టెంపరెక్కువ. ఏంటా నవ్వులు, మా బిల్లులు సెటిల్ చేసి పంపండి అని గట్టిగా అన్నాడు. క్లర్కుల్లో కొంచెం లీడర్లాగా ఉన్నతను .. వార్నీ, కేడరు మాత్రం లోయర్ గ్రేడు క్లర్కంత లేదు, ఈళ్ళకెంత పొగర్రా అన్నాడు. మా నలుగురికీ తిక్క రేగింది. కానీ ఇంతలో మా స్లిప్పులు తీసుకున్న క్లర్కు, గబగబా మా సంతకాలు తీసుకుని చెరొక ఇరవై రూపాయలు చేతులో పెట్టాడు. మేం నిర్ఘాంత పోయాం. కనీసం తలా వందైనా వస్తుందని ఆశించాం అప్పటిదాకా. పాపం అతను మా మీద దయతల్చి జ్ఞానోదయం కలిగించాడు. బేటా పూర్తి జీతం మీద ఆధారపడి ఉండదు. పేస్కేల్లో బేస్ పే ఎంతనో దాని మీద ఆధార పడి ఉంటుంది. మీకు మొత్తం జీతం బాగా ఎక్కువే కానీ, అందులో చాలా భాగం ఎలవెన్సుల కింద ఇస్తున్నారు. మీ బేస్ పే స్కేలు ఒక లోయర్ గ్రేడు క్లర్కు జీతం స్కేలు .. అని అతను చెప్పాడు. సరే ఏదో ఒకట్లే, ఇదైనా దక్కింది, రేపాదివారం, సినిమా టిక్కెట్టుకి పనికొస్తుందని గేటుకేసి బయల్దేరాం.

అయ్యా .. అదీ .. నా ఏకైక ఎలక్షను అనుభవం.

Tuesday, April 21, 2009

బ్రహ్మశ్రీ గొర్తి సాయిబ్రహ్మానందం మహాశయులకి ...

... బహిరంగ ఆహ్వానం.

వాదన మొదలెట్టాక ఒక కొలిక్కి రాకుండా తెరమూసేసే అలవాటు నాకూ లేదు.

అక్కడ పెద్దల ఇంటి ముందు రచ్చ చెయ్యడం భావ్యం కాదని మిమ్మల్ని మా ఇంటికే ఆహ్వానిస్తున్నాను .. రచ్చకి కాదు, చర్చకే.

ఇప్పుడు చెప్పండి .. ఏవిటి తెలుగు బ్లాగుల పట్ల మీ అభియోగాలు? తెలుగు బ్లాగుల్లో సాహిత్య కృషి జరగడం లేదా? సాహిత్య కృషి అంటే ఏవిటి? ఏమి చేస్తే అది జరిగినట్టు తీర్మాన మవుతుంది? తెలుగు బ్లాగుల్లో అది జరగడం లేదని మీరెందుకు అనుకుంటున్నారు? పోనీ తెలుగు బ్లాగుల్లో కాక పోతే ఇంకెక్కడ జరుగుతోందో సెలవియ్యండి.

చెప్పండి!

Monday, April 20, 2009

కబుర్లు - ఏప్రిల్ 20

అమెరికాలో వంగూరి ఫౌండేషను అని ఉంది. హ్యూస్టను నగర వాస్తవ్యులు, వ్యాపారదక్షులు, అమెరికాలో ప్రసిద్ధ తెలుగు రచయిత అయిన డా. వంగూరి చిట్టెన్రాజుగారి నాయకత్వంలో అనేక విధాలుగా తెలుగు సాహిత్య సేవ చేస్తోంది ఈ సంస్థ. ప్రతి ఏడూ ఉగాది సందర్భంగా అమెరికా తెలుగు రచనల పోటీ నిర్వహిస్తుంటారు. పదేళ్ళ క్రితం, 1999 సంవత్సరంలో జరిపిన పోటీకి ఒక కథ రాసి పంపాను. ఒక అమెరికను బడిలో జాత్యహంకార పూరితుడైన ఒక తెల్ల పిల్లవాడు నల్లజాతి మీది ద్వేషంతో స్కూలు అసెంబ్లీ మీద ఆటోమేటిక్ తుపాకితో దాడి చేసినట్టు అందులో చిత్రించాను.

ఆ కథ పంపేసిన సుమారు వారం పది రోజులకి కొలరాడో రాష్ట్రంలోని కొలంబైన్ హైస్కూల్లో ఇటువంటి ఘాతుకం నిజంగా జరిగింది. ఆ దాడి జాత్యహంకారంతో ప్రేరణ చెందినది కాదు కానీ, ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఉపాధ్యాయులూ, విద్యార్ధులూ కూడా తమ తోటివారిని రక్షించేందుకు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దేశం మొత్తాన్నీ ఈ సంఘటన కుదిపేసింది.

కథని సబ్మిట్ చేసిన కొద్ది రోజుల్లోనే కథలో చెప్పినటువంటి సంఘటన నిజంగా జరగడం వల్లనో, లేక ఆ కథలో న్యాయనిర్ణేతలకి ఏదో విలువ కనబడో, మొత్తానికి ఆ కథకి ఆ పోటీలో మొదటి బహుమతి వచ్చింది. ఆ తరవాత ఆ కథ అమెరికాలోనూ, ఆంధ్రాలోనూ అనేక పత్రికల్లో, సంకలనాల్లో మళ్ళీ మళ్ళీ ప్రచురితమై, కథా రచయితగా నాకు కొంచెం మంచిపేరే తెచ్చి పెట్టింది. కానీ, నిజజీవితంలో అటువంటి ఘాతుకం జరగడం నన్ను కూడా కుదిపేసింది. ఆ కథని మళ్ళీ నేను అభిమానంగా చూసుకోలేక పోయాను. అది తెరిచినప్పుడల్లా నాకు వెన్ను జలదరిస్తుంది.

ఈ రోజు కొలంబైను మారణహోమం జరిగి పదేళ్ళు గడిచాయి! కానీ మనసు గాయాలింకా పచ్చిగానే ఉన్నాయి.

గత వారం ఒకరి మీద చాలా కోపమొచ్చేసింది నాకు. ఎలాగంటే, ఏదో ఒక భయంకరమైన అవమానం, ఘోరాతి ఘోరమైన ప్రతిక్రియ చేసేస్తే గానీ ఆ కోపం చల్లారేటట్టు కనబళ్ళేదు. రాత్రీ పగలూ ఇదే ఆలోచన. మరి దేనిమీదా మనసు లగ్నం కాదు. అంత ఆవేశం వచ్చినప్పుడు మరి ఆ ప్రతిక్రియ ఏదో చేసెయకుండా ఎందుకు ఆగానో స్పహ్టంగా చెప్పలేను. ఆవేశానికి లొంగిపోవడం మంచిది కాదు అనే వివేకం కంటే ఏం ప్రతిక్రియ ఎలా చెయ్యాలో తెలియక పోవడం వలన అయ్యుండొచ్చు. ఇలా పూరాగా ఏడు రోజులు బాధ పడ్డాను. ఆ ఆఖరి రోజు ఒక నిర్ణయానికి వచ్చేశాను. ఇవ్వాళ్టితో నా ప్రత్యర్ధికి మూడింది. అలుగుటయే యెరుంగని .. టైపులో నేపథ్య సంగీతం నేనే ఇచ్చేసుకుని పురెక్కి పోయి, రెచ్చిపోదామని డిసైడైపోయి, యథా ప్రకారం ఉదయం మొదటి కప్పు టీ తాగుతూ కంప్యూటరు తెరిచాను. విధి అనండి, దేవుడనండి, డివైన్ ఇంటర్వెన్ష ననండి (ఈ మాట వినంగానే మీలో ఎంతమందికి పల్ప్ ఫిక్షన్ సినిమా గుర్తొచ్చింది?) మొదట నేను తెరిచిన మెయిల్లో ఈ లింకుంది.

అంతే, ఆ కథలో చెప్పినట్టు ఒక్కసారి రెక్కలు విదిలించి చూశా .. వారంరోజులుగా నన్ను కుదిపేసిన కోపం ఆవేశం అంతా తుస్సున జారి పోయింది. మీక్కూడా ఎవరిమీదన్నా కోపంగా ఉందా? ఒక్కసారి రెక్కలు విదిలించండి.

Monday, April 13, 2009

కబుర్లు - ఎన్నికల స్పెషల్!

వీక్షణం (రాజకీయార్ధిక సామాజిక మాస పత్రిక) ఏప్రిల్ సంచిక సంపాదకీయం

ఎన్నికలు ఏం సాధిస్తాయి?

ఈ సంపాదకీయం మీరు చదువుతున్న సమయానికి రాష్ట్రంలో శాసనసభకూ, లోక్సభకూ మొదటి విడత అభ్యుర్ధులు ఖరారయిపోయి నామినేషన్లు ఘట్టం ముగిసిపోయి ముమ్మరంగా ప్రచారం మొదలయి ఉంటుంది. రానున్న రెండు మూడు వారాలలో రెండు విడతల ఎన్నికలు కూడా ముగిసిపోయి ఫలితాల కోసం నెలరోజుల నిరీక్షణ మొదలవుతుంది. ఈ మొత్తం క్రమంలో అటు చట్టసభల అభ్యర్ధిత్వం ఆశించేవారు, అంతిమంగా పోటీ చేసేవారు, వారి అనుచరగణం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రచార మాధ్యమాలు చేసే హడావుడే కనబడుతోంది వినబడుతోంది. ఈ సంరంభంలో ప్రజల పాత్రగాని, ప్రజలకు అవసరమైనది గాని, ప్రజలకు దక్కేది గాని ఏమైనా ఉన్నదా అని చూస్తే చేదు నిజాలు బయటపడుతున్నాయి. ప్రజల పేరు మీద, తమ ప్రతినిధులను ఎన్నుకునే ప్రజల హక్కు పేరు మీద, వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తూ జరుగుతున్న ఈ ఎన్నికల ప్రహసనంలో ప్రజల పాత్ర నామమాత్రమే. రెండు వారాల పాటు శ్రోతలుగానూ, ప్రేక్షకులుగానూ, ఎన్నికల రోజున కొన్ని గంటలు క్యూలో నిలబడి, రెండు నిమిషాల్లో బేలట్ పై తమ ముద్ర కొట్టేవారిగానూ తప్ప అంతకన్నా ఎక్కువ పాత్ర ప్రజలకు లేదు. ఎవరి పేరు మీద ఈ నాటకం నడుస్తున్నదో వారికి ఆ నాటకంలో ఇంత తక్కువ పాత్ర ఉండడం హాస్యాస్పదమైన శోచనీయమైన విషయమని కూడ ఎవరికీ అనిపిస్తున్నట్టు లేదు. ప్రజల పాత్ర లేదంటే ప్రజల ప్రస్తావన లేదని కాదు. నిజానికి జరిగే తంతంతా ప్రజలు, ప్రజలు, ప్రజలు అనే మంత్రం జపిస్తూనే జరుగుతున్నది. కానీ ప్రజలంటే ఎవరు? వారి జీవితం ఎలా గడుస్తున్నది? ఆ జీవితాన్ని మెరుగు పరచడానికి ఏమి చేయవలసి ఉన్నది? తమ చేతికి అందబోతున్న విధాన నిర్ణ్యాధికారాన్ని, విధానాల అమలు అధికారాన్ని ఆ ప్రజాజీవితాన్ని మెరుగుపరచడానికి ఏ విధంగా ఉపయోగించబోతాము, తీవ్రమైన అంతరాలు ఉన్న సమాజంలో కనీస రాజ్యాంగ లక్ష్యాలనైనా నెరవేర్చడానికి ఎటువంటి చర్యలు చేపట్టబోతాము అనే మౌలిక ప్రశ్నలైనా ఈ ప్రజానామ జపంలో వినబడడం లేదు. అన్ని రాజకీయ పక్షాలు పేరుకు ఏవో కొన్ని వాగ్దానాలతో ఎన్నికల ప్రణాళికలు ప్రకటిస్తాయి. ఆ వాగ్దానాలను అమలు చేయనక్కరలేదనీ, చేయవలసిన బాధ్యత ఏమీలేదనీ, కేవలం ప్రజలను ఆకర్షించేందుకే ఆ వాగ్దానాలు చేస్తున్నామనీ అన్ని రాజకీయ పక్షాలకూ చాలా స్పష్టంగా తెలుసు. రాజకీయార్ధిక సామాజిక వ్యవస్థలో మౌలికమైన మాపు జరగకుండా కేవలం ఒకరి చేతినించి మరొకరికి అధికారం మారినంత మాత్రాన ప్రజాజీవితంలో ఎటువంటి మార్పూ రాదనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించకుండా చూడడానికే ఈ ఎన్నికల తతంగం నడుస్తోంది. ఏదో మార్పు జరగబోతున్నదనో, జరిగే అవకాశం ఉన్నదనో ప్రజలను మోసపుచ్చేందుకే ఐదేళ్ళకోసారి ఈ ఎనికల తతంగం నడుస్తోంది. వ్యవస్థ మౌలికంగా మారాలని కోరుకునే ప్రజలకు గానీ, రాజకీయ పక్షాలకు గానీ ఈ ఎన్నికల క్రీడలో పాల్గొనే అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నచోట గూడ నామమాత్రంగానైనా ప్రదర్శన వస్తువుగానైనా రాజ్యాంగం హామీ ఇచ్చిన ఆ సమాన భాగస్వామ్య అవకాశాన్ని వాడూకుని అధికారానికి వచ్చిన ప్రభుత్వాలు చేయగలిగిందేమీ లేదని చరిత్రలో అనేకసార్లు రుజువైంది. అటువంట్ ప్రభుత్వాలేర్పడి ప్రజల పట్ల నిబద్ధతతో, చిత్తశుద్ధితో ప్రవర్తించగలిగిన వ్యక్తులో, శక్తులో ఉన్నా వారిని ఎక్కువకాలం పనిచెయ్యనివ్వనంత బలమన స్వార్ధ ప్రయోజన శక్తులు, పాలకవర్గాలు ఉన్నాయి. అందువల్ల దీర్ఘకాలికంగా ఎన్నికలతో సాధించగలిగింది ఏమీలేదనే అవగాహనను కలిగి ఉంటూనే స్వల్పకాలిక ప్రయోజనాల కొరకు ఎన్నికలు ప్రజలకు ఉపయోగపడతాయా ఆలోచించాలి. ఈ సందర్భంగానయినా ప్రజలు రాజకీయ పక్షాలను అభ్యర్ధులను నిలదీయవచ్చు, ప్రశ్నించవచ్చు. వ్యవస్థ ఎవరి ప్రయోజనాల కొరకు పనిచేస్తున్నదో ఎండగట్టవచ్చు, ప్రజానామజపం బదులుగా, నిజంగా ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కొరకు ఎవరు ఏమి చేస్తారో, ఎట్లా చేస్తారో అడగవచ్చు. తమ గత ప్రజావ్యతిరేక చరిత్రకు ఎలా పశ్చాత్తాపం ప్రకటిస్తారో నిలదీయవచ్చు.

ప్రశ్నించడమే ప్రజలకు మిగిలి ఉన్న ఏకైక మార్గం.

ప్రతులకు:
veekshanam2003 at gmail dot com
reachcdrc at yahoo dot com
040-6684 3495

Thursday, April 9, 2009

మేలుకొలుపులు

కాస్తో కూస్తో సంగీతం తెలిసిన వారికి భూపాలం అనగానే ఉషఃకాంతులూ, పక్షుల కిలకిల రవాలూ, మంచులో తడిసిన పూలూ, రాత్రంతా సేదతీరి బద్ధకంగా మేలుకుంటున్న ప్రకృతి, తెలతెలవారుతున్న తూరుపు ఆకాశం .. ఇవన్నీ గుర్తొస్తాయి. మరి ఆ తిరుమల స్వామిని నిద్ర లేపడానికి భూపాల రాగం పాడ్డంలో ఆశ్చర్య మేముంది?

Get this widget | Track details | eSnips Social DNA

భూపాలంలో స్వరపరిచిన అన్నమయ్య పదం, బాలమురళీకృష్ణ గాత్రంలో శ్రీవేంకటపతికి మేలుకొలుపు

భూపాలం, బౌళి (కొందరు భౌళి అంటారు), రేవగుప్తి .. ఈ మూడూ చాలా సన్నిహితంగా ఉండే రాగాలు. మూడూ బహు ప్రాచీనమైనవే. అనాదిగా ఉషఃకాలోచితమైన అనేక దైవ మానవ కార్యక్రమాలకి ఈ మూడు రాగాలూ నేపథ్యసంగీతాన్ని అందిస్తూ వచ్చాయి. మూడిటికీ మధ్య తేడాలు బహు స్వల్పం. ఎంత చిన్న తేడాలంటే, ఒకపాటి సంగీతం వచ్చిన వారు కూడా ఈ రాగాల్ని విన్నప్పుడు కొంచెం తికమక పడుతుంటారు.

భూపాలం ఆరోహణలోనూ, అవరోహణలోనూ అవే ఐదు స్వరాలను కలిగి ఉంది. ఇలాంటి రాగాల్ని ఔడవ రాగాలంటారు.
ఆరోహణ: స, రి1, గ1, ప, ద1
అవరోహణ: ద1, ప, గ1, రి1, స
72 మేళకర్త విభజన పద్ధతిలో దీన్ని 8వ మేళకర్త హనుమత్తోడి జన్యంగా భావిస్తారు.

దీన్నించి బౌళి రెండు విషయాల్లో విభేదిస్తుంది. గ1 కి బదులు గ2 ఉంటుంది ఆరోహణంలోనూ, అవరోహణంలోనూ. అది కాక, అవరోహణలో ని2 స్వరం అదనంగా వచ్చి చేరుతుంది. అంటే బౌళి స్వరక్రమం ఇలా ఉంటుంది.
ఆరోహణ: స, రి1, గ2, ప, ద1
అవరోహణ: ని2, ద1, ప, గ2, రి1, స
దీన్ని 15 వ మేళకర్త మాయామాళవగౌళ జన్యంగా పరిగణిస్తారు.

బౌళిలో శ్రీరామునికి మేలుకొలుపు, త్యాగరాజ ఉత్సవ సంప్రదాయ కీర్తన, గొంతు బాలమురళీకృష్ణ

Get this widget | Track details | eSnips Social DNA

బౌళిలో ప్రసిద్ధమైన అన్నమయ్య పదం, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గానం

బౌళిలో అవరోహణలో వచ్చే ని2 స్వరాన్ని తొలిగిస్తే అదే రేవగుప్తి. అంటే, ఈ తేడాని కనిపెట్టడానికి బహు సునిశితమైన వినికిడి ఉండాలన్నమాట. స్వరస్థానాలు మారకపోవడం వల్ల రేవగుప్తి కూడ మాయామాళవగౌళ జన్యమే.

రేవగుప్తిలో నేదునూరి వారు స్వరపరిచిన అన్నమాచార్యులవారి గొప్ప తాత్త్విక కీర్తన, గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారి గళంలో


ట్రావంకూరు ఏలిక శ్రీ కులశేఖరమహారాజు (స్వాతి తిరునాళ్ గా ప్రసిద్ధులు) రచించిన అద్భుతమైన సంస్కృత కృతి, గోపాలదేవుని కీర్తిస్తూ, జేసుదాసు గళంలో

ఈ మూడు రాగాల్లోనూ ఒక ప్రత్యేకమైన తూగు ఉంటుంది. ఎందుకంటే, ఆరోహణలో ద1 నించి తారస్థాయి స కి వెళ్ళేప్పుడు, రెంటికీ మధ్య మూడు స్వరస్థానాలు ఖాళీగా ఉంటాయి. ఆ మధ్యలో స్వరాలేవీ ధ్వనించకుండా గొంతుని గంతు వేయించాలి. ఆలాగే అవరోహణలో కూడా (బౌళి అవరోహణలో ఈ ఖాళీ రెండు స్థానాలే, ని2 ఉంటుంది కాబట్టి). ఇదే విధంగా రి-గ ల మధ్య వచ్చే ఖాళీ, గ-ప ల మధ్య వచ్చే ఖాళీ కూడా ఈ రాగాల ప్రత్యేకతకి దోహదం చేస్తాయి.

స, రి, గ, ప, ద, స్వరస్థానాలు కలిగిన ఇంకొక ప్రఖ్యాత రాగం ఉంది. ఐతే అది ఈ మూడు రాగాల్లాగా ఉండదు. అంతే కాదు, కర్నాటక సంగీతంలోనే కాక హిందుస్తానీ సంగీతంలోనూ, ఇంకా అనేక ప్రపంచ దేశాల సంప్రదాయ సంగీతాల్లోనూ తనకొక ప్రత్యేకతని ఆపాదించుకున్న రాగం ఇది. అదే మోహన రాగం.

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా

ఇప్పటిదాకా చలికాలమని చెప్పి హాయిగా వెచ్చగా ముడుచుకుని బజ్జున్న నా మూడు బ్లాగులకీ మేలుకొలుపు పాడుతున్నా.

విన్నవీ కన్నవీ
నా ముఖ్య అభిరుచులైన సంగీతం సాహిత్యం చలనచిత్రాల గురించి నాకు తోచిన ముచ్చట్లు చెప్పుకోడానికి పెట్టుకున్న బ్లాగిది. సినిమాల మీది రచనలన్నీ నవతరంగానికీ, సాహిత్యమ్మీద రచనలన్నీ పుస్తకానికీ పోగా ఇక దీనికి మిగిలేది సంగీతమొక్కటేనేమో! ఐనా వారానికి కనీసం ఒక కొత్త టపాతో మీకు కనుల విందు, వీలైతే వీనుల విందు చేస్తుందిది. సందర్భోచితంగా, కర్నాటక సంగీతంలోని మేలుకొలుపు రాగాల ప్రస్తావనతో తిరిగి మేల్కొందివ్వాళ్ళ.

సాంప్రదాయ తెలుగు పద్య సాహిత్యం
సాంప్రదాయ తెలుగు పద్య సాహిత్యం తెలుగు వారికి పూర్వికులిచ్చి పోయిన తరగని ఆస్తి అని నా నమ్మకం. దురదృష్ట వశాత్తూ, ప్రపంచంలోని ఏ జాతి ప్రజలూ చెయ్యని రీతిలో మనం ఈ ఆస్తిని నిర్లక్ష్యం చేసి దుర్వినియోగం చేసుకుంటున్నాము. పద్యమంటే భయం, ఆ పద్యాల్లోని భాష అంటే భయం, హబ్బే మాకు తెలుగు రాదు అని కంగారు పడే ఆర్కుట్ తరానికి, ఆంగ్లానువాదంతో కొన్ని తెలుగు పద్యకావ్యాల్లోని ఆణిముత్యాల్ని పరిచయం చెయ్యాలని ఈ బ్లాగు ప్రారంభించాను. ఆంధ్రభోజుడు, సాహితీసమరాంగణ సార్వభౌముడు, శ్రీకృష్ణదేవరాయ భూపాలుడు రచించిన ఆముక్తమాల్యద ప్రబంధము నుండి మంగళకైశికి యనే మాలదాసరి కథని రాస్తూ ఉండగా విరామం వచ్చింది. ఆ కథని కొనసాగిస్తున్నాను. ఇది ఇంకొక్క సంచ్కతో గోదాకళ్యాణ మహోత్సవంతో ముగుస్తుంది. అటుపైన ఇంకో తెలుగు కావ్యంనుండి ఇంకో రసగుళిక.

ప్రతిబింబం
రోజుకో కొత్త బొమ్మ.

Monday, April 6, 2009

కబుర్లు - ఏప్రిల్ 6

"చూచు వారలకు చూడ ముచ్చటగ"

మొన్న మా స్థానిక దేవాలయంలో సీతారాముల కళ్యాణం జరిపిస్తూ, జీలకర్రా బెల్లం తంతు పూర్తికాగానే శాస్త్రిగారు దీనితో సీతారాములు దంపతులైనట్టు మైకులో ప్రకటించారు. వెంటనే హాల్లో ఉన్న భక్తులందరూ చప్పట్లు కొట్టి తమ హర్షామోదాల్ని తెలియజేశారు.

నాకిది భలే ఆశ్చర్యమనిపించింది.

దీన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇటువంటిదే ఇంకొక సందర్భం గుర్తొచ్చింది. సుమారు ఐదేళ్ళ క్రితం చికడపల్లి త్యాగరాజ గానసభలో ఒక డాన్సు స్కూలు వారి వార్షికోత్సవం చూడ్డానికి వెళ్ళాను. సీతాకళ్యాణం ఆ రోజు ముఖ్య ప్రదర్శన. పది నించీ పద్ధెనిమిది మధ్య వయసున్న పిల్లలు, చక్కటి కాస్ట్యూములు, మేకప్ తో, చాలా బాగా ప్రదర్శించారు. రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞ రక్షణలో తాటకనీ సుబాహుణ్ణీ వధించి మారీచుణ్ణి పారదోలడం, ఉరుములు మెరుపుల స్పెషలెఫెక్ట్సూ .. అంతా మంచి హంగామాగా జరిపించారు. ఎట్టకేలకి యజ్ఞం ముగిసి విశ్వామిత్రుడు రామలక్ష్మణులని వెంట బెట్టుకుని మిథిలా నగరానికి చేరుకున్నాడు.

సీతా స్వయంవరం జరుగుతోంది. అప్పటికప్పుడే జనక మహారాజు కొలువు తీరి ఉన్నాడు. గొప్ప గొప్ప రాజులంతా ఉన్నారు సభలో. ఈ శివధనువుని ఎక్కుబెట్టిన వాన్ని నా కూతురు సీత వరిస్తుందని జనకుడు ప్రకటించాడు. (అది ఉత్తుత్తి విల్లే, భరతనాట్యం కదా, ప్రాపులుండవు, అంతా అభినయమే!) రాజాధిరాజులు, తేజ ప్రతాపులు, మీసాలు దువ్వుతూ, తొడలు చరుస్తూ లేచి వెళ్తున్నారు. భంగపడి తిరిగి వస్తున్నారు. అందరి పనీ అయ్యింది. ముని కనుసైగ తెలిసి దశరథసూనుడు మదనవిరోధి శరాసనాన్ని సమీపిస్తున్నాడు. పాలబుగ్గల వాడు .. ఇంకా పసితనపు ఛాయలు వీడనే లేదు .. మహామహా బాహుబలులే ఎత్తలేని శివధనువుని ఇతను ఎత్తగలడా? ప్రేక్షకులలో ఉత్కంఠ! ధనువుని చేరుకున్నాడు. వొంగి పట్టుకున్నాడు. అవలీలగా పైకెత్తాడు. ఒక్క ఉదుటున వంచి నారి బిగించ బోయాడు. ఫెళ్ళుమనె విల్లు .. .. (అంతా ఏక్షనే, చెప్పానుగా అక్కడ నిజంగా విల్లు లేదు). అంతే, ప్రేక్షకులంధరూ లేచి నించుని మరీ రెండు నిమిషాల పాటు ఆపకుండ చప్పట్లు కొట్టి వాళ్ళ మోదాన్నీ, ఆమోదాన్నీ ప్రకటించారు.

ఇదేమైనా తెలియని విషయమా? భూమి పుట్టినప్పటినించీ ఎన్నో రామాయణాలు జరిగాయి. ప్రతి రామాయణంలోనూ రాముడే శివధనువు విరిచాడు గదా! ఎప్పుడూ సీత రాముణ్ణే వరించింది గదా! పోనీ ఇంకో రాజెవరన్నా ఆ విల్లు ఎక్కుపెట్టడం గానీ, రాముడు చెయ్యలేక పోవడం గానీ ఏ రామాయణంలోనూ జరగలేదు గదా! ఇందులో మనకి తెలియని సస్పెన్సు గానీ, సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడు సైతం ఎదురు చూడని లాస్ట్ మినిట్ ట్విస్టుగానీ ఏమీ లేదే! మరి ఆ దృశ్యంలో ఎందుకు ప్రేక్షకుల్లో అంత ఆనందాతిశయం?

వాల్మీకి సామాన్యుడు కాదు సుమా. సీత చేతిని రాముడి చేతులో పెట్టి పాణిగ్రహణం చేయిస్తూన్న జనకమహారాజు నోట ఒక గొప్ప శ్లోకం చెప్పిస్తాడు ..
"ఇయం సీతా మమసుతా సహధర్మచరీ తవ"

"రామచంద్రా, ఈమె ఎవరో కాదు, సీత. మీరు ఆది దంపతులు. లోకకళ్యాణార్ధం ఇలా ఈ మానవ జన్మ ఎత్తడానికి తాత్కాలికంగా విడివడినారు, అంతే. నీలో సగభాగమైన ఈ సీతను నీకు చేర్చి నా వంతు పాత్రని నిర్వర్తిస్తున్నాను. ఈమె పాణిని గ్రహించి లోకకళ్యాణం కావించు రామా!"
(ఒక మిత్రులు చెప్పారు, సంస్కృతంలో మహాపండితులైన వారి తాతగారు వాల్మీకి రామాయణం పురాణం చెబుతూ కేవలం ఈ ఒక్క శ్లోకాన్ని గురించి మూడు రోజులు చెప్పేవారట.)

అదీ జరిగిన విషయం. అదేదో తమ కళ్ళ ముందు జరగడం .. ఆ హాల్లో ప్రేక్షకుల ఆనందానికీ, గుడిలో భక్తుల ఆనందానికీ అదీ కారణం.

సీతా కళ్యాణ వైభోగమే!

Thursday, April 2, 2009

చల్తీకానాం గాడీ .. ఎగ్జాం కా నాం సప్ప్లీ

నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజిలో పాఠాలు చెబుతున్న రోజుల్లో (1,2) అప్పుడప్పుడే వీసీఆర్లు, విడియో కేసెట్లు అద్దెకివ్వడం అదొక వ్యాపారంగా మొదలవుతోంది. బాపట్లకంతకీ అప్పటికి ఒక్క షాపు కూడా లేదు. కాస్త స్థితిపరులు, పెద్ద ఉద్యోగస్తులు (అంటే ఏజీ కాలేజి ఆచార్యులు, ఇంజనీరింగ్ కాలేజి ఆచార్యులు, బేంకాఫీసర్లు, ఇత్యాదులు) వాళ్ళ ఇళ్ళల్లో కలర్ టీవీలు మాత్రం ఉండేవి. ఐతే దూరదర్శన్ ఒకటే దిక్కు.

కాలేజీలో ఉద్యోగంలో చేరిన కొత్తల్లోనే, అంటే ఇంకా నెల కూడా కాలేదు, కాలేజి గేటు బయట పాకషాపులో టీతాగుతుంటే ఒక కుర్రాడొచ్చి నమస్కారం పెట్టాడు. చూడ్డానికి స్టైలుగా, కళాశాల విద్యార్ధిలాగా ఉన్నాడు, కానీ నేను పాఠం చెప్పే క్లాసుల్లో కుర్రవాడైతే కాదు. తనని తాను పరిచయం చేసుకున్నాడు. మీతో పనుంది సార్, మీ ఇల్లెక్కడో చెప్పండి అన్నాడు. చెప్పొద్దూ, నాక్కొంచెం భయమేసింది. ఏంట్రా వీడు ఉపోద్ఘాతం ఏమీ లేకుండా డైరెక్టుగా ఇంటికొస్తానంటున్నాడూ అని. ఐనా వాడు నా సైజులో సగం కూడా లేడు, పర్లేదని ధైర్యం తెచ్చుకుని, అసలు సంగతేంటో చెప్పు అన్నా. మనోడు ఆల్రెడీ ఒకటికి మూడు సార్లు మొదటి సంవత్సరపు ఇంజనీరింగ్ డ్రాయింగ్ పరీక్ష డింకీ కొట్టాడు. అయ్యగారు అసలుకి మూడో సంవత్సరం మొదలు బెట్టవలసింది, డ్రాయింగ్ సప్ప్లీ మిగిలిపోవడంతో చతికిలబడ్డాడు. నాతో వచ్చిన రాచకార్యమేంటంటే .. మీరు గ్రహించేశారు .. నేనా సబ్జక్టు ట్యూషను చెప్పాలి.

అదేంటోయ్, పెద్ద మేష్టార్లనెవర్నన్నా అడగొచ్చు కదా అన్నా. లేద్సార్, భయం సార్, ఐనా వాళ్ళు చెప్పరు అన్నాడు. పైగా ఇంకో మాటన్నాడు .. మొదటేడు మరి వాళ్ళే చెప్పారు సార్, అందుకనే ఫెయిలైనా అన్నాడు. ఇంకేం చెప్తాం? అవునోయ్, నేను ఫస్టియరోళ్ళకి డ్రాయింగ్ క్లాసు తీసుకుంటున్నా గానీ, లెక్కప్రకారం అది ఒక సీనియర్ లెక్చరర్కి సహాయకుడిగా మాత్రమే. అంచేత నేను డైరక్టుగా డ్రాయింగ్ పాథం చెప్పింది లేదు. మరి నేను అంతకంటే బాగా చెబుతానని నీకెందు కనిపించింది అన్నా? లేద్సార్, నేను కనుకున్నాన్సార్, మీరు బాగ చెప్తారంట సార్ .. అని సమాధానం.

సరే, ఇంక చేసేదేవుంది? ఎట్టాగూ మధ్యాన్నం నిద్ర లేచిన దగ్గర్నించీ ఫస్టుషో మొదలయ్యేదాకా బోరు కొడుతూనే ఉంది, వీళ్ళతో కాసేపు కాలక్షేపం అవుతుందని మూడింటికి రమ్మన్నా.

వాడు నిజంగా అసాధ్యుడు. మధ్యాన్నం తనతోబాటు ఇంకో నలుగుర్ని వేసుకొచ్చాడు. వాళ్ళల్లో ముగ్గురు ఇంకా ఫస్టియరు వాళ్ళే, కాకపోతే నా సెక్షను వాళ్ళు కాదు. ఓరి మీ దుంపల్తెగ, సప్ప్లీ కేండేట్లంటే అనుకోవచ్చు, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళెవరూ లేరు. మీకేం పోయేకాలం? అన్నా. లేద్సార్, ఆ సార్ చెప్పేది అర్ధం కావట్లేదు, మీరెట్టన్నా హెల్ప్ చెయ్యాల్సార్. మీ సీనియర్ మాస్టారికి తెలిస్తే డిపార్టుమెంట్లో నా పరువు దక్కదురా బాబూ అన్నా. అబ్బే, మెమెందుకు చెప్తాం సార్, మూడో కంటి వాడికి తెలీదు అని హామీ ఇచ్చారు. వాళ్ళ పిచ్చి గానీ, బాపట్ల లాంటి వూళ్ళో, ఇట్లాంటివి దాచడం కుదురుతుందని ఎలా అనుకున్నారో అసలు. మొత్తానికి వాళ్ళు క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు డ్రాయింగ్ ట్యూషను కి రావడం మొదలెట్టారు. కానీ వాళ్ళ సీనియర్ మాస్టర్ నించి నాకేం ప్రాబ్లం రాలేదు, దేవుడి దయవల్ల.

వీళ్ళతో మంచి కాలక్షేపం అవుతూ ఉండేది. చూస్తుండగానే సప్ప్లీ పరిక్షలు దగ్గరకొచ్చినై. అందుకని ఆ ఆదివారం ఇంటికి విజయవాడెళ్ళడం మానేసి నాగప్రసాదునీ వాడి తోటి సప్ప్లీ కేండేటూనీ సాయంత్రం రమ్మన్నా, ఇంకో రెండు గంటలు రుబ్బుదామని. వాళ్ళోచ్చి కూర్చున్నారు, పాఠం మొదలు పెడుతుండగా, ఎక్కణ్ణించో లీలగా .. ఒక పాట వినవచ్చింది .. బాజూ ఊఊఊఊ .. బాబూ సంఝో ఇషారే, హారన్ పుకారే .. హమ్మ్ చల్తీ కా నాం గాడీ సినిమాలో మొదటి దృశ్యంలో పాట. హఠాత్తుగా బుర్రలో లైటు వెలిగింది. అంతకు ముందువారంలో గొప్ప గాయకనటుడు, నటగాయకుడు, కిషోర్ కుమార్ పరమపదించాడు! ఆయన గౌరవార్ధం ఈ ఆదివారం దూరదర్శన్లో ముందు ప్రకటించిన ఏదో చెత్త హిందీ సినిమాకి బదులు ఈ చిత్రరాజాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఈ జ్ఞానోదయం కావడమేవిటి, క్షణంలో డ్రాయింగ్ పుస్తకాలు బంద్, ఉత్తర క్షణంలో సైకిలు మీదున్నా. నాగప్రసాద్ దీనంగా సార్! రేపు సప్ప్లీ అన్నాడు. ఓరి వెర్రి నాయనా, రేపు సప్ప్లీ పోతే మార్చిలో ఇంకో సప్ప్లీ వస్తుంది. ఇప్పుడు చల్తీకానాం గాడీ వొదులుకుంటే మళ్ళీ ఎప్పటికి దొరికేను! చలో ఆఫీసర్సు క్లబ్బుకి అని సైకిలు దౌడాయించాను. తనవెంటన్ సిరి లచ్చి వెంటన్ టైపులో .. నా వెనకనే నారూమ్మేటూ, మరియూ స్టూడెంట్లిద్దరూనూ. మేం నిజంగా ఆఫీసర్లం కాకపోయినా, నేనూ నా రూమ్మేటూ బ్రిడ్జి బాగా ఆడేవాళ్ళం, అందుకని క్లబ్బుకి రానిచ్చేవారు. సుమారు తొమ్మిది దాకా సినిమా చూసి ఆనందించాము. కానీ అది మరీ పొడుగాటి సినిమా కావడంతో వార్తలు ఇట్లాంటి చెత్త కోసం సినిమా ఆపేశాడు. క్లబ్బు కట్టేస్తున్నారు. మాకూ ఆకళ్ళేస్తున్నాయి. మెస్సుకి పోయి తినాలి. అంత రాత్రి పూటా ఎక్కడీకెళ్తాం టీవీ కోసం. అలా కింకర్తవ్య విమూఢతలోనే భోజనం పూర్తి చేశాం. నా దిగాలు మొహం చూసి నాగప్రసాద్ ఏదో నిశ్చయానికొచ్చిన వాడిలా మాతో రండి సార్ అని తను అద్దెకున్న ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు ఒక ఏజీకాలేజి ఆచార్యుల ఇంటో అద్దెకున్నారు. వెళ్ళి వాళ్ళ ఓనర్ని అడిగి పర్మిషన్ సంపాయించి నాకూ నా రూమ్మేటుకీ మిగిలిన సినిమా చూసే అవకాశం కల్పించాడు. తరవాత తెల్సిన విషయం .. తను వారింట్లో అద్దెకున్న ఇన్ని నెలల్లోనూ ఎప్పుడూ టీవీచూస్తానని వారిని అడగలేదుట! అలా నా గురుదక్షిణ ఇచ్చుకున్నాడు నాగప్రసాద్.

ఇంతకీ డ్రాయింగ్ సప్ప్లీ పాసయ్యాడో లేదో!