Monday, March 30, 2009

కబుర్లు - మార్చి 30

ఇందాక రేడియోలో విన్నా .. ఏకాంత కారావాస శిక్ష (Solitary Confinement) నేరస్తులకి పిచ్చెక్కిస్తోందని ఒక పరిశోధనలో కనుగొన్నారని. ఈ పరిశోధన గురింఛి రాసిన వైద్యుని పేరు, అతుల్ గవాండే అని విని అరె, ఇదేదో భారతీయ పేర్లా ఉందే అనుకున్నా. ఇతగాని విద్యా వైజ్ఞానిక ప్రతిభాపాటవాలు అచ్చెరువు గొలుపుతున్నాయి. భారతీయ అమెరికను వైద్యుల్లో వైద్యమే కాక ఇతరత్రా ప్రతిభ కలిగుండడం డా. గుప్తాగారి గుత్తం కాదన్నమాట. సంతోషమే!

అదలా ఉండగా కాసేపు ఆలోచన అసలీ నేరమూ శిక్షా (Crime and Punishment) అనే ప్రాథమిక ఆలోచన మీదికి తిరిగింది. మొదట అసలెవరు నిశ్చయించారో ఫలానా పని చెయ్యడం నేరం, ఈ పని చేసినవారిని శిక్షించాలి అని. అలాగే చెరలో పెట్టడం కూడా. పురాణాలు వాటిల్లో సంగతి నాకు తెలియదు గానీ కౌటిల్యుని అర్ధశాస్త్రంలో కొన్ని భయంకరమైన శిక్షల గురించి చెప్తాడు. రాచరికం ఉన్న రోజుల్లో రాజద్రోహం మిగుల సహించరాని నేరంగా ఉంటుండేది. దానికి శిక్షలు కూడా అతి బీభత్సంగా ఉంటుండేవి. మానవ లోకంలో జరిగే నేరాలూ, వాటికి మానవులు వేసే శిక్షలూ సరిపోక, పాపాల్నీ, వాటికి శిక్షగా నరకాల్ని (ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా ఏడో పధ్నాలుగో ఉన్నాయి!) సృష్టించుకున్నాడు మనిషి. వీడికి ఎక్కడా ఏ కోశానా సుఖపడాలనే ఉద్దేశం ఉన్నట్టు లేదు చూస్తే. అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటా, ఏదన్నా ఇతరగ్రహ వాసులొచ్చి మన మతాల్ని (అన్నిటినీ) గనక స్టడీ చేస్తే ఇదే అనుకుంటారు.

ఫ్రెంచి నవలాకారుడు డ్యూమా రాసిన కౌంటాఫ్ మాంటెక్రిస్టో నవల్లో ఫ్రెంచి దేశస్తుడైన కథానాయకుడు ఒకచోట .. హబ్బే మనవేం శిక్షలూ! శిక్షలంటే ప్రాచ్య దేశాల వాళ్ళని చెప్పుకోవాలి. చైనా, ఇండియా, అరేబియా లాంటి దేశాల్లో వేసే శిక్షలుంటాయి చూస్కోండి, నా సామి రంగ, శిక్ష అమలవుతుండగా చూడ్డందాకా ఎందుకు, అసలు దాని వర్ణన వింటేనే మీకు కడూపులో తిప్పి కాళ్ళొణుకుతాయి .. అంటాడు. రష్యను నవలాకారుడు దోస్తోయెవ్‌స్కీ నేరమూ శిక్షా (Crime and Punishment) అని ఏకంగా ఒక నవలే రాసి పారేశ్శాడు, చదివారా ఎవరన్నా?

మిగతా శిక్షలన్నీ మాయమయ్యి, పిడుక్కీ బిచ్చానికీ ఒకటే మంత్రం లాగా, ఏ నేరానికైనా జెయిలే శిక్షగా ఎప్పుడు తయారైందో? బహుశా శిక్షలు కూడా మానవీయంగా ఉండాలనే ఉదాత్తమైన ఆలోచనలోంచి ఈ అవిడియా పుట్టిందేమో? అమెరికాలో జెయిళ్ళని కరెక్షనల్ ఫెసిలిటీ అంటారు. జెయిలుకెళ్ళినవాడు తదనుభవం ద్వారా తన దుష్టబుద్ధి మానుకుని బాగుపడి చెచ్చేట్టు. మానవీయ జెయిళ్ళ గురించి మనవాడు నాగేష్ కుకునూర్ తీన్ దీవారే అని మంచి సినిమా తీశాడు.

ఏదేమైనా, ఈ నేరమూ శిక్షా కాన్సెప్టు కొంచెం ఆలోచించాల్సిందే.

ఏవిటో ఒక ఆలోచన వెంట ఇంకొకటి తరుముకొచ్చి ఈ కబుర్లంతా కొంచెం బీభత్స ప్రధాన దృశ్యంగా తయారైంది. క్షమించాలి. ఇదొక్కటే కాదు నేను చెప్పాలనుకున్న కబుర్లు ఇంకా ఉన్నాయ్.

మొదటి విడత ఎన్నికల రోజుకి సంబంధించి నామినేషన్లు ముగియబోతున్న సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు బాగా ఊపందుకున్నాయి. వేడికోళ్ళు, పడిగాపులు, విజయగర్వాలు, భగ్న హృదయాలు, బావురుమని ఏడుపులు, ఉన్మాద ప్రేలాపనలు, విలయ తాండవాలు .. ఓహ్, పేపరు ఏ పేజీ తీసినా నవరసభరితంగా .. ఇక్కడ మా వూళ్ళో పార్టీకి వెళ్ళినా అక్కడి పార్టీల గోలే! మధ్యలో పాపం బుడ్డోడికి కారు ప్రమాదం .. గత యెన్నికల్లో వుట్టి పుణ్యానికి అన్యాయంగా సౌందర్య ప్రాణాలు కోల్పోయింది. వాడి సుడి బావుంది .. బుడ్డోడు స్వల్ప గాయాల్తో బయట పడినట్టే. ఆ యాక్సిడెంటు వివరాలు తెలిసిన ఒక డాక్టరుగారు నిన్న ఇక్కడ చెబుతున్నారు, కొంచెం అటూ ఇటూ అయుంటే శరీరం మొత్తం పక్షవాతం వచ్చుండేదట.

అవునూ యెన్నికలంటే గుర్తొచ్చింది, మన బ్లాగ్సోదరులు భావకుడన్ గారు తన అభిమాన పార్టీ తన అంచనాలకి దిగజారితే ఎలా అని క్షణికంగా బెంబేలు పడి మళ్ళీ ఎలా సర్దుకున్నారో ఇక్కడ చూడండి. పనిలో పనిగా విరోధి నామ సంవత్సర రాశిఫలాల్ని గురించి బరాకేశుడేదో మంత్రోపదేశం చేస్తున్నాడు .. ఓ లుక్కెయ్యండి. ఆంధ్రామృతం రామకృష్ణరావుగారు రాశి ఫలాల్ని తేటతెలుగు పద్యాల్లో పొదిగిన తీరునీ గమనించండి. అదే దారిన వెళ్ళి మన బ్లాగాస్థాన చమత్కార శిరోమణి విరోధికి స్వాగతమిచ్చే సొగసు తిలకించండి. సరే పొద్దులో వెల్లి విరుస్తున్న కవితా సంబరాలు సరే సరి. మిగతాదంతా ఏమోగాని, కవులకీ పద్యాలకీ ఈ కొత్త సంవత్సరం బాగా వృద్ధిదాయకంగా ఉన్నట్టు కనిపిస్తోంది!

తుదిపలుకు
బాస్కెటు బాలు గేము చూసి పరవశించే బాస్కెటు కేసులారా! శనివారం రాత్రి ఎవరన్నా విల్లనోవా పిట్సుబర్గ్ గేం చూశారా? మీ వేళ్ళకి గోళ్ళు మిగిలున్నాయా?

Thursday, March 26, 2009

అప్పుడేం చేస్తారు - 2

అసలు విషయంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పిట్ట కథ.

సాంప్రదాయికంగానే కాక, నిజ్జంగా, భౌతికంగా గూడా వసంతం వచ్చేసిందోచ్.
పోయిన శుక్రవారం నాడు వెర్నల్ ఈక్వినాక్స్. ఏంటో ఆ సంగతి మరిచే పోయాను. దానికి తోడు మొన్న సోంవారం కబుర్లు కూడా రాయలేదు. తీరా వరాసగా నాలుగు రోజుల పాటు బయట ఉష్ణోగ్రత నలభైలు యాభైలతో బంతులాడుతుంటే, ఎందుకబ్బా ఇంత తుళ్ళింత అని వింత పడుతుంటే హఠాత్తుగా వెలిగింది. అమెరికాలో సాంప్రదాయికంగా మార్చి 21 నించీ వసంతం ప్రవేశించినట్టే. అయినా మిషిగన్‌లో ఈ కబుర్లు నమ్మే వీల్లేదు, ప్రత్యక్ష తార్కాణం లేకుండా.

అసలింత ముఖ్యమైన రోజుని ఎట్లా మర్చిపోయానబ్బా అనుకున్నా. మొన్నెప్పుడో ఈ బ్లాగులో ఫలాని రోజున ఫలాని పూర్ణిమ అని రాస్తే, ఎవరో వ్యాఖ్యాత కామెంటారు .. అమెరికాలో ఉన్నా ఇవన్నీ ఎలా గుర్తు పెట్టుకుంటున్నారో అని. ఏం, అమెరికాలో ఉంటే చంద్రుడు కనబడ్డా, పున్నమి రాదా? నగరీకరణ ఒక్కటే కాదు, ఇదే, ఈ పట్టించుకోక పోవడంతో కూడా మనం ప్రకృతికి దూరమైపోతున్నాం. ప్రాచీనమైన నాగరికతలన్నీ ఈ ప్రాకృతిక, ఖగోళ సంఘటనలకి ప్రత్యేకత కల్పించాయి. అవే మన పండుగలయ్యాయి. ఉదాహరణకి చూడండి, భారద్దేశంలో హోలీతో మొదలెట్టి విషు వరకూ ఎన్ని వసంతోత్సవాలో!

ఏదేమైనా, మొత్తానికి వసంతం వచ్చేసినట్టే. (ఈ తరవాత కూడా మీ వూళ్ళో మంచు పడితే నా పూచీ ఏమీ లేదు!)

పోయిన గురువారం "అప్పుడేం చేస్తారు" టపాకి మంచి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు వచ్చాయి. కానీ స్పందించిన వారిలో చాలా చాలా కొద్ది మంది మాత్రమే నేనడిగిన ప్రశ్నలోని పూర్తి సారాన్ని గ్రహించ గలిగారు. ఆ స్థితిని అనుభవించామని చెప్పిన నాగప్రసాద్, జీడిపప్పుగార్లు కూడా సమస్యని సీరియస్ గా తీసుకున్నట్టు కనబళ్ళేదు. పెళ్ళైన స్త్రీలకి ఈ పరిస్థితి కొంతకాలమైనా అనుభవమయ్యి ఉంటుందేమో ననుకున్నాను. ఇదేమీ సెక్సిస్టు బయాస్ స్టేట్మెంటు కాదు, కంగారు పడకండి. అమ్మాయి ఏం చదువులు చదువుకున్నా, పెళ్ళంటూ అయ్యాక, కనీసం ప్రస్తుతానికి మన సమాజంలో ఇంకా మొగుడి ఉద్యోగమే ప్రధానోద్యోగం కాబట్టి, దానికి తగిన మార్పులు జరుగుతున్న సమయంలో స్త్రీ ఉద్యోగం చెయ్యని పరిస్థితిలో ఉంటుంది కదా. ఆ కబుర్లేవీ వినబడక పోవడం నాక్కొంచెం ఆశ్చర్యం కలిగించింది. సరే, అది పక్కన పెట్టండి.

ఇప్పుడు రాయబోయే మాటల్తో నేను ఎవరి ఆశయాలనూ, అభిరుచులనూ, నిజాయితీనీ పరిశీలనకి పెట్టడం లేదనీ, శంకించడంలేదనీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. దయచేసి కొంచెం ఆవేశపడకుండా చదవండి.

ఇక్కడ వ్యాఖ్యలు రాసిన అందరూ, బహు కొద్దిమంది తప్ప, ఈ సమస్యని శలవల్లో ఏం చేస్తాము అన్నట్టుగా చూసినట్టే కనిపిస్తోంది నాకు. హాబీల మీద ఇప్పుడు వెచ్చిస్తున్న దానికంటే ఎక్కువ సమయం వెచ్చించ గలరేమో గానీ అదే మాత్రం పూర్తి సమయం పాటు చెయ్యలేరు. ఎన్ని వేరు వేరు హాబీలు పెట్టుకున్నా సరే. ఫ్రీలాన్సుగా దేశోద్ధరణ పనులు, లేదా ఇంకేవో పనులు చేస్తామనుకుంటే, వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోవద్దూ?

ఈ ప్రశ్నల్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం.
ముందుగా ఫ్రీలాన్సు పని. మనవల్ల ఆ సంస్థకో ప్రాజెక్టుకో నిజంగా ఏదన్నా ప్రయోజనం జరగాలి అంటే మనం కొంత నిర్దిష్టమైన సమయాన్ని, రోజుకింతనో, వారానికింతనో, నిక్కచ్చిగా కమిటవ్వాలి, ఔనా? అంటే, అది మళ్ళీ ఉద్యోగంలాగా ఉన్నట్టే కాదూ? పోనీ మనిష్టం వచ్చిన సమయానికి హాజరవుతామంటే, వాళ్ళు ఒప్పుకోవద్దూ?

ఇక హాబీల సంగతి. ఉదాహరణగా నన్నే తీసుకోండి. నేను నాట్యం నేర్చుకుంటాను. నాట్యం చెయ్యడమంటే నాకు చాలా ఇష్టం, అందులో ఏమీ సందేహం లేదు. క్లాసుకి వెళ్తాను. గురువుగారు కొత్త పాఠం చెబుతారు. అది సాధన చెయ్యాలి. రొజంతా చెయ్యడం ఎలాగూ సాధ్యం కాదు గానీ రోజులో కొంత సేపయినా సాధన చెయ్యాలి. అంటే కోంత క్రమశిక్షణ కావాలి. ఈ క్రమశిక్షణ ఎలా వస్తుంది, ఎందుకొస్తుంది? నేనిది సాధన చేసి నేర్చుకుంటే నాకీ కీర్తన మొత్తం నాట్యం చెయ్యడం వచ్చు అనే తృప్తి ఒకటి ఉంటుంది. ఏదైనా కార్యక్రమం జరిగితే అందులో నేనీ నాట్యం ప్రదర్శించొచ్చు. నా మిత్రులకి చేసి చూపించొచ్చు. సాధన చేసేందుకు అవసరమైన క్రమశిక్షణకి పునాది ఈ తృప్తి అనే ప్రోత్సాహకం .. ఇది నా మోటివేషన్. ఇప్పుడు నేను నాట్యం చేస్తే ఏమి, చెయ్యక పోతే ఏమి? ఆల్రెడీ కొంతకాలంగా ఆ గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నాను గనక, ఇహ నేను చెయ్యనండి అంటే ఆ గురువుగారు కొంచెం బాధ పడతారు. నన్ను బాగా తెలిసిన కొద్దిమంది బంధు మిత్రులు అయ్యో అదేమీ, బాగా చేసేవారు గదా అని కొద్దిగా విచారం వెలిబుచ్చుతారు. అంతేగానీ ఏ అత్యవసరమైన పరిణామాలు జరగకుండా ఆగిపోవడంలేదు. అంటే, ఈ తృప్తి నాకు కావాలి అనే అవసరం నాలోపలినించి రావాలి.

అవసరం - ప్రోత్సాహకం - క్రమశిక్షణ.
Need - Motivation - Discipline

ఈ మూడూ కావాలి ఏ పని సంపూర్ణంగా, విజయవంతంగా చెయ్యాలన్నా. ఉద్యోగంలో వ్యాపారంలో మనం చేసే పనులన్నిటికీ డబ్బు సంపాదన, కుటుంబపోషణ అనే లక్ష్యాలు ఈ మూడిటినీ కల్పిస్తాయి. శలవరోజుల్లో, ఇతర ఖాలీ సమయాల్లో మనం చేపట్టే హాబీల విషయంలో కూడా .. అరే, ఈ అవకాశం ఉపయోగించుకోకపోతే మళ్ళీ ఎప్పటికో అనే ఒక తొందర, ఉద్యోగానికి సంబంధించిన ఒక తొందర మనతో ఆ పెయింటింగ్ నో, ఆ మ్యూజిక్ విడియో రీమిక్సింగ్ నో పూర్తి చేయిస్తుంది, గమనించండి. రేపు, లేక వచ్చే సోంవారం మళ్ళీ ఆఫీసుకి వెళ్ళిపోవాలి అనే తొందర లేకుంటే, మీరివ్వాళ్ళ రాత్రి మూడింటి దాకా కూర్చుని ఆ నవల చదవడం పూర్తి చేస్తారా?

మరి ఏ బయటి వత్తిడి, ఏ ఎదురుచూపు లేనప్పుడు ఆ అవసరం ఎక్కణ్ణించి వస్తుంది?

అందరికీ విరోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Thursday, March 19, 2009

అప్పుడేం చేస్తారు?

జీతం కోసం ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదనుకోండి, మీరేంచేస్తారు?

ఒకసారి ఈ పరిస్థితిని ఊహించుకోండి.
మీ ప్రస్తుత జీవితంలో మిగతా విషయాలన్నీ అలాగే ఉంటాయి మారకుండా. ఇప్పుడు మీకొస్తున్న జీతం (పోనీ స్వంత వ్యాపారం ఉన్నవారైతే, దాని ద్వారా మీకొచ్చే సంపాదన) రెండు వారాలకోసారో, నెలకోసారో మీ బేంకెకౌంటులో జమయిపోతోంది. పొద్దున్నే లేవంగానే హమ్మో ఆ ప్రాజెక్టు ఏ స్థితిలో ఉందో, ఇవ్వాళ్ళ ఎనిమిదింటికల్లా బాసుకి రిపోర్టు ఇవ్వాలి, లేకపోతే పది గంటలకి విదేశీ క్లయంట్లతో విడియో కాన్ఫరెన్సుంది, హబ్బ ఈ ట్రాఫిక్కులో పడి గంట సేపు కొట్టుకోవాలి .. ఇలాంటి వత్తిళ్ళు ఏమీ లేవు.
ఇలాంటి పరిస్థితిలో మీ సమయంతో మీరేం చేస్తారు?

ఊహ తెలిసిన నాటి నుండీ మన జీవితం ఏదో ముందే నిర్దేశించిన మార్గంలో నడిచిపోతున్నట్టే ఉంటుంది. ఏదో ఎక్కడో ఒకటీ అరా తప్పించి, మనం చేసే ప్రతీపనీ, వేసే ప్రతీ అడుగూ ఒక మంచి ఉద్యోగం సంపాయించుకోడానికే. ఎందుకంటే? మంచి ఉద్యోగం వస్తే, తగినంత జీతం వస్తుంది. జీవితం సుఖంగా ఉంటుంది. తగినంత జీవితం అంటే? జీవితం సుఖంగా ఉండటం అంటే?

నా మట్టుకి నాకు ఎంత సంపాదన ఉన్నా, రోజులో కొంచెం సేపయినా మంచి సంగీతం వినడమూ, పడుకోబోయే ముందు ఏదన్నా ఒక పుస్తకం చదువుకోవడమూ జరక్క పోతే మహా వెలితిగా ఉంటుంది. అలాగే కొందరికి తమ పిల్లలతో గడిపే సమయం విలువైనది కావచ్చు. ఇంకొకరికి వారి గోల్ఫు ఆట అదే తృప్తినివ్వచ్చు. ఒకేళ జీతం కోసం అఫీసుకి వెళ్ళాల్సిన అవసరం లేకపోతే రోజంతా ఇదే పని చేస్తూ కూర్చుంటామా? అసలు ఎవరైనా రోజంతా సంగీతం వినగలరా? మాంఛి సస్పెన్సు థ్రిల్లరైతే వొదిలి పెట్టకుండా ఇరవైనాలుగ్గంటలూ ఏకబిగిని చదివేస్తామేమో కానీ అదే పనిగా ప్రతీ రోజూ చెయ్యలేము కదా. అలాగే గాల్ఫయినా, పిల్లల్తో ఆడుకోవడమైనా, ఇంకేదైనా.

పిచ్చెక్కదూ?

జీతం కోసం ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదనుకోండి, మీరేంచేస్తారు?

Tuesday, March 17, 2009

కబుర్లు - మార్చి 17

ఏమానందము భూమీతలమున

పలికెడునవె పక్షులు బ్రాబలుకులొ
కల హైమవతీ విలసన్నూపుర
నినాదములకున్ అనుకరణంబులొ

కొమ్మల కానందోత్సాహమ్ములు
ముమ్మరముగ మనముల గదలించెనొ
తలనూచుచు గుత్తులు గుత్తులుగా
నిలరాల్చును బూవుల నికరమ్ములు

అంటూ మొదలుపెడతారు పుట్టపర్తి నారాయణాచార్యులుగారు తన శివతాండవ వర్ణనాలాపనను. అరవై మీరిన ఉష్ణోగ్రతలో మా వూరి భూమీతలము కూడా ఇలాగే పరవశిస్తోంది నిన్నా ఇవ్వాళ్ళా. ఇంకా గుత్తులు గుత్తులుగా పూవులు ఇలరాల్చే సన్నివేశం రాలేదు గానీ, తరువులన్నీ శీతాకాలపు ముసుగులు విదిల్చి కొత్త చివుళ్ళు తొడుగుతున్నాయి కచ్చితంగా. ఆ సంబరంలో క్షణం సేపూ నేనూ సొక్కి సోలి ఒక రోజు కబుర్లాలస్యమైనందుకు విజ్ఞులు క్షమించగలరు.

ఇహ ఇదే వింటర్కి వీడ్కోలు అని తనువులోని అణువణువు కోరుకుంటున్నా మనసులో ఏమూలో దాగిన డౌటింగ్ థామసొకడు మేనెల వచ్చేదాకా ఈ ఉత్సాహాన్ని కాస్థ అదుపులో ఉంచమని హిత బోధ చేస్తున్నాడు. House smearing, not festival!

నాకు యద్దనపూడి సులోచనారాణి నవల్లంటే చాలా ఇష్టం. అందులో నాకు అతిగా నచ్చిన నవల కీర్తి కిరీటాలు. తేజ అనే వాడు హీరో ఇందులో. తేజా వాళ్ళమ్మ గొప్ప గాయని. తన కెరీర్ కోసం తేజ వాళ్ళ నాన్ననీ, తేజానీ వొదిలేసి విదేశాలకి వెళ్ళిపోయి అక్కడ ఇంకో పెళ్ళి చేసుకుని బోలెడు డబ్బూ ఖ్యాతీ అవన్నీ సంపాయించుకుందావిడ. ఇక్కడ తేజా కూడా బాగానే పెద్దవాడయ్యాడు, తన సొంత వ్యాపారం నిర్వహించుకుంటున్నాడు, కానీ వాళ్ళమ్మని చాలా ఛాలా మిస్సయ్యాడు పాపం. ఎనీవే, ఇప్పుడు నవల కథంతా చెప్పలేను గానీ, క్లైమాక్సులో వాళ్ళమ్మ ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉందనీ, తను అక్కడే ఉన్నాడని తెలిసి తనని చూడాలని అడుగుతోందనీ తెలిసి .. తేజా ఏం చేశాడు? ఆ తల్లిని క్షమించాడా?

ఈ క్షమా గుణం ఒకటీ, త్యాగాలు ఒకటీ నాకస్సలు అర్ధం కావు. స్వార్ధం అనండి, ఇట్టే అర్ధమవుతుంది. స్వలాభం అనండి, కరతలామలకం. కానీ త్యాగం .. క్షమ ..? అందుకే నాకు మిస్సమ్మ పెంపుడు తలిదండ్రులు అర్ధం కాలేదు.

తేజాకి అన్నేళ్ళ పాటు, ఆ పసి వయసు నించీ, టీనేజి మీదుగా .. యుక్తవయసులోకి ఆ ప్రయాణంలో .. మా అమ్మ నేను వెళ్ళాలనుకున్నా సినిమాకి వెళ్ళద్దంటేనే నా గుండె రగిలి పోయేదే! తేజాకి ఎంత రగిలి పోయుండాలి, కడుపూ గుండే అన్నీనీ.. ఆ ఒక్క క్షణంలో వాడి మనసు మారి పోయిందంటే, క్షమించేశాడంటే .. ఎవడన్నా వెర్రి కుట్టె నమ్మాలి గానీ, నేను కాదు. రియలిజమంటే ఇలా ప్రాణం పెట్టే నేను .. నిజజీవితమే తిరగబడి నా అంచనాలని తారు మారు చేసేస్తే .. మనుషులు, మామూలు మనుషులే .. స్వభావ విరుద్ధంగా ప్రవర్తిస్తే?

జెన్నిఫర్ అనే తెల్ల అమ్మాయి. మనుషుల్లో నలుపు తెలుపు విభజన రేఖని స్పష్టంగా అమలు జరిపే భూభాగమైన ఉత్తర కెరలైనా రాష్ట్రంలో .. ఒక మగపశువు చేత బలాత్కారానికి గురైంది. పోలీసులు ఆమె యెదుట నిలబెట్టిన వరుసలోంచి రోనాల్డ్ అనే నల్లబ్బాయిని చూపించింది, వీడే నన్ను రేప్ చేసినవాడు అని, నిర్భయంగా, నిస్సంశయంగా. రోనాల్డ్ ఖైదుకి .. జెన్నిఫర్ చిరిగిన తన జీవితానికి .. దాన్ని మళ్ళి చిగురింప చేసుకోవడనికి ప్రయత్నిస్తూ.

పదకొండేళ్ళ తరవాత, కొత్తగా కనిపెట్టిన డీఎన్యే విశ్లేషణ పద్ధతుల్లో ఎందుకో మళ్ళీ విచారణ తెరిచి చూస్తే, ఆ ఘాతుక చర్య చేసినవాడు రోనల్డ్ కాదని నిస్సంశయంగా కచ్చితంగా తేలింది. ఒకటి కాదు రెండు కాదు పదకొండేళ్ళ జీవితం జైలుపాలు, అందులో నిండు యవ్వనంలో, ఒక తప్పుడు ఆరోపణ వల్ల.

ఇప్పుడు ఎవరు ఎవర్ని క్షమించాలి? అసలు ఎవరైనా ఎట్లా క్షమిస్తారు?

వాళ్ళ మాటల్లోనే వినండి!

క్షమ .. forgiveness!!

Monday, March 9, 2009

కబుర్లు మార్చి 9

నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంట. ప్రపంచ వ్యాప్తంగా సగటున మగవాడు సంపాయించే ఒక రూపాయికీ అదే పని చేస్తున్న స్త్రీ సంపాదన అక్షరాలా అరవైమూడు పైసలుట .. ఫెమినిస్టులూ, ఫెమినిస్టులు కానివాళ్ళూ, అసలు ఫెమినిజం ఎందుకూ అనేవాళ్ళూ, ఫెమినిస్టులు లోకాన్ని పాడుచేస్తున్నారనే వాళ్ళూ ఈ సందర్భంగా అసలు మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆలోచించాల్సిందే. ఈ లేండాఫ్ మిల్కండ్ హనీ లో ఈ మధ్యన, ఇటువంటి జీతం తేడాల గురించి స్త్రీలు తమ కంపెనీమీద కేసు పెట్టొచ్చు అని హక్కు ఇస్తూ కాంగ్రెస్ వారు బిల్లు ప్రవేశ పెడితే, ఇది వ్యాపార సంస్థలకి గొడ్డలిపెట్టు అన్నకారణంగా ఆ బిల్లుని సమాధిచేశారు.

మొన్నీ మధ్యన ఎవరో చలం నవల మైదానంలో నాయిక రాజేశ్వరి గురించి రాశారు. ఆ రచనాకాలంలో పరిస్థితులు అని ఏదో రాశారు. మన సాంఘిక పరిస్థితులు, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఆ నవలారచనాకాలం కంటే ఏం పెద్ద గొప్పగా పురోగమించలేదని, అభివృద్ధిచెందలేదనీ సవినయంగా మనవి చేసుకుంటున్నా. పనిలో పనిగా ఈ విషయం కూడా మనవి చేసుకుంటున్నా .. చలాన్ని గురించీ, చలం రచనల్ని గురించీ గొంతెత్తి మాట్లాడే, చలం నా ఆదర్శం అని చెప్పుకునే వారిలో తొంభైతొమ్మిది శాతం మందికి అసలు చలం ఏంటో అణువంతకూడా ఐడియా లేదు.

కొడవటిగంటి కుటుంబరావు రచనా సర్వస్వాన్ని విరసం పది సంపుటాలుగా విడుదల చేస్తోంది. మొదటి సంపుటం విడుదలైంది. ఇందులో అన్నీ కథలు ఉన్నాయి. 463 పేజీలు. 200 రూపాయలు. ప్రతులకు సి.ఎస్.ఆర్. ప్రసాద్ గారిని సంప్రదించ వచ్చు. ఎడ్రసు, సి-132, శ్రీనివాసనగర్ కాలనీ, గుంటూరు - 522 006, ఫోను 98854 46750

Monday, March 2, 2009

కబుర్లు - మార్చి 2

ఈ గడిచిన వారం రాశి ఫలాల్లో మిత్రసందర్శనం రాసి పెట్టి ఉంది. ఒకటికి రెండు సార్లు ఈ వారంలో పాత మిత్రుల్ని కలుసుకుని ఆప్యాయంగా తీరిగ్గా ముచ్చటించుకునే అవకాశం చిక్కింది. శివరాత్రి సోమవారంనాడు ముగిసినా మా స్థానిక దేవాలయం వారు ఉద్యోగస్తులైన భక్తుల సౌకర్యార్ధం కొన్ని ప్రత్యేక అభిషేకాలు పూజలు ఈ వారాంతంలో నిర్వహించారు. దానిలో భాగంగా స్థానిక నాట్య గురువు శ్రీమతి సుధా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో వారి శిష్యులు పలువురు ఆ నటరాజ మూర్తిని నాట్యాంజలితో మెప్పించారు శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలో. చూడ ముచ్చటగా ఉంది. పూర్వకాలంలో మన దేవాలయాలు కేవలం పూజకే కాక విద్యకీ సంస్కృతికీ సాంఘిక జీవనానికీ మూలస్థానాలుగా విరాజిల్లుతుండేవి. వేదాధ్యయనమూ, సంగీత నాట్యాది కళలూ దేవాలయాల్లో విలసిల్లుతుండేవి. ఇప్పుడు ఈ ప్రవాస దేశంలో మళ్ళీ హిందూ దేవాలయాలు అటువంటి పాత్ర పోషించవలసి ఉంది ప్రవాస భారతీయ సాంస్కృతిక చైతన్యం విషయమై.

చెంచులు గిరిజనులు అని చాలా మంది వినే ఉంటారు. బహుశా పేపర్లలోనో పాఠ్య పుస్తకాల్లోనో చదివుంటారేమో. ఆంత్రొపాలజీ సమాచారాన్ని బట్టి వీళ్ళు అనాదిగా ఈ ఆంధ్ర దేశపు ఆడవుల్లో నివాసముంటున్న ప్రజలని తెలుస్తోంది. కర్నూలు చిత్తూరు జిల్లాల్లో వ్యాపించి ఉన్న నల్లమల అడవుల ప్రాంతమంతా పరుచుకుని ఉన్నారు ప్రస్తుతం. చాలా ముభావమైన స్వభావం వారిది. సాంఘికంగా కలవడానికి ఇష్టపడరు. ఇంచుమించు పసి పిల్లలవంటి అమాయకత్వం కలిగిన మనస్తత్వం వారు. దురదృష్టవశాత్తూ నల్లమల తీవ్రవాద ఉద్యమానికి నెలవు అయిన నేపథ్యంలో అటు పోలీసు వ్యవస్థ నించీ ఇటు ఉద్యమకారుల నించీ రెండు వేపులా దెబ్బలు తింటూ అడకత్తెరలో పోకచెక్క మాదిరి చిన్నాభిన్నం అవుతున్నారు తమది కాని తప్పుకి ప్రాణాలు వొడ్డుతూ. ఈ చెంచుల ఘోషని మనసుకి పట్టించుకుని తన కలంతో వారికి గళాన్నిస్తూ ఒక పాత్రికేయుడు స్వేఛ్ఛకోసం అంటూ కొత్తగా బ్లాగు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి గారిని స్వాగతిస్తున్నాను. చెంచుల నిజ పరిస్థితిని గురించి వారు చెప్పే మాటలు చదువుదాం. ఏమైనా సహాయం చెయ్యగలిగితే చేద్దాం.

ఈ జాలం బలే తమాషా చేస్తుంది. మదిలో ఒకదానికోటి పొంతనలేని ఆలోచనలు ఒకదాని తోకపట్టుకుని ఇంకోటి అలా అనంతమైన గొలుసు కట్టినట్టే .. ఎక్కడో మొదలై ఎక్కడో తేల్తాం. ఇదిలా ఉంటే .. ఈ తెలుగు బ్లాగుజాలం అదో వింత ప్రపంచం, ఎంత చిన్నదో అంత పెద్దదీనూ. ఇంతా చేసి బాగా హడావుడి చేస్తున్నది రెండేళ్ళుగానే. ఇంతలోనే ఎన్నో బ్లాగులు మొదలై ఆగిపోయాయి కూడా. ఎక్కడో ఒక మారుమూల చిన్న బురద గుంటలో ఒక బుల్లి తెల్ల తామర పుడుతుంది, విచ్చుకుంటుంది, గుబాళిస్తుంది. పంకజమిత్రుడు మొహం చాటెయ్యగానే వాలిపోతుంది. కానీ ఒక్కో సారి, ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా మీరు అక్కడ నిలబడితే ఆ పాత పరిమళం మీ ముక్కుపుటాలి గిలి పెడుతుంది. అలాంటి నిన్నటి తెలుగు బ్లాగు పంకజం గుబాళింపిది.

అన్నట్టూ కొన్నాళ్ళుగా ఒక ముఖ్యమైన విషయం చెబుదామనుకుంటూ మర్చిపోతున్నా. ఇది ముఖ్యంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారికి. ఇదొక రేడీయో ప్రోగ్రాములో విన్నా. ఒకవేళ మీ తప్పేమీ లేకుండా మీ ఉద్యోగము పోయినట్లయితే (అమంగళము ప్రతిహతమౌగాక) మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు కొన్ని సదుపాయాల్ని అందుకోవచ్చు. దీనికి వీసా స్టేటస్ కీ ఏమీ సంబంధం ఉండకపోవచ్చు. ఈ నియమాలు రాష్ట్రాన్నించి రాష్ట్రానికి మారుతుంటాయి. అంచేత మీ రాష్ట్రంలో పరిస్థితి ఏమిటో కనుక్కోండి. ఆరోగ్య బీమా, జీవిత బీమా లాగానే ఈ నిరుద్యోగ సదుపాయం కూడా బీమా చెల్లింపే. అంచేత ఇది తీసుకోవలసి వచ్చినందుకు ఏమీ కించపడనక్కరలేదు కూడాను. ఇదెవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం కాదు. కష్టతరమైన సమయములో ఇది వ్యవస్థ ఇస్తున్న ఒక చిన్న చేయూత అని భావించండి. అంతే.

అన్ని రకాల రుసరుసలు కసబిసల తరవాత ఈ వారంలో మన బ్లాగరులు హాస్యానికి పెద్దపీట వెయ్యడానికి నిశ్చయించినట్లున్నారు. చదువరిగారు ఇలా తెరతియ్యగా, బ్లాగాడిస్తా రవి గారు ఆగాగు ఆచార్యదేవా అంటూ సుయోధనుడితో తెలంగాణా స్లోగన్లు పలికించారు. ఇక బ్లాగరులంతా యథాశక్తి హాస్యవృష్టి కురిపిస్తారని ఆశిస్తాను. పనిలో పనిగా జల్లెడవారు కొత్త డిజైను వెలయించారు. ఓ లుక్కెయ్యండి.