Thursday, January 29, 2009

తానా బహుకరిస్తున్న గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం

ప్రళయకావేరి ..
ఈ పేరెక్కడో విన్నట్టుగా ఉందా?
చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో ఆంధ్ర ప్రదేశ నైసర్గిక స్వరూపం పాఠాల్లో చదువుకొని ఉంటారు, పులికాట్ సరస్సు గురించి.
ఆ సరస్సు ప్రాంతాన్నీ అక్కడి ప్రజల్నీ సజీవంగా తన కథల్లో నిలుపుతూ ప్రళయకావేరి కథల్ని సృష్టించిన అక్షర బ్రహ్మ శ్రీ స. వెం. రమేశ్.
ఈ కథల్ని మొన్నీ మధ్యనే పుస్తకం.నెట్ లో సిరిసిరిమువ్వ గారు పరిచయం చేశారు.
2003లో గిడుగు రామమూర్తి పంతులుగారి స్మృతిలో తానా ఏర్పాటు చేసిన పురస్కారాన్ని 2009 సంవత్సరానికి గాను స.వెం. రమేశ్ గారికి ఇస్తున్నారు. తెలుగు భాషోన్నతికి, వికాసానికి కృషి చేసిన వ్యక్తులకి రెండేళ్ళకోసారి ఈ పురస్కారాన్ని ఇస్తారు.

వీరి కుటుంబ మూలాలు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట ప్రాంతంలో ఉన్నా, వీరి తండ్రి ఉద్యోగ రీత్యా తమిళనాడులో స్థిరపడ్డారు. రమేశ్ తమిళనాడులోనే పుట్టి పెరిగారు. తన పదహారవ ఏట తెలుగు నేర్చుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు వెలుపల ఉన్న తెలుగు వారు తమ మాతృభాషకు దూరం కావడం ఆయన స్వయంగా అనుభవించారు. ఇదే ఆయన్ని తెలుగు భాషా ఉద్యమకారునిగా తీర్చి దిద్దింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన తెలుగు కుటుంబాలకి భాషా పరంగా జరుగుతున్న అన్యాయం వీర్ని ప్రభావితం చేసింది.

తమిళ, కర్ణాటక, కేరళ, ఒరిస్సా రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసించే ఊళ్ళన్నీ పర్యటించి అక్కడి స్థితిగతుల్ని అధ్యయనం చేశారు. అక్కడ విరిసి ఉన్న తెలుగు భాషా సంపదని సేకరించారు. తమిళనాడులో 100 గ్రామాల్ని ఎంచుకుని సుమారు 5000 మంది కార్య కర్తలకి తెలుగు చదువనూ రాయనూ నేర్పించారు. ఇందుకు గాను భాషాశాస్త్రవేత్తలతో సంప్రదించి తగిన పాఠ్య ప్రణాళికనూ, పాఠ్యాంశాలనూ రూపొందించారు. ప్రభుత్వ స్థాయిలో ఉద్యమించి మూత బడిన తెలుగు పాఠ శాలల్లో 280 పాఠశాలల్ని తిరిగి తెరిపించారు. స్థానిక ప్రజా ప్రతినిధులకి ఈ సమస్యలపై అవగాహన కలిగేటట్లు కార్యక్రమాలు నిర్వహించారు. తమిళ కర్ణాటక రాష్ట్రాల్లో సజీవంగా ఉన్న తెలుగు వారి కళారూపాల్ని సేకరించి 2007 లో హోసూరులోనూ, 2008 లో తిరుచిరాపల్లిలోనూ తెలుగు జానపద కళా మేలాలను ఒంటి చేత్తో నిర్వహించారు.

చెన్నై పచ్చయప్ప కళాశాలలో ఏంత్రొపాలజీ ఎమ్మే పట్టం పొందిన శ్రీ రమేశ్ ఉద్యోగ రీత్యా హోసూరులో నివసిస్తున్నారు. ఇంతా చేసి ఈయనకి నలభయ్యేళ్ళు కూడా లేవు! నేను గమనించిన ఇంకో విషయం .. ఈయన తన పేరు ముందున్న పొడి అక్షరాల్ని ఎక్కడా ఆంగ్లంలో రాసుకున్నట్టు చూళ్ళేదు!!

మన తెలుగు బ్లాగ్లోకం తరపున శ్రీ స.వెం రమేశ్ గారికి అభినందనలు ప్రకటిస్తున్నాను. ఈ పురస్కారంతో వచ్చే నగదు బహుమతి ఆయన నిర్వహిస్తున్న బృహత్కార్యాల్లో గమనార్హం కాకపోవచ్చు. కానీ ఈ పురస్కారం వల్ల వచ్చే గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా వారికి సహాయ సహకారాలు అందేటట్లు చెయ్యగలదని నా ఆకాంక్ష.

ఎప్పుడైనా లేనిదాన్నే మిస్సవుతాం కాబోలు. పరాయి రాష్ట్రంలో పుట్టి పెరిగి నివశిస్తూ ఆయన నా భాషో అని తపన పడిపొయ్యారు.

ఈ బంగారు గడ్డ మీద పుట్టి పెరిగి ఈ తేట తెలుగులో చదువుకున్న మనం .. ఆ తెలుగులో యేవుంది మయ్యాస్ అని దాన్ని మురుక్కాలవలో పారబోసేందుకు సిద్ధంగా ఉన్నాం!

(శ్రీ రమేశ్ గారి జీవిత విశేషాల గురించి కార్యకలాపాల గురించి తెలియ జేసినందుకు తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు డా. జంపాల చౌదరిగారికి ధన్యవాదాలు.)

Monday, January 26, 2009

కబుర్లు - జనవరి 26

బ్లాగ్మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మాతృదేశం విడిచి వచ్చాక గుర్తుంచుకోడానికి అతి కష్టమైన పండగలు ఈ రెండూ. ఇంకా దసరా దీపావళీ ఇత్యాదులకి స్థానిక పచారీ కొట్టువాడూ, పూటకూళ్ళవాడూ ఏదో ప్రత్యేక అమ్మకాలు తగ్గింపు ధరలు పెడతారు. అదీ కాకపోతే స్థానిక దేవాలయమైనా ఘోషిస్తుంది, ఒరే నాయనా, పండగొస్తోందిరా అని. పాపం, దేశానికి సంబంధించిన పండగలకి మాత్రం ఎవరూ గోల పెట్టరు. ఆఖరికి భారతీయ దౌత్య కార్యాలయం కూడా .. ఆ రోజు మా ఆఫీస్కి సెలవ అని బుల్లి అక్షరాల్లో ఒహ నోటీసు పెట్టడం తప్ప ఏమీ అట్టహాసం చెయ్యదు.

నాకు స్కూల్లో ఉండగా ఈ గణతంత్ర దినోత్సవం కథా కమామిషు ఏంటో సరిగ్గా అర్ధమయ్యేది కాదు. స్వాతంత్ర్య దినోత్సవం .. బ్రిటీషు వాళ్ళ మీద గాంధీ గారు సత్యాగ్రహం చేసి గెలిచారు, దేశమాతని దాస్యవిముక్తని చేశారు .. అందులో డౌటేమీ లేదు. ఈ గణతంత్రం గోలేంటో అర్ధమయ్యేది కాదు. మనది ప్రజాస్వామ్యం .. ఇందులో మళ్ళీ గణతంత్రం అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేంటీ అని.

ఇలాంటి విషయాలు అమెరికా వచ్చాక, కూసింత అమెరికా, తదితర పాశ్చాత్య దేశాల చరిత్రలు చదివాక కాస్త వంట బట్టింది. రాచరికానికి పెద్ద పీట వేసి పట్టంకట్టే (శ్లేషని మన్నించండి) మన భారతీయ సంస్కృతిలో .. స్వాతంత్ర్యానంతరం ఆ రాచరిక వ్యవస్థని కాదని గణతంత్ర వ్యవస్థగా స్థిరపడేందుకు నిర్ణయించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎంత గొప్ప అంటే, నిజానికి ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైన అహింసా మార్గంలో సాధించుకున్న మన స్వాతంత్ర్యం ఒక ఎత్తైతే, ఈ నిర్ణయం దానికి సరితూగే ఇంకో ఎత్తన్న మాట. ఆలోచించండి. మనువు దగ్గర్నించీ, రకరకాల రాచరికాలు, రాజ వంశాలు. చక్రవర్తులు. రాచఠీవి, రాజుల సాహసౌదార్యాలు, నా విష్ణుః పృథివీ పతిః అని నానుడి కూడాను. ఇంత బలంగా మన చరిత్రలో సంస్కృతిలో వేళ్ళూనుకుని ఉన్న రాచరిక వ్యవస్థని కాదని .. కొత్తగా పుట్టిన ఈ దేశం ప్రగతి వేపు కొత్త చూపే చూస్తోందని తమని తాము గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడం నిజంగా అద్భుతమైన విషయమే. గణతంత్ర దినోత్సవమంటే రాజధానిలో జరిగే కవాతూ, తత్సంబంధ సైనిక ఆయుధ బల ప్రదర్శనమూ కాదు; అందరమూ మన దేశ గణతంత్ర వ్యవస్థని రూపు దిద్దిన మహనీయుల ఆలోచనల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం మంచిది.

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఈతెలుగు సాధించిన విజయాల్ని పురస్కరించుకుని బ్లాగుల్లోనూ, తత్సంబంధ గుంపుల్లోనూ తెలుగు భాషాభివృద్ధికి మరింత విస్త్రుతంగా పని చేద్దామని కార్యాచరణ ప్రణాళికల రచనకై కొంత చర్చ జరుగుతున్నది. ఇదంతా వ్యక్తిగత స్థాయిలోనూ, సంస్థాగత స్థాయిలోనూ చెయ్యగల పనులను గురించి కాదు. త్వరలో రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల ఎజండాలో భాషాభివృద్ధి కూడా ఒక ముఖ్యాంశం కావాలన్నది ఇక్కడి ప్రధాన ఆశయం. సురేష్ అనే యువబ్లాగరి 7 అడుగుల పథకాన్ని ప్రతిపాదించారు. నరసింహ గారు దానిమీద మరికొంత విస్తరించారు. ఆంధ్రామృతం రామకృష్ణ గారు ఈ పథకాల్ని సమర్ధిస్తూ పద్యమాలిక కూడా రచించారు.


చాలా రోజుల బ్లాగ్విరామం తరవాత కాస్త సమయం చిక్కి బ్లాగ్లోకంలోకి తొంగి చూడగా ఈ ఆణిముత్యం కంట పడింది.

మొన్నీ మధ్యన ఆంధ్రజ్యోతిలో అరుణ గారి కథ చదివినాక ఆ కథలో అదితిలాగా స్త్రీపురుష సంబంధాల పట్ల కొంత తెగువ చూపిన తెలుగు కథానాయికల్ని గుర్తు చేసుకుంటుంటే, మిత్రుడు అక్కిరాజు సృష్టి నందిని గుర్తొచ్చింది. ఆ కథ వచ్చిన కొత్తల్లో సమీక్షిస్తూ "నందిని వంటి యువతి నాకు నిజజీవితంలో తారసపడితే ఆమె నా స్నేహితురాలని చెప్పుకోవడానికి చాలా గర్విస్తాను" అని రాసుకున్నాను. మీరూ నందినిని పరిచయం చేసుకోండి. కథ నచ్చితే (నచ్చకపోయినా) అక్కడే ఓ మాట చెప్పండి, మా మిత్రుడు సంతోషిస్తాడు.

చివరిగా ఒక్క మాట. బ్లాగడం మనందరికీ ఒక గొప్ప శక్తినిస్తోంది. ఒక వేదికనీ ఆ వేదిక మీద మాట్లాడేందుకు గొంతునీ ఇస్తోంది. ఆ శక్తి సామాన్యమైనది కాదు. గొంతులు నొక్కి వెయ్యబడే ఉక్కు పిడికిళ్ళ రాజ్యాల్లో సమయం గడిపి వచ్చిన వారిని అడగండి ఇది ఎంత అపురూపమైన శక్తో! దాన్ని సద్వినియోగం చేసుకుందాం. చర్చ ముఖ్యం .. ఆలోచనలు పంచుకోవడం ముఖ్యం. విభిన్నమైన ఆలోచనలు బయటికి రావడం, నిర్భయంగా స్వేఛ్ఛగా వ్యక్తీకరించ బడటం ముఖ్యం. ఆలోచనల్తో విభేదించడం తప్పు కాదు. అవసరమైతే విమర్శించడం కూడా మంచిదే. కానీ మన మాటలు ఒకరిని కించ పరచరాదు. జుగుప్సా కరమైన భాషా, వ్యక్తీగతమైన దాడులూ, అశ్లీలపు రాతలూ ఎవరికీ ఉపయోగం కావు. పూని ఏదైన ఒక్క మేల్ కూర్చి జనులకు చూపవోయ్ అన్న మహాకవి బోధని మనసులో పెట్టుకుందాం. ఏదన్నా పనికొచ్చే పని చేద్దాం.

Thursday, January 22, 2009

మీసము దిద్దరుగా ...

మీసానికీ తెలుగు పౌరుషానికీ అవినాభావ సంబంధం.

నాలుగో తరగతి తెలుగు వాచకంలో తిరుపతి వేంకటకవుల మీద పాఠంలో వాళ్ళు రచించిన మీసం పద్యం పువ్వుగుర్తు కాకపోయినా బట్టి పట్టేశాను.
ఉ. దోసమటంచె రింగియును దుందుడు కొప్పగ పెంచినారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.
(తెవికీకి నెనర్లు!)
శ్రీశ్రీ అంతటి మహాకవి (ఆయన సొంతానికి మీసం పెంచకపోయినా)మీసం గొప్పతనాన్ని పొగుడుతూ ఏకంగా సీసపద్యమే రాసేశాడు.
ఇహ తెలుగు ఆత్మగౌరవం, తెలుగు పౌరుషం అంటే అన్నగార్ని తలుచుకోకుండా ఎలాగ? విజయవాడ ఎస్సారార్ కాలేజిలో (మా యింటి వెనకాతలే) పీయూసీ చదివే రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణగారి ఆధ్వర్యంలో పల్నాటి యుద్ధం నాటకంలో నాయకురాలు నాగమ్మ పాత్రకి ఎంపికయ్యి, స్త్రీపాత్ర కదా మీసం తీసెయ్యమని గురువుగారంటే, .. ఎంతైనా అప్పుడప్పుడే మొలుస్తున్న నూనూగు మీసం కదా .. నా పౌరుషానికి చిహ్నం తియ్యనని భీష్మించి, మీసాల నాగమ్మగా చరిత్ర సృష్టించాడు మహానుభావుడు ఆ రోజుల్లోనే.

పువ్వు పుట్టగనే పరిమళించును అన్నారు.
మనం కూడా అదే టైపు.

చిన్నప్పుడు నాకు పౌరాణిక సినిమాలంటే గొప్ప మోజు (చిన్నప్పుడనే ఏముంది లేండి, ఇప్పటికీని). కథల్లో ఉండే ఆసక్తి అలా ఉండగా, ఆ (మగ) పాత్రల కేశాలంకరణ నన్ను విపరీతంగా ఆకట్టుకునేది. ముఖ్యంగా జులపాలు, సైడు చెంపలేమో ముందుకి చిన్న రింగు తిరిగినట్టుగా .. ఇహ మీసాల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. మహాభారత కథతో వచ్చిన సినిమాల్లో కేవలం మీసాల సైజు షేపు మార్పు వల్ల వివిధ పాత్రల్ని గుర్తు పెట్టుకునేట్టుగా తీర్చి దిద్దే వారంటే అతిశయోక్తి కాదు, నా దృష్టిలో. ధర్మరాజు మీసమూ, అర్జునుడి మీసమూ, దుర్యోధనుడి మీసమూ ఒక్కలా ఉండవు ఎప్పటికీ. భీముడికి మీసం లేకుండా చేశారన్న ఒక్క కారణం వల్ల దూరదర్శన్ మహాభారతాన్ని తీవ్రంగా నిరసించాను!

అఫ్కోర్సు, చూసొచ్చిన సినిమాల్లోని వీరోచిత ఘట్టాలన్నీ సాయంకాలపు ఆటల్లో మళ్ళీ పునస్సృజించక పోతే మన గొప్ప ఏముంది? పందిట్లోంచి పీకిన వెదురు బద్దతో విల్లు, చీపురు పుల్లల్తో బాణాలు .. కత్తులూ గదలూ .. ఇత్యాది ప్రాపులన్నీ కూడా తయారై పోయేవి గానీ మేకప్పుతోనే వచ్చేది గొడవంతా. సరైన కేశాలంకరణ లేకపోతే పాత్ర మూడ్‌లోకి ఎలా రావడం? నాకు ఓ రెణ్ణేల్లపాటు కటింగక్కర్లేదు, ఎంచక్కా దుర్యోధనుళ్ళాగా జులపాలు పెంచుతాను అని ఒకశనారం రాత్రి భోజనాల్దగ్గర ప్రకటిస్తే, ఆ మర్నాటి ఆదివారమే మా అప్ప మమ్మల్ని అప్పారావు సెలూన్ కి తీసుకెళ్ళి డిప్ప కటింగ్ చేయించేశారు. మా అమ్మ సవరం మీద కన్నేశాను గానీ, అప్పటికే బుడుగు పుస్తకం చదివున్న మా అమ్మ .. నా సవరం ముట్టుకున్నావంటే వీపు చీరేస్తా అని వార్నింగిచ్చింది. అంతేకాక, మీ మీ సవరాల్ని జాగ్రత్త చేసుకొమ్మని పక్కింటి పిన్నిగార్లందర్నీ కూడా హెచ్చరించేసింది.

అలా జులపాల ఆశలన్నీ అడియాసలు కాగా, సరే, అసలు పాత్ర వ్యక్తిత్వం అంతా మీసంలోనే కదా ఉన్నది అన్చెప్పి కేశాలంకరణ వదిలి మీసాలంకరణ మీద దృష్టి సారించాను. బాయిలర్ కోసం నీళ్ళగదిలో ఓమూల బుట్టలో ఉండే మసి బొగ్గులు మా పాటి బంగారు కణికలయ్యాయి. కానీ బొగ్గు ముక్కతో తిన్నగా మూతి మీద మీసం దిద్దుకునేందుకు చచ్చే చావయ్యేది. చర్మానికి నలుపు పట్టేట్టు దిద్దాలి అంటే, బొగ్గు ముక్కని చర్మమ్మీద నాలుగైదు సార్లు రుద్దాల్సి వచ్చేది. అందులో మూతి మీద తోలు కొంచెం పల్చగానూ, సున్నితంగా ఉంటుంది గదా, మంట పుట్టేది. దానికి తోడు ఒక్కోసారి బొగ్గు మొక్క అంచులు బాగా మొనదేలి ఉండి కోసుకు పోయేది కూడా. మా సహదేవుడికొకడికి కోరమీసం దిద్దబోతుంటే ఇలా సన్నగా గీరుకుందని ఏడిచి వెళ్ళిపోయాడు. ఇహ ఇలా లాభం లేదని, సిమెంటు గచ్చు గరుగ్గా ఉండే చోట ముందు బొగ్గు ముక్కని మెత్తగా నూరి, ఆ పొడిని వేలి కొసల్తో మూతి మీదకి ట్రాన్స్ఫరు చేసేవాళ్ళం. ఇదీ అంత బాగా పని చెయ్యలేదు. మా పాత్రల వెరైటీకి కావలసిన మీసాల వెరైటీని ఈ వేలి కొసల ఆర్టుతో సృష్టించడం కష్టమై పోయింది. అర్జునుడి మీసాలూ దుర్యోధనుడి మీసాలూ, ఆఖరికి సహదేవుడి మీసాలూ ఒకేలాగుండేవి. అదీగాక, గచ్చంతా బొగ్గులు నూరి నల్లగా చేస్తున్నామని పనామె వెళ్ళి మా అమ్మకి ఫిర్యాదు చేసింది.

ఒకసారి పనీ పాటూ లేక ఇల్లంతా చక్కబెడుతుంటే, తలనూనే దువ్వెనలూ పౌడరూ ఇత్యాది సామాన్లుండే అలమారులో ఒక చిన్న గుండ్రటి నల్లటి డబ్బా నా కళ్ళని ఆకట్టుకుంది. అది మా అక్కయ్య తాలూకా ఐటెక్స్ కాటుక డబ్బా అని గనక మీరు కనిపెట్టేసి ఉంటే మీకు మీరు ఓ పది మార్కులేసేసుకోండి. ఇన్నాళ్ళూ బొగ్గుల్తో అవస్థ పడుతున్న రోజుల్లో అది నా కళ్ళ ఎందుకు పడలేదు అంటే, నా కళ్ళు ఆ సామాన్లుండే అర స్థాయిని అప్పుడప్పుడే అందుకుంటున్నా యన్నమాట. ఆహా .. భగవంతుడా ఏమి నీ లీల? ఈ భూప్రపంచంలో నావంటి వారి మీసార్ధం ఇలా సుతిమెత్తని ఐటెక్స్ కాటుకని సృష్టించావా! నీ సృజనశక్తి అమోఘమయ్యా అని మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుని కార్యక్రమానికి ఉపక్రమించాను. ఈ మెత్తని నల్లని లేహ్య పదార్ధాన్ని సుతారంగా నా మూతి మీద మొలిపించడం ఎలా? ఆ సమస్య కూడా తీరిపోయింది .. ఎదురుగుండానే తిలకం సీసా. తిలకం సీసా లోపల, మూతకే యెటాచుడ్ గా తిలకం దిద్దుకునే ప్లాస్టిక్ పుల్ల కూడా ఉంటుంది. అది ఎల్లప్పుడూ తిలకం ద్రవంలో మునిగి ఉంటుంది కాబట్టి, దాన్ని చాలా జాగ్రత్తగా తీసి, ఒక పాత గుడ్డ పీలిక ఒకటి సంపాయించి, దాంతో పుల్లని శుభ్రం చేసి (మీసాల్లో ఎరుపు ఉండకూడదు కదా .. ప్లస్ తిలకం జాడలు కాటుక డబ్బీలో కనబడకుండా ఉండేందుకు కూడానూ ..) మా నట వర్గాన్ని రావించి రకరకాల మీసాలు దిద్దేశాను. అందరూ చాలా సంతోషించారు. మా బుల్లి సహదేవుడు మరీనూ. ఆ రోజు సాయంత్రం మా కురుక్షేత్రం బహు రక్తి కట్టిందని వేరే చెప్పక్కర్లేదు. అఫ్కోర్సు, నెలకి పైగా వచ్చే కాటుకడబ్బా వారం రోజులకే ఖాళీ అవడంతో మా అక్కకి దొరికి పోయి తొడపాశం తిన్నాననుకోండి.

తీరా నిజంగా మీసాలు మొలిచి అవి కాస్త మెలివేసేంత ఎదిగే నాటికి ఫేషన్లు మారిపోయి చిరంజీవి నమూనా స్లాంట్ కటింగ్ ఫేషన్ ఐపోయింది. ఇహ అక్కడ మొదలెట్టి తెలుగు హీరోలు, హిందీ హీరోలు, అంతర్జాతీయ హీరోలు (కొండొకచో విలన్లు), అటుపైన దేశవాళీ విదేశవాళీ క్రికెటర్లు .. ఇలా అనుసరించాల్సిన ఫేషన్లన్నీ అనుసరించాక .. ఇన్నాళ్ళకి .. ఇవ్వాళ్ళ పొద్దున మొహం కడుక్కుంటూ అద్దంలో చూసుకుంటే ... నల్లగా తుమ్మెద రెక్కల్లాగా కాటుక చారలాగా నిగనిగ లాడాల్సిన మీసకట్టులో డజనుకి తక్కువకాకుండా వెండి తీగలు మెరిశాయి. కళ్ళు బైర్లు కమ్మాయి. మా ఆవిడ ఏ అలమార్లోనన్నా ఏ మూలన్నా ఐటెక్స్ కాటుక డబ్బా దాచి ఉంచిందేమోనని పొద్దున్నుంచీ వెతుకుతున్నా!

Wednesday, January 14, 2009

కబుర్లు .. రెండ్రోజులాలస్యంగా

ఎన్నాళ్ళొ వేచిన ఉదయం .. మొత్తానికి వచ్చేసింది. చారిత్రాత్మక నిర్ణయంగా అమెరికా దేశ పౌరులు ఎన్నుకున్న నలభై నాలుగవ అధ్యక్షునిగా బరాక్ ఒబామా ప్రమాణ స్వీకారం చేశారు. కనీ వీనీ ఎరుగని రీతిలో దేశం నలుమూలల నించే కాదు, ఇతర దేశాల నుండి కూడా కేవలం ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అనేకులు విచ్చేశారుట. అక్కడ కేపిటల్ భవనం ముందు కూడుకున్న సమూహంలోనూ, తమతమ ప్రదేశాలనించి టీవీలో, అంతర్జాలంలో చూస్తున్న ప్రజలలోనూ పెల్లుబికే విజయోత్సాహం కంటే, ఒక విధమైన గంభీరంతో కూడిన ఆశాభావం మాత్రమే వ్యక్తమవుతూ వచ్చింది రోజంతా. నూతన అధ్యక్షునిగా ఒబామా చేసిన ప్రసంగంలో కూడా, ఏ విధమైన విజయ గర్వం కానీ, గతించిన ప్రభుత్వం పట్ల అసహనం కానీ తొణక్కుండా, తమ ప్రభుత్వానికీ, ఈ దేశానికీ ఎదురుగా ఉన్న కొండంతలేసి సమస్యల్ని గుర్తిస్తూ వాటిల్ని అధిగమించగలమనే దృఢమైన కార్యదీక్ష మాత్రమే ప్రకటించారు.

యాదృఛ్ఛికంగా నిన్ననే మార్టిన్ లూథర్ కింగ్ గారి సంస్మరణ దినం కావడం, ఎన్నో సార్లు ఇంతకు ముందు విని ఉన్నా, నిన్న మళ్ళీ రేడియోలో వినడం ఈ సందర్భంలో ఒక ప్రత్యేకతని సంతరించుకుంది.

తెలంగాణా జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలని రికార్డు చేసుకోవడమే కాకుండా వాటి గురించి సమచార వ్యాప్తి జరగాలి అనే సదుద్దేశంతో ఒక చిన్న సినిమాల పోటీ జరుపుతున్నారు డిస్కవర్ తెలంగాణా వారు. పోటీ వివరాలకి ఫిలిం తెలంగాణా గూడుని దర్శించండి. ఔత్సాహికులకి ఇది మంచి అవకాశం.

కౌముది జాల పత్రిక వారు రచన అచ్చు పత్రికతో కలిసి తెలుగు కథానికల పోటీ నిర్వహిస్తున్నారు. వివరాలిక్కడ.


పలు సంవత్సరాలుగా అమెరికాలో తెలుగు సాహిత్య సేవ చేస్తున్న వంగూరి ఫౌండేషను వారు ప్రవాసాంధ్రుల తెలుగు రచనల పోటీని ప్రకటించారు. కథానిక, కవిత, వ్యాసము, నవల ప్రక్రియల్లో ఈ పోటీ జరుగుతుంది. భారతదేశానికి బయట నివాసమున్న తెలుగు రచయితలందరూ పాల్గొనేందుకు అర్హులే. వివరాలు పై లంకెలో చూడొచ్చు.

ఈ సారి అసలే ఆలస్యమైన కబుర్లు అన్నీ ప్రకటనల సర్వీసుగా మారిపోయినట్టుంది.
పోనీ, ఈ సారికిలా కానిచ్చెయ్యండి. వచ్చే వారం సరైన సమయానికి కరకరలాడే తాజా కబుర్లతో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తూ ..

Monday, January 12, 2009

కబుర్లు - జనవరి 12

మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు, అసలే ప్రపంచ వ్యాప్త ఆర్ధిక సంక్షోభానికి రెపరెపలాడుతున్న భారతీయ ఐటి పరిశ్రమకి పెద్ద దెబ్బే గత వారంలో బయల్పడిన సత్యం కంపెనీ మోసం. ఇప్పటికే మన బ్లాగర్లు చాలా మంది అనేక విధాలుగా ఈ విషయాన్ని గురించి రాశారు, రాస్తున్నారు, కాబట్టి నేను ఇక్కడ కొత్తగా చెప్పేది ఏం లేదు. సత్యం పేరుతో సంస్కృత జాతీయాల మీద సత్యం వధ, సత్యమేవ భయతే శ్లేషలైతే చమత్కారంగా ఉన్నాయి కానీ, నిజపరిస్థితి మాత్రం భయంకరంగానూ ఆందోళన కరంగానూ ఉన్నదని ఒపుకోక తప్పదు. ప్రపంచ విపణి వీధిలో కంపెనీల దురాశ (corporate greed) కొత్త యేమీ కాదు. కొద్ది సంవత్సరాల క్రితమే ఎన్రాన్‌, వల్డ్‌కామ్‌ ఇంచుమించుగా ఇటువంటి వెధవ పనులు చేసే మునిగి పోయాయి. మదుపు దారుల డబ్బు పోవడం అదొక వంతనుకోండి .. మదుపు పెట్టడంలోనే రిస్కు కూడా ఉందని వాళ్ళకి తెలుసు కనీసం. ఎంతమంది ఉద్యోగుల రిటైర్మెంటు డబ్బులు హుష్ కాకీ కాబోతున్నాయో. ఈ మధ్య అమెరికాలో ఇంటి ఋణాల సముద్రంలో మునిగిన బేంకుల్లో వాషింగ్టన్‌ మ్యూచువల్ బేంకు అతి పెద్దది. తమది కాని తప్పుకి ఉద్యోగాలు పోగొట్టుకున్న వందలాది బేంకు ఉద్యోగులు మొన్ణామధ్య సియాటిల్ నగరంలో .. మునిగిన తమ యజమానికి బై బై చెబుతూ .. పేద్ధ పార్టీ చేసుకున్నారుట. బహుశా సత్యం ఉద్యోగులు కూడా అలాంటి పని చేస్తే పోతుంది. మునిగేది ఎట్టాగూ మునుగుతుంది, దాన్ని గురించి ఏడవడం అనవసరం.

మొన్నటి కబుర్లలో మా సద్గురు బోధ .. దయ ముఖ్యం అని చెప్పాను. ప్రముఖ కవి ఇస్మాయిల్ గారు కూడా కరుణ ముఖ్యం అన్నారు. ఒక్కోసారి మనం ఏదో మనసు దిగజారిపోయిన దిగులు దిగులు గుబుల్లో ఉండగా, ఎక్కడో ఎదురు చూడని మూల నించి, అస్సలు పరిచయం లేని కొత్తవ్యక్తి దగ్గర్నించి మనమీదికి దయ ప్రసరిస్తుంది. ఆ క్షణంలో దయ కురిపించిన వారూ, పుచ్చుకున్న మనమూ .. ఇద్దరమూ మన మానవత్వాన్ని దృఢపరుచుకుంటాం. నిజమే, దయ ముఖ్యం. కరుణ ముఖ్యం.

కానీ ఈ కొత్త సంవత్సరంలో అదే కొరవడినట్టుగా ఉంది. గాజా పేలికలో పాలస్తీనియన్లని ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమానికి అడ్డూ అదుపూ ఉన్నట్టు కనబడ్డం లేదు. ఇంతలేసి బలవంతులమని చెప్పుకునే ప్రపంచ దేశాలన్నీ మ్రాంపడి చూస్తున్నాయి. ఇదేమని అడిగే వారు లేరు. ఇజ్రాయెల్ ని నిలదీసేవారు లేరు. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం?

వార్తల్లో విషయాల్ని గురించి కబుర్లు చెప్పాలంటే, బయటెక్కడా కాస్త సంతోషించే వార్తలు కనబడేట్టు లేదు. గుండమ్మ కథలో రమణారెడ్డి అంటాడు కాఫీహోటల్లో పేపరు చదువుతూ, వెధవ పేపరు, అన్నీ చావు కబుర్లే, శుభమా అని నాలుగు పెళ్ళికబుర్లు వెయ్యకూడదూ? అని. పెళ్ళి కబుర్లు కాదుగానీ, మనసుకి ఆహ్లాదం కలిగే కబుర్లు చెబుతా ఈ మిగిలిన భాగంలో.

మాచిరాజు సావిత్రి గారు చిన్నవయసులోనే అమెరికా వచ్చి సెటిలయారు. వృత్తిరీత్యా పర్యావరణ రక్షణ రంగంలో పనిచేస్తుంటారు. మంచి సాహిత్యాభిలాష కలిగినవారు. అమెరికాలో తెలుగు భారతీయ జీవితాన్ని ప్రతిబింబించే చక్కటి రచనలు చేస్తుంటారు. అనేక కథలు కవితలూ ఈమాటలో ప్రచురించ బడినాయి. తరవాణి కేంద్రం అనే ఈ చక్కటి కథని గుర్తు చేసినందుకు మన రానారెకి బోల్డు థాంకులు.

మన అరుణం అరుణ గారు ఆంధ్ర జ్యోతిలో కథ రాసేశారోచ్! సంచలనాత్మకమైన విషయం. చాలా బేలెన్సుతో రాశారు. అభినందనలు. ఒకేళ మొదటి కథ అయితే గనక ప్రత్యేక అభినందనలు. కవర్ స్టోరీగా విజయవాడ పుస్తకోత్సవం గురించి రాశారు, కానీ దానిలో ఈతెలుగు కార్యక్రమం ప్రస్తావన ఏమీలేదు. అఫ్కోర్సు పదకొండు రోజులు నడిచే ఉత్సవంలో ఒక్క రోజు ఒక్క గంట జరిగిన మన కార్యక్రమాన్ని ప్రస్తావించాలనుకోడం అత్యాశే కావచ్చు .. అన్నట్టు, విజయవాళ్ళో మన వాళ్ళందర్నీ కలవడం చాలా సరదాగా ఉందని మా మామగారు చెప్పారు. ఆ దెబ్బతో తనక్కూడా ఓ బ్లాగు మొదలెట్టాద్దామన్నంత ఉత్సాహం వచ్చేసిందనీ, కాకపోతే ఏవన్నా రాయాలంటే ఇదివరకట్లాగు కంప్యూటరు ముందు ఎక్కువసేపు కూర్చోలేక పోతున్నానని చెప్పారు. ఆయనక్కూడా ఈ కింది విషయం చెప్పాలి!

ప్రముఖ కవి కె. శివారెడ్డి ఒక పద్యంలో అంటారు, ఉయ్యాల ఊపు ఎప్పటికీ ఆగనీకు అని. ఇవ్వాళ్ళ పొద్దున్న రేడియోలో విన్న ఓ కథనం నన్ను అమితాశ్చర్యానికి గురిచేసింది. డోరొతీ అనే జపనీస్ అమెరికన్‌ స్త్రీ, 91 ఏళ్ళ వయసులో తన డాన్సు స్టూడియోలో డాన్సు నేర్పుతున్నారని! మరి మీ ఉయ్యాల ఏమిటి?

Wednesday, January 7, 2009

మనం నిజంగా అత్యుత్తమ స్థాయిని ప్రోత్సహిస్తున్నామా?

ఐఐటీలు గొప్పవా?

ఈ ప్రశ్న లెక్కల సబ్జక్టుతో ఇంటరు చదువుతున్న ఏ విద్యార్ధినైనా అడగండి .. మనల్ని ఎర్రగడ్డ నించి ఇప్పూడే విడుదలై వచ్చినట్టు చూస్తారు. ఐఐటీ ప్రవేశ పరీక్షకి అత్యుత్తమ శిక్షణ నిస్తామంటూ వేలాది విద్యార్ధులు ఒక్కొక్కరి నించీ లక్షల ఫీజులు వసూలు చేస్తున్న విద్యా కర్మాగారాల్లో చూడండి. అంతదాకా ఎందుకు. ఒక కొత్త బేచి విద్యార్ధులు ఐఐటీలో ప్రవేశించినప్పుడు అక్కడి విద్యాధికారులే వాళ్ళకి చెబుతారు, వాళ్ళు సాధించినది ఎంత గొప్ప విజయమో, వాళ్ళంతా ఈ ఆకాశ హర్మ్యాల్లోకి అడుగు పెట్టేందుకు పూర్వజన్మల్లో ఎంతలేసి పుణ్యాలు చేసుకున్నారో.

ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించడం నిజంగా గొప్ప విజయమే, కనీసం విద్యా విషయకమైన స్పర్ధలో. ఆ పరిక్ష ఎంత క్లిష్టమో నాకు తెలుసు. విజయం సాధించడానికి ఎంత క్రమశిక్షణా, ఎంత శ్రమా అవసరమో నాకు తెలుసు.

కానీ ఇంత అవసరమా? ఐఐటీ విద్య అంత గొప్పదా? ఇంత కష్టపడి ప్రవేశం సాధించిన తరువాత, ఆ విద్య పొందిన వారు తరువాతి జీవితంలో ఎటువంటి ఘన విజయాలు సాధించారు, సాధిస్తున్నారు?

మీరు గనక ఐఐటీ స్నాతకులైతే (గ్రాడ్యువేట్లు) నన్ను మన్నించెయ్యండి. ఒకేళ మీ పిల్లలు గానీ ఐఐటీ లో చదువుతున్నా సరే. నేనేదో ఐఐటీ ద్వేషిని కాను. మా అన్నగారు ఒక ఐఐటీలో చదివి, ఇప్పుడు ఇంకో ఐఐటీలో పాఠం చెబుతున్నారు. నా అతి దగ్గరి స్నేహితులు కొందరు ఐఐటీ స్నాతకులే. నేనైనా అందని ద్రాక్ష పుల్లన బాపతు కూడా కాదు. ఎందుకంటే నేనూ కొంత ఐఐటీ గాలి పీల్చుకున్న వాణ్ణే. అంచేత, కేవలం ఒక ఆలోచనని పంచుకోవడమూ, ఇంకొంత ఆలోచనని రేకెత్తించడమూ తప్ప ఈ టపాలో వేరుద్దేశం లేదని గమనించగలరు.

ఐఐటీ స్నాతకులు తమ సమకాలికులకంటే ఎక్కువ స్థాయి వారా? నాకు తెలిసి వారెవరూ ప్రపంచాన్ని మార్చి వేసే, లేదా ప్రపంచానికి గొప్ప మేలు చేసే సాంకేతిక, శాస్త్రీయ విషయమేదీ కని పెట్టిన దాఖలాలు లేవు. విదేశాలకి వలస అది వేరే సమస్య అనుకోండి. పోనీ విదేశాల్లో కెళ్ళి అయినా వీరెవరూ తమ తమ పరిధుల్లో గొప్ప శిఖరాలు అధిరోహించిన దాఖలాలు నాకైతే ఏమీ కనబడటంలేదు. పోనీ ఎవరన్నా గొప్ప పారిశ్రామిక వేత్తలయ్యారా అనుకుంటే .. కొద్ది మంది కనిపిస్తున్నారు కానీ, జనాభాలో శాతంగా చూస్తే ఇతర జనాభా శాతం కంటే ఐఐటీ స్నాతకుల శాతం ఎక్కువ కాదనిపిస్తోంది. ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారులే అనుకున్నా, ఆ ఉద్యోగాల్లో అయినా వారు అత్యున్నత స్థాయి నధిరోహించిన విషయం బహు అరుదుగా విన్నాను. కొందరు అయ్యేయస్ వంటి పరిపాలనా రంగాల్లోకి వెళ్తుంటారు .. వారైనా ఇతర అయ్యేయస్ లకంటే మిన్నగా నిలిచిన సూచనలూ నాకు కనబళ్ళేదు.

ఐఐటీ గురించి ఇంత హైరాన పడే మనమూ మన సమాజమూ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అత్యుత్తమ స్థాయిని ప్రోత్సహించక పోగా, ఆ భావనకి పరమ విరుద్ధమైన మీడియాక్రిటీ (mediocrity)ని ప్రోత్సహిస్తున్నామని నాకనిపిస్తోంది.
ఎంత వృధా?
ఒక నాగరికతగా ఇది మన సమాజాన్ని గురించి ఏం చెబుతోంది?

Sunday, January 4, 2009

కబుర్లు - జనవరి 5

చాన్నాళ్ళ క్రితం "రొటీను వెరైటీ" అని ఒక టపా రాసుకున్నా. అందులో రాసుకున్న నిర్ధారణ, నా విషయంలోనే ఇంత సత్యమని మాత్రం నేనస్సలు అనుకోలేదు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన మూడు వారాల శలవ రానూ వచ్చింది, ఐపోనూ ఐపోయింది. నేను ఈ శలవల్లో చేసేద్దామనుకున్న ఘనకార్యాలు మాత్రం, ఫ్లారిడాకి వెకేషను ట్రిప్పు వెయ్యడం తప్పించి, ఒక్కటంటే ఒక్ఖటి కూడా చెయ్యలేదు! బయణ్ణించి ప్రేరణలూ వత్తిళ్ళూ లేకుండా ఘనకార్యాలు సాధించాలి అనుకునే వారికి చాలా క్రమ శిక్షణా, మనోనిగ్రహమూ ఉండాలి సుమా. నాకవి లేవని మరోసారి అనుభవంలోకి వచ్చింది. :(
సరే పోన్లే, ఏమీ చెయ్యని ఖాళీ సమయం కూడా అప్పుడప్పుడూ కాస్త అనుభవిస్తూ ఉండాలి అని సర్ది చెప్పుకుని, మళ్ళీ రేపణ్ణించీ (ఇది ఆది వారం సాయంత్రం రాస్తున్నా) రొటీనుకి రెడీ ఐపోతున్నా.

మనం పెద్దగా ప్రయాస పడపోకుండానే కొత్త సంవత్సరం వచ్చేసింది, దానంతట అదే. కొత్త సంవత్సరం అనగానే ఠంచనుగా జరిగే జాతర .. ప్రతిజ్ఞలు .. అదే, న్యూ యియర్ రిసొల్యూషన్స్. మొన్నెవరో మన బ్లాగర్లే అన్నారు .. New year resolutions are like government rules .. they are made to be broken అని :) ఈ జ్ఞానోదయం నాకు ఎప్పుడోనే కలిగి ఈ ప్రతిజ్ఞలు చెయ్యడం మానేశా. కానీ, మొన్నటి జనవరి 1 కి ముందు ఒక రోజు రేడియోలో .. అసలు ప్రతిజ్ఞలు చేసుకోని వారితో పోలిస్తే, ప్రతిజ్ఞ చేసుకున్న వారు అధిక శాతంలో తమ ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు .. అని ఒక ప్రముఖ మానసిక శాస్త్రవేత్తగారు చెప్పారు. ఉదాహరణకి ఒక జనాభాలో అందరూ బరువు తగ్గాలి అని అనుకుంటున్నారు, కానీ అందులోంచి ఒక వంద మంది మాత్రం కొత్త సంవత్సరంలో బరువు తగ్గాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నారు అనుకోండి. ఈ వందమందిలోనూ సుమారు 43 - 46 మంది తమ లక్ష్యాన్ని చేరుకుంటున్నారట. ప్రతిజ్ఞ తీసుకోని మిగతా జనాభాలో లక్ష్యాన్ని చేరుకునేది 4 శాతం మించదుట. సరే ఐతే .. జయమ్ము నిశ్చయమ్మురా, ప్రతిజ్ఞల్ చేసుకొమ్మురా అని నేనూ ఎడా పెడా ప్రతిజ్ఞలు చేసి పారేశాను.

కొత్త సంవత్సరంతో పాటు పుట్టింది పుస్తకం.నెట్ .. కొత్త సంవత్సరం ఐతే మనం శ్రమపడకుండానే పుట్టేసింది గానీ, ఈ సైటుకి పురుడు పోసేందుకు చాలా మంది చాలా శ్రమ పడ్డారు. వారం రోజులైనా వయసులేని ఈ బుజ్జి పాప అప్పుడే బోల్డన్ని మంచి మంచి వ్యాసాల్తో ముస్తాబై పోయి అలరారుతోంది. పుస్తక ప్రేమికులందరికీ ఒక మంచి ఆకర్షణగా ఎదుగుతుంది అనడంలో ఏం సందేహం లేదు. తెలుగు బ్లాగులనే మానస సరోవరంలో పుట్టిన ఇంకో జాతి కమలం ఈ పుస్తకాల గూడు.

ఈమాట కొత్త సంచిక విడుదలైంది. ఓ లుక్కెయ్యండి.

1956 నించీ 2006 వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్రని సమీక్షించుకుంటూ ఒక సమాచార, విశ్లేషణా గ్రంధం వెలువడింది. దీన్ని సెంటర్ ఫర్ డాక్యుమెంటేషన్ రిసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ (CDRC) వారు ప్రచురించారు. ఆంగ్లంలో, 568 పేజీలతో .. చరిత్ర, వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సౌకర్యాలు, సామాజిక పరిణామాలు, విద్యా వైద్యా రంగాలు .. ఇత్యాది విషయాలపై, సుమారు నలభై విశ్లేషణాత్మక వ్యాసాలు, అనేక పట్టికలతో .. దేశంలో ఏం జరుగుతోంది అని, ఆషామాషీగా కాకుండా కొంచెం సీరియస్ గా పట్టించుకునే వాళ్ళందరి దగ్గరా ఉండాల్సిన పుస్తకం. మేలు ప్రతి రూ 895. విద్యార్ధి ప్రతి రూ 225.
reachcdrc at yahoo dot com లేదా 040-6684 3495 ద్వారా కాపీలు పొందవచ్చు.

హైదరాబాదు పుస్తకాల పండగలో మన బ్లాగర్లు ధనధన లాడించేశారు. ఆదివారం (జనవరి 4) సాయంత్రం విజయవాడ పుస్తకాల పండగలో జరిగిన చిన్న ప్రదర్శన కూడా విజయవంత మైందని మా మామగారు చెప్పారు. ఎంతో శ్రమపడి ఈ విజయానికి కారకులైన అందరికీ పేరుపేరునా అభినందనలు. మరి ఇక్కణ్ణించి ఎక్కడికి? ఇంకేమైనా చెయ్యగలమా మనం? ఈ వేడి చల్లారకుండానే మన భవిష్యత్ ప్రణాళిక నిర్మించుకుందాం రమ్మంటున్నారు చదువరి గారు ఈతెలుగులో. మీ గొంతు కూడా కలపండి అక్కడ.