Tuesday, December 30, 2008

విచిత్రమైన కాలగమనం

కాల గమనం అతి విచిత్రం కదా!
గడియారంలో క్షణాల ముల్లు కదలికే కాదు, సంజె పొద్దులో పడమటి సముద్రంలోకి ఇంకుతున్న సూర్యుడి చలనం, వేసవి రాత్రి గాలికూడా ఊపిరి బిగబట్టినప్పుడు నిర్మలాకాశంలో నక్షత్ర గమనం, రోజు రోజుకీ పెరుగుతూ తరుగుతూ పదారు కళలు ప్రదర్శించే చంద్రుడి విన్యాసం .. చూసే దృష్టి ఉండాలి గాని మన కళ్ళముందే ఈ విశ్వం భరతనాట్యం ప్రదర్శిస్తూ ఉంటుంది విచిత్ర తాళ గతులతో.
ఈ మాటలు ఎక్కడో చదివినట్టు అనిపిస్తోందా?
ఎక్కడో ఏముంది లేండి, నా బ్లాగులోనే చదివుంటారు. ఎప్పుడో పోయినేడు వసంతాగమనాన్ని చూసి పులకించిన సందర్భంలో రాసుకున్న మాటలివి.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం కాలం ఒకే దిశలో ముందుకు మాత్రఏ సాగే ఋజువర్తని (అంటే తిన్నని మార్గంలో పయనించేది, linear). అది నిజమే. గడచిన క్షణం, నిమిషం, గంట మళ్ళీ రాదు. కావాలంటే పరీక్షకి తయారవుతున్న విద్యార్ధిని అడగండి. తెల్లారితే మరణశిక్ష పొందబోయే ఖైదీని అడగండి.
తమాషా ఏవిటోగానీ మన ఋషులు కాలాన్ని వర్తులంగా (cyclical) ఊహించారు. ఒకలా చూస్తే ఇదీ నిజమే. గడియారం గుండ్రంగా ఉంటుంది. పన్నెండు గంటల తరవాత మళ్ళీ పన్నెండు గంటలు. పగలు తరవాత రాత్రి తరవాత పగలు. ఆది సోమాది ఏడు వారాలు మళ్ళీ పునరావృత్తం (తాడేపల్లి గారూ నెనర్లు!) చంద్రుడి కళల్తో శుక్ల కృష్ణ పక్షాల పిల్లిమొగ్గలు. మన సంవత్సరాలు కూడా అరవయ్యేళ్ళకోసారి తిరిగొచ్చేస్తాయి. సంవత్సరాలే కాదు, యుగాలూ, మహాయుగాలూ కూడా.
ఈ కాలం బాట వెంట ఎన్ని మైలు రాళ్ళు? ఏటేటా మరో ఏడు గడిచిందని గుర్తు చేస్తుండేందుకు .. పుట్టిన రోజులు, పెళ్ళి రోజులు, కాలేజి రీయూనియన్లు . ఇవన్నీ చాలనట్టు, వేరే ఏ సందర్భమూ లేకుండా కేవలం ఏడు దొర్లింది అని అరిచి చెప్పడానికే అన్నట్టుగా ఈ న్యూ యియర్.
కానీ, సంతోషించడానికీ, సెలబ్రేట్ చేసుకోడానికీ పెద్దగా ఏం కనబట్టల్లే. ఏ కోణంలో చూసినా మానవ జాతి ఇంకో మెట్టు కిందకి జారిన సూచనలే కనిపిస్తున్నై. ఈ మాటలు రాస్తుండగా, తిరిగి తలెత్తిన పాలస్తీనియన్ హమాస్ ఇస్రాయెలీ మారణహోమాన్ని చూస్తున్నా ఒక కంటితో.
ఐనా మానవుడు ఆశాజీవి. దురాశ దుఃఖానికి దారితీస్తుందని మన సామెత. నా ఉద్దేశంలో నిరాశ మనల్ని నిర్వీర్యుల్నీ నిర్జీవుల్నే చేస్తుంది.
ఈ విపత్కర సమయంలో నాకందిన సద్గురు బోధ మీతోనూ పంచుకుంటున్నాను.
"సమయం విపత్కరమైనప్పుడు అకౄరంగా ఉండటం (being gentle) అన్నిటికంటే ముఖ్యం."
మిమ్మల్నందరినీ అపారమైన దయ ఆవరించు గాక!

Monday, December 29, 2008

కబుర్లు - డిశంబరు 29

వారాని కొక్కసారి ఒక పేజీడు వాక్యాల్ని పండించడం ఏం పెద్ద కష్టం?
కానీ ఒక్కోసారి అదే ఎవరెస్టు పర్వతారోహణం చేసినంత కష్టమై పోతూ ఉంటుంది.
అనాయాసంగా పేజీలకి పేజీలు రాసి పడేసే సమర్ధుల్ని చూసి అసూయ కుట్టేస్తుంటుంది.
ఖాళీగా ఉన్న కంప్యూటర్ తెరా, తెల్ల కాగితమూ ఒక్కలానే వెక్కిరిస్తాయి, కానీ మూడ్ మాత్రం ససేమిరా రానంటుంది.
బాబ్బాబు, ఈ మూడ్, కిలోల్లెక్కన ఏ బజారులోనన్నా దొరుకుతున్నదేమో, చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి.

డిశంబరు 14 నుండీ జనవరి 13 వరకూ ధనుర్మాసం అంటారు. దక్షిణాది హిందువులందరికీ, ముఖ్యంగా వైష్ణవులకి ఇది పవిత్రమైన మాసం. ఈ నెల రోజులూ ఉదయాన్నే తిరుప్పావై పారాయణ చెయ్యడం శుభం చేకూరుస్తుందని నమ్ముతాము. చిలమకూరు విజయమోహన్ గారు రోజుకో పాట చొప్పున, తమిళ మూలమూ, తెలుగు అనువాదమూ తన బ్లాగులో ప్రచురిస్తున్నారు, అభినందనలు.

డిశంబరు నెల తెలుగు బ్లాగులకి కూడా బాగానే పవిత్రమైనదిగా పరిణమించింది. చాలా సంతోషం. ముందుగా తెలుగుబ్లాగర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ-తెలుగు ఆధ్వర్యంలో హైదరాబాదు బ్లాగర్లందరూ కలుసుకోవడం, అటుపై కూడలి చాట్లో అంతర్జాతీయ సమావేశంలో పాతిక ముప్ఫై మంది బ్లాగర్లు సమావేశం కావడం మంచి స్ఫూర్తి నిచ్చాయి. ఈ రెండు సమావేశాల నించీ కొన్నైనా కార్యాచరణ ప్రణాళికలు పుట్టే ఉంటాయి. వాటిని క్రోడీకరించి అందరి దృష్టికీ వచ్చేట్టుగా ఉంచితే బాగుంటుంది. అరిపిరాల సత్యప్రసాద్ గారు ఆ దిశగా కొంత కృషి చేస్తున్నట్టు కనబడుతున్నది

హైదరాబాదు సమావేశం నించి ఉద్భవించిన ఒక అద్భుతమైన ప్రయత్నం మన వాళ్ళు పుస్తక ప్రదర్శనలో పాలు పంచుకోవడం. ఈ ప్రయత్నంలో చురుగ్గా పాల్గొన్న బ్లాగు మిత్రులందరినీ పేరు పేరునా అభినందిస్తున్నాను. సుమారు రెండేళ్ళ పైగా సాగుతున్న ఈ బ్లాగు ప్రయాణంలో, అర్రె నేనూ అక్కడ ఉంటే బాగుణ్ణే అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ, ఈ సందర్భంలో మాత్రం .. ఈ సందోహంలో పాలు పంచుకుంటూ నేను కూడా అక్కడ లేనే అనే బాధ ఎంత తీవ్రంగా ఊపేసిందో చెప్పలేను. నేను టూరులో ఉండి కూడా, ప్రతి రోజూ రాత్రి మజిలీకి చేరగానే ముందు శ్రీధర్ డెయిలీ రిపోర్టు చదవడం కోసం నెట్ వెతుక్కున్నాను అంటే అతిశయోక్తి కాదు.

ఈ సత్సమయంలో ఒక ప్రత్యేక వ్యక్తిని గురించి కొంచెం చెప్పుకోవాలి. దూర్వాసుల పద్మనాభం గారు. అప్పుడప్పుడూ ఈ-తెలుగు నివేదికల్లో వారి పేరు వినడం, వారు నిర్వహించే తెలుగు గ్రీటింగ్స్ సర్వీసుని అప్పుడప్పుడూ వాడుకోవడం మినహా, వారితో నాకు పరిచయం లేదు. తెలుగు బ్లాగర్ల దినోత్సవం సందర్భంగా తన బ్లాగులోనూ, తెలుగు బ్లాగు గుంపులోనూ, చెర్నాకోల ఝళింపు లా చురుక్కుమనే టపా ఒకటి రాశారు, తెలుగు బ్లాగరుల్లారా మేల్కోండి, మీ భాషకోసం మీరుకూడా ఏమన్నా చెయ్యండి అంటూ. తన మాటల్నే చేతలుగా నిలబెట్టి, పుస్తక ప్రదర్శన జరిగినన్నాళ్ళూ అవిరళంగా శ్రమించారు. ఎవరైనా వారి కృషిని కొనియాడితే ఒక చిర్నవ్వు నవ్వి మళ్ళీ పనిలో మునిగి పోయారు. పూని యేదైన ఒక్క మేల్ కూర్చి జనులకి చూపవోయ్ అన్న మహాకవి ప్రబోధానికి మానుష రూపం పద్మనాభం గారు. అయ్యా, పద్మనాభం గారూ! పెద్దవారు. ఇక్కణ్ణించే రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నాను.

మొత్తానికి ఈ సందోహం అంతా, కొత్త వారిని కంప్యూటర్లో తెలుగు వాడకానికీ, తెలుగు బ్లాగుల వైపుకీ ఆకర్షించడంతో పాటు, కాస్త పాతబడి చప్పబడుతున్న బ్లాగరుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని ఇంజెక్ట్ చేసినట్టుంది. సంతోషం. ఈ ఉత్సాహపు పొంగు చల్లారనివ్వకండి. మంచి టపాలు రాస్తుండండి.
మూడ్ ఎక్కడన్నా కిలోల్లెక్కన దొరుకుతున్నదేమో తెలిస్తే మాత్రం నాకు చెప్పండేం?

Wednesday, December 10, 2008

ఈ మధ్య చూసిన సినిమాలు

గుర్తు చేసుకోడానికి వీలుగా ఉంటుందని రివర్సు వరుసలో వెళ్తాను.
నిన్ననే స్లండాగ్ మిలియనేర్ చూశాం. చాలా బాగుంది. సినిమా కేవలం కామెడీ, సినిమాని సినిమాలాగానే చూడాలి .. ఇట్లాంటి సొల్లు కబుర్లు కాకుండా మంచి సినిమా చూడాలి అనుకునేవారెవరైనా తప్పక చూడాల్సిన సినిమా. ముఖ్య పాత్రలైన జమాల్, సలీం, లతిక సుమారు 8-10 ఏళ్ళ వయసులో, మళ్ళీ 13-15 ఏళ్ళ వయసులో, ఆఖరికి 18-20 వయసులో కనిపిస్తారు. అన్ని వయసుల పాత్రల్లోనూ చేసిన వాళ్ళు బాగా చేశారు కానీ, అతి చిన్న వయసులో సలీం జమాల్ గా చేసిన మగ పిల్లలిద్దరూ తినేశారంతే. ఇర్ఫాన్‌ ఖాన్‌ గురించి చెప్పేదేముంది. గేంషో హోస్ట్ గా అనిల్ కపూర్ చాలా పరిణతి చెందిన నటన కనబరిచారు. నటన పక్కన పెడితే, ఇక సినిమా అంతా స్క్రీన్‌ ప్లే, దర్శకుని ప్రతిభ.

నేను సాధారణంగా సమకాలీన హిందీ సినిమాలకి దూరంగా ఉంటూ ఉంటాను. కానీ ఏదో బలహీన ముహూర్తంలో బలైపోతుంటాను. అలా మూడు సినిమాలకి నా బుర్ర నైవేద్యం పెట్టాల్సొచ్చింది.

ముందు జోధా అక్బర్. ఏదో సోప్ ఆపెరా షోలో అక్బర్ ని హీరో చేసినట్టుగా ఉంది. అక్బర్ గారు వీరోచితమైన మాటలూ, రాజోచితమైన మాటలూ మానేసి, ఇరవయ్యొకటో శతాబ్దపు నాగరిక మగవాడిలా ఆడవారి మనసుల్ని అర్ధం చేసుకోవడం, అంతరంగాలు కలుసుకోవడం లాంటి అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతుంటాడు. ఎంతో రాజనీతిజ్ఞుడిగా పేరు పొందిన అక్బర్ గారు మారు వేషం వేసుకుని బజారు వీధిలో తిరిగితే తప్ప ప్రజలు పన్నుల బాధలు తట్టుకోలేక బాధపడుతున్ణారని తెలుసుకోలేడు. హిందువుల తీర్థయాత్రల మీద ఉన్న పన్ను తొలగించడం ద్వారా ఒక్ఖ దెబ్బని పాప్యులారిటీ పెంచేసుకుంటాడు. పన్లో పని, సదరు హిందువులు, అయ్యవారి ఉదారతకి మెచ్చి "అక్బర్" అని బిరుదిచ్చేస్తారు. (అల్లాహో అక్బర్ అనేది ముస్లిముల సాధారణ ప్రార్ధన అని వాళ్ళు తాత్కాలికంగా మర్చిపోయారు.) ఉన్నంతలో సుగుణం ఏంటంటే ఐశ్వర్య అమ్మగారు నటించాలని ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఆమెకూడా నటించి ఉంటే చచ్చుండేవాళ్ళం. మిగతా పాత్రల్లో కాస్త టేలెంట్ ఏదన్నా ఉంటే అది కోంచెం కూడా జాలువారకుండా దర్శకుడు తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమాకి ఇంకో ప్లస్ పాయింటు అద్భుతమైన ఆగ్రా కోట లో జరుగుతుంది సగం కథ. ఆగ్రా కోటని ఇంత అద్భుతంగా అందంగా నేనెప్పుడూ చూళ్ళేదు.

రెండోది జబ్ వియ్ మెట్. కొంత కాలం క్రితం ఇక్కడ స్నేహితుల వలయాల్లో ఈ సినిమా పేరు మారుమోగింది. ఓయబ్బో ఎంత గొప్పసినిమానో అనుకున్నాం .. ఇన్నాళ్ళు చూడకుండా ఉండిపోయినందుకు తెగ ఫీలైపోయి మరీ డిస్కు తెచ్చుకున్నాం. వోర్నాయనో .. కరీనా అమ్మగారు ఎడాపెడా లెఫ్ట్ రైట్, మైక్ టైసన్‌ లెవెల్లో వాయించేసింది. కోట్లకి పడగెత్తిన వా్ణిజ్య కుటుంబానికి ఏకైక వారసుడుగారు, సినిమా చివర్లో .. ఏ సమస్య ఎదురైనా ఈ పరిస్థితుల్లో కరీనా ఏం చేస్తుందీ అని ఆలోచించి అలా ఆయా సమస్యల్ని పరిష్కరించుకున్నాట్ట .. నాయనా .. అక్కడ ఫ్రిజ్జులో ఉన్న కాలీఫ్లవర్లు, ఒకటి కాదు రెండు తీసుకురా మా చెవుల్లో పెడుదువు గాని.

మూడోది తారే జమీన్‌ పర్. దీన్ని గురించి మన బ్లాగ్వరులు ఇప్పటికి చాలానే రాసేశారు. ఇది మిగతావాటీకంటే చాలా బెటారు. ఆ బుడ్డాడు అద్భుతంగా నటించాడు. (మనలో మాట, సినిమాల్లో ఇది యింక బుడ్డాళ్ళ యుగం అని నాకు కచ్చితంగా నమ్మకం). అమీర్ ఖాన్‌ కూడా నటన పర్లేదు. మరీ క్యూట్ కాకుండా ఏదో తిప్పలు పడ్డాడు. వచ్చిన ఇబ్బందల్లా కథతోటే. ఇటువంటి సమస్యల్ని ఇదింతే, ఇట్లా పరిష్కరించెయ్యొచ్చు అన్నట్టుగా చూపించడం, తలిదండ్రుల్ని ఏదో పాషాణ హృదయులుగా చూపించడం .. కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. అసలింతకీ ఒక ఫండ"మెంటలు" కొస్చెను. ఆ బుడ్డాడు అంత అసాధారణ చిత్రకారుడూ కాబట్టి సినిమా సుఖాంతమయింది. ఒకేళ కాకపోయి ఉంటే? చిత్రకళే కాదు, డబ్బు సంపాయించడానికి పనికొచ్చే ఏ పనిమీదా వాడికి ఆసక్తి, తద్వారా ప్రావీణ్యత కలగక ఉండి ఉంటే? ఈ కథ అప్పుడెలా ఉండేను?

లాష్టండ్‌ఫైనలు బుజ్జిగాడు .. ప్రభాస్ .. త్రిష .. పూరీ .. నా బుర్ర చపాతీ! :)

Monday, December 8, 2008

కబుర్లు - డిశం 8

సుమారు నెల్రోజుల క్రితం, అమెరికా అధ్యక్షునిగా బరాకొబామా ఎన్నికైన నేపథ్యంలో చారిత్రక నిర్ణయం అని ఒక టపా రాశాను. ఈ ఆదివారం పొద్దున రేడియోలో అనుభవజ్ఞుడైన వ్యాఖ్యాత యువాన్ విలియమ్స్ అమెరికాలో జాతి సంబంధాల్ని గురించి మాట్లాడుతూ, నేను ఆ టపాలో చెప్పడానికి ప్రయత్నించిన ముఖ్య విషయాన్నే తన విశ్లేషణలో నొక్కి చెప్పడం నాకు చాలా సంతోషం కలిగించింది.

భారతీయ సాంప్రదాయ సంగీతం (దీన్నే కొందరు శాస్త్రీయ సంగీతం అంటారు) ఆఫ్ఘనిస్తానులో కూడా ప్రాచుర్యం పొందిందని చాలా కొద్దిమందికి తెలుసు. పశ్చిమాన్నుంచి ఇరాను (పెర్శియా) ప్రభావం వలన, మత సంబంధాల వలన ఎక్కువగా సూఫీ సంగీతము ప్రాచుర్యం పొందింది అక్కడ. బహుశా ఎప్పుడో మొగల్ చక్రవర్తుల పాలనలో ఇటునించి హిందుస్తాని సంగీత ప్రభావం అక్కడిదాకా చేరి ఉంటుంది. కాల క్రమేణా పోషణ లేక సన్నగిల్లినా అక్కడక్కడా అకస్మాత్తుగా మెరిసి ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను ఇక్కడ వివిలో చదువుకునేప్పుడు వివి వారు ఏదో ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని రవిశంకర్ సితార్ వాదన కచేరీ ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి భారతీయ విద్యార్ధులము చాలా మంది స్వఛ్ఛంద సేవకులుగా పనిచేశాము. కచేరీ మొదలై పోయింది. నేనొక ప్రధాన ద్వారం దగ్గర కాపలా ఉన్నాను. ఒక యువకుడు హడావుడిగా టిక్కెట్టు కొనుక్కుని వచ్చాడు. ఇక్కడ కచేరీ మొదలై పోయినాక లోపలికి వెళ్ళనివ్వరు. మొదటి ఐదారు నిమిషాల తరవాత ఒక బుల్లి విరామం ఇస్తారు .. లేటుగా వచ్చిన వారు ఆ సమయంలోనే లోపలికి వెళ్ళొచ్చు. అలా ఈ అబ్బాయి అక్కడ తలుపు దగ్గర నిలబడి పోయాడు. ఆ సమయంలో వాడితో కాసేపు ముచ్చటించాను. అతను ఆఫ్ఘను అనీ, వాళ్ళ కుటుంబంలో హిందుస్తానీ సంగీత ఆస్వాదన వంశ పారంపర్యంగా వస్తున్నదనీ, ఈ కచేరీకి హాజరయ్యేందుకు అతగాడు సుమారు 120 మైళ్ళు డ్రైవు చేసుకుని వచ్చాడని తెలిసి నిర్ఘాంతపోయాను.
ఇవ్వాళ్ళ పొద్దున రేడియోలో వినబడిన ఆఫ్ఘను హిందుస్తానీ సంగీతపు తునక మీరూ రుచి చూడవచ్చు.

గత వారంలో బుజ్జిగాడు (ప్రభాస్, పూరీ) అనే ఒక యెదవ సినిమా, నిశాంత్ (అమ్రీష్ పురీ, గిరీష్ కర్నాడ్, శ్యాం బెనగల్) అనే ఆర్టు సినిమా చూశాను. త్రిషాని తెలుగు సినిమాల్లో హీరోయినుగా పరిచయం చేసిన వాణ్ణి జూబిలీహిల్స్ చెక్ పోస్టు దగ్గర కొరత వెయ్యాలి. ఏమాట కామాట ప్రభాస్ నటనలో కాస్త ఇంప్రూవ్ అయినట్టున్నాడు. ఇంక అంతకంటే ఆ సినిమా గురించి చెప్పేందుకు ఏవీ లేదు. నిశాంత్ గురించి చెప్పాలి అంటే చాలానే ఉంది. అది ఇంకో సారి తీరిగ్గా చెబుతా సందర్భోచితంగా.

మాకు సుమారు అరవై మైళ్ళ దూరంలో ఉన్న ఏనార్బరు నగరంలో UMS అని ఒక సంస్థ ఉంది. సెప్టెంబరు నెలనించీ మేనెల దాకా రకరకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం దీని ప్రధాన కర్తవ్యం. డిసెంబరులో, క్రిస్మసు పందగని పురస్కరించుకుని వీళ్ళు జరిపే ఒకే ఒక కార్యక్రమం మెస్సాయా .. బైబులు లోని వివిధ వాక్యాల సముదాయానికి జెర్మను సంగీత కారుడు హేండెల్ స్వరపరిచిన స్వర సాహిత్య సంకలనం ఇది. క్రీస్తు అవతారాన్ని గురించి ఒక ఆధ్యాతంక స్థాయిలో కథలాగా చెప్పుకొస్తుంది. సుమారు నూట యాభై మంది గాయనీ గాయకులతో కూడిన UMS Choral Union వారు అద్భుతంగా గానం చేసిన ఈ కచేరీని చారిత్రాత్మక హిల్ ఆడిటోరియములో నిన్న రాత్రి విని వచ్చాను. ఒకే ఒక మాట .. అద్భుతం!

Wednesday, December 3, 2008

నలుగురం కలిసిన వేళ .. పాపినేని శివశంకర్

నలుగురం కలిసిన వేళ

దూరం నించి స్నేహనయనాలతో చిరునవ్వుల్తో
ఆరోగ్యంగా మీరు నడిచివస్తారు
మన చేతులు మృదుగాఢంగా పలకరించుకుంటాయి
అందరం టీపాయ్ చుట్టూనో చాప మీదో
బయట పచ్చిక పైనో విశ్రాంతి భంగిమల మవుతాం
మా పాప పరిగెత్తుకొచ్చి మీ ఒళ్ళో వాలుతుంది
సాయంత్రం చల్లని గాలిలా వీస్తుంటుంది
గూళ్ళు పక్షుల్ని పిలుస్తుంటాయి

మనలో ఒకళ్ళు రాత్రి సినిమా గురించో
కురవక కురిసిన వాన గురించో ప్రస్తావన చేస్తారు
అంతలో మరొకళ్ళు సగం చదివిన లిటిల్ ప్రిన్స్ మీద
సందేహాలు రేపుతారు
ఎంతకీ తెగని చిక్కుముళ్ళవుతాయి చర్చలు
ఇంట్లోంచి టీ వస్తుంది
టీ పొగల మధ్య మిత్రుడి గొంతు విప్పుకొని
ఒక కవిత వానకాలవలా జాలువారుతుంది
మనలో ప్రాణతరంగాలు చెలరేగుతాయి
మెరిసే కళ్ళతో పాప మన వంకే
మార్చి మార్చి చూస్తుంటుంది
ఆ పైన - మనుషుల డబ్బు వాసనో మత శిలోన్మాదమో
దేశమాత గాయాలో వాదానికొస్తాయి
మాటలు ముక్కుల్తో పరస్పరం రాసుకుంటాయి
ఘర్షించి ఘర్షించి మనం
జీవనలయని గట్టిపరుచుకుంటాం
ప్రస్తావన మారిపోయి
ఈసారి మనం పియానో మెట్లమీదగా
బీథోవెన్ ఐదో సింఫొనీలోకి
ఒక పులకరింతతో ప్రయాణిస్తాం
హృదయాలు పిట్టలై ప్రపంచమంతా తిరిగొస్తాయి
సాయంత్రం చీకటిగా చిక్కపడుతుంది
మనలో అదృశ్యదీపాలు వెలుగుతాయి

నలుగురం కలిసిన వేళ
మనం మరొకళ్ళలోకీ మరొకళ్ళు మనలోకీ
ప్రవహించటం ఎంత బావుంటుంది
*** *** ***

"ఒక సారాంశం కోసం" కవితా సంపుటినించి
కవి .. పాపినేని శివశంకర్
1990 లో ముద్రితం

డిట్రాయిట్ లో స్లం డాగ్ మిలియనీర్

అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రతిష్ఠాత్మకమైన బహుమతుల్ని గెలుచుకోవడమే గాక విమర్శకుల, ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న ఈ చిత్రాన్ని డిట్రాయిట్ లో వెండి తెరపై చూడొచ్చు.

రాయల్ ఓక్ లోని మెయిన్ ఆర్ట్ థియేటర్లో డిసెంబరు 5 నించీ ఈ సినిమాని ప్రదర్శిస్తున్నారు.

డిట్రాయిట్ పరిసర ప్రాంత నివాసులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తాను.

నవతరంగం పేజీ

సినిమా గూడు

Monday, December 1, 2008

కబుర్లు - డిశంబరు 1

సుమారు ఆగస్టు నెలనించీ ఎడతెరిపి లేని పని. మధ్యలో వారాంతాల విశ్రాంతి దొరుకుతూ ఉన్నా, సర్వాంతర్యామి లాగా పని వత్తిడి నొక్కుతూనే ఉంది, పూర్తిగా విశ్రాంతి తీసుకోనీకుండా. మొత్తానికి ఆ పని ఒక కొలిక్కి చేరింది. పూర్తిగా సఫలమయిందో లేదో అప్పూడే తెలియదు గానీ .. కర్మణ్యేవాధి కారస్తే అన్నట్టు .. నేను చెయ్యగల భాగం పూర్తయింది. సరిగ్గా ఆ సమయానికే ఈ ప్రత్యేక శలవుదినాలూ కూడుకుని, కాస్త మనసుకీ శరీరానికీ ఆరాం దొరికింది.

థేంక్సు గివింగ్ పండక్కి అమెరికను చరిత్రలో సంస్కృతిలోఒక ప్రత్యేక స్థానం ఉంది. దీని చారిత్రక నేపథ్యం తెలుసుకో దలచిన వారు వికీలో చదువుకోవచ్చు. నేను చూసినంతలో ఇది కుటుంబం అందరూ కలిసి జరుపుకునే పండుగ. అమెరికను ప్రజలకి కుటుంబం అంటే లెక్ఖ లేదు అనే భ్రమ ఒకటి మనవాళ్ళల్లో కనిపిస్తుంది. ఇది నిజం కాదు. ఎక్కువ శాతం అమెరికన్లు కుటుంబానికి చాలా ప్రాధాన్యత నిస్తారు. ఈ థేంక్సుగివింగ్ పండగ కోసం వందల వేల మైళ్ళయినా ప్రయాణం చేసి అమ్మమ్మ తాతయ్యల ఇంటికో, మామ్మ తాతయ్యల ఇంటికో చేరుకుంటారు. పొద్దుటినించీ రకరకాల వంటలు చేస్తారు. భోజనానికి ముందు కుటుంబ సభ్యులందరూ ఒకరి తరవాత ఒకరు, ఆ పరమాత్మునికి కృతజ్ఞతలు విన్నవించుకుంటారు, తమ తమ జీవితాల్లో వివిధ వరాలు పొందినందుకు. పేరుకి దీన్ని థేంక్సు గివింగ్ డిన్నరు అంటారు గానీ తిండి సంరంభం మధ్యాన్నం ఏ మూడింటికో మొదలవుతుంది. ఇహ రాత్రి జనాలకి ఓపిక ఉన్నంతవరకూ తినడం తాగడం కొనసాగుతుంది. టర్కీ కోడి, మంచి గుమ్మడికాయతో పై, క్రాంబెర్రీ (మన వాక్కాయల్లాగా ఉంటాయివి .. అన్నట్టు మన భాస్కర్ తమ్ముడు వాక్కాయ పప్పు చెయ్యడం రాయొచ్చు నలభీమపాకంలో) రెలిష్, బ్రెడ్డు ముక్కల్లో రకరకాల దినుసులు కలిపి చేసే స్టఫ్ఫింగ్ .. ఇవి థేంక్సు గివింగ్ భోజనంలో తప్పని సరిగా ఉండే సాంప్రదాయకమైన వంటకాలు.

మా యింటో థేంక్సుగివింగు కోసం ప్రత్యేకంగా చేసినదేం లేదు. అంతకు ముందు రాత్రి రేడియోలో ముంబాయి దాడి వార్తలు తెలుసుకున్న దగ్గర్నించీ మనసు మనసులో లేక ఆ రోజంతా అలజడిగానే గడిచింది. ఇహ ఇలా లాభం లేదని, కొంచెం చైతన్యం కావాలని ఒక అయిదారు స్నేహితుల కుటుంబాలని శనివారం రమ్మని ఆహ్వానించాము. శుక్రవారం అంతా పడి పడి వంటలు చేశాం. ఇక్కడ ఇంకో సదుపాయం వచ్చే పాట్లక్ అని వచ్చే అతిథులు కూడా ఒక్కో వంటకం తీసుకొస్తారు, గృహస్తులే మొత్తం వంట బాధ్యత తీసుకోకుండా. పిల్లాజెల్లాతో ఏడింటికల్లా అందరూ వచ్చేశారు. రెండేళ్ళ నించీ పదేళ్ళ వయసు మధ్య అరడజను మంది పిల్లలు చేరేప్పటికి ఇంట్లోనే ఒక పార్కు వాతావరణం వచ్చేసింది. పరిచయాలు, కబుర్లు, ఇక్కడ ఎకానమీ గురించీ, ముంబాయి దాడి గురించీ పరామర్శలు .. షడ్రుచులతో బ్రహ్మాండమైన భోజనం .. అటుపైన సుమారు గంట సేపు పెద్దలందరూ కూడా పిల్లలై పోయారు .. తెలుగు మూకాభినయ పోటీలు. Dumb Charades .. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే, వెన్నుపూస ఘల్లు ఘల్లు మన్నదే ఇత్యాది సాహిత్యసుమాల్ని తమ టీం మేట్లకి అభినయం ద్వారా జనాలు చూపించడం .. మిగతా వారంతా పడి పడి నవ్వడం .. మధ్య మధ్య .. పెదవులు కదుపుతున్నారు, టైమైపోతోంది అనే ఆరోపణలు. మొత్తానికి మంచి సందడిగా గడిచింది. ఆట ముగిసి అందరం మళ్ళీ పెద్దతనపు హందా ముసుగులు తొడుక్కుని మర్యాదగా శలవు పుచ్చుకున్నాం.

పాపినేని శివశంకర్ గారు ఒక పద్యంలో చెప్పినట్టు అప్పుడప్పుడూ ఇంకోళ్ళు మనలోకీ మనం ఇంకోళ్ళలోకీ ప్రవహించడం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా!