Monday, October 27, 2008

యే క్యా హో రహా హై?

జానేభీదో యారో సినిమాలో పతాక సన్నివేశంలో అన్ని ముఖ్యపాత్రలూ ఒక థియెటర్లో జరుగుతున్న ద్రౌపదీ వస్త్రాపహరణం నాటకంలోకి చొచ్చుకు వచ్చేస్తాయి. నాటకం అస్తవ్యస్తమై పోతుంటుంది. నాటకంలో ధృతరాష్ట్రుడి పాత్ర వేస్తున్న వాడికి, చచ్చినట్టు కళ్ళు మూసుకుని కూర్చోవాలి కాబట్టి, ఏం జరుగుతోందో అర్ధం కాదు. కళ్ళు తెరిస్తే నాటకం ఇంకా అభాసు పాలవుతుందేమోనని భయం. అందుకని రెణ్ణిమిషాలకోసారి, "యే క్యా హోరహా హై" అని అరుస్తుంటాడు, చెవికోసిన మేకలాగా. తరవాత ఈ డయలాగు ఒక దూరదర్శన్ కామెడీ సీరియల్లో (పేరు నాకిప్పుడు గుర్తు లేదు) ఒక పాత్రకి సిగ్నేచర్ డయలాగ్ గా ప్రాచుర్యం పొందింది.

అమెరికా ఆర్ధిక వ్యవస్థకి పట్టిన పడిశానికి ప్రపంచ ఆర్ధిక మార్కెట్లన్నీ ముక్కు దిబ్బెళ్ళేసి ఎడాపెడా తుమ్ముతున్నాయి. ఏ దేశ వాసులైణా, సాధారణ ప్రజలందరూ, పైన చెప్పిన ధృతరాష్ట్రుడిలాగా .."యే క్యా హోరహా హై" అన్న అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.

ఇటీవల మన తెలుగు బ్లాగ్లోకంలో ఈ వింత పరిస్థితిని మనబోంట్లకి కూడా అర్ధమయ్యేలా విశదీకరిస్తూ రెండు మంచి టపాలొచ్చాయి.
అరిపిరాల సత్యప్రసాద్
కృష్ణశ్రీ
ఆ టపాలకి వచ్చిన కామెంట్లలో మరికొన్ని మంచి సమాచార వేదికలకి లంకెలు కూడా ఉన్నాయి.

ఐతే మనకి రావలసిన ప్రశ్న .. అమెరికాలో మార్టుగేజి ఋణాల్ని వాళ్ల బేంకులు అల్లకల్లోలం చేసుకుంటే మనకెందుకు ఈ సంక్షోభం అని. ఈ విషయం మీద నాకు అర్ధమైన పరిస్థితిని మీతో పంచుకునే ప్రయత్నం ఇది.

సత్యప్రసాద్ గారు చెప్పినట్టు, ఋణాలిచ్చిన బేంకులు, ఆ ఋణాలన్నిటినీ కుప్పపోసి, మళ్ళీ చిన్నా పెద్దా పేకెట్లుగా కట్టి వాటిని విపణి వీధిలో అమ్ముతుంటారు. స్టాకులు, బాండ్లు కొనుక్కున్నట్టే ఇన్వెస్టర్లు (ప్రభుత్వాలు, ప్రభుత్వ బేంకులు, ఇన్వెస్టుమెంట్ బేంకులు, కంపెనీలు, వ్యక్తులు) వీటిని కూడా కొనుక్కుంటారు. ఎక్కువగా వీటి అమ్మకాలు కొనుగోల్లు సాగించేది బేంకులే. ఎప్పుడైతే ఋణాల చెల్లింపులు సజావుగా జరగడం లేదని తెలిసిందో, ఈ పేకెట్ల విలువ ఠక్కున పడిపోయింది. అంటే వాటిని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. (మార్కెట్లో ఒక వస్తువుకి కొనుగోలు దార్లు ఎంత వెల యిచ్చి కొనేందుకు తయారుగా ఉన్నారు అన్న దాన్ని బట్టే దేని విలువైనా నిర్ణయించబడుతుంది.) ఒక పక్కన బేంకుల డబ్బు ఇలా విలువ లేని (ఎవరూ కొనని) ఈ మదుపుల్లో ఇరుక్కు పోయింది. దాంతో తాము చేసే ఇతర కార్యకలాపాలకి డబ్బు కరువైంది. ఇది ఒక మెట్టు, కిందకి దిగజారడంలో. ఇంకో పక్కన ఈ మదుపుల్ని తమ బేలెన్సు షీట్లలో నష్టంగా చూపించాల్సి వచ్చింది. ఇంతింత పెద్ద లాసులు ఉండేప్పటికి, ఈ బేంకులు సరిగా నడవట్లేదు అనే భయంతో ఆ బేంకుల స్టాకు విలువ పడిపోవడం మొదలైంది. ఇది దిగజారుడికి రెండో మెట్టు.

బేంకుల స్టాకు విలువ పడిపోయినా పెద్ద ఇబ్బంది లేదు గానీ మొదటి దానితోనే వచ్చింది తంటా అంతా. బేంకులు చేసే అసలు ముఖ్యమైన పని డబ్బుని తిప్పుతూ ఉండడం. ఆర్ధిక వ్యవస్థ ఒక పెద్ద కర్మాగారం అయితే, డబ్బు దాన్ని నడిపే ఇంధనం ఐతే, బేంకులు ఆ ఇంధనాన్ని సప్లై చేసే పంపులు. ఇలా బేంకుల డబ్బు ఇరుక్కు పోయేప్పటికి రెండు ముఖ్య పరిణామాలు జరిగాయి. ఒకటి బేంకులు తమ దగ్గర ఉన్న డబ్బునే ఋణాలివ్వ గలవు గానీ లేని డబ్బుని ఇవ్వలేవు. ఒక్క సారిగా కొన్ని బిలియన్ల డాలర్ల మదుపు హుష్ కాకీ ఐపోయేప్పటికి అది కేవలం లాసు ఒక్కటే కాదు. ఆ మేరకి తిరిగి ఋణాలిచ్చే వెసులుబాటుని ఆ బేంకు కోల్పోయిందన్న మాట. రెండోది, కాస్తో కూస్తో డబ్బులున్న బేంకులు కూడా, ఈ దెబ్బతో ఎవడికి అప్పిస్తే ఏవి నష్టం మీద పడుతుందో అనే భయంతో బిర్ర బిగుసుకు కూర్చున్నాయి. ఇంకొక్క ఋణం మంజూరు చెయ్యాలంటే చచ్చే భయం పట్టుకుంది. నా పంపుల ఎనాలజీలో చెప్పాలంటే, ఒక పంపు ఫేలయింది. రెండో పంపుకూడా ఫేలవుతుందేమోనని భయంతో స్విచ్చి ఆఫ్ చేసేశారు.

ఈ దెబ్బతో చిన్నా పెద్దా కంపెనీలకి అవసరానికి డబ్బు అందడం మానేసింది. ఆర్ధిక వ్యవస్థకి ప్రాణమైన డబ్బు ప్రవాహం నిలిచి పోయింది. ఈ కారణం వల్ల (కేవలం సబ్ ప్రైం వల్ల కాదు) ఈ సంక్షోభం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలన్నిటినీ ఏల్నాటి శనిలా పట్టుకుంది. అంతే కాక, ఋణాల సెకండరీ డెరివేటివ్స్ లోనూ, ఈ దెబ్బతిన్న బేంకుల్లోనూ అనేక ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, ప్రభుత్వ బేంకులు, ఇంకా బహుళజాతి వ్యాపార సంస్థలు మదుపు దార్లుగా ఉండడంతో ఆయా ఇన్వెస్టుమెంట్లన్నీ కూడా బలంగా దెబ్బ తిన్నాయి.

టూకీగా అదీ కథ.

ఇప్పుడు అమెరికా ప్రభుత్వమూ, ఇతర ప్రభుత్వాలూ దీన్ని సరి దిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలు, బేంకులకి చేయూతనివ్వడం మాత్రమే కాదు .. గడ్డ కట్టి పోయిన డబ్బు ప్రవాహాన్ని మళ్ళీ కరిగించి కాస్త కాస్తగా ప్రవహింప చెయ్యాలని, ఈ జీవనదిని పునరుద్ధరించాలని .. వాళ్ళు పడుతున్న పాట్లు. ప్రస్తుతానికైతే .. ఏమీ పని చేస్తున్న సూచనలు లేవు. నాలిక కాల్చుకున్న తెనాలి రామలింగడి పిల్లి తంతుగా ఉన్నది బేంకుల ప్రవర్తన. చూద్దాం, ఏమవుతుందో!

Saturday, October 25, 2008

ఫేంటసీ కథ కమామిషు

ఈసారి కథా కమామిషు వ్యవహారంలో జరిగిన జాప్యాలస్యానికి అందర్నీ, ముఖ్యంగా కథలు రాసిన వారిని క్షమాపణలు వేడుతున్నాను.

మనం ఈదుతున్నాం చెంచాడు భవసాగరం
ఇచ్చిన అంశాన్ని ఆసరాగా చేసుకుని, ఈనాటి ఒక గృహిణి మనోభావాలకి అద్దం పడుతూ, ఒక కలలాగా మంచి ఫేంటసీ అల్లారు రమణిగారు. ఆ ఫేంటసీలోనే, మొగాళ్ళు కాస్త తమ భార్యల బాధని అర్ధం చేసుకోవాలని మెత్తమెత్తగానే చురకలు కూడా వేసేశారు. ముఖ్యంగా, కథ మొదణ్ణించీ చివరి దాకా ముఖ్య పాత్ర అయిన లక్ష్మి మనస్తత్వం చాలా చక్కగా తీర్చి దిద్దారు. నిజంగా కథలో తప్పు పట్టేందుకు ఏమీ లేదు. అక్కడక్కడా రచయిత్రి వాక్కుగానో, పాత్రల వాక్కుగానో తోంగి చూసిన సామెతలు సమయోచితంగా చురుక్కుమన్నాయి. వైకుంఠంలో నాథునితో సంభాషణలో లక్ష్మీ దేవి నొక్కిన సన్నాయి నొక్కులు కూడా బాగున్నాయి. ఒక చిన్న గమనిక. మన పురాణాల ప్రకారం బ్రహ్మ విష్నువుకి కొడుకవుతాడు గనక ఆ వరసలు అలా నిలిపి ఉంటే బాగుండేది.
ఇది వరకు కథాంశాల మీద రాసిన కథలకన్నా ఈ రచనలో మంచి పరిణతి కనిపిస్తున్నది. రమణి గారికి అభినందనలు.
ఐతే, పోటీ విషయానికొస్తే, పలువురు గమనించినట్లు, పోటీకి ప్రకటించిన విషయం, రచయిత్రి చెప్పదల్చుకున్న కథకి ఒక చిన్న పార్శ్వంగా మిగిలిపోయింది గానీ కథకి కేంద్రం కాలేదు. పైగా, బ్రహ్మ మగవారి తలరాతలు మార్చడం అనే అంశం వల్ల వచ్చే ఫలితాల్ని ఒకట్రెండు చిన్న దృశ్యాలో చూపించారు గానీ, ఆ ఘటన ఫలితం కథలో ముఖ్య పాత్రలైన లక్ష్మి శ్రీనివాసులకి ఏమీ తగల్లేదు.

కాసనోవా 2020
ఒక అజ్ఞాత రచయిత సమర్పించిన అద్భుతమైన సైన్సు ఫిక్షన్ ఫేంటసీ కథనం ఇది. ఎవరన్నా కాస్త సాహసి అయిన నిర్మాత, క్రాంతదర్శి అయిన దర్శకుడు ఉంటే మంచి రసవత్తరమైన సినిమా తియ్యొచ్చు. ఈ రచయిత ఊహా బలానికి హేట్సాఫ్ అనకుండా ఉండలేకపోతున్నా. అనేకానేక అభినందనలు.
తమాషాగా, బ్రహ్మ సృష్టించిన ఈ మగ తలరాతని తన టెక్నికల్ జీనియస్సుతో కథానాయకుడు జయించినట్టుగా ఊహించి రచయిత మంచి పథకమే వేశారు. ఐనా, ఈ కథకి కూడా నేనిచ్చిన కథాంశం ఒక చిన్న పార్శ్వంగా ఉండిపోయింది తప్ప కథలో ముఖ్య భాగం కాదు.అందుకని దీనికీ బహుమతి లభిచదు.
ఇటువంటి భవిష్యత్, సైన్సు ఫిక్షను కథలు రాసేప్పుడు రచయిత కొంత సంయమనం పాటించాలి. ఎటువంటి అంశాలు ఎక్కడెక్కడ ఎలా పరస్పరం ఫిట్ అవుతున్నాయని సరి చూసుకుంటూ ఉండాలి. ఉదా .. ఎవరో ఇద్దరి మధ్యన సంభాషణలాగా మొదలైన కథలో, ఆ సంభాషణ ప్రసక్తి మధ్యలో గానీ చివర్లో గానీ మళ్ళీ రాదు. దొంగల స్థావరంలో సంభాషణలు, జరిగిన సంఘటనలు మరీ అడివిరాముడు సినిమా టైపులో ఉన్నై. మొదటి అధ్యాయంలో పదే పదే సూచనగా కనిపించే ఎర్రగొర్రె పిల్లకి మిగతా కథలో ఏమీ ప్రాముఖ్యత లేనట్టుంది. ఇట్లాంటివి కథనిండా మరి కొన్ని. వీటి మీద దృష్టి పెట్టి, అదే రకమైన పదునైన కథనంతో రాస్తే, ఈ రచయిత తెలుగులో అద్భుతమైన సైన్సు ఫిక్షను సృష్టించ గలరు, సందేహం లేదు.

కథ కథ కందిత్తు
దైవానిక ఈ అంశానికి రాసిన కథలో చాలా మంచి పరిణతి కనిపిస్తోంది, కథకి ఒక సెంట్రల్ థీం, దాన్ని నడిపింఛడానికి పన్నిన వ్యూహము, తదనుగుణంగా ఎన్నుకున్న పాత్రలు ఈ కథకి వనె తెచ్చాయి. భార్యా భర్తల పాత్రలు రెండూ, ఒకరి తరవాత మరొకరు నేను అని కథ నడిపించడం చాలా కష్టమైన పని. అది సమర్ధవంతంగానే నిర్వహించారు. దేవుడు భక్తురాలికి వరమిచ్చే సన్నివేశం కూడా, దేవత నోటి ద్వారా వ్యంగ్య ధోరణిలో చెప్పించి మంచి సందర్భోచితమైన హాస్యం పండించారు. ముగింపు కొంచెం మణిరత్నం సినిమా ష్టైల్లో సుఖాంతమైనట్టుంది. ఈయన కూడా ఇది కలే అని తేల్చేశారు. ఈ కథ కూడా ఇచ్చిన అంశాన్ని పూర్తిగా పట్టించుకోలేదు. పెళ్ళిళ్ళు పాడవడం వల్ల స్త్రీలకే కోపం కలిగినట్టు చూపించడం ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా, మంచి వ్యంగ్య కథల్ని ఈయన కలం నించి ఆశించవచ్చు.

శాపమైన వరం (ఓ కాకరకాయ)
ఈ సారి వికట సింగు, ఐ మీన్, వికట కవి గారు తెరంగేట్రం చేశారు. కథాంశానికి ఆయన చేసిన ఊహ, కథనం మంచి హాస్య భరితంగా ఉన్నాయి. కానీ కథ చెప్పే విధానంలో పట్టు లోపించి వదులు వదులుగా ఉంది. పాత్రల పేర్లు, జరిగిన వింత సంఘటనల పరిణామాల్ని కల్పించడంలో మంచి సృజనాత్మకత చూపించారు. సంఘటనల మధ్య కార్య కారణ సంబంధం, పాత్రల మనస్తత్వ చిత్రణ, సెటైరు పాలు ఎక్కువై, కథా రూపానికి దూరంగా వెళ్ళిపోయాయి. ఇంకాస్త శ్రద్ధ పడితే ఈయన సమకాలీన విషయాలపై మంచి సెటైర్లు రాయగలరు.

జ్యోతి గారు వ్యక్తిగత వేగు ద్వారా పంపారు తన కథని. కథ స్వరూపాన్ని ఊహించడంలో నా ఊహకి అతి దగ్గరగా వచ్చారు. నేనిచ్చిన కథాంశాన్ని యథా తథంగా స్వీకరించి అనేక జంటల మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేశారు. అలాగే అదే ఫెంటసీ ఆలోచనని పొడిగించి స్త్రీల ఘోర తపస్సుకి దీటుగా మగవారితో యజ్ఞాలు చేయించారు. ఐతే, ఈ కథలో కూడా సంఘటనల మధ్య కార్య కారణ సంబంధాల్ని సరిగ్గా పట్టించుకోక పోవడం, పాత్రలకి ఒక వ్యక్తిత్వం లేకపోవడం వంటి లోపాలు మిగిలాయి. ఏదేమైనా, ఇదివరకటి రచనల మీద భాషలోనూ, రచనా వ్యూహంలోనూ చాలా ఇంప్రూవ్‌మెంట్ కనబడుతోంది.

సృష్టి 25.0 అను జానపద పౌరాణిక సైన్స్ ఫిక్షను కథ
ఈ పోటీతో కథకుడిగా తెరంగేట్రం చేసిన చివుకుల కృష్ణమోహన్ చమత్కృతులతోనూ, రచనా వ్యూహంతోనూ పాఠకుల్ని అలరించే విధంగా కథని మలచారు. కథాంశాన్ని వాడుకున్న పద్ధతి కూడా నా మనసులో ఉన్న దృశ్యానికి బాగా దగ్గరగా వచ్చింది. సంభాషణల్లోని యెకసెక్కాలు అలనాటి సెటైరు అతిరథుల్ని తలపిస్తున్నాయి. ముఖ్యమైన లోపం, కథద్వారా సందేశం ఇవ్వాలనుకోవడమే గాక, కథకుడిగా చొరబడి మరీ ఇవ్వ బూనడం. ఇంత చక్కటి కథనం చదివాక ఇది హరాయించుకోవడం కొంచెం కష్టం. అక్కడక్కడా సంభాషణల్లో, నుడికారాలు ధ్వనించే చోట్ల, అన్ని పాత్రలూ కృష్ణమోహన్ లాగానే మాట్లాడుతుంటాయి. ఏదేమైనా, ప్రయత్నం కొనసాగిస్తే మన బ్లాగ్లోకం నించి ఇంకో మంచి కథా రచయిత పుడతారని నాకు ఏ మాత్రం సందేహం లేదు.

ఈ సారి బహుమతి కృష్ణమోహన్ కి.

పాల్గొన్న రచయితలందరికీ మరొక్కసారి అభినందనలు.
ప్రస్తుతానికి ఈ కథ రాసే పోటీల్ని కట్టి పెడుతున్నాను. మళ్ళి ఎప్పుడన్నా సందర్భోచితంగా ప్రయత్నిద్దాము.

Monday, October 20, 2008

అక్టోబరు గడికి స్లిప్పుల సర్వీసు

పొద్దు గడికి స్లిప్పులందించే సుగాత్రిగారు ఎక్కడో స్లిప్పై పోయారు.
ఎక్కడవున్నా వచ్చి అటెండెన్సు వేయించుకోవలసిందిగా కోరుతున్నాం.

పొద్దెరుగని గడి పిచ్చిగాళ్ళకి ఈ స్లిప్పులభారం తలకెత్తుకోక తప్పేదేముంది?

మొదటి వాయ ఇదిగో..

అడ్డాలు:
1. సాయం కావాలా? టైమైపోయిందే?
32. అవ్వలు, బువ్వలు, గవ్వలు, రవ్వలు .. టైమింగు కాదు, రైమింగండీ బాబూ!

నిలువులు:
1. రాజమండ్రి హిష్టరీ ఇది. చిత్రంగా ఉందే!
4. దీన్నీ కొద్దిగా సాగదీశామనుకోండి, పిచ్చెక్కిందనుకుంటారు.

ఇక విజృంభించండి.

Thursday, October 16, 2008

కాసిని కబుర్లు

ఎప్పుడు కొత్త టపా రాయాలన్నా .. ఏదో ఒక వత్తిడి. చాలా క్లెవరుగా రాయాలనో, లేక వినోద చమత్కార భరితంగా రాయాలనో, .. ఈ వత్తిళ్ళు లేకుండా, మిత్రులతో కాసేపు పిచ్చాపాటీ చెప్పుకున్నట్టు, ఈ గత వారం పది రోజుల్లో నా దృష్టికి వచ్చిన వింతలు విశేషాలూ చెప్పుకుంటూ ఒక టపా హాయిగా ఎందుకు రాసుకోకూడదూ అని ఈ తెల్లారు జామున ఈ బ్రిలియంటైడియా వచ్చేసింది.

మన రానారె రాసిన కథ పేరు గలవాడేను మనిషోయ్ ఈ నెల తెలుగు నాడి మాస పత్రికలో పునః ప్రచురితమైంది. ఇతగాడు ఈ మంచి కథ రాయడానికి కాస్తో కూస్తో నేను కూడా కారణమైనందుకు పిచ్చ సంతోషంగా ఉంది నాకు. నా యువమిత్రుడికి హార్దికాభినందనలు. ముందు జాలపత్రిక ఈమాటలోనూ, ఇప్పుడు అచ్చుపత్రిక నాడిలోనూ కథలు ప్రచురించడంతో రచయితగా రానారె ఇంకో మెట్టు పైకెక్కాడు. ఆ బాధ్యతని గుర్తించుకుని సాహితీ క్షేత్రంలో ఇంకా మంచి కథలు విరివిగా పండిస్తాడని నా ఆశ, ఆశీస్సులు కూడా. బ్లాగర్లకీ బ్లాగ్విజిటర్లకీ రానారె చిరపరిచితుడే అయ్యుండచ్చు. ఒకేళ కొత్తోళ్ళకి తెలీదేమో .. నామిని చిత్తూరు మాండలికానికి సాటి వచ్చేట్టుగా కడప జిల్లా గ్రామీణ జీవితాన్ని తనదైన భాషలో తెరకెక్కిస్తున్న వీరబెల్లె వీరుడు రానారె.

పని లేనప్పుడల్లా యూట్యూబులో దూరి కెలుకుతూ ఉంటాను .. ఒక్కోసారి భలే విచిత్రమైన వింతైన విడియోలు బయట పడుతుంటాయి. అలా ఇవ్వాళ్ళ పొద్దున్న సాక్షాత్కరించిన శివస్తోత్రం మీరూ కాసేపు ఆనందిస్తారేమోనని.

తూలిక మాలతి గారు రాసిన రెండు పుస్తకాలు ఈ వారంలో చేతికందాయి.
1. Telugu Women Writers, 1950-1975, Andhra Pradesh, India. A Critical Study.
2. All I Wanted was to Read and other stories.
పుస్తకాలు దొరికే వివరాలు ఇక్కడ.

చదవాలి తీరిక చేసుకుని. చదవంగానే ముందు మీకే చెబుతా ఆ కబుర్లు విన్నవీకన్నవీలో. ప్రస్తుతానికి పెయొలీనీ మూడో నవల బ్రిసింగర్ నడిమధ్యలో ఉన్నా. సినిమాలేవీ చూళ్ళేదు ఈ మధ్యలో.

అనట్టు జాలపత్రిక ఈమాట సెప్టెంబరు సంచికలో సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజస్వామిని గురించి గొర్తి సాయిబ్రహ్మానందం గారు
మంచి వ్యాసం మొదలు పెట్టారు. అనేక మూల గ్రంధాల్ని పరిశోధించి, ఏది ఆధారాలతో ఋజువు చేయగల చరిత్ర, ఏది శిష్యుల భక్తి సృష్టించిన కల్పన అన్న విచక్షణతో త్యాగరాజు జీవిత విశేషాల్ని ఈ వ్యాస పరంపరలో వెలువరించేందుకు శ్రీ గొర్తి చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. కర్ణాటక సంగీతం, చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం.

ప్రస్తుతానికి కబుర్లు ఇంతే. త్వరలో మళ్ళీ కలుద్దాం.

Thursday, October 9, 2008

శుభాక్షుల కటాక్ష వీక్షణం

మొన్న పొద్దు కోసం భువన విజయం కార్యక్రమం నిర్వహిస్తుండగా సభా ప్రారంభంలో తాడేపల్లి వారు అమ్మవారి మీద చక్కటి స్తుతి పద్యం చెప్పారు. అందులో "..శుభాక్షులఁ జూచు జగజ్జనిత్రి ... దుర్గ మముఁ దేల్చుత దివ్య కటాక్ష వారిధిన్" అన్నారు. అంటే భైరవభట్ల కామేశ్వర్రావుగారు "దేవి కటాక్షవారిధిలో మునిగిపోయినా పరవాలేదు!" అని చమత్కరించారు.
***
నేనసలే విజయవాడ కుర్రోణ్ణి.
ముగురమ్మల మూలపుటమ్మ .. దుర్గ మాయమ్మే మరి!
వొట్టి దుర్గ కాదు, కనక దుర్గ.
సింహ వాహినియై, త్రిశూలాది ఆయుధ ధారిణియై, సురారులమ్మ కడూపారడి పుచ్చెడి యమ్మ ..
కానీ
ఆ పచ్చటి రాకేందు ముఖం నుండి కురిసే కరుణ వెన్నెలలు
ఆ పెదవుల విరజిమ్మే దరహాస చంద్రికలు
ఆ శుభాక్షుల కటాక్ష వీక్షణాలు

ఒక పక్క ఈ తల్లి ఇలా ఉండగా, చదువుకోడానికి వరంగల్లు వెళ్తే అక్కడ కాకతీయుల ఆరాధ్య దేవత భద్రకాళి .. ఆవిడా అంతే
ఆకారం మాత్రం భీకరం
కానీ చల్లని చూపుల తల్లి.
***
మహా యోగులకైన తెలియరాని ఆ తల్లి తత్త్వం, "కాయజాది షడ్రిపుల జయించే కార్యము దెలిసిన" త్యాగరాజుకి తప్ప ఎవరికి తెలుస్తుంది?

అందుకే .. వినాయకుని వలెను బ్రోవవే అని వేడుకున్నారు ఆ తల్లిని మధ్యమావతి రాగంలో.
కుమారస్వామిని లాగానో ఇంకొకరిని లాగానో అనలేదు. వినాయకుని వలెను అన్నారు.
ఎందుకూ .. వినాయకుడంటే అమ్మ వారికి ప్రత్యేకమైన వాత్సల్యం. తన వొంటినించి నిర్మించి, తన ఊపిరినూది ప్రాణ ప్రతిష్ఠ చేసింది గనక. తన కండలో కండ, ప్రానంలో ప్రాణం. సహజమైన మాతృ ప్రేమకి తోడుగా, మరుగుజ్జువాడు, ఏదీ తనకి తాను చేసుకోలేని వాడే .. అయ్యో పాపం లాంటి కించిత్ జాలి కూడా ఉంటుంది కాబోలు.

సకల చరాచర జగతికి అంతశ్శక్తి రూపమైన ఆమె సంకల్పం లేక మనమూ మట్టి ముద్దలమే. ప్రాణ ప్రతిష్ఠకు ముందున్న సున్నిపిండి ముద్దలమే. అందుకే వేడుకుంటున్నారు త్యాగరాజు .. వినాయకుని వలెను బ్రోవవే .. అని.

ప్రముఖ కర్నాటక సంగీత గాయకులు, శ్రీ టి.యం. కృష్ణ గాత్రంలో ఈ కృతి.

మీరు చేపడుతున్న, తలపెడుతున్న సత్కార్యములన్నీ విజయవంతములు కావాలని, లోకకళ్యాణానికి దోహద పడాలని ఈ విజయదశమి మహా పర్వదిన సందర్భంగా మనసారా కోరుకుంటున్నాను.
***
పొద్దులో అభినవ భువన విజయ దశమి

ఒక పీట ముడి

జ్ఞాన పీఠము తెచ్చినారము అంటూ మొన్నీ మధ్యన చంద్రిమ గారు మంచి మేలుకొలుపు పాడారు. అంతకంటే, పట్టు దారాలు పైన చుట్టిన చెర్నాకోలతో ఒక చరుపు చరిచారంటే సరిగ్గా ఉంటుందేమో.

అసలేవిటి ఈ జ్ఞానపీట కమామిషూ అని వికీని ప్రార్ధించాను.
అనుగ్రహించింది.

కేంద్ర సాహిత్య యెకాడెమీ అంటే సరే పోనీ రాజకీయుల పైరవీలే అని సరిపెట్టుకోవచ్చు. మరి ఈ జ్ఞానపీట సంగతేంటి. అదిచ్చేవాళ్ళేమో ఏదో ప్రైవేటు ట్రస్టు వాళ్ళు. అదీనూ ఒక సారికి ఒక్కరికే ఇస్తారు. కీర్తిశేషులైన వాళ్ళకి ఇవ్వరు. ఆంగ్లం తప్ప భారతీయ భాషల్లో ఏ భాషా రచయితకైనా ఇస్తారల్లే ఉంది. 1982 వరకూ ఏదో ఒక ప్రత్యేక కృతి గొప్పతనాన్ని గుర్తించినట్లుగా ఇచ్చేవారట (విశ్వనాథకి రామాయణ కల్పవృక్షానికి వచ్చిందిట). అటు తరవాత ఏ ఒక్క కృతి కోసమో గాక రచయిత సర్వతోముఖ కృషికి గుర్తింపుగా ఇస్తూ వస్తున్నారట. చంద్రిమ గారి బ్లాగులో చర్చలో చెప్పినట్టు ఈ ఎంపికలో ఒక క్రమం (అంటే సంవత్సరానికి ఒకటి చొప్పున భాషల టైం టేబుల్) ఏదీ ఉన్నట్టు లేదు. 2004 దాకా ఇచ్చిన 42 ఎవార్డుల్లో కన్నడ భాషా రచయితలకి ఏడు సార్లొచ్చింది .. హిందీ తమిళ రచయితలకి కూడా అన్ని సార్లు రాలేదు. 1970లో విశ్వనాథ తరవాత 1988లో సినారెకి ఇచ్చారు. మరి అది జరిగి కూడా ఇరవయ్యేళ్ళు నిండుతున్నాయి.

అసలీ ఎవార్డులన్నీ పైరవీలే అని పక్కకి నెట్టేయ్యొచ్చు. తెలుగు వాళ్ళకి సాటి తెలుగు వాళ్ళని పైకి తీసుకువచ్చే దృష్టిలేదు అని నిస్పృహ ప్రకటించొచ్చు. మనకివ్వని దాన్ని గురించి మనం ఎందుకులే పట్టించుకోవడం అని ఒక నిట్టూర్పు విడిచి మరిచే పోవచ్చు.

కానీ, ఎంత వద్దనుకున్నా, ఇలాంటి ఎవార్డుల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రయోజనం, మన భాషకీ, మన భాషా సాహిత్యానికీ జాతీయంగా ఒక కొత్త గుర్తింపు వస్తుంది. రెండో గొప్ప ప్రయోజనం, కొంతవరకూ మొదటి దాన్ని వెన్నంటి వచ్చే ప్రయోజనం, ఇలా గుర్తింపు పొందిన రచనలు కొన్నైనా ఇతర భాషల్లోకి, ముఖ్యంగా హిందీలోకి (జాతీయ ప్రాచుర్యం కోసం), ఆంగ్లంలోకీ (అంతర్జాతీయ ప్రాచుర్యం కోసం) తర్జుమా అవుతాయి. ఆ అవడం కూడా ఏదో అయ్యాయంటే అయ్యాయి అన్నట్టు కాకుండా, ప్రతిభావంతులైన అనువాదకులతో అనువాదం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన, అవసరమైన పరిణామం. అఫ్కోర్సు, రచయితకి ముట్టే ఐదు లక్షల రూపాయల నగదు కూడా, కనీసం ఆ వ్యక్తికి సంబంధించినంత వరకూ, మంచి ప్రయోజనమే అనుకోండి.

ఈ సంవత్సరం తెలుగుకి ఇచ్చి తీరతారు అనుకుందాం కాసేపు. అర్హులైన వారెవరున్నారు? ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారంటే నాకెంతో గౌరవం, అభిమానం. ఆయన ఎక్కువగా సంస్కృతం నించి తెలుగు వచనంలోకి అనువాదాలు, వివరణలు వంటి రచనలు తప్ప, స్వంత రచనలు ఎక్కువగా చేసినట్టు లేరు. కథకుడైన కాళీపట్నం రామారావు మేష్టారు ఒక పక్క, విస్తృతంగా తనకు తెలిసిన సమకాలీన జీవితాన్ని ప్రతిబింబిస్తూ నవలా రచన చేసిన అంపశయ్య నవీన్ మరొక పక్కా కనిపిస్తున్నారు వచన రచనలో. కానీ ఇద్దరి రచనల్లోనూ తెలుగు సాహిత్యాన్ని మౌలికంగా ప్రభావితం చేసిన అంశాలు ఏవీ కనబడవు. అటువంటి ప్రభావం కోంత వరకూ యద్దనపూడి సులోచనారాణి, ఆ తరవాత యండమూరి వీరేంద్రనాథ్ తెచ్చారనుకోవచ్చు. కేవలం పాపులర్ రచయితలు ఐనందుకు వీళ్ళని తీసి పారెయ్యనక్కర్లేదు. యండమూరి నవల్లు ఈ మధ్యన మళ్ళీ చదవడానికి ప్రయత్నిస్తే, ఒక పక్కన కొంత ఆసక్తి రేగుతున్నా, ఇంకో పక్క చాలా చీదరగా అనిపించింది.

సీనియర్ కవుల్లో కె. శివారెడ్డి, వేగుంట మోహన ప్రసాద్ కనిపిస్తున్నారు (శిఖామణికి అంత లేదు) .. ఇస్మాయిల్, శేషేంద్ర శర్మ అప్పుడే పోవడం ఈ విషయంలో పెద్ద లోటే. సినీ కవులు వేటూరి, సీతారామశాస్త్రి ఉన్నారు.

ఇంకెవరున్నారు? మీ ఉద్దేశాలు చెప్పండి.

Wednesday, October 8, 2008

మూడు తెలుగు సినిమాలు

Tuesday, October 7, 2008

ప్రేమా పిచ్చీ ఒకటే!

ప్రేమా పెళ్ళి ఒకటేనా, వేర్వేరా అని ఒక ప్రశ్న.
దాన్ని గురించి ఒక చర్చ.

పెళ్ళిని నిర్వచించడానికి పెద్ద శ్రమ పడనక్కర్లేదు. ఇద్దరి మధ్య ఏదో ఒక మత సంబంధమైన తంతో, లేక చట్టం అంగీకరించిన లౌకికమైన తంతో జరిగితే వాళ్ళిద్దరికీ పెళ్ళైనట్టు లెక్క. ఇది, ఆ సదరు నవదంపతులతో పాటు ప్రభుత్వమూ, ప్రపంచమూ కూడా ఒప్పుకునేదే.

మరి ప్రేమని ఎలా నిర్వచించడం? ప్రేమంటే ఫలానా ఇదీ అని నిర్వచించ లేకపోతే .. పోనీ "నేతి నేతి.." అనైనా నిర్వచించే ప్రయత్నం చెయ్యొచ్చునేమో? ఎటువంటి నిర్వచనం ఇచ్చే ఏ ప్రయత్నమూ నాకీ చర్చలో ధ్వనించలేదు. పోనీ అదేవన్నా అనిర్వచనీయమైనదా? ఏమో? మా కృష్ణమోహన్ లాంటి వాళ్ళు చెప్పాలి ఆ సంగతి. ఆయనెలాగా మూడో భాగం రాస్తానని బెదిరిస్తున్నాడాయెను. బాబ్బాబు, ఈ సంగతేదో కాస్త ఆ మూడో భాగంలో తేల్చి చెప్పండి, మీకు పుణ్యవుంటుంది.

ఒకేళ ప్రేమ అనిర్వచనీయమైనది ఐతే దాన్ని పెళ్ళిలాంటి తంతు తో ఎలా ఒకే త్రాసులో తూస్తాము?

సరే, ఈ అయోమయం ఇలా ఉందా? ఇక చర్చ. ఆ చర్చలో ఇంకేవేవో మాటలు వినిపించాయి.
ఆకర్షణ అన్నారు.
అవగాహన అన్నారు.
నమ్మకం అన్నారు.
బంధం అన్నారు.
మానసిక అనుబంధం అన్నారు.
ప్రేమకీ పెళ్ళికీ మధ్య వారధి ఆకర్షణ అన్నారు.
అవగాహన లేకపోతే పెళ్ళిళ్ళు కూలిపోతాయన్నారు.
మానసిక అనుబంధం బాగా ఉంటే పెళ్ళికి సిద్ధమవుతారన్నారు.
ఆకర్షణ ప్రభావంతో కాక అవగాహనతో పెళ్ళికి దారితీస్తే మంచిదన్నారు.
ఇష్టపడితే కలిసి బతకాలి, లేకపోతే విడిపోవాలి అన్నారు.
ప్రేమిస్తున్నా, మనం గా కలిసి మనలేమేమో నని భయం అన్నారు.
మధ్యలో, మన వివాహ వ్యవస్థ చాలా పటిష్ఠం అని కూడా అన్నారు.

ఇంకా నయం, ప్రేమ త్యాగం కోరుతుంది, అమలిన ప్రేమ, నిస్వార్ధమైన ప్రేమ - ఇలాంటి డయలాగులు ఎక్కడా వినబళ్ళేదు.

అసలు ప్రేమంటేనే ఏవిటో ఒక నిర్ధారణకి రాలేకుండా ఉండగా, ఈ అదనపు మాటల వాక్యాల పరంపర .. పిల్లంటే మార్జాలం .. అంటే బిడాలం అన్నట్టుంది.ఇదంతా నాకెలా ఉందంటే నలుగురు గుడ్డి వాళ్ళు ఏనుగు ఎట్లా ఉంటుందో వర్ణిస్తున్నట్టు ఉంది.

నా దేశ యువజనులారా! ఏవిటీ వృధా చర్చ? ఎందుకొచ్చిందీ రచ్చ?

చాతనైతే ఎవర్నన్నా ప్రేమించెయ్యండి.
ఇంకా చాతనైతే ఎవరిచేతనన్నా ప్రేమించ బడండి.

దాహవేస్తే, చల్లటి మంచి నీళ్ళు తాగితే ఆ దాహం తీరుతుంది గానీ, చల్లటి మంచి నీళ్ళని గురించి ఇదిలా ఉంటుంది కామోసు అని కలలు కంటేనూ, కవిత్వం రాస్తేనూ, లేదా, దాన్ని రసాయన విశ్లేషణ చేస్తేనూ ఆ దాహం తీరదు!

ఈ క్షణమే ఆ చల్లటి నీళ్ళు నా గొంతులో పడాలి అనేంతగా మీ దాహం మిమ్మల్నందర్నీ దహించాలని మనసారా కోరుకుంటున్నాను .. కాదు, కాదు, ఆశీర్వదిస్తున్నాను.

Monday, October 6, 2008

మీ రామాయణం సృష్టించండి

ఇటీవల బ్లాగ్లోకంలో రామాయణం నేపథ్యంగా కొన్ని వాడి వేడి చర్చలు జరిగాయి. వాల్మీకి రామాయణం గురించి నాకు తెలియని చాలా వివరాలు తెలుసుకునే అవకాశం కలిగింది. రామాయణంలోని సన్నివేశాలు, పాత్రల గురించి మన బ్లాగ్ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకునే అదృష్టం కూడా లభించింది.

ఇదంతా శ్రద్ధగా చదువుతుండగా నా మదిలో మెదిలిన ఒక ఆలోచన .. రామాయణం ఒక్క కథ కాదు. ఏకపక్షమైన కథ అంతకంటే కాదు. అనేక రామాయణాలు ఉన్నాయి. ప్రజలు ఎప్పటికప్పుడు కొత్త రామాయణాల్ని, "తమ" రామాయణాల్ని సృష్టించుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా మన మనసుల్ని కలవర పెట్టే సంఘటనలని ఈ ప్రజా రామాయణాల్లో ఎలా ఎదుర్కున్నారో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంతుంది. ఈ జిజ్ఞాస ఉన్న వాళ్ళు Many Ramayanas (Ed. Pauala Richman) పుస్తకాన్ని చూడచ్చు. దీన్ని అమెజాన్ లో కొనుక్కోవచ్చు కూడా.

ఇదిలా ఉండగా, అమెరికాలో పిట్సబర్గు నగరంలో ఒక ప్రవాస భారతీయుడు ప్రారంభించిన వాణిజ్య సంస్థ, క్రీడన, బడి వయసు పిల్లల్ని తమ తమ రామాయణ గాధల్ని సృష్టించమని ఆహ్వానిస్తోంది. ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించింది. వివరాలకు ఇక్కడ క్లిక్కండి.

ఇహ ఇప్పుడు చెప్పండి .. మీ రామాయణం ఏవిటి?

Saturday, October 4, 2008

వ్యక్తిగత వికాసం

ఆ క్లాసు రూములో అడుగు పెట్టేసరికి అది క్రిక్కిరిసి ఉంది. రెండు సెక్షన్లు కలిపినట్లున్నారు. ఎవరో ఒకతను డయాస్ మీద నిలబడి ఇంగ్లీషులో లెక్చరు చెప్తున్నాడు. "మనకి వినడం అన్న పని సరిగ్గా రాదు. అసలు వినే అలవాటే తక్కువ. విన్నా కూడా విన్న మాటలు శ్రద్ధగా వినం. కొన్ని వింటాం. కొన్ని తెలీకుండానే వదిలేస్తాం. దాని వల్లనే మన మధ్య కమ్యూనికేషన్‌ సరిగ్గా ఉండదు. వినని మాటల్ని కొన్నిటిని ఊహిస్తాం. దానివల్లనే రిలేషన్‌స్ దెబ్బతింటూ ఉంటాయి. దానికి మీకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను" అన్నాడు.

నన్ను పరిచయం చేసుకుని అతనితో అన్నాను. "వీళ్ళు తెలుగు మీడియం స్టూడెంట్స్. మీరు ఇంగ్లీషులో చెప్పేది వినగలరు కానీ అర్ధం చేసుకోలేరు. తెలుగులో చెప్పండి."

"ఐ కెనాట్ స్పీక్ టెల్గూ మేడం." అన్నాడు వెర్రి మొహం వేసి. "సరే మీరు చెప్పండి, నేను తెలుగులో ట్రాన్సులేట్ చేసి వీళ్ళకి చెప్తాను" అన్నాను.

"ఇప్పుడు నేను మీముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా నంటే దానికి నేను చేసిన పెర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సే కారణం. మా కంప్యూటర్ సంస్థ ప్రత్యేకంగా ఆ కోర్సులో క్లాసులిస్తుంది. బయటైతే ఆ కోర్సుకి ఆరువేల రూపాయలు కట్టాలి. మా సంస్థ ఐతే ఊరికే నేర్పుతుంది. ఆ క్లాసులు నేనే చెప్తాను. ఈ కంప్యూటర్ కోర్సు చేస్తే దీనివల్ల మీకు ఇన్ని వేల రూపాయల జీతంతో ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మీరు గవర్నమెంట్లో చేరితే లంచం లేకుండా ఉత్త జీతం ఎంత సంపాదించ గలరు? మహా ఐతే పది వేలు. కానీ ఇందులో ఐతే అలాక్కాదు. మొదలే ఇరవై వేలు. అప్పుడు మీ జీవితమే మారి పోతుంది. ఇప్పుడు మీకు పోజు వేసిన అమ్మాయి వాళ్ళ పిల్లాణ్ణి మ్యునిసిపల్ బడికి తీసుకెళ్తుంటే మీరు మీ పిల్లాణ్ణి మంచి కాన్వెంట్ లో చదివిస్తారు. మీకు హేండిచ్చిన ఫ్రెండు ముందు అప్పుడు మీరు కార్లోంచి దిగుతారు."

ఈ మాటల్ని అనువాదం చేసి చెప్పడానికి నాకు ఎంతో చిన్నతనంగా అనిపించింది. పోజిచ్చిన అమ్మాయికి తిరిగి పోజివ్వడం, హేండిచ్చిన స్నేహితుడికి తిరిగి హేండివ్వడమేనా వ్యక్తిత్వమంటే?
***

బీయే రెండో సంవత్సరం క్లాసు. ఆ మాస్టారు ఛాందసుడు కాదు. ఆయనకి ప్రాచీనంలోని నవీనత, నవీనంలోని ప్రాచీనత తెలుసు. అందుకే అప్పుడప్పుడూ ఆ క్లాసులో కూచునే అలవాటు.

"యాదృఛ్ఛికమో కాదో గానీ గమ్మత్తుగా రెండు చిత్రమైన పాఠాలు పక్క పక్కనే పెట్టారు యూనివర్సిటీ సెలెక్షన్‌ కమిటీ వారు." అంటూ డిగ్రీ టెక్స్టు బుక్కు తీశారు. క్లాసులో ఒక్కడంటే ఒక్కడి దగ్గర టెక్స్టు బుక్కు లేదు. ఆ అలవాటే లేదన్న మాట.
"దుర్యోధనుడి ప్రాయోపవేశం మొదటిది. కిరాతార్జునీయం రెండోది. అని చెప్పి ఒక్క నిమిషం ఆగి, చెప్పడం మొదలు పెట్టారు.
అరణ్యంలో ఉన్న పాండవులను అవమానించాలని వెళ్ళి తనే అవమానాల పాలవుతాడూ భారతంలో దుర్యోధనుడు. ధర్మరాజు దయా ధర్మ భిక్ష మీద తిరిగి బ్రతికి బయట పడతాడు. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకో బోతాడు. ఎవరి మాటా వినడు. ఆఖరికి రాక్షసులు వచ్చి పాతాళానికి తీసుకెళ్ళి మరిన్ని కుతంత్రాలు చెప్పినప్పుడే ఆ ప్రయత్నం విరమిస్తాడు. అంతకంటే పెద్ద అవమానం కౌరవ సభలో పాండవులందరికీ కలిగింది. రెండో పాఠం కిరాతార్జునీయంలో అర్జునుడు ఆ అవమానం నించి బయట పడటానికి కొత్త శక్తి సంపాదించుకోవాలనీ మనోబలంతో అవమాన భారం పోగొట్టుకోవాలనీ ఇంద్రకీల పర్వతం మీదికి తపస్సుకి వెళ్ళాడు."
"ఇవీ ఈ రెండు కథలూ. రెండు అవమానాలే. ఒక దాన్ని మించి ఒకటి. కానీ వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉందీ? ఎలా ఉండాలీ?" అని మాస్టారు ఆగారు.
ఒక కుర్రాడు ఠక్కున చెప్పాడు. "ఒకడు పాతాళంలోకి కూరుకు పోయాడు, ఒకడూ కొండ మీదికి ఎక్కి పోయాడు."
సంతోషంతో చప్పట్లు కొట్టారు ఆయన.
"ఎవరిలా ఉండాలి మనం?" అడిగారు ఆయనే.
"రెండొదే సార్ .." క్లాసంతా అరిచింది.

"అవమానాలు జీవితంలో ఎవరికీ తప్పవు. కానీ ఇంద్రకీల పర్వతాలే మనల్ని పిలవాలి." అంటూ మాస్టారు పాథంలోకి వెళ్ళిపోయారు.
ఇది సెకండ్ లాంగ్వేజి క్లాసా? వ్యక్తిత్వ వికాసం క్లాసు కాదా? అనుకున్నాను.
అథః పాతాళంలోకి జారే చూపుల్ని ఆకాశంలోకి తిప్పడం ఇలాకాక మరొకలా ఎలా సాధ్యం? ! !!

ఈ సంగతి సదరు "ఐ కెనాట్ " సారుకి ఏ విధంగా మనవి చేయగలను??
***
పుస్తకం: ఆకులో ఆకునై
రచయిత్రి: వాడ్రేవు వీరలక్ష్మీదేవి
పేజీలు: 96
వెల: రూ. 40/-
ప్రతులు దొరికే చోటు: విశాలాంధ్ర (వాళ్ళ దగ్గర కనీసం 50 ప్రతులు ఉన్నాయని రచయిత్రిగారే సుమారు నెల్రోజుల క్రితం నాకు చెప్పారు. ప్రతులు లేవని షాపువాళ్ళు అంటే నమ్మొద్దు.)

నా చివరి మాట .. జీవితాన్నీ, జీవితంలోని మాధుర్యాన్నీ ఆస్వాదించే ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమిది.