Tuesday, September 23, 2008

డిట్రాయిట్ లో తెలుగు బ్లాగర్ల సంరంభం

గమనిక: ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచినందువల్ల, అది చేర్చి ఈ టపాని మళ్ళి ప్రచురిస్తున్నాను. పాఠకులకు అసౌకర్యం కలిగితే మన్నించండి.
*** *** ***
మా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య పదవ పుట్టిన రోజు వేడుకలు బాగా జరిగాయి. సభలకి దేశం నలుమూలల నుండీ సుమారు 150 మంది అతిథులు వచ్చారు. శనివారం జరిగిన విందు భోజనానికి సుమారు 250 మంది అతిథులు హాజరయ్యారు. టొరాంటో కెనడా నుండి పది మంది బృందం రాక ఒక విశేషం.

తెలుగు బ్లాగర్లు నేను ఆశించిన సంఖ్యలో రాక పోయినా, గంగి గోవు పాలు అన్న రీతిగా, వచ్చిన కొద్ది మంది అక్కడ బాగానే సంచలనం సృష్టించారు. ఈ సభల కాన్సెప్టు సాహిత్య విమర్శ. అంచేత నేను బ్లాగుల గురించి కూడా మాంఛి చిక్కనైన విమర్శ వ్యాసం ఒకటి తయారు చేశాను. తీరా మేము సభ ప్రారంభించి బ్లాగుల గురించి మాట్లాడ్డం మొదలు పెట్టే సమయానికి, అసలు బ్లాగులంటే ఏంటి అనే ప్రశ్న సభ్యుల దగ్గర్నించి వచ్చింది. దాంతో మొదట అనుకున్న ప్రణాళికని పక్కన పెట్టి మొదణ్ణించీ మొదలు పెట్టాము. ప్రణాళిక ప్రకారం నడవక పోవడంతో కొంత గందరగోళమైన మాట నిజం. ఈ పరిస్థితిని ముందే ఊహించి ఈ కార్యక్రమాన్ని బ్లాగుల పరిచయ వేదికగా రూపొందించుకుని ఉంటే ఇంకా బాగా జరిగే అవకాశం ఉండేది. అయినా, మాకెదురైన పరిస్థితిలో బాగా జరిగిందనే అనుకుంటున్నాను. మేం చెప్పిన విషయాల వల్ల సభ్యులు ఉత్తేజితులై, తెలుగు బ్లాగులు, వికీ పట్ల ఆసక్తి కలిగినట్లే కనిపించారు. సభ ముగిసిన తరువాత చాలా మంది వచ్చి, బ్లాగు మొదలు పెట్టాక ఏవన్నా డౌట్లు వస్తే ఎలాగ?, వికీలో ఏం చెయ్యొచ్చు లాంటి ప్రశ్నలు అడిగారు.

బ్లాగర్ల చిత్రమాల

ముందుగా తెలుగు వికీ ఆద్యుడు రవి వైజాసత్య వికీ ని పరిచయం చేసి అందులోని వివిధ ఫీచర్లని గురించి చెప్పారు. ఎలా సమాచారం రాబట్ట వచ్చు, ఎలా మనకి తెలిసిన సమాచారాన్ని అందులో ఎక్కించ వచ్చు, సమస్యలు వస్తే ఎలా .. ఇత్యాది విశేషాలన్నీ నెట్ కనెక్షను పుణ్యమా అని అక్కడికక్కడే ప్రదర్శించి చూపించారు. తెలుగు పండితులు కాని స్వఛ్ఛంద సేవకుల నిబద్ధత, సేవా పరాయణత గురించి విని సభ్యులు ఉత్తేజితులైనారు. వికీలో దొరికే సమాచారం నిజమేనని ఎలా నమ్మడం అని కొంత తీవ్రమైన చర్చ జరిగింది. చివరిలో వికీ సోర్సు ని పరిచయం చేసి అందులో సంస్కృత వ్యాస భారతం, ఆంధ్ర మహాభారతం పరిచయం చేసినప్పుడు, ఆచార్య వెల్చేరు నారాయణరావు గారి వంటి మహానుభావులే మహదాశ్చర్యంతో చేతులు జోడించి "మీకు నమస్కారాలండీ" అన్నారు. ఇది నిజంగా తెలుగు వికీ ఉద్యమకారులకి స్వర్ణపతకం లాంటిది.


దీప్తిధార సీబీ రావు గారు, ఇక్కడ డిట్రాయిట్ లో ఈ సభల్లో పాల్గొనడానికి పని గట్టుకుని రావడం మాకందరికీ ఎంతో సంతోషం కలిగించింది. ఆయన తన బ్లాగుల గురించి చెప్ప బోతుంటే సభ్యులు అసలు బ్లాగంటే ఏవిటి అని అడిగారు. దాంతో ఆయన అక్కడికక్కడే ఒక కొత్త తెలుగు బ్లాగు సృష్టించి చూపించారు.

అటు పిమ్మట కాలాస్త్రి బ్లాగు రాసే శ్రీ (మా వూరాయనే), షికాగో నించి వచ్చిన శరత్కాలం శరత్ , బ్లాగుల్తో తమ వ్యక్తిగత అనుభవాల్ని వివరించారు. ఎందుకు బ్లాగు రాయాలనే కోరిక కలిగింది, బ్లాగు రాయడం ద్వారా తాము పొందుతున్న తృప్తిని గురించి చెప్పారు. పనిలో పనిగా శ్రీ బ్లాగు పేజీలో మనం ఎట్లాంటి వింతలు విశేషాలు పెట్టి దాన్ని పెర్సనలైజ్ చేసుకోవచ్చో చూపించారు. శరత్ తను అప్పటికప్పుడూ రాస్తున్న లైవ్ బ్లాగ్ ని చూపించి, తన ప్రసంగం గురించి అక్కడికక్కడే ఒక వాక్యం రాశారు. తన బ్లాగుల్ని పరిచయం చేస్తూ, గుండె దిటవు ఉన్న వాళ్ళు మాత్రమే తన శృంగారం బ్లాగుకి రావచ్చుని అని హెచ్చరించారు కూడా :)

నేను చెప్పాలనుకున్న చిక్కటి విమర్శ చెప్పేందుకు టైము సరిపోక పోవడమే కాకుండా అది సరైన వేదిక కూడా కాదు అనిపించింది. దాన్ని సవరించి ఇక్కడే నా బ్లాగులో త్వరలో ప్రదర్శిస్తాను. ఆ విషయాల గురించి మనందరం చర్చించుకోవచ్చు. అంచేత నావంతు వచ్చినప్పుడు ఒక ఆరు బ్లాగుల్ని సభ్యులకి పరిచయం చేశాను. ఈ ఆరుగురూ విభిన్న నేపథ్యాల నించి వచ్చి, అటు కంప్యూటరు వాడకానికో, ఇటు తెలుగు రాయడానికో, లేక రెంటికీనూ దూరంగా ఉంటూ వచ్చిన వారు ఈ నాడు ప్రముఖ బ్లాగర్లు అయి, తమ రచనల్తో ఎందరినో అలరిస్తున్నారు. టెక్నాలజీ ఇంత అందుబాటులో ఉండీ తెలుగు భాష సాహిత్యాల మీద ఇంత ప్రేమ ఉండీ మీరు బ్లాగులు రాయకుండా ఉండడం న్యాయం కాదు. బ్లాగు మొదలు పెట్టండి అనే సందేశంతో ముగించాను. మొత్తానికి ఒక సీరియస్ సాహిత్య వేదిక మీద తెలుగు బ్లాగుకి, పెద్ద పీట సంగతి దేవుడెరుగు, అసలు సూది మోపినంత స్థానం దొరకడం ఇదే ఓం ప్రథమం. ఈ అవకాశం ఇచ్చినందుకు డిట్రాయిట్ తెలుగు సాహితీ సమాఖ్య వార్షికోత్సవ కమిటీకి తెలుగు బ్లాగర్లందరి తరపునా ధన్యవాదాలు. త్వరలోనే తెలుగు సాహిత్య రంగంలో బ్లాగులకి ముఖ్య స్థానం ఉన్నదీ అని సగర్వంగా చాటి చెప్పుకునే స్థాయిని మనం సాధించాలని కోరుకుంటున్నాను.

ఈ టపా మొదటి ప్రచురణలో మరచిన విషయాలు:
1. కేవలం బ్లాగు URL ఇవ్వడమో, లేక ఒక్కో బ్లాగు గురించి నా వ్యక్తిగత అభిప్రాయాలో కాకుండా, ఆయా బ్లాగుల్లో ఏం రాస్తున్నారో తిన్నగా సభ్యులకి రుచి చూపితే బాగుంటుంది అనిపించింది. అందుకని, ప్రస్తుతం క్రమం తప్పకుండా టపాలు వస్తున్న బ్లాగుల్లోంచి, పధ్నాలుగు బ్లాగుల నుండి ఒక టపాలోని ఒక చిన్న పేరాగ్రాఫుని (a short excerpt), ఆ బ్లాగు పేరు, URL తో కలిపి ఒక పేజీ కరపత్రాన్ని సభ్యులందరికీ పంచి పెట్టాను.
2. నేను వేదిక మీద ఉదహరించిన 6 బ్లాగులు ఏవో అక్కడ ఇచ్చిన సూచనలను బట్టి ఊహించండి చూద్దాం! (దీనికి ప్రైజు ఏమీ లేదు!!)
3. రానారె, విహారి, చరసాల - వీరు ముగ్గురూ బహుశా రాలేమని ముందే చెప్పినా, ఆఖరి నిమిషంలో అక్కడ ప్రత్యక్షమై నాకు విభ్రాంతి కలిగిస్తారేమోనన్న ఆశ, నిజం చెప్పొద్దూ, ఆదివారం పొద్దుటిదాకా మనసులో ఏమూలో మిణుకు మిణుకు మంటూనే ఉంది. నిష్ఠూరాలాడ్డం నా స్వభావానికి విరుద్ధం. మీరు వచ్చి ఉంటే మటుకు చాలా సంతోషించి ఉండేవాణ్ణి. I missed you, guys! It was a delight to meet CB Rao, Vyzasatya and Sarath. CB Rao and Vyzasatya got to witness some not-usually-seen sides of me after the main event was over. I am not going to spill the beans about that. You have to lobby them! :)

మొదటి సారి కలుసుకున్న కొత్త మిత్రులు, ఎన్నో ఏళ్ళ తరవాత మళ్ళీ కలుసుకున్న పాత మిత్రులు, ఒక పట్టాన వదల లేక వీడ లేక అతి కష్టమ్మీద వీడ్కోళ్ళు చెప్పుకుని బయటికి నడిచాము.

Thursday, September 11, 2008

చిల్లర శ్రీ మహాలక్ష్మి

సాధారణ భాషలో చిల్లర అనే మాటని నీచోపమానంగా వాడుతుంటాం .. వాడు అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు, కక్కుర్తి పడి చిల్లర పనులకి ఒప్పుకోకు, నేనంత చిల్లరగా కనిపిస్తున్నానా .. ఇలా. కానీ మన భారతీయ దైనందిన జీవితంలో చిల్లరకి చాలా ప్రాముఖ్యతే ఉంది. ఇలాంటి భావనల్నే చిల్లర శ్రీమహాలక్ష్మి ఇత్యాది నానుడులలో భద్ర పరుచుకున్నాం.

నేను రెండో క్లాసు చదువుతున్నప్పుడు .. అప్పటికింకా ఒకటి, రెండు, మూడు నయాపైసల నాణేలు చెలామణిలో ఉండటం గుర్తుంది. అప్పుడు మా యింటి దగ్గర్నించి బడి దగ్గరకి సిటీబస్సు ఛార్జీ అక్షరాలా ఎనిమిది పైసలు. మా అమ్మ లెక్కబెట్టి ఐదు+మూడు గానీ, ఐదు+రెండు+ఒకటి గానీ చిల్లర డబ్బులు లాగూ జేబులు రెండిట్లోనూ విడివిడిగా ఉంచేది. ఒకసారి చిల్లర లేక ఒకటి పది పైసల నాణెం ఇచ్చింది. బస్సు దిగి ఇంటికొచ్చేలోపల దార్లో ఒక బడ్డి కొట్లో రెండు పైసలకీ రెండు పిప్పరమెంట్లు కొనుక్కుని తినేశా. ఇంటికి రాగానే రెండు పైసల చిల్లరేదిరా అంటే, బస్సు కండక్టరు ఇవ్వలేదు అనేశా. పాపం చాలా నొచ్చుకుంది మా అమ్మ. అదేవిట్రా అలా వొదిలేసుకుంటారూ, చిల్లర జాగ్రత్తగా తెచ్చుకోవద్దూ, మనమేం జమీందార్లం కాదు నాయనా, అని ఇలా చాలా చెప్పుకొచ్చింది. అయ్యో అమ్మ ఇంత బాధ పడిపోతోందే, పోనీ నిజం చెప్పేద్దామా అని కాసేపు అనుకున్నా కూడా. ఇంతట్లో నా బడి బట్టలు విప్పడానికి నన్ను దగ్గిరికి తీసుకుంటే, ఆవిడకి నా నోట్లోంచి పిప్పరమింట్ల వాసన రానే వచ్చింది. అప్పటికే నా షర్టు కాలరు ఆవిడ చేతుల్లో ఉంది. వీపు విమానం మోత మోగిందని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. వెధవ పిప్పరమెంట్లు ఎందుకంత వాసన వచ్చేట్టు చేస్తారో.

నా పీత కష్టాలు ఇలా ఉండగా మధ్యలో మా తాతయ్యొకడు. ఈయన ఒక చిల్లర కొట్టు నడుపుతుండేవాడు. ఎప్పుడన్నా ఆయన కొట్టు సర్దుతున్నప్పుడు నేను గల్లాపెట్టె దగ్గర కూర్చునేవాణ్ణి. ఆ చుట్టుపక్కల పనీ పాటా చేసుకునే స్త్రీజనం అర్ధనా మరమరాలు పెట్టమనీ, అణాకి బటానీలు పెట్టమనీ వచ్చే వాళ్ళు. నేను చాలా తెలివైన వాణ్ణనీ, నాకు చాలా విషయాలు తెలుసుననీ నాకు అప్పటికే గాఠి నమ్మకంగా ఉండేది. ఈ అర్ధనా అణాల గోలేవిటో అర్ధమయ్యేది కాదు. తరవాత, మా తాతయ్య దగ్గరే నేర్చుకున్నా లెండి అణా అంటే పావలాలో నాలుగో వంతు, ఇలా. ఈ గోల ఇలా ఉండగా, ఆ కొట్టు నడిపేందుకు మా తాతయ్యకి ఎక్కడెక్కడి చిల్లరా సరిపోయేది కాదు. చెప్పానుగా, అసలే చిల్లర కొట్టు. ఆ వొచ్చే బేరాలన్నీ ఇలాగే ఉండేవి. అందుకనే ప్రతిరోజూ పొద్దున్నే మాచారం ఆంజనేయస్వామి గుడికెళ్ళి అక్కడ గుడి గుమాస్తా దగ్గర ఒక ఐదు రూపాయల చిల్లర రుమాల్లో మూట గట్టుకుని రావడం నా డెయిలీ డ్యూటిగా ఉండేది. గుడికి ఇదికూడా ఆదాయ మార్గమే - గుమాస్తా రూపాయకి తొంభయ్యైదు పైసలే ఇచ్చేవాడు. ఒకసారి తీరా నేవెళ్ళేప్పటికి గుమాస్తా లేడు. ఎట్లాగురా నాయనా ఇవ్వాళ్టికి చిల్లర అని దిగాలు మొహవేసుకుని బయటికి వస్తుంటే, అక్కడ గుడి గుమ్మంలో ఉండే ఒక కుంటి బిచ్చగాడు చిల్లర కావాలా బాబూ అన్నాడు. హమ్మయ్య అనుకుని ఐదు రూపాయలకి ఇమ్మన్నా. తీరా లెక్కపెట్టుకుంటే రూపాయకి తొంభై పైసలే ఉన్నై. ఇదేంటి, గుడి గుమాస్తా ఐతే తొంభయ్యైదు పైసలిస్తాడుగా అన్నా. మరి నా పొట్ట కూడా నిండాలిగా బాబూ అన్నాడు. సమంజసమే అనిపించింది. మా తాతయ్యకి అనిపించలా. చిల్లర తెచ్చి పెట్టినందుకు ఆయన నాకు రోజూ ఇచ్చే బటానీల జీతం కట్టు ఆ రోజు!

ఉత్తరోత్తరా, మా ఇల్లు అనే ఒక మైక్రో ఎకానమీకి నేను చిల్లారాధిపతిని ఐపోయా. అంటే చిల్లర వ్యవహారాలన్నీ నా చేతిమీదుగానే నడుస్తూ ఉండేవి .. ఏవన్నా చిన్న చిన్న సామానులు కొనడం, పాత న్యూస్ పేపర్లూ, పత్రికలూ అమ్మడం, ఇత్యాది. ఈ బడ్జెటులోనే నా బులి బుల్లి వ్యక్తిగత అవసరాలు కూడా .. ప్రైమరీ స్కూల్లో పిప్పరమెంట్లూ, క్రీము బిస్కెట్లూ నించీ హైస్ స్కూల్లో సైకిలుకి అద్దె, డిటెక్టివు పుస్తకాలకి అద్దె ... అంతవరకూ. ఆ విధంగా మా ఇంటి చిల్లర నా పాలిట శ్రీమహాలక్ష్మే అని చెప్పక తప్పదు.

కాలేజికి హాస్టలుకి వెళ్ళాక మన బడ్జటు మనమే సంభాళించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ 90% లావాదేవీలు ఖాతాల మీదే జరిగేవి కాబట్టి నగదు అవసరం, చిల్లర అవసరం కనబడేది కాదు. అటుపైన ఉద్యోగస్తుడిగా, సంపాదన పరుడిగా ఉన్న రోజుల్లో .. ఆహా నేనుగాగ ఇంత సంపాయించేస్తున్నానని .. చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టేవాణ్ణి. ఆ రోజుల్లో చిల్లర డబ్బు ఏదీ నా చేత ఆడిన దృశ్యం నాకు గుర్తు రావట్లేదు. చిల్లర ఉంచేసుకో అనేది నా ఊతపదంగా ఉండేది.

అమెరికా రావడానికి ఒక్కొక్క డాలరూ పదేసి రూపాయలు మా అన్నయ్య కష్టార్జితం ధార పోసి కొనవలసి రావడంనన్ను మేల్కొల్పింది డబ్బు విషయంలో. అదీకాక, అమెరికా వచ్చిన కొత్తల్లో పూర్ ఇండియన్ గ్రాడ్యువేట్ స్టూడెంట్ అవతారంలో కనీసం ఒక ఏడాది పాటు దుర్భర దారిద్ర్యం బాగానే అనుభవించాను. ఫిలడెల్ఫియా నగరంలో నేనున్న అపార్టుమెంటు నించి విశ్వవిద్యాలయాని (వివి)కి సుమారు మైలున్నర దూరం నడిచి వెళ్ళి నడిచి వచ్చే వాణ్ణి. ఆ దారిలో ఒకసెంటు నాణేలు ఎన్నో ఫుట్ పాత్ మీద కనబడుతుండేవి. అప్పూడప్పుడూ నికెళ్ళు (ఐదు సెంట్లు), డైములు (పది సెంట్లు) కూడా. మొదట్లో, ఛీ, మనవేంటీ, వీధిలో నాణేలు ఏరుకోవడం ఏంటీ అనిపించినా, మళ్ళి వెను వెంటనే, ఒక్కొక్క సెంటూ పది పైసలు. అలాంటివి పది కలిస్తే ఒక రూపాయి అనే భావన బలంగా నాటుకుని, ఆ నాణేలు తీసి జేబులో వేసుకోవడం మొదలు పెట్టాను. ఇతర కొనుగోళ్ళ లో కూడా వచ్చిన చిల్లరని భద్రపరచడం మొదలు పెట్టాను. ఇంట్లో ఒక పెద్ద కాఫీ డబ్బా నియోగించాను ఈ నాణేలు వెయ్యడానికి.

పన్నెండేళ్ళ తరవాత, మధ్యలో కొంత చిల్లరని వాడుతూ ఉండగా, ఇలా పోగైన చిల్లరని బేంకులో మారిస్తే నాలుగొందల డాలర్ల పై చిలుకు తేలింది. అందులో ఒక్క సెంటు నాణేలే రెండొందల డాలర్ల దాకా ఉన్నాయి. ఇక్కడ బేంకుల్లో ఆయా నాణేలని నిర్ణీత సంఖ్యల్లో పోగు చేసేందుకు కాగితపు గొట్టాలు ఇస్తారు (ఈ గొట్టాల్ని షాపుల్లో కొనుక్కోవచ్చు కూడాను). అలా నేనే కూర్చుని ఒక సాయంత్రప్పూట ఈ నాణేల్ని ఆ కాగితపు గొట్టాల్లో నింపాను. బేంకుకి తీసుకెళ్ళినప్పుడు, అక్కడి గుమాస్తా ఆశ్చర్య పడింది గానీ, విసుక్కోకుండా, నవ్వుతూ, ఓపిగ్గా ఆ గొట్టాలన్నీ లెక్క పెట్టి నాకు ధరావతు రశీదు ఇచ్చింది.

కొన్నేళ్ళుగా సూపర్ మార్కెట్టుల్లోనూ అలాంటి చోట్ల చిల్లర లెక్కపెట్టే యంత్రాలు వచ్చాయి. కలగాపులగంగా ఉన్న చిల్లర రాశిని ఆ యంత్రపు బేసినులో గుమ్మరిస్తే అదే వాటిని వేరు చేసుకుని, లెక్క పెట్టి, ఇంత రుసుము ముట్టిందని రశీదు ఇస్తుంది. కానీ ఇవి ప్రవేటు కంపెనీల నిర్వహణ కావడం వల్ల, కొంత కమిషను తీసుకుంటాయి అనుకుంటాను. (నాకు మా మాచారం గుడి బయటి కుంటి బిచ్చగాడు గుర్తొస్తున్నాడు .. మరి ఆ కంపెనీ వాళ్ల పొట్ట గడవడం ఎల్లాగా?) ఐనా, నాణేల రాశిని గుట్ట పోసుకుని, ఒక గంట సేపు వాటిని స్పృశిస్తూ, విభజిస్తూ, ఎంచుతూ, గొట్టాల్లో నింపుతూ కాలక్షేపం చెయ్యడంలోని ఆనందం ఆ యంత్రాన్ని ఉపయోగిస్తే ఎట్లా వస్తుంది నాకు?

మొన్నా మధ్యన నేను తరచూ వినే "మార్కెట్ ప్లేస్" అనే రేడియో కార్య్క్రమంలో "చిల్లర శ్రీమహాలక్ష్మి" అని నమ్మే చిల్లర పిచ్చోళ్ళు మరి కొందరున్నారని విని చాలా సంతోషం వేసింది. తీగ తగిల్తే డొంకంతా కదిలింది అన్నట్టు, ఆ వార్త విని ఈ జ్ఞాపకాల తేనెతుట్టె రేగింది.

Wednesday, September 10, 2008

ఇప్పటిదాకా వచ్చిన కథలు

జూలైలో నేనిచ్చిన మూడవ కథా విషయానికి ఇప్పటిదాకా వచ్చిన కథలు ఇవి.

మనం ఈదుతున్నాము ఓ చెంచాడు భవసాగరం.. July 15

కాసనోవా 2020 July 26

కథ కథ కందిత్తు August 26

సృష్టి 25.0 అను జానపద పౌరాణిక సైన్స్ ఫిక్షను కధ September 7

శాపమైన వరం (ఓ కాకరకాయ) September 7

జ్యోతిగారు వ్యక్తిగత వేగులో అందించారు.

వీరు కాకుండా ఇంకెవరైనా ఈ విషయం మీద కథ రాసి ఉంటే, లింకుతో సహా, దయచేసి నాకు తెలియ పరచ వలసింది.
ఒక ముఖ్య గమనిక. పోటీ గడువుని ఈ నెలాఖరు (సెప్టెంబరు 30) దాకా పొడిగిస్తున్నాను. అంచేత ఔత్సాహికులెవరైనా కొత్త ప్రయత్నాలు చెయ్యవచ్చు. చేస్తే రాస్తే నాకు చెప్పడం మర్చిపోరుగా!