Friday, August 22, 2008

అమ్మ 3: అంతర్ధానమైన రోజు

అనుభూతి

(1)
పురందరదాసు కీర్తనేదో
ఒక మధ్యాహ్నం
బయటెక్కడో కాస్తూన్న ఎండలోకి
చూస్తూ నాదస్వరంలో విన్నప్పుడు

ఆ మేఘాలు కదలాడినై
గాలి పిచ్చిగా పర్వెట్టింది
గగన నీలం పల్చబడింది .. చైతన్యం లోని విస్తృతమై
నా మేనంతా ఏవో పులకలు
కనులు తడి
ఆపుకోలేని అనంత జ్ఞాపకాల వెలుతురు
ఎప్పుడో చచ్చిపోయిన అమ్మ గుర్తుకి
ఆదిశక్తి తనువంతా విద్యుత్తులా ప్రాకి

ఎన్ని గమకాలు ఆ నాదంలో
జగత్తంతా శుభంలో పూచి
మన గుమ్మానికి కట్టిన తోరణాలు అల్లాడినట్లు
ఎంత విసుగు ఆ జాజ్ మ్యూజిక్
వాల్ట్జ్ ఇవ్వ గలదా
ఈ పురా చైతన్యానుభూతి?
ఆ బూర వూదినవాడు
ఇదిగో ఇప్పుడు మేఘంలో
అడుగో సూర్యుడి మీద పడుకుని
మరో తౄటి తారల చుట్టూ దోబూచులు
మరో లిప్త మన ఇంట్లో, నీడలో, హృదయంలో
సాగర సంగీతాన్ని నిశ్శబ్దం చేసి
సాగరాన్ని నిస్తబ్ధం చేసి
ఎన్నో యోజనాలు వెళిపోతున్నాడు.

ఆ సుస్వరం వెళిపోయిన దారినే వెళితే
అక్కడ అమ్మ
నాదం నిండా వాత్సల్యం పొంగి పొరలి
పురా బాల్య స్మృతలతో తలంటు పోసి
స్వఛ్ఛ ప్రేమతో సాదు బొట్టు పెట్టి
సర్వ జగత్శరీరాన్ని ధవళవస్త్రంతో తుడిచి

ఒకటే నాదం
ఆనంద నినాదం
నాదస్వరంలో
ఆది స్వరంలో

(2)
గగన నీలాన్ని
గాలి పొరలు పొరలుగా చీల్చుతోంది
రెండూ అదృశ్యములే
దిక్కులు ఊహా జనితాలు
దిక్కులు లేవు
కృష్ణుడు దిగంబరుడు
కృష్ణుడు శ్యామం
ఏమీ లేనిది నీలం
ఆకసం ఏమీ లేనిది

(3)
ఇది నాది
ఈ సంగీత సంప్రదాయం నాది .. ఇది అనాది
అమ్మలా ఇది ఆదిశక్తి

పురందరదాసుతో బాటూ నేను
అక్కడ చంద్రుని చుట్టూరా నేను
చుక్కల్లో తప్పటదుగులు వేస్తూ నేను
నాతో బాటూ రండి

అదుగో ఆకాశం మన కోసం గీచిన హాస రేఖ.
అదుగో ఎండలో ఇంకా మెరుస్తోంది
ఏ సాయంత్రానికో వెళ్తాం మనం
జడం నుంచి చైతన్యానికి
నాదస్వరం గాలి మూలల్లోకి పాకుతోంది
మన గుమ్మాల తోరణాలు కదలాడుతున్నై
గగన నీలం పల్చబడుతోంది
ఎవరో పిలుస్తోన్నారు
ఆ మండిపోతున్న మేఘాల కొసనుండి.
వేగుంట మోహనప్రసాద్ మాటల్లో అమ్మకి నివాళి
*** *** *** *** ***
వేంపటి అన్నపూర్ణ
1936 - 1998

సంగీతం వినడం నేర్పిన అమ్మకి .. సదా కృతజ్ఞుడనై

Friday, August 15, 2008

అమ్మ 2: ప్రత్యక్షమైన రోజు

హరికిన్ బట్టపు దేవి పున్నెముల ప్రో వర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతల్ తోనాడు పూబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కళ్యాణముల్ - పోతన


భాగ్యద లక్ష్మీ బారమ్మా .. పురందరదాస కీర్తన .. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి
ఈ పాట వినగానే మీకు ఒక ప్రసిద్ధ పాత తెలుగు పౌరాణిక సినిమాలో ఒక ప్రసిద్ధమైన పెళ్ళి పాట గుర్తొస్తే మీ తప్పేం లేదు.

అదే పాట హిందుస్తానీ బాణీలో పండిత భీంసేన్ జోషి గళం, ఒక కన్నడ సినిమాలో

లలిత రాగంలో ముత్తుస్వామి దీక్షితుల కృతి హిరణ్మయీం లక్ష్మీం సిక్కిల్ గురుచరణ్

శ్రీ రాగంలో బాలమురళీ మధుర గాత్రంలో ముత్తుస్వామి దీక్షితుల కృతి శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం - అన్నమయ్య

అమ్మ 1: ఆవిర్భవించిన రోజు

సుజలాం సుఫలాం మలయజ శీతలాం సశ్య శ్యామలాం
శుభ్ర జ్యోత్స్న పులకిత యామినీం
పుల్ల కుసుమిత దృమదళా శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం ... వరదాం ... వందే మాతరం

మనసుని ఆనందడోలికల్లో ఊగిసలాడించే దేశ్ రాగం ... మాతృ వందనం.

సాగర మేఖల చుట్టుకొని, సురగంగ చీరెగా మలచుకొని,
గీతా గానం పాడుకుని, మన దేవికి ఇవ్వాలి హారతులు ..
తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా ..

అరవయ్యొక్కేళ్ళ పండు ముత్తైదువా మా తల్లి .. మహాసముద్రపు అలల నురుగులు ఆమె పాదాల మంజీరాలు.

సారే జహా సె అఛ్ఛా హిందూసితా హమారా ..

పసి పిల్లలకి వాళ్ళ అమ్మ మొహమే అత్యంత సుందరంగా కనబడుతుందట .. హమారా వతన్ .. హిందూస్తాన్ .. బహు సుందరమైనది.

జయ జయ సశ్యామల సుశ్యామ చల చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత పూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా
జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి ..

అరొందలకి పైబడిన భాషల్లో, ఏ భాషలో అమ్మా అని పిలిచినా ఓయని కమ్మగా పలికే ఆ అమ్మ గొంతులో ధ్వనించే భాష ఆప్యాయతే.

ఏదేశమేగినా ఎందుకాలిడినా
పొగడరా నీతల్లి భూమి భారతిని
.. లేదురా ఇటువంటి భూదేవి ఎందూ ..

ప్రపంచంలో ఎటువైపు వెళ్ళినా, ఏ దేశాలు తిరిగినా, ఎన్ని ఐశ్వర్యాలు చూసినా, ఎన్ని భోగాలు అనుభవించినా .. తిరిగి మాతృభూమి మీద కాలు మోపగానే అదొక పులకింత. ఆ గాలి తగలగానే అదొక పరవశం. ఇది నేల మహిమా? గాలి మహిమా? మనుషుల మహిమా?

దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్ ..
దేశమును ప్రేమించుమన్నా ..

మనుషులే, మనుషులే, ముమ్మాటికీ మన మనుషులే. మనుషుల్ని ప్రేమిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం. వట్టి మాటలు కట్టి పెట్టి, గట్టి మేలు తలపెడదాం. మన సత్సంకల్ప బలాన్ని చేతల్లో చూపిద్దాం.

అమ్మా నీకు దండాలు
మా తుఝే సలాం
తాయే వణక్కం
వందే మాతరం

Monday, August 11, 2008

బ్లాగ్విషయం - గ్రంధాలయాలు - 2

మొదటి భాగం తరువాయి

ఎనిమిదో తరగతికి బిషప్ గ్రాసీ హైస్కూలుకి చేరుకున్నా. దీన్నీ గుణదల బోర్డింగ్ స్కూలు అని కూడా అనేవారు. పరమ రౌడీల స్కూలు అని ఆ రోజుల్లో విజయవాడలో ప్రతీతి. నేను ఈ స్కూలుకి వచ్చే సమయానికి సరిగ్గా మా బడికి ఎదురుకుండానే రామగోపాల్ అనే సినిమా హాలు కట్టారు. నగరంలో ముఖ్యమైన థియేటర్లలో ఆడేసిన సినిమాలు ఒక్కోవారం మాత్రం ఈ హాల్లో ఆడేవి.

అప్పటిదాకా చదువుకున్నది కో ఎడ్యుకేషను. పాఠం చెప్పింది లేడీ టీచర్లు. ఇక్కడ బడి ప్రాంగణంలోకి అడుగెట్టాక గుండెలినిండా గాలి పీల్చినా ఎక్కడా ఆడ వాసన కూడా చొరరాని మగ కీకారణ్యం .. కాదు కాదు మగ ఎడారి. ఎలాగో అలవాటు పడ్డాను. కొందరు పాతబడి నించి పాత స్నేహితులు అవలంబనగా ఉండగా కొత్త స్నేహితులు కొందరు ఏర్పడ్డారు. చూస్తూ చూస్తూ ఉండగానే ఎనిమిదో తరగతి ముగిసింది.

పాతబళ్ళోనూ కొత్తబళ్ళోనూ కొంచెం బాగా చదువుతాననీ బుద్ధిమంతుణ్ణనీ పేరు. అంచేత విద్యార్ధుల తరపునించి ప్రత్యేకమైన పని ఏవన్నా ఉందంటే క్లాసులో మేస్టారు నన్ను పిలుస్తూ ఉండటం పరిపాటి. అలాంటిది మేము తొమ్మిది చుదువ్తూ ఉండగా ఒకరోజు బడి అటెండరు ఒక చీటీ పట్టుకొచ్చి మేస్టారికిచ్చాడు. ఆయన, "ఒరే రామకృష్ణా, హెడ్‌మేస్టారు పిలుస్తున్నారు." అని నా ముఖ్య స్నేహితుణ్ణి పిలిచారు. వాడు లేచి అటెండరుతో వెళ్ళాడు. ఆ పీరియడు తరవాత మధ్యాన్నపు ఇంటార్వల్. ఇంటర్వల్లో రామకృష్ణ వొచ్చి కలిశాడు. విషయమేవిటంటే .. మా బడికి ఒక లైబ్రరీ ఉంది (ఆ విషయం మా కెవ్వరికీ ఇంతవరకూ తెలీదు). లైబ్రేరియను ఎవరు లేకపోవటం వల్ల ఇన్నాళ్ళూ అది నడవలేదు. సరికొత్తగా ఒక లైబ్రేరియన్ ఎపాయింటై వచ్చారు. మా రామకృష్ణ వాళ్ళ నాన్నగారు ఇంకో బళ్ళో మేస్టరుగా పని చేస్తార్లే, ఈ లైబ్రేరియను గారు కూడా ఆ బడిలో పని చేసేవారు. మా బడి లైబ్రరీ చాలా కాలం పట్టించుకోక పోవడం మూలాన చాలా హీన స్థితిలో ఉంది. ఆ పుస్తకాలన్నిటినీ బూజు దులిపి లైబ్రరీని ఒహ కొలిక్కి తీసుకు రావడానికి కొందరు "ఒబీడియెంట్ స్టూడెంట్" లని సహాయం పంపమని లైబ్రేరియన్ హెడ్ మాస్టారిని కోరాడు. అలాగ రాంకిష్టిగాడూ, వాడితోపాటు నాలాంటి మరి కొందరమూ మా బడి లైబ్రరీ అనే కోటలో పాగా వేశాం.

అదేదో జానపద కథల్లో మూసి ఉన్న గదిలోకి వెళ్ళోద్దని ముసలి అవ్వ ఆంక్ష పెట్టినా హీరో ఆ గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడో అద్భుత ప్రపంచం ఆవిష్కరించ బడుతుందే .. అలా ఉంది నా పరిస్థితి ఆ లైబ్రరీ గదిలో. వారానికో రెండు గంటలు లైబ్రరీ సర్దటం అనే మిష మీద లోపల దూరడం, పని కూడా చేశాం అనుకోండి, స్వామికార్యమూ స్వకార్యమూ అన్నట్టు, చదువుకోటానికి పుస్తకాలు తెచ్చుకోవడమూనూ. లైబ్రరీ సర్దుడు పూర్తయ్యి ఒక కొలిక్కి వచ్చాక బడి విద్యార్ధులందరికీ పుస్తకాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ పద్ధతి ఎలా ఉండేదంటే, కిటికీ బయట ఒక్కొక్క క్లాసు పిల్లకాయలు లైనులో నించునే వాళ్ళు. లైబ్రేరియను ఒక పుస్తకాల దొంతర పక్కన పెట్టుకుని కిటికీ లోపల కూర్చునేవాడు. చేతికందిన పుస్తకం ఇచ్చేవాడు, ఇక మారు బేరం లేదు.

మేము మాత్రం, ఒక నెల రోజులు లైబ్రరీ సర్దాము అన్న చనువుతో, లైబ్రరీ మీద సార్వకాలిక హక్కులు సంపాదించుకున్నాం. ఈ లైబ్రరీ పీరియడు సమయంలో మాలో ఇద్దరు లైబ్రేరియనుతో పాటు సహాయకులుగా లోపలికి వెళ్ళటమూ, కావలసిన పుస్తకాలు తెచ్చుకోవడము. అఫ్కోర్సు, మాక్కూడా తడవకి ఒక పుస్తకం కంటే ఎక్కువ ఇచ్చేవాడు కాదనుకోండి. ఇక్కడే ప్రపంచ సాహిత్యానికి నాకు తెర తీసినట్టయింది. ఇక్కడే నాకు తొలిసారిగా నండూరి రామమోహన రావుగారి అనువాదాల ద్వారా టాం సాయరూ, హకల్ బెరీఫిన్నూ పరిచయమయ్యారు. షేక్స్పియరు నాటకాల సంక్షిప్త కథలూ ఇత్యాదిగా అనేక ఆంగ్ల క్లాసిక్సన్నీ తెలుగులోనే అవుపోశన పట్టేశా. ఇహ తెలుగు నవలికలు, నవలలు లెక్కలేదు. కానీ నాకు అప్పటికి ఇంకా రాజకుమారుల టైపు సాహస గాధలంటేనే ఆసక్తిగా ఉండేది, సాంఘిక కధలకంటే.

సరిగ్గా ఈ సమయంలో నాకు ముగ్గురు పరిశోధకులు పరిచయమయ్యారు. ఇప్పుడు తల్చుకుంటే ఈ పుస్తకాలు మా బడి లైబ్రరీలో ఉండటం నాకు చాలా ఆశ్చర్య కలిగిస్తోంది. మాది కేథొలిక్ మిషనరీ బడే అయినా, ఒకానొక కాలంలో గొప్ప బడిగా పేరుండినా, మేం చదివే సమయానికి అదంతా గత వైభవం అయిపోయింది. నిర్మల కాన్వెంటు లాంటి ఇతర ఫేషనబుల్ మిషనరీ బడుల లాగా ఉండేది కాదు మా బడి. మరి అలాంటి చోట ఈ సరికొత్త అమెరికన్ ప్రచురణలు ఎలా వచ్చాయో నాకు అంతుపట్టని రహస్యం. మొత్తానికి ఈ ముగ్గురు పరిశోధకుల పరిచయంతో నా సాహిత్యాభిలాష ఒక్క గంతు వేసి పైకెగిరిందని చెప్పొచ్చు. ఒక్ఖ దెబ్బతో రాజకుమారులు, ఎగిరే రెక్కల గుర్రాలూ మీద మోజు తగ్గి, మిస్టరీలూ, క్లూలు, లాజికల్ డిడక్షన్ల మీద మనసు లగ్నమైంది. అహ, అంటే అసలు పూర్తిగా పోయిందని కాదు, ఈ రోజుక్కూడా అప్పుడప్పుడూ నాస్టాల్జియా కోసం మాయమంత్రాల పుస్తకాలు చదువుతాననుకోండి.

తరవాత్తరవాత చిన్నవయసులో ఇంగ్లీషు పుస్తకాలు బాగా చదివిన మిత్రులు చాలా మంది తగిలారు, వాళ్ళెవ్వరూ కూడా ఈ పుస్తకాలు చదివుండలేదు. వాళ్ళేవో నేన్సీ డ్రూ, ఎనిడ్ బ్లైటన్ ఇత్యాది కథల పేర్లు చెప్పేవారు. అవన్నీ ముగ్గురు పరిశోధకుల కాలి గోటికి సాటి రావనేది నా నిశ్చితాభిప్రాయం. డెటెక్టివ్ సాహిత్యంతో అలా మొదలైన నా టీనేజి ప్రేమాయణం ఇప్పటికీ ఏమాత్రం తీక్ష్ణత తగ్గకుండా కొనసాగుతోంది. (సశేషం)

Sunday, August 10, 2008

అమెరికా తెలుగు బ్లాగర్లందరికీ ఆహ్వానం

అమెరికాలో ఉంటూ తెలుగులో బ్లాగుతున్న మిత్రులందరికీ నా ప్రత్యేక ఆహ్వానం

మా డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదో పుట్టిన రోజు వేడుకల విషయం మొన్ననే చెప్పాను, చూసే ఉంటారు.

ఒక తెలుగు సాహిత్య వేదిక మీద తెలుగు బ్లాగు సాహిత్యానికి పెద్ద పీట వేసి, ఒక సెషను మొత్తం తెలుగు బ్లాగు బాగోగుల చర్చకి కేటాయించడం ఇదే మొదటి సారి.

తెలుగు సాహిత్య లోకంలో బ్లాగర్ల సత్తాని చాటి చెప్పేందుకు ఇది మహత్తర అవకాశం. ఇతర తెలుగు బ్లాగర్లని ముఖాముఖీ కలుసుకోవడం అరిసె మీద పంచదార అద్దినట్టు అనుకోండి. బ్లాగర్లే కాక దేశంలో పేరుమోసిన సాహితీవేత్తలెందర్నో కలుసుకోవచ్చు .. ఈ అనుభవానికి ఏం పోలిక చెప్పాలో నాకు అందట్లేదు .. అది అనుభవైక వేద్యం, మీకు చాలాకాలం గుర్తుండే అనుభవం అవుతుందని మాత్రం చెప్పగలను.

దేశం నలుమూలల నించీ డిట్రాయిట్ వచ్చేందుకు అనువైన విమాన సర్వీసులు ఉన్నై. ఇక్కడికి చేరాక, హోటాల్లో ఉండలేను అంటే మీ అవసరాన్ని బట్టి, వసతి సదుపాయాల ఏర్పాట్లు కూడా ఉన్నై. సమావేశాలకి ప్రవేశ రుసుము కూడా ఏమీ లేదు.

ఇప్పుడే రిజిస్టరు చేసుకోండి.

తప్పకుండా రండి.

Saturday, August 9, 2008

పునః పరిచయం

మంచి మిత్రుడొకతను చాన్నాళ్ళకి కనిపించాడు.
పాపం మొహం చిన్నబోయి ఉంది.
ఏమైందయ్యా అన్నా.
బ్లాగు పోయింది అన్నాడు.
అయ్యో అన్నా.
వాళ్ళ దుంప తెగ, ఆ హోస్టు సర్వరు వాళ్ళకి అదేమి తెగులో. (మనలో మాట, మీ మీ రచనలూ, నచ్చిన వ్యాఖ్యలూ కూడా బేకప్ చేసుకుంటూ ఉండండి).
ఐతే, మరి, రాయడం మానేస్తారా అన్నా.

అబ్బే, కొత్త దుకాణం తెరిచాగా అన్నాడు.
మరి ఆ మాట చెప్పవేం? అని వెంఠనే వెళ్ళి తొంగి చూసొచ్చా.
కొత్త బ్లాగు సరికొత్త హంగులతో కళకళ్ళాడుతోంది.

ఈయన తెలుగు బ్లాగులకి పాతకాపే. ఆయనకి నా పరిచయం అవసరం ఏమీ కాదనుకోండి, ఏదో నా చేతులూరుకోక చేస్తున్నా.
మరీ తరచుగా పుంఖాను పుంఖాలుగా రాసెయ్యడు కానీ రాసిన ప్రతిదీ నాలుగు సార్లు చదువుకునేలా ఉంటుంది.
తెలుగు సినీగీత సాహిత్యం అనే ఇసుము నించి తివిరి మంచి గంధపు తైలం తియ్య గల దిట్ట.

Ladies and gentlemen!
I am very happy to re-introduce Sri Chivukula Krishnamohan.

మీరూ ఒక లుక్కెయ్యండి.

Friday, August 8, 2008

అశాశ్వత క్షణాలు

కొన్ని కొన్ని అనుభవాల ప్రత్యేకత వాటి తాత్కాలికత లోనే ఉంటుందేమో ననిపిస్తుంది.
తరగటం పెరగటం లేకుండా ప్రతి రాత్రీ పున్నమి వెన్నెల కాస్తే దానికేమీ ప్రత్యేకత ఉండదు.
ఒక్క వేసవి లోనే కాక ఏడాది పొడుగునా మల్లెపూలూ, మావిడిపళ్ళూ దొరికేట్లయితే వాటికీ ఏమీ ప్రత్యేకత ఉండదు.

మనిషి తత్వం ఎలా ఉంటుంది అంటే .. అయ్యో నెలలో మిగతా 29 రోజులూ ఇలాంటీ వెన్నెల ఉండదు కదా; ఈ మావిడి పళ్ళూ మల్లెపూలూ ఈ రెణ్ణెల్లేగా దొరికేది, మిగతా పది నెలలూ దొరకవు గదా .. అని విచార పడుతూ ఉంటుంది.

ఏదన్నా అనుభవాన్ని తరువాతి కాలంలో గుర్తు చేసుకోవడం కోసం రికార్డు చేసుకోవడంలో తప్పేం లేదు గాని, ఆ రికార్డు చేసుకునే హడావుడిలో పడి ఇప్పుడు ప్రత్యక్షంలో ఉన్న అనుభవాన్ని ఆస్వాదించ లేక పోతే .. హబ్బ, ఎంత వృధా?

ఒకసారెప్పుడో న్యూమెక్సికో రాష్ట్ర రాజధాని ఆల్బుకర్కీ నగరానికి వెళ్ళాను. ఎప్పుడూ అమెరికా ఈశాన్య రాష్ట్రాల్ని వదిలి వెళ్ళని నాకు అదొక విలక్షణమైన ప్రపంచం. అదొక వింత లోకం. (న్యూమెక్సికో రాష్ట్రం అమెరికా దక్షిణపు భాగంలో టెక్సస్ రాష్ట్రానికి వాయవ్య దిశగా ఉంటుంది.) ఆల్బుకర్కీ నగరానికి తూర్పు దిక్కున శాండియా పర్వత శ్రేణులు ఉత్తర దక్షిన దిశగా పరుచుకుని ఉన్నాయి. అక్కడ ఒక చోట పర్వతాగ్ర భాగం చేరేందుకు కిందనించి రోప్ వే కట్టారు. పైన ఒక చిన్న పార్కు, రెస్టారంట్ ఉన్నాయి. ఉత్సాహవంతులైన వారు అక్కడి నించి కాలినడకన వనవిహారం కూడా చెయ్యొచ్చు. ఐనా అది కాదు ఇప్పుడు విషయం.

ఈ రోప్ వే మీద ప్రయాణించే కారు నాలుగు వైపులా అద్దాలతో ఒక మినీ బస్సంత ఉంటుంది. పాతిక ముప్ప్ఫై మంది పడతారు. సుమారు పదిహేను నిమిషాల ప్రయాణం. పైకెక్కే కొద్దీ కళ్ళబడుతున్న శాండియా పర్వత సానువులూ లోయలే కాక, విశాలంగా పురివిప్పుతున్న ఆల్బుకర్కీ నగర విస్తీర్ణం. సూర్యాస్తమయ సమయం. పడమటి దిక్కున సూర్యభగవానుడు సంధ్యాకాంతని రాగరంజితం చేస్తున్నాడు. ఎన్నెన్ని రంగులు ఆకాశం నిండా. ఎటు చూసినా కళ్ళు పట్టనంత సౌందర్యం. నా చుట్టూతా జనాలు, పదిహేన్నిమిషాల మహాద్భుతాన్ని ఒక జీవితకాలం పొందు పరుచుకోవాలని ఆశతో, కేంకార్డర్లలోనూ కేమెరాల్లోనూ ఆ సౌందర్యాన్ని బంధించేందుకు విఫల ప్రయత్నం చేస్తూ. నా చేతుల్లోనూ ఒక అధునాతనమైన కేమెరా ఉంది. ఎక్కడో మెదడు సందేశాలు పంపుతోంది, ఫొటోలు తియ్యమని. దాని గోడు పట్టించుకునే నాథుడు లేడు.

ఇప్పుడు మీకు చూపిద్దామంటే ఫొటోలూ లేవు, ఈ నా మాటలు తప్ప.
కానీ నా మనసులో ఆ అనుభవం మాత్రం పదిలం.

తా.క. ఇవ్వాళ్ళ మూడెనిమిదుల తేదీ :)