Sunday, April 27, 2008

బ్లాగ్విషయం - గ్రంధాలయాలు - 1

ఎన్ని గ్రంధాలయాలని చెప్పను?

చిన్నప్పుడు మా బడి వీధిలో నాపరాతి గచ్చు రీడింగ్ రూము దగ్గిర్నించి విదేశంలో విశ్వవిద్యాలయాల బృహద్గ్రంధాలయల మీదుగా నేడు బహు చిన్నవైనా అత్యాధునికమైన తంత్ర వనరులతో అలరారే ఇక్కడి స్థానిక గ్రంధాలయాల వరకూ .. నా జీవితంలో గ్రంధాలయాల పాత్ర తలుచుకోడం అంటే ఆల్మోస్టు నా జీవితమంతా నెమరేసుకోవడమే. ఈ కథ ఒక్క టపాతో ముగిసేది కాదు, విడతలుగా రాసుకోవాల్సిందే.

మా బడి ఇంటినించి సుమారు ఒక అరమైలు దూరం ఉండేది. అప్పుడప్పుడూ బస్సులో వెళ్ళినా సాధారణంగా నడిచే వెళ్ళటం. నేను నాలుగో క్లాసులో ఉన్నప్పుడు అనుకుంటా .. ఆ వీధిలో ఒక గుమ్మం ముందు బంతి పూల తోరణం కట్టి "నేడే ప్రారంభోత్సవం" అనే చిన్న బేనరొకటి కట్టి ఉంది. మేము బడికి వెళ్ళే వేళకి ఇంతే. సాయంత్రం తిరిగి వస్తుంటే అక్కడ చాలా మంది ఉన్నారు. కొంచెం తెలిసినట్లుగా కనిపించిన ఒకాయన్ని అడిగాం ఏం జరుగుతోందని. ఇక్కడ గ్రంధాలయం తెరుస్తున్నాం, మీరు కూడా వచ్చి చదువు కోవచ్చు అని చెప్పాడాయన. పిల్లల పుస్తకాలు కూడా ఉంటాయా అని ఆత్రంగా అడిగాను. ఆయన కొంచెం నవ్వి "ప్రస్తుతానికి వార్తా పత్రికలూ వార పత్రికలూ అవీ ఉంటాయి. నెమ్మది మీద అన్ని రకాల పుస్తకాలూ సమకూరుస్తాం" అన్నాడు. మాకు అప్పటీకి తెలీదు, ఆయనే ఈ గ్రంధాలయ వ్యవస్థాపకుడూ ఆ యిల్లు ఆయనదే.

మర్నాడు మేం బడికి వెళుతుంటే అక్కడే అరుగు మీద కూర్చుని ఉన్నాడాయన. మమ్మల్ని పిలిచాడు. లోపల చాపలు పరిచి ఉన్నాయి. ఒక టేబుల్ మీద తెలుగు దిన పత్రికలు దొంతర పెట్టి ఉన్నాయి. ఒక కొత్త నోటుబుక్కు, ఒక కొత్త పెన్సిలు రెండూ ట్వైన్‌ దారంతో ముడేసి బల్ల కోడుకి కట్టేసి ఉన్నై, ఎవరూ ఎత్తుకు పోకుండా. అన్నీ మాకు చూపించి, రోజూ వచ్చి మేమక్కడ పత్రికలు చదువుకోవచ్చనీ, వచ్చే నెల నించీ చందమామ లాంటీ పత్రికలు కూడా తెప్పిస్తాననీ, మాకు నచ్చిన విషయాల్ని ఆ నోటుబుక్కులో రాయాలనీ చెప్పాడాయన - వొట్టినే మన పేరు రాసేస్తే చాలదట.

సరే, ఇక ఆ రోజు నించీ సాయంత్రం ఇంటీకి వచ్చే దారిలో కనీసం ఓ పావుగంట అక్కడ పేపర్లు తిరగెయ్యడం అలవాటయింది. పేపరు చివరి పేజీలో పెద్దగా వేసే మా అభిమాన హీరోల సినిమాల ప్రకటనలు చూసి వాటీని చించి దాచుకోవాలనే కోరిక బలంగా ఉన్నా కూడా మేం నిగ్రహంగానే ఉన్నాం. ఒక రోజు పొద్దున మేం బడికి వెళుతుంటే ఆయన పిలిచాడు. మేం దగ్గిరికి వెళ్తూనే తిట్లంకించుకున్నాడు. ఏంటంటే ఎవరో ఆకతాయి వెధవలు పేపర్లని చించనే చించారు. రెగ్యులర్ గా అక్కడికి వచ్చేది మేమే కాబట్టి మమ్మల్ని పట్టుకున్నాడు ఈ పెద్దమనిషి. మాకు రోషం మహా మండి పోయింది. ఇహ ఆ రోజు నించీ ఆయన చుట్టు పక్కల లేకుండా చూసి లోపలికి దూరి ఆ నోటు బుక్కులో మాకొచ్చిన బూతులన్నీ రాసేసి పారిపోయేవాళ్ళం. రెండో నెలకల్లా ఈ గ్రంధాలయం మూతబడింది. స్థానే ఒక చిల్లరకొట్టు వెలిసింది.

ఇంచుమించు ఈ సమయంలోనే నాకు ఒక క్రైస్తవ బాలల గ్రంధాలయమూ ఒక సోవియట్ బాలల గ్రంధాలయమూ కూడ పరిచయమయ్యాయి. మొదటిది ఒక పాస్టరు గారింట్లోనే. అందుకని అంతా పకడ్బందీగా ఉండేది, ప్రశాంతంగా ఉండేది. ఆ పుస్తకాలు చక్కటి కాగితంతో బైండుతో, రంగు బొమ్మలతో చాలా అందంగా ఉండేవి. అక్కడే నేను అబ్రహాము, మోజెస్ ఇత్యాదుల కథలు మొదటిసారి చదివాను. మా బడి ఉండేది చుట్టుగుంట దగ్గిర విశాలాంధ్ర పత్రికాఫీసు ఉన్న రోడ్డులో. అంచేత ఆ చుట్టు పక్కల కమ్యూనిస్టు పార్టీ ప్రాభవం బలంగానే ఉండేది. అక్కడే ఈ సోవియట్ బాలల లైబ్రరీ కూడా. అందులో సోవియట్ బాలల సాహిత్యం మొదటి సారి పరిచయమైంది. ఆ పుస్తకాలు కూడా చాలా చక్కటీ కాగితంతో చక్కటి బొమ్మల్తో ఉండేవి. కథల్లో పాత్రల పేర్లు మీషా, శోష్కా .. అని ఇలా తమాషాగా ఉండేవి. నేనూ నా స్నేహితులు ఒకరికొకరు ఇలాంటి పేర్లు పెట్టుకుని పిలిచుకునే వాళ్ళం. కాకపోతే ఈ రెండు రకాల పుస్తకాల్లోనూ భాష మాత్రం చందమామ లాంటి పత్రికల్లో మాకు అలవాటైన భాష కాదు, చాలా తమాషాగా ఉండేవి. ఆ విచిత్రమైన భాషకి ఆశ్చర్య పడుతూనే కథలంటే ఉన్న పిచ్చి వల్ల క్రమం తప్పకుండా ఈ రెండు లైబ్రరీలనీ దర్శిస్తూ ఉండేవాణ్ణి.

Tuesday, April 22, 2008

లిటిల్ మిస్ సన్‌షైన్‌


లిటిల్ మిస్ సన్‌షైన్‌
సూపర్ సినిమా!
చూడండి!!
అంతే!!!

Monday, April 21, 2008

రెండో కథకి గడువు పొడిగింత

పలువురు బ్లాగ్జనుల కోరిక పై రెండో కథాంశానికి కథలు సమర్పించే గడువు పొడిగించడమైనది. ఔత్సాహిక కథకులకి ఏప్రిల్ 25 వరకూ సమయం ఉంది. త్వరపడండి :-)

అసలు ఏంటీ, కథాంశం, గడువు అనుకుంటున్నారా?
ఐతే ఇక్కడ చూడండి. కాస్త ఓపిగ్గా ఆ టపా చివరిదాకా చదివితే అసలు కథ మీకే తెలుస్తుంది.

ఇప్పటిదాకా వెలువరించిన వారు: లలిత, రమ, తాడిమేటి రాజారావు, మయూఖ, దైవానిక, రమ్య.
ఎవర్నైనా నేను గమనించక పోతే దయచేసి నాకో వేగు పంపండి.

Wednesday, April 16, 2008

నిజ జీవితంలో తెల్ల కాయితం

నేను తెల్ల కాయితం కథా వస్తువుని ప్రకటించినప్పుడు ఒకరిద్దరు మిత్రులు అన్నారు, ఇంకా ఈ కాలంలో ఒక్క తెల్ల కాయితం కూడా దొరకని వాళ్లుంటారా అని.
ఏం చెప్పాలో తెలీక మౌనంగా ఉండిపోయాను.
ఐతే ఈ ఇతివృత్తాన్ని ఉపయోగించి మనవాళ్ళు చాలా మంది రాసిన కథల్లోని కొన్ని సంఘటనలు ఒక నిజజీవితంలో జరిగిన ఉదంతం ఇలా కళ్ళబడుతుందని అనుకోలేదు.

సుంకోజి దేవేంద్ర మంచి భవిష్యత్తున్న యువ కథా రచయిత. తన సొంత అనుభవాల్ని నెమరు వేసుకుంటూ అవే తనకి కథకుడిగా ఎదగడానికి ఎలా ప్రేరణ అయినాయో ఇక్కడ చదవండి తన సొంత గొంతులో.
కథ 2005 సంకలనంలో చోటు చేసుకున్న అతని కథ కొమ్మిపూలు గురించిన ప్రస్తావన ఈ సమీక్షలో చూడచ్చు.
అతని కథల సంపుటి అన్నం గుడ్డ అనే పేరుతో 2007 లో విడుదలైంది.

దేవేంద్ర గురించి, అన్నం గుడ్డ కథల సంపుటి గురించి మరి కొన్ని మాటలు.
http://kadalitaraga.wordpress.com/2007/02/23/aksharala_daarushilpi_devendra/
http://pustakam.wordpress.com/2007/07/09/annam/

దేవేంద్రని ఈ సరి కొత్త గౌరవం సాధించిన సందర్భంగా మనసారా అభినందిస్తూ ..

Monday, April 7, 2008

మిస్సమ్మ

కడుపున పుట్టక పోవడమే లోపమైతే నువ్వు వారమ్మాయివేనమ్మా ..

అనడానికి ఎంత త్యాగ బుద్ధి కావాలి?

ఋజువు లడగలేదు, డాక్యుమెంట్లడగలేదు, ఇంకే సాక్ష్యాలడగలేదు ..

ఎవరో తిరనాళ్ళలో దొరికిన నాలుగేళ్ళ పిల్లని, ఎంత పిల్లలు లేని దంపతులైతే నేమి, తమ సొంత బిడ్డలా పెంచు కోవడమేవిటి, పైగా ఆ పిల్ల చదువు కోసవని అప్పు చేసి మరీ చదివించడవేవిటి .. సినిమా మొత్తం చూడండీ .. టాప్ టు బాటం .. పచ్చి కరుడు గట్టిన స్వార్ధం .. వార్నీ, ఏం తెలివిరా ఈ డెవిరెక్టరుదీ .. మన లోతు లోతుల్లోని స్వార్ధాలన్నీ మనుషుల్లోకి దట్టించి చూపించేశాడే అనుకుంటూ ఉంటాం .. లేకపోతే .. అసలా దొంగ దంపతులే చూడండి .. అ పిల్ల సావిత్రంత సౌందర్యవతీ, గుణవతీ, అన్నిటికన్నా గొప్ప ఆత్మాభిమానం కలదీ కాక పోతే పంతులు మనసు చలించేదా? ఎట్లాగైనా అని చెప్పి ఈమెనే పట్టుకు వేళ్ళాడుతూ ఉండేవాడా?

అలాగే .. పంతులు రామారావంత అందగాడూ, మర్యాదస్తుడూ, స్త్రీ మనసు తెలుసుకుని అనుగుణంగా మెలిగే నెమ్మదస్తుడూ కాకపోతే .. పంతులమ్మ .. మిస్ మేరీ మనసు కరిగేదా .. ఆయనే నా భర్త .. అని తాళి కట్టకుండా పబ్లిగ్గా ఒక మొగాణ్ణీ ఒప్పుకునేదా?

అందరూ .. అంధరూ .. దొంగలే .. టాప్ టూ బాటం .. అంధరూ స్వార్ధ పరులే .. సినిమా ముదణ్ణించీ చివరి దాకా చూసి .. ఆహా, యేమి ఎల్వీ ప్రసాదు మహాశయా, మనిషి స్వభావాన్ని కళ్ళకి కట్టేశావు గాదయ్యా .. ఒక పక్కన హాశ్యమాడుతూనే .. మరో పక్కన ప్రతీ పాత్రలోనూ మా నీడల్నే మాకు చూబెట్టావు గాదటయ్యా .. నా సావిరంగా .. ఇదీ రియలిజం అంటే .. అనుకుంటూ లేచి కూచున్నానండి, సో్ఫాలో .. సినిమా ఐపోవస్తా ఉందండి .. ఇంతకు ముందెన్ని సార్లు చూళ్ళేదండీ .. ఓ ఐదొందల సార్లన్నా చూసుంటానండి ..

సరిగ్గా అప్పుడొచ్చేశారండీ మేరీ తలిదండ్ర్లులు .. ఎస్వీయార్ అడిగాడండీ .. అమ్మాయి మీ సొంత బిడ్డా పెంపుడు బిడ్డా అని .. అప్పుడు సావిత్రి పెంపుడు తండ్రి ఫాదరీ గా దొరస్వామి డయలాగండీ పైన చెప్పింది .. నా సావిరంగ .. నా థియరీ మొత్తం ఒక్ఖదెబ్బతో కూలదోశాడండీ ..అసలు ఏవి డయలాగండీ ..

కడుపున పుట్టక పోవడమే లోపమైతే నువ్వు వారమ్మాయివేనమ్మా ..

పదహారేళ్ళు పెంచి పెద్ద జేసినాక అలాగనడానికి ఎంత త్యాగ బుద్ధి కావాలండీ?

Friday, April 4, 2008

జీవిత పరమార్ధం ఏవిటి?

మీ జీవిత పరమార్ధం ఏవిటి?

మీ అంటే మీరే .. ఈ పోస్టు చదువుతున్న మీరే.

మీ పక్కన బ్రేక్ఫాస్ట్ తింటున్నవాళ్ళో, మీ బుజమ్మీంచి కంప్యూటర్లోకి తొంగి చూస్తున్న వాళ్ళో,ఇవన్నీ కాక ఎవరో సాధారణ సగటు మనుషులో కాదు - మీరంటే అచ్చంగా మీరే .

మీ జీవితాశయం ఏవిటి? ఏ పరమార్ధం కోసం జీవిస్తున్నారు మీరు?

నాకు Pulp Fiction అనే సినిమా చాలా ఇష్టం. అందులో Samuel Jackson అనే నటుడు Jules అనే గూండా పాత్ర పోషిస్తాడు. ఒక రోజు పొద్దున్నే తమ బాస్‌ని మోసం చేసిన ఒక బృందాన్ని బెదిరించి వాళ్ళ దగ్గిరున్న బాస్‌కి చెందిన బ్రీఫ్‌కేస్ తీసుకు రావడానికి వెళ్తారు, జూల్స్, అతని సహ గూండా విన్సెంట్. అక్కడ అంతా వీళ్ళకి అనుకూలంగా జరుగుతోంది అనుకుంటుండగా, ఆ బృందానికి చెందిన ఒక పిల్లగాడు బాత్రూంలో దాక్కుని ఉండి, అకస్మాత్తుగా వీళ్ళ మీద పిస్తోలుతో దాడి చేస్తాడు. వాడు ఆరు బుల్లెట్లు పేలిస్తే తమాషాగా వీళ్ళకి ఒక్కటి కూడ తగల్దు. ఆ తరవాత జూల్స్, విన్సెంట్ ఒక కాఫీహోటల్లో బ్రేక్ఫాస్ట్ తింటుండగా తను గూండాగిరీ విరమిస్తున్నా అంటాడు జూల్స్. విన్సెంట్ నీకేమన్నా మతి పోయిందా అంటాడు. దానికి జూల్స్ సమాధానం ఇది -

"Well, yeah. I was just sitting here, eating my muffin, drinking my coffee, when I had what alcoholics refer to as a moment of clarity."

Now, the question is this - Did you ever have your own moment of clarity?

Tuesday, April 1, 2008

మార్చి గడికి స్లిప్పు

పొద్దు మార్చి గడి ఇక్కడ.
ఈ సారి సత్యసాయి మేస్టారి సాహిత్య పటిమా, సంగీత గరిమా, పౌరాణిక మహిమా .. అన్నీ కలిపి ఒక పక్క ఆనందభైరవిలో సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఇంకో పక్క కండలు పెంచిన గండడై ధబధబలాడించేశారు.
సుగాత్రి గారు మహా గడుసుగా కర్రా విరక్కుండా పామూ చావకుండా రెండు ఆధారాలకి మాత్రం పురెక్కించి వొదిలి పెట్టారు.
మేష్టారూ, చెమత్కారాలు యధావిధిగా మాంఛి ఘాటుగా ఉన్నయ్యి, గానీ ఈ సారి అక్షరాలకి తప్పటడుగులు ఎక్కువై దాంతో మాకు తికమక ఎక్కువఈంది. ఏదో బేక్గ్రౌండులో కంబైండ్ స్టడీలు చేసి కొంతవరకూ సాధించామనుకోండి.
మిగతా సోదర సోదరీమణులకి ఒక్క చిన్న స్లిప్పందిస్తే ఏమనుకోరుగా?