Monday, February 18, 2008

కథ రాయండి!

తెల్ల కాగితం
పల్లెటూరిలో ఒక పదేళ్ళ పిల్లాడు.
భయంకరమైన పేదరికం.
వాడు ప్రాథమిక పాఠశాలలో నాలుగో క్లాసో ఐదో క్లాసో చదువుకుంటున్నాడు.
వాడికెప్పుడూ రాసుకునేందుకు ఒక సైడు వాడిన కాగితాలు కుట్టిన పుస్తకాలే.
ఎప్పుడూ కొత్త నోటు బుక్కు కానీ తెల్లకాగితం కానీ వాడిన పాపాన పోలే.
ఒకసారి ఎవరో ఆఫీసర్లు వచ్చి వెళ్ళినప్పుడు ఒక ఆఫీసరు ఫైల్లోంచి జారి పడిన తెల్ల కాగితం వాడికి దొరికింది.
వాడి మనసు ఉప్పొంగి పోయింది ఆనందంతో.
దాన్ని భద్రంగా దాచుకున్నాడు.
ఏ సందర్భంలో చివరికి దాన్ని ఉపయోగించాల్సి వచ్చింది?

ఈ ఇతివృత్తంతో ఒక చక్కటి కథ రాయండి.

గడువు మార్చి 16 ఆదివారం.

రాసిన కథని మీ బ్లాగులో పెట్టినా సరే, ఏదన్నా వెబ్జీను (ఈమాట, పొద్దు, ప్రాణహిత)కి పంపినా సరే, లేక సరాసరి నాకు పంపినా సరే - మీ యిష్టం. ఏదేమైనా నాకో మెయిలు
పంపడం మరిచిపోకండి.

నాకు నచ్చిన కథకి ఒక మంచి తెలుగు కథల పుస్తకం బహుమతి ఇస్తాను.

సూచన: కథ చెప్పటం పిల్లవాడి గొంతులో పూర్తిగా పిల్లవాడి దృక్పథం నించి చెబితే బాగా బలంగా వస్తుందని నాకనిపిస్తోంది. కానీ అలాగే రాయాలని ఏం లేదు. తెల్లకాగితం అని నేనూరికే ప్రతిపాదిస్తున్నా. మీకిష్టమైన పేరు పెట్టొచ్చు.

మార్చి 17 న కొత్త ఇతివృత్తం వెలువడుతుంది.

Wednesday, February 13, 2008

ఫిబ్రవరి పొద్దుగడికి ఓ ఛీట్ షీట్


Monday, February 11, 2008

నిశాంత మహీజ ...

ముందొక సారి సంగీతంతో .. అటుపై సాహిత్యంతో నన్నొకటికి రెండుసార్లు పల్లిటీ కొట్టించిందీ పాట.

భాగ్యనగరంలో పని చేస్తుండగా నా సహోద్యోగి బల్ల దగ్గర నిల్చుని ఏవో కాయితాలు చూస్తున్నాను. అతని కంప్యూటర్ స్పీకర్లలోంచి సన్నగా వస్తున్నదీ పాట. ముందు పాటలో అంతర్గతంగా ఉన్న బలమైన లయ నన్ను ఆకర్షించింది. నా కాయితాలు నేను చదువుకుంటూ నా ప్రమేయం లేకుండానే దానికి తల ఊపుతున్నాను. పాట ముగిశాక అతన్నడిగాను, ఏవిటది, మళ్ళీ పెట్టమని. సఖి సినిమాలోదని చెప్పి మళ్ళీ పెట్టి సౌండు పెంచాడు. ఆ పేరు విని నాకేమీ స్ఫురించలేదు. ఇప్పుడు స్పష్టంగా వినబడే కానడ రాగం వినగానే నాకర్ధమైంది .. ఇది అలై పాయుదే అని ఊతుక్కాడు వేంకట సుబ్బయ్యర్ గారి కర్ణాటక సంగీత కృతి. ఇదేవిటి మరి ఏవో తెలుగు మాటల్లా వినబడుతున్నాయే .. అదే పేరుతో మాధవన్ షాలిని జంటగా తీసిన తమిళ చిత్రంలో ఈ కర్ణాటక కృతిని యథాతథంగా ఉపయోగించారు. ఓహో, ఈ సఖి అనే సినిమా దానికి తెనుగు సేత అన్న మాట! తమిళ సినిమాలో ఉన్న కర్ణాటక కృతిని కూడా తెలుగులో అనువదించి అదే బాణీలో వాడారే .. భలే ఉందే అని కొద్దిగా ఆశ్చర్య పోయాను .. అంతే .. అంత కంటే పెద్దగా పట్టించుకోలేదు.

ఇదంతా జరిగి ఐదేళ్ళు కావస్తోంది.

మొన్నీమధ్యన మన కల్హార స్వాతికుమారి గారు ఉన్నట్టుండి నిశాంత మహీజ శకుంత మరంద మెడారి గళాన వర్షించవా అన్నారు. ఒక్కసారి తాగుతున్న టీ కొరబోయి నోరు కాల్చుకుని .. అదేంటండీ బాబూ అట్లా జడిపిస్తే ఎలాగన్నాను. అమాయకంగా మొహం పెట్టి ఏదో మీలాంటి వాళ్ళు అర్ధం చెబుతారేమో నన్న ఆశతో అన్నారు. చూడు తల్లీ, ఏదో తెలిసిన నాలుగు తెలుగు ముక్కలు చెప్పుకుని కాలం గడుపుతున్నాను, ఇలా నిలదీయటం భావ్యమా అన్నాను. దయతల్చి ఆవిడే అర్ధం చెప్పారు. నిశాంత అంటే .. రాత్రి ముగిసింది అనగా ఉషోదయ వేళ .. మహీజ .. హమ్మ్ ఇది కొంచెం కొరకరాని కొయ్యే ...(భూమికి పుట్టినది - చెట్టు - థాంక్యూ వికటకవిగారూ) .. శకుంత .. చిన్నప్పుడు చదూకోలా? శకుంత పక్షులు పెంచుట చేత ఆమెకి శకుంతల అని పేరు వచ్చెను అని .. అవొక జాతి పక్షులన్న మాట. మరందం అంటే తేనె. ఎడారి గళాన వర్షించవా అనేది నాకూ అర్ధమైంది, తెలుగేగా! అంటే .. ఓ స్వామీ, తెల్లారు ఝాఁవున ఫలానా లాంటీ తేనెని ఎడారిలాగా ఎండిపోయిన నా గొంతులో కురిపించూ అని కవిహృదయం. అరె, భలేగా రాశాడే, ఎక్కడిదీ గీతం అనడిగా .. సఖి సినిమాలో పాట, అలై పొంగెరా అని సమాధానం. నాకు బల్బు కాదు కదా, ట్యూబులైటు కూడా వెలగలా!

అప్పుడిక లాభం లేదని ఆమె పాట సాహిత్యం మొత్తం పంపారు. చదువుతున్నా .. ఎక్కడో ఏదో జ్ఞాపకాల వీచికలు కదులుతున్నాయి.
అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిశాంత మహీజ శకుంత మరంద మెడారి గళాన వర్షించవా ...
అరెరే!
తరాన ననాన బిరాన వరాల .. ఇదేదో తెలిసినట్టు ఉందే?
అలై పొంగెరా? ఓ అలై పోంగెరా .. అలై పాయుదే .. కణ్ణా .. అలై పొంగెరా కన్నా .. భలే భలే..

ఏళ్ళ తరబడి కర్ణాటక సంగీతం వినివిని ఉన్న నాకు ఈ కృతి చిరపరిచయం. ఎందరో మహానుభావుల గళాన ఈ పాట వినే భాగ్యం నాకు దక్కింది. దీని తెలుగు అవతారం ఇలా తమాషాగా సాక్షాత్కరించడమే నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.

ఊతుక్కాడు వేంకట సుబ్బయ్యర్ త్యాగరాజ స్వామికి ముందటి వాడు. ఆయన జీవితాన్ని గురించి మనకి ఎక్కువ తెలీదు గానీ బాహ్య ప్రపంచాన్ని మరచి సదా బాలకృష్ణ ధ్యానంలో కృష్ణ లీలల్ని గానం చేస్తుండేవారని ప్రతీతి. ఆయన కృతులు అద్భుతమైన లయ విన్యాసంతో నిజంగా బాలకృష్ణుడే నర్తిస్తున్నట్టు ఉంటాయి. ఆ గతి కూడా తిన్నగా ఉండదు, పసి పిల్లవాడి చిందుల్లాగే ప్రతి రెండు వాక్యాలకీ గతి మారి పోతుంటుంది. ఇహ వాటిలోని లిరికల్ బ్యూటీని చెప్పటానికి నా తమిళ జ్ఞానం చాలదు. అన్నట్టు మార్నింగ్ రాగా అనే తెలింగ్లీషు సినిమాలో షబనా అజ్మీ పాత్ర చివరకి తోడి రాగంలో పాడే పాట తాయే యశోద ఉందన్ ఆయర్ కులత్తు దిత్తన్ కూడా వీరి కృతే.

మొత్తానికి ఈ నిశాంత మహీజ నన్నొక ఊపు ఊపి వొదిలి పెట్టింది. ఏవిట్రా దీనిలో ఉన్న పస అని పట్టి చూశా .. మీరూ గమనించండి, ఒక్క నిమిషం మాటల్ని మరిచి పోయి .
లలాల లలాల లలాల లలాల - IUI అనే వరుస పదే పదే పునరావృతమవుతోంది.
దీన్ని ఛందస్సులో జ - గణం అంటారు. జ గణంతో జగడం కోరగా తగదు అన్నాడూ శ్రీశ్రీ సిరిసిరిమువ్వ పద్యాల్లో. అది సరే .. ఒకటే జ గణం ఇన్ని సార్లు రెపీటవడమెందుకూ?
పదండి, మా నిఘంటువు చూద్దాం .. కవిరాజ విరాజితము .. ఈ పద్యమునందు ప్రతి పాదమునను ముందు ఒక న గణమును, దాని పిదుప ఆరు (ఏకంగా ఆరే!) జ గణములును, అంత్యమున ఒక వ గణమును ఉండ వలయును. ఈ నిఘంటువు రాసిన మహానుభావుడు ఉదాహరణ ఇవ్వలేదు. ఇవ్వక పోతే మన సొంత తెలివి లేదా? డవిరెక్టుగా .. తెలుగు లెస్స అన్న తెలుగు వల్లభుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆముక్త మాల్యద నించే ఎగ్జాంపిలు తెచ్చి దాఖలు చేస్తున్నా ..

క.వి. జయ జయ చంద్ర దినేంద్ర శతాయుతసాంద్ర శరీర మహా ప్రసరా ..
ఓయబ్బో, ఇంతదానికి సాహితీసమరాంగణ సార్వభౌమ అని బిరుదొకటి, ఇంతకన్న మా వేటూరే గొప్పగా రాశాడులే పోవయ్యా.

చూడండి మళ్ళొక్కసారి .. అసలు ఎంత ముద్దొస్తున్నదో .. లేచి ఆ లయలో లీనమై చిందెయ్యాలనిపించటంలేదూ?
అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిశాంత మహీజ శకుంతమరంద మెడారి గళాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిల్లు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిల్లు బిగించవా
కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలె రచించవా
కవిత మదిని రగిలి ఆవేదనా
ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలి ఆవేదనా
ఇతర భామలకు లేని వేదనో
ఇది తగునో యెద తగవో ఇది ధర్మం అవునో
ఇది తగునో యెద తగవో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగా
అలై పొంగెరా కన్నామానసమలై పొంగెరా
నీ ఆనంద మోహన వేణుగానమున .. ఆలాపనే .. కన్నా.. కన్నా..

ఆ మహా వాగ్గేయకారునికి దీటైన ప్రతి సృష్టి తెలుగులో చేసిన వేటూరికి జోహార్లు!
ఈ అద్భుతమైన కవిత్వాన్ని నాకు చూపించిన స్వాతి కి స్నేహపూర్వక కృతజ్ఞతాంజలులు!!
*** *** *** *** *** ***
కొసమెరుపు - పాట గురించి నా పైత్యంతా తీరిగ్గా చదివాక అసలు పాట వినకుండ ఎలా?
తమిళం లో
తెలుగు లో
తమిళం పాట ఒకబ్బాయి నోట

Thursday, February 7, 2008

రాకేశ్వరుడి కోసం



సమయానికి రికార్డు చెయ్యటానికి చేతిలో సెల్ ఫోను మాత్రమే ఊంది.'
అసలేమన్నా కనిపిస్తోందా?

Tuesday, February 5, 2008

బ్లాగ్వరులకి కొన్ని గమనికలు - చర్చా సారాంశం

డిసెంబరు 22 న కూడలి కబుర్లలో తెలుగు బ్లాగ్వరులందరూ కూడి కబుర్లాడుకుంటున్న శుభ సందర్భంలో తెలుగు బ్లాగుల ప్రాచుర్యాన్ని పెంచడం ఎలా అనే విషయం చర్చకి వచ్చింది. ఇటీవల ఈ విషయమై దేవరపల్లి రాజేంద్ర, తెలుగు వాడిని లేవనెత్తిన సమస్యలని, చేసిన సూచనలని కూడా సభ్యులు చర్చించారు.

బ్లాగుల్నే కాక అనేక అంతర్జాల పోకడలను అధ్యయనం చేసిన సాలభంజికల నాగరాజు గారు కొన్ని ప్రతిపాదనలు చేశారు ఆ చర్చలో. చర్చ ముగిసిన తరవాత తెలుగు బ్లాగు గుంపులోని క్రియాశీలక సభ్యులకి కొంత మందికి నాగరాజు గారు తన ప్రతిపాదనల సారాంశాన్ని ఆంగ్లంలో ఒక టపా పంపారు. నాగరాజు గారి ప్రతిపాదనలు బ్లాగ్జనులందరూ చదివి ఆలోచించ వలసిన అవసరం ఉందని అనిపించి వారి అనుమతితో ఆ ప్రతిపాదనలను ఇక్కడ తిరిగి రాస్తున్నాను.

అసలు ప్రశ్న: ప్రస్తుతానికి తెలుగు బ్లాగులకి నిత్య పాఠకులు ఇతర తెలుగు బ్లాగరులే నన్నది నిర్వివాదాంశం. ఈ పరిధిని దాటి బ్లాగుల్ని బయటికి తీసుకెళ్ళడం ఎలా? బ్లాగులని క్రమం తప్పకుండా చదివే పాఠకుల సంఖ్యని పెంచటం (కొద్ది శాతం కాదు, పది రెట్లు, వంద రెట్లు) ఎలా? ఇక్కడ బ్లాగులు అంటే వ్యక్తిగత బ్లాగులే కాక పొద్దు, ప్రాణహిత వంటి జాల పత్రికలూ, తెవికీ కూడా.

ఒక సాధారణ పాఠకుడి దృష్టిలో ఈ సమస్యని పరిశీలిస్తే మనమేం చెయ్యాలో అర్ధమయ్యే అవకాశం ఉంది. ఏదో పత్రికలో తెలుగు బ్లాగుల గురించి ఒక వ్యాసం రావటం, ఒక వారం పాటు కూడలి, తెవికీ ఇత్యాది గూళ్ళకి విపరీతంగా సందర్శకులు రావటం, వారిలో అతి కొద్ది శాతం బ్లాగు గుంపులోనో, తెవికీ బృందంలోనో సభ్యులుగా చేరటం, అలా చేరిన వారిలో మరి కొద్ది మంది (ఐదు నించీ పది మంది) క్రియాశీలకంగా రాస్తూ ఉండటం .. మళ్ళీ వారం తిరిగేటప్పటికి పరిస్థితి ఎక్కడ వేసిన గోంగళీ అక్కడే అన్నట్టు. జనాలందర్నీ బ్లాగర్లుగా, వికీపీడియన్లుగా మార్చటం మన వల్ల కాదు, అంత అవసరమూ లేదు. స్వయంగా బ్లాగులు రాయడం మీద ఆసక్తి లేని వారికి బ్లాగుల్ని పరిచయం చేసి, మళ్ళీ మళ్ళీ వచ్చే పాఠకులుగా చెయ్యటం ఎలా - ఇదీ అసలు ప్రశ్న. ప్రస్తుతానికి బ్లాగుల్లోనో తెవికీలోనో రాస్తున్న వాళ్ళకి భాషని గురించో, సంస్కృతిని గురించో - దీన్నేదో నేను ఉద్ధరించాలి అనే తహతహ కొంత ఉండి ఈ పనులు చేస్తున్నారు. మామూలు మానవులకి అలాంటి తహతహ ఏమీ లేదు. వాళ్ళకి అవసరానికి తగిన విజ్ఞానమో, లేక సమయానికి తగిన వినోదమో కావాలి - అంతే! ఆ అవసరాన్ని తీర్చే మాధ్యమాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. రాబోవు పాఠకులకి ముందస్తు షరతులు పెట్టకుండా వాళ్ళని ఇటువైపు ఆకర్షించడం ఎలా - అనేది ముఖ్యమైన ప్రశ్న.

ఎవరో రచయిత ఒక నవల రాస్తే, ఒక పబ్లిషరు దాన్ని ప్రచురిస్తే, ఆ పబ్లిషరే దాని పంపిణీ బాధ్యతలు నిర్వర్తిస్తాడు, ఎందుకంటే అది అతని వ్యాపారం కాబట్టి. అంతర్జాల రచనల్లో, ముఖ్యంగా బ్లాగుల్లో మనమే రచయితలమూ, పబ్లిషర్లమూ కూడా .. అందుకని మన పంపిణీ .. మన ప్రకటనలు మనమే చేసుకోవాలి. ఎవరో వచ్చి ఈ పని మనకి అప్పనంగా చేసి పెడతారని ఆశించడం అమాయకత్వం. పైగా, డబ్బుతో నడిచే పత్రికలవంటి మాధ్యమాలకి అంతర్జాలం అంటే ఒకింత భయం ఉండొచ్చు, ప్రస్తుతానికి కాకపోయినా భవిష్యత్తులో దీని పోటీ తాము తట్టుకోలేమని. అందుకని ఇటువంటి కార్యకలాపాలకి అప్పనంగా వాళ్ళు చేసే సహాయం ఏదీ ఉండబోదు.

ఇది సాధించడానికి కూడలి కబుర్లలో రూపుదిద్దుకున్న ప్రతిపాదనలు ఇవి:
1. అంతర్జాలంలో ఉన్న తెలుగు సమాచారం మొత్తం ఒక డీవీడీ మీద పడుతుంది, అంతకంటే ఎక్కువైతే ఉండదు. అలా ఒక డీవీడీ తయారు చేసి ప్రతి జిల్లాలోనూ ముఖ్యమైన బడులు, కళాశాలలు, గ్రంథాలయాలకు ఉచితంగా పంపిణీ చెయ్యాలి. వెయ్యి డీవీడీల తయారు ఖరీదు రూ. 25 వేలకి దాటదు. పెట్టుబడి కోసం తానా ఫౌండేషన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వంటి సంస్థలని అర్ధించవచ్చు. ఈ పంపిణీ వల్ల కలిగే లాభాలు -
అ) పాఠకులు మన దగ్గిరికి వచ్చే బదులు మన రచనలని మనమే పాఠకుల దగ్గిరికి తీసుకెళ్తున్నాము.
ఆ) వార్తా పత్రిక వేసే ముద్ర క్షణికం. ఒక చోట ఈ డీవీడీ అందుబాటులో ఉంటే తరచూ చూసి ప్రభావితులయ్యే యువత పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉంది.
ఇ) ఒక పూట కనబడి మాయమయ్యే పత్రికల్లో ప్రకటనలకంటే ఇది సమర్ధ వంతంగా పని చేస్తుంది.
ఒక లొసుగు - ఈ పని వల్ల "రచనాచౌర్యం" ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువే. ఈ పని చెయ్యదలుచుకుంటే, మన రచనల్ని ఇతరుల పేరు కింద చూడ్డానికి కొంత మనసు సమాధాన పరుచుకోవాలి.
2. యూనీకోడు వాడకం. ఇటీవల కంప్యూటరు వాడకం పెద్దగా తెలియని వారు తెలుగు బ్లాగుల దగ్గిరికి ఎలా వస్తున్నారు అని గమనిస్తే, ఎక్కువగా గూగుల్ వంటీ శోధనాయంత్రాల వల్ల అని తేలుతున్నది. శోధనా యంత్రాలు యూనీకోడు తెలుగులోనూ లభ్యమవుతూ ఉన్నా, సాధారణ పాఠకులు ఆంగ్ల శోధననే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అంచేత ఒక మామూలు శోధనలో ఒక బ్లాగు కనిపించాలంటే ఆ బ్లాగుకి ఒక RTS అవతారం ఉండాలి. ఇది తయారు చెయ్యడం పెద్ద కష్టం కాదు. తెలుగులో బ్లాగులు రాసేవారందరూ కొంత కాలం పాటైనా తమ బ్లాగులకి RTS ప్రతిబింబాల్ని కూడ తయారు చేసి పాఠకులకి అందుబాటులో ఉంచాలి.
3. బ్లాగు-వికీల ఇంకో పార్శ్వం పాఠకులు కూడ తిరిగి రాయడం. తెలుగులో సులభంగా రాయలేక పోవడం చాలా మందిని నిరుత్సాహ పరుస్తున్నది. జ్యోతి లాంటి మన ఔత్సాహికులు ఎంత కష్టపడినా కంప్యూటరు ఉన్న ప్రతి తెలుగింటిలోకీ తెలుగు వ్రాతని ప్రవేశ పెట్టడం మన శక్తికి మించిన పని. అదే పనిని మైక్రోసాఫ్టు అతి సులభంగా చెయ్యగలదు. ప్రస్తుతం తెలుగులో రాస్తున్న 90 శాతం మంది వాడుకదారులు బరహా, లేఖిని వంటి ఫోనెటిక్ ఇన్పుట్‌ని ఉపయోగిస్తున్నారు. కొత్త వాడుకదారులకి RTS వంటి ఇన్పుట్ పద్ధతి సులభం. మైక్రోసాఫ్టు వారు అటూవంటి మృదులాంత్రాన్ని తయారు చేశరు కానీ ఎవరూ పెద్ద ఆసక్తి చూపక దాని ప్రాతిపదిక కుంటుపడింది. "అహో, మేమంతా దీని మీద ఆసక్తి కలిగి యున్నాము" అని యెలుగెత్తి అరిస్తే మైక్రోసాఫ్టు దీన్ని పునరుద్ధరించ వచ్చు. ఇదే జరిగితే .. వేరే ఏ సాఫ్టువేరు స్థాపించుకో నక్కర్లేకుండానే ఏ అప్లికేషన్లో అయినా ఆంగ్లంలో రాసినంత సులభంగా తెలుగులో రాసేసుకోవచ్చు. దీనికి చెయ్యవలసిన పని - మనలో కొందరం ఒక టీంఉగా ఏర్పడి మైక్రోసాఫ్టుని ఈ పనికి పురిగొల్పాలి. బ్లాగరులు, వికీపీడియనుల అనుభవాలు, పౌనఃపున్యాలు కూడా దోహదం చేస్తాయి. అంతగా అవసరమైతే దానికి కావలిసిన కోడు రాసి సపోర్టునందించగల సమర్ధులు కూడా మనలో ఉన్నారు. మైక్రోసాఫ్టు చెయ్యవలసిందల్లా దీన్ని తమ ఆపరేటింగ్ సిస్టంతో కలిపి అందించటమే. దీనికి అవసరమైన తొలి ప్రయత్నాలు నేను (అంటే నాగరాజు) చెయ్యగలను.
4. ప్రస్తుతం మైక్రోసాఫ్టు XP లేదా విస్టా ఆపరేటింగ్ సిస్టముల్లో ఇన్స్క్రిప్టు అని సులభంగా తెలుగు రాసే పద్ధతి ఉన్నది అని 90% మంది కంప్యూటరు తెలుగు వాడుకదారులకి తెలియదు. తెలిసిన వారిలోనూ 90% మంది అది వాడే ప్రయత్నం చెయ్యట్లేదు - ఎందుకంటే .. కంట్రోలు పేనెలు తెరిచి అది నిర్వహించటం ఒక తలనెప్పి. ఇండీయాలో అయితే చాలామందికి ఆపరేటింగి సిస్టం సీడీ ఉండదు. అసలు ఇన్స్క్ర్ప్టుని డిఫాల్టుగా అందిస్తే? రాకేశ్వరుడు ఒక మంచి ప్రశ్న వేశాడు - ఇవ్వాళ్ళ మనం తెలుగు అన్నాం, రేపు మన సోదరుడు కన్నడం అంటాడు - ఇలా ఎన్ని భాషలు వాళ్ళు డిఫాల్టుగా అందించగలరు? నిజమే, కానీ ఇదంత పెద్ద సమస్య కాదని నా అభిప్రాయం. ప్రస్తుతం వాళ్ళు ఇచ్చే ఎంపికలో పన్నెండూ భారతీయభాషలున్నాయి. ఇతర భాషలు అక్కర్లేని వారు కంట్రోలు పేనెలు లోకి వెళ్ళీ వాటిని "ఆఫ్" చేసుకోవచ్చు. ముఖ్యం ఏవిటంటే ఇంత బాదరబందీ లేకుండా తెలుగులో రాయడం వాడుకదారులకి అందుబాటులోకి రావాలి. పైగా, అసలు సమస్య ఇదీ అని మైక్రోసాఫ్టుకి మనం చెప్పగలిగితే ఇటువంటి చిన్న సమస్యలకి పరిష్కారాలు వాళ్ళే వెదుక్కుంటారు, అవసరమైతే మనమూ ఒక చెయ్యి వెయ్యొచ్చు. అసలు సంగతి చైనీసు, జపనీసు వంటి మిగతా ప్రపంచ భాషల వలే కంప్యూటరులో తెలుగు రాయడం వాడుకదారుకి సులభంగా అందుబాటులో ఉండాలి.

ఈ ప్రతిపాదనల గురించి మన ఔత్సాహికులు, క్రియాశీలక సభ్యులు తెలుగు బ్లాగు గుంపులో అందరూ కలిసి చర్చిస్తే మనకి అందుబాటులో ఉన్న అంశాలని అభివృద్ధి చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యొచ్చు. కూడలి కబుర్లలో నలుగురు కలిసినప్పుడు కూడా ఈ విషయాలు గణనకి వస్తే ఆ చర్చని తిరిగి తమ బ్లాగుల్లోనో, లేదా తెలుగు బ్లాగు గుంపులోనో తిరిగి ప్రస్తావించవలసిందని సభ్యులకి నా వేడికోలు.