Saturday, December 29, 2007

నవంబరు సినిమాలు

నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ పుణ్యమాని గత రెణ్ణెల్లుగా కొన్ని మంచి సినిమాలు చూస్తున్నాను. ఈ కాలంలో ఒక ఆంగ్ల నవల పూర్తిగానూ ఒక పాత తెలుగు నవల సగమూ చదివాను. ఒక విహంగ వీక్షణం:

యిన్ షి నన్ ను (Eat Drink Man Woman) తాయ్‌వాన్, 1994
ఆంగ్ల చిత్ర సీమలో సెన్స్ అండ్ సెన్సిబిలిటీ వంటి చిత్రాలతో ఘన విజయం సాధించిన తాయ్‌వానీస్ దర్శకుడి తొలి చిత్రాల్లో ఒకటి. భార్య చనిపోయిన ఎగ్జిక్యూటివ్ ఛెఫ్ మిస్టర్ చు తాయ్‌పెయ్ నగరంలో ఎదిగిన ముగ్గురు కూతుళ్ళతో ఉంటూంటాడు. ముగ్గురివీ మూడు రకాల మనస్తత్వాలు. ముగ్గురికీ తాము ఇల్లు విడిచి వెళ్ళిపోతే వృద్ధుడౌతున్న తండ్రి ఎలా ఒంటరితనాన్ని తట్టుకో గలడు అన ఆలోచన పీడిస్తూనే ఉంటుంది, కానీ వాళ్ళ చేతిలో ఏవీ లేనట్టు ముగ్గురి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. ఈ మార్పులతోనే వాళ్ళు సతమతమవుతుండగా మిస్టర్ చు చేసిన నిర్ణయం వాళ్ళందర్నీ నిర్ఘాంత పరుస్తుంది. చిక్కటి కుటుంబ బాంధవ్యాలకీ, బలమైన పాత్ర వ్యక్తీకరణలకీ ఈ చిత్రం చక్కటి రంగం కల్పించింది. చిత్రంలోని ముఖ్యమైన సందర్భాలన్నిటికీ, ఒక్కొక్క చోటైతే పాత్రల మనోభావాలకీ, నేపథ్యంగా తాయవానీయ సాంప్రదాయ వంటకాలు ఒక అవిఛ్ఛిన్నమైన ప్రతీకల స్రవంతిలా సాగుతుంటాయి. పాత్రల మనోభావాలని రూపించడంలోనూ, ఒక్కొక్క దృశ్యాన్ని రూపొందించడంలోనూ దర్శకుని అసాధారణ ప్రతిభ కనిపిస్తుంది. అవటానికి ఒక చిన్న కుటుంబ కథే అయినా, సినిమా ముగిశాక ఏదో మహాభారత గాథని చూసిన అనుభూతి మిగులుతుంది.
ఒక హెచ్చరిక: ఖాళీ కడుపు మీద మాత్రం ఈ సినిమా చూడకండి - అడుగడుగునా కనిపించే వంటకాల దృశ్యాలకి పిచ్చెక్కుతుంది.


ఒన్ ఫ్లూ ఓవర్ ది కుకూస్ నెస్ట్ (1975)
కెన్ కేసీ నవలకి దర్శకుడు మిలోస్ ఫోర్మన్ కల్పించిన చిత్రరూపం. జాక్ నికొల్సన్ కి మొదటి ఆస్కార్ వచ్చిందనుకుంటా. చాలా మంది సినిమా పండితులు ఈ చిత్రాన్ని ఆకాశనికెత్తేస్తారు. అందుకని పని గట్టుకుని చాలా జాగ్రత్తగా చూశాను. అంత గొప్పేంటో నాకర్ధం కాలేదు. చిన్న సైజు దొంగ మెక్మర్ఫీ (నికొల్సన్) ప్రవర్తన మరీ దుడుకుగా ఉన్నదని సాధారణ జైలు నించి అతన్ని ఒక మెంటల్ వార్డులో వేస్తారు. అక్కడి పేషెంట్లు, ఒకరిద్దరు తప్ప, తామ బాగు కోసం తామే అక్కడ ఉన్నవాళ్ళు. ఆ వార్డు ని నర్సు రేచెద్ (లోయిస్ ఫ్లెచర్) పటిష్ఠమైన క్రమశిక్షణతో శాసిస్తూ ఉంటుంది. వాళ్ళంతా స్వఛ్ఛందంగానే ఆ జులుంని భరిస్తూ అదే తమకి మంచిదనే మనఃస్థితిలో ఉంటారు. ఆ వార్డులోకి మెక్మర్ఫీ రాక ..కొలనులో చిన్న రాయి కాదు .. ఏకంగా ఒక మందర గిరినే వేసి ..చిలికినట్టు ..ఇహ అల్లకల్లోలం మొదలవుతుంది.
ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరమూ మనం సృష్టించుకున్న మన ప్రపంచానికీ మన భయాలకీ బందీలం, దీంట్లోంచి తప్పించుకోవాలన్నా తప్పించుకోలేం అనే ప్రతీక కథ ఆద్యంతమూ ఉన్నదా అనిపించింది నాకైతే. ఫ్రాయిడియన్ ఎనలిస్టులూ, యంజియన్ ఆర్క్‌టైపు వాదులూ ఈ సినిమా చూసి పండగచేసుకునుంటారు. స్వతస్సిద్ధంగా అధికార ధిక్కారం అంటే మొగ్గు చూపే నాకు మెక్మర్ఫీ పాత్ర మొదట్లో నచ్చినా .. రాను రాను, తగినంత లోతు లేకుండా .. ఊరికే గడ్డి బొమ్మల్లే తీర్చినట్టు అనిపించి చిరాకేసింది, పాత్ర మీదా, సినిమా మీదా కూడా. ఐనా కేవలం నికొల్సన్ నటన కోసమే చూడవచ్చు ఈ సినిమా. నిజ జీవితంలోనూ నట జీవితంలో తాను ధరించిన పాత్రల్లోనూ డెవిల్ మే కేర్ నిర్లక్ష్యాన్ని నిర్వచించిన జాక్ నికొల్సన్ కోసమే ఆ పాత్ర సృష్టించబడిందా అన్నట్టు నటించాడు. అన్నట్టు ఈ మధ్యనెప్పుడో 24 ఫ్రేముల వెంకట్ చెప్పినట్టు .. జీవితంలో ఏ ఆనందమూ ఏ సుఖమూ ఎరగని కుర్రాడి కోసం మందు బాటిళ్ళనీ, అమ్మాయిల్నీ ఆస్పత్రిలోకి స్మగుల్ చేసి వార్డులోనే పెద్ద పార్టీ ఏర్పాటు చేసే దృశ్యం .. మున్నాభాయ్ లోనూ, శంకర్ దాదాలోనూ చాలా జనాల్ని ఆకర్షించింది .. దానికి ప్రేరణ ఈ సినిమా నించే .. ఐతే, ఈ సినిమాలో ఆ దృశ్యం గుండెల్ని కలచి వేస్తుంది.
తాజా కలం: ఈ టపా మొదటి వెర్షను ప్రచురించేశాక ఈ సినిమా గురించి మళ్ళీ కుతూహలం రేగి గూగుల్లో కాస్త వెతికితే తెలిసిన విషయం .. కెన్ కేసీ రాసిన నవల్లో కథనం దృక్పథం పూర్తిగా వేరేగా ఉందిట. సినిమా వాళ్ళు హక్కులు కొనేసుకున్నాక .. ఏవో గొడవలవుతున్న సమయంలో కథని తమకిష్టమొచ్చినట్టు మార్చి .. ఆఖరి స్క్రిప్టుకి కేసీ అనుమతి లేకుండా .. సినిమా తిశారుట .. అంటే, నేనిప్పుడు ఆ పుస్తకం చదవాలి .. ఆంగ్ల సావెజ్జెప్పినట్టు .. ఇప్పుడు ఈ సమస్య పూర్తిగా కొత్తకాంతిలో కనిపిస్తోంది!
మరింత తాజా కలం: ఈ సినిమా టైటిలు కూడా నన్ను కొంత చికాకు పెడుతూ ఉంది .. గూగులమ్మ దానికీ సమాధానం చెప్పింది. ఇది మదర్ గూస్ పేరిట ప్రాచుర్యం పొందిన ఒక నర్సరీ రైం లోని చివరి వాక్యం

త్వరలో ..
చిల్డ్రెన్ ఆఫ్ పేరడైజ్
పియానిస్ట్
సెవెన్ సమురాయ్

Friday, December 28, 2007

చూడవలసిన చిత్ర ప్రదర్శన


యువ చిత్రకారుడు గిరిధర్ గౌడ్ అనతి కాలంలోనే తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకుని ఇంటా బయటా పేరుపొందుతున్నారు. ఈయన గీసిన వర్ణ చిత్రాలు తెలుగు నాడి (జూన్ 2007 సంచిక), కథ 2006 వంటి పుస్తకాల ముఖపత్రాలని అలంకరించాయి.

ఎమ్మెఫ్ఏ చదివిన ఈ రైతు బిడ్డ తన మూలాలకి చేరువగా ఉండాలని గుంటూరు దగ్గర తన స్వస్థలమైన ఒక కుగ్రామంలో నివాసం ఏర్పర్చుకున్నారు. గిరిధర్ చిత్రాలకి వస్తువులు పల్లెల్లో కనబడే నిత్య దృశ్యాలే అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. నెత్తిన గడ్డిమోపుతోనో, పిడకల తట్టతోనో మనకి దర్శనమిచ్చే పాటక స్త్రీల చిత్రీకరణ "శ్రమైక జీవన సౌందర్యానికి" కొత్త అర్ధం నిర్వచిస్తున్నట్టుంది.
ప్రస్తుతం వీరి "ఒన్ మేన్ షో" హైదరాబాదులో జరుగుతోంది. ఈ ప్రదర్శనకి రచించిన చిత్రాల్లో తెలుగు రైతులకి పౌరుష చిహ్నమైన ఒంగోలు ఎడ్ల మీద తన కళాత్మక దృష్టి నిలిపారు శ్రీ గిరిధర్.

చిత్రకళా విషయం: వృషభ 1
చిత్రకారుడు: గిరిధర్ గౌడ్
కళావేదిక:కళాహిత ఆర్ట్ ఫౌండేషన్, 8-2-248/1/7/16,17B,లక్ష్మీ టవర్స్, నాగార్జున హిల్స్, పంజగుట్ట, హైదరాబాద్ 500 082
ప్రదర్శన వేళలు: డిశంబరు 28 నుండీ జనవరి 18 వరకూ
మరింత సమాచారం కోసం: 040 23350543

హైదరాబాదు వాసులకీ, ఈ సమయంలో మాతృదేశాన్ని సందర్శిస్తున్న ప్రవాసులకీ ఒక ప్రతిభావంతుడైన వర్ధమాన చిత్రకారుడి కళని దగ్గర్నించి చూసే మహదవకాశం. ఈ ప్రదర్శన రోజుల్లో ఆయన గేలరీ దగ్గరే ఉంటానని చెప్పారు .. అంచేత చిత్రకారుడితో కాసేపు ముచ్చటించొచ్చు, వీలైతే అతనితో కలిసి ఒక ఫొటో దిగొచ్చు. రేపితను వైకుంఠం, ఏలే లక్ష్మణ్‌లను మించిన ఖ్యాతి సంపాయించిన రోజున, అరెరే, ఆ రోజు భలే ఛాన్సు మిస్సయ్యామే అని నాలిక కరుచుకుంటే ఏవ్హీ లాభముండదు!

Friday, December 21, 2007

సుదీర్ఘమైన రాత్రి

రేప్పొద్దున మీరు రోజూ మామూలుగా లేచే వేళకి లేచి కిటికీలోంచి బయటికి తొంగి చూసి .."ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి?" అనుకునే అవకాశం ఉంది. ఈ నాటి (ప్రపంచపు పూర్వార్ధంలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ గడచి పోయిన) రేయి ఈ సంవత్సరానికి సుదీర్ఘమైన రేయి.

కాలచక్రభ్రమణాన్ని లెక్కపెట్టుకోవటానికి, ఋతువులూ, కాలాలు, ఇలా ప్రకృతి మనకి అనేక టైం టేబుళ్ళని ఇచ్చింది. ఈ అనంత విశ్వంలో భూమి సూర్యునితో చుట్టూ చేసే వింత నృత్యంలో నాలుగు అడుగులు మార్చి, జూన్, సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో సుమారు 21వ తేదీ ప్రాంతంలో పడతాయి. మార్చి సెప్టెంబర్లలో వచ్చే ఈ దినాలని ఈక్వినాక్సులు అంటారు. ఆ రోజున పగలు, రాత్రి ఇంచుమించు సరిసమానంగా ఉంటాయి. జూన్ లో వచ్చేది వేసవి (సమ్మర్) సాల్స్టిస్. ఆ దినం సుదీర్ఘమైన పగలు. ఇవ్వాళ్ళ వింటర్ సాల్స్టిస్ - సుదీర్ఘమైన రేయి. కేవలం భూమి - సూర్యుడు సాపేక్ష చలనాల ప్రకారం ఈ వేళ ఆకాశంలో సూర్యుడు దక్షిణోత్తమ బిందువుని స్పృశించి రేపణ్ణించీ ఉత్తరాయణం ప్రారంభిస్తాడు. భారతీయ సౌరమానంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించితే (మకర సంక్రాంతి) గానీ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలు కాదు.

ప్రాచీన నాగరికత లన్నిటిలోనూ కాలగమనానికి, తద్వారా మన చుట్టూ ప్రకృతిలో వ్యక్తమయ్యే మార్పులకూ చాలా ప్రాముఖ్యత ఉన్నది. కొంత వరకూ అది వారి వారి వ్యావసాయిక జీవితాలతో ముడిపడిన సంబంధాల వల్ల కావచ్చు. ఉదాహరణకి దక్షిణ భారతంలో సంక్రాంతి, పంట చేతికి వచ్చినప్పుడు జరుపుకునే పండుగ.

అదే కాక .. ఈ కాలగమనపు చిహ్నాలు నిరంతరం జరుగుతుండే మార్పుకీ, అశాశ్వతత్వానికీ ప్రతీకలు .. మార్పు సహజం .. మార్పుని ఆహ్వానించు, జీవించు ..అనే తాత్త్విక ఆలోచనలు కూడా మన పూర్వికులకి కలిగినయ్యేమో, ఈ రోజుల్ని పురస్కరించుకుని పండుగలు ఏర్పాటు చేశారు. అమావాస్యలూ, పౌర్ణములూ, సూర్య చంద్ర గ్రహణాలూ .. అంతెందుకు రోజూ జరిగే త్రిసంధ్యలు కూడా మనవారికి శక్తిభరిత ముహూర్తాలుగా తోచాయి. ఆయా సమయాల్లో ప్రత్యేక నిష్ఠతో జపతపాలు పూజలు చెయ్యమని సెలవిచ్చారు.

ఇక్కడ నేటివు అమెరికను జాతుల వారికి చాలా మందికి ఈ రోజు ఎంతో పుణ్యదినము. ఈ రాత్రి ప్రత్యేకమైన సామూహిక కర్మకాండలు నిర్వహిస్తారు. క్రిస్టియానిటీ ఒక మతంగా యూరపులో ప్రబలక ముందు ఆయా దేశాల్లో బలంగా ఉన్న పేగన్, కెల్టిక్ ఇత్యాది మతాల్లో కూడా ఈ రాత్రికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అసలు ఏసుక్రీస్తు డిసెంబరు 25న పుట్టాడని ఋజువేమీ లేదూ, అప్పటికి ప్రబలంగా ఉన్న వింటర్ సాల్స్టిస్ పండగని తమ కొత్త మతంలో విలీనం చేసుకోవడానికి మొదటి క్రైస్తవుల ఎత్తు క్రిస్టమసు అని కూడా ఒక వాదం ఉంది. గమనించండి, చర్చిలలోనూ, జానపద కథల్లోనూ కూడా క్రిస్మసు ముందు రాత్రికే .. ప్రాముఖ్యత ఎక్కువ .. క్రిస్మసు దినానికి కాదు!

Saturday, December 15, 2007

ఆటవ పట్నం సూడరబాబూ ...

ఏమాట కామాటే చెప్పుకోవాలి.
ఆటవా అందమైన నగరమే.
కెనడా దేశ రాజధానిగా ఏర్పడి ఈ సంవత్సరమే నూటయాభయ్యేళ్ళు అవుతున్నాయట.
ఏర్పోర్టు నించి నగరంలోకి వస్తుంటే ఏమంత పెద్ద అబ్బురపరిచేట్టుగా అనిపించలేదు. కానీ .. ఇంక మన ఫేటిదే అని డిసైడైపోయాక, ఇక వెరపేల అని నా కుళ్ళా తలమీద పెట్టుకుని కోటు ధరించి నగరం చూడ పోవగా .. కంట బడిన వింతలెట్టివనిన ..

నేనున్న హోటలు పక్కనే ఆటవా నగర పాలక కార్యాలయాలు. ఆ కార్యాలయ భవనాల మధ్య ప్రాంగణంలో మూడు స్తూపాల్లాంటి నిలువెత్తు బండ రాళ్ళున్నాయి - బహుశా ఏదో ఆధునిక శిల్పమేమో అనుకున్నా. అలవోకగా చూస్తే ఒక్కొక్కటీ పేద్ధ శివలింగంలా ఉంది .. ఆటవా నడిబొడ్డున త్రిలింగదేశం! అనుకుని కాసేపు నవ్వుకున్నా. ఈ కార్యాలయాల వెనక ఒక పార్కు, పార్కు మధ్యలో పేద్ద రాతి ఫౌంటెను. అఫ్కోర్సు, పార్కూ, ఫౌంటెనూ అన్నీ ఇప్పుడు మంచుతో కప్పబడి ఉన్నాయి. అవి దాటి వెళ్తే రోడ్డుకవతల వేపు పెద్దగా ఎత్తు లేకుండా బల్ల పరుపుగా విశాలంగా విస్తరించిన ఒక భవనం కనబడింది. జాతీయ కళాకేంద్రమట! పలువిధముల ప్రదర్శనలు జరుగుతాయట. లోపలి ప్రాంగణంలో అలంకారణలు చాలా అందంగా ఉన్నాయి. అది దాటి వెళితే ఒక అతి పురాతన భవనం .. ఏదో పాతకాలం నాటి బ్రిటీషు భవంతి లాగా .. నా పక్కన వాణ్ణడిగాను ఏవిటదని. అదే పార్లమెంటుట! ఏవిటి ఇంత చిన్నదా? అన్నా. అబ్బెబ్బే, మొదట్లో పార్లమెంటు ఇక్కడే ఉండేది, కానీ ఇప్పుడు ఈ భవనాన్ని కేవలం చారిత్రక కారణాలవల్ల నిలబెట్టి ఉంచుతున్నారు. దానికి వెనకాల విస్తరించి ఉన్న భవన సముదాయం అంతా కలిసి పార్లమెంట్ కాంప్లెక్సు .. అదన్నమాట సంగతి.

ఈ పార్లమెంట్ సముదాయాన్ని దాటి వెళితే అది ససెక్సు వీధి. అక్కడ ఒక పక్క రిడో కేంద్రమని పిలువబడే షాపింగ్ మాల్. క్రిస్మసు అమ్మకాలతో కొనుగోళ్ళతో హడావుడిగా ఉంది. రెండో పక్కన వీధి వీధంతా గొప్ప గొప్ప డిజైనర్ షాపులు - వాటి గవాక్షాల్లో ప్రదర్శిస్తున్న వస్తువులు బట్టలు వాటి ధరలు చూడ్డానికే కళ్ళు జిగేల్మనేట్టు. ఈ ససెక్సు వీధిలోనే అమెరికను దౌత్య (ధౌర్త్య) కార్యాలయం కూడా ఏడిచింది. దాన్ని దాటి వెళితే ముందంతా గొప్ప గాజు బురుజులతో ఒక అద్భుతమైన కట్టడం. అదే జాతీయ కళా ప్రదర్శన శాల. ఇవ్వాళ్ళ (శనివారం) మంచు కురవడం కొంచెం తెరిపిచ్చి, నేనూ, నా యువస్నేహితుడూ వెళ్ళి చెరి ఆరు డాలర్ల ముడుపు చెల్లించుకుని కాస్త కళాస్వాదన చేసి వచ్చాం. కళాఖండాలు నేను అమెరికాలో యూరపులో చూసిన వాటంత గొప్పగా లేవు, కానీ అమర్చిన తీరు బాగుంది. భవనం ఆర్కిటెక్చరే ఒక కళాఖండం.

ఆ రోడ్డు చివరికంటా వెళితే అక్కడొక నది. ఆటవా నది. ఈ నది కెనడాలోని ఒంటారియో రాష్ట్రాన్నీ, క్వెబెక్ రాష్ట్రాన్నీ విడదీస్తోంది. క్వెబెక్ లోకి వెళ్ళామంటే అదో ఫ్రెంచి గోల! ఆ నదిలో నించి మొదలై రిడో కెనాల్ అని ఒక సన్నటి కాలవ ఆటవా నగరం మధ్యగా ప్రవహించి ఊరవతల ఇంకో నదిలో కలుస్తుంది. చలికాలం మొదలవుతుండగా కాలవకి అటూ ఇటూ లాకులు మూసేస్తారట. అందులో మిగిలిన నీళ్ళు గడ్డ కట్టేసి ఒక సహజమైన ఐస్ స్కేటింగ్ రింక్ తయారవుతుందన్నమాట. అఫ్కోర్సు, గత వారంలో కురిసిన మంచుకి ఇప్పుడు కెనాలు మొత్తం పొడుగాటి వెనిల్లా కేకులాగా ఉంది. అన్నట్టు మిషిగన్లో లాగా ఒంటారియో రాష్ట్రంలో ఎక్కడపడితే అక్కడ బీరూ మందూ అమ్మరుట. అంతా గవర్నమెంటు కంట్రోలు .. కంట్రోలు షాపుల్లో మాత్రమే అమ్ముతారట. అఫ్కోర్సు మామూలుగా బార్ అండ్ రెస్టరాంట్లు, పబ్బుల్లో గ్లాసులకొద్దీ తాగొచ్చనుకోండి. లేదంటే నదిని ఈది క్వెబెక్కులోకి పోతే కావల్సినంత మద్యంట. ఫ్రెంచి వాడి మాయ!

గమనిక: ఇక్కడ చూపిన బొమ్మలు వికీనుండీ, ఇతర కెనేడియను సాధికారిక సాలెగూళ్ళనించీ సంగ్రహించబడినవి. నేను తీసిన బొమ్మలు పైకెక్కించడం పూర్తైనాక చూపిస్తాను.

తా.క.: రాకేశ్వరా, మా ఆటవా వోళ్ళు మీ అట్లాంటా వోళ్ళని చితకబాదినారంట.

Thursday, December 13, 2007

కుల్లాయుంచితి కోటు తొడిగితి

ఒక పక్కన "ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను" అనిపిస్తోంది ..

మరొక పక్కన "కుల్లాయుంచితి కోటు తొడిగితి .. పుల్లని సూపుఁ ద్రావితిన్ .. తల్లీ కేనడ రాజ్యలక్ష్మీ దయలేదా నేను శ్రీనాథుడన్!" అనిపిస్తోంది.

ఏంటంటే అంతా అమెరికావోడి మాయ!

మంగళారం నాడు టింగురంగా మంటూ బయల్దేరి కెనడా రాజధాని ఆటవా నగరానికి వచ్చాను వీసా పొడిగింపు కోసం. ఆ రోజు పొద్దున మన బ్లాగ్మిత్రులు కొందరు చాట్లో విష్యూఆల్దబెస్ట్లూ, గుడ్లక్కులూ అన్నీ చెప్పారు కూడా. ఆటవా చేరి ఆడుతూపాడుతూ హోటలు గదిలో బేగు పడేసి, బేంకుకెళ్ళి కట్టాల్సిన వీసా రుసుము చెల్లించి ఇంక హాయిగా హోటలు గదిలో వెచ్చగా కూర్చుని కూడలి కబుర్లలో చేరి మిత్రులతో జాలీగా గడిపేశాను.

బుధవారం పొద్దున్నే ఎనిమిదిన్నరకి వీసా ఎపాయింట్‌మెంటు. నిన్నంతా కురుస్తున్న మంచు వాన ఆగి పోయి బయట నీలాకాశంలో సూర్యుడు చిర్నవ్వులు చిందిస్తున్నాడు. ఆహా, ఎంత శుభదినం అనుకుని బయల్దేరి ఎంబస్సీ చేరుకున్నాను. అమెరికను ప్రభుత్వపు భద్రత పిచ్చి తెలిసిందే కాబట్టి సెక్యూరిటీ వేధింపులకి వెరవక లోపలికి పోయాను. కూచున్నాను. ఒక పది నిమిషాల్లో పేరు పిలిచారు. కిటికీలోంచి ఒక తెల్లభామ పళ్ళికిలిస్తూ నా ఉద్యోగ వివరాలు, కంపెనీ వివరాలు అన్నీ ఊసులాడుతున్నట్టుగా కనుక్కుని ఒక చీటీ చేతులో పెట్టి వచ్చే మంగళారం నాడు తిరిగొచ్చి పాస్‌పోర్టు తీసుకెళ్ళమంది.

బట్ .. బట్ .. వెయిటెమినిట్ .. బట్ ..

మీరు రేపటికల్లా నా పాస్‌పోర్టు .. వీసాతో సహా ఇచ్చేసెయ్యాలి. నా తిరుగు విమానం రేపే. వారం రోజుల పాటు .. నేను .. పని మానుకుని .. కుటుంబాన్ని వదిలి .. ఓకే, వుయ్ విల్ సీయూ ఆన్ ట్యూస్డే! ఎంజాయ్ యువర్ స్టే ఇన్ ఆటవా .. ఇట్సె బ్యూటిఫుల్ సిటీ.

అలా ఆటవాకి బందీనయ్యాను.
బయట అడుగుపెడీతే కొరికెయ్యటానికి కాచుకునున్న చలిని తప్పించుకోవటానికి కుళ్ళా లాంటి టోపీ కొని ధరించాను.
నా మిషిగను కోటునే ఇంకొంచెం గట్టిగా బిగించాను.
మూడు రోజులనుకున్న ప్రయాణం వారం రోజులయ్యేప్పటికి పుల్లటి ఇటాలియన్ సూపుతో నిన్న రాత్రి భోజనం సరిపెట్టాను.
కెనడా రాజ్యలక్ష్మికి ఎప్పుడు దయగలిగి బంధ విముక్తుణ్ణి చేస్తుందో!

తా.క. నా గోల సరేగానీ ఈ ఆదిబాబు గారి సంగతేంటో చూడండి, ఈ తెలుగు పాటల్ని గుర్తు పట్టగలరా అని సవాలు చేస్తున్నారు!