నాయికలు అనంగానే మనకి ప్రబంధాల్లో అష్టవిధ నాయికలు గుర్తొస్తారు. లేకపోతే .. సినిమా నాయికలు గుర్తొస్తారు. అంతేగాని నాయిక అంటే, నాయకుడికి స్త్రీలింగ రూపంగా, నాయకత్వ లక్షణాలు కనబరిచి తమ చుట్టూ ఉన్నవాళ్ళని ఉత్తేజపరిచి, కూడగట్టి ఘనకార్యాలు సాధించిన వాళ్ళుకూడా కావచ్చని మనకి గబుక్కున తట్టదు.
మన చరిత్రలో నాయకురాలు నాగమ్మ, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరనారీమణులెందరో వాసికెక్కారు. కానీ నా దృష్టిలో నాయకత్వ లక్షణమంటే .. కత్తి పట్టుకుని సేనలని నడిపించటమే కాదు .. అన్యాయ భూయిష్టమైన ప్రస్తుత పరిస్థితి (status quo)ని ఎదిరించడం. బేనర్లు పట్టుకుని ఊరేగింపులు తీసి, విలేఖరుల సమావేశాలు పెట్టి బహిరంగ యుద్ధం ప్రకటించవచ్చు - ఇటువంటి ఒక వీరనారిని ఇదివరకు
పరిచయం చేశాను. లేదా నిశ్శబ్దంగా తమ గృహ వాతావరణంతో మొదలుపెట్టి తమ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తూ, తాము నమ్మిన విశ్వాసాలను కోల్పోకుండా, ఎప్పటికప్పుడు తమ ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకుంటూ, సాంప్రదాయాలను గౌరవిస్తూనే కొత్త ఆలోచనలకు తావిస్తూ .. తద్వారా తాము నిష్క్రమించేటప్పుడు ఈ భూమిని కొద్దిగా మెరుగు పరిచిన స్థితిలో వదిలి వేళ్ళేవారు .. (అ)సాధారణ నాయికలు.
ప్రసిద్ధ తమిళ రచయిత, స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కరణాభిలాషి ఐన
కల్కి కృష్ణమూర్తిగారి ఏక పుత్రిక ఆనంది. సభ్యసమాజంలో నాట్యం అంటే ప్రబలి ఉన్న అసహ్యాన్ని తిరస్కరించి ఒక దేవదాసి వద్ద కూతురికి భరతనాట్యం నేర్పించారు కల్కి. పదహారవ ఏట
ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారి దత్తపుత్రుడైన రామచంద్రన్‌తో వివాహం కాగానే ఆనంది నాట్య ప్రదర్శనలకు, కాలేజీ చదువుల ఆశలకు కళ్ళెం పడింది. ఇంతలో పిల్లలు. ప్రదర్శనలు ఇవ్వను అనే ఒప్పందం మీద
రుక్మిణీదేవి అప్పుడే స్థాపించిన
కళాక్షేత్రములో చేరి ఆనంది అప్పటికింకా మిగిలి ఉన్న గొప్ప నాట్యాచార్యుల వద్ద భరతశాస్త్రాన్ని అభ్యసించింది. విద్యార్జన ముగిసిన తరువాత అక్కడే నాట్యాచార్యులుగా స్థిరపడి సుమారు యాభై ఏళ్ళ పాటు ప్రపంచం నలుమూలలనించీ వచ్చిన విద్యార్ధులకు భ

రతనాట్యం నేర్పారు. ఆనంది రిటైరైనాక పలుమార్లు ప్రపంచ దేశాల్ని పర్యటించి, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, శిష్య ప్రశిష్యులకి ఉత్తమ శిక్షణ ఇచ్చి ప్రదర్శనలిప్పిస్తూ, వెళ్ళిన చోటనల్లా న్యాయాన్నీ ధర్మాన్నీ ప్రవచిస్తూ మనకి (అ)సాధారణ నాయిక అయ్యారు.
అమెరికాలో మిడ్‌వెస్ట్ అంటే కరుడు గట్టిన
కన్సర్వేటిజం. ఆడపిల్ల అణిగిమణిగి ఉండాలి. తొందరగా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కని ఇల్లు చూసుకోవాలి. బైబులునీ దేవుణ్ణీ దేవుడి పుత్రుడైన ఏసునీ నమ్మాలి. ఇదీ ఇక్కడి ఆలోచనా పద్ధతి ఇప్పటికీ. ఇంక 1930ల్లో ఎలా ఉండేదో ఆలోచించండి. అలాంటి కుటుంబంలో పుట్టిన బెట్టీ పెళ్ళిచేసుకుని పిల్లల్ని కని సెటిలైపోయింది. మొదటగా
"మాక్రోబయాటిక్" ఆహారం ఆరోగ్యాన్ని ఎలా పెంపొందిస్తుందో తెలుసుకోవడంతో ఆమె అన్వేషణ మొదలైంది. చుట్టూ ప్రబలి ఉన్న ఆహారపు అలవాట్లని కాలదన్ని ఆమె తన ఇంట్లో మాక్రోబయాటిక్ దినుసుల వాడకం మొదలు పెట్టింది. ఈ ప్రయత్నంలో కుటుంబం నించీ సాంఘిక వర్గం నించీ ఎంతో ప్రతిఘటనని ఎదుర్కుంది. ఐనా తన నమ్మకాన్ని వదులుకోలేదు. అక్కణ్ణించి
ఫెమినిస్టు ఉద్యమాన్ని అర్ధం చేసుకుని, ఊరికే పైపైన కాకుండా, స్త్రీ వ్యక్తిత్వపు లోలోతుల్నించి ఈ సాధికారత రావాలని బలంగా నమ్మి దానికోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ ప్రయాణంలో ఆమె యోగ, ధ్యానము వంటి పద్ధతులు నేర్చుకుంది. ఆ తపస్సులో ఆమె
"నేనే దేవత అవతారాన్ని" అనే సిద్ధి పొందింది, మనవాళ్ళు "అహం బ్రహ్మాస్మి" అనుకున్నట్టు. తనకి తాను "మలోరా" అని కొత్త పేరు పెట్టుకుంది. యాభై పైబడిన వయసులో యూనివర్సిటీకి వెళ్ళి సైకాలజీలో ఉన్నత విద్య నభ్యసించి
గృహహింస పాలైన స్త్రీలకి థెరపిస్టుగా పని చేస్తూ తాను నమ్మి ఆచరించిన పద్ధతులని వారికి నేర్పి తాను తనలో మేల్కొల్పిన నిద్రాణమైన శక్తిని వారిలోనూ మేల్కొల్పుతూ గడిపింది. చివరి శ్వాస వరకూ తాను నమ్మిన దాన్నే ఆచరించి, తను ఆచరించినవి ఇతరులకి నేర్పి తన చిన్ని ప్రపంచంలో ఆత్మ విశ్వాసమూ, ప్రేమా నింపిన మలోరా ఇంకొక (అ)సాధారణ నాయిక.
గమనించాల్సిన ముఖ్యమైన మరో విషయం - ఈ ఇద్దరు (అ)సాధారణ నాయికలూ భార్యగా తల్లిగా తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే ఈ విజయాలు సాధించారు. ఇద్దరూ తమ భర్తలతో యాభయ్యేళ్ళ పైబడిన ఆనందమయ వైవాహిక జీవితాలు గడిపారు. ఆ విధంగా కూడా వీళ్ళు మనకి ఆదర్శప్రాయులైనారు.

ఈ (అ)సాధారణ నాయికల స్మృతికి మా "సాధన" నాట్యాలయం నాట్యాంజలిని సమర్పిస్తోంది.
మా నాట్యాచార్యులు "మాధవి మై" రూపకల్పన, నాట్యరచన చేయగా పదిమంది కళాకారులతో ప్రదర్శిస్తున్నాము. అక్కడక్కడా భారతీయ సాంప్రదాయ గాత్రం తప్పించి ప్రదర్శన పూర్తిగా ఆంగ్లంలో ఉంటుంది. కథనానికి ఉపయోగించిన పద్ధతుల్లో భరతనాట్యానికి పెద్దపీట వేసినా, కథ చెప్పటం (narration), మూకాభినయం (mime), ఆధునిక నాట్యం (modern dance) మొదలైన ప్రక్రియల్ని కూడా ఉపయోగించారు.

అక్టోబరు 20, సాయంత్రం ఎనిమిది గంటలకు.
ఏనార్బర్ నగరం మిషిగన్ విశ్వవిద్యాలయం ఉత్తర ప్రాంగణం
వాల్‌గ్రీన్ ప్రదర్శనాస్థలిలో.అందరికీ ఇదే ఆహ్వానము.