Friday, September 28, 2007

ఘోష "యాత్రా"

గౌతం ఘోష్ నిర్మించిన ఆధునిక దృశ్యకావ్యం యాత్రా

ఈ సినిమా చూసేసి అప్పుడే రెండు వారాలు కావస్తోంది. చూసిన రాత్రే ఈ సమీక్ష రాయడం మొదలు పెట్టాను. మనసులో ఎన్నో ఆలోచనలు సుడిగాలుల్లా. వాటిని ఒక రూపంలోకి కుదించడానికి చాలా కష్టమైంది. ఈ సినిమా ఎన్నో తలాలలో పని చేస్తుంది. (It works in many different planes). ఆలోచింపచేసే సినిమాలు చూసే ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ సినిమా తప్పక చూడాలి. సరదాగా టైంపాస్ గా చూసే సినిమా కాదు.

యాభయ్యవ పడిలో ఉన్న ముఖ్యపాత్రలతో ఉన్న ఒక తెలుగు సినిమా చెప్పండి? పోనీ కన్నడ, తమిళం, హిందీ - భారతీయ సినిమా ఏదైనా సరే? గబుక్కుని ఏవీ గుర్తుకి రావట్లేదు కదూ? ప్రపంచంలో ట్వెంటీ సంథింగ్‌లు తప్ప ఇంకెవరూ లేనట్టూ, నలభై యాభై వయస్కులు ఈ ట్వెంటీ సంథింగ్‌లకి అపార్ధం చేసుకునే తలిదండ్రులుగానో, అర్ధం కాకపోయినా వెన్నుతట్టి ప్రోత్సహించే అంకుల్ ఆంటీలుగానో తప్ప వాళ్ళకి వేరే అస్తిత్వం వ్యక్తిత్వం లేనట్టు ఉంటాయి మన సినిమా పాత్రలు. ఈ నేపథ్యంలో నడివయసు ముఖ్యపాత్రలతో గౌతం ఘోష్ నిర్మించిన యాత్రా కనీసం ఈ విషయంలో విభిన్నమైనది. ఇంకా చాలా విషయాల్లో కూడా.

ఒక రచనే కల్పన అయినప్పుడు అందులో నిజం ఏది, కల్పన ఏది? ఈ కథ ఇలా జరిగింది అని రచయిత చెబుతున్నాడు కదా .. రచయిత గొంతు నించి వస్తే నిజమూ, పాత్ర గొంతు నించి వస్తే కల్పనా అవుతుందా? మరి రచయిత కూడా కథలో పాత్ర అయినప్పుడు? నిజానికీ కల్పనకీ మధ్య ఉన్న అస్పష్టమైన విభజన రేఖ మరింత అస్తవ్యస్తమై చెరిగి పోతుంటే? స్వాప్నిక జగత్తులో ఊహించినది నేడు నిజమై నిజ జీవితంలోకి ప్రవహిస్తుంటే? నేను నేనేనా? లేక నా కథలోనే నేనొక పాత్రనా?

హిందీ నవలా రచయిత దశరథ్ జోగ్లేకర్ (నానా పటేకర్) కొత్త నవల "జనాజా" గొప్ప సంచలనం సృష్టించింది. ఒక పెద్ద స్టీలు కంపెనీ సౌజన్యంతో జాతీయ సాహితీ పురస్కారం అతనికిస్తున్నామని ప్రకటించారు. తన కుటుంబంతో ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళి అక్కడి దృశ్యాలు చూడ్డంతోనే కొత్త నవల "బాజార్" కి నాంది పలుకుతాడు. పురస్కారం అందుకోవడానికి ఒంటరిగా హైదరాబాదు నించి ఢిల్లీకి ప్రయాణమయ్యాడు. అతని ఆరోగ్యం గురించి భార్య స్మిత (దీప్తి నావల్) ఒకటే తల్లడిల్లుతోంది. రైల్లో కొత్త నవల రాసుకుందామని ప్రయత్నిస్తాడు కానీ సహ ప్రయాణికుడు మోహన్ అనే యువ చిత్ర దర్శకుడి సంభాషణతో జనాజా కథని వ్యాఖ్యానిస్తుంటాడు. ఆ వ్యాఖ్యానాలు అతన్నీ, మనల్నీ గతంలోకి తీసుకెళ్ళిపోతాయి.

ఆదిలాబాద్ జిల్లాలో ఒక దొర ఉంచుకున్న నర్తకి లాజవంతి (రేఖ) ఒక రాత్రి తన నాట్యంతో ఆ దొర అతిథుల్ని అలరిస్తుండగా అతిథులు అసభ్యంగా ప్రవర్తిస్తే, ఉంచుకున్నవాడే తనని వాళ్ళకి తారుస్తుంటే భరించలేక అక్కణ్ణించి పారిపోయింది. దొర మనుషులు ఆమెని చెరువు వొడ్డున పట్టుకుని దారుణంగా హింసించి అక్కడే వొదిలేసి వెళ్ళిపోయారు. తెల్లవారి బడికి వెళుతున్న పంతులు సతీశ్ శర్మ ఆమెని చూసి తన ఇంట్లో ఆశ్రయమిచ్చాడు. దొర మనుషులు తనకోసం మళ్ళీ వెతుకుతున్నారని తెలిసి, తన రక్షకుని కుటుంబానికి ఆపద రావటం ఇష్టం లేక, సతీశ్ సహాయంతో లాజవంతి హైదరాబాదు చేరుకుని పాత బస్తీలో సెటిలైంది. సతీశ్ అప్పుడప్పుడూ ఆమెని చూసి వస్తుంటాడు.

జనాజా నవల ఎలా ముగిసిందో మనకి (సినిమా ప్రేక్షకులకి) తెలీదు. రచయిత దశరథ్ మాత్రం ముగిసిన నవలని మరిచి పోయి కొత్త నవల మీద దృష్టి కేంద్రీకరించాలి అనుకుంటూ ఉంటాడు. కథ వింటున్న మోహన్ అంటాడు "మీ భ్రమే కానీ, ఒక సారి సృష్టించిన పాత్రలు అంత తొందరగా మిమ్మల్ని విడిచి పోవు". అంతేనా? రచయితకి ఆ మాత్రం స్వేఛ్ఛ లేదా? ఏమో! ఈ సినిమా చూస్తుండగా ఇలాంటి ప్రశ్నలు చాలానే తలెత్తుతాయి. చూడ్డం ఐపోయాక దేనికీ సరైన సమాధానం దొరక్కపోగా ఇంకొన్ని కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయి. అందుకే ఈ సినిమాని వొళ్ళు దగ్గరపెట్టుకుని శ్రద్ధగా చూడాలి.

కథనంలో చిత్రీకరణలో దర్శకుడు కొన్ని అమోఘమైన పద్ధతులు ఉపయోగించాడు. కొన్ని కొన్ని దృశ్యాలు సినిమా ఐపోయిన తరవాత కూడా మన కంటి రెప్పల్ని అంటి పెట్టుకుని పదే పదే కళ్ళముందు మెదుల్తుంటాయి. మూడు ముఖ్య పాత్రలకీ నటులు అతికినట్టు సరిపోయారు. నానా పాటేకర్ మరీను .. నాకు విపరీతంగా నచ్చేశాడు. కొన్ని కొన్ని డైలాగులు అతను చెప్పిన పద్ధతి సింప్లీ మార్వలస్. రేఖని గురించి చెప్పేదేముంది .. ఎనభైల్లో రేఖని ఉమ్రావ్ జాన్ గా చూసిన వాళ్ళకి ఆ జ్ఞాపకాలు రాక మానవు. ఆ చిత్రానికి సంగితం సమకూర్చిన ఖయ్యాం ఈ చిత్రానికి కూడా కొన్ని పాటలు స్వరపరిచారు. పాటలు విడిగా వింటే బాగున్నట్టు ఉన్నాయి, సినిమాలో సందర్భోచితంగానూ ఉన్నాయి, కానీ పాడిన గాయనీ మణుల గొంతులు రేఖకి నప్పలేదు. నాకున్న ఒక్క ముఖ్యమైన ఫిర్యాదు .. చివరి పదిహేను నిమిషాలు లేకుండా ఉంటే సినిమా ఇంకా బలంగా ఉండేదని. నా దృష్టిలో ఇది దర్శకుడి పైత్యం.

Wednesday, September 26, 2007

ఒక చుక్క మంచి నీటి కోసం

ఇంకొన్ని బాపట్ల జ్ఞాపకాలు

ఇంజనీరింగ్ కాలేజి రాకతో బాపట్లలో ఇళ్ళ మార్కెట్టు మీద తీవ్రమైన వత్తిడి వచ్చింది. పేరుకి మునిసిపాలిటీయే కానీ అదొక గ్లోరిఫైడ్ పల్లెటూరుగా ఉండేది ఆ రోజుల్లో. చాలా కాలంగా ఉన్న ఏజీ కాలేజి, ఆర్ట్సు కాలేజి జనాభా ఇంచుమించు అందరూ అక్కడ ఇళ్ళు కట్టుకుని స్థిరపడిపోయారు. ఇంజనీరింగ్ కాలేజి హాస్టలు ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. అంచేత తొంభై శాతం విద్యార్ధులు ఊళ్ళో అద్దెకి ఉంటూండే వాళ్ళు. దాంతో అద్దె ఇళ్ళకి గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. చాలామంది స్టూడెంట్సు ఉండటం ఊరివాళ్ళకి అలవాటై "బ్రహ్మచారులకి అద్దెకివ్వం" అనేవాళ్ళు కాదు గానీ, అసలు ఇళ్ళు ఖాళీగా కనబడేవి కావు. మాకు ఆ పోర్షను దొరకటమే గగనమై పోయింది.

మేము ఆ ఇంట్లో ప్రవేశించేప్పటికి అప్పుడే వారం పది రోజులుగా కాలేజి నడుస్తోంది, క్లాసులకి వెళ్ళొస్తున్నాం. ఆ ఇంట్లో వెనకాల దొడ్డిలో ఒక ఉప్పు నీళ్ళ బావి మాత్రం ఉండేది, మంచి నీళ్ళ వసతి లేదు. మరెలాగ అని ఇంటివాళ్ళని అడిగితే తాము పక్క వీధిలో ఉన్న పబ్లిక్ కుళాయి నించి రెండేసి బిందెలు తెచ్చుకుంటామని చెప్పారు. పాపం ఆడవాళ్ళే అక్కణ్ణించి తెచ్చుకుంటుంటే మగ ధీరులం, మనం ఒక కూజాడు నీళ్ళు తెచ్చుకోలేమా అని మాకు మేమే ధైర్యం చెప్పుకున్నాం. ఆ రోజు కూజా కొనుక్కొచ్చుకున్నాం.

మర్నాడు పొద్దున్నే లేచి నోట్లో బ్రష్షు పెట్టుకుని, మొదటిసారి నా వంతుగా కూజా పట్టుకుని పక్క వీధి పంపు దగ్గిర కెళ్ళాను. వేషం వేరే చెప్పక్కర్లేదుగా .. లుంగీ, జుబ్బా, భుజాన ఒక తువాలు, కాళ్ళకి హవాయి చెప్పులు. మామూలుగా ఏ పబ్లిక్ కుళాయి దగ్గరైనా కనిపించే సీనే ఈ కుళాయి దగ్గిర కూడా .. అప్పటికే ఒక అరడజను మంది అమ్మలక్కలు కుళాయి చుట్టూ గుంపుగా రణగొణధ్వనులుతో మాట్లాడుకుంటూ, కొండొకచో పోట్లాడుకుంటూ, బిందెల్లో, తప్పేలాల్లో, బక్కెట్లలో నీళ్ళు నింపుకుంటున్నారు. కూజా కింద పెట్టి, బ్రష్షుని నవుల్తూ "కిం కర్తవ్యం" అని ఆలోచనలో పడ్డాను. ఇంతలో ఒక పుణ్యాత్మురాలు నా దుస్థితిని గమనించి, "రండి బాబూ" అని మిగతా స్త్రీలని అదిలించి కుళాయి దగ్గర చోటు చేసింది. మనసులోనే ఆవిడకి దణ్ణం పెట్టుకుని, గబగబా పంపు దగ్గిరే మొహం కడిగేసుకుని, కూజా పంపుకింద పెట్టి అటూ ఇటూ చూస్తూ నిలబడ్డా.

సరిగ్గా కుళాయి కి ఎదురుగా వీధికి అవతలి పక్క ఒక పెద్ద రెండంతస్తుల మేడ ఉంది. పై అంతస్తులో ఇంటికి ముందు కొంత జాగా ఓపెన్ టెరేస్ లాగా ఉంది. ఆ జాగాలో పిట్ట గోడ వెంబడి ముగ్గురు కాలేజీ వయసు అమ్మాయిలు నిలబడి దంతధావనం చేస్తున్నారు. నైటీలు వేసుకుని ఉన్నారు. మరీ అలా పొద్దున్నే అమ్మాయిల్ని చూడ్డం మర్యాద కాదు అనుకుంటూనే కొంచెం చూశాను. ఒక డౌటొచ్చింది .. ఇంచుమించు ఒకే వయసున్న ముగ్గురమ్మాయిలు ఒకే ఇంట్లో ఎలా ఉన్నారబ్బా అని. ఇంకాసేపట్లో ఇంకో డౌటొచ్చింది వీళ్ళ మొహాలు ఎక్కడో చూసినట్టున్నాయే అని. ఆ గుర్తొచ్చింది .. వీళ్ళని కాలేజిలో చూశాను .. అంటే .. వీళ్ళు మా కాలేజి విద్యార్ధినులు. ట్యూబులైటు వెలిగింది. ఆ మేడ ఇల్లు కాదు .. మా కాలేజీవారు ఊళ్ళో అద్దెకి తీసుకున్న ఆడపిల్లల హాస్టలు. అంతే, ఒక్క వుదుటున కూజా పట్టుకుని పరుగున ఇంటికొచ్చి పడ్డాను.

నా అనుమానాన్ని మా ఇంటి ఓనరు నివృత్తి చేశాడు .. కుళాయి కెదురుగా ఆ మేడ మా కాలేజి ఆడపిల్లల హాస్టలే! చచ్చాం. ఇప్పుడెలా? మేమున్న ఇంటెదురుగా ఒక ముచ్చటైన డాబా ఇల్లుంది. వాళ్ళింట్లో మంచినీళ్ళ పంపుందని ఓనరు చెప్పాడు. అడగందే అమ్మైనా పెట్టదు గదా, అడిగి చూద్దాం అనుకుని ఆ సాయంత్రం ఎదురింటికి వెళ్ళి తలుపు తట్టాను. ఇంటాయన ఇంట్లోనే ఉన్నాడు. "మేం మీ ఎదురింట్లో కొత్తగా అద్దెకి దిగాం. మీరు అనుమతిస్తే మీ ఇంట్లో రోజూ ఒక కూజాడు నీళ్ళు పట్టుకుంటాం" అని చాలా మర్యాదగా అడిగాను. ఆయన రౌడీ వెధవని చూసినట్టు నన్నొక డర్టీలుక్కేసి, "లేడీసుంటారండీ. వీలుకాదు" అనేశాడు. హమ్మ ఎదురింటాయనా, మీ ఆడలేడీసుని మేమేం కొరుక్కు తినంలే బాబూ అని మనసులోనే తిట్టుకుని, చేసేదేం లేక పైకొక వెర్రి నవ్వు నవ్వి వెనక్కి వచ్చేశా.

నేనూ నా రూమ్మేట్లూ మా వరండాలో సెటిలై, తలా ఒక సిగిరెట్టూ ముట్టించి బుర్రకి పదును పెట్టాము. ఈ మంచి నీళ్ళ సమస్య చాలా క్లిష్ట సమస్య అయి కూర్చుంది. వాళ్ళు మొదట్లో నా ఎడ్వంచర్లు చూసి నవ్వినా, ఆడపిల్లల హాస్టలు ముందున్న పబ్లిక్ కుళాయికి లుంగీలో (పోనీ పేంటు షర్టులో ఐనా) వెళ్ళి నీళ్ళు పట్టుకు రావడానికి వాళ్ళకీ ధైర్యం చాల్లేదు. ఇంతలో మా ఓనరు కొడుకు (నాకు డేవిడ్ బూన్ అని బిరుదిచ్చినవాడే) తన వానర సైన్యంతో కొబ్బరి మట్ట క్రికెట్ మొదలెట్టాడు. వాళ్ళ ఆట చూస్తుంటే ఐడియా వచ్చింది - నీళ్ళు తేవడానికి ఈ పిల్లగాణ్ణి నియోగిస్తే! ఇంట్లో చేరి ఒక రోజేగా ఐంది, ఇంకా వాడికి మేం మేస్టర్లమనే భయం ఏర్పడలేదు. అందుకని పిలవంగానే వచ్చాడు. నెలకి పది రూపాయలిస్తే పొద్దున్నే వాడు పబ్లిక్ కుళాయి నించి మాకొక కూజా నీళ్ళు తెచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఆ తరవాత వాడు ఎక్కడ మేం చదువు చెప్పేస్తామో అని మొహం చాటేసినా, పాపం మంచి నీళ్ళు మాత్రం క్రమం తప్పకుండా తెచ్చేవాడు. నెలనెలా డబ్బులకి మాత్రం వాళ్ళమ్మని పంపేవాడు. అలా మాకు ఆ తొమ్మిది పది నెల్లపాటు నీటి సమస్య తీరింది.


కొసమెరుపు 1: నెమ్మది మీద తెలిసిన విషయం, ఎదురింటాయనకి ఇద్దరు పెళ్ళి కావలసిన కూతుళ్ళున్నారు. పాపం ఆయన భయం ఆయనది.

కొసమెరుపు 2: సందుమొగలోనో, పెద్ద బజారులోనో ఎదురింటాయన ఎదురుపడుతూనే ఉండేవాడు గానీ ఎప్పుడూ పలకరించిన పాపాన పోలేదు. మాకు మాత్రం ఏం తక్కువని మేమూ ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలా ఉండగా కొన్ని నెలలు గడిచాక మా డిపార్టుమెంటు మేస్టారొకాయనకి పెళ్ళైంది బాపట్లలోనే. మేం కూడా వెళ్ళాం. అక్కడ ఎదురింటాయన ఆడపెళ్ళివారి తరపున మర్యాదలు చేస్తూ కనబడ్డాడు. మాతో ఉన్న సీనియర్ మేస్టర్లు మమ్మల్ని పరిచయం చేశారు. అప్పుడర్ధమైంది ఆయనకి మేం స్టూడెంట్లము కాదూ, లెక్చరర్లమని. పెళ్ళినించి వచ్చేస్తూంటే చెప్పాడాయన .. కావలసినప్పుడు వాళ్ళింట్లో మంచి నీళ్ళు పట్టుకోవచ్చనీ.

Tuesday, September 25, 2007

మరొక ప్రపంచ కప్ సన్నివేశం

ఇరవయ్యేళ్ళ క్రితం ..

బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరరుగా పని చేస్తున్నా. ఇద్దరు బ్రహ్మచారి సహోద్యోగులతో కలిసి ఒక పోర్షను అద్దెకి తీసుకుని ఉంటున్నాం "మాయాబజార్" అనే పేటలో. ఇది ఏజీ కాలేజీ వెనకగేటు (ఆడపిల్లల హాస్టలు గేటు) దగ్గర్లో ఉంటుంది. మేముంటూన్నది ఒక పాత కట్టడం. రెండు గదులు, ముందొక వసారా. మా పక్క పోర్షనులో ముగ్గురో నలుగురో మాకాలేజి పిల్లలే ఉండేవాళ్ళు.

ఇంటి ఓనరు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. ఊళ్ళో ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. మేమున్న ఇంటిపక్కనే తాటాకుల ఇళ్ళ కాంపౌండులో ఉమ్మడి కుటూంబంగా ఉండేవాళ్ళు. పెద్దాయనకి ఇద్దరు మగ పిల్లలు. అండులో పెద్దాడు అప్పటీకి బహుశా ఏ ఎనిమిదో చదువుతుండాలి. మాకు పొద్దుటే కూజాలో మంచినీళ్ళు తెచ్చి పెడుతుండేవాడు (దీని కథ ఇంకోసారి చెబుతాను). వాడికి మహా క్రికెట్ పిచ్చి. ఒక కొబ్బరి మట్ట బేటుగా, రబ్బరు బాలుతో అస్తమానం క్రికెట్టాడుతుంటే వాళ్ళమ్మ కేకలేసేది, "మేస్టారి దగ్గిరకెళ్ళి కాస్త చదువుకోరా" అని. వాడికి చాలా అనుమానం మా మీద, ఎక్కడ గబుక్కుని వాణ్ణి పట్టుకుని చదువు చెప్పేస్తామో అని .. ఎప్పుడూ అంతంత దూరంగా ఉంటూ ఉండేవాడు.

ఇంతలో వరల్డ్ కప్ హడావుడి మొదలైంది. భారత్ పాకిస్తాన్ లు కలిపి జాయింటుగా నిర్వహించారు. కాలేజిలో ఇంట్లో ఎక్కడ చూసినా క్రికెట్ గోలే. నాకు మహా విసుగు. మా దగ్గిర టీవీ లేదుగా, నా రూమ్మేట్లు కాలేజీ ఐపోయాక కాలేజిలో హాస్టల్లో ఉండిపోయేవాళ్ళు టీవీకోసం. నేనొక్కణ్ణే ఉసూరుమంటూ ఇంటికొచ్చేవాణ్ణి.

ఒకరోజు మా సందులోకి తిరిగేప్పటికి అక్కడ మా ఓనరు కొడుకు ఇంకొందరు పిల్లకాయల్నేసుకుని కొబ్బరి మట్ట క్రికెట్టాడుతున్నాడు. నన్ను చూడగానే "@%$@ వస్తున్నాడ్రా!" అని అరిచాడు. వాడేవన్నాడో నాకు సరిగ్గా వినబళ్ళా. పిలిచాను, ఏవన్నాడో కనుక్కుందామని. చెప్పానుగా వాడికి మేమంటే చాలా అనుమానమని - ఇందాకన్న మాటే మళ్ళీ అరుస్తూ సందు అవతలకి పరిగెత్తాడు. ఈ సారి క్లియర్ గానే వినబడింది .. ఏదో పాశ్చాత్యుల పేరు. వీడు మనల్ని పొగుడుతున్నాడో తిడుతున్నాడో అర్ధం కావట్లేదు. ఎవరో క్రికటర్ పేరై ఉంటుందని ఊహించాను.

ఆ సాయంత్రం మా రూమ్మేట్ ని అడిగాను. అతను ఆస్ట్రేలియన్ ఆటగాడనీ, బేటింగ్ తో ఎదుటి టీముల్ని చావబాదుతున్నాడనీ చెప్పాడు. ఓహో, ఎవడో హీరో మెటీరయలే అన్న మాట. పర్లేదు. కానీ మళ్ళీ ఒక డౌటొచ్చింది. అతను చూడ్డానికెలాగుంటాడు? మా రూమ్మేట్ ఎగాదిగా చూసి, "హమ్మ్ కొంచెం నీలాగానే ఉంటాడు" అన్నాడు. ఇంక నాకు కుతూహలం ఆప శక్యం కావట్లేదు. ఆ రోజు రాత్రి భోజనానికి మెస్సు కెళ్ళినప్పుడు పేపర్లో ఆటల విభాగాన్ని ఆత్రంగా గాలించాను. ఎదురుగానే కనబడింది డేవిడ్ బూన్ ఫొటో.

Monday, September 17, 2007

ఛత్రీ వెర్సస్ ఖత్రీ

షేక్స్పియరు నాటకాల్ని హిందీలోకి అనువదిస్తూ యువ దర్శకుడు విశాల్ భరద్వాజ్ హిందీ చలనచిత్రరంగం మీదికి ఒక సుడిగాలిలా, ఒక "ఆంధీ"లా దూసుకొచ్చాడు. మెక్బెత్, ఒథెల్లో వంటి సుప్రసిద్ధ ట్రాజెడీలను మక్బూల్, ఓంకారలుగా మలిచాడు. వొళ్ళు గగుర్పొడిచే సంభాషణ రచనా చాతుర్యంతో, ఒక్కొక్క దృశ్యాన్ని ఒక యుద్ధవ్యూహంలా రచించే శైలితో హిందీలో నిశాచిత్రాలకి (film noir) ఒక కొత్త నిర్వచనం ఇచ్చాడనటం అతిశయోక్తి కాదేమో.

ఇప్పటి వరకూ మనిషిలోని నీడల ప్రపంచం మీదే దృష్టి కేంద్రీకరించిన ఈ యువ దర్శకుడు ఒక్కసారి పూర్తి పల్లిటీ కొట్టి స్వఛ్ఛమైన నవ్వుల్నీ, పసుప్పచ్చని పువ్వుల్నీ, పసి తనపు నైర్మల్యాన్నీ తెరకెక్కిస్తానంటే .. మీరు సందేహంతో తల అడ్డంగా ఊపితే మిమ్మల్ని తప్పు పట్టను. కానీ "నీలిరంగు గొడుగు" (Blue Umbrella)తో ఈ చిచ్చరపిడుగు సరిగ్గా అదే సాధించాడు, ఢంకా బజాయించి మరీ.

ప్రసిద్ధ ఇండో ఆంగ్లికన్ కథా రచయిత రస్కిన్ బాండ్ రాసిన నవలికకి చిత్ర రూపమిది. హిమాచల్ ప్రదేశ్‌లో కొండల్లోని ఒక పల్లెలో బినియా అని పదేళ్ళ పాప ఉంటుంది. వాళ్ళన్నయ్య ఆ ఇలాకా మొత్తానికీ పహిల్వాన్. అందుకని ఈ పిల్ల మంచి ధైర్యంగా ఎవర్నీ లెక్క చెయ్యకుండా ధీమాగా తిరుగుతూ ఉంటుంది. ఆ వయసు పిల్లకాయలందరికీ ఆమే లీడరు. బస్టాపుకి దగ్గర్లో టీ కొట్టు నడుపుతూ నంద కిషోర్ ఖత్రీ అని ఒక పిసినారి ముసలాడూ కూడా ఉంటాడు. వీడు వచ్చేపోయే యాత్రికులకి టీ అమ్మడంతో పాటు పిల్లకాయలకి అరువు మీద పిప్పరమింటు బిళ్ళలూ, బిస్కట్లూ అమ్ముతూ ఉంటాడు. వాళ్ళు ఇంట్లో అమ్మకి తెలీకుండా దొంగతనంగా తెచ్చే ఊరగాయతో ఆ అప్పు మాఫీ చేస్తుంటాడు. హిమాలయాల మొదలులో ఉండే ఆ ఊరు చాలా అందంగా ఉంటుంది. చాలా మంది విదేశీ యాత్రికులు వస్తూ ఉంటారు.

ఒకసారి ఒక జపనీయ బృందం బినియాకి తారసపడుతుంది. బినియా మెళ్ళో ఉన్న ఎలుగ్గొడు గోరు తాయెత్తు జపాను అమ్మాయిని ఆకర్షిస్తుంది. ఆ పిల్ల చేతిలో ఉన్న నీలిరంగు గొడుగు బినియాని ఆకర్షిస్తుంది. ఏమీ భాష రాకుండానే వస్తు మార్పిడి జరిగిపోతుంది. ఇక ఆ నీలి గొడుగుతో బినియా ఒక చిన్న రాణీలాగా తిరుగుతూ ఉంటుంది ఊళ్ళో. అందరికీ ఆ గొడుగు మీదే కన్నుంటుంది. ముసలి నందూకైతే అదొక అబ్సెషనై కూర్చుంటుంది. పక్కన బస్తీలో విచారిస్తాడు. ఆ ప్రాంతాల్లో దొరకదని తెలుస్తుంది. బినియాకి ఎన్నో ఆశలు పెడతాడు, కానీ తను దేనికీ చలించదు. ఇంతలో ఒక రోజు ఉన్నట్టుండి బినియా నీలి గొడుగు కాస్తా పోతుంది .. ఎమైందా గొడుగు? ఎవరు దొంగిలించారు? దొంగిలించిన వాళ్ళ పనేమైంది? బినియా ఆ గొడుగు వియోగాన్ని ఎలా భరించింది - ఈ ప్రశ్నలకి సమాధానం వెండి తెరపై - ఐమీన్ బుల్లి తెరపై చూసుకోవాల్సిందే.

బినియాగా చిన్నారి శ్రేయా శర్మా ఎంతో సహజంగా నటించింది, మామూలుగా మన సినిమాల్లో వయసుకి మించి ఓవరాక్షన్ చేస్తూండే ఆరిందాల్లా కాకుండా. ఆ ఠీవి, గొడుగేసుకుని రాణీగారి లాగా లెవెలు కొట్టటం - ముచ్చటేసేసింది. వెటరన్నటుడు పంకజ్ కపూర్ విభిన్నమైన పాత్రల్లో తన ప్రతిభని చాటుకుంటున్నాడు. ఆ ప్రాంతీయ యాసతో, మధ్యలో రెండు ముక్కలు ఇంగ్లీషు కలగలిపి అతను మాట్లాడే తీరు గొప్ప మజాగా ఉంది. ముఖ కవళికల్లో, శరీర భంగిమలో అతను పాత్ర మనస్తత్వం ఆవిష్కరించే తీరు కూడ గొప్పగా ఉంటుంది. అదంతా సరే గానీ ఈ సినిమా మొత్తం దర్శకుడి ప్రతిభకి ఒక చక్కటి ఉదాహరణ - వేరే మాట లేదు. నాకైతే, సినిమా మొదట్లో పిల్లకాయలంతా ఒక దిష్టిబొమ్మని పట్టుకుని ఊళ్ళో తిరుగుతూ చందాలు వసూలు చేస్తూ పాడే పాట విపరీతంగా నచ్చేసింది. ఎవరన్నా పుణ్యాత్ములు ఈ సినిమాని చక్కగా తెలుగులోకి అనువదిస్తే బాగుణ్ణు. అన్నట్టు ఈ డిస్కులో - ఇదివరకెప్పుడూ చూడనిది మొదటిసారి చూశాను - తెలుగు సబ్-టైటిల్సు! నిజం, ఒట్టు.

Sunday, September 16, 2007

ఒక భోపాల్ కథ

హెచ్చరిక: ఇదొక హృదయభాను టపా!

మొన్న బాంబు పేలుళ్ళు. నిన్న ఫ్లయ్యోవర్ కూలుడు. ఈ మధ్యనే హరికేన్ కత్రీనా వార్షికం, సెప్టెంబరు పదకొండు ఆరో వార్షికం. ఇరాకులో ఎడతెగని మారణహోమం .. ఎటుచూసినా ద్వేషం, అవినీతి, నిర్లక్ష్యం, చావులు, దుఃఖం .. మనసంతా దిగులు. ఇలాంటి విషాదపు ముసురు నా మనస్తత్వానికి విరుద్ధం, కానీ చూస్తూ చూస్తూ ఈ విషాద వాతావరణంలో సరదా టపాలు రాయలేను. ఇలాంటి పరిస్థితిలో భోపాల్ నించి ఒక లేఖ వచ్చింది. ఉత్తేజం కలిగించే ఎన్నో జ్ఞాపకాల్ని తీసుకొచ్చింది. బాహ్యాంతర శత్రువుల్ని ఆత్మస్థైర్యంతో జయించిన యువకుడి కథ చెప్పి జ్యోతిగారు మనబ్లాగుల్లో ఒక ఆశా దీపం వెలిగించారు. నేనొక అసాధారణ యువతి కథ చెబుతాను.

రచన తన తల్లితో పదహారేళ్ళ వయసులో ఢిల్లీ నుంచి అమెరికాకి వలస వచ్చింది. అలవాటైన కుటుంబ సాంఘిక వాతావరణాన్ని విడిచి వచ్చి డిట్రాయిట్ శివార్లలో హైస్కూలు పూర్తి చేసి మిషిగన్ విశ్వవిద్యాలయంలో బిబియే చదివింది. స్వతహాగా స్నేహశీలి, సాహసి కావడంతో తన చొరవతో మంచి స్నేహితుల్ని సంపాయించుకుంది. హైస్కూలు పూర్తైనప్పటినించీ ఉద్యోగం సంపాయించుకుని తన ఫీజులు తానే కట్టుకుంటూ స్వతంత్రంగా ఉంటోంది.

భారత అభివృద్ధి సమితి (Association for India's Development, AID)కి మిషిగన్లో ఒక ఛాప్టర్ మొదలు పెట్టి కొంతమందిమి కృషిచేస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయంలో భారతీయ వారసత్వ విద్యార్ధుల సమితి (ఇది భారతీయ విద్యార్ధుల సమితి కాదు, ఇది వేరు) వాళ్ళు ఒక రోజంతా పలు చర్చా వేదికలతో ఒక సమావేశం నిర్వహించారు. అందులో సమాజసేవ గురించిన చర్చలో నేను ఎయిడ్ గురించి మాట్లాడాను. సుమారు వెయ్యిమంది సభ్యులుగా నమోదైన ఆ సమావేశంలో ఈ చర్చలో కూర్చున్నది (వక్తలు కాక) ముగ్గురు. వాళ్ళలో రచన ఒకరు. త్వరలోనే రచన మా ఎయిడ్ ఛాప్టర్లో క్రియాశీలక పాత్ర వహించింది. తన ప్రోద్బలంతో కనీసం ఇంకొక పదిమంది విద్యార్ధులు మా గుంపులో కలిశారు. ఏడాది తిరిగేప్పటికి, ఇరవై రెండేళ్ళు నిండని వయసులో మా ఛాప్టర్‌కి అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టింది. తన నాయకత్వంలో మా ఛాప్టర్ ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపట్టి దేశం మొత్తమ్మీద తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ సమయంలోనే రచన చదువు ముగించి ఏక్సెంచర్ లో కన్సల్టెంట్‌గా ఉద్యోగం మొదలు పెట్టింది. ఎయిడ్ సంస్థాగతంగా భోపాల్‌లో విషవాయు పీడితులకి సహాయసహకారాలు అందించే ప్రాజెక్టులు చేపడుతూ ఉండేది. అప్పటికే యూనియన్ కార్బైడ్‌ని డౌ కంపెనీ కొనుగోలు చేసింది. డౌ కంపెనీ వార్షిక భాగస్వామ్య సమావేశాలకి దేశం నలుమూలల్నించీ ఒక ఇరవై ముప్ఫై మంది కార్యకర్తలు, వివిధ దేశాల వారు, మా ఊళ్ళో దిగారు, డౌ కంపెనీ పద్ధతులగురించి, నడవడి గురించి నిరసన ప్రదర్శన లిచ్చేందుకు. భోపాల్ నించి కూడా ఒక ముగ్గురు నలుగురు వచ్చారు. వారిలో సతీనాథ్ సారంగీ ఒకరు. మేము కూడా కొంత మందిమి కలిసి మొత్తం గుంపంతా ఇక్కణ్ణించి ఒక రెండు గంటలు డ్రైవు చేసుకుని మిడ్లండ్ అనే ఊర్లో డౌ కేంద్ర కార్యాలయాలకి చేరుకుని బయట బోర్డులు పట్టుకుని మార్చ్ చేస్తూ సమావేశము జరిగినంత సేపూ నిరసన ప్రదర్శన జరిపాము. అదొక వింత అనుభవం.

అప్పుడప్పుడూ మా ఛాప్టర్ సమావేశాల్లో ఇటువంటి ఉద్యమాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, కానీ ఉద్యమాలని నడిపించడం మా పని కాదు అనే నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం రచనకి తృప్తి కలిగించ లేదు. ఆ తరవాత రెండేళ్ళు డౌ సమావేశాలకి నిరసన గుంపుతో తనొక్కతే వెళ్ళి వచ్చేది. ఈ మధ్య ఒకసారి ఉద్యోగం నించి ఒక నెల సెలవు తీసుకుని మాతృదేశం పర్యటిస్తూ ఒక వారం భోపాల్‌లో గడిపి వచ్చింది. ఇంతలో ఉద్యోగంలో తనని డౌ కంఫెనీ ప్రాజెక్టుకి వేశారు. అంత పెద్ద కంపెనీ కార్యకలాపాల్లో తను పోషించే పాత్ర అతి చిన్నదే .. ఐనా తన శక్తి సామర్ధ్యాల్ని అవసరమైన చోట కాకుండా ఇటువంటి నిజాయితీ లేని కంపెనీలకి ఉపయోగపడేందుకు వినియోగిస్తున్నానే అని చాలా మధన పడింది .. ఒక్క నెల పాటు.

2002లో ఉద్యోగానికి రాజీనామా చేసి భోపాల్ చేరుకుంది. ఇదీ అదీ అని తేడా లేకుండా భోపాల్ విషవాయు పీడితుల సహాయానికి జరుగుతున్న కార్యక్రమాలన్నిటిలోనూ పాల్గొనసాగింది. త్వరలోనే తన సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు తోటి వారికి తెలిసి వచ్చి రచనకి పై ఎత్తు బాధ్యతలు కట్టబెట్టారు. ఎయిడ్ రచనకి జీవనసాథీ అనే ఫెలోషిప్ ఇచ్చి తన పని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు సహాయం చేస్తోంది. నేను మాతృదేశంలో ఉన్నకాలంలో భోపాల్లో తమ కార్యక్రమాలు చూడడానికి రమ్మని రచన చాలాసార్లు పిలిచింది గానీ నా పనుల హడావుడి వల్ల వెళ్ళటం కుదరలేదు. భోపాల్ ప్రస్తుత పరిస్థితుల గురించి ఇటీవల బ్రిటిష్ పత్రిక గార్డియన్ ఒక వ్యాసాన్ని ప్రచురించింది. తను పని చేస్తున్న సంస్థ ఎక్కువగా వాయు పీడితుల ఆరోగ్య రక్షణకి అనేక ప్రత్యామ్నాయ సేవలు అందించడం, స్వయం ఉపాధి పనులలో వారికి అవసరమైన అవలంబం అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. భోపాల్ వాసులకి జరిగిన జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రపంచానికి చాటి చెబుతుంటుంది. అప్పుడప్పుడూ అవసరాన్ని బట్టి నిరసన ఉద్యమ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. హోలీ సమయంలో భోపాల్ నించి ఢిల్లీ కి పాదయాత్రగా వెళ్ళి కేంద్ర సచివాలయం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వారితో పాటు రచన ముందే ఉంది. భోపాల్ ముఖ్యమంత్రి కార్యాలయం ముందు చేసిన ధర్నాలో అరెస్టయింది.

న్యాయం కోసం ఇంకా కొనసాగుతున్న ఈ సుదీర్ఘ పోరాటంలో భోపాల్ వాసులకి చిన్న చిన్న విజయాలు లభించినప్పుడు వాళ్ళతో కలిసి వారి విజయాలు తనవిగా ఆనందించింది. కోర్టులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, రాజకీయులు కుహనా సిద్ధాంతాల నీడన భోపాల్‌సంక్షేమాన్ని విస్మరించినప్పుడు సత్యాగ్రహంతో ఉద్యమించింది .. ఒకప్పటి నా సహోద్యోగి, ఎప్పటికీ నా స్నేహితురాలు రచన అంటే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది.

Wednesday, September 5, 2007

ముఖరితమైన ముఖారి

ముఖారి రాగం శోకానికీ విషాదానికీ చిహ్నం అంటూ ఉంటారు. నవరసాల్లో శోకం లేదు. దానికి దగ్గరగా వచ్చేవి భీభత్సం, కరుణ. అసలు ఒక రాగం వింటే ఒక రసం, ఒక mood ఉత్పన్నమౌతుంది అనే సిద్ధాంతం నాకు నచ్చదు. ఇలా రాగానికీ రసానికీ ముడి పెట్టే తిక్క హిందుస్తానీ వాళ్ళకి మరీ ఎక్కువ.

ఏ రాగమైనా ఏ మూడ్‌లోనైనా పాడవచ్చని నా అభిప్రాయం. సాహిత్యాన్ని బట్టీ, పాడే పద్ధతిని బట్టీ కొంతవరకూ మూడ్ ఏర్పడుతుంది. సామజవరగమనా అని ఎంతో గంభీరంగా ఉన్నట్టుండే హిందోళం మనసులోని మర్మమును దెలుసుకో అంటూ దీనంగా వేడుకుంటుంది, లేకపోతే ఇళయరాజా ఇంద్రజాలంతో అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయె అంటూ కడలి తరగలై నాట్యం చేస్తుంది.

పూర్వకాలం మనదేశంలో వీధినాటకం, యక్షగానం లాంటి కళారూపాలుండేవి. కొద్ది తేడాతో ఇలాంటివే కర్ణాటకలోనూ తమిళనాడులో కూడా ఉన్నాయి. ఈ కాలపు నృత్య నాటకాలకి మూలమైన కళలివి. వీటిల్లో సంగీతమూ నాట్యమూ ఉన్నా, కథకే ప్రాముఖ్యత. ఉదాహరణకి రామాయణ కథని ఆడుతున్నారనుకోండి - రాముడు అయోధ్య వదిలి అడివికి వెళ్ళినప్పుడు, సీత జాడ తెలియక రాముడు అల్లాడినప్పుడు, ఆశోకవనంలో సీత దుఃఖిస్తున్నప్పుడు - ఇలా విషాదమైన ఘట్టం వచ్చినప్పుడల్లా ముఖారి రాగమే వాడగా వాడగా, జనాల మనసులో ముఖారి అంటే విషాదం, శోకం అనే భావన వచ్చేసి ఉంటుంది. మన హీరోలకి ఇమేజ్ లాగా కొన్ని కొన్ని రాగాలకి కూడా ఇలా ఇమేజ్ ఏర్పడిందని నా అనుమానం.

లేకపోతే ముఖారి రాగం విషాదమేవిటి నా మొహం! ఈ రాగంలో చాలా మందికి తెలిసినది అన్నమయ్య కీర్తన "బ్రహ్మ కడిగిన పాదము". ఎవరు ఎప్పుడు స్వరపరిచారో తెలీదుగానీ ముఖారి రాగంలో ఇప్పుడూ మనం వింటున్న బాణీలో ఎప్పణ్ణించోనే వినబడుతూ ఉంది. ఘంటసాల, బాలమురళీ, ఎమ్మెస్ సుబ్బులక్ష్మిదాకా అందరూ పాడారు. ఎవరు పాడినది విన్నా ఒక పరమాద్భుతమైన దివ్యదృశ్యాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుందే గాని విషాదమన్నది ఏ కోశానా కనబడదు.

ముఖారిలో ఇంకొన్ని ప్రఖ్యాత కృతులు
శివకామ సుందరీ
ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము

తలచినంతనే నా తనువైతే

సంగీత శాస్త్ర జ్ఞానము

క్షీణమై తిరుగ

సరసీరుహానన రామ

ఇందుకా ఈ తనువు పెంచినది

ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము

ఏల అవతారమెత్తుకొంటివో

కారుబారు సేయువారు గలరే

ఏకామ్రనాథాయ నమస్తే

కృష్ణం కలయసఖి సుందరం

మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ గారు కూడా తమ రాగాల పుస్తకంలో ఈ రాగం మనోధర్మ సంగీతానికి మంచి అవకాశం ఇస్తుందని సెలవిచ్చారు. క్షీణమై తిరుగ జనించే అనే త్యాగరాజ కీర్తన పాడేందుకు సెమ్మంగూడి శ్రీనివాసయ్యరు పెట్టింది పేరు. ఇంకా అనేక ఇతర కచేరీలలో వేర్వేరు గాయనీ గాయకులు పాడగా వీటిల్లో చాలా కృతులు వినిఉన్నాను ఇదివరలో. ఎందుకనో మరి ఎవరూ ఈ రాగాన్ని కచేరీలో ముఖ్యాంశంగా పాడరు. మహా ఐతే ముఖ్యాంశానికి ముందుగానో వెనుకగానో, జానెడు ఆలాపన, బెత్తెడు పాట, గుప్పెడు స్వరాలతో ముచ్చటగా ముగించేస్తారు.

మురిపెము గలిగె గదా రామ సురముని నుత కరివరద శ్రీరామ
పరమ పురుష జగదీశ వరమృదుభాష సుగుణమణి కోశ నీకు .. మురిపెము ..

ఈడు లేని మలయమారుతముచే కూడిన కావేరీతటమందు
మేడల మిద్దెలతో శృంగారము మించు సదనములలో
వేదఘోషలచే నుతియింప జూడ శివుడు కోరు యోగ్యమైన
సుందరమగు పురము దొరికెననుచు .. మురిపెము..

సకల సుగంధ రాజ సుమములు సులలితమగు కోకిల నాదములు
సుఖముగ సనకాదుల నుతమైన సూర తరువులు గలిగి
నికటమందు వాణీ కొలువ సురపతి నీలమణి నిభ శరీర నేడు
ప్రకటమైన నవరత్న ఖచిత హాటక మంటప వాసము కలిగ ననుచు.. మురిపెము ..

ఈ మహిలో సొగసైన చోళ సీమయందు వరమైన పంచనద పుర
ధాముని చెంతను వసియించుటకై నీ మది నెంచగ
కామ జనక త్యాగరాజ సన్నుత రామ పవనతనయ విధ్రుధ శరణ
క్షేమముగ వర్ధిల్లునట్టి పురమున సీతాభామ సౌమిత్రి ప్రక్క కొలిచెదరని .. మురిపెము ..


ఎప్పుడో 2002లో మదరాసు వాసంలో కొన్న కేసెట్టు. శ్రీకృష్ణగానసభ వాళ్ళు ఎప్పుడో తమ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యక్ష కచేరీలని ఇప్పుడూ కేసెట్లుగా సీడీలుగా వెలువరిస్తున్నారు .. ఇలాకూడా కొంచెం సొమ్ము చేసుకోవచ్చు అని గ్రహించినట్లు. ఇది ఎప్పుడు జరిగిన కచేరీయో తెలీదు. కాస్మిక్ మ్యూజిక్ అనే పేరిట విడుదలైంది. ఆ కచేరీలో నేదునూరి అనితరసాధ్యమైన రీతిలో అద్భుతంగా ముఖారి ఆలపించి పై త్యాగరాజ కృతిని ముఖ్యాంశంగా పాడారు. కేసెట్టుకి రెండు వైపులా విస్తరించింది. చాలా అరుదైన ఆనందకరమైన అనుభవం. మీరూ కొంచెం రుచి చూడండి.


Nedunuri Mukhari A...
Nedunuri Mukhari M...ఇందులో లాల్గూడి జయరామన్ వయొలిన్, ఉమయాల్పురం శివరామన్ మృదంగం వాయించారు. ఆడియో క్వాలిటీ అంత గొప్పగా లేదుగానీ పరవాలేదు.

Tuesday, September 4, 2007

తంబూర చేకొని ..

తోడి రాగలక్షణాలు చెబుతూ మహామహోపాధ్యాయ నూకల చిన్నసత్యనారాయణ గారు Ragas of Indian Music పుస్తకంలో ఇది శాంత, కరుణ భక్తి రసములకు ప్రధానమని చెప్పారు. త్యాగరాజుకి పూర్వీకుడైన వెంకటసుబ్బయ్యర్ బాలకృష్ణుని గురించి యశోదతో గోపెమ్మలు ఫిర్యాదు చేస్తున్న గొంతుతో "తాయే యశోద, ఉందన్ ఆయర్ కులతుదిత్త" అని ఒక పక్క బాలకృష్ణుని కొంటెతనాన్ని, మరొక పక్క గోపెమ్మల కోపాన్ని, ఇంకో పక్క వాళ్ళ మురిపాన్నీ రంగరించి వయ్యారాలతో, విరుపులతో, బహు సొగసైన పాట తమిళంలో ఈ రాగంలో రచించారు. దీన్నే ఈ మధ్య కొత్తగా ఫ్యూషన్ రంగులద్ది Morning Raga సినిమాలో చూపించారు. ఎప్పుడో యాభయ్యేళ్ళకి పూర్వం మాటల మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు "జోడు గూడీ తోడి రాగం పాడుకుంటూ" అని పాడించాడు రేలంగితో .. ప్రియురాలితో సయ్యాటలాడేందుకు తోడి రాగమే సరైన నేపథ్య సంగీతం అన్నట్టు.

అసలు అంత దాకా ఎందుకు .. త్యాగరాజస్వామే తోడిలో కనీసం ఒక ఇరవై కృతులదాకా రచించారు. వాటిల్లో ఒక దానిలో ఉన్న భావం మరొక దానిలో ఉండదు. కానీ ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క రాగం వాడడం త్యాగరాజస్వామికి ఇష్టమేమో అనిపిస్తుంది. రాముని అందాన్ని పొగడ్డానికి మోహన రాగం, రాముని గొప్పతనాన్ని పొగడ్డానికి ఖరహరప్రియ, బరువైన ఆధ్యాత్మిక వైరాగ్య భావాలని బోధించడానికి శంకరాభరణం - ఇలాగ. సంగీతంలో తనకున్న లోతైన అవగాహన వలన ఆయన తన వాడుకతో ఆయా రాగాలకి ఒక నిర్దిష్టమైన రూపమిచ్చి తనదైన ముద్ర వేశారేమో అని కూడా అనిపిస్తుంది.

అలా ఆయన దృష్టిలో తంబూరా నాదానికి తోడి రాగానికి ఏదో అవినాభావ సంబంధం స్థిరపడి ఉంటుంది. నాకు తెలిసి కనీసం రెండు కృతులలో తంబూరా నాదం తోడిరాగంలో ప్రతిధ్వనిస్తుంది.

కొలువమరెగదా కోదండపాణీ
వేకువ జామున వెలయుచు తంబూర
చేకొని గుణముల చెలువొంద పాడుచు
శ్రీకరునికి ఆశ్రిత చింతామణునికి
ఆకలి దీర బాలారగింప జేయు .. కొలువమరె గదా ..

కద్దను వారికి కద్దు కద్దని మొరల నిడు
పెద్దల మాటలు నేడబద్ధమౌనో
నిద్దుర నిరాకరించి ముద్దుగ తంబూరా బట్టి
శుద్ధమైన మనసుచే సుస్వరముతో
పద్దు తప్పక భజియించే భక్త పాలనము సేయు
తద్దయశాలివి నీవు త్యాగరాజ సన్నుత

తంబూరా ప్రస్తావన మినహాయిస్తే, ఈ రెండు కృతులలోనూ వ్యాపించి ఉన్న స్థాయీభావం వేరు. ప్రధాన రసం భక్తే అయినా గొంతులో తేడా ఉంది - "మోహము నీపై మొలచి యున్నాదిరా" అనడానికీ, "వగ జూపకు తాళను నన్నేలుకోరా" అనడానికీ చాలా తేడా ఉన్నది. రెండూ భక్తిపూరితములే కానీ ఆ తేడా గొంతులో ఉంది. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి చెప్పే ఆర్ద్రత ఇదే. మొదటి కృతిలో కనిపించిన శ్రీరామునికి పాలారగింప చేసే ఘట్టం ఇంకో తోడిరాగ కృతిలో ప్రత్యక్ష మవుతుంది "ఆరగింపవే, పాలారగింపవే" అంటూ.

చార్‌సుర్ వాళ్ళు గత తరం విద్వాంసుల పూర్తినిడివి కచ్చేరీలని "పద్ధతి" అనే పరంపరలో విడుదల చేస్తున్నారు కొంత కాలంగా. కీ.శే. ఓలేటి వెంకటేశ్వర్లుగారి గాత్ర కచేరీలో "కొలువమరెగదా" ముఖ్యాంశంగా విపులంగా పాడారు. వేకువ జామున అన్న చరణపు వరుస మీద నెరవులు వేసి పాడుతుంటే త్యాగరాజు మదిలో జనించిన ఆ దివ్య తంబూర నాదం ఆయన గొంతులో ప్రతిధ్వనించింది.

Saturday, September 1, 2007

గట్టు తెగిన చెరువు - కథలు

అమెరికాకి పెద్ద ఎత్తున వలస వచ్చిన మిగతా వర్గాలతో పోలిస్తే భారతీయ వలస వర్గం ఇంకా కౌమార దశలోనే ఉంది. పుట్టి పెరిగిన స్వదేశాన్నీ, అక్కడ అలవాటైన సంస్కృతినీ వదిలి, ఉద్యోగావకాశాల కోసం కొత్త దేశం వచ్చి పడ్డాం. నిజమే, అవకాశాలు చాలా బాగానే ఉన్నై. కానీ .. గులాబీల వెంటనే ఉండే ముళ్ళ లాగా .. పూర్తిగా మన అనుభవానికి ఆలోచనలకి భిన్నమైన సంస్కృతి మన చుట్టూతా. పెళ్ళి కాకుండా ఒక స్త్రీ పురుషుడితో కలిసి ఉండటం తప్పులేదనే సంస్కృతి. కుటుంబ వ్యవస్థలో స్త్రీ మగవాడి బానిస కాదని చెప్పే సంస్కృతి. విలువల కన్నా, అభిమానాలకన్నా డాలరుదే బలం అనే సంస్కృతి. బొత్తిగా తీరిక లేని సంస్కృతి. ఖండాంతర భూమిలో, మనది కాని మట్టిలో ఇప్పుడిప్పుడే వేళ్ళూనుతున్న మన వలసవృక్షపు వేర్వేరు కొమ్మల్ని వంచి తమ కథలుగా అల్లారు శ్రీ ఆరి సీతారామయ్య గారు.


వీరు వృత్తిరీత్యా స్థానిక ఓక్‌లాండ్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రంలో ఆచార్యులు. కంటి రుగ్మతలకి సంబంధించిన విషయాలపై పరిశోధన చేస్తుంటారు. ప్రవృత్తి రీత్యా తెలుగు భాషాభిమాని, సాహిత్యాభిమాని, ప్రజాస్వామ్య వాది, మానవతావాది. మా తెలుగు సాహితీ సమితికి మూలస్తంభాల్లో ఒకరు. తోటి కథారచయిత, చిరకాల మిత్రులు. సీతారామయ్యగారికి చలం అంటే చాలా అభిమానం. వారింట్లో అందరూ కూర్చునే చోట ఎదురుగుండా చలం ఫొటో ఫ్రేముకట్టి అలమారులో ఉంటుంది. అప్పుడప్పుడూ ఎవరో ఒకరు, మన తెలుగు వారు కూడా, ఆ ఫొటో చూపించి, "ఎవరండీ, మీ నాన్నగారా? " అనడగడం జరుగుతూ ఉంటుంది. (రామాయణంలో పిడకల వేట - ఇది చదివే వాళ్ళలో ఎంతమంది చలం ఫొటోని గుర్తుపట్టగలరు? గురజాడని? విశ్వనాథని?)ఈ సంపుటంలో పధ్నాలుగు కథలున్నయ్యి. ఈ కథలన్నీ 1998 - 2005 మధ్య రాసినవి. మూడు కథలు తప్పించి అన్నీ ఐదారు పేజీలు మించకుండనే, ఆ మూడైనా పది పేజీలలోపే. ఒక్కో కథా, అలవోకగా, సాయంత్రం పూట కప్పు టీ తాగే టైములో చదివెయ్యొచ్చు. ఎటొచ్చీ, చదివిన తరవాత ఆ కథనీ కథలో పాత్రల్నీ ఒక పట్టాన మర్చిపోలేం. మామూలుగా అమెరికా రచయితలు రాసిన కథల్లో (ఇది దారుణమైన స్టీరియోటైపింగ్ అనుకోండి) కనబడే మాతృదేశం విడిచి వచ్చిన బాధ, ఇక్కడి పరిస్థితులు వింతగా కొత్తగా అనిపించడం లాంటి సాధారణ దినుసులు వీటిల్లో ఉండవు. కొత్త సమాజం నించి నేర్చుకోవడం, దాంతో రాజీ పడడానికి ప్రయత్నించడం, రాజీ కుదరని చోట యుద్ధం చెయ్యడం కనిపిస్తాయి. వెరసి ఇప్పుడే కొత్త వాతావరణంలో తన అస్తిత్వాన్ని గుర్తించుకుంటున్న ఒక వలస జాతి గొంతు విప్పడం వినిపిస్తుంది.


కథనంలో సీతారామయ్య గారిది కుటుంబరావు బడేమో అనిపిస్తుంది నాకు. అనవసరమైన వర్ణనలూ అవీ ఉండవు. టూకీగా కథ నేపథ్యాన్ని పరిచయం చేసి పాత్రల్ని ప్రవేశ పెడతారు. కొన్ని కథల్లో పాత్ర ప్రవేశించడంలోనే కథా నేపథ్యం సమర్ధవంతంగా ఆవిష్కృతమౌతుంది. పాత్రలు కూడా, హెవీ మేకప్పు లేకుండా, కథకి తగినట్టు ఉంటాయి. ప్రతి పాత్రా తన స్థాయికి తగిన సంస్కారంతో ప్రవర్తిస్తుంది, సంస్కారానికి తగిన గొంతుతో మాట్లాడుతుంది, ఎవరో మనకి తెలిసిన మనిషిలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కథలన్నీ నిజజీవితం నించి వచ్చినవే.

రెండు వారాల సెలవు, గట్టు తెగిన చెరువు, సావాసం సహవాసం కథలు వృత్తి వలస నేపథ్యంలో హడావుడి పెళ్ళిళ్ళ వల్ల భారతదేశం నించి అమెరికా వచ్చిన స్త్రీల జీవితాల్లోకి కిటికీలు తెరుస్తాయి. మళ్ళా నాలుగేళ్ళకి, ముసుగులోంచి, జీతగాళ్ళు కథలు సమకాలీన జాతీయ అంతర్జాతీయ సంఘటనల నేపథ్యంలో వ్యక్తిత్వానికి ఏం విలువ ఉంది, వ్యక్తిగతంగానూ సమిష్ఠిగానూ మనం ఏం చెయ్యగలమనే ప్రశ్నల్ని పరిశీలనకి తీసుకొస్తాయి. దూరపు కొండలు కథ కుల మత జాతి వివక్షతలు ఎలా మన నరనరాల్లో జీర్ణించుకు పోయాయో, ఖండాంతర వాసంలోకూడా అవి మన జీవితాల్ని ఎలా శాసిస్తున్నాయో ఎత్తి చూపుతుంది. అవచారం, వెలుతురు, కొత్త ఊపిరి కథలు దేశం వదిలి వచ్చినా మనల్ని వదలని (మనం వదిలించుకోని) "ఇంటి" అలవాట్లకి, ఇంకా పూర్తిగా వంటబట్టని "ఇక్కడి" అలవాట్లకి మధ్య నలిగే జీవితాలకి అద్దం పడతాయి.

ప్రగతి ప్రభ, మీకు మీరే - ఈ రెండే అమెరికా ప్రసక్తి లేకుండా భారతదేశంలో జరిగే కథలు. ప్రగతి ప్రభ, కథలో అంతర్లీనంగా ఉన్న రాజకీయ నేపధ్యంతోనూ, పంచతంత్రం లాంటి జానపద కథనంతోనూ, ఇతర కథల్లో లేని వ్యంగ్య వైభవంతోనూ ఈ సంపుటంలోని కథలలో విలక్షణంగా నిలుస్తుంది. కొద్దిగా కొకు రాసిన దిబ్బరాజ్యం కథల్ని తలపించినా, కొకు స్పృశించని లోతుల్లోకి వెళ్ళి అనేక ఆర్ధిక రాజకీయ సామాజికాంశాల్లో కార్య కారణ సంబంధాలపై గురి పెట్టిందీ కథ. ఈ కథా రచనా కాలాన్ని బట్టి బహుశా కథలో రూపించినది వాజపేయి బీజేపీ భారతదేశాన్నీ, చంద్రబాబు టీడీపీ ఆంధ్రరాష్ట్రాన్నీ ఏలుతున్న టైము - అదెంత స్వర్ణయుగమో కథ చదివి చూడాల్సిందే!

వలస జీవితాల్లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు చాలానే మనకి సీతారామయ్య గారి కథల్లో పరిచయమౌతాయి. మామూలుగా సభ్య సమాజంలో జనం బయటకి మాట్లాడుకోడానికి బిడియపడే సున్నితమైన సమస్యలు కూడా. కానీ ఎక్కడా "ఈ సమస్యని ఇలా పరిష్కరించుకోండి" అని రచయిత మనకి నొక్కి చెప్పరు. ఎందుకంటే ఈ సమస్యలన్నీ ఎవరికి వారు, వారి సంస్కారానికీ, వారి సహన శక్తికీ తగినట్టు పరిష్కరించుకో వలసిందే. పరిష్కరించుకోవడానికి మనకి అందుబాటులో ఉన్న పనిముట్లేవిటో చెప్పి, చక్కని పరిష్కారం దొరకాలంటే మనం ఎలా ఆలోచించాలో మాత్రం సూచిస్తారు. అందుకే ఈ కథలు మనల్ని ఆలోచింప చేస్తాయి. నేనుండే నుయ్యే నా ప్రపంచం అనుకునే కూపస్థ మండూకాల సంగతేమో గానీ, మన చుట్టూ ఒక ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంతో నా జీవితం వీడలేని విధంగా ముడిపడి ఉంది అని భావించే అమెరికా భారతీయులు తప్పక చదవాల్సిన కథలివి. వోల్గా కథల్ని సమర్ధవంతంగా ఆంగ్లంలోకి అనువదించిన సీతారామయ్యగారు తన కథల్ని కూడా ఇతర ప్రవాస భారతీయులకి అందుబాటులో ఉండేట్లు అనువదించడం గురించి ఆలోచించాలి.


ఈ పుస్తకాన్ని మా స్థానిక తెలుగు సాహితీ సమితి ప్రచురించింది. ప్రతులు కావాలంటే విజయవాడలో నవోదయనీ, అమెరికాలో మా సాహితీ సమితినీ సంప్రదించ వచ్చు.