Sunday, August 26, 2007

ఈ ప్రభుత్వం మనదేనా?

సెప్టెంబరు 11 ఘోరం జరిగిపోయాక అప్పుడు మేల్కొన్న అమెరికా ప్రభుత్వ యంత్రాంగం నానా హడావుడీ చేసింది. విమానాశ్రయాలన్నిటిలో విపరీతమైన నిఘా పెంచింది. అలాగే ఇప్పుడు హైదరాబాదు పేలుళ్ళతో మేల్కొన్న మన కేంద్ర రాష్ట్ర యంత్రాంగాలూ హడావుడి చేస్తున్నై - తిరుమలలో రెడ్ ఎలర్టు-ట. ఇంకెక్కడో రెడ్ ఎలర్టు. అసలు రాష్ట్రమంతా రెడ్ ఎలర్టే. ఒక ఘోరం జరిగాక అయినా ఇతర జన సమ్మర్ద ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోక పోతే అది అవివేకమవుతుంది కానీ జాగ్రత్తలు తీసుకోవడం గొప్ప వివేకానికి సూచన కాదు.

పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకోనియ్యకుండా దుర్ఘటన జరిగిన స్థలాల్లో పని లేని రాజకీయుల పర్యటనలు. ఇంకొక పనిలేని రాజకీయుడు అసలేం పట్టనట్టు హాయిగా కొడుకు పెళ్ళి చేయిస్తూ - ఐతే అతివృష్టీ లేకపోతే అనావృష్టీ అన్నట్టుగా ఉంది ఈ రాజకీయుల వ్యవహారం.

అసలు అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు ఎవరు బాధ్యులు? దేశంలో జరుగుతున్న అరాచక విధ్వంస చర్యల వెనుక దారులు కొన్ని హైదరాబాదులో అప్పుడెప్పుడోనే తేలినై. మసీదు పేలుళ్ళ వెనుక బాగోతం ఇంతవరకూ బయట పళ్ళేదు. ఆ పరిశోధన ఏమైంది - మీడియాతో పాటు అధికారులు కూడా ఆ విషయం అప్పుడే మరిచిపోయారా? ఇప్పుడు మాత్రం ఏమౌతుంది - రాజకీయులు నిప్పులు చెరుగుతారు, అటూ ఇటూ వేళ్ళు చూపిస్తారు. అధికారులు తగుమాత్రంగా మొహాలు వేళ్ళాడేసుకుని మేం చెయ్యగలిగిందంతా చేస్తున్నాం అంటారు. ఒక వారం తిరిగేప్పటికి మీడీయా ఈ విషయం మరిచిపోతుంది. దాంతో మనమూ మరిచిపోతాం.

అప్పుడే బలిపశువుల్ని సిద్ధం చేసే యజ్ఞం మొదలైనట్టుంది. ఆంధ్రజ్యోతిలో చదివిన వార్త: రాజకీయుల వత్తిడి వల్ల గోకుల్ చాట్‌కి చట్టవిరుద్ధంగా లైసెన్సిలిచ్చిన బల్దియా అధికారులదే తప్పుట. ఎట్లా ఉందంటే ఇంటో దొంగలు పడ్డారు మహాప్రభో అని మొరపెట్టుకుంటే - నీ ఇంటి ప్లాను ఎప్రూవైందా, అసలు ఇల్లెందుకు కట్టావు అని నిలదీసినట్టు.

ఈ పేలుళ్ళ గురించి అత్యంత భీతి గొలిపే విషయం ఏవిటంటే ఆ చోటులో నేనైనా మీరైనా ఉండి ఉండవచ్చు. ఇదివరలో, దాడులు చేసింది ఎవరైనా, దాడికి గురయ్యేది ఏ ప్రముఖ వ్యక్తులో, ఏ రాజకీయ నాయకులో అయి ఉండేవారు. మనది ప్రజా ప్రభుత్వమే అయినా ప్రజలూ ప్రభుత్వమూ ఒకటేనని ఇటు ప్రజలూ అనుకోలేదు, అటు ప్రభుత్వమూ ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ నాడు ఆ హద్దులు చెరిగి పోయాయి. ఎవడికో ఎవరిమీదో ఎక్కడో కాలితే - ఎటూ సంబంధంలేని 42 మంది జీవితాలు దగ్ధమవటం. మనల్ని కాదులే అనుకుని చూపు తిప్పేసుకోలేం. మన గొడవ కాదులే అని మనమింక విడిగా ఉండలేం. ప్రజల గుండె చప్పుడుతో కలిసి వినబడాలి ప్రభుత్వ స్పందన. ప్రజల గొంతుతో మాట్లాడాలి ప్రభుత్వం నోరు. మనవి కాని గొంతుల్ని అరువు తెచ్చుకోనియ్యకండి. ఈ దేశం మనది, ఈ ప్రజలు మనవాళ్ళు, ఈ ప్రభుత్వం మనది - సాధికారతని సార్వభౌమత్వాన్ని స్వాధీనం చేసుకుందాం.

Monday, August 20, 2007

I must be totally crazy ..

.. to try this .. but .. as they say ..

వెర్రి వేయి విధాలు.

So here it goes.

evvAni vAkiTa.wav

అతి సర్వత్ర వర్జయేత్ ..

.. ఈ ఆర్యోక్తి యమదొంగ సినిమాకి బాగా వర్తిస్తుంది.

వినోద భరితంగా కథ రాసుకున్నావు. కథలోని వేర్వేరు దారాల్ని పాయలుగా అల్లుకొచ్చి చక్కటి అమరిక తయారు చేశావు. కథలో పాత్రలకి అనుగుణంగా ప్రతిభగల నటీనటుల్ని ఎన్నుకున్నావు.
వినోదాన్ని రక్తి కట్టించడానికి అవసరమైన మసాలా దినుసులన్నీ పోగు చేసుకున్నావు. ఇవన్నీ చాలవా ?
- ప్రతి అంశాన్నీ అతి చేసి చివరికి రసాభాస చేసుకోవాలా? సినిమాలో వేర్వేరు అంశాలు దేనికదే వినోదంగానే ఉన్నై కానీ అన్నీ కలిపి మూడు గంటలు దాటేసరికి దేన్నీ భరించడం కష్టమైపోయింది. నిడివిని కనీసం ఒక అరగంటైనా కుదించి ఉండొచ్చు. కత్తెర నా చేతిలో ఉండి ఉంటే, కథ చెడకుండా ఒక గంట దాకా కత్తిరించి ఉండే వాణ్ణి.

మెచ్చుకోదగిన విషయాలు:
వినోద భరితమైన కథ. ఆసక్తికరమైన కథనం.
యముడి పాత్రని మలచిన తీరు. యముడు సూర్యుడి కొడుకు అనే పురాణకథని కథకి తగినట్టు ఉపయోగించుకోవడం. మోహన్‌బాబు బాగా నప్పాడు. యమలోకం సెట్టు, పాత్రల ఆహార్యం కూడా బాగుంది.
ధనలక్ష్మిగా మమతా మోహన్‌దాస్ నటన.
చాలా రోజుల తరవాత హాస్యనటుడు అలీ తన ప్రతిభకి తగిన పాత్రలో రాణించాడు.
సాంకేతిక మాయాజాలంతో స్వర్గీయ ఎన్టీయార్ తెరపైన ప్రత్యక్షమై కథలో ఒక కీలకమైన మలుపు తిప్పడం.
యాభై పౌండ్ల భారం వొదిలించుకున్న స్లిం అండ్ ట్రిం జూ. ఎన్టీయార్ డాన్సులు, ఫైట్లు తన సహజమైనశైలిలో నిర్వహించాడు. కొన్ని ఫైట్లు పాటల పిక్చరైజేషన్ చాలా ఇనొవేటీవ్‌గా ఉంది. యముడికి దీటుగా సంస్కృత సమాస భూయిష్టమైన భారీ డైలాగులు కూడా బానే చెప్పాడు.
నేపథ్య సంగీతంలో నరసింహ స్వామి మహిమ సూచించటానికి, యముడి ప్రతిభ ఎత్తి చూపటానికి ఉపయోగించిన ఉఛ్ఛాటనలు సందర్భోచితంగా సమకూరినై.
సంభాషణలు కూడా చాలా మట్టుకు సందర్భోచితంగా, చమత్కారంగా ఉన్నై.
యముడి పాత్రలో చాలా చోట్ల మాయాబజార్ ఘటోత్కచుని "ప్రేరణ" కనిపిస్తున్నది.

దర్శకుణ్ణి మొత్తబుద్ధయ్యే విషయాలు:
ప్రతి అంశంలోనూ మితి మీరిన అతి.
నాయిక పాత్రకి వెర్రిమొహంలా చూస్తుండడం తప్ప వేరే పని లేదు. మన హీరోయిన్లలో కాస్త ప్రతిభగల అమ్మాయి ప్రియమణి - ఈ పాత్రలో పూర్తిగా వృధా. దానికి తోడు ఆమె ఉన్న రెండు పాటల్లోనూ విపరీతమైన మేకప్పు, ఆమెకి అస్సలు నప్పని దుస్తులు వేసి ఆమె సహజసౌందర్యాన్ని నాశనం చేశారు.
స్వర్గీయ ఎన్టీయార్‌కి వాడిన డబ్బింగ్ నప్పలేదు. అంతకంటే చక్కగా ఆయన గొంతుని అనుకరించేవారు ఆంధ్రదేశంలో దొరకలేదంటే ఆశ్చర్యంగా ఉంది.
అన్నిటికంటే చిర్రెత్తించిన విషయం - తెరమీద ఏదన్నా అమ్మాయి పాత్ర ప్రవేశిస్తే చాలు, కెమెరా లెన్సు సరాసరి ఆమె బొడ్డు మీదికి దూసుకు పోతూంటుంది. ఒకటి రెండు సార్లు భరించొచ్చు. ఇక తెర మీద అమ్మాయి కనబడ్డప్పుడల్లా ఇదే గోలా? సినిమా విజయం అమ్మాయిల బొడ్డు చుట్టూ పరిభ్రమించును అని దర్శకుడి భ్రమ కాబోలు.
పాటలన్నీ ఊపుగా మోతగా ఉన్నై. ఏదో అక్కడక్కడా ఒక్కొక్క ముక్క తప్ప సాహిత్యం ఏదీ నా చెవికి స్పష్టంగా వినపళ్ళేదు. బహుశా వినబడకుండా ఉండటమే మంచిదేమో. ఎవరో కొత్త యువకవి ఈ సినిమాలో పాటలు అన్నీ రాశాడుట. అందుకని కొంత కుతూహలంగానే ఉంది. సినిమా మొదట్లో ఉన్న ఒకటి రెండు పాటల్లో ఉపయోగించిన హిప్‌హాప్ శైలి మరీ విపరీతంగా ఉంది. కానీ పాటల చిత్రీకరణ, దానిలో సాంకేతిక బృందం కనబరిచిన టెక్నికల్ బ్రిలియన్సుని, ముఖ్యంగా ఎడిటింగ్‌ని అభినందించాలి.

మన ఓర్పుకి కొంచెం పరీక్ష పెడతుంది గానీ, చూడతగ్గ సినిమాయే. జూ.ఎన్టీయార్ లేదా రాజమౌళి అభిమానులైతే నిరాశ చెందరు.

హైదరాబాదు వాసులకి ఆహ్వానం


గీతాగణేశన్ భరతనాట్యంలో అందెవేసిన చేయి. జయప్రద రామమూర్తి చెయ్యితిరిగిన వేణువాద్య కళాకారిణి. ఈ ఇద్దరు యువ కళాకారిణులు తారనాకలో ఉత్తరా సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే సంస్థను నెలకొల్పి ఔత్సాహికులకి ఈ రెండు కళలలోనూ చక్కని శిక్షణ ఇస్తున్నారు. తాము తమ గురువుల వద్ద నేర్చిన ఈ విద్యలకి తమ శిష్యులే "ఉత్తరా"ధికారులు అన్న ఆలోచనతో ఈ సంస్థని నిర్వహిస్తున్నారు. హైదరాబాదు పరిసర ప్రాంతాలలో వివిధ పండుగల సందర్భాల్లోనూ ఇతరత్రంగానూ వీరి విద్యార్ధి బృందాలు ప్రదర్శనలిచ్చి ప్రశంసలు చూరగొనడం పరిపాటిగా జరుగుతోంది. రెండేళ్ళ క్రితం శ్రీలంక ప్రభుత్వంచే ఆహూతులై తమ బృందంతో ఆ దేశాన్ని పర్యటించి అనేక ప్రదర్శనలిచ్చారు.

ఐతే ఇవన్నీ ఒక ఎత్తు, ఆగస్టునెలలో వీరు జరిపే తమ సంస్థ వార్షికోత్సవం ఒక ఎత్తు. సభలు జరపటమే వృత్తిగా చేసేవాళ్ళు కూడా అందుకోలేని పనితనంతో జరుగుతుంది వీళ్ళ కర్యక్రమం. ఎక్కడా ఆలస్యం కానీ కాలహరణం కానీ ఉండవు. అనవసరమైన సోదితో ప్రేక్షకుల్ని బాదటం ఉండదు. ప్రదర్శనలు చక్కని కళాత్మక, సాంకేతిక విలువలతో ఆకట్టుకుంటాయి. పిల్లనగ్రోవి బృంద గానం, భరతనాట్య నాటక ప్రదర్శన తమకి తామే గొప్ప ఆకర్షణలు కాగా, ఈ యువగురువులు తమ ఇద్దరి కళలను కలబోసి రూపొందించిన వేణు-నాట్య సల్లాపము అద్భుతంగా ఉంటుంది - ఈ వార్షిక ఉత్సవాల్లో ఈ అంశం ఒక ప్రత్యేక ఆకర్షణ.

అంతే కాక ఈ సందర్భంగా వీళ్ళు చేసే మంచి పని ఇంకొకటుంది. ప్రతి ఏడూ ఒక విద్వన్మణికి సన్మానం చెయ్యడం. చిన్నా చితకా సంస్థలు కొన్ని, అప్పటికే పద్మభూషణ్ లాంటి బిరుదులు పొంది ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కళాకారుల్ని పిలిచి వాళ్ళకి తాము కూడా ఒక శాలువాకప్పి ఒక బిరుదిచ్చి - కేవలం ఆ ప్రముఖ వ్యక్తితో ఫొటోలుదిగే అవకాశం అన్నట్టు చేస్తాయి. ఉత్తరా వారి పద్ధతి దీనికి పూర్తిగా భిన్నం - తమ కళల్లో ఎంతో నిష్ణాతులై కూడా స్థానికంగా పట్టుదలతో, నిశ్శబ్దంగా పనిచేస్తూ భావితరాలకి మన సాంప్రదాయ కళలని నేర్పుతున్న గురువుల్ని గుర్తించి సన్మానిస్తారు.

ఉత్తరా వారి ఎనిమిదవ వార్షికోత్సవం రాబోయే శుక్రవారం (ఆగస్టు 24) సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో జరుగుతోంది ఆసక్తి కలవారందరూ ఆహ్వానితులే.

Sunday, August 19, 2007

పదే ఏం భాగ్యం?

వీవెన్‌ని ఖచ్చితంగా అభినందించాలి - ఎప్పుడూ కూడలికి ఇంకా ఏ కొత్త హంగులు అద్దుదామా అని చూస్తూనే ఉంటారు. సరికొత్త ప్రతిపాదన పది అత్యుత్తమ తెలుగు బ్లాగుల్ని ఎంచి కూడలిలో ప్రదర్శించాలని.

కొత్తగా బ్లాగ్లోకంలో ప్రవేశించిన వాళ్ళు వెతుక్కోనక్కర్లేకుండా మంచి బ్లాగుల్ని పరిచయం చేసుకోడానికి ఇదొక మంచి పనిముట్టే. క్రమం తప్పకుండా బ్లాగులు చదివేవారికి వాళ్ళకి నచ్చే బ్లాగులేవో వాళ్ళకి తెలుసు. చాలా మంది (నేను కూడా) తమకి నచ్చే బ్లాగుల్ని బ్లాగు పట్టీలో చూపిస్తుంటారు. కానీ అన్ని బ్లాగులూ అందరికీ నచ్చాలని లేదు కదా. పదింటిని ఎంచితే, ఈ పదే గొప్పవి, మిగతావి చెత్త, చదవక్కర్లేదు అనే భావం కూడా కలగొచ్చు పాఠకులకి. ఆ పాఠకుడు నాలాంటి బద్ధకస్తుడైతే .. మిగతా బ్లాగుల్లో ఏముందో అని శోధించకుండా - ఈ పదింటితోనే సరిపెట్టేసుకో గలడు. విశాలంగా చూస్తే అంతర్జాల విహారంలో, సూక్ష్మంగా చూస్తే బ్లాగుల్లో, ఏదో అలా గాలికి తిరుగుతుండగా అకస్మాత్తుగా ఒక రాత - మనసు చెమ్మగిల్లే కవిత్వమో, మెదడుకి పదును పెట్టే ఆలోచనో, తెలివిని సవాలు చేసే సమస్యో - అనుకోకుండా కంట బడితే - ఆ అనుభూతి చెప్పలేం. ఎన్నో మంచి ముత్యాల్ని నేను ఇలాగే ఏరుకున్నాను. ఇవే మంచివి అని పట్టీలో పెట్టి అందిస్తే .. పాఠకులకి "కనుగొంటిని!" అనే భావం దూరమైపోతుంది. పైగా ఆ పట్టీలోవి వాళ్ళ అభిరుచికి తగనివి ఐతే అరికాలి మంట నెత్తికెక్కినా ఎక్కచ్చు.

ఇది ఎలా చూసినా ప్రజాస్వామిక ఎన్నిక కాజాలదు. ఈ ఎన్నికలో పాల్గొనేవాళ్ళందరూ, నేను గమనించినంతలో, బ్లాగులు రాయడంలోనే కాక బ్లాగుల్ని చదవడంలో వ్యాఖ్యానించడంలో తమ అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్పడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నవాళ్ళు. అంటే బ్లాగౌత్సాహికులన్న మాట. యధాలాపంగానూ యాదృఛ్ఛికంగానూ బ్లాగులు చదివేవాళ్ళ రాసేవాళ్ళ అభిప్రాయం ఇందులో గణనకి రావట్లేదు. అలా జనబాహుళ్యంలో తెలుగు బ్లాగులకి ఎంత ప్రాచుర్యం వచ్చిందో తెలుసుకునే అవకాశం లేదు. కేవలం మూషికం నొక్కుల్ని బట్టి అత్యుత్తమ బ్లాగుల్ని ఎంచుదామా అంటే .. అది మరీ అధ్వాన్నం. తేనెగూడులో ఈ అంశం ఉండేది కానీ నేను చూసినప్పుడల్లా ఆ లిస్టులో కనబడినవి, ఒకటి రెండు తప్ప, ఏదో ఒక కాంట్రవర్సీ వల్ల జనాల దృష్టికి వచ్చినవే కానీ, ఆ బ్లాగులో టపాలో ఏదో విలువ ఉండి కాదు. దానికంటే బ్లాగుల్ని సునిశిత దృష్టితో చదివే వాళ్ళ అభిప్రాయమే మేలు ఖచ్చితంగా. రానారె ప్రకటించిన పద్ధతి కూడా బావుంది - ప్రతిబ్లాగూ తనకెందుకు నచ్చిందో రెండు ముక్కల్లో రాశాడు.

నాకు అంత ఓపిక లేదు గానీ - ఈ టపా తయారు చేసేప్పటికే ఒక శలవురోజు ఉదయమంతా గడిచిపోయింది - కూడలి తెరిచినప్పుడల్లా వీళ్ళ దగ్గిర్నించి ఏవన్నా కొత్త టపాలు వచ్చాయా అని వెతుకుతాను.

ఈ బ్లాగుల్లో ఎప్పుడూ నిత్యకళ్యాణం పచ్చతోరణం
చరసాల అంతరంగం
శ్రీరాం సంగతులూ సందర్భాలూ
రానారె
లలిత ఓనమాలు
చావా కిరణ్ ఒరెమూనా
సౌమ్య
సత్య శోధన
విహారి
నాగరాజా తెలుగు నేల
జేప్స్
దిల్
తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారి కలగూరగంప
వెంకట్ ఇరవై నాలుగు ఫ్రేములు
ఎన్. వేణుగోపాల్ కడలితరగ

ఈ బ్లాగర్షులు ఇంకొంచెం తరచుగా రాస్తే బాగుణ్ణనిపిస్తుంది
నాగరాజు గారి సాలభంజికలు
స్వాతికుమారి
చదువరి
త్రివిక్రం అవీ ఇవీ
రాధిక స్నేహమా
సిరిసిరిమువ్వ
రెండురెళ్ళు ఆరు
రవి వైజాసత్య

ఈ మధ్యనే మొదలు పెట్టినా వన్నె కలిగి వాసికెక్కినవి
రాకేశ్వరుడి ఋౠ
నువ్వుసెట్టి సోదరులు

వూకదంపుడు
లలితాస్రవంతి

సిరి తలపు
పూలవాన
వికటకవి
రమ మనలో మనమాట

చివరిగా ఒక మాట: నా ఈ టపాకి సమాధానంగా .. "నాబ్లాగు మీ పట్టీలో పెట్టినందుకు ధన్యవాదాలు", "ఇంత చెత్త బ్లాగు మీకెలా నచ్చిందసలు, మీకింతకంటే మంచి టేస్టుందనుకున్నానే" - ఇలాంటి వ్యాఖ్యలు రాయడం అనవసరం. అంతకంటే తెలుగు బ్లాగుల వాసి (క్వాలిటీ)ని పెంచడానికి సూచనల్ని ప్రతిపాదించి చర్చిస్తే చాలా సంతోషిస్తాను.

తానింత శ్రమ తీసుకుని నన్నింత శ్రమ పెట్టిన వీవెనుడికి మరోసారి అభినందనలతో ..

Tuesday, August 14, 2007

అవునా .. నిజమేనా ..

ఆ మొఘల్ రణ ధీరులు తంతియా తోపె ఝాన్సీల స్వాతంత్ర్య సమర దీప్తి
త్యాగ మూర్తులు తిలక్ దాదా సీయార్దాసు మాలవ్య మన గాంధి మహిత శక్తి
జాతీయ సంస్థయై శాంత్యహింసల తోడ కాంగ్రెస్సు నడిపిన కదన ఫణితి
తమిళ ఆంధ్ర కేరళ ధారుణీ ప్రజలెల్ల ధారవోసిన మహా త్యాగఫలము
మాత్రు దేశముగా వక్షాస్త్రమయుండై బోసు పడరాని యిడుముల బడిన శ్రమయూ
పండిత నెహ్రుజీ పటేల్ పట్టాభియు రాజాజీ నెరపిన రాజ్య పటిమ
భారతీయుల పుణ్యంబు పండెననగ వచ్చెనిదివో సుస్వాతంత్ర్య వత్సరంబు
పొత్తుగూడు సుశుభముల పొందుడయ్య తొల్లి భారత విభవమ్ము వెల్లివిరియ

కూడలిలో తొంగి చూడంగానే రెండు మూడు టపాలు కనిపించాయి - దీప్తి గారు కన్నుల పండువు గానూ, వీనుల విందుగానూ గుర్తు చేశారు .. అలాగే మరి కొందరూ ..

నేడే స్వాతంత్ర్య దినం
వీరుల త్యాగ ఫలం

అవును, అంతవరకూ నిజమే .. ఇవ్వాళే పంద్రాగస్టు.

కానీ మనసు ఆశతో ఆనందంతో ఉరకలు వెయ్యట్లేదు.

మధ్యాహ్నమే యాహూలో ఈ వార్త చూశాను.

మనసు వికలమైంది. పని మీదకి దృష్టి పెట్టటం కూడా కష్టమై పోయింది.

సాయంత్రం ఇంటికొస్తూ రేడియోలో ఈ కథనం విన్నాను.

ఐదేళ్ళ చిరంజీవి హస్సన్ మహ్మూద్ గొంతులో .. ఏడాది క్రితం ఇజ్రాయెలీ హెజ్బొల్లా కుమ్ములాటలో తన చెల్లి మరణించిందని చెబుతూ .. వినేప్పటికి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి.

ఆశాదీపం జ్వలిస్తున్న ఘంటసాల స్వాతంత్ర్య గానం కూడా ఈ నీడల్ని పారద్రోల లేకపోతోంది!

Tuesday, August 7, 2007

జగమంత కుటుంబమా? మనసంత గందరగోళమా??

ఈ పాట విన్నాను. చక్రం సినిమా కూడా చూశాను. రెండూ పెద్దగా పట్టించుకోవలసిన విషయాల్లాగా అనిపించలేదు అప్పుడు. ఈ మధ్య వికటకవి బ్లాగులో "ఈ పాట నచ్చనిదెవరికి?" అనే రెటోరికల్ ప్రశ్న చదివినప్పుడు "నాకు!" అని సమాధానం నా మనసులో అసంకల్పితంగా మెదిలింది. దాంతో ఎందుకు నచ్చలేదని నాకు నేనే ప్రశ్నించుకున్నాను.

అలవోకగా పాట విన్నప్పుడు అంతర్గతంగా ఉన్న లయ కదంతొక్కే గతులతో ఆకర్షిస్తుంది. తీరికగా చదివినప్పుడు మాటల చమక్కులు కళ్ళు మిరుమిట్లు గొలిపి కాసేపు బైర్లు కమ్ముతాయి. కాస్త ఊపిరి బిగబట్టి లోపలికి తొంగి చూస్తే
పల్లవి
జగమంత కుటుంబం నాది - ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే
మ్మ్ .. బానే ఉందే. పరస్పరం వ్యతిరేకమైన ద్వంద్వాల్ని తనలో ఏకం చేసుకుని ద్వైతంలోనించి ఒక అద్వైత దృష్టి పుడుతున్నది .. ఆహా .. ఇదేదో మన బుర్రని సవాలు చేసి మేధకి పదునుపెట్టే వ్యవహారంలా ఉంది. బాగుంది. మరి తరవాత ..

చరణం
కవినై కవితనై - ఓహో, సృష్టికర్త తనే, తాను సృజించే ఊహ కూడ తనే - సరే
భార్యనై భర్తనై - ఇదేవిటి? Is the poet androgynous? అర్ధనారీశ్వర తత్త్వమా??
మల్లెల దారిలో మంచు ఎడారిలో - ??
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల - ??
నాతో నేనే అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ - ఆగండాగండి .. నాకేం అర్ధం కాలేదు. మల్లెల దారి మంచు ఎడారిలో ఉందా, ఇంకెక్కడైనా ఉందా? పన్నీటి జయగీతం ఏవిటి? ఎవరు పాడారు? కన్నీరు జలపాతం ఎందుకైంది? కవి కవితా, భార్యా భర్తా అన్నీ తానే అయినప్పుడు ఇంక జయగీతాలకీ, కన్నీళ్ళకీ తావేది? అవి ఎవరికి, ఎక్కణ్ణించి పుట్టుకొచ్చాయి? అనుగమించడంటే వెన్నంటి రావడం కదూ? నా"తో" నేను అనుగమించడం ఏవిటి, నన్ను నేను అనుగమించడం అనొద్దూ? భావం ప్రకారం తనకి తానే తోడు అనుకుందాం, ఓకే. మరి నాతో నేనే రమించడమేవిటి? androgynous అవడం సరిపోక సంభోగం కూడానా? హతోస్మి! నాకొక ఆంగ్ల పదబంధం మనసులో మెదుల్తోంది గానీ సభామర్యాద కాదని ఊరుకుంటున్నాను. సరే ఒదిలెయ్యండి, తరవాతి లైనేవిటో ..

ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం .. అయ్యా మాష్టారూ, అనవరతం అన్నా నిరంతరం అన్నా ఒకటే కదండీ?కలల్ని కథల్ని .. కావ్య కన్యల్ని, ఆడ పిల్లల్ని - ఓహో, తనకి లేకపోయినా పుట్టిన వాళ్ళకి లింగ భేదం ఉందన్న మాట .. అన్నట్టు ఇందాక కవిత కూడా నేనే అన్నట్టున్నారు, మరిప్పుడు పుట్టింది కావ్య "కన్య" ఎలాగైంది సార్?

ఈ ఉధృతం చూశాక రెండో చరణంలోకి వెళ్ళాలంటే భయమేస్తోంది కానీ ఒక్క సందేహం మాత్రం అడగకుండా ఉండలేక పోతున్నా - "కనరాని గమ్యాల కాలాన్ని కనడం" అంటే ఎవిటో?

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె - హమ్మయ్య, మొదటి రెండు చరణాల భీభత్సం తరవాత ఈ వరుస నిజంగానే పిల్లగాలిలా, గాలి పాటలా, పాట పాపలా ముద్దుగా ఆహ్లాదంగా ఉంది.
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె - ఆహా, కని పెంచిన కూతురికి పెళ్ళిచేసి అప్పగింత పెట్టి సాగనంపి వెనుతిరిగిన తల్లి మనసు తడి - సెబాషో!!
నా హృదయమే నా లోగిలి - ఇదేవిటి గుండె కాస్తా సంస్కృత గంధం పూసుకుంది అకస్మాత్తుగా?
నా హృదయమే నా పాటకి తల్లి - అయ్యా, ఇందాక అంపకాలు పెట్టినప్పుడే ఆ సంగతి అర్ధమైంది .. అవునూ హృదయం తల్లయితే మరి తండ్రి? ఆడక్కుండా ఉండటం బెటరేమో!
నా హృదయమే నాకు ఆలి - ఇందాక భార్యా భర్తా నేనే అన్నారు, మళ్ళీ ఇప్పుడు హృదయం నా భార్య అంటు .. ఓకే ఓకే, నోరు మూసేసుకుంటున్నా. ఇక చివరిలైను ..
నా హృదయములో ఇది సినీవాలి .. హబ్బ, తిప్పి తిప్పి ఏవి దెబ్బ కొట్టారండీ, దిమ్మ తిరిగిపోయింది!!

లయల జతుల గతుల చమత్కృతుల మోహ పాశంలోనించి బయటపడి ఈ పై పై అలంకారాల పొరల్ని వొలిచి పాటలోకి లోతుగా చూస్తే నాకు కనబడిందల్లా కొంత స్వాతిశయం, మరికాస్త ఆత్మాభిమానం, బోలెడు వాగాడంబరం. కొత్త ఆలోచన గానీ, పోనీ పాత ఆలోచననే కొత్తగా చెప్పడం కానీ లేవు సరిగదా, మొదణ్ణించీ చివరిదాకా అన్వయం కుదరని ఆలోచనలు, అసందర్భ ప్రయోగాలు, మాటల ఇంద్రజాలం - పైపూత పూసి ఇత్తడిని పసిడిగా భ్రమింప చెయ్యవచ్చు కానీ నిజంగా బంగారంగా మార్చలేము కదా. దానికి కెమిస్ట్రీ సరిపోదు - పరశువేదిని ప్రసాదించే ఆల్కెమీ కావాలి, తిలక్ చెప్పినట్టు.

మహాప్రస్థానానికి ముందుమాట రాయమని శ్రీశ్రీ చెలాన్ని అడిగితే కవిత్వాన్ని తూచేందుకు తనదగ్గిర తూనిక రాళ్ళు లేవన్నాడు చెలం. తూచొద్దు, అనుభవించి పలవరించమన్నాడు శ్రీశ్రీ. మరి ఆ పని చెయ్యాలన్నా ముందసలు అర్ధమవ్వాలి కదా అంటాను నేను.

సెప్టెంబరు 30 న చేర్చిన కొసమెరుపు: ఈ నాణేనికి రెండో వేపు ఇక్కడ "సిరివెన్నల" కృష్ణమోహన్ గారి దృష్టిలో.

Friday, August 3, 2007

రొటీను - వెరైటీ

సంఘజీవి ఐన మానవడు కొంతైనా రొటీనుకి అలవాటు పడతాడనుకుంటా - ప్రతి రోజూ ఇంచుమించుగా ఒకే టైముకి లేవటం - లేవంగానో కాఫీనో టీనో తాగడం, ఒకే టైముకి ఆఫీసుకి వెళ్ళడం .. ఇలా ఒక దిన చర్య ఏర్పడిపోతుంది. ఒక్కోసారి మనిషి దీనికి ఎంత అలవాటు పడిపోతాడంటే - అదొక ఎడిక్షను లాగా - ఆ సమయానికి ఆ పని జరక్క పోతే ఏమీ తోచదు. రిటరైన పెద్దాయన తనకి తోచక ఇంట్లోవాళ్ళని ఎలా కాల్చుకు తింటాడో అన్న టైపులో చాలా కథలు రాశారు మనవాళ్ళు, ఇట్లాంటి సందర్భం ఆధారంగానే.

రొటీనుకి వ్యతిరేక భావన వెరైటీ. మన తెలుగు సినిమాల టైపులో కాదు .. రోజూ చేసే అలవాటు పనికి భిన్నంగా చెయ్యడం. ఎంత రొటీను మనిషైనా, కొద్దిగా వెరైటీ కోరుకుంటాడు. పొద్దునే ఆరింటికల్లా లేచి ఎనిమిదింటికల్లా ఆఫీసులో ఉండే వాళ్ళు శనాదివారాల్లో కాస్త ఆలస్యంగా నిద్ర లేవడం. రోజూ ఎవరికి వాళ్ళు రెందు బ్రెడ్డు ముక్కలు మింగి పరిగెత్తే వాళ్ళు ఆదివారం నాడు కుటుంబమంతా కలిసి బయటికెళ్ళి "కావల్సినంత మెక్కు" బ్రేక్ ఫాస్ట్ తినడమో, లేక ఇంట్లోనే దోసెలు వేసుకోవడమో. సంవత్సరానికి ఒకటి రెండు సార్లు "వెకేషన్" పేరిట విహార యాత్రలు. ఇక్కడ కొన్ని ఆఫీసుల్లో ఒక పద్ధతి ఉంది casual Friday అని. మామూలు రోజుల్లో వ్యాపారోచితమైన ఉడుపులు ధరించాలి - శుక్రవారం నాడు మాత్రం జీన్సు, టి షర్టు, టెన్నిసు బూట్లు లాంటివి వేసుకోవచ్చు - అందుగ్గాను ఒకటో ఐదో డాలర్లు ముడుపు చెల్లించాలి. అలా వసూలైన సొమ్ముని ఉద్యోగస్తులందరూ కలిసి ఎంచుకున్న ఒక స్థానిక స్వఛ్ఛంద సంస్థకి విరాళంగా ఇస్తారు.

రొటీను అనగానే అదేదో జాలిపడవలసినది అసహ్యించుకోదగినది అనే భావం స్ఫురిస్తుంది. జాలి ఉట్టిపడుతున్న గొంతుతో "వాళ్ళు అలవాటునీ అస్వతంత్రతనీ కావిలించుకున్నారు" అంటాడు తిలక్. అంటే అన్నాడు గానీ, నా మట్టుకి నాకు కొంచెం రొటీను ఉండడం మంచిదే అనిపిస్తుంది. ఆధునిక నాగరిక జీవితంలో బుర్ర ఏక కాలంలో అనేక సమస్యల్ని గురించి ఆలోచించాల్సి వస్తుంది. కొన్ని పనులైనా రొటీనుగా చేసుకుపోవడం అలవాటైతే రోజూ దాన్ని గురించి ఆలోచించాల్సిన పని ఉండదు - ఆ సమయం, ఆ ఆలోచన వేరే పనికి, ఇంకా ఉపయోగమైన పనికి వినియోగించ వచ్చు. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళాల్సిన వ్యక్తులు, రచయితల్ని కళాకారుల్ని చూసీ అసూయ పడతారు - వాళ్ళకి రొటీను లేదని. అది పొరబాటు. దివంగత వాయులీన విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు డెబ్భై ఏళ్ళ వయసులో ఉదయం రెండేసి గంటలు సాధన చేసే వారట. పేరుపొందిన ఏ రచయిత ఏ గాయకుడు ఏ కళాకారుడి జీవితాన్ని చూసినా క్రమం తప్పకుండా నిరంతరం సాధన చెయ్యటం కనిపిస్తుంది. వాళ్ళకి అవసరమైన రొటీను వాళ్ళకి ఉంటుంది.

రొటీను వల్ల ఇన్ని లాభాలుంటే మళ్ళీ ఇంక వెరైటీ ఎందుకు? అన్ని పనులూ రొటీనుగా చేసుకుంటూ పోవచ్చుగా? అక్కడే ఉంది తమాషా. పరిణామ క్రమంలో వచ్చిన పరిణత కారణంగా కొంత సంక్లిష్టత ఉంటే గానీ తృప్తి చెందదు మనిషి బుర్ర. కొత్త అనుభవాలు, కొత్త సమస్యలు ఎదురైనప్పుడు బుద్ధి చమత్కృత మౌతుంది. మేధ వికసిస్తుంది. వెరసి ఆ అనుభవం మనిషికి తృప్తినిస్తుంది.

అందుకోసం కావాలి వెరైటీ - అలాగని రొటీనుని వొదిలెయ్యక్కర్లేదు.

Thursday, August 2, 2007

బెర్కిలీలో తెలుగు బోధన

ఆచార్య వేమూరి గారి గురించీ కేలిఫోర్నియా బెర్కిలీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన ప్రారంభించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల గురించీ ఇంతకు ముందు ఇక్కడ పరిచయం చేశాను.

ఇప్పుడే వారు పంపిన శుభవార్త చూశా - ఈ సంవత్సరం ఫాల్ సెమిస్టరు నుండీ బెర్కిలీలో తెలుగు క్లాసు మొదలవుతోంది. నాలుగు క్రెడిట్ల క్లాసు, బోధన బుధ, శుక్ర వారాలు మధ్యాహ్నం 12 నించీ రెండు దాకా జరుగుతుందట.

ఈ గమ్యం చేరడానికి అవిశ్రాంతంగా పనిచేసిన వేమూరి వారికీ వారి బృందానికి హార్దికాభినందనలు. విరాళాలిచ్చి బాసటగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు.

ఈ ప్రయత్నం ఆరంభ శూరత్వంగా మిగిలిపోగూడదంటే మనం ఇంకో రెండు పనులు చెయ్యాలి -
1) మూల నిధిని ఇంకా బలోపేతం చెయ్యాలి. ఫండ్స్ లేమి వల్ల ఈ బోధన ఆగిపోకూడదు.
2) ప్రతి సెమిస్టరులోనూ క్లాసు నిండేటట్లు చూడాలి.

సమాజ ప్రేరణతో విశ్వవిద్యాలయంలో తెలుగు బోధించడం మిషిగన్ విశ్వవిద్యాలయంతో మొదలైంది కొన్నేళ్ళ క్రితమే. దీన్ని సాధించడానికి స్థానికి తెలుగు అభిమానులు చాలా కృషి చేశారు - ఐనా ఏం లాభం? గత సెమిస్టర్లలో తగినంత ఎన్రోల్మెంట్ లేక విశ్వవిద్యాలయం వారు ఈ బోధనని నిలిపి వేశారు.

డబ్బంటే తెస్తాం, దాతల గడ్డం పట్టుకుని బతమలాడో, బిచ్చమెత్తో, ఎలాగోలాగ.
విద్యార్ధులకి తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి ఎలా తెప్పిస్తాం?
ఆలోచించాల్సిన ప్రశ్న!