Friday, July 27, 2007

కథలు ఎలా రాయకూడదు?

మనం చదివే ప్రతి కథా బ్రహ్మాండం కాక పోవచ్చు కానీ కొన్ని కనీసార్హతలు ఉండాలని కోరుకోవడం అత్యాశ కాదనుకుంటాను. కాస్త మంచి కథ చదవాలని తాపత్రయ పడే ఒక పాఠకుడిగా మాట్లాడుతున్నానే గాని నేను సాహిత్య సిద్ధాంతాల్ని విశ్లేషించబోవట్లేదు.
ఈ మధ్యన రెండు అంతర్జాల పత్రికల్లో రెండు కథలు చదివాక నాకెందుకు అరికాలి మంట నెత్తికెక్కిందని ఆలోచిస్తే ఈ కనీసార్హతలు స్ఫురించాయి.

1. భాష మీద గౌరవం: రచయితకి ఉన్న ఒకే ఒక ముడి పదార్ధం భాష. రచయిత బాబు సొమ్ము కాదు ఆ భాష - దానికి ఒక స్వంత ప్రాణం ఉంటుంది. ఒక స్వరం ఉంటుంది. దాన్ని గుర్తించటం, గౌరవించటం రచయిత మొదటి కర్తవ్యం. అనవసరపు కామాలు, అడ్డదిడ్డంగా వాక్యాల నిర్మాణం కథాగమనానికి నిరంతరం అడ్డం పడుతుంటాయి. అక్కడక్కడా సాఫీగా సాగిపోయినట్టు అనిపించినా ఒక్క క్షణం ఆగి ఈ వాక్యానికి అర్థం ఏవిటని ఆలోచించి చూడండి - సరైన సమాధానం దొరికితే ఒట్టు.
2. భాష మీద పట్టు: కొన్నాళ్ళ క్రితం నందిని అని ఒక కథ వచ్చింది. దానికి ఏవో పోటీల్లో బహుమతులొచ్చాయి, దాని మీద బోలెడు చర్చ జరిగింది. ఆ కథ చివర్లో రచయిత "చెలియలి కట్ట" అనే మాటని అసందర్భంగా వాడారు. ప్రముఖ కవీ విమర్శకుడూ వాడ్రేవు చినవీరభద్రుడు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఒక విమర్శ రాస్తూ ఈ అసందర్భ ప్రయోగాన్ని చేటలో వేసి చెరిగి వొదిలి పెట్టారు. రచన అంటే మాటలతోనే కదా పని? వాడుతున్న మాటలకి అర్థాలే తెలియక పోతే? ఇంక ఆ కథలో రసమేమి పుడుతుంది? తాళంచెవుల గుత్తి గుమ్మటంలా ఉంది అంటే అర్థం తెలుసా మీకు?
3. పాత్రలకుండాల్సిన స్వేఛ్ఛ: పాత్రలంటే రచయిత బానిసలు కాదు. పాత్రకి రచయిత చెయ్యాల్సిందల్లా - కథకి అవసరమైన మట్టుకి - ఒక వ్యక్తిత్వం ఇచ్చి వాళ్ళ మానాన్న వొదిలెయ్యడమే - అంతే చెయ్యాల్సింది. చెయ్యి పట్టుకుని నడిపించ కూడదు, చెవి మెలేసి గుంజీళ్ళు తీయించ కూడదు. విటుడైనవాడు భావుకుడు కాకూడదనేం లేదు - కానీ రచయిత చెప్పదల్చుకున్న కథలో ఆ విటత్వానికీ ఆ భావుకతకీ ఏమీ పొంతన లేదు. ఇంకా ఆ భార్యామణి గారేంటి - ఆమె సంగతి అసలు ఎత్తకుండా ఉంటే బెటరు.
4. పాఠకుల మీద గౌరవం: ఇది అన్నిటికంటే ముఖ్యం. రచయితకి కలం (పోనీ కీబోర్డు) ముట్టుకోగానే వీరావేశం వచ్చేస్తుంది - తనకి తెలిసిందంతా చెప్పెయ్యాలని, తన తెలివితేటలన్నీ గుప్పించెయ్యాలని. బాధ్యత తెలిసిన రచయిత ఈ పైత్యాన్ని తమాయించుకుని పాఠకుల తెలివికి కూడ కాస్త గౌరవం ఇస్తాడు.

నాకు చిర్రెత్తించిన ఆ కథలు ఇవి: అతి సర్వత్ర ..., ఇద్దరు దుర్మార్గులు

Thursday, July 26, 2007

హేరీ పాటర్లో ఏముంది?

టిప్పింగ్ పాయింట్ అని ఒక పుస్తకముంది, మాల్కం గ్లాడ్వెల్ అనే అతను రాశాడు - ఆలోచనలు, ఉద్యమాలు, ఫేషన్లు - విషయం ఏదైనా ఎట్లా అది అశేష జనాన్ని ఉర్రూతలూగించే స్థాయికి చేరతుంది అనేది ఆ పుస్తకంలో చర్చించాడతను.
హేరీ పాటర్ పుస్తకాల పరంపర జనాన్ని కేవలం ఉర్రూతలూగించడమే కాదు ఒక ప్రభంజనమే అయి కూర్చున్నదివ్వాళ.

హేరీ పాటర్లో ఏముంది ప్రపంచ వ్యాప్తిగా ఇంతమంది జనాన్ని ఆకట్టుకోవడానికి? ఏమన్నా ఉందా అసలు? లేక ఇదంతా మార్కెటింగ్ మాయేనా?

మొన్ననే ఏడో పుస్తకం చదివిన శుభసందర్భంలో ఒక సారి వెనక్కి తెరిగి చూసుకుని - ఈ పరంపర నాకెందుకు నచ్చిందో నెమరు వేసుకుంటున్నాను.

సృజనాత్మకత: మన ప్రపంచంతో సమానాంతరంగా వర్ధిల్లుతున్న ఒక మాయా ప్రపంచాన్ని ఊహించడం. ఆ మాయా ప్రపంచం "ఏదైనా జరగొచ్చిక్కడ" అనేలాంటి కలల ప్రపంచం కాదు, దానికుండే సూత్రాలు, నియమాలు దానికున్నై. అందరూ మాంత్రికులే ఐనా అందరు మాంత్రికులూ అన్ని పనులూ సమాన ప్రతిభతో చెయ్యలేరు. ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత.

మరి కొన్ని తమాషా అంశాలు -
* పిల్లమాంత్రికుల కోసం ఒక బడి - అందులో ఉండే నియమాలు, పిల్లలు చదివే పాఠ్యాంశాలు, వాళ్ళకొచ్చే పనిష్మెంట్లు, ఎసైన్మెంట్లు, పరీక్షలు, పోటీలు
* ఒక మంత్రి, ఒక సచివాలయము, దాని శాఖలు
* రవాణా - ఫ్లూ నెట్వర్కు, చీపుళ్ళు, అంతర్థానం, బస్సు, కొండొకచో ఎగిరే కారు, బైకు
* ఇతరాలు - గుడ్లగూబల తపాలా సర్వీసు, బొమ్మల్లో మనుషులు కదలడం, 9 3/4 ప్లాట్‌ఫాం, మొ.
* క్విడ్డిచ్ - enough said


పాత్రలు: ముఖ్య పాత్రలన్నీ తమవైన వ్యక్తిత్వాలతో నమ్మదగినట్టు ఉన్నాయి.

తప్పు చేసినంత మాత్రాన పిల్లలు చెడ్డవాళ్ళు కాదు - ఆ తప్పుల్నించే పిల్లలు నేర్చుకుంటారు అనే నమ్మకం మూర్తీభవించిన గురువు ఆల్బస్ డంబుల్‌డోర్.

తను చేసిన ప్రమాణానికి కట్టుబడి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకి అతీతంగా, ధైర్యంగా పనిచేసిన దీక్షాపరుడు సెవెరస్ స్నేప్.

తానెవరో తనకే తెలియని స్థితిలో తలతిరిగే ప్రఖ్యాతీ తలకి మించిన భారమూ తలమీద పడినా - అప్పుడప్పుడూ దిక్కుతోచని అయోమయం కలవరపెట్టినా - ఉన్న బలాన్ని ఉపయోగించుకుని గమ్యాన్ని చేరుకున్న నాయకుడు హేరీ పాటర్.

తమ స్నేహితుడికి అన్ని వేళలా తోడు నిలిచిన నెవిల్, హర్మయనీ, రోనల్డ్.

అతిహీన స్థితినుండి లేచి, కేవలం తన శక్తియుక్తులతో మంత్రతంత్రాల్లో గొప్ప విజయాలు సాధించినా, ప్రపంచాన్ని తన పాదాక్రాంతమొనరించుకున్నా, జీవితంలో ప్రేమించడమే అతిగొప్ప బలం అని తెలుసుకోలేక నశించిపోయిన విలన్ టాం రిడిల్ ఎలియాస్ లార్డ్ వాల్డ్‌మోర్ట్.

ముఖ్యమైన సహాయక పాత్రలు వీస్లీ కుటుంబం, సహాధ్యాయులు, ఉపాధ్యాయులు, మాంత్రిక మంత్రి - ప్రతి ఒక్కరూ ఒక విశిష్ట వ్యక్తిత్వంతో నిలబడేవారే.

విలువలు: అక్కడక్కడా గట్టిగా నెత్తిన మొట్టికాయ వేసి చెప్పినా, నీతులు విలువలు వంటి విలువైన జీవిత పాఠాలు కథలో అంతర్గతంగా ఒదిగి ఉన్నై.
మనకి ప్రముఖంగా కనపడేది స్నేహం విలువ. పదకొండేళ్ళ వయసులో మొదటిసారి బడికెళ్ళడానికి రైలెక్కినప్పుడు కలుసుకున్నప్పుడు మొదలైన హేరీ రాన్ హర్మయనీల స్నేహం, ఎదురైన ప్రతి సమస్యతోనూ ఇంకా బలపడి చివరి పుస్తకంలో వాళ్ళు ఒకరి మీద ఒకరు instinctiveగా ఆధారపడే స్థాయికి ఎదుగుతుంది.

ఇంకా సాహసం, ఆత్మవిశ్వాసం, నమ్మకం, పట్టుదల, సాధన, అపోహలని అధిగమించడం, ... ఇలా ఏడు పుస్తకాల్లోని ప్రతి ముఖ్య సంఘటన నించీ ఏదో ఒక మంచి విలువ బయటపడుతూనే ఉంది.

కథనం, కథాగమనం: ముఖ్య పాత్రలైన హేరీ, లార్డ్ వాళ్డ్‌మోర్ట్, డంబుల్డోర్ల వెనుక కథలు, వారి మధ్య ఉత్పన్నమైన సంక్లిష్ట త్రికోణ సంబంధాన్ని అంచెలంచెలుగా ఏడు సంపుటాల్లో, ఎక్కడా కథామర్యాద చెడకుండా క్రమంలో ఆవిష్కరించడంలో రౌలింగ్ ప్రతిభ కనిపిస్తుంది. ప్రతి పుస్తకం చదివినప్పుడూ దాని కథనంలో కథాగమనంలో విమర్శించడానికి చాలా విషయాలో కనిపిస్తై - అక్కడక్కడా బోరు కొట్టిందనో, మరీ పొడుగ్గా ఉందనో, ఇట్లా .. కానీ ఏడు పుస్తకాల మీదా మూల కథ ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందని చూసుకుంటే ఎంత విమర్శకులైనా సంతృప్తితో తలపంకించక తప్పదు.

ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన ఇంత వెల్లువ వచ్చేస్తుందా? ఇంత హడావుడీ ప్రభంజనమూ అవసరమా?

అక్కడే - టిప్పింగ్ పాయింట్ పుస్తకంలో చెప్పిన నాలుగు కీలకమైన అంశాలు పనిచేశాయని నా నమ్మకం.


ముగ్గురు వక్తలు - 1

పోయిన ఆదివారం మా డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితికి ముగ్గురు విశిష్ఠ అతిథులు విచ్చేసి ప్రసంగించారు. చక్కని వేసవి రోజు, వాతావరణం మరి వేడిగా కాకుండా అప్పుడప్పుడూ చల్లటి పిల్లగాలులు వీస్తూ ఎంతో ఆహ్లాద కరంగా ఉంది. గాల్ఫు ఆడుకుంటూనో, పిక్నిక్కులు చేసుకుంటూనో హాయిగా గడిపెయ్యడానికి అనువైనది. ఐనా ముప్ఫై మందికంటే ఎక్కువ తెలుగు సాహిత్యాభిమానులు దాదాపు నాలుగ్గంటలసేపు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

శ్రీ అట్లూరి రామమోహన రావుగారు నవోదయ పబ్లిషర్స్ అధినేత. నవోదయ వారి జీవితంతో ఎంత ముడిపడి ఉన్నదంటే చాలామంది తెలుగు సాహిత్యాభిమానులకి ఆయన "నవోదయ" రామమోహన రావుగానే తెలుసు. తెలుగు పుస్తక పాఠకులకి బాపు-రమణల్ని, నండూరి రామమోహనరావుని, సత్యం శంకరమంచిని, శ్రీరమణని అందించిన ఘనత నవోదయ వారిది. రామమోహన రావుగారు రాష్ట్ర ప్రచురణ కర్తల పుస్తక విక్రేతల సంఘంలో వివిధ పదవుల్లో క్రియా శీలక పాత్ర పోషించారు. విజయవాడ పుస్తకాల పండుగ (Book Festival) ఏటేటా జరిగేందుకు పునాది వేసి దాని అభివృద్ధికి కృషి చేశారు. ఫలితంగా నేడు విజయవాడ పుస్తకాల పండగా దక్షిణ భారతదేశంలో మేటి పుస్తక ప్రదర్శనగా ఎదిగింది. గత జనవరిలో జరిగిన 18వ పండుగని గురించి ఇక్కడ చదవచ్చు.

"నేను మాటల వాణ్ణి కాదు, చేతల వాణ్ణి" అని స్వపరిచయం చేసుకున్న రామమోహన రావు గారు తెలుగు పుస్తక ప్రచురణ చరిత్రని సింహావలోకనం చేసి, ప్రచురణ వ్యాపారంలో తన అనుభవాలను కొన్నిటిని పంచుకుని, ప్రచురణ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల్ని టూకీగా ప్రస్తావించారు. ప్రచురణ చరిత్రలో వావిళ్ళ వారు, కాశీనాథుని వారి వంటి విద్వాంసులు తప్ప ప్రచురణ కర్తలు తొంభై శాతం మంది పెద్దగా చదువుకోలేదని, అంచేత చాలా కాలం తెలుగు పుస్తకాలు భయంకరమైన అచ్చుతప్పులతో, నిర్లక్ష్యంగా చేసిన ముద్రణతో వెలువడుతుండేవి. తెలుగులో పుస్తక ప్రచురణ ఒక వ్యాపారంగా ఏదో ఒక కుటుంబం బతికే ఉపాధి చూపించిందిగాని వ్యాపించే వ్యాపారంగా, ఒక పరిశ్రమగా ఏనాడూ ఎదగ లేదు. ఇప్పటికీ పుస్తక ప్రచురణకి ఒక పరిశ్రమగా గుర్తింపు లేకపోవడం ఆందోళన పడవలసిన విషయం. వ్యాపారం వృద్ధి చెందటం దృష్ట్యా బెంగాలీ అనువాద నవలలు, డిటెక్టివ్ నవలలు, 60లలో యద్దనపూడి మొ. రచయిత్రుల నవలలకి పెరిగిన ఆదరణ, ఆ తరవాత 80లలో యండమూరి మార్కు సంచలనాత్మక నవలలు కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాయి. 90లలో టీవీ వ్యాప్తి పుస్తక పఠనాన్ని విపరీతంగా దెబ్బతీసింది. దీనికి తోడు పెరుగుతున్న ఉద్యోగాల చదువుల వత్తిడులు ఎప్పటికప్పుడు విరామసమయాన్ని ఇంకా కుదించేశాయి. మళ్ళీ కొత్త సహస్రాబ్దిలో - టీవీ అప్పటికే మొహం మొత్తి - పుస్తకాల మీద ఆసక్తి మళ్ళీ పెరుగుత్న్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి పాఠకులు, కల్పనా సాహిత్యానికంటే వ్యక్తిత్వ వికాసం, జీవితంలో విజయం సాధించడం వంటి ఉద్బోధనా సాహిత్యం ఎక్కువగా చదువుతున్నారు.

పుస్తక ప్రచురణకి పరిశ్రమగా గుర్తింపు (Industry Status) లేకపోవడం ఒక పెద్ద ఆటంకం. ఇతర వ్యాపారాలకు ప్రభుత్వం అందించే సదుపాయాలు, సబ్సిడీలు పబ్లిషర్లకి అందుబాటులో లేవు. పాఠ్య పుస్తకాల పంపిణీని పుస్తక విక్రేతల నుంచి లాగివేసుకుని ప్రభుత్వమే పంపిణీ చెయ్యడంతో కొత్త సహాయమేమీ లేకపోగా ఉన్నది కూడా ఊడింది. పురాతనమైన పుస్తక పంపిణీ వ్యవస్థ కూడా ఎదుగుదలకి ఆటంకంగా ఉన్నది.

ఇంత ముసురులోనూ కొన్ని ఆశా కిరణాలు మెరవక పోలేదు. ఎన్నారై సాహిత్యాభిమాని ఒకావిడ క్రమం తప్పకుండా నవోదయ నించి తనకిష్టమైన పుస్తకాలు తెప్పించుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆమె కీ.శే. మహీధర రామమోహన రావు గారి కొల్లాయిగట్టితే నేమి నవల కావాలని అడిగితే చాలా కాలంగా ప్రింటులో లేదని తెలిసింది. ఆ పుస్తకం తిరిగి ప్రచురించడానికి అవసరమైన పెట్టుబడి నిచ్చి ఆమె నవోదయ ద్వారా ప్రచురింప చేశారు. తన వాటా తిరిగి తీసుకోకుండా దాన్ని ఇతర పుస్తకాల ప్రచురణకి వినియోగించమని చెప్పారు. శ్రీరమణ మిథునం కథల సంపుటి వెలువడిన కొన్నాళ్ళకి హైదరాబాదు పారిశ్రామిక వేత్త ఒకాయన వంద కాపీలు ఆర్డరిచ్చారు. నెల రోజుల్లో ఇంకో వంద కాపీలకి .. మళ్ళి నేల ఇంకో వంద .. తన వ్యాపార జీవితంలో ఎదురయ్యే మిత్రులకీ, అధికారులకీ ఆయన ఈ పుస్తకం బహుమతిగా ఇస్తూ వచ్చారు - అలా మొత్తానికి ఆయన ఎనిమిది వందల కాపీలు కొన్నారని చెప్పారు రామమోహన రావు గారు. వారి నవోదయ కలకాలం వర్ధిల్లుతూ ఈ కొత్తయుగంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం.

రెండవ భాగం త్వరలోనే ..

శ్రీ వేంకటేశ్వర మహత్యం

ఈ చిత్రాన్ని గురించి బోలెడు రాయాలనుంది గానీ సమయం లేదు - అందుకని ఈ బుల్లి టపా. నా చిన్నప్పుడు పౌరాణికాలు, జానపదాలు వొదిలి పెట్టకుండా చూసేవాణ్ణి కానీ మొత్తానికి ఈ సినిమాని ఎలాగో మిస్సయ్యాను. మొన్నీ మధ్యనే డిస్కు అద్దెకి తెచ్చి చూశాను.
గట్టిగా చెప్పాల్సిన ఒకే ఒక్క మాట - అద్భుతమైన సంగీతం!
సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు తన జన్మ ధన్యం చేసుకుని ప్రేక్షక శ్రోతల జన్మలు పావనం చేశాడు.
ప్రతి పాటా, ప్రతి పద్యము చక్కటి సంగీతంతో తొణికిసలాడుతూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం పదిహేను నిమిషాలకి పైన సాగే రమణీయ ఘట్టం - పసుపు కొమ్ములు దంచడం దగ్గర్నించీ, అప్పగింతలు పూర్తై కొత్త కోడలికి అత్తారింట్లో దిష్టి తియ్యడం వరకూ ఒక నదిలా సాగే రాగాల మాలిక.
మరి కొన్ని విశేషాలు.
శ్రీ మహాలక్ష్మి గా ఎస్. వరలక్ష్మి తన పాటలు తనే పాడుకున్నారు.
వాకుళా దేవిగా నటించిన శాంతకుమారి కి గాత్రం అందించింది ఎవరో. లేక ఆమెకూడా తన పాటలు తనే పాడుకున్నారా? "ఎన్నినాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా" - పాటలో ధ్వనించే భక్తిభావం అద్భుతం.
చివరలో అమరగాయకుడు ఘంటసాల శ్రీవారి సన్నిధిలో కూర్చుని రీతిగౌళ రాగంలో పాడిన "శేష శైలావాస శ్రీవేంకటేశా" - షడ్రసోపేతమైన భోజనం తరవాత మిఠాయి కిళ్ళీ వేసుకున్నట్టు - తల్చుకుంటేనే నా వొళ్ళు గగుర్పొడుస్తోంది. శ్రీనివాసునిగా అన్నగారు ఛ్ఛాలా బావున్నారు.
తా.క.: ఒక ప్రశ్న. డీవీడి లో నించి చిన్న చిన్న విడియో క్లిప్పులు కాపీ చెయ్యటం ఎలాగో ఎవరికైనా తెలుసా??

Saturday, July 21, 2007

వేలం వెర్రి

నిన్న మా స్నేహితురాలొకరు కాల్చేశారు - అర్ధరాత్రి స్థానిక పుస్తకాల కొట్టు దగ్గిర పడిగాపులు పడేందుకు వస్తారా అని అడగటానికి. ఎందుకంటా పడిగాపులూ? హేరీ పాటర్ ఏడో మరియు ఆఖరు పుస్తకం విడుదలకి. నాకంత ఓపిక లేదు తల్లీ - ఐనా నేను అమెజాన్ లో ముందే ఆర్డరిచ్చాను అని చెప్పాను.

పొద్దున లేచి టీ కలుపుకుందామని చూస్తే పాలు నిండుకున్నై. మా ఇంటెనకాల ఉండే సూపర్ మార్కెట్టుకెళ్ళా. అక్కడ ముందరి వరసలోనే ఒక పెద్ద రాశి పోసి ఉన్నై హేరీ పాటర్ ఏడో పుస్తకం ప్రతులు - 40% తగ్గింపు అనే పేద్ద అక్షరాల ప్రకటనతో సహా.

నాకు నవ్వొచ్చింది - ఇంత మాత్రం దానికి అమెజాన్ లో ముందస్తు ఆర్డర్లెందుకూ, పుస్తకాల కొట్టు ముందు అర్ధరాత్రి పడిగాపులు పడటమెందుకూ .. ఇంటి పక్కన సూపరు మార్కెట్లో కొనుక్కునే దానికి?

నాకు అర్థం కాని ఇంకో విషయం - విడుదలతోనే అంత తగ్గింపు ధర ఎందుకు? దానికి ముందసలు ఒక ధర నిర్ణయించడమెందుకు, మళ్ళీ దాన్ని 40% తగ్గించడమెందుకు?

ఏంటో అంతా వేలం వెర్రి!

అద్సరే ఇంతకీ ఈ అమెజాన్ వెధవ నా ప్రతి ఎప్పుడు పంపిస్తాడో!

అపురూపమైన నాట్య ప్రదర్శన

గత వారాంతంలో మా ఊళ్ళో అద్భుతమూ అపూర్వమూ ఐన ఒక నాట్య ప్రదర్శన తిలకించే భాగ్యం కలిగింది. బెంగుళూరుకి చెందిన Articulate అనే సంస్థ వారు పదమూడు మంది కళాకారులతో పంచవక్త్రం అనే నృత్యనాటిక, మరికొన్ని భరత నాట్యాంశాలు ప్రదర్శించారు.

ఈ ప్రదర్శన మీ ఊరి దగ్గర్లో జరుగుతుంటే తప్పక చూడండి. మీకు భారతీయ సాంప్రదాయ సంగీతం, నాట్యాల మీద ఏ మాత్రం ఆసక్తి లేకపోయినా సరే, వెళ్ళి చూడండి. మీరు ముగ్ధులౌతారని నా హామీ. వారి అమెరికా పర్యటన వివరాలు పైన ఇచ్చిన లంకెలో ఉన్నాయి.

ఈ ప్రదర్శన ఎన్నో విధాలుగా విలక్షణమైనది.

ఈ బృందంలో ఐదుగురు సభ్యులు అంధులు. అన్ని ఇంద్రియాలు, అవయవాలు సవ్యంగా పనిచేస్తుండగానే భరతనాట్యం వంటి సాంప్రదాయ కళలు నేర్వడం చాలా కష్టం. నిష్ణాతులవడం ఇంకా కష్టం. కర్ణాటకలో, సాంప్రదాయ విద్యలకి ఏ మాత్రం సంబంధం లేని నిరుపేద కుటుంబాలలో పుట్టి, చిన్న వయసులోనే వివిధ జాడ్యాల వలన, తగిన వైద్య సదుపాయం లేక చూపు కోల్పోయిన ఈ ఐదుగురు యువకులు నేడు భరతనాట్యంలో కాకలు తీరి దేశ విదేశాల ప్రేక్షకులతో సెబాసనిపించు కుంటున్నారు. వేరెవరో జబ్బపట్టుకుని వేదిక మీదికి తీసుకొచ్చి నిలబడితే, నాలుగు అడవులు వేసి ఏదో చేశామనిపించటం కాదు. ఈ యువక బృందం ప్రదర్శించినది అగ్రశ్రేణి నృత్యం. ప్రతి అంశానికి, ఒకరి వెనుక ఒకరో, లేక బృందం గానో సంగీతానికి తగిన అడుగులు వేస్తూ ప్రవేశించడం, ప్రదర్శన జరిగినంత సేపూ వేదిక మీద వేర్వేరు అమరికలలో నిరంతరం మారుతున్న వ్యూహాలలో చలిస్తూ, వేసే ప్రతి అడుగులో, పట్టే ప్రతి ముద్రలో, అభినయించే ప్రతి భంగిమలో అనంతమైన ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతుండగా నర్తించారు వారు. భూసె గౌడ, రాముడు, శివస్వామి, గురుప్రసాద్, సతీష్ - చిక్కని చక్కని నాట్యాన్ని ప్రదర్శించి అడుగడుగునా ప్రేక్షకుల మన్ననలకు పాత్రులైనారు.

విఘ్నేశ్వరునికీ భూదేవికీ నమస్కృతులిడి సాంప్రదాయకమైన తోడాయమంగళంతో ప్రదర్శన ప్రారంభించారు. నారాయణ తే నమో నమో, శరణు శరణు సురేంద్ర సన్నుత - ఇత్యాది అన్నమయ్య భక్తి పద మాలికలతో విష్ణుదేవుని వివిధ రూపాలలో స్తుతించి మంగళాచరణం చేస్తుంది ఈ అంశం. ఐదుగురు అంధ కళాకారులతో సరికొత్తవిధంగా నాట్యరచన (కొరియాగ్రఫీ) చేశారు ఈ అంశానికి. కాళీయ మర్దన కృష్ణుడు, లక్ష్మణ సహిత రాముడు, శేషశాయి, వేంకటేశ్వరుడు మొదలైన విష్ణు రూపాలను సందర్భోచితంగా ప్రత్యక్షం చేశారు ఈ ఐదుగురు అంధ కళాకారులు (ఐ.అం.క.).

అటుపైన తిల్లానా ప్రదర్శించారు. వివిధ లయ గతులతో క్లిష్టమైన జతులతో నృత్తానికి పెద్దపీట వేసి కళాకారుని సౌష్ఠవానికి, ఓర్పుకి పరీక్షపెట్టే అంశం తిల్లానా నృత్యం. మన ఐ.అం.క. దీన్ని కూడా ఎంతో ప్రతిభతో నిర్వహించారు.

పంచవక్త్రం - సుమారు యాభై నిమిషాల నృత్య రూపకం. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచ ముఖములుగల పరమశివ తత్త్వాన్ని ఆవిష్కరించినది. సృష్ట్యాది లో శూన్యము నుండి శివలింగము ఆవిర్భవించినది - ఇది ఓంకార రూపం. దీని నుండి శివపంచాక్షరీ మంత్రము జనించినది. మంత్రములోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శివుని సృష్టించినది. ఒక్కొక్క శివుడు ఒక్కొక్క శక్తితో కలసి పంచభూతములలోని ఒక్కొక్క భూతము (element) ను సృష్టించినాడు. ఇవన్నీ ఏకమై అర్ధనారీశ్వర రూపముగా అవతరించి యావద్ సృష్టికీ రూప కల్పన చెయ్యడం - సూక్ష్మంగా ఇదీ కథ.

అష్టదిక్కులను దిక్పాలకులను ప్రార్థించే నాందితో రూపకం మొదలైంది. చేతుల్లో ధ్వజము, పూర్ణకుంభము, పువ్వుల పళ్ళెం మొదలైన ఆహ్వాన సూచికలను ధరించి ఐ.అం.క. ఒక బాణం రూపంలో నిలుచుండి ఒకటొకటిగా ఎనిమిది దిక్కులకూ తిరిగి ఆవాహన చేశారు. వేద మంత్రోఛ్ఛారణ నేపథ్యంలో శూన్యంనుండి పంచ ముఖమైన శివలింగం అవతరించడం అద్భుతంగా రూపించారు. ఈ దృశ్యం కరిగిపోగానే రంగానికి వెనుకగా ఉన్న ఒక మెట్టు మీద సద్యోజాత శివుడు ప్రత్యక్షమైనాడు. "సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమో నమః" అనే వేదమంత్రం ఆయన్ను ఆవాహన చేసింది. కర్ణాటక పద్ధతిలో వాద్య సంగీతం మొదలైంది. వయ్యారంగా వచ్చి పరాశక్తి అతనితో చేరగా ఇద్దరూ భరతనాట్య రీతుల్లో నాట్యము సాగించారు. వారి సృజనతో పృథ్వీ భూతం ఉత్పన్నమైంది. శక్తీ శివులు రంగం వెనుకభాగంలో కొలువు తీరగా ఐ.అం.క. ముందుభాగంలో ప్రవేశించి పృథ్వి యొక్క అనేక లక్షణాలను ప్రత్యక్షము చేస్తూ వాద్యసంగీతానికి అనుగుణంగా నర్తించారు.

ఇదే పద్ధతిలో మిగిలిన నాలుగు భూతాల సృష్టి క్రమాన్ని ప్రదర్శించారు..
వామదేవ .. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః .. ఆది శక్తి .. జల భూతం .. కూచిపూడి సాంప్రదాయం
అఘోర .. అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోర తరేభ్యః .. ఇఛ్ఛా శక్తి .. అగ్ని భూతం .. యక్షగాన సాంప్రదాయం
తత్పురుష .. తత్పురుషాయ విద్మహే మహా దేవాయ ధీమహి .. క్రియా శక్తి .. వాయు భూతం .. కథక్ పద్ధతి
ఈశాన .. ఈశానస్సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వ భూతానాం .. జ్ఞాన శక్తి .. ఆకాశ భూతం .. పేరిణి తాండవ సాంప్రదాయం

ప్రకృతి పురుష సంయుక్త రూపముగా అర్ధనారీశ్వరుడు అవతరించి తాండవ నృత్యము సల్పి తన డమరు ధ్వని లోనుండి "అ ఇ ఉ ణృలుక్" శబ్దమాలికగా మాహేశ్వరాణి సూత్రాణి జాలువారగా సృష్టి కార్యక్రమం మొదలైంది.

ఆది దేవుడైన పరమశివునికి సృష్టి అంతా ప్రణమిల్లడంతో రూపకం ముగిసింది.

భరత శాస్త్రంలో నటరాజైన శివుణ్ణి "ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాఞ్మయం ఆహార్యం చంద్ర తారాదితం నమః సాత్వికం శివం" అని అభినయములోని నాలుగు ముఖ్యాంశాలైన ఆంగిక (రంగస్థలం), వాచిక (మాట, పాట, సంగీతం), ఆహార్య (వేషధారణ, అలంకారము), సాత్విక (నటుని హావ భావములు) మూర్తిగా స్తుతిస్తారు. పరమశివుని సర్వ సృష్టికారకునిగా ప్రత్యక్షము చేసిన ఈ రూపకము ఈ నాలుగు అంశాలలోనూ పరిపూర్ణత సాధించడం ఎంతో సమంజసంగా ఉంది. ప్రతి చిన్న విషయంలోనూ ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధ తీసుకుని పనిచేశారనిపిస్తుంది. రంగాలంకరణ, లైటింగ్ డిజైనుని కథలోని సన్నివేశాన్ని ఇనుమడింప చేసే విధంగా ఉపయోగించుకున్నారు. ఉపయోగించిన వేద మంత్రాలు, ఆయా నృత్య రీతులకి సంబంధించిన వాద్య సంగీతములు, గాత్ర సంగీతములు శ్రావ్యంగా ఉన్నాయి, ఎక్కడా ఉచ్ఛారణ దోషాలు లేకుండా. శివ, శక్తి, అర్ధనారీశ్వరుల వేషధారణల అందం చెప్పనలవి గాదు - చూడ వలసిందే. ఒక్కొక్క భూత లక్షణాన్ని నటించడానికి ఐ.అం.క. ప్రతి దృశ్యానికి దుస్తులు మార్చుకుని రావడం ప్రేక్షకులని విస్మయ పరిచింది. సరే ఇక నాట్యకారుల నాట్యకళా కౌశలం గురించి చెప్పేదేముంది.

ఇదంతా ఒక ఎత్తు, అర్ధనారీశ్వరుడిగా ఈ సంస్థ సంచాలకులు శ్రీ మైసూరు నాగరాజు గారి నటన ఒక ఎత్తు. దీనికి నాత్య రచన, నేపథ్య సంగీతము ఉత్తరప్రదేశులో చెలామణి అయ్యే "బహురూపియా" (అంటే బహువేష ధారులు) జానపద కళా పద్ధతిలో ఉంది. నడక అడుగులో, చేతి విదిలింపులో, కనుబొమల కదిలింపులో నవరసాలొలికించ గల ప్రజ్ఞ నాగరాజు గారిది. కుడివైపు పౌరుష భరితమైన తాండవ రాజసం, ఎడమ వైపు మృదు పద లాస్య లాలిత్యం సమపాళ్ళలో ఆవిష్కరించారు. సృష్టి తాండవానికి నేపథ్యంగా మాహేశ్వరాణి సూత్రాణి పఠించడం సృజనాత్మకతకి పరాకాష్ఠ.

కొన్ని బొమ్మలు విడియో ముక్కలు వారి గూటిలో చూడవచ్చు.
ఈ ప్రదర్శన మీ వూరి దగ్గర్లో జరుగుతుంటే తప్పక చూడండి. వారి ప్రదర్శనల వివరాలు కూడా వారి గూటిలోనే ఉన్నాయి.

Tuesday, July 17, 2007

పద్యాల మణిహారం

1993 - 1994 ప్రాంతాల్లో అనుకుంటా నాకు ఈ మెయిలు వాడకం మొదటి సారిగా తెలిసింది. దాంతో పాటే uunet newsgroups కూడా పరిచయమైనాయి. మొదట్లో soc.culture.indian అని ఉండేది. మన తమిళ సోదరులు, మరాఠీ సోదరులు, ఇతరత్రా సోదరులు తమ తమ గుంపులు ఏర్పాటు చేసుకోవడం మొదలయ్యి , మన వాళ్ళు కూడా మాకో గుంపు కావాలని ఉద్యమించి soc.culture.indian.telugu ని మొదలెట్టారు. దీన్నే ముద్దుగా స్కిట్ అని పిలుచుకునే వాళ్ళం. ఈ గుంపులో బలే మంచి సందడిగా ఉండేది. సందేహాలు అడగటాలు, తీర్చటాలు, ఇతరుల తప్పులు దిద్దటాలు, తెలుగు రాజకీయ మరియూ సినిమా వార్తలు, సాహిత్య చర్చలు, వాదోపవాదాలు , జ్వాలా యుద్ధాలు (flame wars) .. మధ్య మధ్య శాన్ ఫ్రాన్సిస్కో నించి హైదరబాదు వెళ్ళేందుకు మా అమ్మకి తోడు కావాలని వేడికోళ్ళు .. ఇలా. ఈ సందర్భంలోనే మనం ఇప్పటికీ వాడుతున్న RTS పుట్టింది - పేజీలకి పేజీలు తెలుగుని ఆంగ్ల లిపిలో రాసేవాళ్ళం, చదివే వాళ్ళం. ఈ గుంపులోనే ఎంతో మంది పండితులు విద్వాంసులైన వారి పరిచయ భాగ్యం కలిగింది. సమకాలీనులు కూడా చాలా మంది స్నేహితులయ్యారు.

అంతర్జాలం ఈ బాల్యస్థితిలో ఉండగానే తెలుగు ప్రభంజనం సృష్టించిన ఆద్యుల్లో డా. పిల్లలమర్రి శివరామకృష్ణ గారు ముఖ్యులు. సహృదయులు, సరసులు, సాహిత్యంలో మంచి అభిరుచి ఉన్నవారు. వీరి టపాలన్నీ ఏదో ఒక చమత్కారంతో గిలిగింతలు పెడుతూ, ఒక్కోసారి పదునైన వ్యంగ్యంతో పొడుస్తూ ఉండేవి. తరవాతి రోజుల్లో స్కిట్‌లో పిచ్చిగోల ఎక్కువై సాహిత్య చర్చలకి వేరేగా తెలుసా గుంపు ఏర్పడడంలో వీరు క్రియాశీలక పాత్ర పోషించారు.

రామకృష్ణ గారు 1995 లో ప్రసిద్ధి చెందిన సీస పద్యాన్ని ఒక దాన్ని చెప్పమని సభ్యులతో ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఫలితాలివి.

మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే, మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ జనునె, తరంగిణులకు?
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే , కుటజములకు?
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే, సాంద్ర నీహారములకు?
అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి యితరంబు జేయ నేర్చు?
వినుత గుణ శీల, మాటలు వేయు నేల?
పోతన భాగవతము, ప్రహ్లాద చరిత్ర, 4 వోట్లు

కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగ
నురికిన నోర్వక యుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి గదల
జక్రంబు జేపట్టి చనుదెంచు రయమున బైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ
గరికి లంఘించు సిమ్హంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జున యనుచు మద్విశిఖవృష్టి
దెరలి చనుదెంచు దేవుండు నాకు దిక్కు
పోతన భాగవతము, ప్రథమ స్కంధము, భీష్ముని పై దండేత్తే శ్రీకృష్ణుని స్తుతి - 2 వోట్లు

ఈ తరువాతి పద్యాలన్నీ ఒక్కొక్క వోటు సంపాయించుకున్నాయి.
కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!
పోతన భాగవతము, ప్రహ్లాద చరిత్ర

పేర్వేర బొమ్మల పెండ్లిండ్ళు సేయుచు నబలల తోడ వియ్యంబు లందు
గుజ్జెన గూళ్ళను గొమరొప్ప వండించి, చెలులకు బెట్టించు జెలువు మెరసి
రమణీయ మందిరారామ దేశంబుల బువ్వుదీగెలకును బ్రోది వెట్టు
సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మ డోలికల నూగు
బాలికలతోడ జెలరేగి బంతు లాడు
శారికాకీర పంక్తికి జదువు సెప్పు
బర్హి సంఘములకు మురిపములు గరపు
మద మరాళంబులకు జూపు మంద గతులు
పోతన భాగవతము, రుక్మిణీ కళ్యాణము, రుక్మిణి బాల్యము

ఘుమఘుమా రావ సంకుల ఘోర జీమూత పటల సంచన్నాభ్ర భాగమగుచు
జటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానా విధ జంతు సంతాన యగుచు
జండ దిగ్-వేదండ తుండ నిభాఖండ వారి ధారా పూర్ణ వసుధ యగుచు
విద్యోత మనోగ్ర ఖద్యోత కిరణ జిద్విద్యుద్ద్యుతి-చ్చటా విభవ మగుచు
నడరి జడి గురియగ నిను డస్తమింప
భూరి నీరంధ్ర నిబిడా-ంధకార మేచి
సూచికా-భేద్యమై వస్తు గోచరంబు
గాని యట్లుండ మనము నవ్వాన దడిసి
పోతన భాగవతము, కుచేలోపాఖ్యానము, కృష్ణుడు కుచేలుడు తమ విద్యార్ధి దశను గుర్తు తెచ్చుకొనుట

ఎవ్వని వాకిట నిభమదపంకంబు రాజభూషణ రజోరాజి నడగు
నెవ్వని చారిత్ర మెల్ల లోకములకు నొజ్జయై వినయంబు నొరపు గరపు
నెవ్వని కడకంట నివ్వతిల్లెడు చూడ్కి మానిత సంపద లీనుచుండు
నెవ్వని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై గలయ బ్రాకు
నతడు భూరి ప్రతాప మహా ప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి
తలుడు, కేవల మర్త్యుడె ధర్మసుతుడు!
తిక్కన భారతము, విరాటపర్వము, ద్రౌపది భీమునితో ధర్మరాజు గొప్పను చెప్పుట

రామకృష్ణగారి టపా నకలు ఇక్కడ చూడచ్చు.

ఆ రోజుల్లో ఈ టపా ఎంత ప్రసిద్ధి చెందిందంటే తొలితరం తెలుగు వెబ్ సైట్లలో పెట్టుకున్నారు. మచ్చుకి ఇదొకటి, ఇది ఇంకోటి.

స్కిట్ ఆర్కైవులు ఇక్కడ ఉన్నాయి.

తెలుసా ఆర్కైవులు ఇక్కడ ఉన్నాయి.

Saturday, July 14, 2007

ముసిముసి నవ్వులు, హాహాకారాలు

ప్రేమించే పెళ్ళి చేసుకున్నా మొగుడూ పెళ్ళాలకి ఆత్మాభిమానాలు బిర్ర బిగుసుకుంటే ఇక ఆ సంసారం నవ్వులపాలవుతుందని "పెళ్ళైన కొత్తలో" ముసిముసి నవ్వుల్తో చెప్పింది. చక్కటి కథకి చక్కిలిగింతలు పెట్టే హాస్యాన్ని జోడించి చిక్కటి కథనంతో ఒక మంచి సినిమా మనకందించారు.

జగపతిబాబు మొహంలో నడివయసు కొట్టొచ్చినట్టు కనబడుతోంది - ఇక మీదట అతన్ని కుర్ర పాత్రల్లో నమ్మడం కష్టం. నాయిక ఎవరో "ప్రియమణి" ట - బాగా చేసింది. అసలీ మధ్య మన సినిమాల్లో కాస్త వ్యక్తిత్వం ఉన్న నాయిక పాత్రలేవీ? ఆ లెక్కన ఈ నాయిక పాత్రని బాగా మలిచినట్టే లెక్క. ఆ అమ్మాయి కూడా పాత్రకి న్యాయం చేసింది. మన సినిమాల్లో మామూలుగా సినిమా మొదటి భాగంలో నాయికలు ఎంత చిన్న గుడ్డ పీలికలు కట్టుకుని ఎలాంటి కోతి గంతులేసినా, "పెళ్ళి" అనంగానే చీరలు కట్టేసి ఒక ముత్తైదువల్లా నిలబెడతారు. పల్లెటూరి సన్నివేశాల్లో సందర్భోచితంగా తప్ప ఈ నాయికకి పెళ్ళైనా తన సహజ వేషధారణతో చూపించడం కొంచెం నమ్మేట్టుగా ఉంది.

నాయకుడికి లేని పురుషాహంకారాన్ని రగిలించి ఎగదోసే మిత్రుడిగా కృష్ణభగవాన్ రాణించాడు. అతని భార్యగా వేసినమ్మాయి - ఈమెని "క్షణం క్షణం" సినిమా నించీ చూస్తూనే ఉన్నాను, పేరు తెలీదు - చాలా సినిమాల్లో అక్క, వదిన, సహోద్యోగి పాత్రలు వేస్తూ ఉంటుంది - తనకి ఎంతో సామర్ధ్యం ఉన్నా కూడా భర్తకి అణిగిమణిగి ఉండే భార్యగా చాలా బాగా నటించింది. మొగుణ్ణి బానిసలా చూస్తూ, నాయికకి దాంపత్య పాఠాలు చెప్పే స్నేహితురాలిగా వేసినామె - ఈమె పేరు కూడా తెలీదు (ఇంతకు ముందు చూసిన గుర్తు లేదు) - మరీ బిగుసుకుపోయినట్టు ఉంది. గర్వంగా అతిశయంగా ఉండటమంటే కొయ్యముక్కలా బిగుసుకుపోవటం కాదు. సత్యభామ వేషంలో ఇదివరకు జమున, ఎస్. వరలక్ష్మి ల నటన చూపించి శిక్షణ ఇప్పించి ఉంటే బాగుండేది. ఆవిడ కొంగు చాటు మొగుడిగా సునిల్ నటన అద్భుతం. హాస్యనటనంటే ఏమాత్రం వ్యక్తిత్వం లేని వెకిలి పాత్రలు అన్నట్టున్న ఈ రోజుల్లో సునిల్ ఇలాంటి వైవిధ్యమున్న పాత్రని తీసుకుని పండించడం అభినందించాల్సిన విషయం. తాతయ్యగా కోట చాలా హుందాగా నటించాడు. బామ్మగా అలనాటి తార జయంతి చూడ్డానికి కొంచెం భయపెట్టేలా ఉన్నా నటన పరవాలేదనిపించింది.

మధ్యలో నాయికకి చిన్నప్పటి స్నేహితుడిగా ఒకతను ప్రత్యక్షమవుతాడు. అతనెవరో నృత్య దర్శకుడల్లే ఉంది, సాంబా నృత్యం బాగా చేశాడు. బ్రెజిలియన్ సాంబా, లాటినో సాల్సా నృత్యాలు మేళవించిన ఆ కొరియోగ్రఫీ, తగిన సంగీతాలు కలిసిన ఆ పాట (సంగీతం మాత్రమే - సాహిత్యం అసలు మాటలేమిటో అర్ధమై ఛస్తేగా?) బాగున్నాయి.

ఒక అమ్మాయి అబ్బాయి ఒకే ఇంట్లో కలిసున్నప్పుడు పరస్పరం ఆకర్షణ రేకెత్తే సందర్భాలు ఎన్నో ఎదురౌతాయి. అమ్మాయి తలంటి పోసుకుని బాల్కనీలో నించొని జుట్టార బెట్టుకోవటం, అబ్బాయి చేతుల్లేని బనీను వేసుకుని వ్యాయామం చెయ్యడం వంటి సన్నివేశాలు మంచి కళాత్మక దృష్టితో, ఎక్కడా ఎబ్బెట్టు అనిపించకుండా, చక్కటి అభిరుచితో తీశారు. ఇక తాతయ్యా, బామ్మా తంత్రం చేసి ఈ మొగుడూ పేళ్ళాలని లిటరల్‌గా ఒక మూటన కట్టి పొర్లు దణ్ణాలు పెట్టించడంతో ఇది పరాకాష్ఠకి చేరుతుంది. నవరసాల్లో శృంగారం రసరాజం అన్నారు మన పెద్దవాళ్ళు. ఆ తరవాత జనరంజకమైనది హాస్యం - దర్శక నిర్మాతలు మదన్ ఈ రెండిటినీ తగు పాళ్ళలో మేళవించి మంచి రొమాంటిక్ కామెడీ మనకందించారు. వేణుమాధవ్, బ్రహ్మానందం, కోవై సరళల అసందర్భపు హాస్యం లేకపోతే బాగుండేది.

ఆడవారిమాటలకు అర్థాలె వేరులే - మతి పోగొట్టుకోవడాలు, జుట్టు పీక్కోవడాలు, హాహాకారాలు - enough said.
తుదిపలుకు: త్రిషని నాయికగా తెలుగుతెర కెక్కించిన వాళ్ళని కొరత వెయ్యాలి.

Wednesday, July 4, 2007

సీసములు కావివి స్వర్ణ కుసుమములు

ఈ కాలపు బ్లాగ్జనులకి అసలు సీసం అంటే తెలుసో లేదో అని సంశయిస్తూనే ఈ ప్రశ్న అడిగాను సుమారు రెణ్ణెల్ల క్రితం.

అడగటం ఆలస్యం అన్నట్టు అద్భుతమైన సీస పద్యాల సుమవర్షం కురిపించారు మన బ్లాగ్విద్వన్మణులు. వ్యాఖ్యల్లో మిగిలిపోతే అందరికీ కనబడవు కదా - అందరితో ఈ చక్కటి పద్యాలని పంచుకోవాలని వీటిని వెలికి తీసి బ్లాగులో పెడుతున్నా. ఆనందించండి.

ఈ పద్యాల సొగసు, రచించిన మహాకవుల కావ్య సృజనాశక్తికీ, ఎంపిక చేసిన సభ్యుల చక్కటి అభిరుచికీ తార్కాణం. ఇవన్నీ ఇక్కడికి చేరుకోవటంలో నేను నిమిత్త మాత్రుణ్ణి మాత్రమే.

సీ. లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర, దీపాలు గగనాన త్రిప్పలేక
జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు, మామూలు మేరకు మడవలేక
పని మాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె, గడియారముల కీలు కదపలేక
అందాలు చింద నీలాకాశ వేదిపై, చుక్కల మ్రుగ్గులు చెక్కలేక

తే.గీ. ఎంత శ్రమ నొందుచుంటివో యేమొ స్వామి!
అడుగిడితి వెట్లొ నేడు మా గడపలోన;
గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు
అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను
సమర్పించినవారు: మురళి
కవి: కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి

సీ. మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు
లలిత రసాల పల్లవ ఖాది యై చొక్కు కోయిల సేరునె కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు

తే.గీ. అంబుజోదర దివ్య పాదారవింద
చింతనామృత పాన విశేష మత్త
చిత్త మేరీతి నితరంబు చేర నేర్చు
వినుత గుణశీల! మాటలు వేయు నేల
సమర్పించినవారు: శ్రీహర్ష
కవి: బమ్మెర పోతన (ఆంధ్ర మహాభాగవతము, ప్రహ్లాదచరిత్ర)

సీ. ప్రాణేశ! నీమంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల?
దయత! నీయధరామృతంబానగాలేని జిహ్వకు ఫలరససిద్ధి యేల?

ఆ.వె. నీరజాతనయన! నీ వనమాలికా
గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు?
సమర్పించినవారు: శ్రీరాం
కవి: బమ్మెర పోతన (ఆంధ్ర మహాభాగవతము, రుక్మిణీకళ్యాణము)

సీ. కూర్చుండ మా యింట కురిచీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా ప్రేమాంజలులె సమర్పింప నుంటి
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు హృదయమే చేతి కందీయనుంటి

తే.గీ. లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝురి చిందు నీ పదాంకముల యందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!
సమర్పించినవారు: సిరిసిరిమువ్వ
కవి: కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి

సీ. మృగనాభి యలదదు మృగరాజమధ్యమ జలకంబు లాడదు జలజగంధి
ముకురంబు జూడదు ముకురసన్నిభముఖి పువ్వులు దురుమదు పువ్వుబోడి
వనకేళిగోరదు వనజాతలోచన హంసంబు బెంపదు హంసగమన
లతల బోషింపదు లతికా లతికదేహ తొడవులు దొడవదు తొడవుతొడవు

ఆ.వె. తిలకమిడదు నుదుట దిలకినీ తిలకంబు
గమల గృహము జొరదు కమలహస్త
గౌరవించి తన్ను గరుణ గైకొన వన
మాలి రాడు మగవుమాలి యనుచు.

సమర్పించినవారు: రానారె
కవి: బమ్మెర పోతన (ఆంధ్ర మహాభాగవతము, రుక్మిణీకళ్యాణము)

సీ. నీలమేఘ చ్ఛాయబోలు దేహమువాడు, ధవళాబ్జ పత్ర నేత్రములవాడు
కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, చక్కని పీన వక్షంబువాడు
తిన్నైన కనుపట్టు దీర్ఘబాహులవాడు, ఘనమైన దుందుభి స్వనమువాడు
పద్మ రేఖలు గల్గు పద యుగంబులవాడు, బాగైనయట్టి గుల్ఫములవాడు

తే.గీ. కపటమెరుగని సత్య వాక్యములవాడు
రమణి! రాముండు శుభలక్షణములవాడు
ఇన్ని గుణముల రూపింప నెసగువాడు
వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు
సమర్పించినవారు: పద్మ i.
కవి: మొల్ల (రామాయణం, సుందరకాండ)

సీ. తట్టికివచ్చి యిట్టట్టు వోనేరని లేళ్ళవిధంబున లీలయెడలి
వలజిక్కి యెక్కడ మెలగంగనేరని చిలుకలచాడ్పున జెన్నుదరిగి
మాపున జొరబడి యావలజనలేని మీలచందంబున జాలగుంది
యురులలోబడి యెందునరుగంగజాలని నెమిళుల తెరగున గొమరుదక్కి

తే.గీ. కలయ జూచుచు బలుకంగ నెలగురాక
నలగుమేనులతో నెరిదలలు వీడి
వెగడుపడి వెల్లనై కడువిన్నబోయి
పుష్పకంబుననున్న యప్పొలతులెల్ల
సమర్పించినవారు: పప్పు నాగరాజు
కవి: తిక్కన (నిర్వచనోత్తర రామాయణము)

సీ. ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి కేలూత నొసగి యెక్కించుకొనియె
మనుచరిత్రం బందుకొనువేళ బురమేగ బల్లకి తనకేల బట్టియెత్తె
గోకట గ్రామాద్యనేకాగ్రహారంబు లడిగిన సీమలయందు నిచ్చె
బిరుదైన కవిగండపెండేరమున కీవ తగుదని తానె పాదమున దొడగె

తే.గీ. 'ఆంధ్ర కవితా పితామహ, అల్లసాని
పెద్దన కవీంద్ర' యని నన్ను పిల్చునట్టి
కృష్ణరాయలతో దివికేగలేక
బ్రతికియున్నాడ జీవచ్ఛవంబ నగుచు
సమర్పించినవారు: చదువరి
కవి: అల్లసాని పెద్దన (చాటువు)

సీ. విమతభూపతు లెట్లు విముఖులై పాఱిరో- రాజపీఠం బెక్కరాని నీకు
కుంభినీధవులెట్లు కూతుఁడ్రనిచ్చిరో- కులమొల్లకయె నీకు గోపకునకు
సుందరీమణులెట్లు చూచి మోహించిరో - కప్పగు మైచాయ గలుగు నీకు
దాసజనంబెట్లు దాస్యంబు సలిపిరో - తిరియు వానిని మారు తిరియు నీకు

తే.గీ. మమత నీలీల అటు సూసి బ్రమసిరేమొ
తగుదువే ఇట్టి ఘనతకు దందభూప
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ
హత విమత జీవ శ్రీకాకుళాంధ్ర దేవ!
సమర్పించినవారు: స్వాతికుమారి
కవి: కాసుల పురుషోత్తమ కవి (శ్రీకాకుళాంధ్రనాయక శతకము)

సీ. కలుగడే నాపాలి కలిమి సందేహింపన్ గలిమి లేములు లేక కలుగువాడు
నాకడ్డపడ రాడె నలిన సాధువులచే బడిన సాధుల కడ్డు పడెడి వాడు
చూడడే నా పాటు జూపుల జూడక జూచు వారలన్ గృపన్ జూచువాడు
లీలతో నా మొరాలింపడే మొఱగుల మొఱలెరుంగుచున్ దన్ను మొఱగువాడు

తే.గీ. నఖిల రూపులున్ దనరూప మైనవాడు
ఆదిమధ్యాంతములు లేక అడరువాడు
భక్త జనుల దీనుల పాలి వాడు
వినడె చూడడె తలపడే వేగ రాడె
సమర్పించినవారు: లలిత
కవి: బమ్మెర పోతన (ఆంధ్ర మహాభాగవతము, గజేంద్రమోక్షము)

Monday, July 2, 2007

మెక్సికన్ మాయా ప్రపంచం

గుయిలెర్మో డెల్ తోరో అనే మెక్సికన్ దర్శకుడు రాసి, తీసిన స్పానిష్ భాషా చిత్రం ఎల్ లాబిరింతో డెల్ ఫానో (Pan's Labyrinth) మొన్నటి ఆస్కార్ అవార్డుల దగ్గిర చాలా సంచలనం సృష్టించింది. కళకీ, ఛాయాగ్రహణానికీ, మేకప్ కీ బహుమతులు గెల్చుకుంది. ఇదొక పాప కథ. తనకి అలవాటైన జీవితం చిన్నాభిన్నమై పోతున్న తరుణంలో తన మనసుతో ఊహాలోకాల తాళాలు తెరిచిన పదేళ్ళ పాప కథ. శైశవ నైర్మల్యానికీ మానవ క్రౌర్యానికీ జరిగే యుద్ధంలో పసితనపు అమాయకత్వం తిరుగులేని విజయం సాధించే కథ.

టూకీగా: ఒఫీలియా తన తల్లి కార్మెన్ తో కలిసి తన స్వగ్రామం వదిలి మారుటి తండ్రి విడాల్ దగ్గరికి వెళ్తోంది. కార్మెన్ అప్పటికి నవమాసాల గర్భవతి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో స్పెయిన్ ఫాసిస్టు నియంత ఫ్రాంకో సైన్యంలో కెప్టెన్ విడాల్ తన దండుతో విప్లవకారులు సంచరించే ఒక అడవి దగ్గర చిన్న గ్రామంలో ముట్టడించి ఉన్నాడు. తన బలంతో క్రౌర్యంతో స్థానిక ప్రజలను భయభ్రాంతులని చేసి గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఈ స్థితిలో ఒఫీలియా తల్లితో అక్కడికి చేరుకుంది. మొదటిచూపులోనే ఆ పాపకి ఈ మారుటి తండ్రి క్రౌర్యం చూచాయగా అర్థమైంది. అతన్నించి దూరంగా ఉండటానికి చుట్టుపక్కలౌన్న వనాలలోకి వెళ్ళి చాలా సేపు గడుపుతోంది. ఒక సారి మేక తలకాయ ఉన్న ఒక విచిత్ర వ్యక్తి (ఇతనే Pan) తారసపడి ఆమె జన్మ రహస్యాన్ని చెప్పాడు. ఆమె నిజంగా వేరేలోకపు రాజకుమార్తె. శాపవశాత్తూ ఇక్కడ ఈ ఆపదలో చిక్కుబడిపోయింది. మూడు సాహసకృత్యాలు నెరవేర్చితే శాపం తీరి మళ్ళీ తన లోకానికి చేరుకో గలుగుతుందని చెప్పాడు. ఒఫీలియా అంగీకరించడంతో ఇక అద్భుతాలు మొదలవుతాయి. నిజజీవితంలో పరిస్థితులు నానాటికీ క్షీణించి పోతున్నాయి. ఒఫీలియా తల్లి ప్రసవ వేదనలో చనిపోయి పుట్టిన బిడ్డ మాత్రం బతికాడు. ఆ పసికందుని రక్షిస్తున్న డాక్టరుని, విద్రోహులకి సాయం చేస్తున్నాడనే అనుమానంతో కెప్టెన్ విడాల్ చంపేశాడు. చివరి సాహస కృత్యంగా Pan ఒఫీలియాని ఏం చెయ్యమంటాడు, ఒఫీలియా తన మాయాప్రపంచాన్ని చేరుకోగలిగిందా, కెప్టెన్ విడాల్ గతి ఏమైంది - ఈ ప్రశ్నలకి సమాధానం వెండితెరపై చూడవలసిందే.

ఈ సినిమా విజయానికి అద్భుతమైన సెట్టింగులూ, ఛాయాగ్రహణమూ ఒక కారణమైతే ఒఫీలియాగా ఇవానా బాఖెరో అనే చిన్నారి నటన ఇంకో కారణం. పాలుగారే బుగ్గలతో అమాయకత్వమూ తెలివితేటలూ సమపాళ్ళలో నిండిన కళ్ళతో మహాముద్దొస్తూ ఉండడం ఒక ఎత్తైతే, ఈ పాప నటనా చాతుర్యం ఇంకో ఎత్తు. ఈ సినిమాలో ఈమె ప్రతిభని పొగడ్డానికి నాకు మాటలు చాలట్లేదు. సిక్స్త్ సెన్సు సినిమాలో హేలీ ఓస్మెంట్ అనే పిల్లాణ్ణి చూసి ఆ రోజుల్లో ఇలాగే ముచ్చట పడ్డాను. వాడి తలదన్నేలా నటించింది ఈమె.

కౄరుడైన కెప్టెన్‌గా సెర్జి లోపెజ్, అతని దగ్గర దాసిగా పనిచేస్తూ విప్లవకారులకి చేయూతనిచ్చే వీరనారి మెర్సిడెస్ గా మారిబెల్ వెర్దు మంచి నటన అందించారు. ఈ సినిమా చూసి నాకు ఒక్కటే విమర్శ మిగిలింది - బాల్యాన్ని గురించి ఇంత చక్కటి సినిమా పిల్లలు చూడ దగినట్లుగా తీస్తే బాగుండేది. కథలో వచ్చే క్రౌర్యమూ, తీసిన పద్ధతిలో కొంత మితిమీరిన నలుపు ఛాయలూ ఈ సినిమాని పిల్లలకి దూరం చేశాయి. మీకు చందమామ కథలు నచ్చేవా? ఐతే ఈ సినిమా తప్పక నచ్చుతుంది.

శ్రీ మేడసాని మోహన్ గారితో ముఖాముఖి

శనివారం నాడు మా సాహితీసమితిలో సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్ గారు ప్రసంగించారు. మేం వెళ్ళటానికి అంతా సిద్ధమై తీరా చివరి నిమిషంలో ఏదో అడ్డంకి వచ్చి వెళ్ళలేక పోయామే అని బాధ పడుతుంటే ఆదివారం మధ్యాహ్నం తానా అధ్యక్షులు డా. బండ్ల హనుమయ్య గారింట్లో వారిని కలిసి గంటన్నర సేపు ముచ్చటించే అదృష్టం కలిగింది.

మోహన్ గారు పాతికేళ్ళకి పైగా తి.తి.దే వారి అన్నమాచార్య ప్రాజెక్టులో పని చేస్తున్నారు. సహాయ పరిశోధకునిగా మొదలుపెట్టి ప్రాజెక్టు డైరక్టరుగా అత్యున్నత స్థానాన్ని అధిష్టించారు. ఈ సమయంలో అన్నమాచర్యుల సంకీర్తనలపై, కుటుంబ చరిత్రపై, తిరుపతి దేవాలయాల చరిత్రపై, ఆ ప్రాంత చరిత్రపై లోతైన పరిశోధనలు చేసి ఏన్నో మౌలికమైన సత్యాలను వెలికి తీశారు. కొన్ని కీలకమైన చారిత్రక విషయాలను ప్రతిపాదించి నిరూపించారు. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అన్నమాచార్యుల సంకీర్తనలని ప్రచారం చెయ్యటంలో అనేక ప్రత్యక్ష కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా, సంధానకర్తగా వ్యవహరించారు.

సంకీర్తనలు, చరిత్ర, అధ్యయనము, పరిశోధన - ఇవి వృత్తి ధర్మాలయితే, పద్య రచన, అవధానము వారి ప్రవృత్తి ధర్మాలు. చిన్నప్పటినించీ పద్యసాహిత్యమంటే మక్కువ. కౌమార దశలోనే లభించిన గురూపదేశంతో ధ్యానవిద్య అలవడి ధారణశక్తినీ, కవితాధారనీ ప్రేరేపించింది. ధారణ జ్ఞాపకశక్తికి ఒక రూపం. అవధానంలో పృఛ్ఛకులకి సమాధానంగా చెప్పిన పద్యాలన్నిటినీ అవధానం చివర మళ్ళీ అదేవరుసలో ఏకబిగిన ఏకరువు పెట్టడాన్ని ధారణ అంటారు.

పదిహేనేళ్ళ వయసులో, మోహన్ గారు పదవ తరగతి పరిక్షలు రాసిన తరవాత వేసవి శలవల్లో బడి ఆచార్యులు, ఊరి పెద్దలు పృఛ్ఛకులుగా మొదటి అష్టావధానం విజయవంతంగా పూర్తిచేశారు. అటుపైన అవధాన ప్రక్రియలో అంచెలంచెలుగా పైకెక్కుతూ శత, ద్విశత, పంచశత, సహస్రావధానాలు నిర్వహించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 18 నించీ మార్చి 20 వరకూ హైదరాబాదులో వీరు నిర్వహించిన పంచ సహస్రావధానం ఒక అపూర్వ సంఘటన. వెయ్యి దత్తపదులు, వెయ్యి సమస్యలు, వెయ్యి వర్ణనలు .. ఇలా వర్గంలో వెయ్యేసి ప్రశ్నలతో మొత్తం 5,116 అంశాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చెయ్యటం మోహన్ గారి మేధకు కలికితురాయి.

అన్నమాచార్యుల సంకీర్తనల గురించి చాలాసేపు ముచ్చటించుకున్నాము. అన్నమయ్యకి ముందు మనకి తెలిసిన ప్రసిద్ధకవులు కవిత్రయం వారు, శ్రీనాథుడు, పాల్కురికి సోమనాథుడు ఇత్యాదులు. వీరందరూ కూడా ఏదో కావ్యాలు రాసేశాం అన్నట్టు కాక ఒక నిర్దిష్టమైన ప్రయోజనాన్ని కోరి గంటం పట్టినవారు. అన్నమయ్య కూడా ఒక నిర్దిష్టమైన ప్రయోజనాన్ని ఆశించే కవి అయినాడు. ఎక్కడో వేదాల్లోనూ, వేదంతములైన ఉపనిషత్తుల్లోనూ, మంత్ర తంత్ర శాస్త్రాల్లోనూ పాతుకు పోయి ఎవరికీ అర్థంకాని "దేవభాష"లో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను జనసామాన్యానికి చేరువచెయ్యటం ఆయన పరమావధి.

తమిళంలో మహాభక్తులైన ఆళ్వారులు ప్రవచించిన పాశురములు దివ్య ప్రబంధమై ద్రావిడవేదముగా కొనియాడబడినాయి. వైష్ణవ మతరహస్యాలనూ, భక్తి తత్త్వాన్నీ సామాన్యప్రజలకు దగ్గరచేశాయి. తెలుగులో అటువంటి సాహిత్యం లేదు. ఆ లోటు పూరించాలి. అప్పటికి ఉన్న రచనా పద్ధతి పద్యకావ్యాలు రాయటం, ఎక్కువగా సంస్కృత పురాణాల ఆధారంగా. తాను ఎంచుకున్న గమ్యం చేరేందుకు ఇది కాదు పద్ధతి - జనానికి సులువుగా పట్టుబడే ప్రక్రియ కావాలి. అదే పదం - అంటే పాట. భక్తి పరవశంతో రంగరించిన పాటనే సంకీర్తన అన్నారు. అది తరవాత రామదాసు నోట కీర్తనయ్యింది. త్యాగరాజు స్వరంలో కృతిగా అవతరించింది - అది వేరే సంగతి.

తన సాహిత్య సౌధానికి పునాదిగా పదాన్ని ఎంచుకున్నాడు అన్నమయ్య. సున్నితమైన తేట తెలుగు మాటలతో, మిక్కిలి సొగసైన తెలుగు జాతీయాలతో నుడికారాలతో పదాలల్లాడు. వేద మంత్రాలని, తత్త్వసారాన్ని, పురాణ గాథలని తన పదాల్లో కూరి వాటితో శ్రీవేంకటశ్వరునికి స్వరాభిషేకం అక్షరాభిషేకం. చేశాడు. ఏలపాటలు, జోలపాటలు, గొబ్బిళ్ళు, టముకులు, కోలాటం, దాసరి పదాలు - అన్నమయ్య ముట్టని తెలుగు జీవిత పార్శ్వం లేదంటే అతిశయోక్తి కాదేమో.

సంకీర్తనలపై, చారిత్రక సాంస్కృతిక విషయాలపై మోహన్ గారు రాసి ప్రచురించిన వ్యాసాలు లెక్కకు మించి ఉండగా, "పురుషోత్తమ చక్రవర్తి" అనే పేరిట 700 పై చిలుకు పద్యాలతో రచించిన పద్యకావ్యం ప్రచురించ వలసి ఉంది. అన్నమయ్య పదాలను, క్లిష్టమైన మాటలకి అర్థాలతో, సంకీర్తన మొత్తానికి వ్యాఖ్యతో మొత్తం 29 సంపుటాల సాహిత్యం అన్నమాచార్య ప్రాజెక్టుద్వారా సిద్ధమైందనీ, త్వరలోనే ప్రచురణ జరుగుతుందనీ చెప్పారు. ఇందులోనుంచి, ప్రస్తుతం బాగా ప్రసిద్ధి చెందిన సుమారు 1500 పదాలని ఏరి మూడు సంపుటాల్లో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ప్రచురిస్తామని కూడా శలవిచ్చారు.