Wednesday, April 18, 2007

భద్రుడి నూతన యుగావిష్కరణ

చెట్టు ఇస్మాయిల్ గారి తవ్వకం పద్యానికి కిరణ్ ఆంగ్లానువాదం చదివినప్పుడు ఏదో జ్ఞాపకపు తెర కదిలింది.
వాడ్రేవు చిన్నవీరభద్రుడి పద్యానికి నా ఈ ఆంగ్లసేత ఎప్పుడో ఆరేడేళ్ళ క్రితం సులేఖ డాట్ కాం లో రాశాను.
మొత్తానికి ఆయన స్వయంగా తవ్వినా, నాతో తవ్వించినా కిరణ్ నా పాలిట పురావస్తు పరిశోధకునిగా పరిణమించారు. ధన్యవాదాలు కిరణ్!
తెలుగు మూలం, కవి పరిచయం టపా చివర.
అనువాదంలో ఏదన్నా అందముంటే అది మూలకవిది.
అవకతవకలన్నీ నావి.

For the Dawn of a New Era

- V. Chinnaveerabhadrudu

Today, I must explode myself with dynamite.

Without that, the rocky blockades of my heart won’t yield.


I must dig into myself, and draw from deep within

Just one drop of pure water, for just one kind word.


Unless it endures much agony

Under the oppressive typhoons, and upon the licking flames of wildfires,

This branch of life won’t give birth to even a tender shoot.


For one smile, today I must wage a great battle against myself.

So that a bud may blossom, I must shed blood, shed tears.


Until my mortal world gets crushed and burnt in the scorching unbearable suffering,

The pearl of compassion won’t twinkle in the corner of The Prophet’s eye.

A poem won’t shine forth.


Until then, the curtain won’t rise on the dawn of a new era.ఒక నూతన యుగావిష్కరణ కోసం
- వాడ్రేవు చిన్నవీరభద్రుడు

ఇవాళ నన్ను నేను డైనమైట్లతో పేల్చుకోవాలి
అప్పుడు గానీ నా హృదయ పాషాణాభ్యంతరాలు తొలగవు.

నన్ను నేను తవ్వుకోవాలి నాలోకి, తోడుకోవాలి నాలోంచి
ఒక్క చుక్క మంచి నీటి కోసం, ఒక్క మంచి మాట కోసం.

తుపానుల ఒత్తిడుల మీద, దావాగ్ని కీలల రాపిడుల మీద
ఎంతో వ్యధ చెందితేనే గాని
ఈ జీవిత శాఖ ఒక్క లేత చిగుర్ని కూడా ప్రసవించదు.

ఒక్క నవ్వు నవ్వటానికి, ఈరోజు నాతో నేను ఒక మహా సంగ్రామమే కానివ్వాలి.
ఒక్క పువ్వు పుయ్యటానికి ముందు నే నెత్తురొలికించి కన్నీరు చిందించాలి.

నా మానవ ప్రపంచమంతా దుర్భర వేదనల సెగలో నలిగి రగిలినప్పుడు గానీ
ఒక ప్రవక్త కన్నీటి కొలకులో కారుణ్యపు ముత్యం తొణకాడదు,
ఒక కవిత ప్రభవించదు.

ఒక నూతన యుగావిష్కరణకై తెర తొలగదు.
********************************

వేదాంత శాస్త్రంలో ఎమ్మే పట్టం పుచ్చుకున్న వాడ్రేవు చిన్నవీరభద్రుడు కవిగా కథారచయితగా విమర్శకునిగా ప్రసిద్ధులు. నిర్వికల్ప సంగీతం, అరణ్యం, ప్రశ్నభూమి, ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ వీరు ప్రచురించిన పద్య సంకలనాలు. ఆంప్ర ప్రభుత్వ గిరిజన అభివృద్ధి శాఖలో వివిధ పదవులు నిర్వహించి ప్రస్తుతం డిప్యుటీ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. చిత్తశుద్ధితో తాను పని చేసిన ప్రాంతాలలో గిరిజనుల అభివృద్ధికి పాటుపడ్డారు. అంతర్ముఖమైన తాత్త్విక చింతన వీరి కవిత్వంలో ప్రముఖ భూమిక వహిస్తుంది. ఈ మధ్య కాలంలో వేదాంత శాస్త్రం పై తెలుగులో అనేక పుస్తకాలు ప్రచురించారు. ఆ విషయాలు మరోమాటు.

Thursday, April 12, 2007

కర్ట్ వానగట్

ప్రముఖ అమెరికన్ వ్యంగ్య నవలా రచయిత కర్ట్ వానగట్ మరణించారని యాహూమెయిల్లో లాగిన్ అవగానే కనిపించింది. ఆయనకి 84 ఏళ్ళు.
అమెరికన్ సృజన సాహిత్య ప్రపంచంలో మార్క్ ట్వైన్ తరవాత అటువంటి సెటైర్ అంత కన్సిస్టెంట్ గా రాసిన రచయిత మరొకరు కనబడరు. సమకాలీన ప్రపంచాన్ని, జీవితాన్ని, ఎక్స్ రే తీసి, లోపల కుళ్ళి కంపుగొడుతున్న రుగ్మతల్ని ఎండేసిన పదునైన కత్తి ఆయన కలం. దేవుణ్ణి నమ్మక, మనిషి ఎంత కౄరుడైనా, ఎన్ని రాక్షస చర్యలు చేసినా మానవత్వాన్నే నమ్మి, ఎప్పటికైనా మానవత్వం గెలుస్తుందనే ఆశతో రచనలు చేసిన మానవతా వాది.

ఇంచుమించు ఇరవై నవలలు రాశారు. స్లాటర్ హౌస్ ఫైవ్ (Slaughterhouse Five) బాగా పేరు తెచ్చుకున్న నవల, ఇప్పటికీ ఇక్కడ హైస్కూళ్ళ ఇంగ్లీషు లిటరేచర్ క్లాసుల్లో చదువుతుంటారు. నాకు తెలిసి ఆయన నవలలన్నీ చిన్నవే - రెండొందల పేజీలకంటే ఉండవు.
సుమారు 2000 సంవత్సరం ప్రాంతాల్లో సులేఖ డాట్ కాం లో సరదాగా పాల్గొంటున్న రోజుల్లో అక్కడి సంభాషణల వల్ల వానగట్ గురించి తెలిసింది. అప్పుడు కుతూహలంతో స్థానిక గ్రంధాలయం నించి కొన్ని నవలలు తెచ్చి చదివాను. బుర్ర తిరిగింది ఒక్క సారి ఆ పదునుకి, ఆ సృజన శక్తికి, ఆ భాషకి. ఆపై, కనబడిన ప్రతి పాత పుస్తకాల కొట్టులో ఆయన పుస్తకాల కోసం వెదికే వాణ్ణి. ఎక్కువ దొరక లేదు. నా దగ్గర ఐదో ఆరో ఉండాలి. ఆయన్ని స్మరించుకుంటూ మళ్ళీ ఇంకో సారి చదవాలి అవన్నీ.


Wednesday, April 11, 2007

పాత సినిమాల తీపి గురుతులు రెండు

విజయవాడ పుస్తకాల పండగలో తెలుగు సినిమాకి సంబంధించిన పుస్తకాలు బాగా కనిపించాయని రాశాను కదా. వాటిల్లో రెండు గత వారంలో చదివాను.
"తగదిది తగదిది తగదిదీ
ధరణీధర వర సుకుమారీ . తగదిదీ
అండగా మదనుడుండగా
మన విరి శరముల పదనుండగా
నిను బోలిన సుర భామిని తానై
వరు నరయగ పోవలెనా?"
ఘంటసాల గొంతులో ఈ పాట (ఓకే, పాటలో భాగం) విన్నారా ఎప్పుడైనా?
వాగ్దానం చిత్రంలోని "గిరిజా కళ్యాణం" అనే యక్షగానంలో భాగమిది. శివుడే భర్త కావాలని తపస్సు చెయ్యడానికి బయల్దేరిన పార్వతికి మన్మధుడు అడ్డుపడి అంటున్నాడు.

రాసింది మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు.
ఈయన సముద్రాల సీనియర్ కి బహిరంగంగా ప్రకటింపబడని జంట కవియట. ఎంతగా అంటే ఇప్పుడు సముద్రాల సీనియర్ పేరిట చెలామణీ అవుతున్న సినిమా కథ మాట పాటల్లో ఏవి ఆచార్యులుగారివో ఏవి శాస్త్రిగారివో ఎవరికీ తెలీదు. అదొక విచిత్రబంధం.

బహు భాషావేత్త. బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక సంస్కృత గ్రంధాల్ని పరిష్కరించి ప్రచురణకి సాయపడిన పరిశోధకుడు, పండితుడు. శాస్త్రిగారు గొప్ప కథా రచయిత కూడా. వందల మీద రాసిన కథలు పోయినవన్నీ పోగా దొరికిన వాటిని 1980ల్లో రెండు సంపుటాలుగా ప్రచురించారు. అవి వేడి పకోడీల్లా అమ్మూడైపోయి మళ్ళీ మళ్ళీ మలి ముద్రణకి నోచుకున్నాయి. నేనా రెండు సంపుటాలూ ఎన్నిమార్లు చదివానో గుర్తులేదు. ఆ కథల గురించి వివరంగా మరో టపాలో ముచ్చట్లాడుకుందాం గానీ, శాస్త్రిగారి వచనమూ, కథ చెప్పే తీరూ (వారు కథలు రాయరు, చెబుతారు) - ఆ శైలి అనితర సాధ్యం. అచ్చతెనుగు తనానికి శాస్త్రిగారి రచన పుట్టినిల్లు.

శాస్త్రిగారు 1965లోనే పరమపదించారు. ఆ సందర్భంగా ఎందరో సినీ ప్రముఖులు వివిధ పత్రికల్లో అర్పించిన అశ్రుతర్పణాల్ని ఒక చోట చేర్చి శాస్త్రిగారి శతజయంతి సందర్భంగా 2005 లో ఈ "మణిదీపం" వెలిగించారు కొందరు భక్తులు.

రచయితే కానీ నటులు కాదు కదా, ఎక్కువ ఫోటోలు ఎక్కడా కనబడవు. ఈ పుస్తకంలో ఉన్న కొన్ని బొమ్మలైనా ఆ లెక్కన చాలా విలువైనవే. అశ్రుతర్పణాల్లో వాళ్ళ ఘోష ఎక్కువగానూ, శాస్త్రిగారి మీద వాళ్ళకున్న గౌరవం కొద్దిగానూ కనబడుతోందే తప్ప శాస్త్రిగారి జీవితాన్ని, రచనలని గురించిన సమగ్ర దృష్టి ఎక్కడా కనబడదు. శాస్త్రిగారికి అమిత సన్నిహితులుగా జగమెరిగిన ఆరుద్ర, జరుక్ శాస్త్రుల వ్యాసాలు కూడా నిరాశ పరిచాయి. ఈ నాటి కలం పోటుగాళ్ళ (వేటూరి, వెన్నెలకంటి, భువనచంద్ర ప్రభృతులు) నివాళులు కొన్ని రాయింపించి వేశారు - పించకుండా ఉంటేనే బాగుండేది.

ఆరుద్ర చెప్పిన ఒక చిన్న పిట్ట కథ - జయభేరి సినిమాకి ఒక నృత్యదృశ్యానికి శాస్త్రిగారు "నీవెంత నెరజాణవౌరా!" అనే జావళీ లాంటి పాట రాశారు. సంగీత దర్శకుడు పెండ్యాల స్వరపరిచేశారు. నృత్యదర్శకుడు వెంపటి పెదసత్యం అడుగుల వరుసలు సరిచూసుకుంటూ పెండ్యాలతో "ఏవండీ, పాటలో ఇక్కడ ఈ చిన్న మార్పు చేస్తే బావుంటుంది కదా, నాట్యానికి ఇంకా బాగా సరిపోతుంది" అన్నార్ట. పెండ్యాల కావాలంటే ఆయన్ని మీరే అడగండి అన్నార్ట, మధ్యలో తాను ఇరుక్కోకుండా. ఇంతలో అక్కడికి శాస్త్రిగారు రానే వచ్చారు. పెదసత్యం వారికి పాటని సంగీత అభినయ సహితంగా చూపెట్టి, చాలా గౌరవంగానే "గురువుగారూ, ఈ చిన్న మార్పు చేస్తే .."అని అర్థోక్తిలో ఆగిపోయారు.

వెంటనే శాస్త్రిగారు, "నాయనా సత్యం, మిగతా పాటంతా బాగుంది కద? అక్కడంతా డాన్సు చెయ్యొచ్చు. ఈ చిన్న మొక్కే కద? ఇక్కడ డాన్సు చెయ్యక్కర్లేదు. కావాలంటే అంజమ్మని (హీరోయిన్ అంజలీదేవి) ఆ కాసేపూ తల గోక్కోమను. అందంగా ఉంటుంది." అనేసి కండువా దులిపి బుజాన వేసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఆ పాట నృత్యం చిత్రీకరణ చివరికి గురువుగారు చెప్పినట్టే జరిగిందని వేరే చెప్పక్కర్లేదు. ఇంతా చేసి ఆ డాన్సు అంజలీదేవిది కాదు, రాజసులోచనది.

అన్ని వ్యాసాలు చదివిన తరవాత శాస్త్రిగారి అఖండ ప్రతిభ, మొక్కవోని ఆత్మవిశ్వాసం - ఈ రెండే కళ్ళ ముందు నిలబడతై.

రావి కొండలరావు నటనా జీవితంలో ఏమి సాధించారోగాని, నటన నించి రిటైరయినాక పాత సినిమా కబుర్లని కాగితమ్మీద రికార్డు చేసి తెలుగు చలనచిత్ర చరిత్రకి ఎనలేని సేవ చేస్తున్నారు. నా వుద్దేశంలో "వజ్రోత్సవ" వేడుకలంటూ బోలెడ్డబ్బులు తగలేసే బదులు మన చరిత్రని కొంచెం పదిల పరుచుకునే ప్రయత్నం చేస్తే ఏమన్నా అర్థవంతంగా ఉండేది. అదింకో గొడవ, వొదిలెయ్యండి. ఏవిటి చెబుతున్నానూ .. ఆ .. రావి కొండల రావు.

ఆంధ్రప్రభ వార పత్రికలో రాసిన పాత సినిమా కబుర్లలో కొన్నింటిని చేర్చి "బ్లాక్ అండ్ వైట్" ని రూపొందించి సినీ అభిమానులకి అందించారు. పుస్తకం గెటప్ ముద్దుగా ఉంది. లోపల కాగితం గట్టిగా తెల్లగా బాగుంది. అచ్చు బహు బాగా ఉంది. అచ్చుతప్పులు నా కెక్కడా కనబళ్ళేదు చదివినంతలో. ఇంత మంచి ప్రచురణ విలువలతో వెలువడ్డ తెలుగు పుస్తకం నేనీమధ్య చూళ్ళేదు.

అసలు విషయం చెప్పమంటారా - అబ్బో ఎన్నని చెప్పేది .. ఎప్పుడో ఇక్ష్వాకుల నాటి హెచ్.ఎం.రెడ్డితో మొదలెట్టి తొలినాటి అతిరథ మహారథులందర్నీ స్మరించి, ఆ పైన 40లు, 50లు, 60ల వరకూ తెలుగు సినీ రంగాన్ని నిలబెట్టి, బలమిచ్చి, రంగులద్ది, దాని కీర్తిని గానం చేసిన ఎందరో మహానుభావుల్ని గురించి తగినంత విశదంగా చెప్పుకొచ్చారు. స్టార్లు, హాస్య నటులు, కేరెక్టర్ నటులు, సంగీత సామ్రాట్టులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, కవులు, దర్శకులు - ఓహ్, ఒకటేమిటి, ఈ వ్యాసాల్లో ఆయన స్పృశించని సినిమా పార్టు లేదంటే నమ్మండి.అనేక సినిమాల నిర్మాణ విశేషాల్ని చెప్పుకొచ్చారు. మధ్య మధ్య వ్యక్తిగతమైన విశేషాల్ని (శ్రీశ్రీని ఒక మిత్రుడు ఒక నాటిక రాసిమ్మని గోల చేస్తుంటే "ఏ నాటికైనా రాస్తా"నని నచ్చ జెప్పార్ట!) చొప్పించారు ఆసక్తి కరంగా.

ఇక ఫోటోలున్నాయి కదా .. చూడల్సిందే కాని మాటల్లో చెప్పలేను.

ఇంత రాసి .. చివరి పేజీలో "ఎక్కడైనా తప్పుడు సత్యాలు (factual errors) వుంటే వుండవచ్చునేమో! తెలిసిన వారు సరిదిద్దితే మరు ముద్రణలో సరిదిద్దుకుంటాను" అని తన వెనక మాటగా చెప్పుకున్నారు. అది ఆయన వినయానికి తార్కాణం.
తెలుగు సినిమాని అభిమానించే ప్రతి ఒక్కరి దగ్గరా ఉండ వలసిన పుస్తకమిది.

Friday, April 6, 2007

స్పందన ప్రసాదు కోసం

పొద్దు నిర్వాహకుల ఆశీర్వాదంతో ..
గడిని చూసి చేతులెత్తేస్తున్న బ్లాగు సోదర సోదరీమణులకి కొంచెం ఉత్సాహం పుట్టించడానికి ..
నాకు వీలైనప్పుడల్లా ఇలా ఒకటో రెండో ..
ప్రసాదు గారూ, మీ పేరిట పెట్టానని ఏవీ అనుకోకండి. ప్రతి ఉద్యమానికీ ప్రతీక ఒకరుండాలి కదా! ఇప్పుడు మీ వంతన్న మాట.

అన్నట్టు విప్పబడిన ఈ ఆధారంతో మీకు తట్టిన మీరు ఛేదించిన ఇతర సమస్యల్ని ఇక్కడ పంచుకోవటం మరవొద్దు సుమా!

11. మరాకు తానైతే మంచిముత్యం మరొకరు, అనుబంధం ఉన్నా రాగద్వేషాలు లేవు (4+2+4)

Thursday, April 5, 2007

మీసం పై సీసం


కులగోత్రాలు సినిమాలో అనుకుంటా.
గుమ్మడి ఒక సంపన్న గృహస్తు. పుట్టిన రోజో, షష్ఠిపూర్తో జరుగుతోంది.
సంబరం జరిగిపోతుండగా చిన్నల్లుడు పద్మనాభం "ఇప్పుడు మామ గారి మీసం మీద సీసం" అని ప్రకటించాడు. పెద్ద కూతురు సూర్యకాంతం "అదేవిటి మరిది గారూ, నిక్షేపం లాంటి నాన్న మీసాల మీద సీసం పోస్తానంటారా?" అని కోప్పడింది. "సీసమంటే పద్యం వొదిన గారూ" అని ఆవిణ్ణి శాంత పరిచి పద్మనాభం మామ గారి మీసాల ప్రశస్తిని ఈ విధంగా కొనియాడినాడు.

సీ. కారు మబ్బుల బారు సేరునేలెడి తీరు కోర మీసము పొందు కోరుకొందు
మృగరాజు జూలునే తెగనోడ జాలు నీ ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమల దండు కదలాడినటులుండు నీ మీసము తెరంగు నీలరంగు
మెలిపెట్టి నెలబెట్టు మీసాల రోసాలు గగన మండలముపై కాలు దువ్వు
తే. ఎవరు మోయుచున్నారు ఈ అవని భార-
మాదిశేషుడా, కూర్మమా? కాదు, కాదు
అష్టదిగ్గజ కూటమా ? అదియు కాదు
మామ మీసాలె భువికి శ్రీరామ రక్ష

ఇది రాసింది శ్రీశ్రీ అని సీసపద్యాలు సర్వే చేసిన మా కురువృద్ధులు సెలవిచ్చారు.

Wednesday, April 4, 2007

మీకిష్టమైన సీసపద్యం

తెలుగు పద్య కవిత్వంలో సీస పద్యానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.
వర్ణనలకి సీసపద్యం పెట్టింది పేరు.
మాత్రా ఛందస్సుతో ఏర్పడింది కాబట్టి ఈ పద్య పాదాల్లో ఒక నిర్దిష్టమైన నడక (pun intended) ఉంటుంది. అందులోనూ ఎక్కడ పదాల్ని విరవాలో తెలిసిన కవి చేతులో ఇంకా రసవంతంగా పడుతుంది.
ఎప్పుడో ఇంకా సాలెగూడు పుట్టని పాత రోజుల్లో, అమెరికా తెలుగు కురువృద్ధులు ఒకాయన ఈ మెయిల్లో ఒక సర్వే చేశారు - మీకిష్టమైన సీస పద్యం ఏది - అని.
కావ్యంలోది కావచ్చు, ప్రబంధాల్లోది కావచ్చు, చాటువు కావచ్చు, నాటకాలనుంచి రావచ్చు - చివరికి సినిమా కోసం రాసింది ఐనా సరే!
అదే ప్రశ్న ఈ నాటి బ్లాగ్లోక యువ తురుష్కులని (young turks :-)) మిమ్మల్నందర్నీ అడుగుతున్నా.
మీకిష్టమైన సీసపద్యం ఏది?
షరా 1: ఈ పద్యం నా కిష్టం, కానీ ఇది సీసపద్యమో కాదో తెలీదు అనుకునే వాళ్ళు ముందు ఆ పద్యాన్ని ఇక్కడ రాయండి. అది సీసమో కాదో తరవాత తేల్చుకోవచ్చు.
షరా 2: సీసపద్యమంటే ఏంటి అని అడిగే వాళ్ళు లక్షణపద్యాన్ని వందసార్లు తెలుగు imposition రాయాల్సి ఉంటుంది. పీకు-అతుకులు చెల్లవు.

Sunday, April 1, 2007

ఉన్నికృష్ణన్ గాత్రం

నిన్న (శనివారం) సాయంత్రం స్థానిక సంగీత సభవారు ఉన్నికృష్ణన్ గాత్ర కచ్చేరీ పెట్టారు. వయొలిన్ మీద విఠల్ రామమూర్తి, మృదంగం మీద వినోద్ సీతారామన్ (ఈ యువకుడు మా వూరి స్థానికుడు) సహకరించారు.

మేం కొంచెం ఆలస్యంగా వెళ్ళాము. అప్పటికి ముఖారి రాగాలాపన చేస్తున్నారు. ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము అనే త్యాగరాజ కీర్తన పాడారు. చరణంలో కనులార సేవించి అనే వరుసమీద నెరవులు వేసి ముఖారి అందం వెలువడే లాగా చక్కటి స్వరప్రస్థారం చేశారు.

ఆ తరువాతి ఆలాపన మొదలై నడుస్తుంటే ఆ రాగమేదో బాగా పరిచయమున్నదే .. కానీ అంతు పట్టకుండా ఉంది అన్నట్టు కొన్ని నిమిషాలు ఏడిపించింది. ఒక చక్కటి మూర్చన పడేప్పటికి అర్థమైంది రహస్య మేవిటో. ఆ మూర్చన అచ్చం బాగాయెనయ్య అనే త్యాగరాజ కృతి మొదటి వరుసలాగా ఉంది. ఆహా, చంద్రజ్యోతి - ఈయన పలానా పాట పాడతాడు చూసుకో అని మా ఆవిడతో చెప్పాను. ఆలాపన ముగిశాక ఆయన సరిగ్గా అదే కీర్తన మొదలు పెట్టారు. అంత సరిగ్గా ఎలా చెప్పానంటారు? నాకు తెలిసినంతలో ఆ రాగంలో అదొక్కటే కాస్త ప్రశస్తి పొందిన కృతి మరి :-)

అదయ్యాక తీరిగ్గా బిలహరి అందుకున్నారు. చక్కగా పొడూగున ఆలపించి వివరంగా పాడారు. ఆపై మళ్ళీ త్యాగరాజ కృతి దొరకునా ఇటువంటి సేవ ఎత్తుకున్నారు. ఈ పాట పాడ్డం అంత తేలిక కాదు. బిలహరి పాడే వాళ్ళు చాలా వరకూ పరిదానమిచ్చితే పాడతారు. త్యాగరాజు కృతుల్లో అరుదుగా కనిపించే 'రెండు కళల చౌకం' ఈ పాటలో ఉంటుంది. ఏ మాత్రం జంకకుండా "రాముని జగదోద్ధారుని .." అంటూ శరవేగంలో స్పష్టంగా వీర ధీర శృంగార మూర్తియైన రాముని రూపాన్ని మనముందు నిలబెడతారు. బాగుంది. భలే.

రామ బ్రహ్మ తనయుడౌ త్యాగరాజు తా పాడుచు నుండగా అనే వరుసమీద వివరంగా నెరవులు వేసి చక్కగా స్వరకల్పన చేశారు. మనకి తెలిసి త్యాగరాజ స్వామి కృతుల్లో తన పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకోవటం ఈ పాటలో ఒక్కదాన్లోనే. ఇంకో విషయం. దొరకునా అంటే శంకరాభరణం సినిమాలో చివరి పాట కాదు. అది సినిమా కోసం వేటూరి రాసిన పాట. కళ్యాణి రాగఛ్ఛాయలో స్వరపరిచారు.

వెంటనే ఖరహర ప్రియ. ఆలాపన ఒక మాదిరిగా ఉంది. మధ్యలో రాగం మారినట్టుగా ఉంది. ఇదేవిట్రా అనుకుంటూ ఉండగానే రాగం మళ్ళీ మారిపోయింది. ఈ సారి పట్టుకున్నాను - అది తోడి. ఓహో .. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపలే .. కళ్యాణి. ఇక అక్కడితో ముగించారు. మళ్ళీ ఎవరు ఏం అపార్థం చేసుకుంటారోనని ఆయనే వివరించాడు. దీన్ని గృహభేదం అంటారు. ఇదొక స్వరాల లెక్కల ప్రక్రియ. ఎవరికైనా శృతిలయలు సినిమాలో షణ్ముఖ శ్రీనివాస్ మాండొలిన్ కచేరీ చేసే సన్నివేశం గుర్తుందా?
ఈ గృహభేదం గురించి ఇంకో టపాలో వివరంగా ముచ్చటించుకుందాం.

ఈ రాగాలన్నీ చుట్టబెట్టుకుని వచ్చి మళ్ళీ ఖరహర ప్రియతో ముగించి ఇక తానం. తానం తరవాత పల్లవి.

ఇక్కడ పల్లవిని గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఈ పల్లవిలో పాడే సాహిత్యం ఉందే .. దీక్షితార్ గారి కృతుల్లో మాదిరిగానే .. ఈ పల్లవి సాహిత్యంలో ఆ రాగం పేరు వచ్చేట్టు ఉండడం అదొక చమత్కారం. ఈ ఖరహరప్రియ రాగానికి కొంత కథ ఉంది. దీన్ని మొదట హర ప్రియ (అంటే శివునికి ఇష్టమైనది) అనే వాళ్ళు. మేళకర్త రాగాలకి కటపయాది వర్ణక్రమంలో పేర్లు పెట్టటంలో దీనికి ఖర అనే రెండక్షరాలు చేర్చారు పేరుకి ముందు - అలా ఖరహరప్రియ అయింది. ఖరహరుడంటే ఖరదూషణులనే రాక్షసులని నిర్జించినవాడు శ్రీరాముడు - అనగా రామునికి ప్రియమైన రాగం అయింది. దానికి తగ్గట్టే త్యాగరాజస్వామి వారు ఎన్నో అద్భుతమైన కృతుల్ని ఈ రాగంలో రచించారు.

ప్రస్తుతంలో ఉన్నికృష్ణన్ గారు "తరుణేందుశేఖర హర ప్రియే, లలితే!" అని ఎత్తుకున్నారు పల్లవిని. భేషు, భలే బాగుంది. చుట్టుతిరిగి మళ్ళీ మొదటికొచ్చామన్న మాట!

పల్లవి తరవాత పాడిన రాగమాలిక స్వరాలలో అన్నీ "ప్రియ"మైన రాగాలు పాడారు - షణ్ముఖ ప్రియ, రిషభ ప్రియ, నాటక ప్రియ .. ఇలా.

అపటికే ఏడున్నర దాటింది, స్నేహితుల ఇంటికి హాజరు కావలసి ఉండి మేము బయల్దేరాం.