Saturday, March 31, 2007

ఏప్రిల్ ఫూల్!


చిన్నప్పుడు ఏప్రిల్ ఒకటి దగ్గర పడుతోంటే పిచ్చి గుబులుగా ఉండేది. ఒకటేమో ఎవరైనా మనల్ని మోసగించేసి "ఏప్రిల్ ఫూల్" అని అరుస్తారేమోనని. మోసం చెయ్యటమంటే ఏదో మన డబ్బులో వస్తువులో లాగేసుకుంటారని కాదు. ఈ మోసాలు "నీ చెవి మీద ఏదో పాకుతోంది" దగ్గర్నించి .. "హెడ్మిస్ట్రెసు గారు నిన్ను తీసుకు రమ్మన్నారు. నీకేదో మూడింది" దాకా ఉంటై. మనం తొణక్కూడదు, బెణక్కూడదు. మన తోటి వాళ్ళనీ, చిన్న వాళ్ళనీ బోల్తా కొట్టించడం కంటే మనకంటే పెద్దవాళ్ళని ఓ పిల్లి మొగ్గ వెయ్యించడం అదొక గొప్ప. మా ఇంటి చుట్టుపక్కల నాతో ఆడుకునే వాళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళు - అక్కడ మనకి హీరో వర్షిప్ కాక పోయినా కొంచెం నాయకుడి పొజిషనుండేది. పోయి పోయి ఈ పిల్ల వెధవల చేతిలో ఫూలైపోతే మన పరువేంగానూ! ఎంత జాగ్రత్తగా ఉన్నా మరీ రోజంతా బిగదీసుకుని ఉండలేం కదా. ఒకసారైతే ఒక గడుగ్గాయి, వెంకటప్పయ్య కొట్లో పాత బొంగరాలు తీసుకుని కొత్తవిస్తున్నారని చెప్పి నన్ను పల్టీ కొట్టించాడు.

ఆందోళన కలిగించే రెండో విషయమేంటంటే రోడ్డు మీదా, స్కూల్లో స్కూలైపోయాకా బట్టల మీద సిరా చిమ్మేవాళ్ళు. అప్పుడంతా ఫౌంటెన్ కలాలే ఉండేవి. చిన్న రబ్బరు ఫిల్లర్తో వచ్చే ఈనాటి చైనా హీరో పెన్నులు కాదు, ఒక్కొక్క కలానికీ ఒక ఔన్సుడు సిరా పట్టేంత బానపొట్టలుండేవి. మాకు ఐదో తరగతిలో అనుకుంటా కలాలు వాడటం మొదలైంది. పరిక్షలప్పుడు కూడా సిరా నింపుకోని చాలా మంది పిల్లకాయలు ఆ రోజు మాత్రం కోవటి కొట్టు తెరవంగానే ఐదు పైసలకి కలంనిండా సిరా పోయించుకుని యుద్ధ సన్నద్ధులై ఉండే వాళ్ళు. అది నిజంగా యుద్ధమే! మనమీదకి వస్తున్న సిరాస్త్రాల్ని తప్పుకుని అవతలి వాళ్ళని ముంచెత్తాలి. ఈ యుద్ధాల్లో ఆడపిల్లలు కూడా వీరోత్సాహంతో పాల్గొనే వారు. ఏదో ఆడపిల్ల కదాని మనం దయతల్చి ఊరుకున్నా వాళ్ళే వెనకనించి వచ్చి ఇంకు చిమ్మేసి విరగబడి నవ్వేవాళ్ళు. ఎవడన్నా హీరో ఆడపిల్ల చేతులో ఇంకు దెబ్బ తిన్నాడంటే వాడింక ఆ రోజుకి జీరోయే.

ఈ తతంగమంతా స్కూలైపోయాక మొదలయ్యేది, ఎందుకంటే స్కూలు జరుగుతుండగా ఎవడన్నా ఇట్లాంటి పన్లు చేస్తే హెడ్మిస్ట్రెసు గారి పేంబెత్తంతో వీపు చిట్లబడేది. కానీ స్కూలుకెళ్ళే రోడ్డు మీద వేరే స్కూలు పిల్లలకి మన హెడ్మిస్ట్రెసు గారంటే ఏం భయముండదు గదా. అందుకని స్కూలుకి చేరేదాకా చాలా అప్రమత్తంగా నడవాలన్నమాట.

ఒక సంవత్సరం మా స్నేహితుడొకడికి బ్రిలియంటైడియా వొచ్చింది. బంగాళ దుంప చెక్కమీద జాగ్రత్తగా అక్షరాలు చెక్కి దాన్ని ఇంకులో ముంచి printing block లాగా వాడొచ్చని. తగినంత పెద్ద బంగాళ దుంప తేవడం వాడి వొంతు. కొయ్యటానికి కత్తి తేవడం ఇంకోడి వంతు. దానికి పులమటానికి పెన్నుల్లో ఉండే ఇంకు చాలదు కాబట్టి ఇంకు బుడ్డీ తేవడం నా వొంతు. అన్నీ అనుకున్నట్టుగానే జరిగిపోయాయి. ఎట్లాగో రహస్యంగా ఇంటర్వల్లో ఒక చెక్కని తయారు చేశాం. మధ్యాన్నం డ్రాయింగ్ పీరియడ్ కొంచెం ఆట విడుపు. క్లాసులోనే నెమ్మదిగా మా శత్రువర్గపు నాయకుడి వెనక చేరి వాడి వీపు మీద వేసిన ముద్ర .. ఇలా!


మన ఖర్మ కాలి ఆ పూటే మనం ఇంటికి చేరే లోపలే మా నాన్నగారి కలంలో సిరా నిండుకుంది.

Friday, March 30, 2007

పొద్దు గళ్ళ నుడికట్టు

హైస్కూల్లో నాతోటి విద్యార్థి (పోటీ కూడా) ఉండేవాడు. మేస్టారు ఏదైనా క్లిష్టమైన ప్రశ్న వేసినప్పుడు నోరు మూసుక్కూర్చోని, సమాధానం మేస్టారే చెప్పేశాక "అబ్బ, సరిగ్గా అదే అనుకున్నా!" అనేవాడు. మాకందరికీ బలే వొళ్ళు మండేది.

రేపో మాపో పొద్దు మొదటి గళ్ళనుడికట్టు గడువు ముగుస్తుంది. త్వరలో సమాధానం కూడా ప్రచురిస్తారు. నాకేమో అన్నీ రాలేదు గానీ అధిక శాతమే వచ్చాయి, ఆ వచ్చినవి కూడా కరక్టే అని అనుకుంటున్నా. తీరా వాళ్ళు ప్రచురించేశాక అప్పుడు "అబ్బ సరిగ్గా అలాగే అనుకున్నా" అని మొత్తుకుంటే ప్రయోజనమేముంది? అందుకే ఇలా పబ్లిగ్గా ఇవ్వాళ్ళ (గడువుకి ముందే) ప్రకటిస్తున్నా.

అసలు పొద్దులో గళ్ళనుడికట్టు నిర్వహించాలనే బ్రిలియంటైడియా వచ్చినందుకూ, ఆ వచ్చిన ఐడియాని బహు చక్కని నుడికట్టుగా తీర్చినందుకూ, ఆ నుడికట్టులో అనేక సాంకేతిక విచిత్రాల్ని కూడా చొప్పించినందుకూ పొద్దు నిర్వాహకుల్ని మనసారా అభినందిస్తున్నాను. కొన్ని కొన్ని ఆధారాలు చిక్కటి చమత్కారంతో బహుసొంపుగా ఉన్నై. ధన్యోస్మి.

హెచ్చరిక - మీరు గానీ ఇప్పటి దాకా పొద్దు గళ్ళ నుడికట్టు చూశి ఉండక పోతే ఇక్కడతో ఆపేసి ముందు పొద్దు దిక్కు తిరగండి.
నుడికట్టుతో కుస్తీ పట్టి మీ సమాధానాలు ఇంకెవరితోనన్నా పోల్చుకోవాలని కుతూహలంగా ఉంటేనే ఈ టపా మిగిలిన భాగం చదవండి.

నా సమాధానాలు.
అడ్డం
1 . రసికరాజ తగువారము కామా (5+5+2); 6 . ణీరంతూ (తూణీరం, 3); 7 . గుడుగుడుగుంజం (6);
10 . యష్టి (2); 11 . ??; 12 . సురభి (3); 15 . పాగ (2); 17 . తిరుమల తిరుపతి దేవస్థానం (4+4+4);
20 . కినిమా (3); 22 . కోలాహలం (4); 26 . లాలన (3); 28 . ఏలే (2); 32 . జంఘాలశాస్త్రి (5);
33 . వికీపీడియా (5)

నిలువు
1 . రమణీప్రియదూతిక (8); 2 . కనితూ (తూనిక, 3); 3 . జరుగుబాటు (5); 4 . గుసగుసలు (5);
5 . కావి (2); 8 . గుండు (2); 9 . భాషాభిమానం (5); 13 . మామ (2); 14 . గరువు (3);
15 . తిలాపాపం (?, 4); 16 . గద (2); 18 . లకుమా (3); 19 . వదలం (3); 21 . నిద్ర (2);
22 . కోన (2); 23 . హలం (2); 24 . మలేసియా (4); 25 . సామజం (3); 27 . లత (2);
29 . కశా (2); 30 . ఏవి (2); 31 . కపీ (పీక, 2)

Monday, March 26, 2007

ఒక రామ కథ

వారాంతపు బ్లాగు విహారంలో గిరి గారి "అనుకుంటా" తీగె కాలికి తగిలింది. ఆ తీగె లాగితే పెద్ద డొంకే కదిలింది.
భూకైలాస్ సినిమాలో నారదుడు పాడే రామాయణ గాథ పాటలో కపటనాటకుడని ఎవర్ని అన్నారని గిరిగారికి సందేహం.
ఆ పాటని అర్థం చేసుకోవడానికి నాకు తోచిన విషయాలు ఇవి.
1. అసలు సినిమా కథ రావణుడి గురించి - అందులో కథా నాయకుడు రావణుడు.
2. రావణుడు పరమ శివభక్తుడు. దీనికి counter point గా నారదుని విష్ణుభక్తి ఈ సినిమాలో ఈ రెండు పాత్రలు తారసిల్లిన ప్రతి సారీ ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. రాధిక గారు ఉదహరించిన దేవ దేవ ధవళాచల మందిర పాటలోనే ద్వితీయార్ధం నారదుడి చేసే విష్ణు స్తుతి.
3. శివుని వర మహిమ వలన రావణుడి చేతిలో బందీగా ఉన్న పార్వతీ దేవిని అనునయించడానికి నారదుడు ఈ కథ చెబుతున్నాడు. ఈ కథ మామూలుగా చెప్పిన రామాయణ కథ కాదు. ఒక ప్రయోజనం కోసం ఒక దృక్కోణం నించి ఒక లాంటి మనోభావాలున్న పాత్ర తన వ్యాఖ్యానంతో సహా చెబుతున్న కథ.
నారదుడి వైష్ణవం ప్రసక్తి ఎందుకు తెచ్చానంటే ఆయన దృష్టిలో విష్ణువే పరమాత్ముడు. ఈ భక్తుడి గొంతు పాట మొదటినించీ చివరి దాకా స్పష్టంగా వినబడుతుంది.
"ద్వార పాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో .. రాముని అవతారం .. రవికుల సోముని అవతారం"
ఇలా ఎత్తుగడ దగ్గర్నించీ ప్రతి ఘట్టంలో, ప్రతి చరణంలో నారదుడు తన వ్యాఖ్యానంతో పరమాత్మ రూపంగానే చెపుతాడు కానీ తిన్నగా కథ చెప్పడు.
దీనికి తులనాత్మకంగా "అహో రామ కథ", "ఏమి రామ కథ శబరీ శబరీ", లవకుశ సినిమాలోని మూడు రామాయణం పాటలనీ గమనించండి. అవన్నీ రాముణ్ణి మనిషిగా, కథానాయకుడిగా చూస్తాయి. పాడిన వారు రామ భక్తులే గానీ పరమ వైష్ణవ తత్వాన్ని తెలుసుకున్నవారు కాదు. అదీ నారదుడి వైష్ణవత్వం విశేషం. కవి సముద్రాల గారు వైష్ణవులు కావటం కూడా దీనికి దోహదం చేసి ఉండవచ్చు.
ఇంకో కథా సూక్ష్మం ఏవిటంటే - రావణుడు హీరోగా ఉన్న సినిమాలో "వాడుత్త వెధవ, రాముడు పుట్టి వాణ్ణి చంపుతాడులే" అన్నట్టు రామకథ చెప్పటం కథా మర్యాదకి వ్యతిరేకం - మన హీరోని మనమే విలన్ గా చేసుకోవటం కూడదు. అందుకని రావణుడికి counter point గా నారదుణ్ణి పెట్టి ఆయన గొంతుతో రామ కథ చెప్పించారు.
ఇదేం మల్లాది చన్ద్రశేఖరశాస్త్రి గారి పురాణకాలక్షేపం కాదు, ఏదో నాకు తోచిన నాలుగు ముక్కలు మీతో పంచుకోవాలని, తద్వారా మీరు ఆ పాటని ఇంకొంచెం ఎక్కువ ఆస్వాదిస్తారేమోనని.

శ్రీనాథ్ గారు కూర్చిన ఘంటసాల పాటల ఖజానాలో ఈ పాట వినచ్చు.

పాట పూర్తి పాఠం ఇదుగో.

ద్వారపాలుర మరల దరిదీయు కృపయో
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో
రాముని అవతారం, రవికుల సోముని అవతారం
సుజన జనావన ధర్మాకారం
దుర్జన హృదయ విదారం

దాశరధిగ శ్రీకాంతుడు వెలయు
కౌసల్యా సతి తపము ఫలించు
జన్మింతురు సహజాతులు మువ్వురు
లక్ష్మణ శతృఘ్న భరతా

చదువులు నేరుచు మిషచేత
చాపము దాలిచి చేతా
విశ్వామిత్రుని వెనువెంట
యాగము కావగ చనునంట
అంతము జేయు నహల్యకి శాపము
ఒసగును సుందర రూపం

ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యా సంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో
విరిగెను మిథిలా నగరమున

కపటనాటకుని పట్టాభిషేకం
కలుగును తాత్కాలిక శోకం
భీకర కానన వాసారంభం
లోకోద్ధరణకు ప్రారంభం

భరతుని కోరిక తీరుచుకోసం
పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికి నవనవ సంతోషం
గురుజన సేవకు ఆదేశం

అదిగో చూడుము బంగరు జింక
మన్నై చనునయ్యో లంకా
హరనయనాగ్ని పరాంగన వంకా
అరిగిన మరణమె నీకింక

రమ్ము రమ్ము హే భాగవతోత్తమ
వానర కులపుంగవ హనుమ
ముద్రిక కాదిది భువన నిదానం
జీవన్ముక్తికి సోపానం

రామ రామ జయ రామ రామ
జయ రామ రామ రఘుకుల సోమ
సీతా శోక వినాశన కారి
లంకా వైభవ సంహారి

అయ్యో రావణ భక్తాగ్రేసర
అమరంబౌనిక నీ చరిత
సమయును పరసతి పై మమకారం
వెలయును ధర్మ విచారం.

Friday, March 23, 2007

అమెరికా తెలుగు వారికి అక్షరాల విందు

చేతన గారి బొమ్మల బ్లాగు "నా కేమెరా" చూసిన వాళ్ళందరికీ అమెరికాలో వెలువడే తెలుగు మాస పత్రిక "తెలుగు నాడి" గురించి తెలిసే వుంటుంది.

ఈ పత్రికలో మిగతా శీర్షికల సంగతెలా వున్నా ఇంచుమించు ప్రతీ సంచికలోనూ ముచ్చటగా మూడు కథల్ని ప్రచురిస్తుంటారు.

ఒకటి అమెరికా తెలుగు కథ - అంటే అమెరికాలో నివసించే తెలుగు రచయిత రాసిన అమెరికా జీవితానికి సంబంధించిన కథ
రెండోది ఒక వర్తమాన తెలుగు కథ - అంటే దేశవాళీ పత్రికల్లో ఈ మధ్య కాలంలో ప్రచురితమైనది
మూడోది అలనాటి తెలుగు కథ - సంపాదకుల దృష్టిలో దీని నిర్వచనమేవిటో సరిగ్గా తెలీదు కానీ ఇప్పటిదాకా ఈ శీర్షికన కనిపించిన కథల్ని చూస్తే ఇరవై ముప్ఫై ఏళ్ళకి ముందు ప్రచురితమైన ప్రముఖ రచయిత కథగా దీన్ని చెప్పుకోవచ్చు.

కథా సంకలనాలు తెలుగులో చాలానే ఉన్నాయి, పాత తరపు కథల్ని కొంచెం శాంపిల్ చూడాలంటే. కానీ తెలుగు నాడి ప్రచురించే అలనాటి కథలు చాలా మట్టుకు సంకలనాల్లో దొరకవు. కనీసం అందుకోసమైనా ఈ పత్రిక చాలా విలువైనది. అఫ్ కోర్సు, మనం కట్టే చందాకి గిట్టుబాటునిచ్చే విషయాలు ఈ పత్రికలో ఇంకా చాలా ఉన్నై.

మార్చి నెల సంచిక పోయిన వారమే చేతికందినా మొన్ననే చదివాను.
నాకు గొప్ప సంతోషం కలిగించిన విషయం - నా అభిమాన కథా రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి "వడ్ల గింజలు" నవలికని ఈ సంచిక నించీ ధారావాహికంగా ప్రచురిస్తున్నారు. ఒక గర్భ దరిద్రుడు (తంగిరాల శంకరప్ప) రాచరికం చుట్టూ ఘనీభవించిన ప్రాకారాల్ని ఛేదించుకుని పెద్దాపురం మహారాజు (మహారాజ నెలవోలు గండాంక పేషణి హనుమంత శ్రీవత్సవాయి తిమ్మగజపతి మహారాజులుంగారు) తో చదరంగం ఆడి గెలవటం ఇతివృత్తం.
ఆ భాష, ఆ సంభాషణా చాతుర్యం, ఆ పాత్రల మనస్తత్వాలు, హావభావాలు, ఆ కథ నడిపే నేర్పు, ఇక కథ చివర కొస మెరుపు - ఓహ్, ఒకటేమిటి .. మీరు చదివి అనుభవించాల్సిందే. తెలుగు భాష, తెలుగు కథ అంటే అభిమానమున్న ప్రతి ఒక్కరూ ఈ కథ చదివి తీర వలసిందని నా ఖచ్చితమైన అభిప్రాయం.
ఈ సంచికలో అలనాటి కథగా పురాణం సుబ్రహ్మణ్య శర్మ (చాలాకాలం ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకునిగా ప్రసిద్ధుడు, ఎందరో తెలుగు కథా రచయితల్ని పరిచయం చేసి పుణ్యం కట్టుకున్నవాడు) రచన "సీత జడ" ప్రచురించారు. పాత్ర చిత్రణలో, కథనంలో విచిత్రమైనది ఈ కథ.

ఈ పత్రిక మీకు ఏ షాపులోనూ దొరకదు.
పాత సంచికలు మిస్సయ్యామే అని దిగులు పడక్కర్లేదు - మీకు కావలసిన పాతసంచికల్ని కూడా డైరెక్టుగా ప్రచురణకర్తల దగ్గర్నించే కొనుక్కోవచ్చు.

మనలో మాట - సంపాదకులు నా స్నేహితులే గానీ పాపం ఆయనేం నన్నడగలేదు ఇలా టముకు వెయ్యమని. నేనే ఏదో ఇలా బహుజన హితాయ అన్నట్టు .. బ్లాగ్మిత్రులకి సేవగా ..
ఇంకెందుకు ఆలస్యం? వెంటనే చందాదారులు కండి.

Thursday, March 22, 2007

ఒక ముందు చూపు

నిన్న రాత్రి మా ఊళ్ళో "నేంసేక్" సినిమా ప్రీవ్యూ ప్రదర్శించారు.

తన కథల పుస్తకానికి పులిట్జర్ బహుమతి గెలుచుకున్న రచయిత్రి జుంపా లహిరి రాసిన మొదటి నవలకి మీరానాయర్ కల్పించిన వెండితెర రూపం. ముఖ్య దంపతులుగా తాబూ, ఇర్ఫాన్ ఖాన్, వారి కొడుకుగా కాల్ పెన్ నటించారు.


అసలు లహిరి రచనలు సినిమాలకి ఒదగవని నాకో నమ్మకం. వాటిల్లో ప్రేక్షకుల ఉత్సుకతని రేకెత్తించే హడావుడి ఏముండదు. మామూలు మనుషుల జీవితాల శకలాలు అవి. ఐతే ఆవిడ తన పాత్రలని ఎంతో శ్రద్ధతో ఆర్ద్రతతో తీర్చి దిద్దుతుంది. ఆ పాత్రలు మనకెంతో తెలిసిన వాళ్ళలాగా ఆత్మీయుల్లాగా అనిపిస్తారు. వెండితెరకి అనువదించటంలో పాత్రలకి రూపమిచ్చేది రచయిత్రి కలం కాక దర్శకురాలి కెమెరా కావటంతో - ఆ పాత్రలతో ఏర్పడాల్సిన అనుబంధం ఏర్పడదు. వాళ్ళు మనకేమీ కారు. ఎవరి జీవితాల్లోకో మనం (దొంగతనంగా) తొంగిచూస్తున్న అనుభూతి మిగుల్తుంది. హాస్యం కూడా మనం ఆ పాత్రలతో కలిసి హాయిగా నవ్వుకున్నట్టుకాక వాళ్ళని చూశి నవ్వుతున్నట్టు ఉంది.


ముఖ్య నటీనటులు తమతమ పరిధిలో బానే నటించారు. థియేటర్లో అందరూ (ముఖ్యంగా అమెరికన్ స్త్రీలు) తాబూని చూసి ఆహ్ ఊహ్ (పొగడ్తగా) అనుకున్నారుగాని, నాకైతే ఇర్ఫాన్ ఖాన్ నటన చాలా నచ్చింది. ఓవరాక్షన్ కి ఆలవాలమైన భారతీయ సినిమా నించి వచ్చి పటిష్ఠమైన కంట్రోలుతో అశోక్ పాత్రని పండించాడీయన. మక్బూల్ సినిమా చూశారా ఎవరైనా?


కాల్ పెన్ పరవాలేదు కానీ కొన్ని చోట్ల మరీ వెర్రివెంగళాయిలాగా అనిపించాడు. నవీన్ ఆండ్రూస్ ఐతే బాగుండేదేమో, కానీ అతను మరీ పెద్దవాడిలా కనిపించొచ్చు ఈ పాత్రకి. హౌరా బ్రిడ్జి, విక్టోరియా మెమోరియల్, తాజ్ మహల్ లాంటి భారతీయ దృశ్యాలు చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. వాటి వెంటనే మీరానాయర్ ట్రేడ్ మార్కు భారతీయ నగర దృశ్యాలు కళ్ళు బైర్లు కమ్మే గందరగోళంతో ప్రత్యక్షమౌతాయి - సలాం బాంబేలో ముంబాయి, మాన్సూన్ వెడింగ్ లో ఢిల్లీ, ఇప్పుడు కొలకత్తా.


నేపథ్య సంగీతం బాగుంది. యమన్, దేష్, శ్యాం కళ్యాణ్, బెంగాలీ జానపద సంగీతం బాగా ఉపయోగించారు. గంగూలీ కుటుంబం తాజ్ మహల్ని దర్శిస్తున్న ఘట్టంలో తమాషాగా హంసధ్వని వినిపిస్తుంది.

Wednesday, March 21, 2007

కుంతీసుత మధ్యముండు

ఇందాక తెలుగుబ్లాగుల గుంపులో తొంగిచూస్తే ఈ సంభాషణ కంట బడింది.
అందులో రానారె ఏదో సిద్ధాంతం చెప్పి చరసాలవారిని "ఔనంటారా" అని దబాయిస్తే ఆయన ముసిముసినవ్వు దాచుకుంటూ ఇచ్చిన గడుసు సమాధానం చూసి నవ్వొచ్చింది.
నిన్నరాత్రే పడుకునేముందు తోచక కాసేపు నర్తనశాల సినిమా చూశాను. నేను మళ్ళీ మళ్ళీ చూసే సినిమాల్లో ఇదొకటి. నా వుద్దేశంలో తెలుగు పౌరాణిక చిత్రాల్లో మాయాబజారు తరవాత బెస్టు సినిమా. రానారె-ప్రసాదు సంవాదం చదివితే అందులో ఒక డవిలాగు గుర్తొచ్చింది.

ఉత్తరకుమారుడు తన చెల్లెలు ఉత్తరకు అభిమన్యుడే తగిన వరుడని సిద్ధాంతీకరించి పక్కనే ఉన్న బృహన్నలతో "ఔనంటారా బృహన్నల గారూ?" అంటాడు. దానికి బృహన్నల గడుసు సమాధానం "మీరౌనన్నది నేను కాదంటానా? నేను కాదంటే మీరూరుకుంటారా? అందుకని ఔనే అంటాను!"

ఈ సినిమాలో మిగిలిన అంశాలన్నీ ఒక ఎత్తూ, పద్యాలు మాత్రం ఒక ఎత్తు. సందర్భోచితంగా పాత్రోచితంగా ఎక్కువ రాగాలు పెట్టి చావగొట్టకుండా క్లుప్తంగా భావపూరితంగా వాడారు పద్యాల్ని. అంతే కాదు, ఆయా సన్నివేశాల్ని చాలా చక్కగా పండించారు పద్యాల వాడుకతో. ఆ పద్యం అక్కడ లేని ఆ సన్నివేశాన్ని ఊహించలేం.
పద్యాలు ఇంత ప్రాముఖ్యత సంతరించుకోవడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి నాకు. ఒకటి, ఈ సినిమాలో వాడిన పద్యాలు ఇంచుమించు అన్నీ తిక్కనగారి మహాభారతం లోనివి. రెండు, ఆ పద్యాలన్నీ భారతకథలో ఆయా సన్నివేశాల్లో ఆయా పాత్రలు పలికిన సంభాషణలు. తన మారు వేషం తీసేసి, గాండీవం ధరించి దేవదత్తాన్ని పూరిస్తూ అర్జునుడు యుద్ధభూమిని సమీపిస్తుంటే ఇంకా మనిషి ఆనవాలు తెలియటంలేదు, శంఖారావం వినిపిస్తోంది, రథం లేపుతున్న దుమ్ము కనిపిస్తోంది.ఈ సందర్భంలో ద్రోణుడు అంటాడు.

సింగంబాకటితో గుహాంతరమున్ జేడ్పాటుమై నుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్
ఆకలి గొన్న సింహం గుహలోపల పొంచివుండి లేళ్ళ గుంపు కనపడగానే వాటి పై విరిచుకుపడ్డట్టు వనవాసంలో చిక్కిన అర్జునుడు యుద్ధాన్ని అభిలషిస్తూ నా సేనమీద దండెత్తి వస్తున్నాడహో! అని అర్థం.

మ స జ స త త గ అనే గణాలతో ఏర్పడ్డ ఈ ఛందస్సుని శార్దూలం అంటారు. అంటే పులి. అర్జునుడి సమరోత్సాహానికి సింహపు ఉద్రేకంతో ఉపమానాన్ని "పులి" ఛందస్సులో చెప్పటం అదొక చమత్కారం. అదలా ఉండగా లేళ్ళ గుంపుని చూసి ఉరికే సింహపు శౌర్యాన్ని (రెండో పాదం అంతా) "స్ఫూ, ధ, ఉద్యత్ క్రోధ" లాంటి కొరడా ఝళిపింపు చప్పుళ్ళతో ఒకే సంస్కృత సమాసంలో గుక్క తిప్పుకోకుండా చెప్పడం ఇంకో చమత్కారం.

చాన్నాళ్ళ కిందట ఫిలడెల్ఫియా నగరశివార్లలో ఒక సాయంత్రం కొందరు తెలుగుమిత్రులతో ముచ్చటిస్తూ నేను ఈ పద్యం చెప్పి, "పాపం తిక్కన గారు ఇక్కడ పప్పులో కాలేశారు. అర్జునుడు పాండవ మధ్యముడే కానీ కుంతీ సుతుల్లో చివరి వాడు." అని వ్యాఖ్యానించాను.

వెంటనే అక్కడున్న ఒక పెద్దాయన ఇలా అన్నారు. "పప్పులో కాలేసింది తిక్కనగారు కాదు, ద్రోణుడు. తిక్కనగారు ఆ పద్యాన్ని చాలా సందర్భోచితంగా, పాత్రోచితంగా రాశారు. ఆ పద్యంలో గొంతు వినండి, అందులో ఆనందం వినండి. అసలు బతికున్నాడో లేడో తెలియని ప్రియశిష్యుడు ఇలా హఠాత్తుగా కళ్ళముందు ప్రత్యక్షమయ్యేప్పటికి ఆ పరవశంలో ద్రోణుడు లెక్క తప్పినట్టు చూపించారు తిక్కన గారు. ఎంత సందర్భోచితమే చూడండి."
ఇదంతా చెప్పి ఒక క్షణం ఆగి "ఔనంటారా?" అనడిగారాయన.

ఔననక చస్తానా!

Friday, March 16, 2007

ఫాల్గుణ బహుళ ద్వాదశి


నందకాంశ సంభూతుడు, పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు అవతారం చాలించి తన ఇష్టదైవంలో లీనమైన పుణ్య దినం.

తన పదాలతో షోడశకళానిధికి షోడశోపచారములూ జరిపించి, ఆ వైభవమూర్తిని వేనోళ్ళ కొనియాడి, అంగజ జనకుని దివ్య శృంగార తారకల్ని వెలయించి, సంసారజలధిలో పడి దిక్కుతోచక కొట్టుకుంటున్న జీవాళికి మోక్షమార్గము చూపిన మహనీయుడు చిరస్మరణీయుడు.

సుమారు ముప్ఫై రెండు వేల సంకీర్తనలు (ఆయన 90 ఏళ్ళు బతికాడనుకుంటే, బతికున్న ప్రతిరోజూ ఒక కొత్త పాట రాసినట్టు!) మనకిచ్చి
చివరికి -
వేనామాల వెన్నుడా, నిన్ను వినుతించ నెంత వాడ?
కానిమ్మని నాకీ పుణ్యము గట్టితివీవే, అయ్యా!
అని ఆ పుణ్యం కాస్తా స్వామికే ఇచ్చేశాడు.
అవును నిజమే, ఆ స్వామే తనవాడైనప్పుడు ఇంక ఈ పుణ్యమెందుకు, భుజాల మీద బరువుగాక!
సుపుత్రుడు పెదతిరుమలాచార్యుడు తండ్రి తిథినాడు ఆ మహాత్ముని ఆహ్వానిస్తున్నాడు విందారగించమని.
రాళ్ళని కరగించే శ్రీరాగంలో స్వరపరిచిన ఈ కీర్తననీ, ఈ పుణ్యతిథినీ గుర్తు చేసినందుకు శ్రీ డివిఎన్ శ్రావణ కుమార్ గారికి శతకోటి వందనాలు.

Thursday, March 15, 2007

పడికట్టు

నా చిన్నప్పుడు విజయా డెయిరీ వారి పాలబూతులో వారానికొకసారి ఒక రెండు గంటల సేపు నెయ్యి అమ్మేవాళ్ళు. నాకు ఏడెనిమిదేళ్ళు ఉండొచ్చు. అప్పటికే నేను ఇంట్లో కావలసిన అత్యవసర వస్తువులు పచారీ కొట్టు నించి అప్పుడప్పుడూ తెచ్చి పెడుతూ ఉండేవాణ్ణి. చిల్లర సరిగ్గా లెక్కపెట్టి తెచ్చుకోవటం, కొట్టతను సరైన తూకపు రాయి వేశాడా తక్కెడలో అని గమనించటం లాంటి జాగ్రత్తలు బానే తెలుసు.

నెయ్యితో కొంచెం క్లిష్ట పరిస్థితులున్నయ్యి. ఒకటి ద్రవ పదార్థం కావటం. రెండు ఖరీదైనది కావటం. పైగా ఆ నెయ్యి అమ్మే పాలబూతుకి పెద్ద రోడ్డు మీద వెళ్ళాలి. నేను సరిగ్గా తేలేనేమో అని మా అమ్మకి భయం, అందుకని నెయ్యి తెచ్చే బాధ్యత నాకెప్పుడూ ఇవ్వలేదు - అప్పటిదాకా.

ఒక రోజు అకస్మాత్తుగా నన్ను నెయ్యి కొనుక్కు రమ్మంది. ఆ పూట నాకంటే పెద్దవాళ్ళెవరూ అందుబాటులో లేరు. మిగిలిన నెయ్యి మరుసటి వారం దాకా సరిపోదు. ఇక నన్ను పంపక తప్పలేదు.

ఆహా! మనకి ప్రమోషనన్న మాట - అనుకుని గర్వపడి పోయాను. నెయ్యి తెచ్చే "స్టీలు కేరేజీ" తొందరగా ఇవ్వు మరీ అని చెయ్యి చాపాను. అమ్మా, మా అమ్మ అంత తొందరగా అంత పెద్ద బాధ్యత నా చేతిలో పెడుతుందా?

రోడ్డుకి పక్కగా తప్పుకుని నడు. సైకిళ్ళ వాళ్ళు దూకుడుగా వస్తుంటారు, జాగ్రత్తగా చూసుకుంటూ నడు. కేరేజీని గట్టిగా ఊపకు. వంటింట్లోంచి కేరేజి తెచ్చి నా చేతికిచ్చి, డబ్బులు లెక్కపెట్టి నా జేబులో పెట్టే వరకూ ఇలా జాగ్రత్తల దండకం చదువుతూనే ఉంది. అన్నిటికీ బుద్ధిగా తల ఊపుతున్నా, ఎక్కడ తన మనసు మార్చేసుకుని నన్ను పంపదో అని. తీరా చెప్పులేసుకుని గుమ్మం దాట బోయే సమయానికి ఈ హెచ్చరిక - పడి కట్టించటం మర్చిపోకు!

ముందరికాళ్ళకి బంధాలు పడ్డాయి. ఇన్నాళ్ళ నా కొనుగోలు అనుభవంలో ఈ స్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. అసలు మా అమ్మ ఏమందో అర్థం కాలేదు. ఏం కట్టించటం?

"పడి, పడి కట్టించు, నెయ్యి పోసే ముందు."

"పడి అంటే ఏంటి? అదెలా కడతారు?" అడక్క తప్పలేదు. తెలీదని ఒప్పుకుంటే పంపదేమోనని ఒక భయం. తెలిసినట్టు తలూపేసి వెళ్ళిపోతే, తీరా అదేదో సరిగ్గా జరక్క పోతే .. నా బుర్ర ఆ పర్యవసానాన్ని ఊహించలేక పోయింది.

"హోర్నీ. నీకింతవరకూ పడికట్టటం అంటే తెలీదూ?"

అప్పుడు తెల్సుకున్నాను పడికట్టుని గురించి. ఇప్పుడు నెయ్యి కొనుక్కోటానికి మనం ఒక స్టీలు కేరేజీ తీసుకెళతాం కదా. మనం కొనేది ఏ అరకిలోనో. కొట్టువాడు అరకిలో రాయి తక్కెడ ఒక పళ్ళెంలో వేసి రెండో పళ్ళెంలో మన కేరేజీ పెట్టి దాంట్లో నెయ్యి పోసిస్తే ... మన కేరేజీయే ఒక మూడు నాలుగొందల గ్రాముల బరువుంటుంది కదా, అంటే మనకి వొచ్చేది ఒక వంద గ్రాముల నెయ్యేనన్న మాట. నెయ్యి బోలెడు ఖరీదని ముందే చెప్పాను కదా.

అందుకని ముందు ఖాళీ కేరేజీని తక్కెడ పళ్ళెంలో ఉంచి దాని బరువుకి బేలెన్సుగా రాళ్ళ పళ్ళెంలో కొన్ని రాళ్ళు పెడతారు. తక్కెడ సమతూకానికి వచ్చాక అప్పుడు రాళ్ళ పళ్ళేనికి అరకేజీ రాయి చేర్చి నెయ్యి తూచాలి - అప్పుడే మనకి అరకిలో నెయ్యీ పూరాగా వచ్చినట్టు.

ఈ ప్రక్రియని పడి కట్టడం అంటారు. కేరేజీ బరువుని తూచడానికి వేసే రాళ్ళని పడికట్టు రాళ్ళు అంటారు. వాడుతూ ఉంటాం, కానీ వాటి వల్ల ఏమీ విలువ సమకూరదు.

పడికట్టు మాటలు కూడ అంతే!

బ్లాగ్పేరడీలు


రెండు ప్రసిద్ధమైన పోతన పద్యాలకి బ్లాగ్పేరడీలు
ఆనందించండి.

క. బ్లాగెడిది బ్లాగవతమట
బ్లాగించెడివాడు రామబ్లాగుండట నే
బ్లాగిన తోడనె ఇండీ
బ్లాగులలో బెస్టు కాక బ్లాగగ నేలా?

క. బ్లాగర్షులు బ్లాగేశులు
బ్లాగస్థులు గిలుకు సకల బ్లాగులలో పెం
బ్లాగుగ నెవ్వడు గిలుకునొ
బ్లాగనుశాసనుడు వాడె, బ్లాగుగ గొలుతున్.

పందిని పొడిచినవాడే బంటు, కందం రాసినవాడే కవి అని సామెత.
అంటే నేనూ కవినేనోచ్!

ఆరాధ్య దేవతకి అక్షర నీరాజనం

ఈ సినీతారల అభిమానులుంటారే - ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క నిర్మాణాత్మకమైన పని చేసినట్టు కనపడిందా మీకు?
ఆయనేం ధనవంతుడు కాదు, ఆయన వెనక పెద్ద బలగమూ లేదు. కానీ ఒక మంచి పని తలపెడితే వనరులు అవే కూడుకున్నై. ఒక వీరాభిమాని తన ఆరాధ్య సినీదేవతకి చివరిసారి అక్షర నీరాజనం పట్టాడు. తద్వారా తెలుగు సినిమాభిమానులందరికీ ఒక మధుర జ్ఞాపికని అందించాడు. 2005 డిశంబరులో తనువు చాలించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డా. పాలువాయి భానుమతికి అభిమాని భమిడిపాటి రామగోపాలం (భరాగో) పట్టిన ముత్యాల హారతి ఈ స్మృతి సంచిక - మహామహిళ.

వారపత్రికల సైజులో 195 పుటలతో బాపూ గీసిన వర్ణముఖచిత్రం (భానుమతిని సంగీత సాహిత్య సరస్వతిగా రూపిస్తూ) ముఖచిత్రంగా. లోపల కొందరు ప్రముఖులు (శివాజీ గణేశన్, తనికెళ్ళ భరణి, డి.వి. నరసరాజు), ఎందరో అప్రముఖులు, కొందరు భానుమతి కుటుంబాన్ని సన్నిహితంగా ఎరిగిన వారు, మరి కొందరు వృత్తిరీత్యా మాత్రమే ఎరిగిన వారు పంచుకున్న జ్ఞాపకాలు, అనుభవాలు. ఆవిడకున్న అఖండమైన ఆత్మవిశ్వాసం, ఈ వ్యాసాలు రాసిన వ్యక్తుల్ని ఏదో ఒక సందర్భంలో ఆదరించిన ఆవిడ ఔదార్యం, ఆవిడ గొప్ప గాత్రం - ఇంతకంటే ఈ వ్యాసాల్లో భానుమతిని గురించి వ్యక్తిపరంగా గానీ వృత్తిపరంగా గానీ మనకి కొత్తగా తెలిసేదేం లేదు.

ఈ పుస్తకాని కంతకీ హైలైటు ఫొటోలు. ఎక్కెడెక్కడి ఫొటోలూ - భానుమతి మొట్టమొదటి సినిమాల నుంచీ 90లలో చేసిన సినిమాల వరకూ సినిమాల స్టిల్స్, పాత సినిమాల పోస్టర్లు, భానుమతీరామకృష్ణల కుటుంబ చిత్రాలు, ఎవార్డులూ బిరుదులూ అందుకుంటూ, ప్రముఖులతో ఫొటోలు - ఈ ఫొటోలే తెలుగు సినిమాభిమానులకి ఈ పుస్తకాన్ని చాలా విలువైనదిగా చేస్తున్నాయి.
ఫోటోలన్నీ వేటికవే గొప్పగా ఉన్నై.
అందులోనూ నామట్టుకి నాకు స్పెషల్ గా అనిపించినవి -
రాజ్ కపూర్ చెన్నై వచ్చిన సందర్భంలో దిగిన గ్రూప్ ఫొటో (ఎన్టీ ఆర్, ఏఎన్నార్, అంజలి, జి. వరలక్ష్మి కూడా ఉన్నారు)
1947 ఆగస్టు 15 న ఆలిండీయా రేడియో కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖుల గ్రూప్ ఫొటో (అప్పటి మహామహులు చాలా మంది ఉన్నారిందులో)
వ్యాసాల్లో - భానుమతికి సంగీత గురువైన దొడ్డవరం చంద్రశేఖరం గారి గురించి ఒంగోలు వాస్తవ్యులు శింగంశెట్టి శివరామకృష్ణ గారు రాసిన "నేపథ్యం"
భరణీ పిక్చర్స్ వారి ఆస్థాన రచయిత రావూరి సత్యనారాయణరావు గారి కుమార్తె టి. జ్ఞానప్రసూన గుర్తు చేసుకున్న వ్యక్తిగత మధురానుభవాలు
భానుమతి పాటల్లో కర్ణాటక సంగీత విశేషాలను గురించి విదుషీమణి వింజమూరి లక్ష్మి గారి జ్ఞాపకాలుఈ మూడూ చెప్పుకో దగ్గవి అనిపించాయి.
అన్నట్టు తెలుగులో ఆవిడ పాడిన పాటలన్నిటి సాహిత్యమూ, అన్ని భాషల్లో ఆవిడ నటించిన సినిమాల లిస్టూ కూడా ఉన్నాయి ఈ పుస్తకంలో.
దీన్ని స్మృతి సంచిక అన్నారు. ఈ పుస్తకమొచ్చి భానుమతి స్మృతిని కొత్తగా నిలబెట్టేదేం లేదు - ఆ పని ఆవిడకున్న అసాధారణ ప్రతిభ, వ్యక్తిత్వమే చేస్తాయి ఎలాగూ. ఎటొచ్చీ భరాగో తన భక్తికి ఒక నిర్దిష్ట రూపమిచ్చుకున్నాడు ఈ పుస్తకంతో. పనిలో పనిగా మనలాంటి వాళ్ళకి ఈ మహామహిళతో ఒక మంచి ఫొటో ఆల్బం ఇచ్చాడు మళ్ళీ మళ్ళీ చూసుకుని ఆనందించేందుకు.

ప్రచురణ కర్తలు: జ్యేష్ఠ లిటరరీ ట్రస్టు, విశాఖ (891-2535550)
వెల: రూ 160
దొరకు చోట్లు: నవోదయ బుక్ హౌస్, కాచిగూడ (40-24652387)
నవోదయ పబ్లిషర్స్, విజయవాడ (866-2573500)
అజొవిభొకం ఫౌండేషన్ ఇంటర్నెట్ బుక్ షాపు

Sunday, March 11, 2007

త్యాగరాజ యోగ వైభవం


ఆనంద భైరవి రాగం, రూపక తాళం
ముద్దుస్వామి దీక్షిత కృతం

ప|| త్యాగరాజ యోగ వైభవం, సదా శివం, సదాశ్రయామి

అ|| త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజ
యోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం

చ|| నాగరాజ వినుత పదం, నాదబిందు కళాస్పదం
యోగిరాజ విదిత ప్రదం, యుగ పద్భోగ మోక్ష ప్రదం
యోగరూడ నామరూప విశ్వసృష్ట్యాది కరణం
యుగ పరివృత్త్యాబ్ద మాస దిన ఘటికాద్యావరణం

శ్రీ గురుగుహ గురుం, సచ్చిదానంద భైరవీశం
శివ శక్త్యాది సకల తత్త్వ స్వరూప ప్రకాశం
శం, ప్రకాశం, స్వరూప ప్రకాశం, తత్త్వ స్వరూప ప్రకాశం,
సకల తత్త్వ స్వరూప ప్రకాశం,
శివ శక్త్యాది సకల తత్త్వ స్వరూప ప్రకాశం

గోపుఛ్ఛ యతి వరుస: ఆవు తోక లాగా మొదట లావుగా ఉండి రాను రాను సన్నబడే మాటల ప్రయోగం.
త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగ వైభవం, రాజ యోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం

త్యాగరాజ యోగ వైభవం = త్యాగమునందు రాజైన ఆ పరమేశ్వరుని యోగము యొక్క వైభవము
త్యాగము చేతనే అమృతత్వము లభించును. యోగము దానికి మార్గము. యోగమును ఉపదేశించినవాడు ఈశ్వరుడు. ఐశ్వర్య దాత అగుటచే అతని వైభవము ఇది. ఐశ్వర్యమంటే ధనము కాదు - ఈశ్వరుని లక్షణము, ఈశ్వరుడు ఇచ్చినది ఐశ్వర్యము. భావమేమంటే త్యాగము, యోగము, వైభవము - ఈ మూడింటికీ మూలము ఆయనయే.
అగరాజ యోగ వైభవం = పర్వతరాజు హిమవంతుని యోగముచే పార్వతిని పాణిగ్రహణమొనర్చిన వైభవము కలవానిని
రాజయోగవైభవం = జీవులకు మహారాజ యోగమునిచ్చు వైభవము గలవానిని, లేక రాజాధిరాజులచే సేవించబడు వైభవము కలవానిని
యోగ వైభవం = జీవాత్మ పరమాత్మల అనుసంధానము యోగము. అర్థనారీశ్వరుడై ఈ సంధానమునకు ప్రతీక అయిన వైభవము కలవానిని
వైభవం = విభవము కలవానిని
భవం = భవుని, ఈశ్వరుని (వానిన్ ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్ - అని భాగవత పద్యం).
వం = అమృత స్వరూపుని.
________________________________

స్రోతోవాహ యతి వరుస: నదీప్రవాహం లాగా మొదట్లో సన్నగా వుండి రాను రాను పెద్దదయే పద ప్రయోగం.
శం, ప్రకాశం, స్వరూప ప్రకాశం, తత్త్వ స్వరూప ప్రకాశం,
సకల తత్త్వ స్వరూప ప్రకాశం,
శివ శక్త్యాది సకల తత్త్వ స్వరూప ప్రకాశం
శం = సుఖమొసగు వానిని (శంకరుడు అంటే అర్థం ఇదే)
ప్రకాశం = వెలుగు వానిని
స్వరూప ప్రకాశం = స్వంత రూపముతో వెలుగు వానిని
తత్త్వ స్వరూప ప్రకాశం = వేదార్థమైన రూపముతో వెలుగు వానిని
సకల తత్త్వ స్వరూప ప్రకాశం = సర్వమైన వేదార్థముల రూపముతో వెలుగు వానిని
శివ శక్త్యాది సకల తత్త్వ స్వరూప ప్రకాశం = వేదార్థములనగా వేరేమియు కాదు శివ శక్తి - ప్రకృతి పురుష తత్త్వమే. ఈ వేదాంత సూక్ష్మమును తనలో దాచుకొని వెలుగు వానిని .. అని అర్థం.

కృతిలో యతి ప్రాముఖ్యత:
సంగీతమునకు "శ్రుతిర్మాతా లయః పితా" - శ్రుతి తల్లి, లయ తండ్రి.
లయ పాటను నడిపించును.
లయను నిర్దేశించునది తాళము.
తాళమునకు పది ప్రాణములు - కాలము, మార్గము, క్రియ, అంగము, గ్రహము, జాతి, కళ, లయ, యతి, ప్రస్తారము.
త్యాగరాజస్వామి కూడా సొగసుగా మృదంగ తాళము అనే కృతిలో "యతి విశ్రమ సద్భక్తి" అని చెప్పినారు.
యతి ఆరు విధములు.
ఇందులో గోపుఛ్ఛయతి వరుసగా 16, 12, 8, 4, 2, 1 అక్షరముల నిడివితో వచ్చును. ఇక్కడ అక్షరమనగా రాసిన అక్షరము కాదు, పాడునప్పుడు తాళము వేయుటలో రెండు తట్టులకు మధ్యనుండు కాలము (the smallest time interval in a taala, a beat).
స్రోతోవాహ యతి సరిగా దీనికి వ్యతిరేకము. 1, 2, 4, 8, 12, 16 అక్షరములతో వెలయుచున్నది.
ఈ యతుల ప్రయోగములో గూఢార్థముగ విశ్వరూపము నుంచి అణువు వరకు, అణువు నుంచి విశ్వరూపము వరకు సర్వము నిండియున్న ఈశ్వర తత్త్వమును దీక్షితులు ఆవిష్కరించినారు.
___________________________
"దీక్షిత కృతిరచనా దక్షత" అనే పుస్తకములో సంగీత సాహిత్య విద్యా విశారద శ్రీ నిరాఘాటం శ్రీరామకృష్ణ శాస్త్రిగారు రచించిన వ్యాఖ్య ఈ వ్యాసమునకు ప్రాణము. దానికి నా మిడిమిడి జ్ఞానాన్ని జోడించి మీముందుంచుతున్నాను. దీక్షితుల కృతులపై ఆసక్తి ఉన్నవారికి ఈ పుస్తకము ఒక వరము.
______________________________
శ్రీరామా, వింటున్నావా. ఇటువంటి చమత్కార యతి ప్రయోగములు నారాయణతీర్థుల తరంగములలో కనిపించునని శ్రీ శాస్త్రిగారు శలవిచ్చారు (నువ్వు చెప్పినటే!). నాకు తరంగాల సాహిత్యం బాగా తెలీదు గనక నేను దానిగురించి ఏమీ చెప్పలేను. ఓపిక ఉన్నవాళ్ళు ఆంధ్రభారతి సైటుకి వెళ్ళి వెతికి చెపితే బావుంటుంది.

Saturday, March 10, 2007

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు1998 లోనో 99లోనో - సరిగ్గా గుర్తులేదు - ఒక స్నేహితురాలి ప్రోద్బలంతో ఒక గురువారం సాయంత్రం ఏన్ ఆర్బర్ లో ఒక యోగా తరగతికి వెళ్ళాను. ఆ తరగతిని నడుపుతున్నది ఒక తెల్లావిడ. బార్బరా లిండర్మన్. మొదటగా చూడగానే గౌరవభావం కలిగించే రూపం. తెలుపూ నలుపూ సమపాళ్ళలో కలగలిసి రింగులు తిరిగి పొట్టిగా కత్తిరించుకున్న జుట్టు. పెద్ద ఫ్రేమున్న కళ్ళద్దాలు. ఎంతో దయతో స్నేహపూర్వకంగా చూసే కళ్ళు. చక్కని చిరునవ్వు. మృదువైన గొంతు. పొడుగ్గా సన్నగా రివటలాంటి శరీరం. మొదటిసారి వస్తున్నారా, మీరు ఇండియా నించి అల్లే వుందే, చాలా సంతోషం. మీరిది ఆనందిస్తారని ఆశిస్తాను అంటూ ఆహ్వానించారు. మాకు చోటు చూపించారు. చూస్తుండగానే ఆ హాలు కొంచెం చోటు కూడా మిగలకుండా నిండిపోయింది. నాకు తరవాత తెలిసింది, ఆ గురువారపు తరగతి ఆ ఊరి మొత్తానికీ చాలా పాప్యులర్ అని. ఆ మొదటి తరగతి అనుభవం ఎలా జరిగిందో నాకిప్పుడు గుర్తు లేదు. కానీ ప్రతి గురువారం నేనా తరగతికి హాజరవటం మొదలు పెట్టాను. నెమ్మది మీద ఆమె నడిపే బుధ శుక్ర వారాల ఉదయపు తరగతులకి కూడా వెళ్ళటం సాగించాను. ఇది నేను 2002 లో ఆ నగరం వదిలిపెట్టే వరకూ సాగింది.

బార్బ్ గురువారపు తరగతి చాలా చిత్రమైనది. దాని పేరు Poses to Sacred Music. సుమారు గంటన్నర క్లాసు ఐదారు విభాగాలుగా సాగేది. ప్రతి విభాగానికీ ఒక పాటో, కొన్ని పాటల వరుసో నేపధ్య సంగీతం. అన్నిటికంటే తమాషా ఏవిటంటే మూణ్ణెల్లకోసారి ఈ sacred music మారిపోయేది. ఒక మూణ్ణెల్లు హిందూ భజనలు. ఒక మూణ్ణెల్లు కిరస్తానీ భజనలు. మూడో క్వార్టరులో ముస్లిము భజనలు (ఔను ఉన్నాయి, వింటానికి చాలా బావుంటాయి కూడా). చివరు మూణ్ణెల్లూ, వివిధ మతాల భజనలు (టిబెటను బౌద్ధము, నేటివ్ అమెరికనుల ప్రార్థనలు, ఆఫ్రికను ప్రార్థనలు, ఇలా). మారిన సంగీతానికి తగ్గట్టు విన్యాసంలో కొద్దిగా మార్పులు చేసేవారుగాని, మొత్తమ్మీద ప్రోగ్రాము ఒకలాగానే ఉండేది సంవత్సరం పొడుగునా. చివరి ఐదు నిమిషాలు శవాసనం. మా శరీరాల్ని మనసుల్ని విశ్రమింప చెయ్యటానికి తన మెత్తటి గొంతుతో సూచనలు చెపుతూ మమ్మల్ని ఆ అంతర్లోకంలోకి చేరవేసేవారామె. మళ్ళీ అంతే మృదువుగా మాట్లాడుతూ ఆ యోగనిద్రలోంచి మేలుకొలిపి ఆ వారంలో తనకి తోచిన ఒక మంచి ఆలోచనో, లేక ఎక్కడన్నా చదివిన/విన్న కొటేషనో, మనసుకి ఉత్తేజం కలిగించే మాటలు చెప్పేవారు.

ఆమె ఏ ఒక్క మతాన్ని గుడ్డిగా నమ్మి అనుసరించినట్టు కనపడదు. ఆమెని బౌద్ధ గురువుల ఉపన్యాసాలు, ధ్యాన కేంద్రాల్లో చూశాను, హిందూ కీర్తన సభల్లో చూశాను, క్రిస్మసు టైములో యూనిటేరియన్ యూనివర్సలిస్టు చర్చి కార్యక్రమాల్లో చూశాను. యోగము, దయ, మానవత్వమూ ఆమె నమ్మి ఆచరించిన ముఖ్యసూత్రాలు.

బార్బ్ తరగతిలో యోగవిన్యాసాలు ఒక అనుభవమైతే, ఆమెతో పరిచయం, సాహచర్యం, ఆమె దయని ప్రత్యక్షంగా చూస్తూ దాని ఫలితాలు అనుభవిస్తూ ఉండడం, ఆమె ద్వారా పరిచయమైన ఇతర అద్భుతమైన వ్యక్తులు, ఆమె ప్రోద్బలంతో మేము హాజరై ఎంతో ఆనందించిన అనేక కార్యక్రమాలు .. అవ్యాజంగా ఆమెకి మా మీద కలిగిన వాత్సల్యం - మాటల్లో వర్ణించలేను.

బార్బరా లిండర్మన్ ఫిబ్రవరి 24న స్వర్గస్తులైనారని ఇవ్వాళ్ళే తెలిసింది. 72 ఏళ్ళు. అమెరికాలో ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్న స్త్రీ పోవలసిన వయసు కాదు. ఒకటనిపిస్తుంది - అల్లకల్లోలమవుతున్న ఈ ప్రపంచానికి ఒక దిక్కూ తెన్నూ చూపించడానికి ఆ పైవాడికి ఇలాంటి సమర్ధులైన స్త్రీల అవసరం అర్జంటు అనిపించి పిలిపించుకున్నాడేమో నని.

Wednesday, March 7, 2007

గోపుఛ్ఛ యతి

ముత్తుస్వామి దీక్షితుల వారి కృతులు అనేక శబ్ద చమత్కారాలతో అలరారుతుంటాయి. చిన్నప్పణ్ణించీ ఘంటసాల వారి గొంతులో వాతాపి గణపతింభజే కృతి వింటూనే వున్నా, ఆ కృతిలోని అంత్యప్రాసలకి - అవేవిటో తెలియని స్థితిలో కూడా - ముగ్ధుణ్ణి అవుతూనే ఉన్నాను. కొంచెం రాగాల గురించి తెలుసుకుని వాటిని గుర్తుపట్టటం నేర్చుకుని దాంతోబాటుగా సాహిత్యం మీద కూడా కాస్తంత శ్రద్ధపెట్టి వినడం అలవాటు చేసుకుంటున్న స్థాయిలో .. ఈ కృతి హంసధ్వని రాగమనీ, ఆ రాగం పేరు కృతి సాహిత్యంలో ఇమిడి ఉందనీ గమనించినప్పుడు.. ఎంత ఆనంద పడిపోయానో చెప్పలేను. గట్టిగా అరిచి మా అమ్మకి చెప్పాను. మా అమ్మ నవ్వి, ఔను, మనలాంటి వాళ్ళం ఆయనరాగాలు గుర్తుపట్టలేమేమోనని మహానుభావుడు చక్కగా పాటలోనే రాగం పేర్లు వచ్చేట్టు రాశాడు అంది.

నాకు సుమారు పధ్నాలుగేళ్ళప్పుడు అనుకుంటా మా అమ్మ మదురై మణి అయ్యరుగారి రికార్డొకటి కొనుక్కొచ్చింది. అందులో ఆయన "మాయే త్వం యాహి" అనే కృతి పాడారు. మణి అయ్యరుగారి ఉచ్చారణ అర్థం చేసుకోవటం ఒక బ్రహ్మ ప్రయత్నం. ఐనా ఆ కృతిలోని శబ్ద చమత్కారం నన్ను ఇట్టే ఆకట్టుకుంది. ఆ సాయంత్రమే ఆ కృతిని ఒక పది సార్లు వినివుంటాను. మరునాడు లేవంగానే మళ్ళీ. మా అమ్మ గొడవ - రికార్డు అరిగి పోతుందిరా - అని.

నన్నింతగా ఆకట్టుకున్నది ఆ కృతిలో ఒక వరుస - ఇలా వస్తుంది.
సరసకాయె రసకాయె సకాయె ఆయె.. మాయే త్వం యాహి..
ఈ మాటల మాయాజాలం ఏవిటో అర్థం చేసుకోవడానికైనా సంస్కృతం నేర్చేసుకోవాలన్నంత హడావుడి పడిపోయాను.

ఈ చమత్కారాన్నే గోపుఛ్ఛయతి అంటారుట - నిన్న కృష్ణమోహనరావుగారి వ్యాఖ్యతో తెలిసింది.

నెమ్మదిమీద దీక్షితుల కృతులు వినగా వినగా మరికొన్ని ఉదాహరణలు ఎదురయ్యాయి. ఇవి కేవలం నాకు గుర్తున్నట్టు రాస్తున్నాను - తప్పులుంటే క్షమించండి.

ఆనందభైరవి - త్యాగరాజ యోగ వైభవం
త్యాగరాజ యోగ వైభవం, అగరాజ యోగవైభవం, రాజయోగ వైభవం, యోగ వైభవం, వైభవం, భవం, వం.

ఈ కృతిలోనే చరణంలో వ్యతిరేక శ్రేణిలో ప్రయోగం కూడా ఉంది.
ప్రకాశం, సంప్రకాశం, స్వరూప ప్రకాశం, తత్త్వ స్వరూప ప్రకాశం, సకల తత్త్వ స్వరూప ప్రకాశం, శివశక్త్యాది సకల తత్త్వ స్వరూప ప్రకాశం

ఈ వ్యతిరేక శ్రేణిని స్రోతోవాహ యతి అని పిలుస్తారుట, కృష్ణమోహన రావుగారు ఇప్పుడే చెప్పారు.

తరంగిణి - మాయే త్వం యాహి
సరసకాయె రసకాయె సకాయె ఆయె

శ్రీ - శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం
శ్రీ సారసపదే రసపదే సపదే పదే పదే

ఇప్పటికింతే గుర్తున్నాయి. మీక్కూడా ఏవైనా గుర్తొస్తే చెప్పండి.

దీక్షితుల కృతుల సాహిత్యం శ్రీ టాడ్ మెక్కోంబ్ గారి కృషి ఫలితం RTS లో మేళకర్త రాగపు వరుసలో ఇక్కడ చూడొచ్చు. సాహిత్యం వెంటనే ఆంగ్ల అనువాదాలు కూడా ఉన్నాయి.

Tuesday, March 6, 2007

దీక్షితుల రచనా దక్షత

ఇది ఈమాటలో మన తెలుగు బ్లాగాస్థాన గురువులు పప్పు నాగరాజుగారి వ్యాసానికి శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావుగారి వ్యాఖ్య. ఇందులో వారు చెప్పిన విషయాలు ఇక్కడ సంగీతమంటే ఆసక్తి ఉన్నవారికి ఉపయోగపడతాయని పెడుతున్నాను.

కృష్ణమోహనరావుగారు రచ్చబండ తెలుగు యాహూగ్రూపులో ఛందో విజ్ఞాన సంబంధమైన జాబులు తరచూ రాస్తుంటారు.
*** *** *** *** ***

శ్రీ ముత్తుస్వామి దీక్షితులు మూడు సంగీత పద్ధతులలోఆరితేరినవారు. వారి తండ్రి రామస్వామి దీక్షితులు కూడ సంగీత విద్వాంసులే. వీరు హంసధ్వని రాగమును కనుగొన్నారు. ముత్తుస్వామి గాత్ర సంగీతమును మాత్రమే గాక వీణను కూడ నేర్చుకొన్నారు. వారు పాడునప్పుడు
వీణను కూడ వాయించెడివారు. వీణతో కలిపి పాడుచుండుటచే వారు చౌక (లేక విలంబిత) కాలమును ఎక్కువగా వారి కీర్తనలలో వాడెడివారు. చివర మధ్యమకాలము సామాన్యముగా కీర్తనలలో నుండును. వీరు ఐదారు ఏళ్ళు కాశీలో గడిపినారు. కావున వీరికి హిందూస్తానీ సంగీతముతో బాగుగా పరిచయము. హిందూస్తానీ రాగములను తన కీర్తనలలో వాడియున్నారు (జంఝూటి, జయజయవంతి, యమన్, సారంగ, బృందావనసారంగ, ఇత్యాదులు).

వీరు వీరి తండ్రిగారితో మదరాసు సమీపమున నున్న మణలిలో కొన్ని సంవత్సరములు ఉన్నారు. మణలికి నాయకుడు వేంకటకృష్ణ ముదలియార్. వీరు దుబాసి, సెయింట్ జార్జ్ కోటలో పని చేసెడివారు. అప్పుడప్పుడు ముత్తుస్వామిని, వారి తమ్ముడైన బాలాస్వామిని
కోటకు తీసికొని వెళ్ళేవారు. ఆ సమయములో అక్కడ పాశ్చిమాత్య బ్యాండ్ మేళమును వినేవారు. సి మేజర్‌కు సరిపోయే
శంకరాభరణములో నోటు(ట్టు) స్వరములను వ్రాసినారు. సుమారు నలభైకు పైన సంస్కృతములో వ్రాసినారు. నేడు కూడ ఇట్టి నోటుస్వరాలు కచేరీల చివరలో తుకడలుగా పాడుతారు. ఇంగ్లాండ్ రాష్ట్రగీతమైన గాడ్ సేవ్ ది కింగ్ మెట్టులో సంస్కృతములో వ్రాసినారు! వీరి తమ్ముడు బాలాస్వామి ఒక ఆంగ్లేయునిచేత ఫిడేల్ నేర్చుకొన్నారు. వారి తండ్రిగారి సలహా ననుసరించి ముత్తుస్వామి కచేరీలలో వయలిన్ వాయించేవారు. ఇదే కర్ణాటక సంగీతములో మొట్టమొదట వయలిన్‌ను పక్కవాద్యముగా ఉపయోగించుట. అంతకు ముందు వీణను ఉపయోగించేవారు.

మూడు సంగీత సంప్రదాయాలను అవగాహన చేసికొని అందులో ఘనతను సాధించారు దీక్షితులవారు.

వీరి సంస్కృత కృతులలో ప్రాస, అనుప్రాస, అంత్యప్రాస, యతి, గోపుచ్ఛయతి, బీజాక్షరములు, ముద్రాలంకరము (రాగము పేరు
పాటలో వచ్చుట), ఇత్యాదులు ఎక్కువ. వీరికి భక్తి మాత్రమే కాదు, విభక్తి అంటే కూడ ఇష్టమే. వీరి విభక్తి పాటలు ఒక ప్రత్యేకత. ఒక్కొక్క పాటను ఒక విభక్తిలో వ్రాయుట ఇందులోని విశేషము. ఎనిమిది విభక్తులలో వీరు ఎన్నియో పాటలను వ్రాసియున్నారు. పాటలలో ఉదాహరణ లనవచ్చును వీటిని.

మాత్రుష్కా బొమ్మలాగు పదములలో పదములుంచి వ్రాయుట వీరి కృతులలోని మరొక విశేషము. శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం, వసుప్రదే, శ్రీ సారసపదే, రసపదే, సపదే, పదే పదే, ఇత్యాదులు. దీనికి గోపుచ్ఛయతి అని పేరు.

ఇవన్నీ రచయితకు తెలిసియుండవచ్చు. స్థలాభావమువల్ల వ్రాసియుండక పోవచ్చు. కాని అందరికీ ఇవి తెలిసిన మంచిదని
నేను తెలియజేయుచున్నాను.

Monday, March 5, 2007

వీటిల్లో మీరేవైనా చదివారా?

ఆంధ్రజ్యోతి దినపత్రిక సోమవారం సంచికలో వచ్చే "వివిధ" తెలుగు సాహిత్యమంటే ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది.
ఇవ్వాళ్టి సంచికలో 2006 సంవత్సరంలో వెలువడిన తెలుగు కథల గురించి పలువురు ప్రముఖ కథా రచయితలు విమర్శకుల నుండి సేకరించిన అభిప్రాయాలతో ఖదీర్ వ్యాసం చదవండి.

వీటిల్లో మీరేవైనా చదివారా?

Friday, March 2, 2007

మోహన రాగ మహా - 3, 4వీటిల్ని గురించి కూడా కొంచెం విపులంగా రాద్దామనుకున్నాను గానీ ఈ వారంలో బొత్తిగా సమయం చిక్కలేదు. ఇంక దీని సంగతి అసలు మరిచిపోయే బదులు క్లుప్తంగా నైనా సరే చెప్పుకోవటం మేలు గదా.
మూడో మోహనం కూడా యాదృఛ్ఛికంగానే తగిలింది. పాడింది అరుణా సాయిరాం. ఈవిడ గాత్రం కొంచెం విచిత్రంగా ఉంటుంది. గొంతు విప్పితే ఎక్కడ ఏమి ఒలికిపోతుందో అన్నట్టు గుసగుసగా పాడే ఈ తరం యువగాయనీ మణుల్లా కాకుండా చక్కగా గొంతు విప్పి పాడతారు. ఇలా బలంగా పాడటంలోనే ఒక లాంటి కర్కశత్వం ధ్వనిస్తూ ఉంటుంది. ఈ లక్షణం ఆమె పదాలు స్పష్టంగా పలికేప్పుడు కూడా కనిపిస్తుంది. ఐనా అందులోనూ ఒక ఆకర్షణ ఉంటుంది. ఈమె పోయినేడాది క్లీవ్‌లాండ్ ఆరాధనకి వచ్చారు. కారిడార్లలో తారస పడేవారు, పచ్చగా ఉండి, ఎప్పుడు ప్రశాంతంగా చక్కటి చిరునవ్వుతో కనిపించేవారు. తీరా ఆవిడ కచ్చేరీ ఎప్పుడో వారం మధ్యలో పెట్టారు, నేను విననే లేదు. ఈమెని గురించి ఇంకో విశేషం చదివాను - వీణ ధనమ్మాళ్ గారి వారసురాలైన టి.బృంద దగ్గర తన సంగీతానికి మెరుగు పెట్టుకున్నారుట. తద్వారా క్షేత్రయ్య పదాలు, తదితర పదాలు పాడటంలో తంజావూర్ బాణీకి వారసురాలీమె. చాలా యేళ్ళ క్రితమే ఒక ఫ్రెంచి కంపెనీ ఈమె పాడిన పదాలని వెలువరించింది - అదిప్పుడు దొరకటం లేదు. ఈవిడ గురించి మరికొంత ఇక్కడ చదవొచ్చు.
విన్న కీర్తన - రారా రాజీవ లోచన రామా! నను బ్రోచుటకు - అని. ఇన్నాళ్ళు ఇది త్యాగరాజ కీర్తన అనుకుంటున్నా. ఈ టపా రాయటానికి కూర్చుని దీన్ని పరిశోధిస్తే తెలిసిన విషయం (శ్రీరామా, వింటున్నావా?) - ఇది మైసూరు వాసుదేవాచార్యుల కీర్తన!! ఆహా, ఎంత తియ్యగా రాశారు. రాముని అందాన్ని గాని, తేజస్సుని గాని, మహిమని గాని మోహన రాగంతో జత కలపడంలో త్యాగయ్యకు సాటి లేరనుకున్నాను, ఆయనకి దీటుగా వచ్చింది ఈ కీర్తన - వాసుదేవాచార్యులు నిజంగా ధన్య జీవి. ఈ పాట సాహిత్యం ఇప్పుడు అందుబాటులో లేదు, ఈ సారి టపాలో వేస్తాను.
ఈ సీడీ వివరాలు ఇక్కడ.
ఇహ చివరి మోహన సన్నివేశం ఆ సాయంత్రం నేను కావాలని పెట్టుకుని విన్నది. ఇది లాల్గూడి జయరామన్ వయొలిన్, ఎన్. రమణి వేణువు, ఆర్. వెంకటరామన్ వీణ కలిసి వాయించిన మోహన రామా కృతి. జంత్ర వాద్య కచ్చేరీ, అందులో మూడు వాయిద్యాల కలయిక వల్ల కొంచెం నియంత్రించినట్టుగా ఉంటుంది గానీ ఇందులో అలరించే లక్షణాలు చాలా ఉన్నై - మొదట వచ్చే ఆలాపన జయరామన్ గారి స్వభావసిద్ధమైన మృదుత్వానికి ఒక మచ్చుతునక; పల్లవి మీదా అనుపల్లవి మీదా సుమారు పది పదిహేను సంగతులు వేసి, చక్కగా పాఠం చెప్పినట్టుగా సాగిస్తారు ముగ్గురు విద్వాంసులూ. ఇక పాత ముగిశాక వచ్చే స్వర ప్రస్తారం కూడా ఒక వరుసలో సంక్లిష్టమవుతూ రసవంతంగా ఉంటుంది.


కొత్తగా సంగీతం వినడం మొదలు పెట్టినవారికి ఈ రికార్డు ఒక నిధి.